గరిమంపు విష్ణు భక్తి య
లరు ప్రహ్లాదుని ఘనుని హిరణ్యాక్షు మహా
సురగణ నాథుని నిజపతి
ఖర పాదముఁ గొల్చి కాంత గనె సత్పుత్రున్ 62
[ఖరపాదము = వేఁడిమి గల పాదము]
ఖర ఫాలాగ్ని విరాజితున్ శివుని ముక్కంటిన్ మహాదేవునిన్
హరు నాగాభరణున్ దిగంబరుని దేవారాధ్యునిన్ శంభునిన్
నిరతం బుంచి మనమ్మునం దునిమి సందేహమ్ము ఖండేందు శే
ఖరపాదార్చనఁ జేసి పుత్రునిఁ గనెం గంజాక్షి మోదమ్మునన్ 61
అల పదాఱు వేల లలనలు చెఱ లోన
రగులు చుండ నంత రాజ కన్య
లిట్లు తలఁచి రెదల నీ నరకాసురు
చావొసఁగు సమస్త సౌఖ్యములను 60
కావఁగ లేరు తృప్తి నెదఁ గాంచక వర్తిలు వాని నేరు సం
భావన సేసి చూడఁగను మానవ కోటికి ఘోర దుఃఖముల్
రావిల మీఁదు మిక్కిలి దురాశను జంపిన నుత్సహించి యా
చావొసఁగున్ విశేష సుఖ సంచయ మన్నది వాస్తవమ్మగున్ 59
ఘనుఁడా వంశోద్ధారకు
జననం బయ్యెడు ముదంపు సమయములో గే
హినికిన్ లోపల వెలుపల
పెనిమిటికే కలుగుఁ బ్రసవ వేదన గడిఁదిన్ 58
వనితకుఁ గల్గుఁ బుట్టిన దివమ్మున మాత్రమ కష్ట మెంచఁగాఁ
దనయుఁ డొసంగు నిక్కటులు తద్దయుఁ దండ్రికి జీవి తాంతముం
గను నపు డాలి కిప్పుడమిఁ, గన్న ఫలమ్మది చెందుఁ బిమ్మటం
బెనిమిటికే కదా, ప్రసవ వేదన గల్గును మిక్కుటంబుగన్ 57
పౌరు లెదు రేఁగ కుండ న
గౌరవమున నాచరింపకయు నెట్టి నమ
స్కారమ్ములు నిలువన్ ధి
క్కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్ 56
కారు విరోధు లూన మమ కారము సైపఁగఁ జాలరే తిర
స్కారము లిత్తు రెల్లరును శాపము లత్తరి వీడ లే రహం
కారము నిర్జి తేంద్రియులుఁ గౌశిక ముఖ్యులు నప్సరో జ నా
కారముఁ గాంచి నంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్ 55
అంగాంగ వైభవమ్ముల
మంగలవారి నరయంగ మాన్యుఁడు సుమ్మీ
యంగన వచింతు నిక్కము
మంగల! వాఁడే పతి యగు మానుము దిగులున్ 54
అంగజ తుల్య సుందరత రాస్యుఁడు ధీనిధి సర్వ శాస్త్ర పా
రంగతుఁ డుత్తముండు నిను లాలన సేయుచుఁ బ్రేమగా ని జో
త్సంగము నందు నిల్పి కను సచ్చరితుండు తిరస్కృతాన్య భా
మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖ మిఁకం దలోదరీ 53
[భామను + కలవాఁడె = భామం గలవాఁడె]
బంధు జనము లన్న బంధమ్ము మిన్న కా
లు నిలువ దొక చోట వనిత కెప్డు
చుట్టములను బ్రీతిఁ జూడఁగ నీదు మే
నత్త తిరిగి వచ్చె నాలు గూళ్లు 52
ఉత్తల మయ్యె లోకులకు నోర్వగ లేక మహానలమ్మునుం
దత్తఱ మంద జంతువులు ధారుణి వాయువు రేఁగినంత న
త్యుత్తమ సుప్రచండ పవనోద్ధృత దుర్భర వేగ ధాటి కా
నత్త రయంబునం దిరిగె నాలుగు గ్రామము లొక్క జామునన్ 51
బిడియ మెక్కువ నారికి జడియుఁ దిరుగ
నలుగు రున్న జగము లందుఁ దొలఁగు నన్య
పురుషులను గాంచి నంతనె పువ్వుఁ బోఁడి
చూడ నేఁగును సిగ్గిలి చూడ దయ్యొ 50
కూడదు నమ్మ బోటులను కొమ్మలు చంచల చిత్త లౌదురే
యాడఁగ నేఁగు సిగ్గు పడి యాడదు యాడక యుండ లే ననుం
బాడఁగ నేఁగు సిగ్గు పడి పాడదు పాడక యుండ లే ననుం
జూడఁగ నేఁగు సిగ్గుపడి చూడదు చూడక యుండ లే ననున్ 49
మచ్చ యొక్కని కుండంగ మధ్య మందుఁ
గాయ మక్కట కరువయ్యెఁ గంతునకును
వింత వారి గణించిన వెఱ్ఱితనమె
వికృత రూపముల్ గలవారు విధుఁడు మరుఁడు 48
ధగ ధగ కాంతు లీను నిజ దర్శన సుందర భర్మ వర్ణ దే
హి గురు విధేయు శక్ర జలధీశ యమానల బృంద సన్ను తే
ద్ధ గుణ గణాఢ్య పూరుషునిఁ దన్నిష ధేశు నలాఖ్యుఁ గాంచినన్
మిగుల వికార రూపులని మెచ్చరు కంతు జయంతుఁ జంద్రునిన్ 47
కులపు గొప్ప నెంచి కుజను లొనర్చు పొ
గడ్తల కెద నుబ్బి గర్వ మంది
టక్కరుల కొసంగ డబ్బును గపటంపుఁ
బరువుఁ దీయువారె బంధు హితులు 46
గురుతర కష్ట మేర్పడఁగఁ గో యన వెన్కకుఁ జూడకుండఁగాఁ
బరువును దీయువారలె? శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్
గురుతర కష్టమేర్పడఁగఁ గూర్మినిఁ గావఁగ సత్వరమ్ముగాఁ
బరువును దీయు వారలె శుభంబును గూర్చు హితుల్ సుబాంధవుల్ 45
[పరువు = పరుగు]
స కృపఁ గందు సహోదరి స తత మిల స
హోదరి యగును లక్ష్మి సహోదరిఁ గనఁ
దన కిడ సిరి రమా సహోదరి తొలఁగు ము
రియుచు శశి సహోదరి యలరి సిరు లొసఁగు 44
పొళ్లుగఁ జేసికొనఁ దినఁగ
నోళ్లూరును సున్నితముగ నూరినచో నం
గళ్లను గొని సన్నగ, వేఁ
పుళ్ల కు కారమ్మె మేలు, పూఁతగ నద్దన్ 43
నోళ్లను గాఱు చొంగయె యనూహ్య రుచుల్ పరగంగఁ జేర వా
కిళ్లను వాసనల్ దనర గీర్పతి కైనను వజ్రి కైన నం
గళ్లను విక్రయింపఁ దగుఁ గమ్మని మాషపుఁ గంది పప్పు దం
పుళ్ల కు నుప్పు కారములఁ బూతగ నద్దిన మేలు గల్గెడిన్ 42
[పూతగ = పూచునట్లు]
బళ్లను నేర్ప నట్టివి యబద్ధము లైనవి చెప్పు కొన్నిటిన్
నుళ్ల ననంగఁ బల్కెను ఘనుండు నొకం డపు డివ్విధమ్మునన్
గోళ్లను గీఱ నేర్పడఁగ ఘోరపు రీతిని దేహ మందు నా
పుళ్ల కు నుప్పు కారములఁ బూఁతగ నద్దిన మేలు గల్గెడిన్ 41
పల్గుణా ప్రాణులకు నెల్లఁ గల్గఁ జేయు
సుఖము ననిశమ్ము పిన తండ్రి సుమ్ము మనకు
వాయు దేవు నేరు మనుచుఁ బలికె నింక
ధర్మజుం డాంజనేయుని తండ్రియె కద 40
ధర్మజ వాయు తచ్ఛకుని తండము ద్వాపర సుప్ర సిద్ధమే
ధర్మయు తాక్ష , చాలన, కుతంత్ర కళా కలి తాక్ష లోభ వ
త్కర్మ రతాంతరంగ సు వికాసులు మువ్వు రహో క్రమమ్మునన్
ధర్మజుఁ డాంజనేయునకుఁ దండ్రి సుయోధను మేనమామయున్ 39
ఘన దీర్ఘ బాహు రక్షిత
వనస్థ బంధన చతుర కబంధ మహా దై
త్యునిఁ బద సానన కుక్ష్యం
త నయనుఁ బరిమార్చి జనుల దైవంబయ్యెన్ 38
ఘనముగ ఘోర దైత్య లయ కార్యము లిట్లు దొడంగెఁ జేయఁగాఁ
జను గవ పాలు త్రాగెడు మిషం గొని లీలగఁ బ్రాణ వాయువుల్
మును మును బాలకృష్ణుఁ డల పూతన బాల గణఘ్న రాక్షసీ
తనయనుఁ జంపి లోకులకుఁ దద్దయు మేలొనరించె దేవుఁడై 37
కారణము లెన్ని చెప్పిన
దారుణ కృత్యమ్ము లంచుఁ దద్దయు వారిన్
ఘోరముగఁ జీత్కరించిరి
జారుల కృత్యములఁ గని సుజనులు మురిసిరే? 36
తార త రావధారణ విదారిత భీత మనో వికార ధై
ర్యోరు పరాక్ర మావృత మహోన్నత నైపుణ యుక్త సంత తో
దార విహార సార జన తారక కారణ కార్య దీక్షతోఁ
జారుల నిత్య కృత్యములు సజ్జన మోదముఁ గూర్పకుండునే 35
[దీక్షతోన్ + చారుల = దీక్షతోఁ జారుల]
ఈ పత్రం బట మం దగు
వే పోవును బాధ యెల్ల వీనినిఁ దినినన్
సైఁప నిఁకఁ నిది కరము లా
వేఁ పాకుల పచ్చడిఁ దిన వేడ్క జనించెన్ 34
[లావు + ఏఁపు + ఆకుల = లావేఁపాకుల; ఏఁపు = బాధ;
కరము లావు, ఏఁపు వ్యస్త పదములు కాన
టు గాగమమునకుఁ దావు లేదు]
ఓపం జాలదు గుండె నెయ్యి దినఁగా నొక్కింతయే నన్న! సం
తాపాంభోధిని ముంచుఁ జక్కెర తమిం దాఁ గొన్న నట్లన్న! ఘో
రాపన్నం బట యుప్పు దిన్న నిఁకఁ బ్రాణాపాయమే యన్న! నా
వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్ 33
వింత యౌను వీక్షింపఁగఁ గంతు లీల
వాని నోడింపఁ దర మౌనె మౌని కైన
గాధి తనయుండు దుర్భర కామ తప్తుఁ
డింతినిం గౌఁగిలించె మునీంద్రుఁ డకట 32
దాంతుఁడు భూసురేంద్రుఁడు నితాంత తపో మహి మాన్వితుండునున్
సంతస మంది సేవలకు సంయమి చంద్రుఁడు డెంద మందు ని
శ్చింతను సత్యరుంధతి వసిష్ఠుఁడు దార సతీ మతల్లి నా
యింతినిఁ గౌఁగిలించెను జితేంద్రియుఁడైన మునీంద్రుఁ డక్కటా 31
ఆతత సేవా నిరతిన్
సీతారామ చరణములు సేవింపంగన్
నీ తను వుండ బుధుండవు
స్వాతంత్ర్యము దొరికె విడువ వా దాస్యంబున్ 30
[విడువవు +ఆ దాస్యంబున్ ]
త్రాతల్ భూమిని లేరె దేశమును సంరక్షింపఁ బాలింపఁ ద
న్నేతృవ్రాతము శాస నాలయములన్ నిత్యమ్ము పౌరాళికిన్
వ్రాతల్ మారవు తాత తండ్రులది పారంపర్య మేపారఁగా
స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్ 29
శున కోత్సవ మచ్చోటం
దనరఁగఁ జిత్రాతి చిత్ర తను కాంతులతో
ఘనతర దర్శన కేళిన్
శునకమ్ములు పువ్వులయ్యెఁ జోద్యము గాదే 28
ఘనుఁ డా సుందరుఁ డేఁగ మిత్రుని లసత్కల్యాణముం గాంచఁగా
వనితా రత్నము లొక్కచోఁ గలిసి సంభాషించుచుం జెల్గఁగా
వనజా తాయత లోచనవ్రజము భాస్వత్తప్త జాంబూన దాం
శున కమ్ముల్! గనఁ బువ్వులయ్యెను గదా చోద్యమ్మె ముమ్మాటికిన్ 27
[జాంబూన దాంశునకు + అమ్ముల్; అమ్ముల్ =అమ్మాయిలు]
ఏ కాల మందయిన ము
ప్పోకల మూఁగకు నుడివి నపుడు నాలుక పైఁ
బ్రాకటముగ వాక్కులు నా
నూకలు నానుటకు వలయు నూఱు యుగమ్ముల్ 26
వాకులు తాఁకఁ జిత్తమును బాటున కేర్పడ మచ్చ లచ్చటం
బోకకుఁ బట్టు నేండ్లు శతముల్ ధరలోన నదెట్టు లన్నచో
వాకిలి లోనఁ జల్లగను బాఱఁగఁ దప్త దృఢాయసంపుఁ బె
న్నూకలు నాని పోవుటకు నూఱు యుగమ్ముల కాల మయ్యెడిన్ 25
అమరద్విష భస్మాసురు
ని మనం బెఱిఁగి శివుఁ డసమ నేత్రుం డకటా
కుములుచు వ్యర్థంబౌ వా
క్సమరమ్మును వీడి శూలి చయ్యనఁ బాఱెన్ 24
విమల యశస్వి ఫల్గుణుఁడు వే చెలరేఁగఁగ భండనోగ్ర భూ
గమన విశారదుండు దృఢ కాయుఁడు గాంచిన భీకరారి రా
డ్భ్రమ నర గాండివచ్యుత సుపర్వ వితాన విఘాత సైన్యమున్
సమరము మాని శూలి రభసమ్మునఁ బాఱెను బ్రాణ రక్షకై 23
[శూలి = శూలము ధరించిన యొకానొక కౌరవ వీరుఁడు]
అమ్మ - కొమ్మ - నిమ్మ – బొమ్మ అన్యార్థంలో భారతార్థంలో.
అమ్మగువ నిటకుఁ బిలువం
బొమ్మను రానిమ్మను ననఁ బోడిని సభకున్
నెమ్మిఁ గర మందు కొమ్మను
మిమ్మను జాధీశుని తొడ నెక్కఁగ నిమ్మా 22
పుడమి నాంధ్ర భాషను నిజ భుజము పైనఁ
దాల్చి వ్యాకరణమును సంధానము నొన
రించి పెంచి పోషింపఁగ మించి పూర్వ
మాంధ్రభోజుఁడు నన్నయ్య యనుట నిజము 21
[భా + ఉ + జుఁడు =భోజుఁడు; భా = ప్రకాశము; ఉ =బ్రహ్మ;
ఆంధ్ర భాషా కాంతి తోఁ బ్రకాశించు బ్రాహ్మణుఁడు ]
చిన్నమ ముద్దు పెన్మిటి విశేష బలాఢ్యఁడు కృష్ణ దేవ రా
డున్నత రాజ సత్తముఁడు నూర్జిత నిర్ణయుఁ డుత్సహించి పె
ద్దన్నను బిల్చి విప్ర వర! తద్ద యెలుంగున నీవు పేర్మినిన్
న న్నయ! యాంధ్రభోజుఁ డనినన్ సరి యంచును మెచ్చి రెల్లరున్ 20
[నన్ను + అయ = నన్నయ]
పెండ్లి సేసిరి తెలియక వీని తోడఁ
బెద్ద లప్పుడు గొప్పగఁ బిదప సత్య
మెల్లఁ దెలిసె నా కకట గా దెన్నఁడు మగఁ
డుత్తముఁ డని విడాకుల నువిద గోరె 19
ఉత్తల మాయె మొత్త మట నుత్తినె విత్తిరి సందియంపుఁ బె
న్విత్తన మిత్తలోదరికి నెమ్మదిఁ గ్రొత్తగ నిత్తె మందఁగాఁ
తత్తర పాటు చిత్తమునఁ దత్తరుణీమణి కాదు నా మగం
డుత్తముఁ డంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్ 18
ఇత్తరి వీరి లోన మఱి యెవ్వరు మారిరి యొక్క యేఁటిలోఁ
గ్రొత్తఁ దనమ్ము పూరుషులకుం గర మిష్టమ చంచలమ్ములా
చిత్తము లాడు వారి కిలఁ జెప్పు మొకప్పుడు తానె నా మగం
డుత్తముఁ డంచుఁ బేర్కొని యయో సతి గోరుకొనెన్ విడాకులన్ 17
అరి భయంకరు ఘను నమర నదీ సుతు
వీత శస్త్రుఁ జేసి భీష్ము నని శి
ఖండి దర్శనమ్ము కాలు నింటికి నంపె
మరుని కంటిమంట మాడ్చె శివుని 16
కదలని కోట యున్న దని గాఢ నివాతము చిప్ప పెట్టెయుం
బదిల మొసంగుఁ దప్ప కని పంతము నూని మనమ్ము నందుఁ దా
బెదరక నిల్వ దర్పమున భీష్ముని భస్మ తనూ కృతజ్వల
న్మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్ 15
[త్రినేత్రుఁడు = కొబ్బరికాయ]
తమ నెలవుల నుండి తలిరుఁబో ళ్లేతెంచ
నొక్క చోటి కప్పు డక్కజముగఁ
బల్కె నొక్కఁ డిట్లు పన్నుగ వినఁబడ
జమునఁ జూడ విజయ శాంతి దక్కె 14
కుములుచు నిక్కుపాటులను గ్రుంకుచు మిక్కుట మెల్ల కోపులం
దమిఁ జని యేటి కింపుగఁ గతల్ విని బత్తి మునింగి నంతటన్
గము లయి వచ్చె సొమ్ములు దగన్ వడిఁ బట్టిన యెల్ల తావులన్
జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్ 13
జన సంచయమ్మునకు మే
లొనరు పనులఁ జేయు వారు నొప్పుగ నింకన్
మన శాస్త్రచ యోక్తము పా
వన ధర్మముఁ బూను జనులు భాగ్యముఁ గనరే 12
వనజాతాసన వాస వాది వర దేవవ్రాతముం బ్రీతిఁ గొ
ల్చిన నేపారెడు పుణ్య మబ్బును ధరన్ శ్రేష్ఠమ్ముగా నమ్ము పూ
సిన వృక్షమ్ముల నెల్లఁ గూడి పశు పక్షివ్రాత సంపోష ణా
వన ధర్మమ్మును బూన లోకులకు సౌభాగ్యమ్ము ప్రాప్తించులే 11
కతిపయ దినంబులు మహో
న్నత రీతిఁ బ్రియములు వల్కి నటియించుచు మి
త్రత వర్తిల్లు నరాధము
లతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్ 10
సతతము గౌరవం బిడుట సచ్చరి తాంధ్రుల లక్షణంబునై
నుత జన సమ్మతం బయి మనోహరమై విలసిల్ల ధాత్రిలో
వితత దురాప వాదములు ద్వేష గుణమ్మున రేఁగు చుండఁగా
నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రుల లక్షణమందు రెల్లెడన్ 9
అన్నుల మిన్నలు నన్నిటఁ
గన్నఁ గడింది పొగడంగఁ గమనీయముగాఁ
గ్రన్నన దారము, నేలను
దున్నను, సూచీబిలమునఁ దూర్చెదఁ గనుమా 8
ఎన్నఁడు పొల్లు వోదు సుమి యే నిడ మాటను భూమి క్రుంగినన్
మిన్నది నేలఁ గూలినను మిత్ర శశాంకులు దారి తప్పినం
గ్రన్నన నేఁగి మీ రిభ నికాశముఁ దెండిట కగ్గి పెట్టెపై
దున్నను సూది బెజ్జమునఁ దూర్చెద మీరలు మెచ్చు రీతిగన్ 7
పట్టీ వినుమా ముట్టఁగ
గట్టును బంతమ్ము పట్టు గట్టిగ నీ వి
ప్పట్టున నెట్టన నీ కెదఁ
దట్టెడు పద్యమ్ము చాలు తట్టె డవేలా? 6
[తట్టెడు = తోఁచెడు]
రాట్టులఁ బట్టి దట్టముగ రంగుల నెట్టెము చుట్టి యుండఁగా
కట్టెదుటం బొగడ్తలను గ్రమ్మఁగఁ జేయఁగ మోక్ష మెట్టులౌ
ముట్ట నెడంద హత్తుకొని మోక్షము చూపెడు, వాక్కు లేలనో
తట్టెడు, పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో 5
అవనత వదనులు పర ద
ర్ప వినాశకు లగ్ని నిభులు వన మేఁగఁగఁ బాం
డవ పంచ కౌఘమున నరుఁ
డెవఁడే యెవ్వఁడె యెవాఁడె యెవ్వఁడె యెవఁడే 4
భువి రాజిల్లిన శక్ర సన్నిభ మహా పుణ్యాత్ములే సద్యశ
శ్ఛవి మద్గాత్రులు ధర్మ తత్పరు లిలన్ షట్చక్రవర్త్యావలి
ప్రవరల్ సెప్పుమ సారసాక్షి కని చిత్రం బింపుగా నెచ్చెలీ
యెవఁడే యెవ్వఁడె యెవ్వఁడే యెవఁడె తా నెవ్వాఁడె యెవ్వండొకో 3
మూర్ఖు నొప్పింప శక్యంబె పుడమి లోన
వేగ వార్నిధి జలమెల్లఁ ద్రాగ వచ్చుఁ
గేళిఁ దారల నెల్ల లెక్కింప వచ్చు
గరికపోచతో నేన్గును గట్టవచ్చు 2
జలనిధి సప్త వేష్టిత విశాల ధరాతల సాద్రి వృక్షముల్
వెలసిన నైనఁ దూఁపఁగను విష్ణుని సాధ్యము కాక యున్ననుం
దులసి దళమ్ముతో హరినిఁ దూచెనె రుక్మిణి భక్తి మీఱినం
బొలఁతి! నిజం బిదే గరిక పోచయె చాలును గట్ట నేనుఁగున్ 1