2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

సమస్యాపూరణ_సెప్టెంబర్ 2016

శంభు భక్తవశంకరు శంకరు శివు
మూరిన సదమల మతినిఁ బూజ లర్థిఁ
జేయఁ గరుణతోడఁ గురుపించిన వరముల
కుండపోఁత వర్షమ్మున గొడుగు లేల                                                58

పెద్దల మాట లన్నియును బృధ్విని నింపగు చద్ది మూటలే
గ్రద్దన వచ్చు రెక్కలు ధరప్రకరమ్ములఁ గాల రీతినిన్
ముద్దుగ గ్రీష్మ కాలమునఁ బూని కొనంగ కరమ్ము మేలికన్
వద్దిక ఛత్రముల్ గొనుట వర్షము వచ్చినఁ గుండపోఁతగన్                  57
[కొనుట= కొనుక్కొనుట]

మేలుగ నాత్మ లింగమును మీఱి వరింపక కోర పార్వతిం,
గాల మతిక్రమింప దశకంఠుని శక్యమె, ధర్మ పూజ్య భా
వాలినిఁ జంపె రావణుఁడు,  పార్వతి శోకముఁ గాంచి జాలితో
శూలి మనోవికాస మికఁ జొప్పడ నూరటిలంగ  జేసెగా                        56
[భావ+ఆలి = భావాలి]

సుగ్రీవు డంగదునితో పలుకు మాటలు:

వానరమ్ములఁ బెక్కింటి బాణ ధార
లు కురిపించి నరికి సేతులు శిరములను
మనము నిండగ లోభ కామములు పుత్త్ర!
వాలినిభ! వాని కొఱకు, రావణుఁడు చంపె                                         55

అవనీ జాతుల కెల్ల సంతత నిరాహార్యంబు లాజన్మ సం
భవ విద్వేషులు లోభ మోహ మద కామక్రోధ మాత్సర్య ఘో
ర వితానమ్ములు మానవోపచితి నిర్ఘాతంబు లెన్నంగ నీ
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్               54            
[నీకు+అవియేగా= నీకవియేగా]

జవ సత్వ రహిత మగు వా
రువము జయమ్మును చెఱచిన రూపమ్మున స
త్కవన జగమ్మునఁ దలుపఁ గు
కవియే మఱి పతనమునకు కారణ మగురా!                                    53

అమ్ముదిత సుభద్ర కడుఁ బ్రి
యమ్ముగఁ, గూడి చెలికత్తియల, సేవించన్
సమ్మతి సంయమి హృదయపు
రెమ్మల ప్రేమ సుమములు పరిఢవిల్లు గదా!                                      52

సకల గుణైక భూషణుడు సత్య పరాక్రమ ధర్మ మూర్తియుం
బ్రకటిత సత్య వాక్పరమ పాలన నిశ్చల ధీర చిత్తుడున్
సకల వరాస్త్ర శస్త్ర బల సంయుత ధన్వి ఖరాసు రాతి హీ
న కులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్                51

శూర్పణఖ రావణుని తో చెప్పు మాటలు:

తండ్రి పంపున నిరతమ్ము ధనువు తోడ
లక్ష్మణ జనక సుతల సహితమ్ము,
నన్న చెప్ప నేల, నడవిఁ దిరుగుచు మ
న కులుఁ జంపె రామ నరవిభుండు                                                   50

నారదుడు గయునకుపాయము చెప్పు సందర్భము: 

తనరిన వైభవమ్మున విధాత వరద్యుతి నాక వీధినిం
జనిచని యుమ్ము వేయగ వ్రజప్రభు దోయిలిఁ గూలి నంతటం
గనలునఁ బంత మూనినను ఖండన సేయగఁ జక్రధారి నీ
వనమున సంచరించుటకుఁ బద్ధతు లుండవె యెంచి చూడఁగన్            49
[నీవు+అనమున=నీవనమున; అనము = ఊపిరి,శ్వాస] 

అనయము రాజ భటులు శో
ధన సేసిన నప్రమత్తతన్ భయ మేలన్
మన మలరంగగఁ  బ్రమదా
వనమునఁ దిరుగుటకు లేవె పద్ధతులు గనన్                                    48

కట్టిన బట్ట కట్టడట కళ్లకు నల్లని కళ్ళజోడునున్
దట్టపు గంధ చందనము తప్త సువర్ణపు టుంగరమ్ములున్
పట్టిని నీయ పెండ్లికిని బంధువు లెవ్వరు మెచ్చి ప్రేమగం
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్               47
[ప్రేమగన్+ చుట్టును= ప్రేమగంజుట్టును]

ఆలు చూలు లేదు మ్రోల పుత్రుండట
దూఱ సందు లేదు తోడు డోలు
డబ్బు లేని వాడు నుబ్బి యెక్కెఁ బడవ
జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె                                                        46

ఛద్మము చేసిరి బాలునిఁ
బద్మదళాక్ష భగినీప్రవర పుత్రు ననిన్
సద్మాక్షయము నెఱి నతడు
పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుఁడే                                        45
[సద్మాక్షయము = అక్షయ ధామము; నెఱి = పరాక్రమము]

వరదానప్రతి భోగ్ర సైంధవు డటన్ వారింప భీమాదులం
గురు సైన్యాధిప దుష్కృతాహవము సక్రోధంబ ఛేదించియున్
పరవీరాక్రమ ణావరోధము నురుప్రావీణ్యతం జేయగన్
ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో           44

సవతికిఁ బుట్టి తీవు మరి శక్యమె యెక్కగఁ దండ్రి యంకముం
దివిరి మదీయ గర్భమునఁ దీరును బుట్టిన నన్న రోషుడై
ధ్రువు డసమాన ధీరత సుతీక్ష్ణ తపోరతి రత్నగర్భ భూ
ధవుని పదమ్ములం గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే                43

అవలీలగఁ గాచిన హ
స్తివరదుఁ బ్రహ్లాదుడు ప్రతి దినమును భక్తిన్
భవ తరణార్థము మది మా
ధవుని పదమ్ములను గొలిచి ధన్యతఁ గాంచెన్                                  42

విడ్డూరంబుగ నప్పుఁ దేగలడు వైవిధ్యంపు మార్గంబుల
న్నడ్డంబైనను నెల్ల లోకము లుపాయశ్రేణి గట్టెక్కుచున్
దొడ్డౌ సంస్థలఁ బెక్కు లేర్పరచి తా దోశ్శక్తిఁ జూపించెడిన్
వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే వర్షించు నైశ్వర్యముల్                      41

దుడ్డులు లేని నరుండిక
వడ్డీ చెల్లింపలేఁడు, వర్షించు సిరుల్
దొడ్డయి యెగఁ గొట్టంగ
న్నడ్డంబుగ నప్పుఁ గుజను లందరి వోలెన్                                        40

ఉత్కలికా ప్రపూర్ణ  కవ నోత్సవ సత్కృత మండ పాంతరా
త్యుత్కట హర్షణాన్విత ముఖోదజ భాసిత గర్వ సర్వ క
వ్యుత్కర సంస్థి తాంచిత నవోజ్వలమాన సభా విరాజితా
సత్కవు లెల్ల మూఢులయి చాలక పోయిరి పూరణమ్ములన్                39
[విరాజిత+అసత్కవులు = విరాజితాసత్కవులు;  
ఉత్కలిక = విలాసము;  అత్యుత్కటము = అత్యధికము; 
ఉత్కరము = సమూహము]

వైనతేయున కెదురాడ పాము సరణి
మదగజమును నిలుపగఁ దామర ఛదమన
సింహరాజము నాప మూషికము పగిది
సత్కవులు పూరణములకుఁ జాలరైరి!                                      38
[సత్కవులకు తూగు పూరణలు కావని]

జనులకు వితరణ లొసగినఁ
దన పక్షము చిత్తయినది దారుణ మనగం
దన రిపునిదౌ, సుగుణము క
తన, దండే గెల్చినంతఁ దా నేడ్చె నయో                                       37

అనయంబుం బృథివీ జనౌఘ పరమాహ్లాదంబు కాంక్షించెడిన్
వినయాద్యంచిత సద్గుణప్రతతినిన్ విఖ్యాత శీలుండలన్
ఘన సంతోషము పట్ట లేక మదినిం గంపించి సాశ్ర్వక్షుడై
తన దండే గెలువంగ నెన్నికలలోఁ దానేడ్చె సాజమ్ముగా!                36

అడరి తపమ్ము సేయ ననలాంబకు డిచ్చిన మాట తప్పునే
పడతి శిఖండి కిత్తరి వివాహ వయస్సరు దెంచెనే భయం
పడ నుచితమ్మె పుంస్త్వము నవారిత మెమ్మెయి దైవ లీలలం
బడఁతికి నాతితోడనె వివాహము గావలె శాస్త్రపద్ధతిన్                      35

రూపము గన సుందరము సులోచనములు
మనసు సూడ వెన్న యట సంశయము వలదు
ముదముగా నను వలచెను సదమల మతిఁ
బడఁతి, నాతినే పెండ్లాడ వలెను వలచి                                            34

ఏమఱి నిదురించఁ గలను
గోముగ పురుషద్వయమును కొమ్మ లిరువురన్
నామదిఁ గంటిని చూడగ
రాముడు, రాక్షసుఁడు, సీత, రక్కసి యయ్యెన్                                    33

కామ రూపులైన రాక్షసుల చేష్టల నుద్దేశించి పూరణ:

కామము ప్రజ్వరిల్లగను కర్బురు డాదశ కంఠుడే ఘన
శ్యాముని వేష మూన మరి జానకి వేషము చుప్పనాక యా
రామము చేరి చూడగ దురంతము గోచర మయ్యె నచ్చటన్
రాముఁడు రాక్షసుండుగను రాక్షస కాంతగ సీత యయ్యెడిన్                  32

అల్లన గని తా మందుల
నొల్లవు మారాము లేల నుచితమె నీకుం,
దల్లడిలకు నిన్నేమనఁ
దల్లీ! యని,  పిలుచునంట తండ్రిని సుతుడే.                                         31

పెద్ద చదువులకు దేశాంతరము వెళ్ళ గోరు తనయుని పల్కులు: 

మేలౌ నమ్మ సమగ్ర విద్యల నిలన్ మే ముందు మైక్యమ్ముగన్
సల్లాపమ్ములు సేయ వచ్చును గదా చక్కంగ నిత్యమ్మునుం
గల్లల్ పల్కుట లేదు నమ్ము నను శోకంబేల పంపింపవే
తల్లీ! యంచు సుతుండు పిల్చె నదిగో తండ్రిన్ ముదం బొప్పఁగన్              30

దారుణముగ నా రాతిరి
పార మెరుంగక మదిరను బానము సేయం
గారము సున్నగ యన్నం
బీరును గని త్రాగుబోతు భీతిం జెందెన్                                                     29
[అన్నంబు+ఈరు =అన్నంబీరు; ఈరు = అల్పము]

వీరావేశులు త్రాగు బోతులు సుమీ వీరాడు వాచ్యంబు లా
పారావారము దాటు చేత లపసవ్యంబుల్ సమీక్షింపగన్
కారెవ్వారికి భీత చేతనులు లోకంబందు ఘోరాద్భుతం
బీరుం గాంచిన త్రాగుబోతు మిగులన్ భీతుం డయెన్ జూడుమా                  28
[ఈరు = మీరు, ఈవు నకు బహువచనము]

చేతలఁ  జూడ కొంటరియె చిత్తము వచ్చిన రీతి వర్తిలున్
ప్రీతిగ నొక్క లేఖ నొక భీరువు కింపుగ పంపె నంత న
న్నాతియె వ్రాయ పత్రము మనమ్మున నెంతయు సంతసించగం
గోతికి జాబు వచ్చెనని గొల్లున నేడ్చుట యుక్తియుక్తమా?                           27

చదువు సంధ్య లందున నెట్టి శ్రద్ధ లేదు
యల్లరిని జేయు జేష్టల నతడు కోతి
బడికి నిక రావలదనుచు వదరుఁబోతు
కోతి కొక జాబు వచ్చిన గొల్లుమనెను                                                        26

అక్కజ మైన విధ్య పరమాద్భుత రూపము గల్గి యుండియున్
మక్కువ తోడ నవ్వనిత మానస మందున ముద్ర వేయగం
జక్కని చుక్కనే చదువు సంధ్యలు నేర్వని భామ పెద్ద మొ
ద్దక్కనుఁ బెండ్లియాడె నొక డందరు సంభ్రమ మంది చూడఁగన్                      25

తక్కువ చేసితి ననవల
దెక్కువ మక్కువ మనమున నీమే యని  పె
ద్దక్కను గాదని మరి చి
న్నక్కనుఁ బెండ్లాడె నొక్కఁ డందరు చూడన్                                                24

అనవరతంబు నాటల మహాద్భుత నైపుణ మున్న యట్టి నీ
తనయుని కోర్కి తీర్చుమని దానట నుండగ మేనమామయే
జనకునిఁ దిట్టె, నాత్మజుఁడు చయ్యనఁ గార్చుచు మోదబాష్పముల్
మనమున సంతసించుచును మన్నన సేసెను తండ్రి నింపుగన్                    23

వనచర సైన్యము తోడుగ
వననిధి చెంతకుఁ జని రఘు వంశజు డంతం
దను వేడగఁ బలుకని శశి
జనకుని దూషించె సుతుఁడు సజల నయనుఁడై                                          22
[సుతుడు = రాజు]

మత్తుండైన జయద్ర థాధముని దంభంబంతయుం ద్రుంచి కిం
చిత్తుంచన్ శిఖి నంత ఖండనము వే చేయంగ సౌవీరుడా
చిత్తోన్మాది తపోబలమ్మునను నిశ్చేష్టుండయెన్ భీముడే
మత్తేభమ్మును దోమ కూల్చ నదియే మండ్రాడె దైన్యమ్మునన్                       21

అల్ప జీవి యని యనాదరణ వలదు
కాల వశమ జీవ కాయ మెల్ల
నేత్ర మందు దూరి చిత్రముగను దొడ్డ
సామజమునుఁ గూల్చె దోమ యొకటి                                                         20

చల్లగఁ జూచె దేవుఁడిటఁ జక్కని పాప నొసంగె మాకు నా
పిల్లను మల్లి పేరునను బిల్చెద మంచును, బల్కె దానితో
తల్లిరొ తెస్తి నీకు మొల త్రాడు సువర్ణమ సుమ్ము సూడుమా
మల్లియ! తీఁగకుం గలిగె మామిడికాయలు మేలనన్ జనుల్                           19
[తీఁగ=మొలనూలు; మామిడిపిందెల మొలత్రాడు]

అల్లన మామిడి చెట్టునఁ
బెల్లున నొక మల్లె పాదు పెరుగగఁ గనుడా
పల్లవము లందు కాయలు
మల్లియ తీఁగియకుఁ గలిగె మామిడికాయల్                                                  18

కాలుం డేవిధి జీవ రాశులకు సంఘాతమ్ము కల్పించునో!
మూలం బీవన మంచు నెంచి సనె సంపూర్ణంపు భోజ్యమ్ముకై
కాలాతీతము గాగ నా యడవినిం గాలుండు వ్యాఘ్రంబునుం
బాలం జూచిన పిల్లి పాఱె భయసంభ్రాంతుల్ మదింగ్రమ్మఁగన్                            17

కాలువ గట్టున నేగుచు
మేలుగ మూషికములఁ గని మ్రింగగ నెంచన్
మ్రోల బుసలు కొట్టెడు స
ర్పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్                                                        16

వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ బ్రోచెడు దైవముండగా
గిరివర వేంకటాద్రి ఘన కీర్తితు వేడక వేంకటేశ్వరున్
నరబలు లిచ్చి క్షుద్రసుర నైరృత పూజలు సల్ప నేలయా
గరళముఁ గ్రోలఁ జూచెదవు కమ్మని పాలను నేలఁ ద్రోచియున్                            15

అరుదుగ సేవింతు ననకు
నరనరముల కెక్కి చెఱచు నవ నాడులనే
యరుజమని యెంచి మద్యము
గరళముఁ గ్రోలెదవు త్రోచి కమ్మని పాలన్                                                        14

కల్లయ సుమ్మి మానినులు గాతరు లన్న చరిత్ర లందునన్
వెల్లువ లయ్య గాధ లిల వీర వరేణ్య లతాంగు లెన్నగం
బిల్లి యనంగఁ దాఁ దగదు పెక్కులు ధైర్యము సాహసమ్ములుం
దల్లికి, మీసముల్ మొలిచెఁ దండ్రికి లే వది యేమి చిత్రమో                                 13

వెల్లువగ కేశ సంపద
తల్లికి, మీసములు మొలిచెఁ దండ్రికి, లేవే
పిల్లకు రెండును వింతగ
మెల్లగ రావచ్చు నేమొ మీద శిరమునన్                                                           12

ప్రమదానవరత ఘన ర
రమణి చెలువపు పరువాన రగులుచు నంతన్
సుమనోహర భాసుర ఘన
విమలాంచిత రూపు రాము వేడెను బతిగా                                                         11

శివసతి శాప భీతిని నశేష జనాళి తపించు చుండగన్
భువి వసుదేవ నందనుని భూరి కృపారస కారణమ్మునం
బ్రవిమల బుద్దినిం, గడప భాద్రపదమ్మున శుక్లపక్షపుం
జవితినిఁ, జంద్రదర్శనము సర్వశుభమ్ము లొసంగు మానవా                                10

జాంబవతి తోడ నింపుగ సత్యభామ
కూడ దక్కెను గృష్ణునకు శశిని గనఁ
బాలలోభాద్రపద శుక్లపక్షమందు,
చవితి చంద్రుఁడు శుభముల సర్వ మొసఁగు!                                                       9

రవి యొక్కడున్న చాలును
ఛవి తాపము సైప లేక సంత్రస్తు లవన్
భవితవ్యము దేవుఁ డెరుగుఁ
గవిసమ్మేళన మనంగఁ గడు భీతిల్లెన్                                                                   8

కవనోగ్రాంశు సమాన తేజ రచనా కంజప్రతీకాశు లీ
భువ నాకాశ విరాజమాన రవి వైభోగాత్త విద్వాంసులున్
ఛవిమత్కంకణ ధారు లుత్తముల వాచా భూషణాయత్త మీ
కవిసమ్మేళన మన్న భీతిలెను బంగారయ్య విన్నావటోయ్                                      7

బిడ్డడు తిరుగగ నడ్డము
వడ్డీ గడ్డయిన దుడ్డు వారకఁ గొనినన్
బిడ్డడి తాతకు దాతకు
వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్                                                                 6

మానుము చింతలన్ని కొను మా ధన గుప్తిని నప్పు నింపుగం
బూని గృహమ్ము కట్టగ నపూర్వముగా యని పల్కి యిత్తురే
తానిఁ క నప్పుమొత్తమును దత్క్షణ మిచ్చెద నన్న నొప్పరే
కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు  రీతి యిద్దియే                                            5

ప్రాణినికాయ భవార్త
త్రాణ పరాయణ సుగుణ విరాజిత దైవ
శ్రేణిప్రధముండు శివుడు, 
ప్రాణములను గొనెడువాఁడు, పరమాత్ముండౌ                                                           4

మీరిన భక్తి తోడుత నమేయ కృపారస వీక్షణున్ ఘనా
కారు రమా మనోహరు వికారము వీడి భజింపఁ గల్గు నా
ద్వారము పుణ్యమూర్తులకు భవ్యపదమ్ము పునర్భవాది తృ
డ్వారక ప్రాణముల్ గొనెడువాఁడు గదా పరమాత్ముఁ డన్నచో                                        3

ఆర్తత్రాణ పరాయణుండు కమలాత్మాధీశు డత్యున్నతిన్
ధూర్తేంద్రారులు రాహుకేతువుల వే త్రుంచంగ దుష్టాత్మసం
హర్తృద్రోహ పరాయణుండు దిన రాహ్వాఖ్యుండు గన్పించి యా
మార్తాండుం డుదయాద్రిఁ,  గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్                                  2

కర్తవ్యంబును దా ని
ర్వర్తింపఁ జరించుచుండ రాహుక్షుద్భా
ధార్తిం గుంది వివశుడై
మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహ్నమునన్                                                           1