1, నవంబర్ 2022, మంగళవారం

సమస్యాపూరణ_నవంబర్ 2022

వీఁకను జూపించుచుఁ దగు 
సాకులు వొందఁగ ఫలమ్ము సాధింపంగా 
లోకమ్మునఁ బ్రాణేశుని  
శోకమె భూషణము గన విశుద్ధ మనమునన్                                     59   

వాకిటఁ బుష్ప భార నత పాదప పంక్తులు తోరణమ్ము లౌఁ
బ్రాకట భూషణావళులు పన్నుగ నాతికి నిర్మలమ్మునౌ 
నాకము భంగి నా ముఖమునన్ దరహాస సమేత సంత తా
శోకమె భూషణం బగు విశుద్ధ మనంబున నెంచి చూడఁగన్                   58              

హరునకు తగునే యా రీ
తి రమణి కీయం బరీక్ష దేవేరిగఁ దా
గిరి కన్యం గొన నంచును  
గిరిజా కళ్యాణముఁ గని కేశవుఁ డేడ్చెన్                                               57  

హరునిన్ భర్తగఁ గోరుచుం దపము నత్యంతార్తి సైరించి దు
ర్భర విక్షోభము లెల్లఁ జేసి శివునిన్ ఫాలాక్షు మెప్పింపఁగాఁ   
దరుణీరత్నపు బాధలం దలఁచి స్వాంతం బందు శీతాద్రినిన్  
గిరి రాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా                  56          

రమణీ మణి నా లక్ష్మినిఁ
గమనీయమ్ముగ నెడంద గంభీరుఁడు సం
ద్రము నిజ ఘన ధైర్యమ్మున  
హిమవంతుఁడు హరికిఁ దన దుహిత నిచ్చెఁ గదా                                  55                 

నయగారమ్మున మించు నట్టి తనయన్ నాగేంద్ర హారుం దలం
చి యెడందం దగి నట్టి నాథుఁ డనుచున్ శీఘ్రంబ  డెందమ్మునం
బుయిలోటమ్మును వీడి హైమవతినిన్ ముక్కంటికిం, మ్రొక్కి తా  
నయ మొప్పన్ హిమవంతుఁ డా హరికిఁ, గన్యాదానముం జేసెరా           54         

నిస్త్రింశమ్మునఁ దత్కుసు
మాస్త్రుం గాల్చిన హరుని మహాదేవుని హ
ర్యస్త్రు శివు నంబరాంబరు 
వస్త్రచ్యుతుఁ గాంచి సతులు ప్రణమిల్లరొకో                                          53           

సస్త్రీబాల సజీన పూరుషులు నిశ్శంకన్ ఝషాంకాస్త్ర స
ద్యస్త్రస్తాత్మలు గోపికా మణులు మిథ్యా బాలు శ్రీకృష్ణునిన్ 
శాస్త్రామ్నాయవిశారదల్ ముని సతుల్ సక్కంగ సద్భక్తినిన్ 
వస్త్రమ్ముల్ విడ నాడువానిఁ గనుచున్ భామామణుల్ మ్రొక్కరే            52            

జలక మాడుచును యమునా జలము లందు 
వల్లవీ మణులం గూడి ద్వాపరమున   
వింతగ బలభద్రుం డట వీణ లేని 
వైణికుం డయ్యె రాముఁడు భామినులకు                                            51      

ప్రాణము సీత రామునకు భామకు రాముఁడె దేవుఁడెన్న నె
క్కోణము నుండి చూచినను గోమలి కెన్నఁడు వింతగాదు తా
ర్కాణము లేల కృష్ణునిగ రామఁడు ద్వాపర మందుఁ బుట్టి తా    
వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్పఁగన్                    50     

తీరెఁ గష్టము లెల్లను గోరిన విధి
నుండ వచ్చు నంచు నెదల మెండు గాను, 
నరకమును జూపి బాధించిన పగ వాని 
తండ్రి మరణింప, సుతులు ముదంబుఁ గనిరి                                     49        

అం డ్రిటు లెల్లరుం బుడమి నాత్మ కృతాఘ ఫలమ్ము నెందు నొ
క్కండ్రు కలండె దాఁటఁగను గాంచఁ బురాకృత దుష్ట కర్మముల్ 
తీండ్రములౌ విధమ్ముగ విధించిన దుఃఖ పరంపరల్ వెసం  
దండ్రి! గతింపఁగన్ గడు ముదంబును బొందిరి పుత్రు లత్తఱిన్           48   

పద్మం బొక్కటి సరసినిఁ  
బద్మ సతీ రత్న మొకటి పాథోనిధినిం 
బద్మావతి  యిలను మహా 
పద్మమొకటి కోటలోనఁ బ్రభవమ్మొందెన్                                         47      

పద్మదళాక్ష మిత్ర సఖు వైశ్రవణున్ దశవక్త్రుఁ డుద్ధతిన్     
ఛద్మ మనస్కుఁ డాసురుఁడు సంగర మందు జయింప బల్మినిన్ 
సద్మము నిండ వెల్గులను సన్నిధి రత్నమహో లసన్మహా
పద్మము కోటలోనఁ బ్రభవమ్మును బొందె నదేమి చిత్రమో                   46        
[సత్ + నిధి రత్నము = సన్నిధి శ్రేష్టము. ఇక్కడ పద్మ, సతీరత్నము 
వ్యస్త పదములు. పద్మ కు విశేషణము సతీరత్నము]  

ఆలోచింపక సుంతయుఁ 
గాలుని దండనము లెడఁదఁ గాపురుషు లిలన్ 
లోలు లయి యొనర్చెడు పా 
పాలె జనావళికి నరక వాసమ్ము నిడున్                                         45         
 
ఏ లీలన్ భగవంతుఁ డిద్ధరణి నేయే రీతులన్ జీవులం
బాలింపంగఁ దలంచు నవ్విధములన్ వర్తిల్ల నొప్పుం జుమీ  
యీలోకమ్మునఁ బాప కారకములౌ యీ దౌష్ట్యచింతౌఘ కూ
పాలే సర్వ జనాళికిన్ నరక సంప్రాప్తిన్ వెసం గూర్చెడిన్                     44       
సంతతమ్ము నాత్మ సంతోష ముప్పొంగఁ 
జేకురుఁ గుశలమ్ము శీఘ్ర గతిని   
నంతరంగ మందు నడరుచున్నట్టి య
శాంతి లుప్త మైన సౌఖ్య మబ్బు                                                     43              

చింతలు మీఱ డెందమునఁ జిక్కులు కల్గఁగ జీవితమ్మునన్ 
వంతలు సంతరింపఁగడు వ్రక్కలగున్ మది శాంత మెల్లనున్  
శాంత మనస్కులై కరము సంతస మింపుగ నబ్బగా ని జా 
శాంతి విలుప్త మైనపుడె సౌఖ్యము దక్కును మానవాళికిన్                42          
[నిజ + అశాంతి = ని జాశాంతి] 

నిత్య మానవ సేవయే నెగడు మాధ
వున కొసంగు పరమ సేవ యనఁగ ధాత్రి   
నాశ్రిత దయాగుణమ్ము నిజాత్మ విగత 
దౌష్ట్యమే ధర్మపథము విధాతృ విధము                                             41       
 
మౌష్ట్య మసాధు వర్తనము మానఁగ నొప్పును సంతతమ్ము నౌ
త్కృష్ట్యము సుమ్ము భూత దయ దీన జనావన మెంచి చూడ వై
శిష్ట్యము మానవావలికి శ్రీహరి మెప్పు వహింపఁ గూడ దీ        
దౌష్ట్యమె ధర్మమార్గము విధాతృ వినోదము విష్ణు మాయయౌ             40   

వర్ణ మొక్కటి కాకున్నఁ బచ్చ నగు సు
వర్ణ వర్ణ తనుచ్ఛాయ వఱలు వనిత  
పూర్ణిమకు రవి నచ్చఁగ ముచ్చటగను   
బూర్ణిమను రవిగ్రహణమ్ము పూర్ణ మయ్యె                                        39         

తూర్ణము సాగుచుండఁ గడు దూరపు దేశము కల్గె నాకు వి
స్తీర్ణ నిరోధ మేఁగుటకుఁ దీవ్ర తరమ్ముగ విత్తభంగమై          
యర్ణవ తీర మందుఁ బరిహాసము కాదు నిజమ్ము కంటి నో     
పూర్ణిమ! నాఁడు వట్టినది పూర్ణ రవి గ్రహణంబు చోద్యమై                     38       
 

ఆహ్వీకర ణోత్సవముల 
కాహ్వానమ్ములు కడింది యర్థఘ్నమ్ముల్ 
విహ్వల కారకములు గా
నాహ్వానము శాప సదృశమై ముద మిడునా                                      37  

జిహ్వాగ్రమ్మునఁ దీపి నుంచి కప టాశేషంపుఁ బ్రేమమ్ముతో
నాహ్వానింపఁగ నుత్సవమ్ములకు నయ్యా  యేఁగ నచ్చోట దు
ష్ప్రహ్వోపేత వచో నికాయమున సంత్రాసమ్ము సంధిల్లఁగా  
నాహ్వానమ్ములు శాప సన్నిభము లయ్యయ్యో ముదం బిచ్చునా         36      

పెల్లుగఁ బతి పయి రాగం
బుల్లసిలఁగఁ బద్మ నేత్ర కొక్కుమ్మడినిం 
దల్లడిలఁగ విరహాగ్నికి 
మల్లెలు గన నల్ల నయ్యె మాలల నల్లన్                                             35      

నల్లని వాని చెల్లె లట నారుల నెంచఁగ నీల రత్నమే 
చల్లని వేళ నింపొదవఁ జక్కఁగ హెగ్గడికత్తె కృష్ణ సం
ఫుల్ల సరోజ నేత్ర పువుఁ బోడి విరాట సతీ గృహమ్ములో 
మల్లెలు నల్లవాఱినవి మాలల నల్లెడి వేళ వింతగన్                             34     

భీమాకారుఁడు రావణుఁ
డా మను జాశనుఁడు నద్దశాననుఁ డత్యం
తామానుషమ్ము ధర్మము
రాముని వృత్రుండు మ్రింగెరా జనులు గనన్                                         33     
[ వృత్రుఁడు = శత్రువు]

క్షేమం బిచ్చిన విశ్వ రూపు ద్విజు సత్కీర్తిన్ వెసం జంపఁగా
నామర్షమ్మునఁ ద్వష్ట జన్మ నిడఁగా నా పుత్ర శ్రేష్ఠుండు త
ద్ధీమంతున్ సుర నాథు వజ్రధరునిన్ దేవేంద్రు నా పుష్క రా
రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరా యంచు శ్లాఘింపఁగన్             32    

నోరు మంచి దైన నూరు మంచి దగును 
సామెత నిల వినమె చక్క గాను 
మంచి వర్తనమున మనుచు లోకము నందుఁ 
బరువు పెంచు కొనిన భాగ్యమబ్బు                                                       31               
[లోకము నందున్ + పరువు = లోకము నందుఁ బరువు] 

సురుచిర వాస్తు శాస్త్రమును జూచి చరించుమ నమ్మకమ్ముతో 
విరివిగఁ బ్రాగుదీచి దిశఁ బెట్టకు భారము నెన్నఁ డేనియుం 
బరు వది పెర్గు నష్టములు వాయును దప్పక విన్మ నైరుతిన్ 
బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము లబ్బును నిశ్చయంబుగన్           30            
[ఎన్నడేనియున్ + పరువు =ఎన్నడేనియుం బరువు] 

"మాత - పిత - తాత - దుహిత" నీతిని బోధిస్తూ యన్యార్థములో
వినుమా తరుణీ హంస గ
మన ఘన కుపి తాత తానుమానము వలనం 
గన రాదు హితము సుంతయు
మనుజులకున్ బ్రతుకు లందు మనము కృశించున్                                29                            

ఇలలో వెలసెను వెన్నుఁడు
కలికాలమ్మునఁ దిరుమలఁ గరుణాత్ముండై
యల వేంకటేశ్వరుఁడు భూ
తల కల్పద్రుమముగ నిడుఁ దా భాగ్యములన్                                           28       

విలపింపం బని లేదు డెందమున సంప్రీతిన్ సభక్తిన్ జనుల్ 
గొలువం దీరును బాధ లెల్లరకు సంకోచింప కాత్మీయ భ
క్త లలామాళికి శ్రీ సతీ మణియె నిక్కంబెంచ నీలాభ్ర కుం
తల కల్పద్రుమ మయ్యె నార్తులకు సద్భాగ్యంబులం గూర్చుచున్                27                  

పరలోకమ్మునఁ దప్పవు 
గురుతర శిక్షలు కృతము లగు నఘావళికిం 
దరుణుల యసభ్యపుం జి
త్తరువులఁ గూల్పంగ మేలు తప్పక కల్గున్                                                26           

తరువులు పండ్లు పూవులును ద్వక్కులు నాకులు నౌషధమ్ములున్ 
నరులకు నిల్వ నీడలు ఘనమ్ముగ నిత్య మొసంగుఁ గోరకే 
పురుగులు వట్టి యెండినవి పూర్తిగఁ గొత్తవి నాట నెంచి యా
తరువులఁ గూల్చినన్ హితము తప్పక కల్గును మానవాళికిన్                    25     

ప్రోత్సాహము లభియించును
గుత్సితపుఁ బనులకు భృశము ఘోరమ్ముగ బీ
భత్స మగు వీడ వలయు న
సత్సాంగత్యము వల దను సాహిత్యమ్మే                                                  24      

వత్సా నిక్కము నాలకింపు తగ నీ వాక్యమ్ములన్ శ్రద్ధగా 
సత్సంబంధము లిచ్చు సత్ఫలములం జక్కంగ నిద్ధాత్రి న
త్యుత్సాహమ్మునఁ జేర రాదు జనులన్ దుష్టాలిఁ బాపివ్ర జా
సత్సాంగత్యము వీడుమంచుఁ దెలుపున్ సాహిత్య మెల్లప్పుడున్               23             
[వ్రజ+ అసత్సాంగత్యము= వ్ర జాసత్సాంగత్యము ] 

ఆ పార్వతీ మనోహరుఁ 
డా పరమ శివుండు దీను నా శశిఁ బ్రీతిం 
గాపాడఁగఁ బ్రేత వన
శ్రీ పతి నెలవంకఁ దాల్చె శీర్షము పైనన్                                                  22  

శాప మొసంగ మామయె ప్రజాపతి దక్షుఁడు చంద్రుఁ డంతటం
బ్రాపున కేఁగి యంజలినిఁ బ్రార్థన సేయ సభక్తి శంభు నా
యాపద నుండి కావ నిటలాక్షుఁడు నీలగళుండు హర్షిత
శ్రీపతి మెచ్చి తాల్చెనఁట శీర్షముపై నెలవంక నొప్పుగన్                            21        

ఇంపొసంగు సేవా భావ మెంచి సతము
తాత నడిపింపఁ జక్కఁగఁ దలఁచి యెదలఁ
దోయజాక్షు లుందు రెలమిఁ దోడు గాను
జాయ లిద్దరు గాంధికి జాతి పితకు                                                          20  
[తోడుగాను + చాయ లిద్దరు = తోడుగాను జాయ లిద్దరు; చాయ = నీడ] 

కా మాటోపములేదు సుంతయును నిక్కంబెంచ సత్యార్థియౌ 
ధీమంతుండు మహాత్ముఁడే వలదు సందేహమ్ము కస్తూరి నా
సామాన్యాంగనయున్ ద్వితీయ సతిగా సత్యాగ్రహం బుండఁగా
మామా! యిద్దరు భార్య లుండిరి మహాత్మా! గాంధికిం జిత్రమే                       19            

ఎక్క డయిన వైద్యునకున్ 
ముక్కుచు నుండి కలి కాలమున రోగులకుం
జక్కఁగ నొక్కొక్కటిగను
బెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా                                              18       

నిక్కము కల్గ రాపిడి జనించును శక్తి విశేష రీతినిన్ 
దక్కఁగ సత్ఫలమ్ములు సతమ్ము విచారము సేయ మిన్నగా 
గ్రక్కదలంగ నూహ లెదఁ గ్రమ్ముకొనంగ రచింపఁ బద్యముల్  
బెక్కు సమస్య లుప్పతిలఁ బెన్నిధియౌఁ గవు లెల్ల వారికిన్                           17

సల్లలితమ్ముగ నిటు నటు
మెల్లగ నడయాడు చుండ మృదు మధురముగా 
నుల్ల మలర నొక్క చెవుల 
పిల్లినిఁ గని యెలుక పిల్ల పెండ్లికిఁ బిలిచెన్                                                    16         

కల్లయె యోడలే యగుట క్రన్నన  బండ్లు ధరాతలమ్మునం 
జల్లగ సైంధవుండు సరసమ్ముగఁ బాండు కుమారులే యనిం
దల్లడిలంగఁ బల్కెను గదా యెదిరించి భయమ్ము లేకయే  
పిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్                           15 

తెల్ల వాఱు జామునఁ గుర్యఁ దెల్లని వగు 
మంచు బిందువు లాకుల యంచు లందుఁ  
దోఁచె నప్పట్టు నందిట్లు వేచి చూడ
మావి కొమ్మకుఁ బూచెను మల్లెపూలు                                                          14  

నల్లని వాఁడు పద్మ నయనమ్ముల వాఁ డటఁ గాఁగ మాయమే 
వల్లవు లెల్ల నుల్లములు వ్రక్కలు కా విర హానలమ్ముతో 
నెల్లరు వేఁగి చేరఁగ నగేంద్రములం బరికింప వెన్నునిన్ 
మల్లెలు పూచె ముచ్చటగ మామిడి కొమ్మకు మాఘ మందునన్                    13   

అడరి కుంతీ కుమార మధ్యముఁడు రాత్రి
సమయమునఁ జేరి నర్తన శాల శత్రు
భేది కీచకు సైరంధ్రి మీది వలపు
టంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను                                                       12  

సంధి వరింప కుద్ధతిని సంగరమున్ వరియించి పోరఁగా 
బంధు జనుల్ నశింపఁ గని పాఱిన దాగఁగ మడ్గు లో నహో 
యంధు సుతున్ సుయోధనుని నా తొడ లందు, నశేష రాజ్య కాం
క్షాంధునిఁ, జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్                         11        

మేను లున్నఁ జేయఁగ వచ్చు దానములను 
మేను నశియింప శక్యమే దాన మీయ 
మానవునకు ధరఁ దనకు మాలి నట్టి 
దాన మిడకుండుటే మేటి ధర్మమగును                                                             10     

కానఁగ ధర్మ సూక్ష్మములు కంజున కైనను నేర శక్యమే  
మేనునఁ గోసి యిచ్చె శిబి మేటి కపోతము నీక డేగకున్  
మానవు లీయ దాన మిల మాన్యమ యైనను బ్రాణ హానియౌ 
దానము సేయ కుండుటయె ధర్మము శర్మముఁ బుణ్య కర్మమౌ                             9   

అడిగెడిది బిచ్చ కాదు మేలైన భక్తి 
గాని యిచ్చు నట్టిది కనకమ్ము కాదు
దివ్య మహిమను వీక్షించి తెలిసి కొనుమ 
తిరిపె మెత్తెడి వాఁడెట్లు దేవుఁ డయ్యె                                                                   8 

హరి హర మాయ లేరికి సమంచిత రీతిని నర్థ మౌనులే 
కరి వర చర్మ మూనుటయుఁ గాటిని నిత్యము సంచరించుటల్ 
హరి మెడ నూఁగులాడుటయు నక్షిని వహ్ని సెలంగుటల్ గనం 
దిరిపెము నెత్తు వాఁడు మన దేవుఁడుగా నెటు లయ్యెఁ జిత్రమే                                7  

కేళీ లీలల నయినను 
ఫాలాభీలాక్షుని పయిఁ బలుకకు మిట్లున్ 
వేళాకోళములు వలదు 
భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ                                                                   6   

కాళిందీజల వర్ణు నాత్మసఖుఁడే కాళీ సతీ భర్తయే 
తాళం జాలరు దేవతా మునులు దైత్యవ్రాత గంధర్వులుం  
దాళధ్వాన సమేత నర్తకు నిటుల్ ధర్షింప నిర్భీతినిన్ 
భోళాశంకరుఁ డేదొ యిచ్చు ననుచుం బూజింప మూఢత్వమౌ                                   5    
 
తగునె శంకింపఁగా భారత జన శక్తిఁ
దగునె యిట్టు లాత్మ న్యూనతను వహింప 
దగునె నీ కిట్టి ప్రశ్న వింతగఁ దలంపఁ  
దగున భారతీయుఁడు బ్రిటన్ ధవుని గాను                                                              4   

అగణిత భార తావనిని నాంగ్ల జనేశ్వరు లేలఁ గాంచమే 
తగు నని యేండ్లు పెక్కు ఫలితమ్ముగ నేఁ డవకాశ మేర్పడెం 
దగదయ పల్క నివ్విధము తద్దయు సందియ మూని యాత్మలోఁ 
దగు నొకొ భారతీయుడు ప్రధానిగ నేలుట యాంగ్లదేశమున్                                        3  

చక్క సల్లాపముల తోడ సంతసమునఁ
గాల ముత్సాహ ముప్పొంగఁ గడపి తిరిగి
వారి వారిండ్ల కేఁగచుఁ బట్ట లేక
పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము                                                                 2     

మెండుగఁ గాల మేఁగఁగ సమీపము సేరుట కొక్క సారిగా 
నండ లభించి నట్టుల నిజాత్మలఁ దల్చుచు నొక్క రొక్కరే 
దండకు వచ్చి నంతటనె తద్దయు హర్షము పొంగి పొర్లఁగాఁ
బండుగనాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై                                             1