ఏ యెడ నయిన వివాహ
ప్రాయ సముం గైకొనుమ యుపాయము చేతన్
వే యేల మాట లవి పా
పా యసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో 61
ఈయది త్రేత నా యుగమె యెవ్వరు గాంతురు ఋష్యశృంగునిం
దోయజ లోచనుండు దయతో ధరఁ బుట్టునె సంప్రదించి వే
పాయక వైద్య సత్తముని వంధ్యత కింపగు మందు వాడకే
పాయసముం దమిం గొనిన వారికి సంతులు గల్గు టెట్టులో 60
అంబుజ నాభు మహిమ మక
రంబులఁ దారా గ్రహముల రంజిలుచును మో
దంబునఁ గర్కటములతో
నంబరమునఁ జేఁప లీఁదె నందమ్మొలుకన్ 59
చుంబన కేళి సల్పుచును జోద్యమ బంగరు రంగు లీనుచున్
సంబర మంబరమ్మును భృశమ్ముగఁ దాఁకుచు నుండఁ దోఁగి పు
ణ్యాంబువు లందు దోవతిని నాడుచు నుండఁగఁ బాండురంపు నా
యంబర మందుఁ జేఁపలు నయంబుగ నీఁదె మనోహరమ్ముగన్ 58
మండఁగ డెందము నిప్పుల
గుండ మన నశోకుఁడు ఘటికుఁడు నెగ్గిన రా
గండఁడు కలఁతను జూడఁగ
ఖండిత శీర్షములు నవ్వెఁ గదన తలమునన్ 57
మెండుగఁ బొందఁగా జయము మీఱిన యాజిని రత్న మౌళి స
న్మండిత మూర్ధ పంక్తి నర మాన్య ప రార్చిత మస్త రాజముల్
ఖండిత దుఃఖ సంచయము ఖండిత శత్రు శిరో విరాజి తా
ఖండిత శీర్షగుచ్ఛము పకాలున నవ్వెను యుద్ధభూమిలో 56
[విరాజిత + అఖండిత= విరాజి తాఖండిత]
ఇల నెఱుకుల కడ పందులు
కలుఁగుల లోన నెలుకలు నగరుల శునకముల్
కలవా రింటను బిల్లులు
నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్ 55
ఉల్లము తల్లడిల్లఁగ సహోదరు తోడుత జోడు మద్దులై
గొల్లల మందలో నిలువ ఘోరముగాఁ బలు వత్సరమ్ములే
చల్లగఁ జేర రిత్తవడి చాగఁగ నత్తరిఁ బాను పక్కటా
కొల్లలు కొల్లలయ్యె నలకూబరు మంచము నందు నల్లులే 54
సిగ్గె యగును గొప్ప సింగార మువిదకు
సిగ్గులు మొలకెత్త బుగ్గ పైన
ముద మొసంగ నీదు ముద్దు ముక్కు పుడక
నీల మెఱ్ఱవాఱె నీలవేణి 53
నీలము లయ్యె ముత్యములు నీరజ నేత్రు కరమ్ము లందుఁ దా
లీలగ నుంచ రాఘవుఁడు లేమ శిరమ్మున నంత హర్ష క
ల్లోలిత జానకీ సతి శిరో వర దేశము నుండి జాఱఁగా
నీలము లెఱ్ఱవాఱె రమణీ రమణీయ విలాస రేఖలన్ 52
సంతతమ్ము దాను బంత మూని చెలఁగి
వీఁక సందియమ్ము లేక తనదు
నీతి లేమిఁ జూపు హేతువు నెల్ల రూ
ప రహితమ్ము సేయు వాఁడు ఖలుఁడు 51
పర ధన ధాన్య సంపదల పైన మనమ్ము కడింది యుంచి స
త్వరము గ్రహింప వంచనను వానిని యత్న మొనర్చుచున్ నిరం
తర నిజ లాభ కార్య రతిఁ దాలిచి డెందము నందు సజ్జ నా
పర హిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁ డందురే 50
[సజ్జన+అపర హితము = సజ్జ నాపర హితము]
ఇందు వదన సీతను గాంచి డెంద మంద
నింపు రావణు శక్తి గణింప నెంచి
సుందరుం డగు మారుత నందనుండు
కరిముఖుండు వాలమున లంకను దహించె 49
[కరి ముఖుఁడు = కోఁతి ముఖము వాఁడు]
సురుచిర రామభక్తుఁడు వచో నిపుణుండు మనోజవుండు నా
వర ఖర దానవజ్వలిత వాల విరాజితుఁ డాంజనేయుఁడే
హరి కట శంక రాంశునకు నయ్యను జాభున కీయ దీవనల్
కరివదనుండు, వాలమునఁ గాల్చెను లంకను శౌర్యమొప్పఁగన్ 48
వారని దీక్ష వహించి య
పార కవిత్వ సపటుత్వ పద గుంభన మే
పారంగన్ రచియించిన
నీ రస పద్యమ్మె మేలు నిక్కముగఁ గవీ 47
శారద చంద్రికా ధవళ సన్నిభ శుద్ధ దళాంతరమ్మునన్
నీరద వర్ణ తుల్య కమనీయ వరాక్షర రాజితమ్మునౌ
నీ రమణీయ శబ్ద చయ నిర్మిత రమ్య రసీ కృతేద్ధ త
న్నీరసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ 46
నీకు నెఱుక కాదె లోకపు టీ తీరు
చింత సెంద కయ్య సుంత యేని
దుష్టుఁ డగును సఖుఁడు దుష్టున కిలఁ బలు
గాకి నొక్క ఖలుఁడు గౌఁగిలించె 45
ప్రాకట ఖేలనప్రవర రాణ్మణి పైఁ జెలగంగ నాశలే
కూఁకటి వేరునాఁ బరఁగు గొప్ప ప్రవీణుఁడె యోడె నక్కటా
కూఁక సెలంగు నాట వడి గ్రుక్క మరల్పక తద్ద కూయు నా
కాకిని మానవాధముఁడు గౌఁగిటఁ బట్టి రమించె నయ్యయో 44
[రమించు = క్రీడించు]
అన్నారీ రత్న మెలమిఁ
జిన్ని కొమరునిగ మహిమను జేసిన వానిన్
వెన్నునిఁ గని ముద్దుగ ననె
నన్నున్ నగ్నముగఁ గనుట న్యాయమె నీకున్ 43
మృగరాజుతో నొక సింహి పలుకులు:
సన్న వరావలగ్న సువిశాల భుజాంతర సింహరాజమా
సన్నుత విక్ర మోద్ధత లసన్నయనద్వయ భీక రాకృతీ
త్వన్నిల యాగ తైక మృగ తండ నితాంత సమక్ష మందహో
నన్నిటులన్ నయమ్ము విడి నగ్నముగాఁ గన నీకు న్యాయమా 42
ఉఱుకుచు నాత్రమ్ముగఁ దన
కొఱకై విజయమ్ము సేయఁ గోమలి పతికే
వెఱ పెందుకు కాదు కదా
పెఱవానికి సాధ్వి ముద్దు పెట్టెం బ్రేమన్ 41
మాటలు గూడ రాని సుకుమారుఁడు కుల్కుచు వింత వింతగాఁ
బాట లనంగఁ గూఁతలను బన్నుగఁ గూయుచుఁ బూరుషుండు దా
నాటలఁ జెల్గి యంకమున నర్భకుఁ డుండఁగ ముద్దు పట్టికిం
బైఁట చెఱంగుఁ బట్టు పెఱవానికి ముద్దిడె సాధ్వి ప్రేమతోన్ 40
మాట లింపైనచో నూరు మంచి దగును
జేత లింపైనచోఁ గీర్తి సెలఁగు నీకు
నిత్తరిం గరుణా హీన మిట్లు నర్మ
యుక్తముగఁ బల్కు టది సమయోచితమ్మె 39
సూక్తులు సెప్పఁగా వలె నరోత్తమ! పెద్దలు మెచ్చు రీతినిన్
నక్తచర ప్రభావము ఘనమ్ముగఁ గల్గిన యట్లు తోఁపఁగా
రిక్తపు మాట యేల విపరీతపు టాత్రము తోడ నివ్విధిన్
యుక్తము నైన మాట సమయోచిత రీతినిఁ బల్కు టొప్పునే 38
సగణ విగత ధూమపు లీ
జగ దవన పరు లమరులు విచక్షణు లట్లుం
దగ నమృతమ్మును, గోరక
పొగఁ, ద్రాగెడి వాఁడు లోక పూజ్యుం డగురా 37
ముప్పులు మూరి నంతట నమోఘ మెడందఁ బ్రశాంతి కల్గఁగాఁ
దెప్పిఱు దీవు తత్క్షణము తీరు మనోవ్యథ చుట్ట కాల్చినం
జొప్పడఁ గొల్వు చక్కఁగను జుట్టల యంగడి నీకు నివ్విధిం
దప్పక చెప్ప నొప్పుఁ బొగఁ ద్రాగెడి వాఁ డగు లోక పూజ్యుఁడే 36
వచ్చెద మని వక్కాణించి తెచ్చెద మని
మెండుగ బహుమానమ్ముల దండముల నొ
సంగి వాక్రుచ్చి కాంచక ప్రాంగణములు
పర్వదినమున నేడ్పింత్రు బంధు హితుల 35
శర్వుఁడు కాచుఁ గావుతఁ బ్రజా నిచయమ్ముఁ గృపారసేక్షలన్
సర్వ జగత్తు సాధన వశం బగుఁ దత్సముపార్జ నార్థమే
యుర్విని వీరి వారి వని యొక్కొక పేరునఁ బర్వ పంక్తియే
పర్వ దినమ్మటంచుఁ బరివారము బంధుల నేడిపింతురే 34
వాలిన భక్తిని గొలువుమ
యీ లీలను మార్చి మార్చి యీ హరుని హరిన్
వీలుగ ననంతర మిటుల
నీలగళుఁడు హరి శివుండు నీలాంగుండే 33
వ్రా లిట్లుండఁగ సంశయం బగును భావం బందు నిక్కమ్ముగా
నీ లీలం గన స్పష్టమే యగును నీ కిప్పాదమే వింతగా
నీలాంగుండగు విష్ణువే శివునకున్ నీలంపుఁ గంఠం బహో
నీలగ్రీవుఁ డనంగ,విష్ణువె యగున్ నీలాంగుఁ, డాశంభుఁడే 32
[పద విభజన: నీలగ్రీవుఁ డనంగ ౼ఆ శంభుఁడే విష్ణువె యగున్ నీలాంగుఁడు]
ధర్మ మింపుగ రక్షించు ధర్మ మాచ
రింపఁ ద్రికరణ శుద్ధిగఁ జంప కుండ
నరున కజ్ఞాత వాసమునఁ బదిలముగ
శాపమే వరమయ్యెఁ గష్టములఁ దీర్చె 31
శాపగ్రస్తులు గూడ విష్ణు దయనున్ సాధింపఁగా యోగ్యులే
యా పద్మాసను మాన సాత్మజులు వీరావేశులై యంతటం
గోపింపన్ జయఁ డింక నా వి జయుఁడుం గూలంగ శాపాగ్నినిన్
శాపమ్మే వరమయ్యెఁ గష్టములు శశ్వత్సౌఖ్య మందించెలే 30
పర వనితా లోలుఁడు క్రూ
ర రావణుఁడు బల్లిదుఁ డసుర వరుఁడు నిద్రై
క రతుఁ డగు కుంభకర్ణుని
పరనారీ! సోదరుండు పంక్తిముఖుండౌ 29
[పర నారీ = ఓ శ్రేష్ఠ నారీ]
అరి వీరోగ్రుఁడు బ్రహ్మ వంశజుఁడు దైత్యశ్రేణి నాథుండునున్
వర దర్పుండు పులస్త్య పౌత్రుఁడును విశ్వఖ్యాత కామార్తుఁడున్
హర భక్తుం డసురుండు శూర్పణఖ నత్యం తాదరస్ఫూర్తినిం
బరనారిం గనుచుండు రావణుఁడు నిర్ద్వంద్వంబుగన్ జెల్లిగన్ 28
వారకుండ నకట వత్తువు వోదువు
నా కొఱ కనుదినము నీ కొఱకు నొ
కండు వచ్చి యుండు దండ నొక్క దినము
వాఁడు వెదుక దొరకువాఁడు గాఁడు 27
వీడక యెల్ల వారలను వింతగ నుందురు పూరు షేంద్రులే
తోడుగ నిద్ద ఱం దొకఁడు దూఱఁగ లోపల బాహ్య మందుఁ దా
రాడును గోచరమ్ముగ నరాలికి నన్యుఁడు లోని వాఁడహో
వాఁడెవఁ డందువా వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో 26
ఘనుఁడా ఫాలాక్షుం డ
న్యు ననుపు గుంభనముగా నహో దాక్షిణ్య
మ్మున వే మోక్షం బీయఁగ
ననుఁ జంపఁగ వచ్చు వాఁడె నా దైవ మగున్ 25
కన లే రన్యులు కృష్ణు నవ్విధము సంగ్రామంబునం దెన్నఁగా
వనమాలిన్ వసుదేవ నందను నటన్ వాకృచ్చె నిబ్భంగినిం
గని భీష్ముం డనిఁ దన్ను జంపఁగను జక్రం బూని కృష్ణుండు రా
ననుఁ జంపం జనుదెంచు వాఁడె గనఁగా నా యిష్ట దైవమ్మగున్ 24
పామరులను గాంచి పండిత వ్రజ మెల్ల
సంత సిల్లఁ దివిరి సుంత వారి
కీ ధరా తలమున నిడకున్న జ్ఞానము
కవులు గొప్పవారు గారు నిజము 23
రవి శశి మానినీ నృప ధరాధర జంతు విహంగ హృత్సరో
జ వన నదీ నగాభ్ర సుర సంచయ వర్ణన కావ్య కర్తలన్
వివృత వచో విశేషముల విత్త విహీనము రిక్త వాక్కులం
గవులను గొప్పవా రనుచు గౌరవ మిచ్చుట వ్యర్థమే సుమా 22
"తండా - గ్రామము - ఊరు - నగరము" భారతార్థములో
ఊరువుల విఱిచి నిన్ను న
పార ఘన గరమును మ్రింగి బ్రతికిన వాఁడన్
వీరగ్రామము గనఁగా
వారువ తండాంతరమున వధియింతు ననిన్ 21
చారు నయన గంధ మలఁది చనుచు నుండఁ
జంప కంబని భ్రమ సెంది చామ నాసి
కఁ గని వ్రాలఁగ భ్రమర సంఘమ్ము వింత
నతివకు మొలిచె మీసము లంచుఁ గనిరి 20
వెతలకు నోర్చి విత్తులను బ్రీతి సెలంగఁగ సంగ్రహించి యా
తత బల వర్ధ కౌషధ వితానము నింపుగ వాడి కావఁగా
నత మృదు కాండ సంయుతము నాటిన విత్తు లవెల్లఁ, జెప్పఁగా
నతివకు మీ సముల్, మొలిచె నంచు ముదంబునఁ గాంచి రెల్లరున్ 19
[మీ సముల్ = మీకు సమ మైన వారు]
చుక్కలను గణింపఁ దరమె సూర్య చంద్రు
ల కయిన నలినజున కైన నకట వితత
నాక మగునె పత్రమ్ము వివేక మందు
నంధుఁడు గణించెఁ జుక్కల నంబరమున 18
కన్మా దైవము తోడు నుండఁ గలదే కా రాని కార్యం బహో
సన్మానమ్మున కాతఁ డర్హుఁ డగుఁ దా సంరంభ మేపారఁగన్
విన్మా సత్యము సెప్పు చుంటిని మనో నేత్రమ్మునం జక్కఁగా
జన్మాంధుండు గణించెఁ నభ్రమున నక్షత్రమ్ము లెల్లన్ వడిన్ 17
కేలీ లీలను జదువుమ
బాలా! యేలా భయమ్ము వడయఁగ నీకుం
జాలుం జాలును నీ వన
బాలవ్యాకరణముఁ జదువన్ దోషమగున్ 16
(చదువన్ = చదువను)
కాలం బెల్ల నిరర్థకం బగును దుష్కార్యంబ చింతింప దు
శ్శీలుం జేరిన సజ్జ నోత్తముఁడు దుశ్శీలుండునౌ రీతినిన్
హాలాహాల నిభంపుఁ గావ్యమును, వ్రాయన్ దానిఁ బాటింపకే
బాలవ్యాకరణంబునున్, జదివినన్ బాండిత్యమే లుప్తమౌ 15
రామ రావణు లిద్దఱు ప్రాణ సఖులు
బాల్య మిత్రులు ననురాగ బద్ధు లిద్ధ
రా తలమునఁ బిలువ కున్న రావణుండు
రావణుని పెండ్లి కేఁగెను రాముఁ డలరి 14
కావఁగ లోక వాసులను గారణ జన్ముఁడు రాఁగఁ దోడు స్వీ
యావరజుండు లక్ష్మణుఁడు నార్తిని నత్తరిఁ దండ్రి పంపునన్
వే వన వాస మెంచి ధృతి వీర వరేణ్యుఁడు, వుట్ట లేదు తా
రావణు పెండ్లి, కేఁగె నఁట రాముఁడు భూమి సుతా సమేతుఁడై 13
నుతియించిన నొసఁగును గొ
న్ని తరులు ఫలపుష్పముల ననేకముల నిలన్
నుతియించుటఁ గొన్నిటి నా
పి తరుల నిందించి నపుడె విభవము దక్కున్ 12
ధృతి మతి నూని దొంగలకు దిట్ట తనమ్మున బుద్ధి సెప్పుచున్
సతతము మానవత్వమును జక్కఁగ నేర్పుచు మార్ప నెంచుచుం
ముతుకల నింక నుత్తములఁ బుణ్య జనాలినిఁ గాక రేపు మా
పితరుల నింద సేసిననె బిడ్డలకున్ సిరి దక్కు నిచ్చలున్ 11
[రేపు మాపు + ఇతరుల = రేపు మా పితరుల]
అన్నన్న యే మన నగును
గన్నుల కింపు గొలుపంగఁ గల విచ్చట మే
లన్నా పొట్టకు వీటికి
నన్నము సున్న మని మోద మందిరి బందుల్ 10
పిన్నలఁ బెద్ద లెల్లరను వృద్ధుల నెంచి మనమ్ము లందు నా
సన్నుల కీయఁ దృప్తిని భృశమ్ముగ వండిరి వేఱు వేఱుగాఁ
బన్నుగ నట్లు వృద్ధులకు వడ్డన సేయఁగ వారి కింపుగా
నన్నము సున్న మైన ముద మందిరి బంధులు పెండ్లి విందులో 9
నరులకు దేవుని వరమే
ధరలోఁ జరియించు పక్షి తండము లెంచన్
మరలఁగ వఱదయె కాకులు
పురుగుల భుజియింప రోగములు దొలఁగునులే 8
రురునయనా! నిజం బరయ రోగ నిరోధక దివ్య శక్తియే
మురియుచుఁ గొద్దిగాఁ బసుపుఁ బుచ్చుకొనంగఁ బెరుంగు సంతతం
బరుగక వైద్య శాలలకు నల్లముఁ గొంచెము చంపఁ గుక్షిలోఁ
బురుగులఁ బ్రీతితోఁ దినినఁ బోవును రోగము లంద్రు వెజ్జులే 7
ఖండము లొనరింపఁ దగదు
మెండుగ నెన్నఁడు భృశమ్ము మెత్త నయిన యీ
పండుఁ దిను టట్లు కాదుర
పండు! విడిచి తొక్కనుఁ దినవలె మేల్గనఁగన్ 6
కుదురుగ నుంతురే యిచటఁ గోరిన పండిన పండ్ల నుంచఁగాఁ
బదుగురు తిర్గు చోటున నపాత్రులు గైకొన కూర కుందురే
పదిలము కా దయో పరుల పాలగు నంటిని యిట్టు లక్కటా
మొదటనె పండు, జార్చుకొని ముద్దుగఁ దొక్క, భుజింప మేలగున్ 5
కారఁ దొలఁగింప నెద మమకార మూని
కరము తనవారి పైన ముష్కురుల కకట
నిరతి గద్దె నిడి పలికి నేటి గాంధి
గాంధి పుట్టిన దినమని కలఁతపడుము 4
కలవర మేల నిక్క మిది గాంధి మహాత్మఁడు సత్య సంధుఁడే
యిల నట “సత్యమేవ జయ తీతి” యనంగ నొకింత మార్చిరే
యిలనె “యసత్య మేవ జయ తీతి” యనంగను నేత లక్కటా
కలఁతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్ 3
అనుకూల సుతులఁ బడయుట
మనుజ పురాకృత సుకృత మమానుషమే సే
కొని యాలిని స్వీయ సుకృత
వనమున సంతాన మందు వాఁడె సుఖించున్ 2
(వనము = సమూహము )
ఘనముగ నేర్చి విద్యలను గార్య సమర్ధతఁ బొంది నైపుణ
మ్మును దగ వృద్ధి సేసికొని పొందఁగ వృత్తిని నాయ వంతుఁడై
వనితకు నింక మర్త్యునకుఁ బన్నుగ ముప్పది లోపు నిండు యౌ
వనమున సంతతిం బడయు వానికిఁ గల్గును సౌఖ్యముల్ గడున్ 1