పండితుల నగ్రగణ్యుఁడు పద్య రచన
లందుఁ గడు దిట్ట మేధావి డెంద మందు
నెవ్వ రనుకొంటి వీతని నివ్వధాని
వంద యవధానము లొనర్చె మంద బుద్ధి! 59
ఎందుకు నీకు నిట్టి పగ నీతని పై నవధాని వర్యుపైఁ
గొందఱు గొప్ప పాండితినిఁ గొందఱు ధారణ మందు గొప్ప యే
చందము నెంచి చూచినను జక్కని ధీనిధి గాఁడె లీలఁ దా
వంద వధానముల్ బుధులు బా గనఁ జేసెను మంద బుద్ధియే 58
ఎగిరి నట్టి బంతి యిల మీద పడు నట్లు
పుట్టి నట్టి వాఁడు గిట్టు నట్లు
వృద్ధి వొంది నంతఁ బృథ్విలోఁ దప్పక
పతన ముండు నెంత వారికైన 57
సతతం బుండవు హర్ష దుఃఖములు నిస్సందేహ మెవ్వారికిన్
సతతం బుండవు భోగ భాగ్యములు నైశ్వర్యమ్ము నెవ్వారికిన్
సతతం బుండదు వృద్ధి యెవ్వరికినిన్ సత్యంబు చింతింపఁగన్
బతనం బుండదె యెంత వారలకు నైనన్ లోక ధర్మం బిదే 56
త్రాగి నంతటఁ గాఁబోఁడు త్రాగుఁబోతు
గుట్టు రట్టు సేయఁగఁ దా నగు నిలఁ ద్రాగుఁ
బోతు గోల సేయును ద్రాగుఁబోతు కరము
తుదకు నశియించుఁ ద్రాగుఁబోతు రుజ లడర 55
త్రాగినఁ గాని దుఃఖమును దాల్ప నశక్తుఁడ నంచు నెంచుచుం
ద్రాగుచుఁ దూలుచుండి నిదురం గలలం గనుచుండి నిత్యమున్
మూగగఁ జేయ రోదనము బోరన నాయు వణంగ సంత తా
ధోగతి పాలుగాఁగ జన దూషితుఁ డౌ నిల నంతుఁ గాంచఁగన్ 54
పర మాశ్చర్యం బక్కట
కరి మ్రింగిన వెలఁగ పండు కరణి గృహమునన్
గరిమంపు దొంగ యా ట
క్కరి తాఁకిన వస్తు చయము గనుమఱుఁ గయ్యెన్ 53
మరు దతి వేగధాటికి సమస్తము లిద్ధరఁ గంపితమ్ములౌ
ధర నుదకమ్మునం దడియఁ దప్పక యార్ద్రము లెల్ల వస్తువుల్
తర తమ భేద మెంచ కతి దారుణ వహ్ని జగత్ప్రజా భయం
కరి స్పృశియించి నంతటనె కన్మఱుఁ గయ్యె సమస్త వస్తువుల్ 52
పెద్ద లైన వృద్ధులు నైనఁ బిన్న లైనఁ
గాంత లైనను గాదేనిఁ గన్య లైన
భేద మున్నె వెతల కిది బేల పలుకు
బ్రహ్మచారులకే కదా బాధలెల్ల 51
బ్రాహ్మ ణాన్వయ మందుఁ బుట్ట నపార భక్తి సెలంగ నా
బ్రహ్మముం బఠియించు చుండి యవారితమ్ముగ సంత తా
జిహ్మ వర్తనమున్ వహించి యశేష నిష్ఠఁ జరింపఁగా
బ్రహ్మచారులకే కదా ఘన బాధ లెల్లను జూడఁగన్ 50
దినమణి నిశామణులు నైన దిక్కు లేక
రాహు కేతువుల భయము రగులు కొనఁగ
నెదురు కొన సాహసింపక యెడఁద లందుఁ
బర్వమని రవి విధు లొక్క ప్రక్కఁ జనిరి 49
ఇర్వురు బాల్య మిత్రు లట నింపుగ నేర్చిరి విద్య నొక్కెడం
బర్వులు తీయు లోకమునఁ బాఱుచు వీడిరి పొట్ట కూటికై
యర్వది యేట మిక్కుటపు టక్కజ మీయఁగఁ దారసిల్లఁగాఁ
బర్వ మిదే యటంచు నొక ప్రక్కకు నేఁగిరి సూర్యచంద్రులే 48
పుంస్త్వా పుంస్త్వ విదారిత
పుంస్త్వ వితర్కమ్ము లెల్ల భూతల మందుం
బుంస్త్విషిత మనో భవముల్
పుంస్త్వము లేనట్టి వాఁడు పుత్రునిఁ బడసెన్ 47
పుంస్త్వరమాణ కార్యములు భూరి ఫలమ్ము లొసంగు నిత్యముం
బుంస్త్విషిత ప్రవృత్తి పరిపోషణ మెన్నఁగ గర్హ్యనీయమే
పుంస్త్వచ మిచ్చు దర్పమును బొందఁగ దైవ దయామృతమ్మునుం
బుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్ 46
[త్విషితము= ఉద్రిక్తమైన]
మార విరోధిని భావి కు
మార జనకుని నిజ చండ మారణ నయనున్
మారణ కారణు నిర్జిత
మారునిఁ బెండ్లాడె సీత మంజుల రూపున్ 45
[సీత =గంగా దేవి]
ఆ రఘు వంశ వార్ధి శశి నంబుద సన్నిభ వర్ణ గాత్రునిం
నీరజ పత్ర లోచనుని నిర్జిత ఘోరత రాసు రాలినిన్
శూర వరేణ్యు దాశరథి సుందరు రాముని రమ్య నవ్య కౌ
మారునిఁ బెండ్లి యాడినది మంజుల రూపుఁ డటంచు సీతయే 44
పేపరు- పెన్ను - టైపు- మెమో భారతార్థము :
వగ పేపరు దయ్యె నెద వి
నఁగఁ బెన్నుడులు వెగటై పునర్వచనములం
దగ నేర దామె మో మె
త్తి గరిమ బదు లిడఁగఁ గృష్ణ దీనత్వమునన్ 43
[వగపు ఏపు అరుదయ్యె;
వగపు యొక్క ఏపు(ఆధిక్యము) వగపేపు, షష్ఠీతత్పురుష సమాసము,
టు గాగమమునకుఁ దావు లేదు]
దోహదము కాదు గాంచఁగ
దేహాదుల వృద్ధి కింత తెల్లము కాఁగా
నాహా యేలా నీ కీ
సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా 42
మోహావేశము లాత్మ దారకములై ముప్పొద్దు వేధించెడిన్
గ్రా హాతీత వచో వికారమున శృంగారంపు వ్యాజ్యమ్మునన్
బాహాటంబుగ నేఁడు లభ్య మగు నప్రాశస్త్య వాగ్ధోరణీ
సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు వీడం దగున్ 41
క్షయ మొనరించియు దయ ద
క్ష యజ్ఞమున మేఁక శిర మొసఁగి రక్షించెన్
దయ నిభ శిర మొసఁగి సుతుని
లయకారుఁడె సృష్టిఁ జేసె లావణ్యముగన్ 40
నయ మేపారఁగఁ బ్రీతిఁ బంచుకొని రా నాథుల్ ధరం గార్య సం
చయ మిబ్భంగిని సృష్టి రక్షణము నాశంబుల్ శతానందుఁడే
దయ శ్రీనాథుఁడు రక్షణం బొసఁగ విధ్వంసమ్ముఁ జేకూర్పఁగా
లయకారుం డొనరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్ 39
ఆదరము దనర నిజ కృ
త్యాదుల నమ్మగ సతము జయం బగు నంచున్
మేదినిఁ దా నగు నాశా
వాది వధాని యనుటయె యబద్ధము శిష్యా 38
కౌశే యాంబర మూని దర్పమున శంకన్ వీడి డెందమ్మునం
బ్రాశస్త్యమ్ముగఁ జెప్ప నేరకయె యౌరా కీర్తి కండూతి నాఁ
బా శాబద్ధుఁ డనుక్షణమ్ము సభలం బద్యమ్ములన్ మార్పఁగా
నాశావాది వధాని యౌ ననుట శిష్యా పెద్ద బొంకే సుమా 37
మాట లందుఁ గాంచ మార్దవం బెట్లుండు
మగువ తనము నెడఁద మఱచి నిలువ
వెక్కసముగ నగుచు వేశ్యా లలామ యా
రామ యనిన బూతురా పలుకకు 36
తా ముగ్రమ్ముగఁ బల్క బూతులను మిత్రత్వమ్మునం బ్రీతియౌఁ
దా మాన్యమ్ముగఁ బిల్వ నామమున బాంధవ్యమ్ము నూహించి యా
హా మాత్సర్యము తోడ భీకరముగా వ్యాపింప శత్రుత్వమే
రామా యన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపం బగున్ 35
మించి యా యంచ యాన వహించి చేత
సారె సారెకు నాకుచు సారె యంచుఁ
బంచఁ బొరుగు వారు తమకుఁ బంచదార
తేలు కొండిని ముద్దాడె నీలవేణి 34
పశ్చిమ దేశ పర్యటన భావము తోఁచుఁ బరీక్ష సేయఁగా
దుశ్చరితమ్ముఁ దోఁప దిట దోష మొకింతయుఁ గాన రాదులే
నిశ్చయ రీతి మంచి దని నెమ్మి వహించి తులాఖ్య రాశినిన్
వృశ్చిక పుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దు లాడెనే 33
అంబరము లింక నన్నము
లం బరమ ప్రీతిని ననురాగమ్మునఁ ద్యా
గం బర్థుల కొనరింపక
సంబరములు సలుపు టేల జన్మ దినమునన్ 32
తన్మయ మంది సంతతము తద్దయు మద్య నిషేవనమ్మునం
దున్మక దుర్గు ణావలినిఁ ద్రుంపక షడ్రిపు వర్గ మింతయున్
విన్మ మహోత్సవమ్ముగను వేలకు వేలు వ్యయించి వెఱ్ఱులై
జన్మ దినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించు టేలనో 31
ఏమని వర్ణింపఁగ నగు
నా మృదు మధు రానుభూతి నర్జును సమ రో
ద్దాముని శాత్రవ వీర వి
రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్ 30
తామర సాయ తాంచిత దళాక్షిని మేఘ నిభ ప్రభాంగినిం
గోమలి నీల సాంద్ర తర కుంతల మత్త గజేంద్ర గామినిన్
భామను మత్స్య యంత్ర జితఁ బాండవ మధ్యము భండ నాంగ ణా
రాముని మానసమ్ము గడు రంజిలె ద్రోవదిఁ గాంచి నంతటన్ 29
వార్క్ష్యమున నుందు రేల స
రర్క్ష్య సదృశ కాంతి సంబరమ్మున నెవఁ డీ
తార్క్ష్యుఁడు వీరలు నెవ్వరు
తార్క్ష్యుని తనయుండు క్రీడి దమ్ముఁడు హరియౌ 28
[సరర్క్ష్య సదృశ కాంతి = నక్షత్ర సంబంధ (ప్రకాశము) నిభ కాంతితో]
వార్క్ష్య విరాజమాన తరు పంక్తి తటాక తటమ్ము లందు ఘో
రర్క్ష్య నినాద సంభరిత రమ్య గుహాంతర మందు నిల్చిరా
తార్క్ష్యుఁడు వాని బంధువులు తార్క్ష్యుని చుట్టలు వార లివ్విధిన్
తార్క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీ హరి బావ కర్ణుఁడౌ 27
[ఘోరరక్ష్య నినాదము = ఘోర భల్లూక సంబంధ నినాదము]
మీసము లుండవు నారుల
కే సమయము నందు నయిన నిల నొకచోఁ బే
రాసల తోడుత నించుక
మీసములు గలుగు తరుణి కమే యాగ్రహమౌ 26
మోసము సేయు పూరుషులు పొంతన లేని విధమ్ము పల్కుచుం
ద్రాస మొసంగు వారలును దారసిలంగ నవారితమ్ముగా
దాసిగ సంతతం బెడఁద దారను గాంచెడు మిమ్ము గాంచినన్
మీ సము లున్నఁ గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్ 25
కవి సన్మానాలను వర్ణిస్తూ మత్తేభ విక్రీడితము
1వ పాదం 1వ అక్షరం 'స' 2వ పాదం14వ అక్షరం 'న్మా'
3వ పాదం 5వ అక్షరం 'న' 4వ పాదం16వ అక్షరం 'ము'
స రసజ్ఞ వ్రజ పండిత ప్రవర విజ్ఞా నాప్రమేయ ప్రభా
నర సందోహ స పామర ప్రథిత సన్మా నార్హ విద్యాధిక
స్ఫుర దీశాన కృపాత్త భక్త జన సంపూజ్యమ్ముగా నూత నా
మర కావ్యమ్ములు వ్రాయఁ దత్కవికి సన్మానమ్ము నిత్యార్హమౌ 24
విచ్ఛిన్న మయ్యె డెందము
పృచ్ఛకునకు నత్తఱిని వివేకం బాఱెం
దచ్ఛిరము వ్రాలె నక్కట
పృచ్ఛకుని వధాని దిట్టె వేదిక పైనన్ 23
మెప్పుల నింక నిందలను మేటి వధానులు పూరణమ్ములన్
గొప్పగఁ బల్కు చుండుదురు కూర్మిఁ గ్రహింపఁగ నొప్పు వానినిం
దప్పుగ నెంచఁగాఁ దగదు ధర్మము కాదు తలంప నివ్విధిం
దిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్ 22
భూత దయ యెడందఁ బూజ్యమై యుండంగ
నింక దైవ భక్తి యింత లేక
గొప్ప కొఱకుఁ గాక యిప్పగిదిఁ బతికిం
దపము లేలనొ యజనమ్ము లేల 21
కపట మొకింత లేక యెదఁ గంజ దళాక్షు పదాంబుజంబులన్
నృపవర!నిల్పి యాత్మలను నిత్యము భక్తినిఁ దద్వికుంఠ ధా
మ పదద నామ సంస్మరణ మంత్రము లింపుగ వల్లె వేయగం
దప మొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై 20
తొల్లి మంతనమ్ముల నాడి యెల్ల రుల్ల
సిల్లి వ్యర్థ ప్రసంగము లెల్లఁ జేయఁ
దోరముగ సమయాతీత కారణమున
ధారణం జేయని వధాని కౌర మెప్పు 19
పార మెఱుంగ రాని దగు పాండితి కన్న సభాంతరమ్ములన్
ధారణ ముఖ్య మెన్నఁగ వధానము లందు నిరంతరమ్ము స్వీ
యేరిత పద్య సంచయము నించుక యేనియు గర్హణీయమౌ
ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్ 18
చెప్పినది వినం డెప్పుడు
తప్పులె వచియించు సంతతము వ్రాయకుమీ
తప్పులు పథ్యమురా యిటఁ
బప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ 17
చప్పుడు సేయకుండఁ దగఁ జక్కఁగఁ బద్యము విన్న వారికిం
దప్పక చిత్ర వీక్షణము దక్కును శీఘ్రమ యట్లు కానిచోఁ
బప్పుల తోడ బెల్లమును వారక తిన్డని చెప్పి నంతటం
బప్పులు బెల్లమే వలదు పద్యమె కావలె నండ్రు బాలకుల్ 16
ఏ ప్రాంతంబం దున్నఁ గ
వి ప్రవరుల కున్నె లోటు విశ్వం బందున్
సుప్రాచ్య పండితులతో
నప్రాచ్యులు సేయఁ జాగి రవధానములన్ 15
సుప్రామాణ్యములై విరాజిల నిలన్ సుశ్లోక ధీవర్యులే
సుప్రక్షాలిత హృత్సరోజములతో శోభిల్లఁగన్ సత్కవుల్
విప్రావిప్ర కులోద్భవప్రవరు లీ విశ్వమ్ము నందుండ నా
యప్రాచ్యుల్ బుధులై వధానములఁ జేయం జొచ్చి రాంధ్రావనిన్ 14
అర్థ గాంభీర్యమునఁ దాఁక నంబరమును
శబ్ద లాఘవ మింపుగ సంతరింప
ధార సంతస మీయ నుదారముగను
బండితులు మెచ్చ నిది రమ్య పద్య మయ్యె 13
[మెచ్చన్ +ఇది =మెచ్చ నిది ]
దండిగ నిచ్చి విత్తములు దండము లింపుగఁ బెట్ట నిత్యమున్
మండల నేత లందఱిని మానుగఁ దృప్తిలఁ జేయ రక్తిమై
ఖండము లైన భావములు క్రన్ననఁ బండిత మాని ప్రాపునం
బండితు లెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రస రమ్య పద్యమై 12
ధర్మ్యచ్యుతు లయి నిజ పితృ
హర్మ్యార్థము సోదరు లనయం బక్కట నై
ష్కర్మ్య రతులు పగతు రయిరి
హర్మ్యంబునఁ దగవు లాడె హస్తి మకరముల్ 11
ధర్మ్యాధర్మ్య విదుండు భక్త జన హృద్ధాముండు రక్షింప నై
ష్కర్మ్యుం డవ్యయుఁ డప్ర మేయుఁడును శ్రీకాంతుండు బాంధవ్య సా
ధర్మ్యంబై జల జీవ సంచయము నిత్యం బుండు తత్పద్మినీ
హర్మ్యం బందున హస్తి నక్రములు సేయం జొచ్చె సంగ్రామమున్ 10
'ఈగ - దోమ - నల్లి - పేను' ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో:
ఈ గరితయె కలదో మఱి
వేగమ తా నల్లిన తలఁపే నుగ్గయినం
జాగినదొ యాత్మ హత్యకు
నే గతిఁ గను గొందు నింక నే జానకినిన్ 9
గగన తల మందుఁ జీఁకటి క్రమ్ము కొనఁగఁ
దార లెల్ల డెందముల సంతాప మందఁ
దద్ద కోపమ్ము సెలఁగ నంతమ్ము కాఁగఁ
బగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె 8
విన లే మక్కట నిట్టి మాటల నహో విజ్ఞానులే పల్కగం
జనునే పల్కఁగ నిట్టు లార్యులకు నస్తవ్యస్త వాక్యమ్ములం
గన నీ మాటలు తోఁచు చున్న యవి నిక్కం బెంచ నిబ్భంగినిన్
దిన మధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్ 7
భక్త సందోహమున కవి ముక్తిదములు
సంకట హరణమ్ములు విశ్వ సన్నుతుఁడు భ
రతుఁడు శిరమున నుంచిన రాఘవేంద్రు
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్ప నొప్పు 6
చప్పుడు సేయ నేల సువిచారము సేసి గణింప సత్యముల్
తప్పక యాచరింప వలె ధాత్రిని నెల్లరు మానవాళి కె
ల్లప్పుడు నంచితమ్ముగను బ్రాజ్ఞ వరేణ్య ముఖచ్యుతమ్ము లా
చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును దప్పు గాదులే 5
[చెప్పులు = చెప్పెడి మాటలు]
స్ఫూర్తియె జగతికి నార్యా
వర్తం బెందుండును నిజ భర్త నిరతమున్
వర్తిల్లుచు రక్షకునిగ
భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్ 4
[కాఁడె = కాఁడు గదా]
వర్తన మందు రక్కసుని భంగిఁ జెలంగుచు సంతతమ్మునున్
ధూర్తుల వెన్నుఁ గాచుచు నధోగతి పాలొనరించి రుద్రుఁడై
యార్తి నొసంగి భూ ప్రజకు నంత మెఱుంగని రీతిఁ గ్రూర భూ
భర్తయె భారమై సతిని బాధలకున్ గురి సేయు నెప్పుడున్ 3
[సతి = భూనాథుని సతి, భూదేవి]
తప్పులను నేర నింపుగ నొప్పు లెల్లఁ
దెల్లము లగుఁ దత్క్షణ మిది కల్ల కాదు
మాన కన్య విద్యార్థుల మాట లందుఁ
బంతులే చెప్పెఁ దప్పులఁ బలుకు మనుచు 2
వింత యనంగ నేల యిది విద్యలు నేర్పెడు రీతు లందు నొ
క్కింత విభిన్న మార్గ మగు నెల్లరి క్రీడ యనంగ నొప్పు ని
శ్చింతగఁ జక్కఁగన్ బడుల శిష్యుల నేర్పు గణింప నెంచుచుం
బంతులె తప్పులం బలుక వచ్చని చెప్పెను బిల్లవాండ్రతో 1