ఎంచ భగవంతుని కరుణ
నించుక కొన వలయు భక్తి యిద్ధన మేలం
బంచఁగ నతనికి గొందఱు
కాంచన పుష్పాంజలిని బికారి హరి కిడెన్ 60
[కాంచనము = చంపకము]
మించ ధనాఢ్యులం దివిరి మేదినిఁ బూర్వ దశా భవౌఘ స
త్సంచిత పుణ్య రాశి ఫల సంభవ ధీ మహి మాగ్ర్య భక్తి స
క్తాంచిత చిత్త శుద్ధిఁ బర మైక్యము సెందఁ బరాత్ప రాత్మలోఁ
గాంచ నపుష్ప పూజను బికారి యొనర్చెను శేషశాయికిన్ 59
దుర్భరపు టార్తి నంత
ర్గర్భ కన ముదమ్మొసంగెఁ గరముం బుత్రా
విర్భావ మొక పరి సదన
గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్ 58
నిర్భయ మేఁగి రందఱును నేరక బాలు నవస్థ లోనికిన్
దుర్భరమై నసా బిలపు దోయికి వాసన పర్వుచుండఁగా
నర్భకు పాన్పు నందు రుచిరార్తవ మాలను నుంచ మాలికా
గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్ 57
రాతి నైన నీవు రత్నమ్ముగా మలు
చఁ గల వయ్య మించి సద్గురువర
వాఁ డొసంగు నట్టి వస్తు చయం బంత
వాసి కంటె మేలు రాసి గనఁగ 56
[అంతవాసి = శిష్యుఁడు]
దోసము లెంచ కిందుఁ బరితోషము నొందుమ వీడి శంకనున్
వాసికి నెక్కు దీవు పరిపాలన మందును గార్య మెద్దియుం
జేసిన నిచ్చు సత్ఫలముఁ జెన్నుగ నియ్యది దుష్ట తిధ్యమా
వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ 55
తూఱి చెవు లందు జూలునఁ దూఱి దాగి
తూఱి గోళ్ల సందులఁ గళ్లఁ దూఱి నసలఁ
గుట్ట దూఱి తలను బాదుకొంచుఁ గొంచుఁ
జచ్చె సింహము చీమచే సత్యమిద్ది 54
సచ్చారిత్ర శకుంతలా సతి కిడన్ సంతోష మప్పట్టునన్
రచ్చం గాంచక దీనయై నిలిచి క్రూరత్వంబు గోల్పోవఁగా
నచ్చంబౌ విపినాంతరమ్మునను దౌష్యంతుండు పౌగండుచేఁ
జచ్చెన్ సింహము, చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్ 53
[పౌగండము = 5-10 మధ్య వయస్సు]
అప్పిచ్చు వాఁడు గలఁ డని
ముప్పుల నెంచక యెడంద మునుఁగుదు వేలా
యప్పుల కెప్పటి యట్టులఁ
గుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్ 52
[సిరులు = శోభలు]
ఒప్పుగఁ బంచు మద్ధనము నుత్తమ కార్యము లందు గర్వపుం
దప్పపు టంధకార మది తప్పక కప్పును నిక్క మింత నీ
వప్పరమేశు సన్నిధికి నక్కట యౌదువు దూర మిద్ధరం
గుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్ 51
[దప్పము = దట్టము]
ఏమని పొగడుదు నాతని
సామ వచన కోవిదుండు స్వజనావలికిన్
క్షేమము లెల్ల నొసఁగెడిన్
రామారెడ్డికి వధాన నైపుణి గలదే! 50
శ్రీమంతావలి దోహలమ్ము నిజ చిత్తేచ్చా బలాధిక్యమున్
సామంతాధిక సాహ్యమున్న ధరలో సద్విద్యలన్ నేర్వరే
యేమీ మాటలు బ్రాహణుం డయిన నింకిద్ధాత్రి రెడ్డైననున్
రామా! రెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్ 49
వియ్యాల వారి యింటను
సయ్యాటలు సల్పుచుండ సమ్మదమున నీ
వొయ్యనఁ బల్కుమ తా నే
యయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్ 48
కయ్యము నెంచ కాత్మ సిత కంజము నందు సురాలి పంపునన్
వియ్యము నెంచి వెండిమల వీరున కింపుగ నుద్యమించి తా
నయ్యతనుండు వేయ శర మంతటఁ బార్వతి మారవైరి యా
యయ్యనుఁ గాంచి యామె విరహాతుర యయ్యెను సాజమే కదా 47
[అయ్య = పూజ్యుఁడు]
మతముల కులముల నృదళ పతుల దేశ
భాగముల భూముల ఖనుల వాగు లింక
వంకల కలహ కారుల యంకె లేల
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ 46
వికలం బయ్యెను భూతలమ్ము పరగెన్ విధ్వస్త వాణిజ్యముల్
బక తుల్యమ్ము సహస్రసంఖ్యులను దా వ్యాపించి విశ్వమ్ము మూ
రి కరోనక్రిమి కానిపించని దహో త్రెళ్లంగఁ జేసెన్ ధరన్
ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో 45
నారదుని వచనములు:
సూక్ష్మంబుగఁ జెప్పితి నీ
పక్ష్మము లల్లాడ శివుఁడు భద్రం బగు నీ
కీ క్ష్మాతలమున నవ్విధి
లక్ష్మీపతి! భర్త యయ్యె లలన నగజకున్ 44
సూక్ష్మీభూత విచార సంచయములం జోద్యమ్ము గా నేరదే
యీ క్ష్మా వాసులు తల్తు రీ హరి హరై కేశత్వ మింపారఁగన్
లక్ష్మీనాథుని యండతో శివుఁడు కైలాసాద్రి కారాధ్యుఁడై
లక్ష్మీ! వల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్ 43
సారంగినిఁ గూడి మసలి
తా రక్షితమై సతమ్ము తద్దయుఁ బ్రీతిన్
వారని ప్రేమను జూపఁగ
సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్ 42
పారావార పరీత భూవలయముం బాలించు రాజన్యునిన్
వీర శ్రేష్ఠ వరుండు నా భరతు సంవేద్యున్ సవజ్రప్రభా
సారౌన్నత్య శచీ మనోహర సమాజ్ఞప్తాప్సరో మేనకా
సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్ 41
[సారంగంబు = చిత్రమైన వర్ణము కలది]
చేతనము లుడిగి వింతన్
నాతులతో నేఁగుదెంచి నందుని వనికిం
బ్రీతినిఁ జెక్కిన బొమ్మను
రాతినిఁ గని ముద్దు లిడెను రాధ ముదమునన్ 40
త్రాతను వ్యోమ ధీ బృహ దరాతిని భీకర ఘోటకాసు రా
రాతినిఁ గంస రాణ్మహ దరాతి నభో గత మారు తాసు రా
రాతిని వాహ్య రా డ్లస దరాతి బకారినిఁ బూతనాంగ నా
రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్ 39
భూధర సపాదప చయ మ
హా ధరుఁడు పిదప గృహస్థుఁ డయ్యెం గద తా
నీ ధర నస్ఖలితుం డట
రాధా! కృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ 38
ఆధారం బగు నీకు సంతతము నీ యా మాటలన్ వీడుమా
బాధల్ దీరఁగ వేఁడు కొన్మ యతనిం బద్మాక్షి నిన్నేలఁగా
నాధీనుం డగు భక్త కోటి కిల నబ్జాక్షుండు బాల్యమ్మునన్
రాధా! కృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా 37
ఎలమి మేనరికమ్మని యెల్ల రమ్మ
లక్క లాడ గుసగుసలు మిక్కుటముగ
వారి కౌ నతం డట మేనబావ యాడె
సోదరిం బెండ్లి, యాడెను సోదరుండు 36
పాద వృతాందుక స్వన విభాసిత నంచిత సింహమధ్య శా
తోదరిఁ గంబుకంఠి సిత తోయజ నేత్ర నరాళ కుంతలన్
సాదర వాక్యఁ జంద్ర సదృ శాస్య నొకండు సువర్ణవర్ణ భా
సోదరిఁ బెండ్లియాడె, నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్ 35
[భాస +ఉదరి = భా సోదరి]
కష్టము బలవంతు నణఁచఁ
గాష్ఠమ్మున మండు వఱకుఁ గలుగు పరులకున్
నష్టము ముంచు నితరులన్
దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశ నెపుడున్ 34
[పర మందు = ముంచిన పిమ్మట]
డ-ఢ ప్రాస వలె ట-ఠ ప్రాస ప్రయోగము!
పాఠాంతరము:
కష్టము బలవంతు నణఁచఁ
గృష్ట మగు వఱ కడరి కలిగించుఁ బరులకున్
నష్టము ముంచు నితరులన్
దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశ నెపుడున్ 33
స్పష్టమ యంత్య కాలమునఁ బద్మదలాక్షుని నేర కైనఁ దా
నిష్టము లేక తల్చిన నహీన ఫలమ్మిడు విష్ణు నామమే
దృష్టము విష్ణు నామ ఘన తేజ మహో వినమే యజామిళున్
దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ 32
సుర గణము తన్ను గోరఁగఁ జోద్య మొప్ప
నెమ్మి నిజ పుష్పబాణ చక్రమ్ము పఱచె
బ్రహ్మచర్య కాఠిన్యము భవుని, కాంచి
కంతుఁడు శివునిఁ, జంపెఁ జక్రమ్ముతోడ 31
[బాణచక్రమ్ము = బాణసమూహము]
సుంతయు సిగ్గు సెందక వచోరచ నాజ్ఞుఁడు మిత్ర కోటికిం
జెంత సురా నిషేవణ మశేషము జేసి వికార చిత్తుఁడై
పొంతన లేని మాటలను మోహ వశమ్మునఁ బల్కె నిట్టులం
గంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై 30
తీపి జ్ఞాపకము లనుచు నాప కుండఁ
దలఁచి తలఁచి ముదము నొందఁ దగును గాక
చిన్న నాటి యా ముచ్చట లన్న యేల
శంక నాఁటిరోజు లిఁకరా వింకరావు 29
కా విలఁ బ్రాణి దేహములు గావిలఁ గావిలఁ గావు నిత్యముల్
పో విఁకఁ బుట్టు బుద్దు లవి పో విఁకఁ బోవిఁకఁ బోవు చావకే
లే విఁక బాంధవమ్ము లవి లే విఁక లే విఁక లేవు చావఁగా
రా విఁక నాఁటి రోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా 28
భృశ శిరో మయూర పింఛ భాసితు భక్తు
లార చిన్ని కృష్ణు శార దాంబు
ద నిభ వర్ణ దేహుఁ దప్త సువర్ణ మే
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి 27
ఇలకున్ భారము తీర్చ నెంచి తగ విశ్వేశుండు విష్ణుండు భూ
వలయం బందు నరాకృతిం దిరుగుచున్ భాసిల్లఁగా సంతతం
బలపే లేకయు నిర్మలాత్మను ని జాంబా నిర్దయా ప్రా గులూ
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్ 26
వరబల దర్పితునిఁ బురం
దరజిత్తుని మేఘనాథు దైత్యవరేణ్యున్
ధరణిసుర గణ బలవ దశు
భ రతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్ 25
సురపతి జేతృ దైత్యకుల శూర వరేణ్యుని భండనమ్ములో
ఖరతర కంకపత్రములు కాయము సీల్చఁగ వహ్నితుల్యముల్
శరములు సేసి యత్తరి ప్రసారము రావణ పుత్రు రాక్ష సే
భ రతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్ 24
మద ముప్పొంగిన వానికి
మది యలరు పలుకులు కొన్ని మంచివి యనఁ గీ
డెదురైన చంద మత్తరిఁ
గదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్ 23
సదయుఁడు నీ సఖుం డచటఁ జక్కఁగ శాంతి నెడందఁ గోరుచుం
బదిలము నెంచి నల్వురకుఁ బల్కిన భంగి వచించి తీ వహో
యది వినినంత నాతఁ డన హర్షము తోడుత గౌరవమ్ము నా
కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్ 22
[నాకు + అదనము= నా కదనము]
కవికిఁ గవి బద్ధశత్రువు కాఁ గలండు
ధరణి నన్నది కా దనృతమ్ము నాఁగ
నార్యులార మీకు నసూయ యంచు తలఁచు
చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న 21
[తలఁచుచు +అంపెదను = తలఁచు చంపెదను]
సన్నుత చిత్త వర్తన విశారద మిత్రమ యేమి చెప్పుదుం
బన్నుగ శబ్ద భావ సమపాత్రత నెంచి యెడందఁ బండి తా
సన్నుఁడు శుక్ర నామ ధనశాలి యొకండు వచించె నివ్విధిన్
నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్ 20
జుట్టు - కన్ను - ముక్కు – చెవి పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థములో .
తన పైకి దుముకు ఖరుని భటులను గాంచి రాముఁడు తలఁచిన విధము:
తా ముక్కునఁ దే జుట్టుచు
మోము లలర వారి కన్ను పొదవ రయమునన్
రామునిఁ జేరఁ దలఁచె విధి
నేమని యందుఁ బడి రిట్టు లీ రనలమునన్ 19
[ఉక్కు = బలము; తేజు +ఉట్టుచు =తేజుట్టుచు : తేజము
కాఱుచు; వారికి +అన్ను =వారి కన్ను: అన్ను = ఒళ్లెఱుఁగమి;
ఈరు = మీరు ]
నిర్మల హృదయుండు సొనిపి
మర్మ స్థానముల నిశిత మార్గణ చయమున్
ధర్మరతుఁడు సంపి యనిని
దుర్మతి రాజైనఁ గనిరి తోషమును జనుల్ 18
కర్మవశమ్మునం జనఁగఁ గార్య విశారద విక్రముం డహో
యర్మిలిఁ జూపు తండ్రియె నిజాత్మజుఁ డప్పుడు కోరఁ బౌరులే
ధర్మపరుండు యౌవనుఁడు ధైర్య యుతుండును రౌద్రి వోవఁ దా
దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్ 17
[దుర్మతి: రౌద్రి పిదప వచ్చుసంవత్సరము]
సుర తుల్య తపస్సంప
న్న రమాధవ నామ చింతనా రత హృదయుల్
పరమంపు యోగ విద్యా
పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్ 16
వర భక్త వ్రజ మానసాబ్జముల నా పద్మాక్షుఁ డాయత్తుఁడై
నిరతం బుండఁగ విష్ణు భక్తవర సాన్నిధ్యమ్ము మేల్సేయదే
హరినామస్మర ణైక వర్తనులు ధ్యాయచ్ఛంఖభృచ్చింతనా
పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై 15
సద్యః ప్రీతి నొసంగుచుఁ
బద్యం బలరార నొప్పు భావ ద్యుతినిం
జోద్యము దుష్టార్థంపుం
బద్యమ్మునుఁ బాతిపెట్టు వారలకు నతుల్ 14
వేద్య కథా సముచ్చయపుఁ బెన్నిధి సత్కవి వర్య కోటికిం
బాద్యము భంగి హృద్య మగు భావ పదాన్విత శోభితమ్ముగన్
సేద్యము నా వెలుంగు రస సిక్త మహోన్నత పద్య రాట్ఖనిం
బద్యముఁ బాతిపెట్టఁగలవారి పదంబుల కేను మ్రొక్కెదన్ 13
ధీనిధిఁ బోతన సత్కవిఁ
గానమె సన్మాన మంద కవి లోకములో
నీ నాఁ డన కిట్టులు స
న్మానమ్మును బొందని కవి మాన్యుం డగునా 12
గాన వికాసమాన పద కాయము కల్పన చేయకున్నచో
జ్ఞాన సుచోదన ప్రతిభ చాటక వ్యాకరణాది బోధ నా
నూన విశేష పాండితిని నూనక సత్కవి పుంగవాలి స
న్మానముఁ బొందకున్న కవి మాన్యుఁ డటంచు గణింతురా ప్రజల్ 11
[కవి మాన్యుఁడు = కవులకు మాన్యుఁడు]
చదివిన చదువులఁ బటిమ సవ్య భంగి
నంచితమ్ముగ సర్వ విద్యార్థు లందు
నర్హతల నెంచఁగఁ దగవు లనఁగఁ దోఁచు
తగవులం బెట్టు వా రుపాధ్యాయు లనఁగ 10
[తగవు = జగడము, న్యాయము]
నిగమక్షీణపు విద్య లేల యిలలో నేర్వంగ యోచించుమా
యగు ణాన్యాయ విధాన మియ్య దని విద్యానైపుణీ శోధనం
బగలే పుట్టఁగఁ దారతమ్యము లెదన్ వర్ధిల్ల విద్యార్థులుం
దగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్ 9
[నిగమము = మార్గము]
నెమలి గుంపు నందు నెగడు కుక్కుట మనఁ
బరమ విమల జలపు పంక మనఁగ
స్వర్ణ పీఠ శునక సదృశంపు రీతిని
గండపెండెరము కుకవుల కొప్పు 8
విలసిత పాండితీ గరిమ విద్వ దనుత్తమ కావ్య రమ్య సం
కలన యశో విరాజిత నిగర్వ మహోన్నత బుద్ధిమత్క వీం
ద్రుల కిల నేల సత్కృతులు లోకులు మెత్తురు వారి నిత్యముం
దలఁతురు గండపెండెరముఁ దాల్ప సదా కుకవుల్ యశోర్థులై 7
కుత్స్యము వచింప నేల చి
కిత్స్యము కా నేర దిది యకృత్యము నీ యీ
దిత్స్యము జుగుప్సిత మహో
మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్ 6
[కుత్స్యము = నింద్యము; చికిత్స్యము = రోగము;
దిత్స్యము = ఈ నెంచినది]
మత్స్యాలాభుఁడు సత్వరమ్మున వినా మాత్సర్యమే వింతగా
నుత్స్యాభమ్మయి మిత్రుఁ డివ్విధము సద్యో రీతి విభ్రాంత చం
చత్స్యందాత్ముఁడె యేమి పల్కినను హాస్యంబై ధరం జెల్లుఁ బో
మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్ 5
[మత్ +స్యాల +ఆభుఁడు = మత్స్యాలాభుఁడు; నాకు బావమఱఁది వంటి వాఁడు;
ఉత్స్య +ఆభము = ఉత్స్యాభము; ఉత్స్యము =, ఊట సంబంధ మైనది, పొంగుట]
వింఖము లెత్తెను గుఱ్ఱము
పుంఖము తిరుగంగఁ బైన బోరున నూదెన్
శంఖము జంగము దేవర
శంఖధ్వానము వినఁబడె శ్వానము మొఱుఁగన్ 4
ప్రేంఖా లీలఁగ స్యందనమ్మున మహా ప్రీతిన్ విజృంభించుచుం
బుంఖవ్రాతము లెల్ల దిక్కులను సంపూర్ణంబుగా నిండగం
బుంఖవ్రాతము సంచరించె దివిఁ దాఁ బూరించ బీభత్సుఁడే
శంఖధ్వానము విన్పడెన్ పృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్ 3
[పుంఖము = బాణపు పిడి; పుంఖము = డేగ]
పన్నాగము లెందుకు నా
సన్నము కాఁగ సమయమ్ము జనకాయము చే
మన్నన నొందిరి గద వీ
రెన్నిక కానట్టివారె? యేలుదురు ప్రజన్ 2
సన్నము కాఁగ సమయమ్ము జనకాయము చే
మన్నన నొందిరి గద వీ
రెన్నిక కానట్టివారె? యేలుదురు ప్రజన్ 2
సన్నము రాజభక్తి యిల సద్గుణ ధర్మ పరత్వ చిత్తు లే
ల్కొన్నను మెత్తురే ప్రజలు కోరిన కోర్కులు తీర్చకున్నచో
సన్నుత యేమి సెప్పుదును సజ్జన భావము లందు నించు కే
నెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో 1
ల్కొన్నను మెత్తురే ప్రజలు కోరిన కోర్కులు తీర్చకున్నచో
సన్నుత యేమి సెప్పుదును సజ్జన భావము లందు నించు కే
నెన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో 1