మున్న శివ భక్తుఁ డాతండు పుణ్య తీర్థ
దర్శనమ్మునఁ దనదు స్వాంతమ్ము నందు
మూర సద్భక్తి ముక్కంటి పూజల పయిఁ
గాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె 57
కాశి వినూత నాలయము కాంతులతో మిఱుమిట్లు గొల్పఁగా
నాశగ సౌధ రాజముల నద్భుత మండప పంక్తిఁ గాంచఁగా
లేశముగా వెలుంగ శివలింగము బిందు వనంగ వార్ధినిం
గాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా 56
కావే చిక్కులు నరులకు
జీవితమును వే కృశింపఁ జేయున వకటా
యే వలను గనినఁ గలుగును
జీవితమున గొప్ప సుఖము చిక్కు మడిసినన్ 55
ఏ వగ పుండ నేర దిఁక నెన్నఁడు గాంచవె యీతి బాధలన్
భావిని నాఁక లుండ దిఁకఁ బన్నుగ దప్పిక మాయ మౌనులే
నీ వగ వాఁడు వొందు నిల నెమ్మిని నిమ్ముగ వాని కెంచఁగా
జీవిత మందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ జచ్చినన్ 54
చెవిటికి శంఖం బూదిన
నవివేకి కొసఁగఁ గవిత్వ మర్థము గలదే
యవనిని వారక వారికిఁ
గవనమ్మును జెప్పు కవు లకారణ శత్రుల్ 53
చవి యొక యింత లేని నిజ శాస్త్ర సమూహ విరుద్ధ కావ్యముల్
భువి నొసఁగంగ నేర్చునె ప్రమోదము మానవ కోటి కెన్నఁడుం
జెవులఁ గనంగఁ జిల్లుల నశేష నిరర్థ బృహత్కథా విపా
క వనముఁ జెప్పి యెల్లర కకారణ శత్రులు గారె సత్కవుల్ 52
[వనము = సమూహము]
మెండుగ రోషము మీఱఁగ
భండన మొనరించు భంగి బ్రహ్మాండమ్ముల్
నిండఁగ ఘోషించుచుఁ దాఁ
బండితుఁడై వింతమృగము పగిదిఁ జరించెన్ 51
ఆద్యము వింత చేష్టలకు నాస ధనమ్మునఁ గారణమ్ములన్
వేద్యమ మాన వాలికి వివేకము నాశన మౌను లొంగినం
జోద్యపు నమ్మకమ్ము లెదఁ జొప్పడ క్షుద్ర సు రాల్యుపాసనా
విద్య గడించి పండితుఁడు వింత మృగంబుగ సంచరించెనే 50
'మబ్బు - వాన - ముసురు - వరద' ఈ పదాలను
అన్యార్థంలో ప్రయోగిస్తూ ఖాండవ దహన వృత్తాంతము
కరి వరద దయాన్వితుఁ డయి
కర మబ్బురము సురు చిరముగ దవానలమే
దరికొన ఖాండవ వనమున
సురనాథు సుతుండు వోరె సురపతి తోడన్ 49
ముక్కఁగ విద్యుచ్ఛక్తియె
దిక్కుల నెల్ల నకటా యదియు వేసవిలో
వెక్కస మై చెలఁగ జనుల
కుక్కకుఁ జెమ్మటలు వొడమకుండునె సతమున్ 48
ఎక్కటి దైవ మెప్పగిది నేరినిఁ గాఱియ పెట్టు చుండునో
యుక్కిఱి బిక్కిరై పదము లుద్ధృత రీతిఁ జలించు చుండఁగాఁ
జిక్క నరణ్య మందుఁ బెను సింహముఁ గాంచిన గ్రామ సింహ మా
కుక్కకుఁ జెమ్మటల్ వొడమ కుండునె రే పవ లొక్కరీతిగన్ 47
స్వీయ సతి యడిగినం గమ
నీయమ్ముగ శంకరుండు నిజ సద్భక్త
శ్రేయస్కరుం డుమా పతి
శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి! పలికెన్ 46
ఈ యా మాటలు వల్క నేల నిరతం బీ నేర్తు నిక్కమ్ముగా
శ్రేయమ్ముల్ మది విశ్వసించి నను బూజింపంగ నే దుస్స హా
పాయశ్రేణిఁ దొలంగఁ జూతు ధరలోఁ బాంచాలి తత్పాండవ
శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై 45
సుప్రాప్త శాకములతోఁ
బ్రప్రథమమున సుర తోడఁ బండుగ దిన మం
దా ప్రముఖు లెల్లరు విగత
విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుక తోడన్ 44
సుప్రథితంబ లోకమునఁ జోద్యము కాదు తలంప రాజ భా
ర్యా ప్రము ఖాధ్వర క్రతు చర ద్యజమాన ముఖ వ్రజమ్ముతో
క్షిప్రమ యశ్వమేధ హవ శేఖర మందు వధించి యశ్వమున్
విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్ర పద్ధతిన్ 43
[రాణి యశ్వమునుఁ గత్తితో వ్రేయ ఋత్విక్కులు గుఱ్ఱపు కొవ్వును వండ రాజు దానిని వాసన జూచును. ఇచట వారు నిజముగ మాంసము తిన్నను దినకున్నను జంపిరి కాబట్టి పొట్టనఁ బెట్టు కున్నట్టులు భావింపఁ దగును. శాస్త్ర పద్ధతిని నన్నది గమనార్హము. ఆహారార్థము పశుహింస హింస కాదని పెద్దలు చెప్పుదురు. పూర్వము విప్రులు మాంసమును దినెడి వారట. అగస్త్యుఁడు తినిన వృత్తాంతము ప్రసిద్ధమే కదా!]
త్వరితమ్ముగ మిత్రులు గూ
డి రింపుగను గాంచ నెంచి డెందము లందుం
బరమానందము సఖి శే
ఖర! సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్ 42
వర కపిఁ జూడ వచ్చితిమి బాలక! యిందఱ మంది యాతనల్
కరము ముదమ్ము నందితిమి కంటివె నిన్నిటఁ జూడఁగా ననన్
వర దరహాస మొల్కఁగను బల్కితి నాతని తోడ నివ్విధిన్
ఖర సముదాయ మిచ్చటికిఁ గాంచుటకై నను వచ్చెఁ జూడుమా 41
ఓ మహిష వాహన! ఘన
శ్యామా! రమణీయ గాత్రు సదమల చిత్తుం
గోమలుని దక్షిణ ది శా
రామా! సుతుఁ జంపితి వవురా నిర్దయతన్ 40
ఏమీ దుండగ మేల వచ్చితివి నీ వెందుండి యేతెంచితే
భీమాకారుల ఘోర రాక్షసులనుం బీడించితే కోఁతి! యే
కామం బెంచితి వియ్యశోక వని భగ్నంబేల కావించి తౌ
రా మా పుత్రునిఁ జంపినాఁడవుర నిర్దాక్షిణ్య చిత్తుండవై 39
ఫాలమునకు బదులు ఫోల మని పలుకు(సురా సేవనమునఁ గావచ్చు)
చుండఁ బలు కషాయముల వలనఁ బొట్టలు ప్రక్షాళనము లయి ఫో ను వీడి ఫా
పలుకుచు ఫాలము హస్త విభూషణ మని పలుకు సందర్భము :
పల్ ఫాంటమ్ములు త్రాగఁ ద్రాగఁ దమినిం బ్రక్షాళనంబై వెసం
బల్ ఫండమ్ములు శుద్ధి యై పలుకు విన్మా చేసి దండమ్ములే
వేల్ ఫాలాగ్రము, మాని యక్కరము వేవేగంబ భక్షించి దో
సెల్ ఫోన్, హస్త విభూషణం బని కవిశ్రేష్ఠుల్ ప్రశంసింతురే 38
[ఫాంటము = కషాయము; ఫండము = పొట్ట; ఫాలాగ్రము = ఫాలము (నాఁగటి కఱ్ఱు)
చివర నున్నది, నాఁగలి; ఫోన్ = ఫో యను నక్షరమును ]
కాకాసుర వృత్తాంతము.
నిషిద్ధాక్షరాలు – క వర్గాక్షరాలు (క, ఖ, గ, ఘ, ఙ)
వింత మో రను మల చెంతను వనవాస మందు సీత యొడిని నంద నిద్ర
రాముఁడు సీత నారట పెట్ట బలిభోజనుండు స్తనము చీల్చి తిండి నెంచి
తల్లడిల్లుచు నుండఁ దరుణి శోణితము స్రవింప భృశము వాయసంపుఁ జేష్ట
నరసి లేచి పతి సురాధిపు సూనుని రోసి బ్రహ్మాస్త్రము వేసె నంత
మూడు భువనముల శరణము వడయమిని
వేఁడ రాముని నేత్రము నూడఁ దీసి
యొండు ప్రాణము తను వందు నునిచి నిలిపె
దాశరథి వాయసమ్మును దయ వహించి 37
[వింత మోరు = చిత్రకూటము]
ఇలలో నింద్రియ వశుఁడై
లలనా దేవన సురా వలయ మగ్నుఁడు భూ
వలయమ్మును నేలెడు వాఁ
డలిగిన పతి యుచిత కార్య మరయం గలఁడే 36
లలనా రత్న నికాయ పూజలకు నర్హంబైన భార్యా మణిం
గలలో నైనఁ బరుం దలంపనిది యౌ కాంతా మణిం గ్రూరుఁడై
జలజాతాయత పత్ర లోచనను దా శంకించి డెందమ్ము నం
దలుకం జెందిన యట్టి కాంతుఁ డుచిత వ్యాపారముల్ నేర్చునే 35
కమలాయతాక్షి మదగజ
గమన మదిఁ దలంచి లోక కల్యాణమ్మున్
విమల మతి యుమా దేవి ప
రమ శివ పత్నిగ మహిషుని ప్రాణములఁ గొనెన్ 34
సమధిక సర్వ మంగళ విశాల మృగేక్షణ దుష్ట శిక్షణా
ర్థము కరుణార్ద్ర చిత్త ధృతి రక్త విలోచన భద్రకాళి నా
మ మడర లోక కంటకుని మానిని పార్వతి ఫాలనేత్ర హృ
ద్రమ శివపత్నియై మహిషు ప్రాణములం గొనె సంగరంబునన్ 33
తగ వేటికి రే పవళులు
మగఁడా నీ కివ్విధమ్ము మగువల తోడన్
విగ తాన్న ముండ నెంచినఁ
దగవుల నాడంగఁ దగును దరుణుల తోడన్ 32
జగతికి మూల మంగనలు శాంత మనస్కలు నోర్పు నందుఁ జూ
డఁగ సరి భూ సతీ మణికి డయ్యరు చేతల డెంద మందుఁ జ
క్కగఁ బడయంగ నూఱటను గౌరవ మిచ్చుచు మంచి మాటలం
దగవుల నాడఁగాఁ దగును దామరసాక్షుల తోడ నిచ్చలున్ 31
న్యస్తాక్షరి:
పోదము పాఠశాలలకు మూఁడ విరామము లెల్ల నేటితోఁ
బాదము లుంచఁగా బడులఁ బాఠము లన్యము లెల్ల నేర్వఁగా
నీదు మనమ్ము లోపల జనించెనె నూత్న విశాల భావముల్
వాదనముల్ సెలంగె ననివార్యములై కడుఁ బాఠశాలలో 30
కపి యారగింపఁ బండిన
కపిత్థ మింపుగ సతమ్ము కవి తా నిత్య
మ్ము పలుకుఁ గవిత్వ మలరుచుఁ
గపివరు లెల్లరునుఁ గనఁగఁ గవివరులైరే 29
కపటము పల్కుఁ దత్కవియె కానదు కోఁతి నిజమ్ము నెమ్మదిం
దపన సెలంగఁ బండ్ల పయి దానికిఁ బ్రాసలఁ బ్రీతి వీనికిన్
నృపవర సత్య మిప్పలుకు నేనరు దెంచితి నందుకే సుమీ
కపివరు లెల్ల నేఁడు గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్ 28
అరసితివి లోక కంటకు
నరసితి లోకోత్తరుని నిజాత్మజుఁ బౌత్రున్
వర భూవర!నిక్కమ్ము స
గరుఁడా నీయందుఁ బుట్టె గరళము సుధయున్ 27
కర మాశ్చర్యము మంచి చెడ్డ లిలలోఁ గన్పట్టుఁ బార్శ్వంబులన్
నరుఁ డీ రెంటిని నేర కున్నఁ దగ క్షంతవ్యుండు కాదెన్నఁడున్
ధరఁ దార్కాణము నీదు వర్తన మగుం దథ్యంబుగా క్షీర సా
గరుఁడా పుట్టె విషంబునున్ సుధయు నీ గర్భంబునందున్ భళా 26
శంక నెల్ల వీడి శాంత మనమ్మున
సంతతమ్ము కొలిచి నంతఁ జాలు
విఘ్న సంచయఘ్న విఘ్ననాయకుని శాం
కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము 25
సుర సంసేవిత దివ్య పాదములు విష్ణుద్వంద్వ పాదమ్ములున్
సిరి నిత్యమ్మును గొల్చు పాదములు శ్రీ సీతేశు పాదమ్ములున్
శరణార్ధివ్రజ రక్ష కాంఘ్రి యుగముల్ సంరక్షితక్షీణ వ
త్కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యం బిచ్చుఁ బూజింపుమా 24
పంకజ నాభుని శ్రీ వ
త్సాంకుని దామోదరుని మహా పన్నగ ప
ర్యంకుని నా నారాయణు,
శంకర! మూర్తినిఁ గొలిచెద శ్యామలవర్ణున్ 23
శంక వహింప కే నెడఁద సన్నుతి సేసి భుజంగ భూషణున్
సంకట సంచయ క్షయుని సర్వ శుభప్రదుఁ జంద్ర శేఖరున్
శంకరి వామభాగమున శైల వరాత్మజ వెల్గు చుండఁగా
శంకర మూర్తిఁ గొల్చెదఁ బ్రసన్నుని శ్యామల! కోమలాంగునిన్ 22
భారతార్థములో న్యస్తాక్షరి:
ఘన నిభ భాసమాన నిజ కాయుని కార్ముక యుక్త బాహు నా
యనుపమ శూరునిన్ నర వరాఖ్యునిఁ బార్థుని సవ్యసాచినిన్
వినుత పరాక్రమున్ సమర వీరుని ఖండిత కాలకేయునిం
గన మిల మించు వీరులను గౌరవ వంశము నందు ముత్యమున్ 21
త్వత్స్నేహం బిప్పట్టునఁ
గృత్స్నంబిఁక వీడ నొప్పుఁ బృథ్విని నిర తా
సత్స్నిగ్ధాత్మ జనులతో
సత్స్నేహముఁ జేయ దక్కు సంకట చయముల్ 20
[నిరత + అసత్ స్నిగ్ధాత్మ = నిర తాసత్స్ని గ్ధాత్మ]
జ్యోత్స్నా సన్నిభ కాంతి మన్ముఖ! మహా చోద్యంబ యర్థం బహో
కృత్స్నంబిక్కడ మాఱిపోవుఁ గద వీక్షింపంగ బింద్వర్ధమే
సత్స్నేహం బొనరింప పిమ్మట నిడన్ శంకింప నిబ్భంగినిన్
సత్స్నేహం బొనరింప దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్ 19
[ఒనరింప లో ప పిదప నరసున్న యున్న నిడుమలు తక్కును లేకున్న నిడుమలు దక్కును]
వగచుచు డెందమునఁ గరము
తగ విట్టి గుణమ్ము లనుచుఁ దన కూతురునిం
బొగరునకుఁ జలమునకు, విను
మ! గనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్ 18
పగతుర కైన నిట్టి వగు పాటులు కూడ దటంచుఁ దల్చుచుం
దగ దని నొక్కి పల్కుచును దద్దయు రోషము వొంగు చుండఁ ది
క్కగ బదు లీయఁ గోపమునఁ గన్న కుమారుని, నూఱడించి తా
మగనినిఁ, దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞు లౌ ననన్ 17
పంకజ నాభుఁడు శ్రీవ
త్సాంకుండు రమా ధవుఁడు మహాభారత ఘో
రాంక తలమ్మునఁ బాండవ
శంకరుఁ డన నెవఁడు పార్థ సారథియె కదా 16
పంకజ గర్భ దేవ గణ వల్లభ పూజిత సర్పరాజ ప
ర్యంకుఁడు నవ్యయుండు పరమాత్ముఁడు భక్త జనౌఘ సంత తా
తంక వినాశకుండు హరి త్రాతయు రక్షిత దైత్య భీతి మ
చ్ఛంకరుఁ డన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో 15
ఎంచి కీడును మున్ముందు నంచితముగ
నెంచ నొప్పును మేలును మించి పిదప
కారణం బేమి యైనను దూర ముంచ
మే లగును బిల్లలకుఁ గొన హాలహలము 14
కన్నం గొన్న విచార మందుదురు తత్కాంతా నికాయంబె యా
సన్నంబైన క్షణంబ గౌరవము నాశంబౌను వంశాబ్ధికిన్,
ఛిన్నాభిన్నము సేయ కుండ కులమున్ శీఘ్రంబ నారీ గు ణా
చిన్నారుల్ ముద మార హాలహలమున్ సేవింపఁగా, మేలగున్ 13
[గుణ + అచిత్ + నారుల్ = గు ణాచిన్నారుల్; అచిత్ = అజ్ఞానము]
పరఁగంగ వింత రోగము
ధరఁ దన తల్లికి గురుండు తనతో ననఁగాఁ
గర ముంచి నమ్మకమ్మును
వర కోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్ 12
ఏమీ వింత విభుండు దృశ్యుఁ డయి యైదేండ్లేఁగ నింటింటికిన్
సామాన్యుం డన వచ్చి కొల్చుచును వాక్చాతుర్య మేపారఁగన్
నే మీ కిత్తును సర్వ సౌఖ్య తతులన్ నిండారఁ దన్నెన్నఁగన్
శ్రీమంతుం డగు వాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్ 11
ఒండొరులకుఁ బులకరింప మెండుగాను
మేను లంత నిరువు రుద్యమించి వేగ
పెండ్లి యాడ సద్యః ప్రేమ విరియ నెదల
గర్భవతి యయ్యెఁ జూపులు కలిసినంత 10
అన్నుల మిన్న యంజన విహారము సల్ప గిరీంద్ర సానులం
జెన్నుగ మచ్చెకంటి యట శీతల వాయువు వీచుచుండగా
మిన్నగ రేఁగ మోహము సమీరున కామెను గౌఁగిలింపఁగాఁ
గన్నులు కన్నులున్ గలియఁగా సతి గర్భముఁ దాల్చె వింతగన్ 9
అజరామర మౌను యశం
బజస్రము మునీంద్రులకు నిహ పరము లందున్
నిజముగ వాంఛాలిని సం
త్యజనముఁ జేయంగ సమిధ లాజ్యము లేలా 8
ధ్వజములు ఛత్ర రాజము నృపప్రవ రార్హము లుండ నింపుగా
వ్యజనము లూని హస్తముల నంగన లిద్దఱు వీచు చుంద్రు వా
రిజదళ నేత్ర! వన్య చమరీ మృగ సుందర దీర్ఘ లాంగుల
వ్యజనముఁ జేయఁగా సమిధ లాజ్యము లగ్నులు హోత లెందుకో 7
పానాశ నాది బాధలు
హీనమ్ములు కాఁగ నింక నిలలో నెందుం
గానక మందులు నిజమే
సానులతోఁ జెలిమి మోక్ష సాధనము గదా 6
మానుగఁ బ్రాణు లన్నిటను మానక విష్ణువు నిత్య ముండుటన్
వానర కిన్న రోరగ నభశ్చర నిర్జర దేవ గాయనీ
మానవ యక్ష వన్య మృగ మానుష భోజన వంశ జాతలన్
సానుల తోడి మైత్రియె సుసాధ్య మొనర్చును మోక్షమున్ సదా 5
[సాని = అధిపురాలు]
పరమోత్సాహముతో న
య్యరవిందాక్షులు స భక్తి నచ్చటఁ బాడన్
వర తాళ యుక్త వాద్య ము
ఖర గానము సభను వినఁగఁ గల్గె ముదంబే 4
పర మాశ్చర్య గళ స్వరమ్ము లడరం బాడంగ నా గాయకుల్
వర వీణా మరళీ మృదంగ సుమహా వాద్యాది నాదమ్ములన్
హర నామావలి సత్కథా కలిత విఖ్యాతంపు ఖండేందు శే
ఖర గానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్ 3
అరి రాజు లణఁగి వేగమ
మరలిన నస్త్రములు వీడి మౌనము తోడం
దరుణు లడరి నోములు నోఁ
చ రణము పద్మాకరమున జాఱిన శుభమౌ 2
భద్రాభ్రాసన మందు రత్న రుచులన్ భాసిల్ల నాసీనవై
క్షుద్రాలోచన లెల్ల వీడి నిలు నిశ్శోకంబ రాజిల్లె రా
జద్రాకేందు నిభాస్య! యాస్తరము విస్తారమ్ముగా మెత్తగా
భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్ పద్మా! కర మ్మందునన్ 1
[కరమ్ము = అధికమ్ముగ; అందునన్ = అందులో]