అంచితముగ మన్నన జన
సంచయ మిచ్చిన వరించి సద్గుణ రాశిన్
మించి నిలువ నాశ పడక
లంచమునకు రాచ గద్దె లభియించుఁ గదా 62
లంచము వేలు వే లొసఁగి రాజ్యము దక్కినఁ గోట్ల కోట్లనున్
మించి గడింప కుండుటకు మేదిని వెఱ్ఱులె వార లక్కటా
యించుక శంక నూనకయె యెన్నిక లప్పుడు నేత లీయఁగా
లంచము స్వీకరించిన ఫలంబుగ దక్కును రాజ పీఠమే 61
సృట్చతురాస్య జనిత స
మ్రాట్చయము నిరంతరమ్ము రణముల లోనన్
ధ్రుట్చయమై పోరాడుచు
షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే 60
[ధ్రుట్టు = అపకారి, శత్రువు; షట్చక్రములు = ఆఱు ఖండములు]
త్విట్చక్రద్వయ రాజ పుంగవులు వైవిధ్యైక శాఖా మహీ
రుట్చాంచల్య సముద్భ వానిలుఁడు మారుండింక నాభీలవౌ
షట్చక్రావలి వాహకుండు జల మన్, సత్యంబు నెంచంగ, రా
ట్షట్చక్రంబులలోన దాఁగెను గదా షడ్వైరిబృందం బహో 59
భాష్యము: కాంతిపుంజముల జంట దినరాజు రేరాజు నయిన సూర్యచంద్రులు, వివిధములైన కొమ్మలు కలిగిన వృక్షముల యస్థిరత కొఱకు పుట్టిన గాలిరాజు లక్ష్మీ పుత్రుఁడైన కామరాజు వషట్కారములను మోసికొని పోవు నగ్గిరాజు జలమయమైన సముద్ర రాజులతో గూడిన యీ యాఱుగురు రాజుల వలయములలోఁ బ్రాణుల యాఱుగురు శత్రువుల బృందము దాఁగి యున్నది.
ఆయా సమయములలో వీరు విలయమును సృష్టించు చుందురు. చంద్రుఁడు, మన్మథుఁడు కామవికారములను గలిగించి పాపకార్యము లొనరించుటకుఁ బురికొల్పి మానవులను బాపకూపములోఁ బడ వేయుదురు. మిగిలిన వారి బీభత్సము విదితమే.
భూత దయ నొకింతయు నైనఁ బూన కున్న
దాన గుణము డెందమ్మునఁ గాన కున్నఁ
బాప భీతిని వీడి పాపములు సేయఁ
దీర్థ యాత్ర లఘంబులఁ దీర్చు నొక్కొ 58
బెదరరు పాప కర్ము లెదఁ బృథ్విని నిందు నిమిత్త మెన్నఁడుం
బదపడి నీవు సంతతము వారక రక్తినిఁ బెక్కు శాస్త్రముల్
చదివితి కాదె వీడు మిఁక సందియ మేల నరాళి కిద్ధరన్
వదలదు పాప సంచయము వాసిగఁ జేసిన తీర్థ యాత్రలన్ 57
రమణీ మణి ద్రౌపదిఁ గాం
చి ముమ్మరమ్ముగ నెడందఁ జెలరేఁగఁగఁ గా
మము వర్తిలఁ గీచకునకు
యమపాశం బయ్యెను గుసు మాస్త్రం బయ్యో 56
సుర గణ కార్య మంచు హరి చోదితుఁడై కడు నుత్సహించి యా
గిరిజకు శంభుఁ గూర్ప విలు కేలను గైకొని మన్మథుం డటన్
హరు నయ నాగ్ని భస్మముగ నయ్యెను బాణము వేసి నంతటన్
మరుని సుమాస్త్రమయ్యె యమమారణపాశముగాఁ గనుంగొనన్ 55
విజయము సాధింపంగ గి
రిజా సతీనాథుఁ జేయ రేఁగ మరుం డా
గజ దిట్ట సదాశివు నం
గజ బల మాకాశ మందు గంతులు వైచెన్ 54
[అంగజ బలము = మారుని సేన]
ఋజువుల నేల కోరుదు నిజేచ్ఛను నీవ యెఱుంగ నోపుదే
నిజముగ వర్ష కాలమున నివ్వెఱ నందఁగ నభ్ర వీధినిన్
సజల మ హాసితాభ్ర ఘన సంచయ మారయఁ దోఁచు నివ్విధిన్
గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్ 53
ధారుణి భారము మోయుచుఁ
బౌరజన క్షేమ మెంచి పన్నుగ నిటకుం
దోర మెడఁద మీఱిన మమ
కారముతో వచ్చె నఁట జగత్పతికి నతుల్ 52
కారణ జన్ముఁడై భువినిఁ గావఁగ శిష్టులఁ ద్రుంచ దుష్టులం
గోరఁగ ధర్మనందనుఁడు కూర్మి సెలంగఁగ వాసుదేవుఁడే
గౌరవ మొప్ప నెల్లరకుఁ గౌరవ పాండవ సంధి నెంచి శ్రీ
కారము తోడ వచ్చిన జగత్పతికిన్ బ్రణమిల్లఁగాఁ దగున్ 51
అల గోపన్న మహాత్ముం
డిలఁ గట్టిన మందిరమ్ము నెలమిని భద్రా
చల రాముం డాంధ్రమ్మునఁ
గలి కాలము నందుఁ బుట్టెఁ గద రాఘవుఁడే 50
లలి తాకారుఁడు ముగ్ధ మోహనుఁడు లీలా కేళి దక్షుండు కే
వల నైర్గుణ్యుఁడు శైల రూప ధరుఁడై పద్మావతీ నాథుఁడే
నలినాక్షుం డిల వేంకటేశ్వరునిగా నారాయణుం డింపుగం
గలికాలంబునఁ బుట్టె రాఘవుఁడు లోకం బెల్ల రక్షింపఁగన్ 49
ఆప్త సఖియు సుదతి తప్త కాంచన భూషి
త తరుణీ మతల్లి తరళ నేత్ర
పూర్ణ చంద్ర బింబ ముఖి వచ్చి నిల్చిన
దీప మార్ప గృహము దీప్త మయ్యె 48
దీపము లేల యింక దివి దీపము వెల్గుచు నుండ నంచు నా
చూపరు లెల్ల నిల్వ వెఱ చొప్పడ శారద రాత్రు లందు సం
ప్రాపిత చంద్రికా ధవళ భాను వితానము సేర నింటిలో
దీపము నార్ప దీధితులు దీపిత మయ్యె గృహాంతరమ్మునన్ 47
లోభు లందుఁ బరమ లోభి యయిన వాఁడు
భార్య చీర లుండ బట్ట లేల
వ్యర్థ మంచు నెంచి పన్నుగ నప్పిసి
నారి చీరఁ గట్ట నవ్వ రొక్కొ 46
దారుణ శాప కారణ విదారిత పుంస్త్వ వికార రూపుఁడై
పౌరవ వంశ మండనుఁడు పార్థుఁడు పాండవ మధ్యముం డహో
నారికి రాజనందనకు నాట్యము నేర్ప దినేశజప్ర ధా
నారియె చీరఁ గట్టిన జనంబులు గన్గొని నవ్వ కుందురే 45
[ప్రధాన + అరి =ప్రధా నారి ]
పరమాత్ము మహిమ యట్టిది
వర కృమి విల యార్థము తెఱవక యున్న గుడిన్
సురలఁ గొలువ గుడిలోనఁ జ
తుర! కలలో భూమిసురులు దూఱెద రింకన్ 44
[తూఱు = చొచ్చు]
తర తమ భేధముం దలఁచి తర్కము సేసిన లాభ ముండునే
ధరఁ బ్రజ గౌరవింప నిజ ధర్మము మేలు నిరంతరమ్మునుం
దిరుగుచు మాని పూజలను దిట్ట తనమ్మున నీవు సొచ్చినం
దురకలలోన బ్రాహ్మణులు దూఱెద రింక విచార మేటికిన్ 43
[దూఱు = తిట్టు; విచారము = ఆలోచనము]
ఓ మానవ డెందమ్మున
నీ మాటఁ దలంచి చూడ నింపుగ నిక్కం
బే మహి హృద్రోగ మొసఁగి
కామక్రోధమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్ 42
ఏ మాత్రం బనుమాన మూనకుమ నే నీ రీతిఁ జెప్పంగ స్వీ
యామోఘవ్రత సత్య వర్తనము నిత్యాంగార కోద్యత్శిఖా
ధూమస్తోమ విరాజియై పరమ శాంతుండై విసర్జింప నా
కామక్రోధమదాది షట్కమె నరుం గైవల్యముం జేర్చుఁగా 41
వా దోప వాదముల నీ
వాదరమున నాపి యింక నానందముగా
నీ దౌష్ట్యపు, మన్నించుచు
వేదమ్మును, రూప మాపవే యశ మందన్ 40
కాదన కెన్నఁడే నఖిల కార్య పరంపర లందు నీతినిన్
సాదర ధర్మ రీతి ననయమ్మును నిల్పుచు నుండ మే లగున్
నీ దగు భార తావనిని నిత్య మనీతిని భారతీయ సం
వేదము రూపు మాపవలె విస్తృత కీర్తి గడింపఁ గోరినన్ 39
దామోదరునకు హరి కా
శ్రీమన్నారాయణునకు లేఁడు సముండే
నేమమ్మునఁ బూజించిన
సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్ 38
భామా ద్వంద్వ వివాద కారణమునం బ్రాప్తాశ్మ రూపుండు నా
హా మాహాత్మ్యము నందు విశ్రుతుఁడు దేవారాధ్యుఁడౌ యా పరం
ధాముం డెన్నఁడు స్వీయ భక్తునకు స్వాంతం బందు బందీకృ తా
సామాన్యుం డగు వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్ 37
ప్రకృతి జనియించు నట్టి శబ్దమ్ము లెల్ల
జనుల చెవులఁ బడ్డఁ కలుగు సంతసమ్ము
నేను వచియించు చుండఁగ నీకు సంశ
యమ మహిష ఘంటికానాద మది ప్రియంబు 36
కాలుని దర్శనం బయినఁ గానఁగ నోపరు వారు లోకులం
గాలునిఁ గాన కున్న మఱి కాలుని దున్నఁ గనంగ శక్యమే
యేల వచింప నీ పగిది నేరు నెఱుంగని యట్టి మాటలం
గాలుని దున్నపోతు మెడగంటల సవ్వడి శ్రావ్యమౌఁ గదా 35
ధరలో మిక్కిలి కష్టము
చరియింపఁగ సంయమమున సాధువు వోలెన్
నరునకు నిష్ఠ జయించిన
నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా 34
మరలన్ నేరవు లోభ మోహ మద కామక్రోధ మాత్సర్యముల్
నర లోకమ్మున సంతతం బొసఁగు సంతాపమ్ము మర్త్యాలికిం
గర మాసక్తినిఁ జేయ నా పనియె యే కార్యమ్ము ఖండించు నా
యరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్ 33
విష్ణుని సహిష్ణు నా ప్రభ
విష్ణుని పాదమున నుద్భవిల్లిన కతనన్
విష్ణుపది యా సురాపగ
వైష్ణవులకుఁ గాశి యపర వైకుంఠ మగున్ 32
అరవిందాక్షుఁ డనంతుఁ డచ్యుతుఁడు విశ్వాత్ముండు నిత్యుండునుం
బరమాత్ముండు రమా మనో ధవుఁడు శ్రీవత్సాంకుఁ డెల్లప్పుడున్
హరి విశ్వమ్మున నెందుఁ జూచినను నందందుండునే యందుకే
గురుఁడా వైష్ణవు లందురే యపర వైకుంఠంబుగాఁ గాశినిన్ 31
ధాత్రి వరహీన మందురు దార కన్నఁ
దాను జిన్న వాఁ డయినచోఁ గాన వినుమ
యెన్నఁడు పురుషునకుఁ దన కన్న పెద్ద
పడఁతిని సతిగ స్వీకరింపంగఁ దగదు 30
కడు విడ్డూరము స్వీయ పుత్రికకు శంకాహీనమే మర్మమే
చెడకుండంగను భూధవుం డొకఁడు సేసెం బెండ్లి శీఘ్రంబ సం
దడి నారీమణి తోడ మోసమునఁ గాంతారత్నమే యన్యపుం
బడఁతిన్ బత్నిగ స్వీకరించుట యసంబద్ధంబు ముమ్మాటికిన్ 29
దుర్మతిఁ ద్యజించి యింపుగ
నిర్మల చిత్తమ్ము నూని నిత్యమ్మును స
త్కర్మముల నీ వవశ్యము
ధర్మాచరణమ్ము గనఁగ దానవ! గుణమౌ 28
ధర్మమె స్వీయ భ్రాతలకు దారుణ మత్సర మూనఁగా మహా
కర్ములె యాదితేయు లగు కశ్యప సూనులు దైత్య దానవుల్
ధర్మ విభేద మున్న నొక తండ్రి కుమారులె యందు సంత తా
ధర్మము నాచరించుటయె దానవ నైజము మానఁగాఁ దగున్ 27
పౌరవాన్వయ తిలకుండు కౌరవ కుల
దీపకుండు పాండు సుతుండు స్థిరుఁడ యాజిఁ
గుంతి కీయంగ సంతోష మంత వినుమ
దేవకీ! పుత్రుఁ డయ్యె యుధిష్ఠిరుండు 26
దేవ గణమ్ము కోరఁగ నతీత భయమ్మున విష్ణు వింపుగాఁ
గావఁగ భూ నివాసులను గయ్యము నందు స్థిరుండు రాముఁడే
పావనుఁ డైన పంక్తిరథు భార్యకు నెవ్వతె ముందు వుట్టె నా
దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుఁ డా దశకంఠుఁ జంపఁగన్ 25
రా రా రమ్మంచుఁ బిలువ
గా రామా యేల రావు కాంతా సీతా
రా రా నారీ లోకపుఁ
దారా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్ 24
నారీ రత్నమ నీవు లేని యెడలన్ నా కేల యీ ప్రాణముల్
ఘోరారణ్యము నందు నుంటి వెట సంకోచింప నీ కేల సీ
తా! రాజీవదళాక్షి! ప్రాణ సమ! స్వాంతాకాశ వీథీ లస
త్తారా రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్ 23
దూరపు బంధుత్వ మడరఁ
బేరిమి మీఱ నుతియించి విత్తార్థంబై
బోరనఁ జెంతకు నేగిన
వార కులాంగననుఁ గలియ వర్ధిలును సిరుల్ 22
క్షీర సముద్ర రాజ సుత సేవిత పద్మదళాక్ష సంత తా
పార దయార్ద్ర మానసను భక్తి వహించి మనః పథమ్మునన్
వారక కోరి విత్తమును బద్మ దళస్థిత లోభిలోక దు
ర్వార కులాంగనం గలియ వర్ధిలు సద్విభవంబు లీ భువిన్ 21
అంతెఱుఁగని మైకమున లోకాంతరమున
కేఁగి వింతఁ గాంతుం డొకఁడే గరిమను
బల్కె నివ్విధముగఁ దడఁబడుచుఁ గరము
సంతసమున ముంగిసలతో సర్పమాడె 20
చింతింపంగ ధరాతలమ్మున నహో చిత్రమ్ములం గాంచమే
వింతల్ పెక్కు సెలంగుఁ దాపసుల సద్వృత్తమ్ము లందింపుగాఁ
గాంతారమ్మునఁ గణ్వు నాశ్రమమునం గన్పించు నీ దృశ్యముల్
సంతోషంబునఁ గూడి యాడెఁ గనుమా సర్పంబుతో ముంగిసల్ 19
పాయక యెన్నఁడు నా నా
రాయణు నచ్యుత మయిన నిరంతరము మహా
మాయా లీలల వెలిఁగెడు
కాయమె సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్ 18
ఆయా లోకము లెల్ల నేక మయి బ్రహ్మాండంబు మున్గంగ నా
తోయం బందు మహోగ్రమౌ ప్రళయమే తూర్ణంబు నేతెంచఁగాఁ
బ్రాయంబం దరయంగ బాలుఁ డగు నా పద్మాక్షు నిత్యంబునౌ
కాయంబే కద సుస్థిరంబు నిలుచున్ గల్పాంతకాలంబునన్ 17
చెట్టు పైనను గాకుండఁ బుట్ట లోనఁ
గాక మఱి యింటి లో నైనఁ గాక యకట
చేతి లోనఁ జెలంగెడుఁ జిత్ర మగు ని
రగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె 16
వారక కీటకం బొకటి ప్రాణములం గొని విఱ్ఱవీఁగుచున్
వీర విహార ముద్ధతిని బిట్టుగఁ జేయుచు నాక్రమించెనే
దారుణ శస్త్ర సంచయము తద్దయుఁ గల్గిన విశ్వ మూర్ధమున్
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై 15
శబ్దముల భావ మెఱుఁగక చాలు నంచు
నర్థము గ్రహింప సుంతయు నలవి గాక
పామర జన సందోహ నివాస మందు
లోకులకు సత్కవిత్వము లోకువ గద 14
శాక విహీన పక్వ పల సన్నిభ దుష్కర నారికేళ పా
కైక కఠోర శబ్ద సుదురాప నిగూఢ నిజార్థ సంగ్ర హా
ర్థాకలన వ్యధైక భరి తాత్ములఁ గూడిన యట్టి భూమిలో
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్ 13
తివిరి నైవేద్య మిత్తురు దేవునకును
దినుట యది యెల్ల నింపుగ జనుల వంతు
తావి యున్నట్టి సుమమాల దంపతులకుఁ
దావి లేనట్టి సుమమాల దైవమునకు 12
ఏవి హి తాహితమ్ము లిల నెంచఁగ దేవున కెన్నఁ డేనియున్
దేవుని సృష్టి కెన్నఁగ నతీతము లున్నవె భూతలమ్మునం
దావి సెలంగు నట్టి సుమ దామ సమానము సత్య మెంచినం
దావి యొకింత లేని సుమదామమె యొప్పును దైవ పూజకున్ 11
విత్త మెంచి పాప భీతి సుంతయు లేక
విఱ్ఱ వీఁగి లజ్జ వీడి ఘోర
దుష్ట పాప బుద్ధితోఁ జేసి నట్టి పా
పాల వలన నరులు భ్రష్టులైరి 10
వ్రాలం బంతము లందుఁ బాచికలలోఁ బానీయ పద్మాక్షులన్
నేలం బౌరుష ముఖ్య దుర్గుణములన్ నిత్యమ్ము చిత్తమ్ములే
తూలం గాంతుము జీవితమ్ముల నయో దుష్టాక్షరం బాద్యమై
బా లే కారణమయ్యె మానవులకున్ భ్రష్టత్వముం బొందఁగన్ 9
సోయగమ్ము నందుఁ జూచిన సరి లేరు
గుణము లందుఁ గాంచ మణియె చుమ్మి
కాంత లందు మిన్న కలనైనఁ దలఁపక
పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె 8
తరుణుల కెంచ స్వీయ పతి తద్దయు గౌరవనీయుఁడౌ నిలన్
వరునకు నెంచ స్వీయ సతి పన్నుగ నిత్యము రక్షణీయయౌ
కర మనురక్తి సంతతము కాంత స హర్షము స్వీయ దేవ తా
పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై 7
[దేవతా +అపరుని =దేవ తాపరుని; అపర దైవము]
అండ దండ లొసఁగు చుండు మండితుండు
గండములను ఖండించు నితండ యంచు
దండములు వెట్టు చుండి పాషండ చండ
గురువులను దైవము లనుచుఁ గొలువఁ దగదు 6
పురజన సర్వ జానపద పుంగవ పామర పండి తాలినిన్
సురుచిర వేష భాష లవి చొప్పడ మోసము సేయు చుండఁగా
గురు తర బోధన ప్రభలఁ గ్రూర మనస్కుహ నైక చింతనా
గురువుల దైవ మూర్తు లని కొల్చిన వారికి దక్కుఁ గష్టముల్ 5
దానవ నిచయమ్ము ధాత్రి మాయము కాఁగ
రాక్షసాలి గుణము రగులు కొనఁగ
నంతరంగముల నరాలికిఁ గన నేఁడు
మానవుం డసుర సమానుఁడయ్యె 4
దాన గుణమ్ము మృగ్యము ప్రధానము విత్తము సంతతమ్ము సం
తాన సమస్త బాంధవ వితాన విశేష పురోభివృద్ధియే
మానస మందు నెన్నఁ బర మార్థముగా నర కోటి నిక్కమే
మానవుఁ డయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే 3
తాను దిన్నచో నింకను దార తిన్న
స్వీయ నందను లెల్ల భుజించిన యది
దండుగ యయిన సత్యమే తప్పకుండఁ
దల్లికిం దిండి పెట్టుట దండుగ గద 2
ఒల్లదె యిట్టి భూత దయ నుర్విని నెన్నఁడు సజ్జనాళి శో
భిల్లరు గొప్ప వారయినఁ బృథ్విని నింటను బెంచి నట్టి యా
పిల్లికి నెట్టివానికిని వింతగఁ గాదని తన్ను గన్న యా
తల్లికిఁ దిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్ 1