కోప మూనకు నిత్యమ్ము క్రూరముగను
శత్రువై యది పీడించు సంతతమ్ము
ద్వేష మూనకు నీదు మదిని దహించు
శాంతి సతతమ్ము దుర్జన! సౌఖ్యదమ్ము 63
దాంత యుధిష్ఠి రాజ్ఞ విని తమ్ముఁడు నిల్వక యున్న భీమ దు
ర్దాంత రుషానలం బపుడు దాయలఁ గాల్పక యున్నె వీర్యవ
త్స్వాంత సరోరు హాలయ విభాసిత దాంత కృపా సుధా లస
చ్ఛాంతి సతమ్ము దుష్టజన సౌఖ్యదమౌనని యండ్రు పండితుల్ 62
భీష్మ ద్రోణ దయిత యు
ద్ధేష్ముండు ధనంజయుం డహీ నేష్వాసుం
డూష్మానల నిభ నరుతో
భీష్మ ద్రోణుల సమరము భీముండు గనెన్ 61
శుష్మప్రాభవ సచ్చతుష్టయ మహో శోధింప నిండెం బ్రగా
ఢోష్మం బెల్లెడ విస్ఫులింగములతో యుద్ధావనీ వాటికన్
గ్రీష్మాదిత్య ని భార్జు నాగ్రజుల కాగెం గొంత నిశ్చేష్టులై,
భీష్మ ద్రోణుల కాహవంబు జరిగెన్, భీమార్జునుల్ గాంచఁగన్ 60
[పద విభజన: గ్రీష్మాదిత్య ని భార్జు నాగ్రజలకు భీష్మ ద్రోణుల కాహవంబు జరిగెన్ ,
ఆగెం గొంత , నిశ్చేష్టులై భీమార్జునుల్ గాంచఁగన్]
వే యణఁగిన నణఁగ నగును
గాయ మగును దీయ నెంచఁ గరవాలమునన్
నీ యఱికాలివి యానియ
కాయలు గాయలుగ నుండుఁ గావు ఫలంబుల్ 59
నా యెదు రెవ్వ రుందు రని నా సరి యౌ బలవంతుఁ డుండునే
యే యెడ కేఁగి చూచిన మహీతల మందని విఱ్ఱవీఁగుచుం
జేయఁగఁ బాప కాయములు శీఘ్రమ పండక యుండునే యిలం
గాయలు గాయలై మిగులుఁ గావు ఫలంబు లటన్న సత్యమే 58
ఆలికినిఁ బాక పరిపా
కాల సమానుఁడ నరయఁగఁ గానే యంచున్
వ్రేలను ముంచుచుఁ గాయుచుఁ
బాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై 57
కీలి నిభ ప్రభా కలిత కీర్తి వికీర్ణ సుఘోర దర్శ నా
భీల వరూధినీ సహిత భీద పరాక్రమ సుప్రచండ బా
హా లస దుగ్ర శాత్రవ జయార్భట చిహ్న సునిర్మి తేద్ధ స్తూ
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్ 56
బాలునకు నిత్య మాడుట వ్యసన మౌను
నాయకునకు వ్యసన ముపన్యాస మౌను
దెనుఁగు కవికి దినదినమ్ము తీర నట్టి
వ్యసన మిది సమస్యాపూరణాచరణము 55
దిస లెల్లం గనఁ బెర్గె కయ్యము లహో తీవ్రమ్ముగా నిత్య మా
కస మంటంగ మదీయ ఘోర రసనా కండూతి పెంపొందఁగా
నసమా నానుచిత ప్రగల్భ కువచో వ్యాసంగ సంయోగమే
వ్యసనం బైనది మానకుంటిని సమస్యాపూరణం బయ్యయో 54
[వ్యసనము = ఆపద; సమస్యా + ఆపూరణము = సమ స్యాపూరణము;
సమస్యల నంతట నిండించుట]
స్మర ఖర బాణ వితాన మ
ధుర ఘాతమ్ములకు నోడి తోయజనేత్రా!
దరికిం గీచకుఁ డదె దు
ర్మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని! గనుమా 53
నర వరు లేరి కెన్నఁడును నాకచ రాలినిఁ గాంచ శక్యమే
తరుణిని నిన్ను గాంచితిని ధర్ముఁడ నీ దయ వ్యర్థ మెట్లగున్
సురవర! సత్యవంతు సతి చూడు మరల్పఁగ స్వీయ భర్తృ దు
ర్మరణముఁ గోరి వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో 52
నిండ మంచు కురియ రేఁగు పండు పైన
రామచిలుక వచ్చి కొఱుక రక్తి తోడఁ
జోద్యముగ నప్పు డచ్చటఁ జూడఁ జిలుక
కాణిముత్తెము ముక్కుపై నమరి యుండె 51
ఒద్దిక నాణి ముత్తెమె కృశోదరి దంతము లెన్న ముత్తెముల్
దుద్దుల లోన ముత్తెములు తొయ్యలి గాజుల యందు ముత్తెముల్
ముద్దియ కంఠహారమున ముత్తెము లుండఁగ మేటి ముక్కఱన్
ముద్దుగ నాణిముత్తె మది ముక్కునఁ జేరినఁ జూచి మెచ్చితిన్ 50
కరము విలయ మిడు విద్యల
ధర నేర్పెడు వాని తోడఁ దప్పక క్షుద్రా
మర పూజలు నేర్పంగన్
గురుదక్షిణ నొసఁగువాఁడు గ్రూరుండు గదా 49
కలవర మంద కెట్టిదినిఁ గ్రన్న నొసంగినఁ గోరి నట్టిదౌ
తలఁపఁగ నుత్తముండె గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా
కలఁగ కబద్దమున్ నిజముగాఁ బలుకంగ వచించి పెద్దకుం
దలఁపఁగఁ గ్రూరుఁడౌను గురుదక్షిణ నిచ్చెడివాఁడు నమ్ముమా 48
[గురు దక్షిణ = 1. గురువుల కొసఁగు ధనాది వాంఛితములు;
2. పెద్ద మొత్తమున నొసఁగు ధనము (లంచము)]
అంగాంగ విలాసమ్ము ల
భంగమ్ము సెలంగ వీడి భార్యను దా వే
శ్యాంగనను గూడె నక్కట
గంగమ్మను రోసి మురుగు కాల్వను మునిఁగెన్ 47
పొంగ నవీన శుద్ధ జల ముంచ దభంగ తరంగ సంగ తో
రంగ విహీన సుస్రవ విలాస యుతమ్ముగ నిచ్చ మెచ్చుచుం
జంగునఁ బోయి యప్పురుష చంద్రుఁడు పంకము నిండి యుండఁగాఁ
జెంగట నున్న గంగ నిసిసీ యని రోసి మునింగెఁ గాల్వలోన్ 46
[గంగ = నీరు]
ధిఙ్నాగ గమ నగక్ష్మా
భుఙ్నందనను నలినాక్షిఁ బుణ్యాత్మ సుధా
రుఙ్నేత్ర పార్వతీ సతిఁ
బ్రాఙ్నగమున శంకరుఁడు సుభద్రనుఁ గూడెన్ 45
[సుభద్ర = మిక్కిలి శుభ మైనది]
దిఙ్నుత కార్తికేయుఁడు సు ధీనిధి సన్నుత పన్నగేంద్ర సు
త్వఙ్నగ భూషణుండు దయఁ దాల్పఁగ షణ్ముఖ నామ మంది స్వ
ర్దృఙ్నయ వంచనమ్మునను దేవ చమూపతి తేజనమ్మునం,
బ్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె, వాలియే 44
[స్వర్దృక్కు = అగ్ని; సుభద్ర= మిక్కిలి శుభ మైనది; తేజనము = ఱెల్లు గడ్డి; వాలి = దిగి]
భానుమతీ భానుల యస
మానపు దాంపత్య మందు మచ్చ యనంగం
దా నొక తప్పొనరింపఁగ
భానుని భానుండు గాంచి వడవడ వడఁకెన్ 43
దీన ముఖోత్పలమ్ము నిజ దీప్త లయమ్మున వీత తోయ త
న్మీనము భంగిఁ దోఁపఁగను మించియుఁ గాంతుల యందు దేవతా
మానవ సంచయమ్మును విమాన మొనర్పఁగ మింట నున్న స్వ
ర్భానునిఁ గాంచి నంతటనె భానుఁడు బిట్టు వడంకె భీతుఁడై 42
[సూర్యునిఁ జూచిన కలువ ముడుచుకొని యుండుట సహజ మట్టి కలువను
బోలిన సూర్యుని ముఖము రాహువును గాంచఁ గాంతి హీనత రెట్టిం పయ్యె
నని భావము]
వద్దుర కన్నయ్యా యి
ప్పొద్దున నిలు వదలి నీవు పో వద్దనినం
దద్దయు దిట్టఁదనమ్మున
వద్దన్నను వచ్చువాఁడె వంద్యుండు గదా 41
ఎద్దుల బండి పంతమున నెక్కఁగ బల్లిదు లందు నెంచఁగాఁ
బెద్దయె తల్లి పంపునను భీముఁడు పట్టణ రక్ష ణార్థమై,
తద్దయు భీతితో ద్విజుఁడు దైత్యుని వద్దకుఁ బంప లేను పో
వద్దని యెంత వేడినను, వచ్చెడి వాఁడె స్తుతింప నర్హుఁడౌ 40
వాఁగ వాఁగ జనుల కెల్లఁ దూఁగు రక్ష
పాప లానఁగఁ బాలను ద్రేఁపు రక్ష
త్రాగి త్రాగి పిదప సుంత త్రాగఁ జల్ల
త్రాగుఁబోతుల కదియె శ్రీరామరక్ష 39
శ్రీగళ భక్త సత్తముఁడు సీతకు భర్త దయాంబురాశియే
రాగము మీఱ రాఘవుఁడు త్రాతగ, దుస్సహ తాప వహ్నినిం
గాఁగఁగ రామ నామ జప కార్య సమంచిత చింతనా సుధం
ద్రాగెడి వార లెల్లరకుఁ దా నగు నెప్పుడు రామరక్షయై 38
[పద విభజనము: ...రాఘవుఁడు తా నగు త్రాతగ నెప్పుడు రామరక్షయై]
ముని వరు లవని తలమ్మున
మునుఁగఁ బ్రభాత సమయములఁ బుణ్య జలములం
జనుదు రెలమి వేర్వేఱుగ
వనధికి సాగరమునకు లవణశరనిధికిన్ 37
వన మన నీర మప్పనిన వారియు నంబువు లన్న నంతియే
ఘనులగు సాగరుల్ పుడమి గర్వ మెలర్పఁగఁ ద్రవ్వ సాగరం
బనియును నీటి కుప్ప లని వచ్చెను బేరులు తత్ప్రకారమే
వనధికి సాగరమ్మునకు వార్ధికి నబ్ధికి నంబురాశికిన్ 36
ధ్వాంతము గనుమఱుఁ గైనన్
స్వాంతము నుంచి కడు స్వచ్ఛ సరణి దలఁచుచున్
సంతోషమ్మున సగరుని
సం తాపముఁ దెల్ప నొప్పు జన్మదినమునన్ 35
[సంతు +ఆపము=సంతాపము; సంతు = సంతానము; ఆపము =
జలసమూహము, కడలి; తెలుపు = మేలుకొలుపు; ఇక్కడ కడలిని
మేలుకొలుపుట యన స్నానము సేయుటయే]
పాప వియామ సంచయ నివారణ నైపుణ భారతీయ పు
ణ్యోపనిష త్ప్రయుక్త సమయోచిత హృద్యనురాగ భాస్వ దా
లాపశుభప్ర దాంచిత గిరా సుమ యుక్త హితమ్ము వీత సం
తాపముఁ దెల్పఁగాఁ దగును దప్పక జన్మదినమ్మునన్ సఖా 34
ఘన మృదు పద సద్భాసిత
ఘన గంభీ రార్థ గర్భ కాలానుగ తై
క నయ వచ నోల్లసిత త
ద్వనితా కవితలనుఁ బోల్చఁ బాడియె సుకవీ 33
[పాడియె = భావ్యమే, నిశ్చయముగ భావ్య మని]
విన నుప్పొంగు మనమ్ము కావ్య గత వాగ్వృష్ట్యంగనా వాక్యముల్
వని తాస్యాబ్జము కావ్య భావ ముఖ మాపాదించు నానందముం
గన నీ రెండు పరస్పరమ్ము సమముల్, కాదన్నచో నెల్లరన్,
వనితం బోల్చఁగనొప్పు నా కవితతో, వారింప నొప్పుం గవీ 32
భారత రణ కారకుఁ డగు
నా రాధేయుండు నుత మహా వీరుండున్
నారీమణి కన్యోదర
కారాగారమునఁ బుట్టెఁ గద కర్ణుండే 31
కౌరవ్యుండు యుయుత్సు తోడ స శతైకం బయ్యెఁ బుత్రాలియే
నారీరత్నము వుట్టె దుశ్శలయె యన్నల్ గాఁగ వారందఱుం
గౌరవ్యావలి షోడశాత్మజుఁడు దుష్కర్ణానుజుండై యుఖా
కారాగారమునన్ జనించెను గదా కర్ణుండు గాంధారికిన్ 30
[కౌరవ్యావలి = దుర్యోధన సమూహము; ఉఖా కారాగారము = కుండ యను
కారాగారము; దుర్యోధ నాదులలోఁ బదునాఱవ వాఁడు,దుష్కర్ణుని తరువాత
గాంధారికిఁ గుండలోఁ బుట్టిన వాఁడు కర్ణుఁడు ]
కాయ కాంతి కన్నను మనః కాంతి ఘనము
గొప్ప వాడను నేను సద్గుణము లందుఁ
దేహ మందు వీక్షింపఁగ నెఱుపు దెలుపు
దెలివి రవ్వంత లేని సుధీవరుండ 29
[తెలివి =కాంతి; సుధీవరుఁడు = మంచి బుద్ధిమంతుఁడు]
అలరుచు నన్ను పిల్త్రు ప్రవరాఖ్యుఁడ నంచును మిత్రు లెల్లరుం
బొలుపు సెలంగ నెట్టి దగు పుణ్యముఁ జేసితిఁ బూర్వ మెన్ని బా
ములను మనోవికారములు మోహము లెన్నఁడు, పిల్వ నంద క
త్తె, లివి రవంత లేకయె సుధీవరుఁడన్న ప్రశస్తి నందితిన్ 28
[అందకత్తెలు +ఇవి = అందకత్తె లివి]
పదిలము గనిపింపని నిజ
హృదయమ్ముల నింప స్వార్థ మివ్విధి నేఁడిం
పొదవని పోటి సెలంగఁగఁ
జదు విచ్చునె మానవులకు సంస్కారమ్మున్ 27
వదనాంభోజ వికాస హేతు వయి స్వస్వాంతామలీ భూతమై
కదనద్వేష మనః ప్రభావ మిడి సత్కారార్హులం జేయఁగా
సదసద్భేద వివేక బుద్ధి నిడి నిశ్శంకన్ మహోత్కృష్టమౌ
చదువే, రీతి నొసంగు మానవులకున్ సంస్కార సౌశీల్యముల్ 26
[చదువే = చదువు మాత్రమే; రీతిన్ =పద్ధతిన్ / ఆచారమున;
కదనము = పాపము, యుద్ధము]
కాననమున సుగ్రీవుని
యానతి రాఘవులఁ గాంచి యయ్యనిలునకున్
సూనుండు బూటకపు టా
మానిసి మానుషము వీడి మర్కటమయ్యెన్ 25
మానవుఁ డుద్భవించె మును మర్కట సంతతి నుండి యెన్నఁగాఁ
గానఁగ వచ్చు శాస్త్ర చయ గర్భము లందు ధరాతలమ్మునం
గాన విచిత్ర మెద్దియును గానము సుంతయు స్వార్థ బుద్ధినిన్
మానిసి మానుషంబు విడి మర్కటమయ్యె నిదేమి చోద్యమో 24
ధిగ్వ్యసనమ్ములు వీడు మ
సృగ్వ్యామోహమ్ము వలదు శ్రేయము లిడు స
మ్యగ్వ్యాపారియు దుర్జన
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ 23
ప్రాగ్వ్యాపార నిమిత్త పశ్చిమ ధరా వాసాన్య దేశస్థులే
దిగ్వ్యాపార సు మత్త దిగ్గజములై దేశవ్రజం బేలఁ ద్వా
దృగ్వ్యూహమ్ము లొసంగు నష్టములు సందేహంబు శూన్యంబ దు
ర్వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతి నందున్ గదా 22
సంతసమ్మునఁ గ్రమముగఁ జక్క నిత్తుఁ
బరమ పంచ మిత్రులకుఁ బద్మరాగ
వజ్ర మౌక్తిక నీల ప్రవాళము లివి
మీకు మీకును మీకును మీకు మీకు 21
సద్దు సేయకుండ వలయు మిద్దె లోన
గుట్టు రట్టౌను లేకున్న నొట్టు తల్ల
డిల్లి వచియించు చుంటి నే నెల్లరకును
మీకు మీకును మీకును మీకు మీకు 20
ప్రాకట దేశ సత్సమితి రాడ్వరుఁ డప్పుడు పల్కె నివ్విధిన్
వీఁకఁ జెలంగ నేతలు సుభీకరు లేడ్వురుఁ బ్రీతి మీఱ నే
కైకము సప్త సాగరము లిత్తును గొండు వివాద మే లొకో
మీకును మీకు మీకు మఱి మీకును మీకును మీకు మీకునున్ 19
నర లోకము మారెను నేఁ
డరయం దా నెంచిన పని యౌ కుల ధర్మం
బడరుచు నిరంతరము నా
పర ధర్మమె మేలని హరి వలికెను గీతన్ 18
[న+అపర = నాపర; అపరము కానిది, స్వీయము]
నర లోకంబున స్వీయ ధర్మములు సన్న్యస్తంబులై భాసిలెన్
దురి తామ్నాయ వినాశ హేతువులు చాతుర్వర్ణ్య సంభావ్యముల్
నిరపేక్షం దన దైన ధర్మ మిలలో, నిత్యమ్ము త్యక్తంబుగాఁ
బరధర్మం, బిడు శ్రేయ మంచు హరియే పల్కెం గదా గీతలో 17
అడుగిడ భూషిత యౌ రతి
పడతి తనసతిఁ గన నెఱిఁగె బాల్యసఖు దయన్
వడి ననుకొనెఁ దా నివ్విధిఁ
జెడె నయ్యో కృష్ణుచేఁ గుచేలుని యాశల్ 16
[రతిపడతి యాచ్ఛిక సమాసము; రత్నాలతూనిక వంటి పడతి]
పంచఁగ వాయ కోత్తముఁడు బట్టలు మంచివి వాసుదేవ నా
మాంచిత యుగ్మమం చెఱిఁగి యాతని మెచ్చి యొసంగె సంపదల్
వంచకు దుష్టు రా రజకు వస్త్రము లిమ్మనఁ దిట్ట దిట్టయై
త్రుంచెను కృష్ణుఁ డాగ్రహముతోడఁ గుచేలుని యాశ లన్నిఁటిన్ 15
[కుచేలుఁడు = చెడ్డ బట్టల నూనిన వాఁడు]
పానీయ మగును నిత్యం
బే నరపుంగవున కైన నిల శంఖములో
దా నుంచిన యెడల నెఱిఁగి
తే నీరే తీర్థమగును దేవుని గుడిలో 14
కానిమ్మింక నయజ్ఞు లెవ్వ రిచటం గానంగ రారేమి పో
యీ నీరంబు నొసంగ కూడ దనిరే యెవ్వారు నిప్పట్టులో
నీ నీరాకర బద్ధ భూవలయ మిట్లేపార వీక్షింప బ్రాఁ
తే నీరే యిడనొప్పు దేవళములోఁ దీర్థంబుగా నెప్పుడున్ 13
[బ్రాఁతి = దుర్లభము]
వీఁకఁ జెలఁగి యన్యాక్రాంత మేక మెంచి
యెన్నఁ డైన నాలోచన పన్ని యెడఁద
స్వీయ నిధులను బూడ్పంగఁ జెల్వముగను
గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు 12
అమలస్వాంత రమా వికార హృది క్రూరాశీవి షాభమ్ముగా
సమయించుం గద తన్ను ఘోరముగ నిశ్శం కాన్య దారాంచిత
ప్రమదా రత్నవిలోల మానసము విభ్రాంతమ్ము కన్నన్ ధరం
దమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్ 11
కొలిచినఁ గొలువ కున్ననుఁ గూర్మి మీఱ
నగపడక యేరి కిద్ధర నంచితముగఁ
గాచుఁ గంటికి ఱెప్పగఁ గరుణ తోడ
మతి సెడిన వారి దైవము మాధవుండు 10
[సెడిన వారి (న్) దైవము మాధవుండు]
పతి యగు భూ నభో వితతి బద్ధ చరాచర జీవరాశికిన్
సతతము పద్మనాభుఁడు విచారము నెమ్మదిఁ జేసి చూచినన్
మతి గల వారి కెల్లరకు మాన్యుఁడు సన్మతి నందఁ గోరినన్
మతి సెడి నట్టి వారలకు మాధవుఁడే నిజమైన దేవుఁడౌ 9
శరణు గోరినఁ గరుణించు శత్రు నైన
రఘు వరేణ్యుఁడు సత్య పరాక్రముండు
హరి నిభుఁడు సేరఁదీసి, దశానను ననిఁ
జంపెను, విభీషణుని రామచంద్రుఁ డలిగి 8
అంప విఘాత మంది యనె నంతట వాలి రఘుప్రవీరుతో
నింపుగ నేన సఖ్యమును నెంచిన సాయము సేయ నోపనే
పంపిన నుంతు దైత్యుఁ దవ పాదము చెంతనె యన్న దుష్టునిం
జంపెను రాఘవుండు దన సఖ్యముఁ గోరు విభీషణుం గ్రుధన్ 7
[విభీషణుఁడు = మిక్కిలి భయంకరుఁడు, యిచట వాలి;
సుగ్రీవునకు మున్న తన్నడిగిన రాముని సఖ్యము కోరువాఁడ నని వాలి
చనిపోవుచుఁ బలికెను.]
నడుమఁ గలుగు దుర్గుణములు
వడయ నరుడు దుఃఖరాశి బ్రతుకుట కొఱకై
పుడమినిఁ బడు నప్పు డగునె
దుడుకఁడు కాపురుషుఁ డులిపి ధూర్తుఁడు ఖలుఁడున్? 6
తడయక కాంచి నంతటనె తప్పక యందురు చూపువానినిన్
దుడుకుఁదనమ్ముఁ, జెడ్డ నరుఁ, దుంటరి, జూదరిఁ, గుచ్చితుం, గడిం
దెడనెడ రోఁత కల్గు పను లెల్లను జేసెడు వాని నివ్విధిన్
దుడుకఁడు దుర్జనుం డులిపి ధూర్తుఁడు కాపురుషుండు నీచుఁడున్ 5
జడియకుమీ యెన్నండు ప
సిడి వెలకై చిత్తమందుఁ జెన్నుఁగ నెంచం
దొడవు కడు స్థూల మయినం
జెడదు తనువు సర్వముఁ గనఁ జెడుఁ దథ్యముగన్ 4
[తనువు సర్వము = సన్నము సర్వము]
తడియదు నీట మండదు సుదారుణ వహ్నిని నింత యేనియుం
గడవదు శస్త్ర రాజములఁ గానఁగ రాక వసించు చుండుఁ దా
నడరుచు నిత్య మాత్మ సుకృ తాఘ చ యార్జిత దేహరాశిలోఁ
జెడనిది పాంచభౌతిక విశిష్ట శరీరమె? సర్వ మంతమౌ 3
దేవుఁ డెఱుఁగును ఫలితమ్ము లేవి యైనఁ
జేయ నా పతి యప్పులు చింత తోడ
నోము లెన్నియొ నే నిల నొచ్చు చుండి
నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ 2
నీమము తోడఁ బూజ లనునిత్యము సేసి కృశించి కన్న దా
కోమలి పుత్రు దుష్టుఁ డయి ఘోరముగా నిడ వాఁడె దుఃఖముల్
సామజ తుల్య గామిని యశాంతి మనమ్మునఁ దల్చె నివ్విధిన్
నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో 1