అష్ట విధ నాయికలు:
| ||
స్వాధీనపతిక.
| ||
మ.
|
నర నాథుండు మహోగ్ర వీరుఁ డరి సైన్యవ్రాత భీభత్సుఁడే
తిరుగన్నేరఁడు నెన్నఁడేనియు వినాదేశమ్ము నన్నెంచుచున్
వర దానమ్ములు పెక్కు సేయుఁ దమి సంభావించి నన్నెంతయుం
దరుణీ రత్నమ యేలు నన్ననెడు భర్తం గంటి భాగ్యమ్మునన్
|
1.
|
వాసకసజ్జిక.
| ||
శిర మందుంచెను రత్న మింపుగను గౌశేయాంబర శ్రేష్ఠ మూ
ని రమా సన్నిభ స్వర్ణ కుండలము లూనెం గర్ణ యుగ్మంబునన్
వర జాంబూనద హార కంకణ నసాబం ధేద్ధ కేయూరముల్
తరుణీ రత్నము మేఖ లాకలితయై తా వేచె నాథార్థమై
|
2.
| |
విరహోత్కంఠిత .
| ||
శా.
|
రాకేందు ప్రభ లయ్యె నా కకట దుర్వారాగ్ని కీలాభముల్
కాకాక్రోశము లయ్యెఁ గర్ణముల భృంగ ద్వంద్వ ఝంకారముల్
కాఁకం దుల్యము చంద నాగరులు తీక్ష్ణజ్వాల రింఛోళి క
య్యో కామోద్ధతి సైఁప నోపఁ బతి సంయోగార్తి నో దైవమా
|
3.
|
విప్రలబ్ద.
| ||
శా.
|
నీలాకాశము నందుఁ జందురుఁ డహో నిద్రించె నిట్టూర్పులే
నాలో రేఁగెను దెల్లవాఱె నకటా నా యీ ప్రసూనమ్ములే
నేలం గూలెను వాడి నే విసర ఱేనిం జూడ రాదయ్యెనే
కాలం బెల్లయు వ్యర్థ మయ్యెను రమాకాంతా! దయం జూడవే
|
4.
|
ఖండిత.
| ||
మ.
|
పర భామా రతుఁ డయ్యెనో వలపె నాపై క్షీణమై పోయెనో
పరుషమ్ముల్ పలుకంగ నేర్చె నకటా భారంబు నే నైతినే
కర మాశ్చర్యము నాథు వర్తన మహంకారమ్ము పేట్రేగెనే
దురితం బే నిట నేమి సేసితి నయో దుర్భాగ్య మయ్యెం గదా
|
5.
|
కలహాంతరిత.
| ||
మ.
|
సత తాసత్య వచో ధురంధరుఁడు నిస్సారుండు దుర్భాషుఁడున్
గత సంస్కారుఁడు కాల యాపనుఁడు శంకవ్రాత చిత్తుం డహో
విత తావేశ మనస్కుఁడే యనుచి తోద్వేగుండు నెట్లయ్యెనో
మతి నే నెంచను వీత రాగు నిఁక నంబా నాథు నే వీడుదున్
|
6.
|
ప్రోషిత భర్తృక.
| ||
మ.
|
ధన మార్జింప నిజాత్మనాథుఁ డురు విద్యావేత్త తా నేఁగఁగా
ఘన దూ రాపర దేశ వాసమునకై కాంతా విహీనమ్ముగా
వనవా సావనిజాభ వైతి సఖి దుర్వారంపు సంత్రాసమే
నిను నిత్యమ్మును వేఁచునే యను గిరల్ నే నింక నెట్లోర్తునో
|
7.
|
అభిసారిక.
| ||
మ.
|
సర సాలాప మృదూక్తి సారఘ రసాస్వాద ప్రమోదంబునన్
వర చేలోజ్వల హేమ భూషణ మహా వర్ష్మమ్ముతో వెల్గుచున్
దరహాసమ్ము ముఖారవిందమున నుద్భాసిల్ల సంరంభియై
గిరులన్ దాటి లతాంగి పర్వు లిడె సంకేతస్థలం బేఁగఁగన్
|
8.
|
ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
11, మే 2021, మంగళవారం
Ashta Nayikaa mano raagamulu_ అష్ట నాయికా మనో రాగములు
1, మే 2021, శనివారం
సమస్యాపూరణ_మే 2021
మిన్నగఁ గ్రిమి బారినిఁ బడి
యున్న జనుల కీయ ధైర్య మున్నతముగ నీ
వన్నగరమున కరుగఁ గుం
దున్ననుఁ గని దోఁచితి వని రుల్లంబులనే 61
[కుందు +ఉన్నను =కుందున్నను]
సన్నము సేయ నెంచి తగ సంశయ కారక చింత నావలిన్
భిన్నపు దృక్పథమ్ములను బేరిమి నేకము సేయ నెంచుచుం
దిన్నగఁ గూర్ప స్నేహమును దిట్టతనమ్మున వారి మధ్య వా
దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లము లంచు వచించి రెల్లరున్ 60
[వాదు +ఉన్నను =వా దున్నను; వాదు =కలహము]
ఆహా విరహము తొలఁగఁగ
నీ హాయి లభింప భాగ్యమే కద యనుచున్
మోహముతో విరి దండను
రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే 59
[రోయు = వెదకు]
దోహద ముండ సంతతము తోరము రోహిణి పైన నన్యులన్
గేహము లందుఁ గాంచఁ డని కిట్టఁగ నశ్విని చంద్రు నంతటన్
స్నేహము మీఱ డెందమున జ్యేష్ఠ వరాశ్విని చెంత నుండఁగా
రోహిణి వచ్చి నంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై 58
సూర్య చంద్రులు లోకుల కార్య వరులు
వారు గ్రహణ పీడితు లైన భావ్య మగునె
తుష్టు లయి నాహరింపఁగ దుస్సహపు ట
హితముఁ గను గ్రహణమున భుజించు వాఁడు 57
పుడమిని విశ్వసింతురు సమోదము వేద విదుల్ వచింపఁగాఁ
గుడువఁగ రాదు మానవులు కూడిన ఘోరత రోపరాగమే
యుడుపతి పద్మ బాంధవుల నుంచి మనమ్మున భక్తి మౌనముం,
గడు హిత మబ్బులే గ్రహణ కాలమునన్, భుజియించు వానికిన్ 56
వేగమ పూర్వ మజామిళుఁ
డేఁగెను బాపక్షయమున నింపుగ దివికిం
బోఁగాలమున హరిఁ దలఁప
భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా 55
నాగేంద్రాస్తర చిద్విలాసుని హరిన్ నాగేంద్ర సంకీర్తితున్
నాగేంద్రాభరణాప్తుఁ గొల్వ నెడఁదన్ నాగేంద్ర ధారిన్ ధరన్
వాగౌన్నత్యము వెల్గుచుండ హరిసేవా నామ తత్కీర్తనా
భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్ 54
[ హరిసేవానామ భోగాసక్తుఁడు, తత్కీర్తనా రాగబద్ధుఁడు]
హర ధాత్రాదుల పిమ్మట
హిరణ్యకశిపుఁ బరిమార్చితే యిక నైనన్
నరహరి! శాంతించి రమా
విరహముఁ బాపు మని గౌరి వెన్నుని వేఁడెన్ 53
హరి కరి రక్షకుండ గతి యంచు మనమ్మున విశ్వసించుచున్
వరము నొసంగి చిక్కెఁ బతి పన్నుగ వెల్వడఁ జేయు మంచుఁ దా
నరహరిఁ గాంచి తెల్పి నిజ నాథు గజాసుర గర్భ సంస్థితున్
విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేఁడెను గౌరి తప్తయై 52
వరుసగా పా - రా - వా - రం - అక్షరాలను న్యస్తము చేయుచు
సముద్ర మథన వర్ణనము:
పాశము రా ఫణి వాసుకి
యాశను గిరి మందరంబ యా కవ్వము గా
నా శుభ బారావారం
బీశుని కృపఁ ద్రచ్చి రెల్ల రీ సుర లసురుల్ 51
వాసుకి భుజగమ్ము పాశ మయ్యెను మంద
రంబు భీమ శైల రాజ మయ్యె
వరపుఁ గవ్వ మప్డు వార్ధిఁ జిల్కిరట సు
రలు నసురవరులు వరం బిడ హరి 50
శంకరుఁడు పార్వతీ దేవిని సంతోషపఱచుటకుఁ దాను జంపిన బాలునకు గజాస్యముతోఁ బ్రాణము లొసఁగెను; పార్వతీ దేవి కొఱకై మేరుపర్వత సమీపపుఁ గుమార వనమునకు వచ్చిన మగ జీవు లాఁడ జీవులుగా మారెదరని శపించెను. ఈ సందర్భము:
సుతునకు నిచ్చెఁ గరి ముఖము
సతులుగ మారుదు రనె వని సకల పురుషులన్
సతి కెదురాడఁడు భర్గుఁడు
సతతము సంతస మొసంగు సతితో గొడవల్ 49
[సతి = పార్వతీ దేవి]
అతులిత హర్ష దాయక మనంత సుఖప్రద మౌను స్వీయ జీ
వితము స భార్య మోక్ష గతిఁ బృథ్విని నారయ వీలు కల్గఁగా
వితత మనోనురాగ మది వెల్వడ దూరము కాఁగ నింపుగా
సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్ 48
వాఁడు నిను గాంచు నిత్యము
పాడిగఁ దన కూఁతురి వలె వలదిఁకఁ దలఁకే
యోడ కయితి నాసఖునకుఁ
గోడలి వని పల్కె నొకఁడు గూఁతురితోడన్ 47
వేడుక మీఱఁ జేసి సుత పెండిలి నిచ్చుచుఁ గట్టనమ్ములన్
వాడి తఱుంగ నట్టి వగు బంగరు టాభరణమ్ములం దమిన్
బాడిగ పుట్టి నింటి గరువమ్మును నిల్పుమ గొప్ప యింటికిం
గోడలి వంచు నొక్కరుఁడు గూఁతురి తోడ వచించె నెమ్మదిన్ 46
అటు నిటు పోకుండ సతము
వటువులు వల్లించుచుండఁ బాఠ్యాంశములం
బటువుగ మఱి జదు వనెడు న
వి టులకుఁ దావలము లయ్యె విద్యాశాలల్ 45
[అవి +ఇటు + ఉలకు = అ వి టులకు; ఇటు = ఇట్లు;
ఉల = కండూతి / దురద; అవి = ఆ విద్యా శాలలు]
కటువుగ నుండుఁ బల్కఁగను గాని నిజం బిది యెంచి చూడ గ్రా
మటికల యందు నిక్కముగ మంత్రి వరేణ్యుఁడ! యొక్కటేని లే
దట వినుమా పటుత్వమున నా శిథిలంబులు తార కోర్వశీ
విటులకుఁ దావలంబులుగఁ బేర్మిఁ గనెన్ బడు లెల్ల తావులన్ 44
[తారకా విటుఁడు = చంద్రుఁడు; ఊర్వశీ విటులు = మిత్రావరుణులు
(ఊర్వశి వలన వసి ష్ఠాగస్త్యుల జన్మకారకులు); చంద్రి కాతప వర్షములకుఁ
దావలము లైనవి. ]
బోయఁ డాత్మజునకుఁ బెట్టెఁ బుణ్య పురుషుఁ
డు శిబి చక్రవ ర్త్యాఖ్యను భృశపుఁ బ్రీతి
నక్కట పెరిగి సూనుఁడు మిక్కుటముగ
క్రూరుఁడై శిబి ఖండించెఁ బారువమును 43
పారావార పరీవృ తాఖిల జగత్ప్రాణ్యోఘ సంభావ్య లో
కారాధ్యుండు మహామహీశ్వరుఁడు శ్యేనార్థంబు నిర్భీతినిన్
సారోదార దయాసముద్రుఁడు నిజ స్కంధమ్ము, రక్షింప న
క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం, గపోతమ్మునే 42
[పద విభజనము: రక్షింపఁ, గపోతమ్మునే, నిజ స్కంధమ్ము నక్రూరుండై... ]
విప్రవరుఁ డుదంకుని మాట విని యొనర్ప
నధిపుఁ డిష్టిని నాస్తీకుఁడు ధరణీ సు
రోత్తముఁడు వేఁడ జనమేజయుఁ డహుల పయి
సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె 41
అమరుఁడు నయ్యె నింపుగ మహాత్ముఁడు మౌర్య కులస్థుఁ డిద్ధరం
గమలఁగ నంతరంగము ప్రగాఢముగా విజయుండు నయ్యుఁ దా
విమలుఁ డశోక భూధవుఁడు వేదన నీయ కళింగ యుద్ధమే
సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుం డహో 40
[సుయోధనుఁడు = మంచి యుద్ధము చేయువాఁడు, ఇక్కడ అశోక చక్రవర్తి]
వింతఁ గాంచ లే రెవ్వరు సుంత యేని
యిందు వీడు మింక నెడఁద సందియమ్ము
వెలఁది పసతోడ వీవఁగ విసన కఱ్ఱ
గాలి విసరెను వృక్షశాఖలు గదలవు 39
చాలదు శక్తి గాలికిఁ బ్రసారము నందుఁ దరింప ఖండముల్
వేలను దాట లేని ఘన భీకర వారిధి భంగి ధాత్రిలోఁ
దేలక కొంచె మైన మన దేశము లోన, సుదూర భూమిలో
గాలులు తీవ్రమై విసరెఁ గాని, చలింపవు వృక్షశాఖలే 38
కంటి కగపడ కుండగ నుంటి వేల
మెచ్చుకొందు నిచ్చను నిన్ను నిచ్చ లేను
మూర నింక నీ కాకుల మూఁక లోన
గాన మొనరించు పికమ నిన్గాన నగునె 37
ఈ నర కాయ మివ్విధము హీన కరోన కరాళ నృత్యముం
గానఁగఁ దల్లడిల్లుచును గాఱియ లందుచు నుండఁ జేయచున్
నీ నుతి విశ్వమం దకట నిండఁగ నెల్లెడ రోదనమ్ములే
గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ 36
[కర +ఊన = కరోన = చేతులు తక్కు వైన కృమి]
ఘనము - ధనము - మనము - వనము -
అన్యార్థంలో రామాయణార్థంలో పద్యము:
మునుల రక్షణార్థము దండ కారణ్యములో
మునులను బాధించు చున్న రాక్షసులను
జంపెద నని రాముఁడు మునుల కభయ
మీయ సీత సంశయించి కారణములను
జెప్పి రాముని దండకా వన మేఁగుటను
దిరిగి యాలోచింప మనఁగ రాముఁడు
భార్యతో పలుకు సందర్భము:
మన ముక్త సంగ సన్ముని
వన ముద్హర్తృ నిధనము భువన రక్షణ మా
యనఘ నముచిసూదన నిజ
మనోర థానుగుణ మౌను మైథిలి వింటే 35
[సన్మునివనము = సన్ముని సమూహము]
కాంచఁ గలికాలమున నిట్టి ఘనులు కలరు
కేవల ధనార్తు లధములు కేలి లీల
నవ్వ యాస్తికై నిర్దయ నెవ్వ రిత్త్రు
జనకుఁ జంపినవానికి జనుల నతులు 34
ఇనకుల వంశ వర్ధనున కిద్ధ చరిత్రున కేక సత్య వా
గ్ఘనునకు సత్య శౌర్య గుణ గణ్యున కిద్ధర సీత భర్త కా
యనయుని లోకరావణు దశానను భండన మందు నింద్రజి
జ్జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్ 33
దుర్భరమై చెలఁగఁ బ్రథమ
గర్భమున ముదమ్ము నీయఁగ నెడందకు నా
కర్భకులు కవలు చెలి నీ
గర్భాధానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్ 32
గర్బం బింపుగఁ గల్గ వింత యగునే కాంతాళి కెంచంగ వై
దర్భీతుల్యపుఁ బుణ్యకాంతకు, వివాదం బేలనో పెండ్లి యై,
దుర్భావం బది యేల, యేఁడు తగు సంతోషమ్ముగా నేఁగఁగా
గర్భాధానము నాఁడె కల్గిరి సుతుల్ కంజాక్షికిన్ జంటగా 31
లలనలు కా రాటల బొ
మ్మలు శక్తి సమాన లెంచ మహిలో నెల్లం
గులసతి యనంగఁ గా దిల
వెలయా, లొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్ 30
తలి యై పెట్టును గడ్పు నిండ నొసగుం దా మంత్రియై యోచనల్
విలసిల్లున్ సిరి భంగి రూపమున సేవించుం దగన్ దాసియై
కలలో నైనను భార్య కెవ్వరు నహో కట్టంగ లే రిద్ధరన్
వెల, యాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే 29
[వెల యిచట ద్వితీయార్థ ప్రథమలో నున్నది కనుక యడాగమము.]
దూరం బైనవి జనుల వి
కారమ్ములు వేంకటేశుఁ గాంచఁగఁ గనులన్
మూరిన యధికారుల సహ
కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్ 28
సార విభూతి గంధ తను సంతత నిర్జర వంది తేద్ధ బృం
దారక నామ కీర్తిమ దుదాహృత జన్మ మహా పరంపరా
తారక మంత్ర వన్నమక తచ్చమ కావృత దివ్య కుర్వ దోం
కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్ 27
భవ పారావారమ్మును
శివ నామము దాఁటఁ జేయు శీఘ్రమ్ముగ భ
క్తి వశుండనై ముని గణా
శ్రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్ 26
[ఆశ్రవము = అంగీకారము]
భవ చయ నాశకుం డజుఁడు పంచ వరాస్యుఁడు నిత్య సద్దయా
ద్రవ పరిపూరి తాత్ముఁడు నుదారుఁడు సాంబుఁడు స్వీయ మానస
స్రవ శివ నామ సంస్మరణ సక్త సమంచిత పూర్వ భా గను
శ్రవ యుత మౌన మూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్ 25
[అనుశ్రవము = సంప్రదాయము]
కలుఁ గాయుచు జన కోటికిఁ
గలుఁ బంచుచు గెలిచి యెన్నికల మాటలతో
బల మింకను దండిగ రూ
కలు గలిగిన వాఁడె రాజు కలికాలమునన్ 24
కలకల మెల్లఁ గల్గినను గాదని యెల్లరు రట్టు చేసినం
దలఁచిన కార్య మాపక సతమ్మును బాలన మందు నిల్చుచుం
బలువురు తిట్టు చుండినను బట్టు చలించని యట్టి గుండె నాఁ
గలు గలవాఁడె రాజు కలికాలము నందుఁ దలంచి చూచినన్ 23
[కలు = ఱాయి] ; వృత్తములో రాజు గొప్పదనము సూచింపఁ బడుట గమనార్హము.
పితృ వివాసితుఁ డయ్యెను సుతుఁడు రాముఁ
డంచు నెఱిఁగి నిశ్చేష్టుఁడై మించ నెడఁద
లోనఁ జింత భృశము తన్ను దాను మఱచి
రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు 22
ఎడఁద మహానుమోదము నహీన విచారము రెండు కల్గఁగం
దడఁబడి వేగ సానుజుఁడు తారణి తెమ్మని వచ్చెనే భయం
పడి రిపు వీర సంతతికి, వచ్చును గాంచఁగఁ, దాను గాఁడు నౌ
క,డుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై, రఘురాము పాదముల్ 21
[నౌకు = అంగహీనుఁడు, మొఱ్ఱి;
పద విభజనము: తాను గాఁడు నౌకు, కాతరుఁడై రిపువీర సంతతికి భయంపడి
రాఁడులే గుహుఁడు, వచ్చును గాంచఁగ రఘురాము పాదముల్]
సంతత హరి నామ జప లోక సంచారి
బ్రహ్మచారి దేవరాణ్నుతుండు
నారదు నిజ తనయు నారాయణునిపై ని
రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె 20
అతులపు ఘోర భీకర మహా తప మత్తరి నిర్జరాలికిన్
వెత లిడఁ దాప మంది తొలు వేలుపుఁ గోరఁగ వచ్చి యిచ్చెఁ దా
వితతిని మెచ్చి బ్రహ్మఋషి పీఠము గాధిజ సల్లసత్తపో
రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్ 19
కొట్టి పిల్వ నేల వట్టిగ వత్తురు
మాన మున్న వారు మఱచి మమ్ము
మింగు నట్టి విధము, మే మఱవఁగ నిట్లు
రాము రాము రాము, రమణి గాంచె 18
[రాము: రా మని చెప్పుట]
భీముని గొప్ప వింటి నట వే విఱువన్ విని భార్గవాన్వయుం
డా ముని పుంగవుం డలిగి నా రఘు రామునిఁ గాంచ వచ్చినన్
భీమపు రాము నారసి సభీతి వసిష్ఠుని మామ పిల్వఁగా
రా ముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్ 17
[రా (న్) ముని = వసిష్ఠ ముని రాఁగ; వసిష్ఠ మునిని, పరశురాముని, భర్త రాముని
మువ్వురను జానకి చూచెను.]
భక్తి యగుఁ గారణం బిల
ముక్తిఁ బడయ మానవులకుఁ బుణ్యాత్ములకున్
సూక్తిఁ బలికితి శరీరపు
ముక్తికిఁ గారణము విషయ భుక్తియె తలఁపన్ 16
ఉక్తము ముక్త సంగు లిల నొందుట యుత్తమ విష్ణు ధామమున్
రిక్తము కాదు భక్తి సుపరిశ్రమ ముండగ నిత్య కామ సం
సక్త మనో వికార గత మానవు లిద్ధర దూర మౌటకున్
ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్ 15
మూడు లోకములఁ జరించు పుణ్యనదిఁ గ
నఁ దొలఁగును పాపములు కరుణా లసన్మ
నస్కు హరు నౌదల సహస్ర భాస్కర చ్ఛ
వి ధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె 14
[ధుని = నది]
అల తన చేతి దెబ్బలకు నప్పుడు మృత్యువు దైన వాకిలిన్
నిలువఁగ నన్నచే బ్రతికె నివ్వెఱ వోయె మృగేంద్ర తుల్యుఁ డా
వలలుఁడు సైంధ వాధముఁడు భండనమందుఁ జెలంగ నవ్విధిన్
వెలవెలఁబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచి నంతటన్ 13
నగజాతను బెండిలి యా
డఁగ వలెఁ గావున సుర కపటమ్మున వృషభేం
ద్ర గమనుఁడు నిత్య కీర్తిత
నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్ 12
[నిత్య కీర్తిత నగధారి = నిత్యము కీర్తింపఁ బడిన నగధారి
యైన విష్ణువును గలవాఁడు, శివుఁడు]
పగలే యుండవు దేవదేవునకుఁ గోపంబున్న శాంతించుగాఁ
దగ నేకైక క్షణమ్ము నందు ఘనుఁడౌ దాక్షిణ్య భావమ్మునన్
వగవన్ మిక్కిలి భర్తృ వేదనను భాస్వన్మేరు సంజ్ఞా మహా
నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే 11
[నగరాడ్ధారి = మేరు పర్వతమును విల్లుగా ధరించిన శివుఁడు]
దివిలో దీవింప నమరు
లవలోకించి ముద మార నా పాలకుఁడే
యవనిఁ బడ నీన గుఱ్ఱం
బవలీలగఁ జిన్నపిల్ల, యశ్వము నెత్తెన్ 10
ధవళాచ్ఛాద పరీవృ తేద్ధ ముఖపద్మ ద్యోత, శోభిల్లఁగా
ఛవిమత్కుండల యుగ్మ కంకణ మృదు స్వానమ్ము, హస్త ద్వయిన్
నవ కాంతిన్ వెలుఁగొందు గవ్వల గమిన్ నట్టింట నాసీనయై
యవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్ 9
[అశ్వము =ఏడు సంఖ్య]
మగువ కింపొసఁగు మదికి మండు టెండ
భర్త యుండంగ నండఁగ వర్తనమునఁ
బండు వెన్నెల, లేకున్నఁ బతి సరసను,
బారిజాత గంధమ్ము దుర్భరము సతికి 8
స్వాంతము నందు భక్తి నిడఁ జాలదె లోకుల కెంచఁగా రమా
కాంతు దయావలోకన నికాయము వొందఁగ సమ్మదమ్మునం
గాంతుని దాన మిచ్చి ధన కాయము చేఁ బతిఁ దూఁప లేక యా
కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోఁటలోన్ 7
జీవగఱ్ఱ వ్యాకరణము చేత నెంత
సత్య వాక్యమొ యంతియ సత్య మగును
దలఁచి చూడ నీ వాక్కులు ధరణిలోన
“సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ” 6
సిరు లీ నేరవు మోక్ష మెన్నఁడును సంసేవింపు పీతాంబరున్
గురు సంఘమ్మును వేడి కాంచుమ గతిన్ ఘోరంబుగా నిట్లు పం
దిరి శోకింపఁ దరింతె వెన్నుని పయిన్ నీ సత్తెపుం బత్తి నా
సిరియే మోక్షము నంద సాధన మగున్ జింతించి సాధింపుమా 5
వినకుమ కనకుమ పస చెడిన పని యను
నది కఱవయిన జనులకు నెదను గలవ
ర పఱచెడి కతలఁ గల గిరలను నిటులఁ
గుశలవుల్ గారు రాముని కొడుకు లంద్రు 4
చిత్రము కా కు నార్తికకుఁ జేరఁగ దీపము “దుష్ట తప్త దీ
పాత్ర” యనంగ నొప్పగు నపాత్రపు గాథకు నెంచి చూడఁగన్
క్షాత్రము నందు తండ్రికినిఁ జాలరె! కార్ముక మందు నల్పపుం
బుత్రులు గారు పో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్ 3
[కా + ఆర్తిక +దీపము; “దుష్ట+తప్త+ దీప+అత్ర”: చెడ్డదైన యార్తి నొందిన దీప
మిక్కడ యని యనఁగ నొప్పగును.]
సుంకము చెల్లింపఁ గలవు
జింకలు సింహంపుఁ గంటఁ జేటునఁ పడినన్
జంకక యచ్చట గడ్డిని
జింకలు దినెఁ, బొలసు గడ్డి సింహము మేసెన్ 2
[పొలసు కడ్డి = మాంసపు కఱ్ఱ (బొమిక)]
వంకలు వాగులం దిరిగి పర్వులు వెట్టుచు నింక దుమ్కుచున్
బింకము మీఱఁ జేరినవి పెన్నడవిం దమి నక్కజమ్ముగా
నంకమునన్ మృగేంద్రుఁ గని యచ్చట కేఁగక భీతిఁ జాటుగా
జింకలు, మాంసముం దినెను సింహము, గడ్డిని మేసెఁ బ్రీతితోన్ 1
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)