1, డిసెంబర్ 2018, శనివారం

సమస్యాపూరణ_డిసెంబర్ 2018

హేయపుఁ బనులం జేయును
ఛాయా వినుమా కడింది సాధువె యైనం
బాయక యసురు ఘ నాంహ
స్సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్                                                                    62
[అంహస్సు + ఆయి = అంహస్సాయి; పాప మాదాయము గా
గలవాఁడు]

ఈ యతి వర్తనమ్మును సహించఁ డతండని నీ వెఱుంగవే
పాయక వాని నివ్విధినిఁ బంతము తోమఱి కాఱు కూతలం
గూయఁగ వీరభద్రు మదిఁ, గోపము మీఱఁగ నాదరింప కా
సాయిని, నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా                                                 61

అంధ ప్రక్రియ బంధన
సంధా నార్తి శకటారి సద్దయఁ జూపన్
గాంధారీ నాథుఁడు పు
ట్టంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్                                                                 60

అంధక దైత్య హంతక మహా శివుఁ డద్భుత భూత రూపమే
సంధిలఁ జేసి నిల్వ నర సారథి నెంచి సుయోధ నార్త వా
క్కుంథన చోది తోత్సుకుఁడు కుంభజ సూనుఁడు మత్స రోగ్ర రో
షాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్                                       59

మండిత భంగ సంచయ సమాహిత సన్నుత శుద్ధ సంత తా
ఖండ జలోద్ధతిం బరఁగు గౌతమి తెచ్చిన యట్టి దిద్ధరా
ఖండము సారవంత మిది కాదన నేరికి నెట్టు లైన రా
దొండ లతా విశేషమునఁ దోరపు బెండ లభింపఁ జోద్యమే                                                     58

[రాదు + ఒండ = రాదొండ; ఒండు = ఒండ్రుమట్టి; లతా 
విశేషము : బెండ మొక్క సన్నని కాండ]

కంటి వేమొ పగటి కల నింట నుండి
తొంటి యట్ల నీవిత్తువు తంట లెన్నొ
చెప్పు మయ్య నిశ్చయముగ నెప్పు డెట్టి
దొండ తీఁగకుఁ గాసెను బెండకాయ                                                                                  57

మండి తోర్మి కదంబ కేద్ధ సమగ్ర సన్నుత సంత తా
ఖండ కోమల పూర్ణ భాసిత గౌతమీ స్రవ దత్త భూ
ఖండ మియ్యది సారవంతము గా దనంగ సఖుండ రా
దొండ తీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా                                                        56
[రాదు + ఒండ = రాదొండ; ఒండు = ఒండ్రుమట్టి; తీఁగ : బెండ మొక్క సన్నని కాండ]

ఎట్ట కేల కతివ యిందీవరాక్షి ని
జానుమతిని నొసఁగెఁ జంద్ర వదన
యంచుఁ దలఁచి నంత మించ నానందము
కనుల నీరు నింపి కట్టెఁ దాళి                                                                                         55

ఇన్నర లోక మందు గుణ హీనుల కేమి కొఱంత వింతగం
గన్నులఁ గంటక మ్మనఁగఁ గాపురుషుండు వరుండు మిత్రుఁడే
యిన్నలినాక్షి కే నకట యీడని తల్చుచు నేడ్చు చుండ నేఁ
గన్నుల నీరు నింపుకొని, కట్టెను దాళి వధూ గళమ్మునన్                                                54

నారీ విను మొక యించుక
మేరను జక్కెర, చెలువుగ మెఱయు సువర్ణా
కారం బిడు పొడి కాదది
కారముఁ, బాయసము నందుఁ గలిపిన రుచియౌ                                                            53

దార యిదేమి వింత సతతమ్మలుకల్  గొన నీకుఁ బాడియే
పోరులు గల్గవే ముదిత పూర్వ గతిన్ నిజ కాంతు నందునన్
గౌరవ ముంచి సుంత మమకారము, వీడి ముఖంపు టా తిర
స్కారముఁ, బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్                                       52

ఆపి మేఘ రాశి నలరి వానల నిచ్చు
సమ్మతపు ఫలౌషధమ్ము లొసఁగు
మూల సంహితమ్ముఁ గాలోచితమ్ముగ
వనమునన్ లభించు ఘనసుఖంబు                                                                            51


వన గజ రక్షణోద్యమ కృపా రస సిక్త ఘనాంతరంగు పా
వన ముని సంచయ వ్యసన వారణ సక్త మనోవిరాజి యా
కనకమ యోజ్వ లాంగద వికాస రమా పతి విష్ణు పాద సే
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్                                          50


సును గొలువంగ నిద్ధరఁ గొందఱు
సుర గణార్చితుండు మురహరుండు
క్రీడ లలరి చేయు కృష్ణునిఁ గొల్చెద
స్తుత మతులను గూడి సతము నేను                                                                          49

వనితా మతల్లి చెఱ నింపుగఁ గన్నదొ యట్టి బాలకుం
డే వశ యెంచెఁ దా నసువు లెల్లను దీయఁగ నట్టి బాలకుం
డే వరవర్ణినుల్ నుడివి రెవ్వని క్రీడల నట్టిబాలు నే
నా వసుదేవ నందనుని నార్తినిఁ గొల్తును బస్తు లున్ననున్                                               48

భామకు బోయ కులమ్మున
నా మహితాత్ముండు తిన్నఁ డవతరిలంగన్
భూమిని నాహా తలఁచం
జీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా                                                                          47

ఈ మహి నందుఁ జిత్రములె యిట్టివి గాంచఁ దలంచి చూడగన్
భ్రామక మౌనె కొండ లవి పచ్చిక లచ్చట నుబ్బు చుండగా
నేమని చెప్పు వాఁడ మఱి యేనుఁగు లెక్కుట యబ్బురంబె యం
చీ మల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా                                                46
[అంచు+ ఈ మలకు = అం చీ మలకు]

కలరూ పెల్లయు నుడువన్ 
లలితాంగి నిజ పతికయి వలపునన్ వేచం 
దెలతెలవాఱం గలఁతన్ 
నెలఁ జూపి లతాంగి కంట నీరుం గార్చెన్                                                                          45

లలి తాంభోరుహ పాదయుగ్మ మృదు లీలా కేళి డోలాయమా
న లుఠన్మానస చంచలాక్షి పరమానందంబు సంధిల్లగా 
నల దా నేఁగఁ బొలమ్ము పాదమునఁ జేయన్ గాయ మచ్చోటి యీ
నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచుం బయ్యెదన్                                          44

మేరు వొసంగినఁ బృథివీ
సార మొసంగిన మనమున సంతృప్తి యనన్
నేరని వానిని నిత్య వి
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్                                                                    43


వారక దుష్ట చిత్తు లగు వారినె కాదు సుమా కడంగి యే
తీరున నొప్పునో తలఁచి ధీరత యోర్పును నైపుణంబు నే
పారఁగ నొవ్వ నీక మృదు వాక్య పరంపర దుష్ట సంఘ సం
చారు ను దూర ముంచిననె చాగును జీవిత మద్భుతమ్ముగా                                           42

ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ
సంగరమ్ము నం దక్కట భంగ పడక
నిల్వ నేర్తురే యుక్కునఁ బల్వరించ
కవ్వలలుని ముంగట సుంత నొవ్వ కుండ                                                                      41

వృక తుల్యోదర భీమసేనుఁడు గదావిద్యా ప్రవీణుండు రా
జ కులైక ప్రవరుండు దుర్జయుఁడు శంసన్ మల్ల యుద్ధంబు నా
పక పోరంగఁ బరాజయమ్మున కటం బాలైన వారెందఱో
యొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో                                          40

నివసింతురు నాగరికులు
వివేకవంతులు కడింది విజ్ఞానముతోఁ
గవు లెందఱొ కల రచటఁ గు
కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్                                                                   39

అవిరామమ్ముగఁ దిర్గి తిర్గి యిక నే నా పట్టణంబందునన్
సువిశా లాపణ ముత్క్రమించి చనఁగన్ సొమ్ముల్ మహా చోరు పా
లు విచిత్రమ్ముగ నూఱడింపు గల పల్కుల్ విన్న నొప్పౌను నా
కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునం జూడఁగన్                                         38
[నాకు + అవి = నాకవి]

కుక్కు టాధమా ప్రకోపించ కిట్టుల
నుక్కు వలదు నీకు వెక్కసముగ
గృధ్ర రాజ మేను గిట్టించ నాదు శా
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను                                                                              37

వికటస్ఫూర్తిఁ జరించ భీతిలుదునే విద్రోహి దైత్యాధమా
ప్రకటంబే యిది నిత్య సత్యముగ దుర్వారంపు జ్వా లాస మాం
బక భక్తాళి పఠించు మంత్ర తతు లా పంచాక్షరీ వాక్త్రయం
బకమే చాలును బ్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్                                                36

ఘన విక్రముండు దా భయ
మన నెఱుఁగడు మానసమున నటఁ బట్టంగం
జని కని పామును, దలఁచుచు
హనుమంతుని, తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్                                                                35

అని లోద్ధూత పతాక సంస్థిత వికా సామేయ శౌర్యద్యుతిన్
హనుమంతుండు విరాజమానుఁ డయి తా నార్చన్ వడిం దా ననీ
కిని నిల్చుండఁగ భండన స్థలిని, టెక్కెం బందు వీక్షించుచున్
హనుమద్వాలముఁ,  ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్                                    34


ఏక్ - దస్ - సౌ – హజార్ 
రిపు వీ రానేక భయ
పురస్సర సౌకుమార్య శత జన వృతుఁ డా
విపుల స్కంధుఁడు భీముం
డపుడు హజారమున నిలిచె నానందముగన్                                                                 33
[హజారము = ఆస్థాన మండపము]

అక్కట చరింతురు నరులు దక్కి జాలి
మోయ లేక భారమును నారాయణ యని
ధావ కాంబర సంచయ ధర మహా ఖ
ర మణి, పాపమ్ము గద, పాశురములఁ జదువ                                                               32

కమనీయమ్మగు రీతు లొప్పఁగను సత్కార్యాళి సంప్రీతినిన్
విమలాంతః కరణప్రభామహిమఁ దా వే సేయ నొప్పుం గదా
కుమ తీర్ష్యా దమ నైక చిత్తమున నాక్రోశించి నిత్యమ్మునున్
రమణీ పాశురముల్ పఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ                                             31

వట్టి మనిషివే నీవని
ముట్టుమ యశనము నని వలపున గంటలు దా
నెట్టెట్టని నట్టింటను
గొట్టెడు పతి నిష్ట పడరె కోమలు లెల్లన్                                                                           30

నెట్టన బుజ్జగించుచును నిత్యము తిర్గుచు వెంట నీవు నా
చిట్టివి బుజ్జివే యనుచుఁ జిత్తము నందునఁ బ్రేమ మీఱఁగన్
మట్టెలు తాకుచుం దనదు మాటల కెల్లను వంత పాడి యూ
కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్ట పడంగ నేర్తురే!                                                         29

అచ్చర యనఁ దగు శరచ్చంద్ర వదనను
నంబుజాయ తాక్షి నాత్మ తనయఁ
గంబుగళ విలసిత జాంబూనద తను ము
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె                                                                                 28
[ముఖరము=వాగునది]

అరుదగు వింతఁ గాంచుఁడు మహాద్భుత మెంచ నభోధ్వ మందునం
బరువిడి సంభ్రమమ్మున నపార మనః ప్రణ యాత్త చిత్త తా
న రయము రోహిణీ రుచిర నామక తార త్రి నేత్ర శంభు శే
ఖరమును గౌఁగిలించు కొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్                                        27
[త్రి నేత్ర శంభు శేఖరము =మూడు కన్నులు గల శంభుని శిరమందున్న వాఁడు, చంద్రుఁడు]

ధరణి భవ్య పుణ్య క్షేత్ర దర్శనములు
కారణము లఘ సంఘ విఘాతమునకుఁ
జూడఁ దగిన యట్టివి పెక్కు సుందరంపుఁ
బొలఁతి! మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట                                                                     26
[మేను = పార్శ్వము]

పార్వతీ దేవి మనోదర్శనము సకల పుణ్యక్షేత్ర దర్శన తుల్యము:  

గణ్యం బైనది నైమిశాటవి యనం గాంతా శిరశ్శాల లా
వణ్యంబౌ ముఖ మండలమ్ము శశి సంభావ్యంపు వేశ్మంబ తా
రుణ్య భ్రాజిత పాద యుగ్మ మఘ సంరోధంపు క్షేత్రం బనం
బుణ్య క్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై                                           25

ఆశ లుడిగి చిత్తమునం
బాశ విముక్తులయి నరు లమర గురుని ప్రతీ
కాశము నిజాప్తులకు సం
దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్                                                                       24

దేశము నందునన్  ధరణి దేవుఁడు వాసము సేయ కుండినన్
దేశము నందు వైద్యుఁడు నుదీర్ణతఁ గన్పడ కుండ నుండినన్
దేశము నందు జీవ నది తీర్థము నిత్యము పాఱ కుండినన్
దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్                                                     23

తీరె నంచితముగఁ బ్రతీకార మంచు
నతిశయమ్ముగ గెలుపొంది నట్టి వారు,
చిత్తయి యొకింత సవ్వడి సేయ కున్న,
నవ్వి, రోడినవార, లానందమొప్ప                                                                                22
[ఓడిన వారు -  చిత్తయి యొకింత సవ్వడి సేయ కున్న- ]

మూఁడు నిలన్ జయాపజయముల్ సమరమ్మున దైవ లీలలై
యాడిరి శక్తి మీఱ విజయార్థ మనమ్మున గెల్పు లోటముల్
సూడఁగఁ దాఱుమా ఱయినఁ జోద్యముగా నపు డంత గెల్వ ము
న్నోడిన వారు నవ్వి రయయో యని గెల్చిన వార లేడ్చిరే                                                21

నడయాడఁగ వీధులఁ దా
నడరిన దుర్వ్యసనముల ధనాతిశయమునం
గడువడిఁ గుల గౌరవ మది
చెడు, గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్                                                         20

నడవడి ముఖ్య మెల్లరకు న్యాయము కన్నను మిన్న యైన దీ
పుడమినిఁ గాంచ నేరము ప్రమోద మొసంగు క్షమా గుణం బిలం
దడయక యుద్యమించుచు సదా శరణన్న నరాతి కోటిఁ గా
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్                                         19

ఆతత గదా సమరమున నాదర గురు
పుంగవుం డని మ్రొక్కుచుఁ బూజ సేయ
బావ వరుస వాఁ డని బలభద్రునిఁ దమిఁ
బవనతనయుండు రామునిఁ బరిహసించె                                                                      18

వివరము లేలఁ జెప్ప నిట వీనుల చేటు వినంగ లేము మే
ము వదరు లెల్ల దుష్టుఁ డయి మూర్ఖపుఁ గర్మలు సేయు చుండు రే
పవలును మందలించుముర పాడిగ నిప్పుడు నీకు నక్కటా
పవన! సుతుండురా ముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా                                           17

నిరత ఋజు వర్తనుఁడు జన
వర హృద యావగత విబుధ వరుఁడు సుజనుఁ డౌ
ధరణీ సుర మాన ధనునిఁ
గరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్                                                           16

పరుగిడు వారు శస్త్ర చయ భగ్నులు దుస్సహ భీత చిత్తు ల
స్థిరమతి వాగు వారి పయి దీర్ఘపు మత్తున నున్న వారి పై
నరిబల శూర సంయుతము నా శరణాగత దీన సత్కృపా
కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయమ్ముగన్                                     15

పున్నమి నైనను గానము
చిన్న దొర యితండు పిసరు చెక్కది చెదరం
డెన్నఁడు నిందల కన్నా
యెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్                                                                 14

ఇన్నర దేవ యక్ష భుజగేశ్వర కిన్నర శత్రు వీతఁడే
యిన్నగ ధీర విక్రముఁడు నిమ్మహిషాసురుఁ డుగ్ర రూపునిం
జెన్నుగ దైత్య శేఖరులు సేరి వచించిరి పల్కు లిట్లు వే
యెన్ను కొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే                                               13

వేగమ మందిరమునఁ దగ
మూఁగుచు శ్రీరామ నవమి పూజల తోడన్
వేఁగక మదిఁ బానకముం
ద్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్                                                                     12

ఆగమ సంచ యావన పరాత్మ రమాహృద యాబ్జ భాస్కర
ప్రాగధినేత కీర్తిత సుపాద ధరా ధవ నామ గానముల్
సాగుచు నుండ నిత్యమును శౌరి పదాంబుజ చింతనా సుధం
ద్రాగిన మాన వోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్                                           11

అసమాన యశో విభవ వి
లసిత మహా ప్రాజ్ఞ వర విరచితము నపహా
స సమేత పద పరివృత వి
రస మయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్                                                             10

ముసరఁగ మేఘ పంక్తి దివి మోదము నందవె కేకి కోటులే
యసదృశ యుద్ధ విక్రమ మహా నిపుణుండు సమిత్తు మెచ్చఁడే
రసహృద యాళి మెచ్చదె కరమ్ము సుకావ్య రసామృతమ్మునున్
రసమయ కావ్య మే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్ ?                                    9

చిత్రంబుగ నా కిచ్చట
గాత్రం బెండెను గరమ్ము కంపం బయ్యెన్
విత్రాసంబునను భృశము
పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్                                                           8
[మగని = మగ పిల్లవాని]

నేత్రానందము నీయ నాకు హృదినిన్ నీరేజ పత్రాక్ష స
ద్గోత్రప్రాభవ లాఘవమ్మకట నిర్ధూతంబ నీ యందు నో
పా త్రాపాత్ర వివేక విస్తృత మహా ప్రాజ్ఞుండు మా మామకుం
బుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్                                            7

బంగ్లా దేశమున నధిక
పుం గ్లాని తొలంగఁ గోరి పూర్ణము జూదం
పుం గ్లహమును మాన్పఁగఁ దా
నాంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్                                                                    6
[గ్లహము = పందెము; కృతి = ఒక రచన; పోతన = బంగ్లా దేశపు పోతన]

యాంగ్ల మనంగ నేమి భువి నందు వెలింగెడి భాషలందు నీ
యాంగ్ల జనవ్రజమ్ముతిరుగాడగ భారత మందుఁ గాంచి వా           
రాంగ్ల పురమ్ము లందలి జనాళి పఠింపఁగఁ గూర్చు రీతి నా
యాంగ్లము నందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో                                         5

సుధ లూరెడు కవనమ్ము ల
వధు లెఱుఁగక కవి వచింప వారక మఱి యి
వ్విధ మైన సంస్కృత శతా
వధాన మన మదన పల్లె ప్రజలకు భయమౌ                                                                 4

రయముగఁ బొట్ట కూటికయి గ్రామ నివాసులు వేఁగఁ బద్య సం
చయముల సంతసమ్ము మదిఁ జారు తరమ్ముగఁ బొంద నేర్తురే
స్వయముగఁ జూచి తే నట నివార్యమ సుమ్మిఁక నెన్ని భంగులన్
భయమునఁ బాఱదే మదన! పల్లె ప్రజాళి వధాన మన్న చో                                              3

సతులకు నుర్వీ తలమున
సతతము పతు లొసఁగు వార సంపద లెల్లన్
నుతు లీయరె యొక మాసముఁ
బతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్                                                                   2

శ్రిత మందార యశో విరాజితుఁడు కాశీ పత్త నాధీశుఁడున్
నుత సీతాపతి నాగ భూషణుఁడు విష్ణుస్కంధ నారాచుఁడున్
నత శక్రాది సురౌఘ పూజిత మహానందుండు దాక్షాయణీ
పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే                                           1

1, నవంబర్ 2018, గురువారం

సమస్యాపూరణ_నవంబర్ 2018

కాశ్మీర మది యొసంగును
రశ్మి రుచిర భారత నగర సమూహమునం
గాశ్మీర వాసు లుడిగినఁ
గాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్                                                                              58

అశ్మాగారములై చెలంగు రిపు శూరానీక చిత్తమ్ములే
రశ్మిజ్వాలల రోయ నెల్లెడల వీరశ్రేణు లొక్కుమ్మడిన్
వేశ్మవ్రాత పరీత రక్షణ దళావేశోర్భటిన్ క్షీణమై
కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్                                                        57


అలవడునే యన్యులకు స
కల వేదార్థజ్ఞత భువిఁ గాకుత్స్థనితాం
త లసద్భాషణములుఁ గా
వలయు ననిన రఘువరా! కువలయ దళాక్షా!                                                                     56

మోఱ యెత్తి యెలుఁగు లిడ మీఱి యంత
నావులకుఁ బగ్గములఁ జేయ వే వదులుగ
రాటఁ గట్టిన యా మెడ త్రాళ్ళవ పలు
చ నులు లేని యావులు పాలఁ జాల నొసఁగె                                                                          55
[నులు = మెలిక]

చెన్నుగ భూతలమ్మునను జీవ నికాయము గీత నాదముల్
కన్నులు మూసి కొంచు వినుఁ గమ్మగఁ బాలిడ మాను నం చనం
బన్నుగ నెంచ నీ వపుడు పాటల నాపి తొలంగ గట్టు నం
చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్                                                   54
[అంచు +అన్ను; అన్ను = పారవశ్యము; సంగీతపుఁ బారవశ్యములో 
పాలు చేపుట మఱచు నన్న భావము ]

ఎల్లెడను జెల్ల చెదరయి మల్లె లెల్ల
నచ్చటఁ బడియుండఁగ నెండ నబల యరసి
కొల్లలుగ నున్న పువ్వులఁ గూర్చమాసి
నల్లఁ గా నున్న మల్లెల నాతి దాల్చె                                                                                     53

వెల్లువ గాఁగ సౌరభము వింతగ నెల్లెడ వేశ్మ మందు శో
భిల్లుచు మంద మారుతము వీవ మనోహరమై భృశమ్ముగన్
సల్లలితాంగి సేరి సరసమ్ముగ నింపగు దండ నెమ్మి దా
నల్లఁగ, నున్న మల్లెలను, నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్                                            52

చలచల కాగుచు నుండఁగఁ
బలు విధ శాక నిచయములు వాఁడివి యౌ కో
లలు వెదురివి యెగురఁగ నా
వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై                                                                            51
[వలలుఁడు = వంటవాఁడు; కీచకము = వెదురు; కీచకుఁడు = మూర్తీకృత వెదురు]

లలిత విరాట రాజ్యమును లాలన లీలగఁ జేయు చుండి వీ
రు లల పరాక్రమించిన శిరోదళన మ్మొనరించి ధాత్రినిం
గల నృప సింహ విక్రమ నికాయము నుద్ధతి, దక్క నొక్కనిన్
వలలునిఁ, జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్                                                      50

వినుమా చెప్పెద నీకిటఁ
బని గట్టు కొని పిలిచి తమి వారెల్లరిచే
తను మఱి నిన్నున్ దుందుడు
కనిపించిరి, కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్                                                                           49
(దుందుడుకు + అనిపించిరి)

జననుత పండితప్రవర సంచయ కూటమి సాగుచుండగన్
ఘనముగ నర్థ శబ్దములు కైతల లోఁ దిలకించి పాడిగన్
మననము సేసి భావము విమర్శన సంభృత వాద కోటినిం
గనఁబడి రప్డు, వానరులు గాఁ గవి వర్యులు తత్సభా స్థలిన్                                                     48
(వాను+అరులు =వానరులు; వాను =నోటిచేత; వా=నోరు; చేతల గాక 
మాటల శత్రువులని భావము, అలుక్సమాసము.)

విద్యాధికులకు నడుమ న
నాద్య మ్ముండుఁ గద దుస్స హాసూయ గనన్
విద్యావంతులఁ దెగడెడు
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్                                                                           47

మద్యము గీ డొనర్చు భువి మానవ జాతికి నక్ష దుష్కళా
విద్యయు నట్టి దయ్య యవివేకులు వాటికి లోఁబడన్ మహా
వద్య వికామ మోహ మద వైర రుషా భర లోభ మత్స రా
విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్                                                    46
[కనెం బూర్వమని భావము;  మహా+అవద్యము: మహా నికృష్టము; మత్సర+అవిద్య]

కల్లయుఁ గపటం బెఱుఁగక
పిల్లది గుండమునఁ బడ గుభిల్లున మంటల్
పెల్లుబికి కాలు చుండగఁ,
జల్లని నీరమున, నొడలు సర్వముఁ గాలెన్                                                                        45
[చల్లని నీరమున = నీళ్ళు చల్ల కుండమిచే]

చెల్లునె నీకు నక్కట విచిత్రపుఁ జిందులు నివ్విధంబుగా
నల్లరి సేయ నిత్తరిని నందఱు బిత్తఱ పోవఁ జల్లఁగం
బెల్లగు వేడి నీటిని గుభిల్లున చల్లని నీటి నక్కటా
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో                                                           44

తాపస స్వరూపమున సతత మసత్య
వాది దోసము గీసము లేదని మఱి
తిరుగు వానికి నహహా మతి విడనాడి
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును!                                                                        43

బాసలు సేత లన్నియును బాడిగ నొక్క విధమ్ము నుండగన్
ధీ సహితమ్ము యుక్త మగు దీన జనాళికి దైవ కీర్తనల్
సేసి సమంచితమ్ముగను సేవ, తలంచక చిత్త మందునన్
మోసముఁ, జేయు వారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై                                          42

ఏ డుండుకుఁ డేని వడిని
మూఁడుట నాచేత నిక్కము సుమీ కనుమా
నేఁడ యసురుఁ డా రుతముల
తోడఁ బొలియు ద్రౌపది యిటఁ దూర్ణము ధృతినిన్                                                               41

అమ్మా యిపుడు రయమ్ముగ
లెమ్మిఁకఁ  జెల్లెలి నలంకరించుమ మఱి సీ
తమ్మా మంచి ముహూర్తము,
రమ్మని తండ్రి పిలిచెఁ, దొలిరాత్రికిఁ, గూఁతున్                                                                       40

నమ్ముమ తార తమ్యములు నా జనకుండు తలంపఁ డమ్మ యో
యమ్మరొ కోప మేల నిట నామెను ముందుగఁ దాత పిల్వగం
గమ్మని పేరు సంధ్య తన కన్నియ యామిని కూతు రిల్లు దూ
రమ్మని పిల్చెఁ దండ్రి తొలి, రాత్రికిఁ గూఁతును బ్రేమ మీఱఁగన్                                                39
[తొలి = తొల్లి; రాత్రికిఁ గూతు = యామిని కూతురు]

అసువులు వడి వీడె నచ్చట నక్కట
యొక్క యాడు బల్లి దిక్కు లేక
పిక్క జారఁ గాంచి బేర్మి సఖి మరణం
బకమునుఁ గబళించు బల్లిఁ గనుము                                                                                 38
[మరణంబు + అకమును = మరణం బకమును; అకము = దుఃఖము]

ప్రకటిత మౌను దైవ కృత రమ్య వినోద సులీల లన్నియున్
సుకరము గాంచఁ బ్రాకృతిక సుందర జంతు నికాయ మంతటిం
జకచక గోడఁ బ్రాఁకుచును జయ్యనఁ గీటక సంచలత్కదం
బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొను మయ్య మిత్రమా                                           37
[కదంబకము = గుంపు]

సహకార మించు కేనియు,
వహించ కోర్మి, సలుపంగ వలదంచని తా
విహరించఁ గోప మూని య
సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్                                                                36

అహ రాద్యంతము దుర్భరాశన సమాహారంబు సాగుం గదా
యిహ మందున్  జన సంచయమ్మునకు నిట్లీక్షించగన్   రోషని
ర్దహనప్రాభవ భాసితద్యుతి మనో ధైర్యమ్ము నిండన్, మహా
సహనమ్మే తొలఁగింపఁ, జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్                                    35
[మహా +అసహనము = మహాసహనము]

గణ నాతీతమ్ముగ ఘన
రణ విద్యా విక్రమముల రాజువరులు నై
పుణ ముత్తమముగఁ బొందిన,
రణములె కద, పండితులకు రమ్యక్రీడల్                                                                          34

గుణ ఘన నిస్వనమ్ముల నకుంఠిత విక్రమ వీర్య సంపదన్
రణ మొనరింప వీరు లుదరమ్మున వ్యాకర ణార్థ శబ్ద వా
గ్గుణ గణ తర్జ నాదులను ఘోర పరస్పర పాండితీ విచా
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్                                                 33

దైవ భక్తు భంగిఁ బరఁగి దారుణములు
ధర్మ మెంచక క్రూర కర్మమ్ము లెల్ల
వార కెన్నఁడు సేయఁ బోవ గల వయ్య
గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు                                                                          32

వెలవెలఁ బోవ బంధు సఖ బృందము పత్తన వాసు లందఱిం
బిలుచుచు బిట్టు తిట్టుచును బీడ లొనర్చి చెలంగు చుండ వా
రల వదన చ్యుత ప్రకట రావ తరంగ సుశాప దాయులౌ
గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్                                                   31
[సురగంగ = మద్యమను గంగ] 

అర్కానిల సమ తేజుఁడు
తర్కంబేలఁ జిరజీవ ధన్యుం డరయన్
మార్కండేయుండొ యపర
మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్                                                                        30

సార్కద్యోచర సంచయమ్ములు దివిన్ సంచారముల్ సల్పు సం
పర్కంబై యుడు చక్రవాళముల సంభావ్యంపుఁ బర్యంతమున్
బెర్కే లే దన, నంజనీ సతికి సంప్రీతుండు, తుల్యుండునై
మార్కండేయునకున్, సుతుం డగుచు జన్మంబందె సామీరియే                                            29
[బెరుకు = భేదము]

పిన్న లకట వీరిఁ బేర్మినిఁ జూడంగ
వలయు సుమ్మి వీడఁ బాడి కాదు
చెందకుమ నిరాశ చెప్పుము, కోపము
వలదు, చదువు బాల బాలికలకు                                                                                      28

చదలునఁ దిర్గు పక్షులకు శాస్త్రము సెప్పిరె యెవ్వరేని యీ
యుదక వసుంధరా చర మృగోత్కరముల్ వినెనే వచింప కీ
పదుగురు చెప్పు చుంటిరని పశ్చిమ దేశము లందు మర్మపుం
జదువులు, బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు, వద్దురా                                                27

అందముగ నిల్పి భూమినిఁ
జిందులు వేయుచు మురారి చిత్క్రీడల నం
దందఁ దిరుగు చుండం దొలి
పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్                                                                           26

అందియ లల్ల ఘల్లు మన నందము లొల్కు సతీ మతల్లి తా
నం దిడఁ బంచ భక్ష్య పరమాన్నము లింపుగఁ బళ్ళెరమ్మునన్
స్కంద గురుండు విశ్వపతి కల్మష కంఠుఁడు గానఁ దోలుచుం
బందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై                                                      25

ఓఘద సత్కథ మఱి యవ
దాఘము తీర్పంగ సముచితము నాకు మ హా
మోఘమ్ము కావ్య రత్నము
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్                                                                  24
[ఓఘదము = ఉపదేశము నిచ్చునది, మాఘము = మాఘ 
విరచిత కావ్యము]

దాఘము ప్రేమకై వర వితానమునం దొనరంగ నగ్నికిన్
మోఘము కాక యుండగను మూరి ధరించఁగ భార్య సప్త ఋ
ష్యౌఘ సతీ మతల్లు లట శ్యామ యరుంధతి దక్కఁ దోఁచ భీ
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్                                                     23
[భీమ = అఘము = భీమాఘము: మహాపాపము; మార్గ శిరము = (బ్రతుకు) 
మార్గము యొక్క చివర; కార్తికము = షట్కృత్తికలకు (సప్తర్షుల భార్యలు)
 సంబంధించినది] 

వడి వడి నరుదెంచి బాలకుం డొక్కఁడు
సవ్వ డించుకయును జల్ప కుండ
వేగఁ దెచ్చి యంత బాగుగ దుప్పటిం
గప్పను గని పాము కలఁతఁ జెందె                                                                                      22
[కప్పను = కప్పఁగా]

ఎప్పుడు వచ్చు చిక్కు లవి యెక్కడ యేరికి నెట్లెఱుంగ గా
నిప్పుడమిం గలట్టి జను లెన్నఁడు నేర్తురు తప్ప శక్యమే
యప్పను దల్చి చిత్తమున నచ్చటి ముంగిస, మ్రింగ వచ్చుచుం
గప్పను, గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై                                                    21

కలి యుగమ్ము లోనఁ గాంతుమె సుఖమును
రేవగళ్ళు వంత లావరించు
నరుగ నర వరేణ్యు లమర లోకమ్ములు
లయమె శాంతిఁ గూర్చు నయముగాను                                                                             20

నియమ క్షీణుఁడు రావణుండు వర మౌనివ్రాత  విద్రావణుం
డు యథాజాతుఁడు రాక్ష సాన్వయుఁడు దుష్టుండున్ జగత్కంటకుం
డు యశఘ్నుండు కులాంతకుండు దశ కంఠుం బంప ఘో రాంతకా
లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై                                                    19

ఒట్టు వేసి బెట్టిదముగ గట్టు నందు
నక్కటా పెట్టి యెట్టు లనంగ నేర్తు
విట్టి వట్టి సుద్దుల నెప్పు డెందు నెట్టి
తోడఁ బుట్టు వే యన్నకుఁ గీ డొనర్చె ?                                                                               18

భరతుని దుఃఖాలాపములు:
మోడయ్యెన్ గద నాదు జీవితము దంభోళిప్రహారంబునన్
వ్రీడన్వీడెను కేకయాధిప కుమారిం జూచితే వెఱ్ఱినిన్
వీడన్నేర్చెను ధర్మ మక్కట మహావీరుండ యో మామ నీ
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!                                                       17

వర మిడు పాదుకలను ని
న్నరసెద నన రామచంద్రుఁ డానందమునన్
వర సోదరుండు వేఁడఁగ
భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్                                                                    16
[రాముఁడు = రామ వర్ణము (నలుపు) వాఁడు,ఇచట భరతుఁడు] 

నిరతము రాజ్య మేల నవనీ పతి రా వన వాస సిద్ధినిన్
వర రఘు రాముఁ డంతట నవార్యము న్యాస ధరా తలార్ప ణా
బిరతుఁడు మాండవీ ధవుఁడు వీరవరేణ్యుఁడు సత్యసంధుఁ డా
భరతుఁడు భ్రాతృ వత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్                                                15

కమనీయమ్ముగ మా యిం
ట మైమఱచి పాటలం దడరి తమిఁ గనుమా
ప్రమద మ్మది మీఱఁ బఱచి
తిమి ర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్                                                                      14

ప్రమిదల తో జనవ్రజము పబ్బము సల్పుచు నుండఁ జేతిఁ దా
కమియును వే మతాబు లవి కాల్చఁ గనుల్ సెదరంగ రోగ దా
యి మహిని నీ వెలుంగును సహింపఁగ లేక తటిల్లతా ద్యుతిం
దిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్                                             13
[తిమిరము = నేత్రరోగము] 

పరఁగి తిక్కన హరిహర నాథ యంచును
జేసె రచన నపుడు చిత్త మలర
భేద మనఁగ లేక వెల్గుదు రిద్దఱు
నరక హంతకుండు గరళ గళుఁడు                                                                                      12

నరముని దేవ సంఘముల నైరృతి నాథులు దుష్ట చిత్తులై
యురువుగ నేఁచు చుండగ బలోద్ధతి నీశ్వరుఁ డుత్సహించగన్
నరహరి దైత్యు లా త్రిపుర నాముల శ్రీపతి బాణ రూపుఁడై
నరక నిహంత యయ్యెఁ గద నాగ గళుం డగ జాత మెచ్చగన్                                                 11
[నరక (న్) =నఱకఁగ); కదన అగ గళుండు: యుద్ధ మను చెట్టు ధూపమును 
పీల్చు వాఁడు]

నాతిని నీవును, భావా
తీత పరాశక్తిని హృదుదిత భక్తి మెయిం
జూతురు సతము జగన్ని
ర్మాతలు మువురైన నొక్క మాతఁ, గొలుతువా                                                                    10

ఆతత భార తావనిని నైచ్ఛిక బుద్ధినిఁ జిత్తగించి భూ
మాతను గొల్వఁ జాలునె సమంచిత రీతిని నిత్యమున్ క్షమా
తీత వసుంధరల్ భగవతీ కమలా గిరిజా సతీ జగ
న్మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే                                                  9

కల నైనఁ దలంచఁడు పది
తల లున్నట్టి దనుజుండు దర్పంబెసఁగన్
విలసిత  సంగర  కౌతూ
హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్                                                                     8

సలలిత సూర్య వంశ విల సత్పురు షోత్తమ రామ నామ హృ
ద్విలసిత దేవ మౌని వర విప్ర గణార్చిత భాసితుండు వి                 
హ్వల ఖర దూష ణాది పల లాశన మారక బాణమన్   హలా
హలమున రాఘవుండు దను జాధిపుఁ జంపెను సంగరంబునన్                                            7

ఆ పగ లంతయు నతి ని
ష్ఠా పరులై యౌపవస్త సన్ముక్తులు నై
యేపుగఁ గార్తికమున దీ
పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్                                                                      6
[ దీపావళి నాడు జరిపెడు బాణసంచా సంబరము]

పావన భూమి భావితర భవ్య జనావలి వృద్ధిఁ జెంద సం
భావన నీయ సమ్మదము భద్ర సమీరణ భూ నభః కృపీ
టావరణమ్ము లెవ్విధిని వ్యర్థము సెందవొ యట్టి రీతి  దీ
పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్                                                        5
[దీపావళి నాడు రాబోవు కార్తికపు పున్నమి రాత్రి కూడ.                                       

సమీరణ భూ నభః కృపీ టావరణములు = వాయువు, పృధ్వి, 
యాకాశము, నీళ్ళు కూడిన యావరణము. అగ్నిని దీపావళి 
బాణసంచు లెవ్వియు నాశనము సేయ లేవు కదా!] 

పొగరు తోఁ  దిరుగుచున్న కొడుకును జూచి యొక 
తండ్రి పలికిన పలుకులు:
బుద్ధి యున్న వారు వోవు గతులు గావు
కుల వినాశ మగు సకల జన భయ
దమ్ముగ బెడిదంపు దౌర్జన్యమును, ముంచి
మంచిఁ, బెంచువారు మందమతులు                                                                                     4

సంచుల నిండ నింపుటకుఁ జాలును గాంచఁగ గో కలాపముం
బెంచుట కైన నియ్యది భువిం దగునే మఱి దేశ పౌర స
త్సంచయ నంద వర్ధకము శాలి సుసస్యము మాని పూసకా
మంచినిఁ బెంచువార లిల మందమతుల్ గద యెంచి చూడఁగన్                                                 3
[పూసకామంచి = ఒక రకమైన గడ్డి, కామంచి గడ్డిలో నొక రకము]

ఊర్మ్య సరోవర కలి తా
కర్మ్య తరూద్భవ సునందకము పుష్కర సా
ధర్మ్య విపిన కూల మహా
హర్మ్యంబున నెదిగె వట మహా వృక్ష మహో                                                                              2
[విపిన కూల మహా హర్మ్యము = అడవిలోని 
పెద్ద దిబ్బ యనెడు హర్మ్యము]

సగర చక్రవర్తి కుమారుఁ డసమంజసుని ప్రవర్తనపు సందర్భము. 
పూర్వ జన్మము లో నతడు మహాయోగి. సామాన్యుఁడు కాదు. మహా వృక్ష సముండే.
ఐర్మ్యమ్ముల్ కలుగంగఁ బౌరులకు సూర్యామ్నాయ హీనుండు సా
ధర్మ్యంబై చెలఁగంగ దైత్యులకుఁ దద్రాజ్యమ్ము నందుండి నై
ష్కర్మ్యంబే నిజ ధర్మ సారమని దుష్కార్య వ్రజోన్మత్తుఁడై
హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్                                                     1

1, అక్టోబర్ 2018, సోమవారం

సమస్యాపూరణ_అక్టోబర్ 2018

పాడిగ సంకీర్తనములు
పాడిరి సద్భక్తి మీఱ వార్చిరి సంధ్యన్
వేడి శివుని వని క్షుత్తన
కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్                                                                           64
[క్షుత్తునకు + ఓడి = క్షుత్తున కోడి; ఓడి = నీవార ధాన్యము]

గూడెము నందు వింతలను గోరి లిఖింపఁగ నెంచి లేఖకుల్
పాడుచు నేఁగి వేగముగఁ బల్లెకుఁ గాంచఁగ గ్రామవాసులం
బాడిగ వాఁడి వార్తలను వా రిడఁ గైకొని, వండి యీయ నా
కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి, భుజించిరి గాదె శ్రోత్రియుల్                                                   63
[శ్రోత్రియుఁడు = వార్తలు సేకరించు వాఁడు; శ్రుతి = సుద్ది]

ఇష్టా గోష్ఠుల జన సం
క్లిష్ట వికారము లెఱింగి లీలా లీలం
గష్ట మనక చేయ నడచి,
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద, పురువుల మందుల్                                                                62
[పురువుల (న్) = పురువులను; అడచి పురువులను మందుల్  
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద] 

ఇష్టము సేయ మిక్కిలి మహీజన కోటికి నుద్యమించి యే
కష్టము దేహ మందునను గానఁగ రాదట వేదశాస్త్ర భూ
ద్రష్ట లొసంగి రంట యుదరస్థిత కీటక నాశకారు లీ,
పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట, పుర్వుల మందుల మ్రింగ మే లగున్                                             61

వదనారవింద యే నద
నదీ తటాక భరిత ఘన నగరమ్మున నే
సదనమ్మున నిమ్ముగ నె
మ్ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్                                                                   60

ముదిత సుభద్ర సోమ సమ మోహన రూపుఁడు సవ్యసాచినిం
బదిలపు వీర భావమునఁ బౌరవ రాజస తేజ మేర్పడం
గదలెడు భావి కాల విధి కల్పిత శాప విముక్త భాను మ
న్ముదిత నపుంసకుం గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్                                                59

అందము లొల్కు పథమ్ములు
విం దొనరించుఁ గనులకు నవియ దేశము నం
దెందును జూడఁగ మెలఁగుదు
రంద ఱొకని లోన నొక్కఁ డందఱి లోనన్                                                                              58

విందుల యందు మందులును బెం దమకమ్మునఁ జిందు లేయరే
డెందమునం దమంద రహి డిందును బొందియు సందడించుచుం
గుందక యిందు నెందునను గుంద మరంద సనంద పాన మీ
యందఱి లోన నొక్కఁ డగు నందఱు నొక్కని లో వసింతురే                                                       57

ఖండిత నాసికా కర్ణ శూర్పణఖ మనోగతము:
వర రఘువీర సుదారిత
గురు నాసా కర్ణ దుష్ట గుణ శూర్పణఖా
దురవస్థ విమోచన మీ
ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్                                                                          56

గరళగ్రీవ భుజంగ భూషణ లసత్కైలాస హైమప్రభా
భరితక్ష్మాధర సన్నివాస గిరిజాప్రాణేశ దుర్వార దు
ష్పురదైత్యత్రయ ఖండనాత్త సుయశఃపూర్ణుండు బాలేందు శే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్                                                55

ఊయలల నూఁగఁగఁ  దమిని నువిద లెల్ల
లేచి యుదయమ్ము దిని యట్లు లేనగవులఁ
బాటవముగఁ బాడి యలర నేటి నుండి
యష్టమికి జరుపగ నొప్పు నట్ల తదియ                                                                                  54

ఇష్టము తోఁ గురంటకము నేపుగ నద్ది తలమ్ము లందునన్
మృష్టపు భోజనమ్ము దిన మిక్కిలి యింపగు నట్లతోమనో
యష్టిగ నాడి యాశ్వయుజమం దప రార్ధము పంచ వాస రో
నాష్టమి నాఁడె యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్                                                    53
[పంచ + వాసర + ఊన + అష్టమి : ఐదు రోజులు తక్కువగా నష్టమి] 

ఊనిన భక్తి సతమ్మును
మానిత సు మనోర థౌఘ మయ చిత్తుండన్
నే నుడ్డకేలు వేలుపు
సానిం గొల్చెద నమేయ సౌఖ్యము లందన్                                                                             52
[ఉడ్డకేలు వేలుపు సాని = విష్ణువు భార్య, లక్ష్మీ దేవి]

నానా భూత గణాధి పత్య విల సన్మాన్యా సు కైలాస వా
సా నాగేంద్ర వరావతంస నుత మూర్ధాలంకృ తేందు ప్రభా
మౌనీం ద్రామర సిద్ధ యక్షవర రంభా భవ్య సేవా ప్రభా
సా నిం గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్                                                      51

అన్నన్న యెంత మాటిది
మిన్నంటెను మిన్నగఁ బుడమిం గ్రన్నన ద
న్నెన్నఁ దరమె యెన్నండును
జిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో                                                                    50

కన్నుల రాల నిప్పులు వికారమునన్ జను లిట్లు పల్కిరే
క్రన్నన వ్రాసి తే నడరి కావ్యము గొప్ప దటంచుఁ జెప్పుఁ దాఁ
బన్నుగఁ జేరి నిత్యమును బండిత మానియ యక్క టక్క టం
చిన్నయ సూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గు బాసయే                                                    49
[అంచు + ఈ+నయ సూరి; నయ సూరి = అందమైన పండితుడు!!! నిందార్థమున]

పురాంతరమున బహు కాల క్షుద్బాధతో నలమటించు చున్న 
మిత్రు లొకచో వివాహము జరుగు చుండఁ  గని తమలో 
ముచ్చటించు కొను సందర్భము:
తుల్యము క్షుధ నరకమునకు
శల్య మగుట నిక్క మౌను జావక మున్నే
కళ్యాణోత్సవమునఁ దిన
శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్                                                                                  48

కాశీనాథ దయా నిమిత్త జన రక్షా దక్ష దేవేంద్ర సం
కాశ క్ష్మావిభు సంచయాన్వితమ యిక్ష్వాక్వన్యయం బౌను స
ర్వాశాభగ్నము కాటకమ్మునను దేశావాస బాధాఘ్న మై
వైశాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ ప్రజాకోటికిన్                                                              47
[వైశాలి = విశాల దేశ రాజ పుత్రిక (విశాలుని కూతురు);
 వైశాలి + ఓదనము = వైశాల్యోదనము; ఓదనము = అన్నము]

వర్తనమ్ము గాంచఁ బాప యుక్తమ పల్కు
లెల్లను బరుషములు తల్లడిల్లఁ
జేరఁ గల్మషమ్ము చిత్తమున మెయి న
స్నాన జపము లేల జంద్య మేల                                                                                               46
[అస్నానము = స్నానము లేమి]

వీనుల్ విందుగఁ గూయు నా విహగముల్  విన్నేగి యేపారగం
గానన్ వేడుక మీఱ జంతువులు చక్కం దిర్గు చుండంగ నీ
మీనంబుల్ సత ముండ సంతసముగన్ మీనాకరం బందునన్
స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా                                                         45
[ జంద్యంబును + ఆకు = జంద్యంబు నాకు;  ఆకు = విస్తరి]

పగలు సనఁగ తెగువ మిగిలి
తగులమ్మునఁ బేక గములఁ దగిలి వెగటుగం
దెగ వాఁగు వాఁడు మగఁడే
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే                                                                                       44
[నిల్పు = నిల్పుము]

ఒకఁడు తన మిత్రునితో నన్న మాటలు:
తగునే నీ కిట భార్యనుం దెగడ మిత్రా యల్కతో నవ్వ దా
వగలం జూపుచు నెత్తి మొట్టుచు సురాపానంబు మాన్పింపగన్
నగ రాజాత్మజ సేవన ప్రభల నే నారీ లలామంబు ప్రే
మగ నిన్ వాకిట నిల్పు నట్టి మగువా మా జోతలం బొందుమా                                                       43

నవ మన్మథుఁ డగు పతి సం
భవమై తనరంగ నత్త వారింటను నూ
త్న వధూ వరులకు నింపుగ
నవ రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్                                                                             42
[నవము = కొత్త]

శివ లంకా పుర వాస భామిను లిటుల్ సెప్పంగ నే విన్నవే
యివి సద్వాక్కులు సత్యసంధ వన మత్తేభేంద్ర ఘీంకార వా
గవనీ నాథుఁడు రామచంద్రుఁడు పురంబందుండ గర్వాంధ దా
నవ రాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్                                                     41

మిత్రుఁ డనియె నిట్లు మేటి చరిత భార
తమున నరుని రాథ తనయుఁడు పెను
చలము వూని మదినిఁ, జక్క నతఁడు కథ
లల్లుఁ, జంపఁ దలఁచె నాహవమున                                                                                            40

కొల్లలు గాథ లివ్వసుధ గోత్ర వినాశన పూరితంబులై
కల్లన రాదు క్రూరమిల క్షత్రియ వంశపు ధర్మ మెంచగం
దల్లడ మంద లోకములు ధర్మ తనూభవు శల్యుఁ డవ్వ మే

నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ క్రుద్ధుఁడై                                                         39

శముఖ ప్రహరం బయ్యె దశమి దినము
రముల జయించె నరుఁడు దశమి దినమ్ము
రసతి సమయించె మహిషాసురు దశమిని
హి నొసంగు జనులకు దశహర నేఁడు                                                                                     38

శకంఠక్షయ కార్య కారణమునం దన్నామ మే కల్గగన్
విశదంబే దహారి నాఁగ దిశలన్విఖ్యాతియే ధాత్రినం
ద శమీ పల్లవ దాన నిష్కల విస్తారక్రియా సంతతిం

బశుపత్యర్ధ శరీరినిం బ్రజలకున్ మందారఁ బ్రార్థింపరే                                                                   37

ఈశ - హర - శివ – భవ
వర లక్ష్మీశ జలజ భవ
హర త్రయీ రూప దుర్గ యమ్మల కమవై
పరఁగు శివ వమ్మ నీ విల
నురుతర భక్తిం గొలిచెద ముత్సవ వేళన్                                                                                    36

మనఁ గలమె మన మిటఁ దెల్పుమ యిది గాక
యొండు నగర ముండదె జను లుండ గలరె
యచట దుర్గంధ పూరిత మౌర పుత్ర
కా! పురము కంటె కన నరకమ్ము గలదె                                                                                      35
[కంటె = చూచితివా?]

వే పయనించ నింపయిన వీధులు సత్పథ రాజ పర్వముల్
ప్రా పిడ బంధు వర్గమును వైద్యుని సన్నిహితమ్ము నెమ్మినిం
దీపి జలంపు నూతులును దేవ నిభ ద్విజు లుండ కున్నచోఁ
గాపురముం గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్                                                     34
[కాపురము = చెడ్డ పట్టణము]

నలిన జాత్మజులు ముని వరులు మహేశు
ముదమునఁ గొలువఁ గైలాసమున కరుగ స
నక సనంద నాదు, లటఁ దనరి హసించఁ
బ్రమథు, లూర్ధ్వపుండ్రములతో వఱలినారు                                                                                 33
[వఱలు = ప్రకాశించు]

ప్రమదము చిత్తమం దలర వైష్ణవు లధ్వర కార్య దక్షులున్
శమ దమ భక్తి భావ రత శాంత గుణవ్రజ దీప్త కాయు లా
విమల చరిత్రు లుత్తములు విప్ర వరేణ్యులు పంచ జీవ కం
ప్ర మథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వ పుండ్రముల్                                                     32
[మథి = వాయువు (చలించునది)]

గత్యంతర కృత కల్మష
కృత్య వినాశ మొనరించు గీర్వాణుండే
సత్యము దలంప నచ్చట
మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్                                                                   31
[మృత్యువు = యమధర్మరాజు]

సత్య పథోన్నతస్థిత విషాద విహీన వికుంఠ లోక స
చ్ఛైత్య సమాశ్రయప్రదము చక్రి నిరంతర దివ్య కామ్య సాం
గత్య విరాజమాన సుర కాయ నిరీక్షిత ధామ మందగన్
మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్                                             30

సతతము నవ్య కుసుమములఁ
బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలం
గత మేమైనను మఱి యె
ట్టి తరుణమునను దలఁచకుమ డెందము నందున్                                                                 29

నుతులఁ దరించి యలసి సొల
సి తరుణు లుద్వాసన లిఁకఁ జెప్ప నెలమి పూ
జిత విగ్రహములు జలమున
బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్                                                                          28

తోడుగ రాఁగఁ బత్తనపుఁ దొయ్యళు లెల్లరు బేర్మి నాడుచుం
బాడుచు నంతరంగములఁ బ్రబ్బఁగఁ దోరపు భక్తి రక్తినిం
గూడి విభిన్న వర్ణ కుల కోమల పుష్పము లెల్ల, వీడ నా
వాడిన పూవులే, తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్                                                   27

కాళికా దేవ్యభయ సుప్రకాశ మహిమ
భూసురాన్వయ సద్గుణ భూషణుండు
కాళిదాస సన్నాముఁ డొకండు మున్ను
జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను                                                                              26

ఒకానొక పుత్ర చతుష్క సద్బ్రాహ్మణుని ప్రస్తావించు సందర్భము:

మానధనుండు విప్ర కుల మాన్యుఁడు సద్గుణ పంచ దేహ జే
కోనుఁడు గౌరవాన్వయ సముద్భవ సచ్చరితుండు సజ్జ నా
ధీన విశారదుండు నిజదేశ బలారి సమాన రా డవ
జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్                                                 25
[అవజ్ఞానము = తిరస్కారము]

కాల మహిమ నగ్ని యలుఁగ
జ్వాలిగ నంగిరసుఁ డయ్యె భారము మోయన్
మే లొనగూడుఁ  దమి సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్                                                                         24
[సినీవాలి = అంగిరస మునీంద్రుని కూతురు]

కాల సమాన తారక విఘాతక జన్మ నిమిత్త మిత్తరిన్
శూలినిఁ గామపాశమున సోలఁగఁ జేయుము మీనకేతనా
కాలగళుండు వీరవరుఁ గ్రౌంచనిషూదను గాంచు నీ సినీ
వాలిని భార్యగాఁ గొనిన, స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్                                                  23
[సినీవాలి = పార్వతీ దేవి]

ధరణీ నర గణ జన్మాం
తర కృత దుష్ట హృదయ జనిత ఘన కలుష సం
హరణము కైలాసం బను
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే                                                                               22
[ తిరుమల = పవిత్రమైన కొండ]

వర కిటియై హిరణ్యదృ గపార భయంకర దైత్యుఁ జంపి శ్రీ
ధరణి సతీ సమేతము త్రిధాముఁడు వేంకట నాథు డింపుగన్
హర సుర పద్మ సంభవుల కప్పుడు సేసిన బాస తప్ప కా
తిరుమల లోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్                                                            21
[శశిమౌళి ప్రీతి = శశిమౌళికి ప్రీతి]

హరి నామస్మరణ మొసఁగుఁ
బరమ పదమ్ము తరువంచు వత్సర మంచున్
గిరియంచును గావలదు ము
ఖర మాజీవనమునన్ సుఖంబుల నిడుమా!                                                                        20
[ముఖరము = అసంబద్ధవచనము లాడునది; 
ఆజీవనమునన్ = బ్రతుకు నంత వఱకు; ఇడుమా = విడువుమా] 

సురగణ పూజిత! భక్తవ
ర రక్షక! రమావినోద! రక్షిత కరి రా
డరవిందాక్ష! జితమనః
ఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా                                                                           19

వరుసన్ వచ్చెడు వత్సరమ్ములఁ దలంపన్ భీతి మా కయ్యెడిం
గరుణాయత్త మనోవిలాసమున రక్షాదక్ష వత్సమ్మ! మ
మ్మరయన్ రా ఖర! కావుమా! వికృతి నామాబ్దార్తి సంహర్తృ శే
ఖరమా! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా                                                   18

తగులము దఱుమఁగ మరణము
ఖగపతి కిడె రావణుండు గాండీవమ్ముం
దగఁ దీర్చఁగఁ దన కోరిక
ను గిరీటి కొసఁగె ననలుఁడు నుతియించి తమిన్                                                                      17

పగలును రేయినిం జెలఁగి ప్రాణి విరావణుఁ డయ్యె నగ్ని మిం
టఁ గదియ దిక్కులం జిటపట వ్రజ రావము లెల్ల నింపగం
బగతుర భారతాంకమునఁ బాటవ మొప్పఁగ, సవ్యసాచి యా
ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్, నృపకోటిఁ జంపఁగన్                                                   16
[ఖగపతి = బాణములకు యజమాని]

వింత నవత రించెఁ బుడమి విష్ణు వెంచి
దుష్ట శిక్షణ రక్షింప శిష్ట జనులఁ
బేర్మి తల్లులు, దశరథు ప్రీతి తమపు
భార్యలు మువురు, శ్రీరామభద్రునకును                                                                                  15

దశరథుని యర్థ సప్త శత భార్యలుతో కూడిన కౌసల్య సుమిత్ర కైకేయులు 
ముగ్గురు రాముని మాత లని విశదీకరించు సందర్భము:
భూర్యశ లుత్తమాంగనలు భూభృ దజాత్మజ రమ్య కామితే
ద్ధార్యలు భామినీ వర శతాధిక సంవృత దేవతా సమా
నార్యలు సౌమ్య సద్గుణవ దంబలు, పంక్తిర థాభిధాను స
ద్భార్యలు, మువ్వు రా పరమ పావనుఁడౌ రఘు రామమూర్తికిన్                                                14

కలవారినిఁ దోచ మదినిఁ
దలఁచుచు వెదకఁగ ననువులు తటమట గతి వా
క్కుల మోసపుచ్చు పలు పో
కల వాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్                                                                                      13

అల వైకుంఠ నివాసుఁడే సుహృదుఁడే యాత్మీయుఁడే యవ్వ దా
యల మోసమ్మున నేకచక్రపురి బిక్షార్థమ్మ, యూహింపగం
దలమే, పాండవ వీరపంచకము సంస్త్యాయమ్ములే తిర్గెనే
కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షం గోరె గ్రామంబునన్!                                                      12

రావణుం డన నామ మరయఁగ నోపఁ
బుష్ప కావరోధన రోష పూరిత హృది
భర్గ భక్తుఁడు దానవ వంశ నిత్య
శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ                                                                                          11
[శంకరుఁడు =  సుఖమును గలుగఁజేయువాఁడు.]

శంక యొకింత లేక నిజ సత్త్వ మదాన్విత ఘోర చిత్తుఁడై
శంకర కింకరుండు విధి సత్కుల జాతుఁడు రావణుండు లం
కాంకిత దానవవ్రజ వరాధిప దైత్యుఁడు సేవ్య హృల్లస
చ్ఛంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్                                                              10

హనుమంతుఁడు సీతాదేవిని నోదార్చు సందర్భము:
వనరఁ జన దనయ మిచ్చట
మనఁ గలరే పొలసుదిండ్లు మగువా వెఱపిం
చిన నిను నీ పెనిమిటి ధన
ధన వచ్చి తునుము గద పదితలల మొఱకునిన్                                                                          9

ఇష్మ పికాభ గాత్రుఁడు మునీంద్రుఁడు నెమ్మిని హవ్య భుక్ప్రకా
శోష్మ శరీరుఁ డా దశర థోత్తమ సూను తటిల్లతా విభా
శుష్మ ముఖారవిందు రిపు సూదను దైత్య నికాయ హృచ్చల
ద్భీష్ముని భార్య సీత యని వే మన వ్రాసెను భారతమ్మునన్                                                           8

దోష మనఁగ రాదించుక భాష తెలియ
విశ్రుతమ్మె సుమ్మిద్ధాత్రి భీష్ముని సతి 
సీత యనుచు వేమన వ్రాసె నాతత నుత
వాక్య మత్తరి భూతల వాసు లెఱుఁగ                                                                                            7
[ భీష్ముడు = శివుడు; సీత =గంగా దేవి]

భీముఁ డను వాఁ డొకఁ డలరి
యా మానినిఁ దార యనఁగ నడరెడు దానిన్
వేమన గనన్ వరించఁగ
భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్                                                                                 6

రామ కథావృత ప్రవిమల స్తుత కావ్యమునం గవీశ్వరుం
డా ముని శేఖరుండు దమి నంచిత రీతిని నింద్ర దత్త స
ద్దాముఁడు వానరేంద్ర జిత దైత్యగణాధిప వాలి యమ్మహా
భీముని భార్య తార యని వే మన వ్రాసెను భారతమ్మునన్                                                           5
[భీముని = భయంకరుని; వే = శీఘ్రముగ; మన (న్) = మనుటకు; 
భారతమ్మునన్ = భారత దేశములో] 

అలజడి లేపఁగ నాంగ్లే
యుల మన మందు మన భూమి నుండెడు వసన
మ్ములు వస్తువులు మఱియు నూ
కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్                                                                              4

కల నందైనఁ దలంప రాదు నర సంఘాతంపుఁ గార్యమ్ములన్
వల దెన్నండు విరోధ భావ మెద భావ్యంబౌను సచ్ఛాంతమే
చల మేలన్ సుజనాభ్ర మందున నహింసా సత్యముల్ మేటి రి
క్కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబుం గనెన్                                                      3

మాదు వంటకములఁ బోల్చ నీ దినమున 
నంగడి కరిగి తెచ్చిన నకట చెప్ప 
వేల ధైర్యముగ ననృత మేల వెక్క
సం బలికి, సమం బగునె భక్ష్యములు దినఁగ                                                                               2
[వెక్కసంబు + అలికి = వెక్కసం బలికి; అలుకు = భయపడు]

కంబుక మెత్తి చూచినను గన్పడ నేర్చునె పట్టణమ్ములో 
నంబ కరంపు వంటకము లద్భుత రీతినిఁ జేయ వీటినిన్ 
సంబరముల్ సెలంగ సరసమ్ముగఁ జూచెదు గాక పోల్చినం
తం బలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్                                                          1
[పోల్చినంతన్ + పలి = పోల్చినంతం బలి; పలి = పల్లె]

1, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్యా పూరణ సెప్టెంబర్ 2018

వికసిత ఘన కాంతార
ప్రకరము లభివృద్ధి సేయ వలయు మనుటకున్,
సక లాటవీ క్షయ క్షి
ప్ర కృతి వినాశనమె, మిగులఁ బావనము భువిన్                                                                        60
[మిగులన్ = మిగులుటకు; పావనము = జలము] 

సుకరము కాదు మార్చ మధుసూదనుఁ డెంచిన నైన మూర్ఖునిం
బ్రకటిత మైనఁ జేయవలెఁ బన్నుగ యత్నము మానవాళికిన్
వికలిత ధీ దయాది గుణ భీకర మర్త్య మనస్థ కుత్సిత
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్                                                              59

[ప్రకృతి = స్వభావము]

ఆకాశ వాణి  సమస్య :
తీరుగ నేటి నాయకులు దేశ సురక్షణ కార్యపుం బృహ
ద్భారము మేమ మోతు మని బాసలు సేసి యనర్హమైన స
త్కారము సేసి ప్రేముడి సదా స్వజనాళికి దేశమం దధీ
కారముఁ బెట్టి బంధువుల కన్నులు చల్లఁగఁ జేసి రెంతయున్                                                        58

అల్లనఁ జల్లగ నెల్లఱు
నుల్లాసముగఁ జను చుండ్రి యుంచుమ దానిం
దల్లి కడ వత్తువ యిటులఁ
బిల్లినిఁ జంక నిడుకొనియె, పెండ్లికిఁ జనుమా                                                                                57

ఉల్లము సంతసింపఁగ ని నొప్పుగఁ బిల్చిన నేఁగ కుంట నీ
కెల్లిదమై పరంగు భవదీయ సఖుం డట నిన్ను గాదనం
గల్లరి సోమవాసరము కార్తిక మాసము కాన్కపేటి, రే
పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికి నేఁగుట పుణ్యకార్యమౌ                                                                 56
[ఇల్లి = ఉపవాసము] 

అండాకార చతుర్దశ
షండ భువన భాండ పాల సమ భోగీం ద్రా
ఖండ మృదు భోగ మండిత
ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై                                                                               55
[ముండ = తల]
బంగారపు గుండె పాదములను మొక్కుబడి గా సమర్పించెద నని  మ్రొక్కు కున్న భక్తుని తో:

నిండైన విగ్రహుఁడు కో
దండ రఘూత్తమున కచట దండము లిడుచున్
మెండైన భక్తి నుంచుము
ముం డా మ్రొ క్కెద నిడు పదముల నా తలపై                                                                           54
[మున్ + డా మ్రొక్కు +ఎద + నిడు పదములను + ఆ తలపై; 
మున్ = ముందు; డా మ్రొక్కు = ఎడమవైపున నున్న మొక్కుబడి; 
ఎద = హృదయము;  నిడుపదములు = పొడవైన పాదములు; ఆ తల = ఆ చోటు]

గండంబౌ నని యెంచి పాదములు ప్రక్షాలించి యీ రీతి మి
త్రుండౌ యగ్గుహుఁ డత్తరిం బలికె సంతోషించి భాస్వద్యశో
భాండాగార విరాజమాన మహ దిక్ష్వాక్వన్వ యాంభోధి సో
ముండా మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే                                                     53

సైఁపు వ్యాకర ణాదుల సంస్కరించి
వీఁక సుందరతరముగ లోక మందు
నున్న చిన్న చూపును, దగ నుద్ధరించి
భాషను, నశింపఁ జేసెను పండితాళి                                                                                          52

కాసుల నీయ నేరదు సగౌరవ ముంచదు దేశ మందునన్
మూసెను జీవ నాధ్వమును బోయెను రాజుల ప్రాపు దీనికిన్
బాస యనంగ నేఁడు పెఱ బాసయ కూటికి గూటి కెంచగన్
బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై                                                                  51

గృహముఁ దీర్చి దిద్దెడు నేర్పు కీర్తిఁ బడసి
పేర్మి బుద్ధులు గఱపుచుఁ బిల్లలకును
బోషణమ్మునఁ దల్లినిఁ బోలి నామె
తాతకుం దండ్రికిఁ, దనకు దార యొకతె                                                                                     50

ప్రీతి సెలంగ మానవతిఁ బెండిలి యాడితి మెచ్చ నెల్లరున్
జ్ఞాతులు దర్ప జాతులయి సంపద నెల్లను దోచి నంతటన్
నీతిఁ గనంగ లేక చన నీతి పథమ్మున నిల్ప నెమ్మినిం
దాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్                                                         49
[తార = కనుగ్రుడ్డు] 

అగ్ని యుత భూతములు జల
మగ్న ప్రాణులు విహంగ మహిచర మృగముల్
భగ్నము కాదిల నీతికి
నగ్నముగా సంచరించినన్ మేలనరే                                                                                          48

భుగ్న మనో వికారములు వూనక మర్త్యులు, దా రపత్రపా
మగ్న నివార ణార్థము సమంచిత వస్త్రము లూన నొప్పగున్
భగ్నము కాదు ధర్మమిల బ్రాజ్ఞుల కచ్చెరు వేల జంతువుల్
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్                                                            47

పద్మములు తటాకమ్ములఁ బాలివోవ
నీడజమ్ములు సాగఁగ గూడులకును
నాల మంద వోఁ జాగ గోశాల కంత
మిడుఁగుఱుల వెల్గులో, రవి మింట సాగె                                                                                    46

అడరఁగఁ గాలకేయుల సురాధిపు పంపునఁ జంపెఁ బోరునన్
జడియక పందికై యెఱుకు జాజర నున్న శివుం బెనంగెనే
కడు వెఱఁ గయ్యె మాత్స్యునకుఁ గవ్వడి సారథి యయ్యె నక్కటా
మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్                                                45

తగు కార్యమ్ములు సల్పుచుఁ
బగళులు రేయులు శ్రమబడి పన్నుగ భక్తిన్
భగవద్ధ్యానమునఁ, జనక
పగలో, మున్గిన నఘములు భస్మమ్ము లగున్                                                                           44

జగ దాదిస్థిత విష్ణు పాద భవ సచ్ఛైవాలినీ వారినిన్
సగ రామ్నాయ సహస్ర సంతతి సు నిస్తారప్రదాయీ నదిన్
రుగనీకద్యుతి భాసమాన నదిలో లోకత్రయై కామరా
పగ లో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్                                                    43

ఇన కుల జలనిధి సోముఁడు
ఘన ధానుష్కుండు నీల కాయుఁడు విల్లున్,
ముని యిప్పించంగ నడిగి
జనకుని, రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్                                                                              42

వనచర సంచయ మ్మది యవారిత రీతినిఁ బోరు సల్పగా
ననుజుఁడు రావణానుజుఁడు నద్భుత లీలఁ జెలంగ నాజినిన్
ఘన మగు లంక యంద దశకంఠుఁడు రావణు దైత్యు నింద్రజి
జ్జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై                                                             41

విశ్వ మెల్లయు నరయంగ వింత యగును
జరము లైనను నిత్య మచరము లైన
దేవు నెఱుఁగు గుప్తంపు రీతిని ననంగ
నా మనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె                                                                              40
[మని = దేవుడు,  ఎప్పుడు ఉండువాఁడు , మనమందుండువాఁడు]

ఆ కర టీంద్రుఁ డార్తుఁ డయి యచ్యుతు వేడిన యట్టి భంగినిం
బ్రాకట రీతిఁ జూచి గుఱి రౌద్ర నిషాదుఁ డొకండు పక్కిపై
భీకర బాణ మేయగను భీతిలి దైవము నంతఁ జీరుచుం
గోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్                                                                39

దేవ గంధర్వ యక్ష రాత్రిచర సిద్ధ
కింపురుష జాతి జీవియ కీర్తి సేయ
నబ్బురం బౌను గద విని నంత నెట్టి
చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె?                                                                                    38

ధామ పిపీలికా సముఁడు ధర్షిత సైంధవుఁ డుగ్ర రోషుఁ డా
శ్యామ గళప్రసాదుఁ డని నడ్డుపడన్ వడి ధర్మజుండు త
ద్భీమ వరాశ్వనీ సుతులు దిక్కరి తుల్యులు నోడి నిల్చిరే!
చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే                                                           37

ధర్మ భూమి యనఁగఁ దనరె ముజ్జగముల
భరత ఖండము మును సురలు మెచ్చ
నిస్పృ హాతి సుప్తి నిష్క్రియా క్లీబ దౌ
ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి                                                                                         36

యోగ్య నియోగ సంచయ సమున్నతి భాసిల దేశ మందు నా
రోగ్యము దేహసత్త్వము నరోష సఖిత్వము లెల్లఁ బెర్గ వై
రాగ్యము వీడి సంతతము రంజిలఁ బౌరులు కృష్ణవర్ణ సౌ
భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్                                                         35

వెత లందుఁ దాఁ జలించక
పతితపు సంకటము లందుఁ బంతము తోడన్
ధృత ధైర్యమునఁ, గలసి తన
పతితోఁ, బోరాడిన సతి వంద్య యగుఁ గదా                                                                                 34

ధృతి చిత్తమ్మున వృద్ధి సెందుచును సంధిల్లంగ సంసార దు
ర్గతులం దెన్నఁడు నీరసించకను సంకల్పించి నిత్యం బభి
ష్టుత నారీమణియై ప్రమాదముల విడ్డూరమ్ముగన్, వీడి తాఁ
బతితోఁ గ్రూరతఁ, బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే                                                               33

అవని విష్ణువే మఱి పుట్టె నంచెఱుఁగక 
రాముఁడే దైవమని, చెప్పె రావణుండు 
మానవుం డీతఁ డేల సంశయ మని మది
దలఁచె విఱ్ఱవీగి నశించె దాని వలన                                                                                           32

భీమపు బాహుమూలమున భీతిలి చిక్కి కృపార్థియై దశా
స్యామరనాథ ఘోర రిపు వంత వినమ్రత దోఁచు చుండ స
ర్వామర పూజనీయుఁడు స్వయంభువుఁ డుద్భవ దత్త జానకీ 
రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా                                                            31

కలిగి మిగుల సద్యస్స్ఫూర్తి సులభ రీతి
వివిధ సునిశిత భావార్థ విలసిత పద
తతి నియోగ రతుఁ డయి సతత మపగత
విషగళుండైన నవధాని వినుతి కెక్కు                                                                                        30
[విషగళుఁడు = దుర్భాషలాడు వాఁడు]

తృషఁ గొని పద్య గద్యములు తెల్లపు రీతిని భావ శబ్ద క
ల్మషములు లేని భంగి బుధ మాన్య విధమ్ముగఁ జెప్ప నేర్వ మా
నుష గురు యత్న భాసిత ఘనుండయి తృప్త కృతార్చనా బృహ
ద్విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై                                                           29
[విషగళుఁడు = శివుఁడు] 

ద్రోహమునకుం దగిన ఫలి
తాహార్య మనఁగ సుకన్య కాఖ్య విడి మనో
మోహము చ్యవనుని జర్జర
దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్                                                                                  28

ఆహవ దోహ లోద్ధత విహార విలాసిత చండ దైత్య సం
దోహ వినాశకుండు ఘన దోర్బల దివ్య ధనుర్ధరుండు వి
ద్రోహ జనాంత కార్య జన దుఃఖ వినాశక రాఘవుండు వై
దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్                                                       27

అవనీ జనులకు నీయఁగ
నవసర విశ్రాంతిని ముదమారఁగ నా వా
రువములఁ గ్రుంకె నపర దిశ
రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్                                                                                     26
[ఉత్తరమున = పిదప]

శివ దత్తాంచిత శక్తి మీఱఁగను నిశ్చింతం బ్రలాపించి తా
బవరంబందునఁ బాండవోత్తముల నాపం జాలి యల్పుండు సైం
ధవుఁ డుగ్రుండు జయద్రథుం డెద్రిచి సంతాపం బొసంగెం గడున్
రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై                                                            25


వ కార నిషిద్ధము:
అంతరాయమ్ముల నన్నింటి మరల మరల నాపు నిన్నేను గొలిచి కొలిచి
యాద్యంతములు లేని హృద్యంపు నీరూపు లలర నలర మదిఁ దలఁచి తలఁచి
యాగ మోక్తములైన యద్భుతాఖ్యలఁ దనియ తనియ నేరక యఱచి యఱచి
తొండ మేక రదము తోరపు బొజ్జయు చోద్యము చోద్యము సూచి చూచి

మూషిక రథముఁ గని కని మురిసి మురిసి
కుడుము లమర నమరఁ గాంచి కులికి కులికి
దినము దిన మేను నుతియింతుఁ దేఱ తేఱ
బొజ్జ గణపయ్య రక్షించు మూరి మూరి                                                                                      24

కలవరపా టది యేలనొ
గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునం
బలికితి విట్లు నిజ మరయ
గెలిచెను సోమకు ఝష మయి కేశవుఁ డన్నా                                                                             23

వడి వేదంబులు దొంగిలించి చన శ్రీవత్సుండు వీక్షించి తాఁ
గడు వేగంబున దూఱి సంద్రమునఁ జక్కంబట్టి మత్స్యంబునై
యడఁచెన్ సోమక నామ దైత్యుని, వరాహస్వామియై, శూలియే
యడరం జెంతను, వేంకటాద్రి వెలసెన్ హ్లాదంబునన్ ధాత్రినిన్                                                        22

అల తాళద్రుమ వనమున
ఫలములఁ దిన నీయ డతఁడు ప్రజలను దినుచున్
ఖల ఖర దైత్యుండు బలుఁడె
బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే                                                                                    21

కల లందైనను బాహు నిర్జిత మహాకాళింది యేకైక కుం
డలుఁ డుగ్రుండును ముష్టికాంతకుఁడు గాఢస్కంధు పాటిన్ రసా
తలమం దెచ్చట నైన రోసినను దైత్యశ్రేణు లందెల్ల, నీ
బలరాముం దలమీఱు, పాపి గలఁడే భావింపఁగా మేదినిన్                                                           20
[తలమీఱు = అతిక్రమించు]

విష్ణు వయ్యెను రాముఁడు కృష్ణుఁ డుండె
ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె
కృతయుగమ్మున బ్రహ్మకుఁ గీడుసేయ
నామముల కేమి కొఱఁత భూనాథునకును                                                                                19

ఏపునఁ జంపె విష్ణు వసురేంద్రుని మత్స్యపు రూప మంది వే
దాపహరున్ జలమ్మున వదాన్యుఁడు వ్యాస మునీంద్ర భవ్య సం
ప్రాపిత కావ్య మందునను బన్నుగ వింటిమి యా యుగంపు ద్వం
ద్వాపర మందు, సోమక వధం బొనరించెను రాముఁ డుద్ధతిన్                                                       18
[ద్వంద్వ + అపరమందు = ద్వంద్వాపరమందు]

రామున కనుజుండు రమణి సీతాసతీ
సోదరిని విబుధ జనాదరణను
దరుణి జనక రాజ తనయ నూర్మిళ నక
లంక నేలినాఁడు లక్ష్మణుండు                                                                                                     17

మంకుతనమ్ము మీర నవమానిత రీతినిఁ బంప నన్నయే
తంకము సెంది చేరఁగను ధర్మవిదుండు విభీషణుండు ని
శ్శంకను రావ ణానుజుఁడు,సత్య పరాక్రమ రాముఁ డీయగన్
లంకను బోరులో గెలిచి, లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్!                                                               16
[లక్ష్మణుఁడు = శ్రీమంతుఁడు]

మేలగు నీ కిఁకఁ జని తేఁ
జాలిన మఱి నీదు భర్త సతము మధు మహా
శాలను బ్రీతి వదరుఁబో
తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్                                                                                     15
[ వదరుఁబోతు + ఏలును =  వదరుఁబో తేలును]

పాలను నీటి నింపుగను వారక వేరొనరించ నేరు నీ
జాలపదంపుఁ దెల్లని ఖజాకము కానము దాని నెందు నే
గాలము వేసి చూచినను గాంచుమ యా కలహంస నీటి లోఁ
దేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ                                                                14
[తేలు =  నీళ్లలో క్రీడించు]

దేవ కార్యము సాధింప దేవ దేవుఁ
డమిత కారుణ్య మూర్తి విషాంతకుండు
ఫాలనేత్రుఁ డర్థి హిమవత్పర్వత వర
పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను                                                                                          13

చిత్రము చంపి మన్మథునిఁ జిత్తము నందు నుమా తపో రత
స్తోత్రము మెచ్చి బాపి ఘనశోకము తారక దైత్య జైత్ర స
త్పాత్రుని కార్తికేయు శిఖివాహనునిన్ హిమశైల మేనకా
పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్                                                             12

మెల్లగ యతి వేష మలర
నల్లనఁ గుంతీ తనయుఁడు నర్జునుఁ డంతం
జల్లంగ వాసుదేవుని 
చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్                                                                                      11

ప్రల్లదు రాజుఁ జేయ జనవారపు సమ్మతిఁ బొంద నేర్తునే 
తల్లడ మేల పుత్రకుఁ డితండు విభుం డని చెప్పె రాజు దాఁ
గల్లరి కంత పట్ట మది కట్టక యొక్క దినంబు మాత్ర మం 
చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే                                                                           10
[అంచు + ఎల్లికి = అంచెల్లికి; ఎల్లికి = రేపటికి]

గుణగణము వెలుఁగ నకుంఠితము నెలమి
రుచిర విద్యలను సముచిత రీతిఁ
దేటపడఁ గఱపుచుఁ దీర్చి దిద్దఁగ శిష్య
రుల గురువు లెల్ల సురలు సుమ్మి                                                                                                 9

ఉరుతర శిక్షణాక్రియ గురూత్తమ పాణి తలామృతాభగన్
గురుతర బాధ్యతావలిని గోముగఁ జిత్తము నందుఁ దల్చుచున్ 
స్థిరముగ శిష్యకోటికిని దేశ సకాల సుయుక్త విద్యలం 
గరమను రక్తి నేర్పు గురు కాయముఁ గొల్చెద దే తుల్యమున్                                                             8
[అమృత = ఉసిరిక]

మన విఘ్నేశ్వరునకు వా
హన రాజ మగుట ముదావహ మని తలఁచి తాఁ
గనువిందుగ సురగణ పా
వన రాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్                                                                                      7

కనఁగన్ వింతగు బొజ్జదేవరకు గంగా పార్వతీ నందనుం
డన విఖ్యాతుఁడు నేక దంష్ట్రుఁడు గణాధ్యక్షుండు శూరుండు హ
స్త్యనవద్యాస్యుఁడు విఘ్నరాజున కనింద్యాఖ్యుండు నా దేవతా
వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్                                                                   6
[వనము = సమూహము]

   
పూతన జీవాపహర! సు
చేతన భూసుర శివజ్ఞ చేతస్స్థిత! సం
పాత భవ ముక్తి దాయక!
పాతక హర! నిర్జితబ! పాలింపుమయా!                                                                                             5
[శివజ్ఞ = వేదములు తెలిసిన వారు]

ఈ కొలఁది కడుపున కిదియ
మా కిఁకఁ జాలని తనిసిన మానసు లగుచున్
వీఁకను బాయసము, పితికి
మేఁకను, సాధువులు వండి మేలని తినిరే                                                                                            4

చేకొని సాధు సజ్జనులఁ జిత్తము నుంచి పదాంబుజంబులన్
గైకొని వారి దీవనలు కమ్మగ నుండినఁ  జాల మేలగున్
మాకది యొప్పు వంటలను మాగృహ మందున, నెన్నడేని రా
మేకను, వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే                                                                     3
[రాము + ఏకను =రామేకను; ఏకు = తిట్టు]

మగ్నుండై పని యందు న
భగ్నపు రీతి నిరతమ్ముఁ బన్నుగఁ దా ప్ర
త్యఙ్నగము సేరి కదలుచుఁ
బ్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్                                                                                       2

రుఙ్నయ నారవింద సఖ రోష విలుప్త ముఖుండు నా పయో
ముఙ్నిచయచ్యుతానన విముక్త నిదాఘ సువిగ్రహుండు ఋ
త్విఙ్నర నిత్యపూజితుఁడు వేగఁ జలించి రయోద్ధృతిన్ మహా
ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో                                                                     1