1, డిసెంబర్ 2022, గురువారం

సమస్యాపూరణ_డిసెంబర్ 2022

అత్రి కడగంటి చూపుల నలరి నట్టి 
చంద్రుఁ డుదయింప విరిసెఁ గజ్జలము లింక   
నదితి పట్టి మారీచ వంశాబ్ధి పూర్ణ 
చంద్రుఁ డుదయింప వికసించె సారసములు                                               61     

భృశ మనుమానమే కలుగఁ బెద్దలు కొందఱు జ్ఞాన వృద్ధులే 
నిశితపు బుద్ధి గ్రాహకుల నేర్పును నేర వచింతు రివ్విధిన్    
విశదమ యెల్ల వారలకుఁ బృథ్విని వింత నెఱుంగ మిందులో  
శశి యుదయింప విచ్చుకొనె, సారసముల్ ముకుళించెఁ, గల్వలున్              60

కవి వరేణ్యుల మార్కొని యవితథముగ 
స్వీయ గౌరవ మెల్లెడ వెలయ నెంచి 
సభల గెలువంగఁ బాండిత్య సంగర జిత
కాశి కేఁగిన కవికిఁ గాంక్షలు సెలంగె                                                  59        

ఆశల నెల్ల వీడి మది నంబరకేశు భజించి భక్తితో 
నాశలు పిక్కటిల్లగ మహాత్ముని గొప్పతనమ్ముఁ జాటఁగా    
నీశునిఁ బద్యగద్యముల నింపొసగం బొగడంగ నాత్మలోఁ   
గాశికి వెళ్ళి నట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా                     58                 

మాటి మాటికిఁ జెలరేఁగి చేటు గూర్ప 
సంగరమ్ములు వర్ధిల్లు సంతతమ్ము  
నంద ఱొక చోటఁ జర్చించి నంతఁ దొలఁగ 
సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు                                         57      

భంగము సేయ ధర్మమును భండన భూమి సబాంధవమ్ముగాఁ 
జెంగక కూల్చె రావణుని సీత నిమిత్తము రాముఁ డుగ్రుఁడై   
సంగత మైన దుష్ట జన సంచయ మిద్ధర సత్య ధర్మ యు
క్సంగర మిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్య జాతికిన్          56               

నారాయణుండు నీ పతి 
నీరజ పత్రేక్షణ! విను నిశ్చల మతినిన్   
వారక ప్రమథగ ణాలికి 
క్షీరాంబుధి తనయ! మగఁడు శ్రీకంఠుండౌ                                         55                    

క్షీరాంభోధి యొసంగ విష్ణునకు నా శ్రీ లక్ష్మినిన్ భార్యగా 
నా రాశిన్ జనియింపఁ శంకరునకున్ హాలాహలం బీయఁగం  
బారావారము తోడఁ జెప్పె నిటులన్ వాక్యాలి శైలేంద్రుఁడే  
క్షీరాంభోధి! కుమారియౌ గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ                        54                       

భాషలు వేఱైనను నిజ
వేషము లూనినఁ గడింది ప్రీతిని నొకచో    
రోషము దోషము గాదే!  
దోషంబులు లేక యుంట దోషము గాదే!                                            53                 

ద్వేషము వీడ కుండుటయు వేగిరపాటు వహించి యుంటయున్ 
వేషము నందు నించుకయుఁ బేరిమి సక్కఁదనమ్ము స్వచ్ఛతల్     
భాషల యందు మార్దవపుఁ బల్కులు డెందము నందు సుంత యేఁ 
దోషము లేక యుండుటయె దోష మటంచు వచింత్రు పండితుల్            52                                       

మందునకు నెవ్వ రున్నను  
ముందుం గామప్రకోపములు నిత్యమ్మున్ 
డెందమ్ము నాక్రమింపఁగ 
సుందరి వెన్నెలవె యనుట చోద్యం బెటులౌ                                        51  

మంద సమీర సన్నిభము మానిని నీ వచ నాలి వీవ ని
ష్యంద శరీర చందనము చారు తరంబు సెలంగ సంత తా
నంద విలాస శుద్ధ దరహాస విరాజిత చంద్ర వన్ముఖీ 
సుందరి నీవు వెన్నెలవె చోద్యము గా దిటులన్ వచించినన్                    50        

సిలువ - చర్చి - యేసు క్రీస్తు   లతో విష్ణుస్తుతి 

నుత గుణ చర్చిత చక్రీ 
స్తుతియింతును భాసిలు వయసున ననురక్తిన్
సతతము నీ రక్ష నరసి  
మతియే సునిశితము కాఁగ మాధవ! నిన్నున్                                      49            

సీత బ్రతికుండఁ బతిపయిఁ బ్రీతి తోడఁ  
బుట్టఁ గవలు కుశలవులు నట్టడవిని 
నొప్పిదమ్ముగ సౌమిత్రి సెప్పె నిట్లు 
రామునకు నత్త యగు నఁట రమణి సీత                                                48    

భామ లౌదురు  కన్య లెల్లరు  వారు వెర్గిన ధాత్రిలో 
భామ  లింపుగఁ దల్లు లౌదురు వారు గూడఁగ భర్తలన్ 
భామ లింపుగ నత్త లౌదురు వారు వొందఁగ బిడ్డలన్  
రామ! చంద్రుని భార్య యొక్కతె రాజసంబున నత్తయౌ                             47               

సకల గుణ సుసంపన్నుఁడు 
వికచాంబుజ లోచనుఁడు భువిని సందేహిం
పక ఖరు స్వీయోద్ధతి ద
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై                                                 46      

వికలీ భూత సనాతనార్ష మత దుర్భేద్యున్ దశగ్రీవు నా
యకళంకాత్ముఁడు రాక్షసాంతకుఁడు నీలాభ్రప్రభా కాయుఁ డా
వృక సంకాశుని దుష్ట మానసుని నారీలోక మున్యౌఘ నా
శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్                     45          

ఇభ నిభ బలుండు శూరుఁడు 
నభోనదీ సూను నాయనయె నిర్జర స
న్నిభుఁ డైన బాహ్లికుఁడు, కా
దభిమన్యుఁడు, భారతమున నతి వృద్ధుఁ డగున్                                          44                    

ఇద్ధాత్రిం గృప కుంభసంభవజ రాధేయాస్త్ర శిక్షాక రై
కేద్ధస్కంధుల ధార్తరాష్ట్రులను దేవేంద్రాత్మపౌత్రుం డహో   
యుద్ధప్రాభవ విద్య లందు నరి వీరోగ్రుండు నిక్కమ్ముగా 
వృద్ధుం డందఱి కంటె భారతమునన్ వీరాభిమన్యుం డగున్                            43              

తోఁకల జాడించుచు నట 
భీకరముగఁ గుక్క లఱవఁ బేరిమి చెడునే   
యే కాలమ్మునఁ గరికిన్ 
శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్                                                   42                       

శ్రేయం బయ్యె జయింపఁ బండితులకుం జిత్రంపు టా భూమి లో     
నాయా రీతుల సర్వ శాస్త్రముల విద్యా పాటవం బెన్నఁగా 
సాయంకాలము వేసి ప్రశ్నల నహో సంక్లిష్ట వాక్యమ్ములం 
జేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళం బందునన్                              41               

భువిఁ గయితగాండ్లు కూయఁగఁ 
గవి! కర్ణ రసాయనములు గాకుల గోలల్ 
భువిలోఁ గాకుల కింపుగఁ  
గవి! కర్ణ రసాయనములు గాకుల గోలల్                                                       40                   
[రసాయనము = 1. విషము, 2. ఔషథము]

తాఁకినఁ గత్తి వాటు మెయిఁ దాళఁగ వచ్చును గాని యౌర చీ
కాకు సెలంగ డెందములఁ గావ్యము నత్తఱి నాలకింపఁగా 
నాకుల చిత్త తప్తులయి రందఱు పండితమాను లైన యా 
కాకుల గోల నేఁడు కవి కర్ణ రసాయన మయ్యె వింటివా                                     39  
[రసాయనము = విషము]

మున్నడుగక యేల మరణమ్ము నెఱిఁగింప
వలసి వచ్చెను మధురాధి పతికి నిట్టు  
లకట యాకాశవాణి పలుకక యున్నఁ  
గంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని                                                   38                             

కంసుని మించు దుర్జనునిఁ గానము భాగవతమ్ము నందుఁ దా
ధ్వంసము సేయఁగాఁ దొడఁగె బాలుర నెల్లరఁ బ్రాణ భీతినిన్   
హంస నిభుండు కృష్ణ నిర తాత్ముఁడు ఘోర కుటుంబ భార భా
గంసుని మించు సజ్జనునిఁ గానము భాగవతమ్మునన్ సఖా                                 37   
[భార భాక్ + అంసుని = భార భాగంసుని; భాక్ = పొందినది; అంసము = మూపు] 

ధర్మ వేత్తలు నుడివిన దారి నడువ 
ధరణి జనుల కెల్లరకును దథ్యముగను  
సంతసం బొనగూర్చుచు సంతతం బ
శాస్త్ర దూర కార్యమ్ములు సౌఖ్య మొసఁగు                                                              36         

అస్త్ర యుగమ్ము వోయె నణు వద్భుత రీతిని నేఁడు వచ్చెనే 
శస్త్ర విభాగ మందు నిల సర్వము నాశము సేయఁగాఁ ద్రుటిన్    
వస్త్ర విభూష ణాస్త్ర చయ వాహన యోజన దైత్య సంచర
చ్ఛాస్త్ర విరుద్ధ కార్యములె సౌఖ్య మొసంగును మానవాళికిన్                                    35    

ఎన్న వింత గాక యున్నె నన్నుం బోలి
యున్న యన్నర వరుఁ గన్న చెన్ను  
నన్ను నన్ను లందు మిన్న నున్నని చెక్కి 
లద్ద మందుఁ గాంతు నన్యు నొకని                                                                        34                  

రద్దులు సేయ కెద్దినము శ్రద్ధగఁ దద్ద సెలంగఁ బెద్ద గో
మద్దిర! సుద్దు లుద్ధతిని హద్దు లెఱుంగక గ్రుద్ది పల్కుచున్    
బ్రద్దలు కాని శుద్ధమును గ్రద్దనఁ గంటికిఁ బెట్టి నట్టి దౌ 
యద్దము నందుఁ గాంచి నపు డన్యుఁడు గన్పడు నెల్ల వేళలన్                                  33       

హిత మొనర్చెను గురు పత్ని కెలమి నిచ్చి 
పౌష్య పత్ని కుండలములు బ్రాహ్మణుండు    
దొంగిలింపఁ గుండలములు దొంగ యయ్యెఁ  
దక్షకుఁడు, హితకారి యుదంకునకును                                                                 32           

దక్షత నిచ్చునట్లు గురు దక్షిణ పైల మహర్షికిం దగన్  
వీక్షణ మాఁత్మఁ జేసి కడు భీతిని నేరక దొంగిలించి తా  
రక్షిత కుండలమ్ములు ధరా సుర వర్యున కిచ్చి సుంతయేఁ   
దక్షకుఁ డాప్తుఁడై హిత ముదంకునకుం బొనరించె మేలుగన్                                       31               

స్వజన పరజ నావలిఁ గాం
చ జగతిని సుమధుర పాక శాస్త్రమ్ములలో 
సృజనా రీతుల సన్నుత 
భుజ బలమున సతుల మించు పురుషుఁడు గలఁడా                                                  30      

అజునకు నైన శంభునకు నైన బలారికి నైన మత్త సా
మజ గమ నాంతరంగమున మంత్రము లేరికి నేర్వ వచ్చునే   
నిజమును బల్క శాంతమున నీరజ నేత్రలఁ దక్క నొక్క త 
ద్భుజ బల మందుఁ గాంతలను బూరుషు లెన్నఁడు మించఁ బోరు పో                             29

యమున దాటంగ గోష్పద మయ్యెఁ గాదె 
తులసి దళము భక్తి నిడఁగఁ దూఁచెఁ బతిని  
హరిఁ దలంప మనమ్మున నడ్డు గలదె  
గరిటతోఁ దోఁడవచ్చు సాగర జలమును                                             28     

హరిఁ బూజింప ఫలంబొ యార్తవమొ తోయం బైనఁ జాలం చనన్  
వర పూజార్థము సన్మనమ్మునను సంభావింప దేవాళినిం  
గర పద్మమ్ముల నచ్చ టిగ్గరిటెడుం గాదేని యీ బిందెఁడున్     
గరిటం దోఁడఁగ వచ్చు వార్ధి జలముం గామేశ్వరా వింటివా                     27                 

అక్షోభ్యము తన వారికి 
స్వక్షేమము తెలుప వ్రాయ సంతోషముగా  
నక్షయముగ జాబు సెలఁగి   
పక్షమ్ములు దెగిన పక్షి పైపై కెగసెన్                                                   26       

రక్షో నాథుని నే నెఱుంగుదును వే రండంచు వృత్తాంతమున్ 
సక్షేమంబు దశాస్యు జాడ తెలుపన్ సంపాతి చిత్రమ్ముగా  
నిక్షిప్తమ్ములు కాఁగ రామ మహిమన్ నీరేజ పత్రాక్షుచేఁ  
బక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్                          25        

నిత్య వేశ్యాంగనా జన భృత్య నరులు
సంత తానంద మగ్న విశ్రాంత జనులు
నిత్య విత్తాంతరంగ వాణిజ్య పరులు
పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు                                              24      

చోద్యము కాఁగఁ బ్రాస కయి శుష్కప దావళి నింపఁ బాదముల్
పద్యము లందహో యతికి వ్యర్థ పదమ్ములు నింపు చుండ సం
వేద్యమ పండితోత్తములు విజ్ఞులు విస్తృత మున్న నేలలోఁ
బద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే                         23
           
నత్త మొత్తమ్ము నందొక్క నత్త కెత్తఁ 
జిత్త మందు నత్తఱి వీస మెత్తు ప్రేమ 
నత్త నత్తను మెత్తగ హత్తుకొనఁగఁ  
గొట్టె నత్తనుఁ బ్రేమతోఁ గోడలమ్మ                                                        22                     

మెత్తని మాట లత్తఱి నిమిత్తము లెంచి సదుత్తరమ్ము నే
యుత్తల మాత్మ నత్తుకొన కుత్తమ వృత్త సమగ్ర చిత్త సం
విత్తము నౌ విధం బిడఁగఁ బ్రీతిని నంత భుజమ్ము పైన మే     
నత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్                        21        

ప్రబల దుర్మార్గము కడింది లంక లోనఁ 
దనరి రక్షింప ధర్మము నిన కులమునఁ  
బుడమిని హరి ఘోర వినాశము వొడఁగాంచ  
రాముఁ డుదయించె రావణు రాజ్యమందు                                            20                      

భామను గొంట గైకొని నెపమ్ముగ వెన్నుని భక్తితోడ స
ర్వామర లోకమా యజుని నబ్జజు ముందిడి దీన చిత్తతన్   
ధీమతిఁ గోర రావణు వధింప మహా నగరం బయోధ్యలో 
రాముఁడు పుట్టె రావణుని రాజ్యము నందున ధర్మ రక్షకై                         19         

భగ్నములు కాఁగ భద్ర వి
లగ్న పృథకుఁ గౌరవుల కలలు భావిని దీ   
ప్తాగ్నినిభ మడరఁగ నినుఁడు  
ప్రాఙ్నగమున నర్జునుఁడు సుభద్రకుఁ బుట్టెన్                                            18              
[సుభద్ర = ఇక్కడ భ ద్రావలగ్న యైన కుంతి]

వాఙ్నలినాక్షి గాంచ దయ వ్రాసితి నివ్విధి మెచ్చఁ బండితుల్ 
వాఙ్నయ రీతినిం గ్రమముఁ బన్నుగ నెంచి పఠింప నింపుగం   
రుఙ్నిచయుం, డజన్ముఁడు, నరుం ,డభిమన్యుఁడు, సంగరమ్మునం 
బ్రాఙ్నగ మందు, శంభుఁడు, సుభద్రనుఁ గూడఁగఁ, బుట్టెఁ, గ్రీడియే                   17                     

దర్భల పైఁ గూర్చిండియు 
దుర్భర మగు నిష్ఠ తోడఁ దొడర నహో యా
విర్బావులు మంత్ర మహిమ   
గ ర్భాదానమునఁ గవలు గల్గిరి సతికిన్                                                       16  
[గర్భ + అదానము = గ ర్భాదానము]

దౌర్భాగ్యంబ తలంప వేఁడుకల నుత్సాహమ్మునం గాంచుటల్ 
నిర్భాగ్యుల్ ధర నేర రెన్నఁ డనినన్ నిక్కంబ స్వీయాత్మ జా
విర్భావమ్ముల నేర శక్య మగునే విశ్వమ్ములో నో బృహ
ద్గర్భా! దానము నాఁడె కల్గిరి కవల్ కామాక్షికిం జూడఁగన్                                15      
[గర్భదానము సాధు సమాస మని నా యభిప్రాయము. వాడుకలో గర్భాదానము.] 

కమ లాయ తాక్షు కారు
ణ్యమున నిరంతరము వడయ నానందమ్మున్  
సముచిత మీ జీవ సమా
జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూర వలెన్                                               14     

స మదము తన్నదీ మణి విచార విహీన తిరస్కరింపఁ జెం
త మసలు మంచు నాజ్ఞ నిడఁ దద్బల రాముఁడు బల్లిదుండు సాం
త్వమున నమర్షమే చెలఁగ వాహిని కీయఁగ ఘోర శాపమే   
జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరఁగా వలెన్                            13           

చూచు వారల మనసు ముదమ్ము వడయంగ 
సుందర తర ముండ సుదతి యిల్లు  
ప్రాకటముగ రక్తి వాకిట రంగులు 
దార మెత్తె భువి నుదారముగను                                                                       12   
[మెత్తు = పులుము] 

దారగ భూసతిం గొనఁగఁ దల్చి మహోద్ధతి నెత్తి దర్ప హుం 
కార మడంప దైత్యునకుఁ గ్రాలు వరాహ మహావతారమున్  
భారము గాఁగ దూది వలె వైష్ణవ మాయ సెలంగ శ్వేత కుం
దారము భూమి నెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్                                      11  

యక్షవరుఁడు సుకేతున కంచితముగఁ    
దపము నొనరింప నిష్ఠఁ బెద్ద సమయమ్ము    
బ్రహ్మ యొసఁగిన ముద్దుల పట్టి యనుచుఁ 
బూజ్యురాలు తాటక యని మునులె యనిరి                                                           10  

చేటొన గూర్ప నిట్లన విచిత్రము మార్పకుమీ చరిత్రమున్ 
వీటఁ జెలంగు పిల్లలకుఁ బ్రీతినిఁ జెప్పుమ సత్య మెప్పుడుం    
బాటవ మొప్ప చెప్పుమ యబద్ధము నాడక యే యుగమ్మునం  
దాటక పూజ్యురా లనుచుఁ దాపసు లెల్లరు గొల్చి రింపుగన్                                        9         

బెదర కుండఁగ నుండంగఁ బిల్ల లెల్ల 
రక్షణం బొసఁగఁ దలంచి యా క్షణమునఁ  
దెంపు మది నూని భృశము గాండ్రింప నచట 
నెవ్విధిఁ బులి, పిల్లలను లాలించె లేళ్లు                                                                     8               

శ్రీమంతుండు దయార్ద్ర దృష్టిఁ గన సంప్రీతిన్  సహస్రాక్షుఁడే     
భూమీ నీర నభశ్చరావలికి సంపూర్ణమ్ము శాబాలిపైఁ 
బ్రే మస్వాంతము జీవ కోటి కడరున్ విశ్వమ్ములో నెన్నఁగా 
నేమేమీ పులి పిల్లలన్ గదిసి లే ళ్లీరీతి లాలించెనా                                                        7                 
[అన్వయము: పులి లేళ్లు పిల్లలన్ గదిసి]  

మనుజుల తనువులఁ గల  చెమటలు నింక 
దుమ్ము నిత్యమ్ము నక్కటఁ గ్రమ్మ మలిన
ములు సెలంగఁ గరం బబ్బు ముఱికి గాని  
మునుఁగ గౌతమిలో నెట్లు మోక్ష మబ్బు                                                                      6    

కనక విభూషణమ్ములను గైతవ వృత్తి నొసంగ నెన్నియున్ 
ఘన కలుషాత్ముఁ డెన్నఁడును గైటభ మర్దను గాంచ నేర్చునే 
మనమున భక్తి నిల్పకయె మానవ ఘాతకఁ డెన్ని మార్లునున్ 
మునిఁగిన వాఁడు మూర్ఖుఁ డగు మోక్షము దక్కున గౌతమీ నదిన్                                     5       

ఆ మాయావిని సాయము 
నా మనుజాశనుఁడు గోరి యసురేంద్రుఁడు ము
న్నా మారీచుఁ, డెవనిఁ గనె 
రాముఁడు, కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్                                                                       4   

ధీ మతి రావణుండు సుర దేవుని శంకరు భక్తుఁ డెన్నఁడున్ 
క్షేమము నెల్లఁ దా నడిగి కేళులు మోడ్చి నమస్కరించి త
త్కామ నిహంత భూత గణ కాంతుని శంభుని చెంత నుండి వే 
రా ముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్                                           3      

వాదములకు నింక భేదములకుఁ దావు 
లేక యుండు నట్టి రీతి నచట  
మూర మేలుగ నధికారంపు టా పంప
కాలు మేలు గూర్చె గ్రామమునకు                                                                                    2 
 
కాలాతీతము కాక మున్న సిరి భూకాంతుల్ స్వదేశమ్మునన్ 
లోలత్వమ్ముల నెల్ల వీడి తగ నాలోచించి వేగమ్ముగా  
మేలౌ రీతి వ్యయమ్ము సేయఁగను సంప్రీతిం బరీక్షించి సుం
కాలే మే లొనఁగూర్ప విల్లసిలె నా గ్రామంబునన్ సౌఖ్యముల్                                                1