గుణమున్ సంధించి యమర
గణార్థము సుమాస్త్ర మేయఁ గాముఁ డకట కా
రణ కారణమ్ము ప్రమథుల
గణపతి నేత్రాగ్ని గాల్చెఁ గాముని నయ్యో 60
గణిత తపో నిరంతర వికాసు నుమా విర హాగ్ని తప్త ని
ర్గుణ సగుణాత్మ చిన్మయుని రుద్ర గ ణాద్యుని నుల్లసత్ఫణా
ఫణి వర హార సల్లస దపాంగుని, పుట్టక మున్న యమ్మహా
గణపతి, కంటిమంటలకుఁ గాముఁడు బూడిద యయ్యె నయ్యయో 59
వారక తిరిగి తిరిగి యా
వారిధి నొడ్డాణ మనఁగఁ బన్నుగఁ జెలఁగం
బేరిమి మందర గిరి కొని
దారుణ సర్పముఁ గనుఁడు సుధల్ వెలి గ్రక్కెన్ 58
దారగ ధర్మమే యనుచు దైత్య కులోద్భవ రాజ కోటికిం
గోరిన స్త్రీల నెల్లరను గొంకక పొందుట సర్వ నిర్జరౌ
ఘారి వచించె నౌర జనకాత్మజతో ఘన రాజనీతినిన్
దారుణ కృష్ణసర్పము సుధల్ వెలి గ్రక్కుచునుండెఁ జూడరే 57
మగువలకు భర్త మెచ్చం
గఁ గలుగు నట సంతసమ్ము కర మెద నంద
మ్ముగ నచ్చు విధమ్ముగఁ దన
మగనికిఁ గట్టినది చీర మహిళ మురియుచున్ 56
పగులును మాన మంచు మది భావనఁ జేయుచు నెవ్వ రేనియుం
దగ దని మాన వచ్చు మఱి దానిని మానఁడు నూన నెన్నఁడుం
దగ ధరియింప భద్ర మిడు దైవము దానిని హస్త సూత్రమున్
మగనికిఁ జీరఁ గట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్ 55
[చీరన్ = పిలువఁగ ]
జనక వాక్యములను జక్కఁగఁ బాలించు
వాఁడు ధర్మ మెంచు వాఁడు సతము
సత్య విక్రముండు సద్గుణ నిధి రామ
చంద్రుఁ డొకఁడె కనఁగ సత్య వాక్కు 54
మంద్రస్వాన వచో విరాజి జన సంభావ్యుండు సత్కీర్తి రా
జేంద్రశ్రేణి కరార్చితాంఘ్రి యుగ భూమీశుండు రాకా శర
చ్చంద్రాభానన సుప్రసిద్ధ పర మేక్ష్వా కూద్వహుం డా హరి
శ్చంద్రుం డొక్కఁడె సత్యవాక్కనఁగఁ బ్రాశస్త్యమ్ము నందెన్ భువిన్ 53
అనవలె మదరాసున కెన్ని యంచు వాక్య
మందు వ్యాకరణము గాంచ నుంది చిన్న
తప్పు చిన్నయ సూరి మతమ్ము నెంచ
చెన్నపురి నుండి మదరాసు కెన్ని మైళ్ళు 52
చెన్నయి నుండి మిత్రవర చెన్నుగ నామదరాసు దూరమే
యెన్నఁగ నెంతొ యంతియ వచింపఁగఁ దల్చిన నీకు నిక్కమున్
నన్నడు గంగ నీ విటుల నా బదు లయ్యది తృప్తి నందితే
క్రన్ననఁ జెప్పుమయ్య మదరాసుకు చెన్నయి యెంత దూరమో 51
కలుషి తాత్మున కక్రమ కార్య రత మ
నో వికారున కార్త వినోదికి సత
తానృత వచనునకు నిజ హస్త యుగళ
కవికి గౌరవ మిడుట మూర్ఖత్వ మగును 50
[హస్త యుగళ కవి = రెండు చేతుల సంకెళ్లు కలవాఁడు]
భువిలో నుండిన మాన వోత్తములనుం బోనాడి చేపట్టినం
గవితా కన్య నపాత్ర దాన గత సంకల్పమ్ముఁ గావ్యాక్షర
చ్ఛవినిన్ నేరని విత్త దర్పునకు భాషాద్వేషి కింతేనియుం
గవికిన్, గౌరవ మిచ్చుటన్నఁ గన, మూర్ఖత్వమ్మె ముమ్మాటికిన్ 49
భక్తగణ రక్షకుండు కృపా రసేక్ష
ణుండు దుష్ట సంచయ శిక్షకుండు కృష్ణుఁ
డోర్వకయె విలపింప దుర్యోధనుండు
కర్ణుఁ డిచ్చె ద్రౌపదికిఁ గోకలను దయను 48
నాక ధరాత లాశ్రిత జనవ్రజ దుఃఖ మహాబ్ధి దాటఁగా
నౌకకు వాసుదేవుఁడు ఘనమ్ముగ కర్ణము కాఁగఁ గర్ణుఁడం
బ్రాకట నాముఁ డయ్యె నిల భామ సభక్తి నుతింప నార్తినిం
గోకలు ద్రౌపదీ సతికిఁ గోర్కె నొసంగెను కర్ణుఁ డొప్పుగన్ 47
[సహజ కర్ణకుండలములతోఁ బుట్టి నందుకు వసుసేనుఁడు కర్ణుఁడు కాఁగ
దుఃఖాబ్ధి తరణమునకుఁ గర్ణము కాఁగ కృష్ణుఁడు కర్ణుఁ డుగుట సమంజసమే కదా. ]
పెల్లుగ మృగ జాలము విలసిల్లు ఘోర
కాననము నందు నొక్కెడఁ గానఁ బడఁగ
భీతి గొల్పెడు మృగ రాజు జాతి నరయఁ
బిల్లి పోరాటమునఁ జంపెఁ బెద్దపులిని 46
ఝల్లనఁ జూచు వారలకు జాఱఁగ గుండెలు సంభ్రమించి కం
పిల్ల ధరాతలం బుఱికి పెన్నిశి తాయుధ మూని చేతిలోఁ
దల్లడ మంద కింతయును ధైర్యము నూని యెడంద నంత ఱం
పిల్లి దురంబునం దునిమె పెద్దపులిం గడు విక్రమించుచున్ 45
[ఱంపిల్లు = విజృంభించు]
పావన చరితం బలరఁగఁ
దా వీడి ధనాశ నెల్లఁ దన సొమ్ములనే,
యావల భద్రముగ నునిచి
దేవుని సొమ్ముఁ, దిను వానిదే భక్తి యగున్ 44
ఈ వలెఁ దోయమో ఫలమొ యింపుగఁ బుష్పమొ పత్ర మైననున్
దేవునిఁ జూడ సొమ్ము లట దేవునిఁ గొల్చుట కైన సొమ్ములే
దేవుఁడు నయ్యెఁ బెట్టుబడి దేవుఁడు పణ్యము నయ్యె నిక్కలిన్
దేవుని సొమ్ము నంతయునుఁ దేరగ దోఁచెడి వాఁడె భక్తుఁడౌ 43
[భక్తుఁడు = భాగము కలవాఁడు; భక్తము = భాగము]
పుణ్యావశేష మహిమను
గణ్య సుపాచనము వేగ కావింపఁగఁ గా
రుణ్య రహితుఁ గ్రూరు, విడిచి
పుణ్యాత్మునిఁ, జంపి పాపి పొందెను ముక్తిన్ 42
గణ్యంపుం గ్రతు సంచయమ్ము నటఁ దాఁ గావించి విశ్వమ్ము బ్రా
హ్మణ్యశ్రేష్ఠ మరీచి సూనునకు నీయన్ యుద్ధ విద్యాగ్ర్య నై
పుణ్యుం డుత్తమ విక్రముండు పగతో భూనాథ కోటిన్ వినా
పుణ్యాత్మున్ వధియించి పాపి తుదకుం బొందెన్ గదా ముక్తినే 41
తనదు భర్త పైననె కాదు ధాత్రి లోన
సత్యము వచింతు నిట్లు నిస్సంశయము వి
నుండు యుక్తానురాగము నిండి నట్టి
కోడలికి నత్త సన్నిధిం గోపమె నగ 40
పాప విహీన భావ చయ భాసిత కార్య నికాయ మగ్న సం
స్థాపిత శుద్ధ చిత్త నిజ మాతృ దృగంచిత భక్తి యుక్త ని
స్తాప నితాంత సద్వినయ శాంత గుణద్యుతి యుక్త నిత్య ని
ష్కోపమె భూషణమ్మగును గోడలికిం దన యత్త సన్నిధిన్ 39
భీతి నైన తనదు పేరాస నైనను
మెప్పు కొఱకు నైన ముప్పు నెంచి
యెవ్వ రైన నేమి యీతని వీక్షించి
పండితుఁ డనఁ దప్పుఁ బలుకు వాఁడె 38
పాటున కోర్చి తర్కమును బన్నుగఁ జేసి సు నిశ్చితాత్ముఁడై
పాటవ మొప్ప నే నరుని పక్షము నూనక యాలకించుచున్
మాటల నందు నొప్పయిన మాటల నొప్పుగఁ జెప్పి తప్పులౌ
మాటలఁ దప్పుగాఁ బలుకు మానవుఁడే కద పండితుం డనన్ 37
ఘోరము బాలుర దాచిన
నేరం బర్హ మగుఁ బుడమినిన్ శిక్షలకున్
నేరక యుంచినఁ దమకుం
దా రా పుత్రుల విడుచుటె ధర్మము గృహికిన్ 36
పోరాటమ్ములు సాగు చుండును సతమ్మున్ భూ ధన శ్రేణికిన్
వీరావేశము తోడ జీవన మహో విశ్వంబులో నిత్యమే
రారే వెంటఁ దలంప నెవ్వరును గాలం బేఁగుదెంచన్ ధరన్
దారాపుత్రుల వీడిపోవుటె గదా ధర్మంబు సంసారికిన్ 35
క్రుంకును జిత్తము లోపల
జంకక యేమి పలికినను జంచల నయనల్
వంకలు పెట్టు సతము ని
శ్శంకలు లేనట్టివాఁడు సరసుండగునే? 34
చంకను వెల్గు బాలకుఁడు చక్కఁగ సుందరి బుగ్గ గిల్లినం
బెంకులు దద్దరిల్లఁగను బెద్దగ నేడ్వక యుండ నేర్చునే
కంకకు కొంచె మైన రసికత్వము డెందము నందు, వీడుమా
శంకలు, లేనివాఁడు సరసంబు నెఱుంగునె మోద మందునే? 33
నీమము గీమము లేదని
రాముని తమ్ముఁడు ఘనుండు లక్ష్మణుఁడే, ని
ష్కాముఁడు శాంతము నూనఁగ
రాముఁడు, గ్రోధము వహించె రాజ్యము వోవన్ 32
కామిత లబ్ధ కైకయినిఁ గాంచిన భండన రంగ విక్రమో
ద్దాముఁడు భాతృ వత్సలుఁడు దండ ధరాభుఁడు రక్త నేత్రుఁడున్
భీమ బలుండు లక్ష్మణుఁడు విస్తృత సంతత సేవి తోల్లస
ద్రాముఁడు గ్రోధ మందె మది రాజ్యము దక్కక జాఱి పోవఁగన్ 31
కవనమ్ము లందుఁ గాంచమె
కవి సంచయ వర్ణనములు కాంతల యెడ రే
పవ లెడయికం గుముద బాం
ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్ 30
ఉవిదకు స్వీయ భర్త పయి నున్నత భావము నిత్య ముంట యీ
భువి సహజమ్ము సుమ్ము పతి పూజ్యుఁడు ధర్మము నెంచి చూడఁగా
నెవరిని నైన గౌరవము నీయక మిక్కిలి కించ పర్చినన్
ధవునిఁ, బరాభవించుటయె ధర్మము సాధ్వికిఁ దప్పు లేదిలన్ 29
దయతో వేటకు నాయుధ
చయ విస్తారమ్ముగా ససైన్యము, పౌర
క్షయమున కెడంద మిక్కిలి
భయపడి, పాఱిన ప్రభువును బ్రజ మెచ్చుకొనెన్ 28
భయ మన నేరఁ డెన్నఁడును భండన దుర్జయుఁ డంచుఁ బల్కుచున్
రయమునఁ గూలఁగా నిజ బలం బని బొందినిఁ బ్రాణ ముంట సం
దియ మయి దాడి సేయ నరు దెంచిన శత్రువె యిట్టి ఱేనికిన్
భయపడి రాజ్యమున్ విడిచి పాఱిన, రాజును మెచ్చి రెల్లరున్ 27
ఎడఁ గనఁడు తాను దూఱంగ మెడకు డోల?
తిండి పెట్ట లేఁడు కడుపు నిండుగ నన
నగల మాట లేలయ్య కన్యామణులను
దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు 26
మీనము మేషముల్ దలఁప మేలొడఁ గూడునె రోగి కెన్నఁడుం
గాన నెఱింగి చక్కగను గార్యము సేయ ఫలమ్ము దక్కదే
నేను దలంతు వే కడుపు నిండుగ నన్నము నీక పైడినిన్
దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్ 25
తరుణం బిట నేతెంచెను
బురుషర్షభు లార సిద్ధముగ నుందు మనన్
మరణింప వధింప నకట
గరళము గఱవయ్యె లేదు ఖడ్గం బైనన్ 24
కరి గంధర్వ శతాంగ సద్భట గణోగ్రవ్యూఢ మొక్కమ్మడిం
బరివా రార్భక సంచ యోక్ష గణ గో వ్రాతమ్ము భీతిల్లఁగా
నరి సందోహము మార్కొనంగ నిట మూయం గొట్టఁగా ధిక్సుభా
గరళమ్మే కఱవయ్యెనే యకట ఖడ్గంబైన లేదయ్యెనే 23
[ధిక్ +సుభాక్ + అరళము = ధిక్సుభా గరళము ; అరళము = తలుపు]
మతము నిత్య మొసఁగ వలె మంచి బుద్ధి
మానవత్వమ్ముఁ జూపించు మతము మతము
తన మతమ్మును నమ్మక దర్ప మూని
పర మతమ్మును దూషించు వాఁడె బుధుఁడు? 22
పరమ పదంపుఁ బ్రాప్తికి శుభప్రద మార్గ నిదేశ పాట వా
క్షర విలసన్మతం బగును సన్నుత యోగ్యము సంతతమ్ము భీ
కర నృబలి క్రియా నిచయ కల్మష కారక నిష్ప్రభా ప రా
పర మత దూషణోత్సుకుఁడె వాసి గడించు బుధుండుగన్ సదా 21
వడివడి పర్విడి ముద్దుగ
నుడువులు కొన్ని వచియించి నోరారఁ దగం
గొడు కిట్లనెఁ దాఁ దినుటకుఁ
గుడుముల రోసి గజ ముఖుఁడు గోరెన్ రొట్టెల్ 20
అడరుచు లోకు లెల్లరు సు రార్చన లందు నొసంగరే భుజిం
చెడి నిజ భోజనమ్మును విశేషము గా నమ రాలి కింపుగాఁ
గడఁగి చరించు విశ్వమునఁ గానని దేశము తిండి యుండునే
కుడుముల రోసి విఘ్నపతి గోరెను పశ్చిమ దేశ భక్ష్య ముల్ 19
అర్ణవ గంభీర ధవళ
వర్ణుఁడు గంధర్వ రాజు ప్రధన కళా సం
పూర్ణుండును విద్రావిత
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్ 18
కర్ణ విహీన వారిరథ కాంతుఁడు కారణ సంభవుండు ద్వే
షార్ణవ పూర్ణ చంద్ర సదృ శాత్మ హి తాకృతి వైరి పోసి సం
పూర్ణ ధరా తలాక్రమణ పూర్ణ మనోరథ వహ్ని కాజ్యముం
గర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవ రాజు గుందఁగన్ 17
కలుగునె భాషానందము
విలువలు వర్ధిల్లునే వివేక మడరునే
యిలఁ గన విన్నను వ్రాసినఁ
జలిలోఁ జెలి గౌఁగిలింత సంతాపమిడెన్ 16
తెలవాఱెం గడు వ్యర్థ పూరణము లేతేరంగ దిగ్భ్రాంతినిం
గలుగం నేర్చునె సత్కవిప్రవర సంఘాతాత్మ సంతృప్తి వి
హ్వల చిత్తస్థిత తప్త మర్త్యునకు దుర్వారవ్యథా భూతమే
చలి వేళన్ జెలి గౌఁగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా 15
ఆతత పావన వర్తన
భాతిని సావిత్రి వంటి భామామణులే
ప్రీతిని సుగతులు, సూపుచుఁ
బాతివ్రత్యము, న విటులఁ బైకొంద్రు సతుల్ 14
[పాతివ్రత్యమును+ అవి + ఇటుల = పాతివ్రత్యము న విటుల]
పాతాళమ్మున కేఁగినం దఱుఁగునే పంచాస్త్రు ప్రాబల్య మే
రీతిం గాంచిన దాని శక్యమె నివారింపన్ నిజాంతఃపు రా
రాతివ్రాత నిభమ్ము మించుచును దారాదేవిఁ గౌటిల్యపుం
బాతివ్రత్యముఁ జూపుచుండి విటులం బైకొందు రబ్జాననల్ 13
[శత సహస్రమున నొక్కరు మాత్రమే యిట్లుండ నోపు.]
వర్తిలి మంత్రిగఁ జిక్కులఁ
గీర్తిత దాసిగ పనులను గేళీ లీలన్
గుర్తున భోజన వేళల
భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్ 12
ఆర్తిని నంద నేల మది నాత్మజు లేమికి సత్య మెంచినం
గీర్తిత శాంత భావ నర కేసరి నత్యనురాగ యుక్త స
ద్వర్తన హర్ష కారకుని ధర్మ ర తాత్ముని స్వీయ పుత్రికా
భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్ల వేళలన్ 11
గురు కృపతో గురు దేవుని
గురు తర మహిమ నిజ శిష్య కోటికి ధరలో
గురు నిందార్థ కలుష వా
గురువును నిందించిన నొనఁగూడును విద్యల్ 10
[వాక్ + ఉరువును = వాగురువును; ఉరువు = విరివి]
గిర లవి యొంటఁబట్టుఁ బరికింపఁగ సద్గురుఁ గొల్చి నప్పుడే
గురువును దైవ తుల్యముగఁ గోరి భజించెద సంతతమ్ము నే
నిరవుగ శ్రద్ధ తోడఁ దగ నిట్లనినం బ్రణుతింతు నింపుగా
గురువును నింద సేయ నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్ 9
[నింద సేయను + ఒనఁగూడును = నింద సేయ నొడఁగూడును]
పనులు సేసి చేసి పద్మ దళాక్షులు
దివస మెల్ల నిచట దిట్టముగను
మీ రలసితి రింక మిక్కటమ్ముగను వి
రతికి సిద్ధపడుడు రమణులార 8
వితతానుగ్రహ యుక్త వీక్షణములన్ వీక్షించు నాదిత్య సే
విత భూతేశునకుం ద్రినేత్రునకు వేవేగంబ కాత్యాయినీ
పతికిం బన్నగ రత్న భూషణునకున్ భద్రమ్ముగా మీరు హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్ 7
వితతంపు ధన వ్యయమౌ
కత కివ్విధిఁ జాలు నయ్య కమనీయముగా
నుత నటు లీ పతి, రామా!,
సతు లిద్దఱు గలుగ మఱొక సతి యేలనయా 6
అద్దిర రామ వింటి నట నబ్బుర మందఁగ విర్గఁ జేసి యె
ప్పొద్దును గాఁగ నీ కవని భూషలు పల్కులు గొప్ప చేతలే
సుద్దులు సెల్గ సత్య సతి చొప్పడ ధర్మము నాఁగ నాతి నీ
కిద్దరు భార్యలున్నను వరించితె వేఱొకతెన్ రఘూద్వహా 5
భాషణప్రియుఁ డాప్తుఁడు వేష భాష
లందు రమణీయుఁడు పుడమి యందు నాదు
ప్రాపున మదీయ మిత్రుఁడు దీపకాంతి
రవి వెలింగెను దూర్పున రాత్రివేళ 4
ఊతము నీయఁ జాగుట కనూరుఁడు కా రథ చోదకుండు సం
ప్రీతి సెలంగఁ బ్రాణులకు వెల్గుల నీయఁగ నిత్య గామియై
యాతత తాప సంయుతుఁడు యామము నర్ధము కాఁగ నేఁగి యా
రాతిరి, చండ భాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై 3
బంధ విమోచనము సు సుత
సంధానము విత్త యోగ సద్గుణ చయ స
త్సంధానము సంతత వీ
తాంధత్వము పుణ్యజన్యమై ప్రాప్తించున్ 2
అంధుల్ గారె నరోత్త మోత్తములు లోలాక్షీ ప్రలోభమ్ముచే
నంధీభూతులె యెంత వారయినఁ గా మాకాంక్ష మీఱంగ దో
రింధానేద్ధ ముఖారవింద పర నారీ లోక వీక్షా నిమి
త్తాంధత్వమ్మది పూర్వజన్మకృత పుణ్యప్రాప్త మూహింపఁగన్ 1
[దోః+ఇంధాన+ఇద్ధ=దోరింధానేద్ధ]