తన సముఖము నందుఁ దగులఁబడ మరుఁడు
చేష్ట లుడిగి నిలువఁ గష్టము గని
మాయ మయిన నంత మారహరుఁ డకట
శివునిఁ జూడదంట శీత నగజ 50.
ఎవని వరించి ఘోర తప మిద్ధ మనమ్మునఁ జేయుచున్నదో
యవిరళ నిష్ఠ శీత నగ మందు నతండె వరింప వచ్చినన్
భవుఁ డని నేరకే కపట పావన సంయమి వేష ధారి యా
శివుని ముఖమ్ముఁ జూడ దఁట శీత నగాత్మజ మంచిదే కదా 49.
కవి పుంగవు లౌరా యన
నవలోకింప నవలీల నవనిన్ వేవే
లవధానమ్ములు సేసిన
యవధానికి శిక్షణమ్ము లవసర మగునా 48.
అవలీలన్ భువి లోన సాధనమునన్ వ్యాపించుఁ బ్రావీణ్యముల్
లవ మంతైనను సంతతమ్ము ననివార్యం బౌను జింతింపఁగా
నవనీ వాసుల కెల్ల కార్యముల కభ్యాసమ్ము శంకింప కి
ట్లవధానాభ్యస నార్థ శిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే 47.
తల్లడపడంగ నేలా
తల్లీ యార్తిం బిలువుమ దైవ గణమ్ముం
జెల్లీ పిలువఁగ వచ్చిన
దల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్ 46.
అల్లెట్లౌను ధరిత్రి రక్షకుఁడు సత్యం బెన్న నేనాఁటికిం
గల్లోలమ్ములఁ గాచు వాఁ డిల రమా కాంతుండు కా కన్యుఁడే
కల్లల్ వల్కఁగ నెట్టు లొప్పె మది నక్కా దైవ గీతాల యా
యల్లా ప్రోచెడి వాఁ డటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్ 45.
[గీతాల+ఆ+అల్లు + ఆ= గీతాల యా యల్లా; అల్లు=అల్లిక/అల్లుట]
కార్యమ్ము లీ గుణమ్ములు
క్రౌర్య నివారణము శాంత గమనము, నిత్యా
కార్యం బవార్య వార్యము
భార్యా పుత్ర ధన కాంక్ష బైరాగులకౌ 44.
ఆర్యోపాసక సంఘ పుంగవుఁడు సత్యాన్వేషి భిక్షాన్న సం
పర్యాప్తోదర భాసమాన వదనప్రద్యోత విఖ్యాతుఁడుం
గార్యాకార్య విలగ్న మానస లసత్కాయుండు శశ్వద్వినా
భార్యా పుత్ర ధనేషణ త్రయముతో బైరాగి భాసిల్లెడిన్ 43.
వావిరి సందేహమ్మున
వేవురు పలు మారు లడరి విబుధులు శోధిం
పావంతైన నహో దు
ర్భావ మభావ మయిన యెడఁ బద్యము వెల్గున్ 42.
భూవర నిక్క మెంచినఁ దపో మహి మింతయు లేక యున్న స
ద్భావ మెడంద నుద్భవము పండితుఁ డైనను గల్గ నేర్చునే
చేవ వెలుంగ సత్కవికి శ్లిష్ట మభావము దోఁప భావమై
భావ మభావమై నపుడె పద్యము హృద్య మటంద్రు పండితుల్ 41.
ఏటికిఁ బంతం బనుచును
వేటున కోర్వంగ రాక విప్ర వరేణ్యుల్
తాటక పైఁ గల భీతినిఁ
దాటకిఁ బూజింపుఁ డనుచుఁ దాపసు లనిరే 40.
మత్తకోకిల.
ఏటి దీ వర ధర్మ సూక్ష్మ మదెన్న నేరికి శక్యమే
బోటి వీడెను గాదె గల్మషముం బురాకృత మెల్లనున్
నాఁట రామ శరమ్ము మేనున నాతి వీడఁగఁ బ్రాణముల్
తాటకిం గడుఁ బూజ్యురాలని తాపసుల్ నుతియించిరే 39.
గ్రామం బం దొక్క తడవ
సీమ లెఱుంగని విచిత్ర చిత్ర వినోదం
బే మందు బుస్సు బుస్సని
పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే 38.
కోమలి కప్ప పెండ్లికిఁ ద్రికూట గిరీంద్ర సభాంగణమ్మునన్
శ్యామ మయూర పత్ర రథ సంచయ నాట్య వినోద కేళిలో
భౌమ పికౌఘ సంజనిత భవ్యమనోహర గాన వేదికం
బాములు పాట పాడినవి పాముల వాఁడు శిరమ్ము నూఁచఁగన్ 37.
కాకి కేకి చిలుకలకుఁ గనదు భేద
మకట తనకుఁ దోచిన యట్టి వికట నామ
ములను బిలువఁ జాగెను దాను గులికి కులికి
కాకిఁ గేకి నొనర్చి చిల్క యని పిల్చె 36.
రాకలు పోక లెన్నగను బ్రహ్మ యభీష్టము లెన్నఁ డైనఁ జీ
కాకు పడంగ రిత్త యగుఁ గర్జము చక్కఁగ మిన్న కుండుటే
వీకను దాఁ దలంచినది వేఱు లభించిన దొండు వింతగాఁ
గాకినిఁ గేకిఁ జేసి చిలుకా యని పిల్చెను గోరువంకయే 35.
జాగు సేయంగఁ దగ దింకఁ జంచలాక్షి
యన్నులన్ మిన్న క్షీరాన్న మున్న దిచట
పాత్ర నిండుగా వెచ్చగఁ బాయ సాను
రక్త పానమున్జేయంగ రమ్ము సకియ 34.
రక్తిని నేఁగి వేట కయి రక్కసుఁ డొక్కఁడు మాంస మందు నా
సక్తిని సంచరించి వనిఁ జక్కఁగ నొక్కెడఁ గాంచి నంతనే
శక్తిని వైచి చంపి నర సత్తము నొక్కని నైరృతుండు వే
రక్తముఁ బీల్వఁ బ్రేయసిని రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో 33.
దైవ లీల లద్భుతమ్ము లగు నిలిచి
సవ్యసాచికి సరసన శిఖండి
తాతఁ గూల్చె నాజి దర్శనము నొసంగి
దోమ మ్రింగె నొక్క సామజమును 32.
పొంగఁగ రాదు ప్రాణులకు భూరి బలమ్ము సెలంగ నెన్నఁడుం
బ్రాంగణ మందు నుండఁగను బల్లిదు నక్కట దోమ కుట్టఁగా
భంగము కాఁగ దేహమున స్వాస్థ్యము కూలెను వింత వ్యాధితో
మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్ 31.
క్రుంగ జవ సత్వములు గూ
లంగ బడలి తత్క్షణము ధరా తల మందున్
వంగని నఖములతో బల
శృంగముతోఁ గ్రుమ్మె నంట సింహము గజమున్ 30.
[శృంగము = దొరతనము]
భంగము కల్గుచోఁ దనదు భద్రత కించుక యెన్నఁ డేనియుం
గ్రుంగక యల్ప జీవియును రోషము నూని చెలంగు నుగ్రతం
జెంగున డాసి సత్వమున శ్రేష్ఠము ఖడ్గ మృగమ్ము రెంటినిన్
శృంగము తోడఁ గ్రుమ్మె నఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్ 29.
[సింహము (న్) మత్త గజేంద్రమున్]
దయతోఁ గాచును సతము వి
నయమ్ము తోడఁ దను గొలిచిన మనుజులన్ సం
దియ మేలా దీన జ నా
లయ కారుఁడు సౌఖ్య మొసఁగు లచ్చి మగండే 28.
[దీన జన + ఆలయకారుఁడు]
దయ కురిపించు శిష్టులకుఁ దద్ద యొసంగును రక్ష నిత్యమున్
క్షయ మొనరించు దుష్ట తతిఁ గంజ దళాక్షుఁడు మారకున్ననున్
నయముగ గీతలో నుడివె నంద కుమారుఁడు నిక్క మివ్విధిన్
లయమున కాది దైవతము లచ్చి మగం డతఁ డిచ్చు సౌఖ్యముల్ 27.
పెల్లుగ నుంచి ఫలములను
బిల్లలతోఁ బలికి నంతఁ బ్రియమునఁ దినుఁడీ
యుల్లము లలర భయంపడ
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్ 26.
గుల్లలు కాక మున్న బ్రతుకుల్ సిరు లెల్లయుఁ బోక మున్న మీ
పిల్లలు ఘోర దుఃఖముల వేఁగక మున్న నిరంతరమ్మునుం
జల్లఁగ నుండ నెంచినను సత్వర మెల్లరు నింక వీడుఁ డీ
కల్లన నిచ్చగించి రఁట గాంధిని నమ్మిన వార లెల్లరున్ 25.
వీర సింహుండు భీముండు ఘోర మత్త
కరి సుయోధనుం డతి భయంకరుఁడు భీముఁ
డడరి విఱిచెను రారాజు తొడల నాజి
గోళ్లు లేనట్టి సింహము గూల్చెఁ గరిని 24.
విల్లుండన్ నరుఁ దాఁకు వాఁడు కలడే వీరుండు సృష్టింపఁగాఁ
గల్లోలమ్మును సుప్రతీకము వెసన్ గాండీవి పంచాస్యమే
సల్లాపమ్ములు రేఁగ భారత మహా సంగ్రామ మేపారఁగా
గోళ్లున్గోరలు లేని సింహ మకటా కూల్చెన్ మదేభమ్మునున్ 23.
అద్రువఁ బని లే దయా వరు
స ద్రోవదికి నన్న సవ్య సాచి విలున నె
న్నఁ ద్రినయన సముఁడు తక్క
న్న ద్రుపదుని తనయకు మగలు నల్గురె సుమ్మీ 22.
సుదతి కొసంగె నా వరము చోద్యము మీఱఁగ ఫాలనేత్రుఁడే
హృదయము నిండ హర్షమున నేవురు భర్తల మున్నొ సంగెనే
సదమల చిత్తునిన్ సమర సత్వ వరేణ్యుఁ గిరీటి వీడి యె
న్న ద్రుపదరాజ పుత్రికకు నల్గురె భర్తలు నమ్మకంబుగాన్ 21.
సంజాత విహంగము లెగు
రం జాలక యభ్ర మందుఁ ద్రస్తాత్మలునై
పంజరములలో మేఁతల
కుం జరములు సమసెఁ గుంభకోణము నందున్ 20.
[మేఁతలకున్+ చరములు = మేఁతలకుం జరములు]
కాలాతీతులు కారె యెవ్వరును ధిక్కారమ్ము దుర్భేద్యమే
వేలాకోలము కాదు పౌర తతి జృంభింపంగ నచ్చోటఁ బోఁ
గాలం బేర్పడ రాజకీయ ఘనులే గర్వాంధు లౌటం గటా
హేలన్ దిగ్గజ సంఘముల్ సమసి పోయెన్గుంభకోణమ్మునన్ 19.
చూడ రాకున్న నెప్పుడు చుట్ట మేల
నీరు లేని పట్టణమున నిలయ మేల
వైద్యుఁ డుండని యూరను వాస మేల
కరుణ లేని జేజెకు నమస్కార మేల 18.
పరమోదారుఁడు దేవుఁ డార్తులకు సంభావ్యుండు మర్త్యాలికిన్
హరి నిత్యమ్ము దయా సముద్రుఁ డయ సత్యం బెన్న భక్తాలికిన్
గిర లిబ్భంగి ననంగ రాదు పుడమిం గృత్యమ్ము దుష్టాలికిం
గరుణా దూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో 17.
ఆతత సంతోషమ్మున
వీత సకల దుఃఖముల భువిఁ దగ వెలుఁగుమా
నీతి గతిఁ జరింపుమ యని
సీతకుఁ గర్ణుండు బావ సెప్పిరి ప్రాజ్ఞుల్ 16.
[కర్ణనాముఁడు మఱియు బావ యిద్దఱు సెప్పిరి, వారు ప్రాజ్ఞులు]
నరనాథాత్మజుఁడై రమేశుఁ డిలలోనం బుట్ట రాముండు నా
సిరియే పుట్టెను సీత నామ మలరన్ శ్రీరామభద్రాఖ్యునే
ధరణీ నిర్జర దుఃఖ సాగర తరిత్రశ్రేష్ఠకర్ణుం డనన్
ధరణీజాతకు బావ కర్ణుఁడు గదా ధర్మజ్ఞు లౌనందురే 15.
[కర్ణము = చుక్కాను]
ఆసఁ గలల నమ్మి మోసపోవ వలదు
చెదరఁ గలలు తొలఁగుఁ గద భ్రమ లిఁకఁ
గలల యందు నెల్ల నలవడు వింతలే
దోమ గరిని మ్రింగెఁ జీమ పులిని 14.
పరమాశ్చర్యము నంద డెందముల సంభావ్యమ్ము లీ వింతలే
దురమం దౌర శిఖండి భీష్ముని వెసం దున్మాడ యత్నించెనే
స్థిరచిత్తుం డయి సైంధవుం డకట యాక్షేపించె భీమాదులం
గరినిన్ మ్రింగెను దోమ చీమ దినె వ్యాఘ్రంబున్ విచిత్రంబుగన్ 13.
వెక్కసమ్ముగఁ జూపులు పిక్కటిల్ల
నొక్క రొక్కరి పంతము ముక్క కున్న
హావభావము లెన్నియొ యలరు చుండ
మౌనమున వెల్లు వెత్తెను మాట లెన్నొ 12.
మానవ నైజ ముల్లసిల మానక తర్క మొనర్చి మిక్కిలిం
గానక సుంత సమ్మతి వికత్థన వాక్కుల దైవ కోటిపై
నానలు వెట్టి వాదన లనంత మొనర్చి శ్రమించి పిమ్మటన్
మౌనముఁ బూని రిద్దఱును మాటలు మాత్రము వెల్లువెత్తెరా 11.
కర్ణుఁ డొకతూరి సంగ్రా
మార్ణవ మక రాభుఁడై సునాయాసముగా
వర్ణన కతీత వీరుఁడు
కర్ణుం డుగ్రుఁ డగుచు ననిఁ గవ్వడిఁ గూల్చెన్. 10.
కర్ణు బలమ్ము సంతతము కాదన నెల్లరు నౌర దుర్మనః
పూర్ణము ధార్త రాష్ట్రుఁ డతి మోహము కమ్మఁగ నమ్మె, దేవతా
నిర్ణయ ముండె నన్య గతి నిక్కము నెంచ నెడంద దీనికిం
గర్ణుఁడు గూల్చె యుద్ధమునఁ గవ్వడి నొంటరిఁ జేసి క్రోధియై 9.
ధరలో దుర్వ్యసనమ్ములు
పరఁగును నశియింపఁ జేయఁ బ్రాభవ మెల్లన్
స్థిర మనమున వెస వీడిన,
దొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్ 8.
సురుచిర దుగ్ధ మందు నొక చుక్క విషంబు విదుల్ప నక్కటా
కరఁగ విఱుంగ క్షీరమును గాంచమె యొక్క క్షణమ్ము నందిలన్
నరులకు మూరి సేసిన ఘనమ్ముగ యత్నము నెవ్విధమ్మునన్
దొరకును గీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో 7.
మించిన చలమ్మున సమర
సంచారము సేయ సవ్యసాచికిఁ బ్రీతిం
బంచనఁ గులుకుచు వికృతపుఁ
బాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్ 6.
[ పాంచాలి = బొమ్మ, శిఖండి ]
వావిరి క్రూర చింతనలఁ బార్థులు కొందఱు తన్ను గొల్వఁగా
వేవురు ధార్తరాష్ట్రుఁ డవివేకి సుయోధనుఁ డుగ్ర దుష్ట సం
భావన రక్తుఁడా దురభిమాని చలమ్మున నెన్న భీష్ముఁడే
పావని ద్రోవదిం గనుచుఁ బక్కున నవ్వెను భీష్ముఁ డా సభన్ 5.
సమయము కా దిది పరిహా
సమున కసురు లేడ యమర సంహర మేడా
భ్రమ పడఁగ నేల యెచ్చట
నమరులఁ దునుమాడియు సుధ నందిరి దైత్యుల్ 4.
దమనులు నాదితేయులును దైత్యులుఁ గశ్యపు బిడ్డ లైననుం
గుమతులు దైత్యు లెల్ల రని కొందఱు నిత్యము దల్చుచుంద్రు దో
షములకు నెల్ల మూలము నిశాచరు లంచు వచింతు రిట్లహో
యమరుల సంహరించి సుధ నంతయు దైత్యులె పొంది రుద్ధతిన్ 3.
ఎప్పుడు నెవ్వ రయినఁ దన
తప్పు నెఱుంగక యెడందఁ దలపోయక తా
నొప్పుగఁ దలంచి వింతగఁ
దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా 2.
[తప్పే = తప్పా, కాదని]
మెప్పు వహింతు రెల్లరును మిన్నగ మౌనము నూని సుంతయుం
జప్పుడు సేయకుండ నృప సత్తము నింపుగ నాలకించినన్
గొప్ప సదస్సు నందు నృప కుంజరుఁ డాడిన మాట లందు నే
తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా 1.