మానవ సంక్షయ మిత్తఱి
నే నే మని చెప్ప నేర్తు నిశ్చయ మయ్యెం
గానఁగ దుశ్శకునమ్ములు
మీనపు గర్భమునఁ బెక్కు మేఁకలు పుట్టెన్ 57
మానవ కోటి కీయఁగ నమంద ముదమ్ము నమేయ మేష సం
తానము వృద్ధి సెందగను ధారుణి లోనఁ గడింది సంత తా
నూనముగా నరణ్యముల నుచ్ఛమునన్ గురు శుక్రు లుండఁగా
మీనపు గర్భమందుఁ బలు మేఁకలు వుట్టెను గొండ కోనలన్ 56
[మీనపు గర్భము = మీన రాశి యంతరము]
మాధవుని భక్తిఁ బూజించు మానవులకుఁ,
బుణ్య కర్మము లొనరింప గణ్యముగను
సాయ మించుక యైనను జేయ కున్నఁ
బాపులకు, సుఖములు దక్కు స్వర్గ మందు 55
దుర్గమ మైన వైతరణిఁ దూలక దండధ రోగ్ర వాహినీ
వర్గపు బారినిం బడక భద్రత సేకుర స్వీయ మృత్యు సం
సర్గము వొందు నట్టి తఱిఁ జక్రి వరాఖ్యను బల్కి నంతటన్
స్వర్గము నందుఁ బాపులకు సర్వ సుఖంబులు దక్కు నిత్యమున్ 54
నర సు రాసుర గంధర్వ నాగ కిన్న
రాప్సరో గణ యక్ష విహంగ రాజు
లరయఁ బదునాల్గు లోకము లందు నెలమిఁ
గంధ రహిత సుమమ్ముల గౌరవింత్రు 53
[కంధము = మేఘము; సుమము = ఆకాశము]
అంధులు గూడ సంఘమున నర్హులు మన్నన లంద నెంచఁ గా
మాంధు లనర్హు లందఁగ నిహమ్మున గౌరవ మించు కేనియున్
గంధము లేని పుష్పములుఁ గంజ దళాక్షుని యర్చ కొప్పు దు
ర్గంధము లేని పూవులకె గౌరవ మబ్బు సమాజ మందునన్ 52
దుర్మతి కంసుఁ డొకింతయుఁ
గూర్మి వహింపక నిజ జనకు నునిచెఁ జెఱలో
ధర్మ విదూరు మతమ్మున
ధర్మ విరుద్ధమ్మె యగును దండ్రికి మ్రొక్కన్ 51
నర్మము లేల పల్కఁగను న్యాయ మొకింత గణింప కక్కటా
మర్మము విప్పి చెప్ప వలె మానుగ నన్య మొకింత యున్నచో
ధర్మము సూపుచుం దగు విధంపుఁ బ్రమాణము వల్క నిట్టులన్
ధర్మ విరుద్ధ మౌను గద తండ్రికి సాఁగిలి మ్రొక్కఁ బుత్రుఁడే 50
అల్ప మనస్కుఁ డొకం డటఁ
దల్పము పైనం బరుండి తన మనమున సం
కల్పించి విచిత్రమ్ముగ
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్ 49
బల్పున విఱ్ఱవీగుచు నపార మదాన్వితుఁ డొక్కఁ డాత్మలోఁ
దల్పఁగ నిట్లు మిత్రు లెగతాళి యొనర్చిరి చూచి బొమ్మనుం
గోల్పడి యోర్మి వింతగను గోరి స్వయమ్ముగఁ జెక్కి నట్టి యా
శిల్పము వెక్కిరించె నని చిందులు వేసెను చూచి యంధుఁడే 48
అలవోకగ నత్తఱి వా
కిలి రోగ నిదానములు నికృష్టమ్ములు దో
మలు నీగలుఁ బోల్పఁగ నయి
పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్ 47
చెలరేఁగంగ భయంకరమ్ము లయి యక్షీణంబ గాండ్రింపులుం
విలయాభీల సుఘోర ఘీంకృతు లెదల్ భేదిల్ల వేర్వేఱ నా
వల నిం కీవల వింత భూతలమునన్ వాతోద్ధతిన్ రాలఁగాఁ
బులు లేనుంగులు భూర్జ పత్రములపైఁ బొల్పొందఁగా నిల్చెనే 46
ఆర్యాంబ శిఖండి యనఁగ
సూర్యుం డస్త గిరి సేరఁ జోద్యమ్ముగ సౌం
దర్య నిధి, మునుఁగ ముదమున
భార్యయె, భర్తగను మాఱె భాగ్యము గలుగన్ 45
ఆర్యుల భాషణమ్ము లివి యర్థ యుతమ్ములు సమ్మతమ్ము లౌ
దార్య గుణాభి రాముఁ డయి దార మనోరథ పూరణార్థ కైం
కర్య మొనర్ప నిత్య కృత కర్ముఁడు, హర్షిత తృప్తచిత్త గా
భార్యయె, భర్త యైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్య యోగముల్ 44
ఆఁగక నమలు నరునకు రోగ మబ్బుఁ
దూఁగ నిత్యమ్ము నరునకుఁ దొలఁగు సిరులు
వాఁగు నరునకు దండమ్ము వఱలు సుమ్ము
త్రాగు నరునకు మోక్షమ్ము దప్ప దెపుడు 43
బాగుగ నమ్మి డెందమునఁ బాప మెఱుంగని శుద్ధ భక్తితో
నాగమ సంచ యోక్తముగ నంచిత రీతిని నిత్య సుప్రశం
సా గరి మార్చనా సహిత మాధవ నామ సుధా రసమ్మునుం
ద్రాగెడు వాఁడు మోక్షమును దప్పక పొందు నఁటంద్రు పండితుల్ 42
పదుగురు మెచ్చ వలె నని యె
డఁదఁ దలఁచుచుఁపలుకు నా యొడయుల పదమ్ముల్
పదపడి వార్తా భాషా
పద సంపద నాశన మగు వ్యాకరణముచే 41
పద కోశమ్ముల నుండు గ్రామ్యములు దుర్వారమ్ములై దోషపుం
బద జాలమ్ములు పెక్కు పత్రికల దుర్భాగ్యంబు చింతింపఁగాఁ
జదువుల్ నేర్పవు నేఁడు తెన్గు నకటా సత్యమ్ము నెన్నంగ దు
ష్పద సంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్ 40
ఏ రీతిని రామునితోఁ
బోరు దలంపఁ దగ దంచు బోధింపంగా
నా రావణునకు ధర్మము
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్ 39
ఆరాధ్యుం డగు దైత్య దానవ విహం గాదిత్య సిద్ధాప్స రో౽
నూరశ్యేన గవాశ్వ యక్ష తరు నాగోష్ట్రౌఘ శార్దూల ర
క్షోరాడ్వ్రాత మృగేంద్ర గార్దభముఖస్థోమమ్ముఁ బుట్టించె నో
ధారాళమ్ముగ నెవ్వఁ డివ్వసుధ నాతం డౌను నిక్కమ్ముగా
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్ 38
[మారీచుఁడు = మరీచి పుత్రుఁడు, కశ్యపుఁడు]
జగతి నడపించు నెవ్వండు సతము నంచు
నెట్లు జీవ రాసులు జనియించె నంచు
భూమి కున్నట్టి యాధార మేమి యనుచు
దేహ మున్నంత వఱకు సందేహ ముండు 37
ఆహా యాత్మకు స్వీయ కర్మ ఫల భోగానేక జన్మమ్ములే
శ్రీహర్యాజ్ఞఁ జెలంగు చుండ నకటా చిత్రాతి చిత్రమ్ములై
బాహాటమ్ముగ నగ్నిఁ గాల్చు దనుకన్ భద్రమ్ముగా ధాత్రినిన్
దేహం బుండెడి దాక నుండు గద సం దేహంబు లీ దేహికిన్ 36
[దాక = తొట్టి (దాఁక = వఱకు): సం దేహములు = మంచి దేహములు]
ఆడఁ బోయిన తీర్థము పాడిగ నెదు
రైన యట్టి చందమ్మున నక్కజముగ
సాయ మొనరింపఁగఁ దలంచి శత్రువులను
జంప వచ్చు వారిఁ గనిన సంతస మగు 35
సంతస మందిరి శత్రువర్గముల్ - యన్వయ లోపము.
కయ్య మొనర్చెడి వారలు సంతస మందిరి; శత్రు వర్గముల్ కంపము నంద డెందముల.
ఇట్లు పూరణమున నన్వయ ప్రాప్తి గమ నార్హము.
ఇంపుగఁ దాము గోరినదె యివ్విధి నిప్పుడు గాంచ నయ్యెనే
తెంపున మార్కొనంగఁ దమ ద్వేషుల నెల్లర నన్యు లుద్ధతిం
గంపము నంద డెందములఁ, గయ్య మొనర్చెడి వార లత్తఱిం
జంపఁగ వచ్చు వారిఁ గని సంతస మందిరి, శత్రు వర్గముల్ 34
లేప నార్థమ్ము నింపుగ రేపు మాపు
వనిత వాంఛించి వియ్యాల వారి కంత
బదులు, నని యిట్లు మే మన్య వసతు లందు
విడియ, మిచ్చి భార్య యడిగె వే తనమును 33
[తనము= గంధము]
అంగనా మణుల మతు లెఱుంగఁ దరమె
మాసపు మొదటి దిన మంచు మది నెఱింగి
గోముగఁ బతి దేవుఁ గదిసి కులుకు లొలుక
విడియ మిచ్చి భార్య యడిగె వేతనమును 32
పడతులఁ దల్ప నల్ప లని భావ్యము గా దిల నిశ్చయమ్ముగా
నొడయునిఁ గాంచి యత్తఱిఁ దలోదరి పుత్ర నిమిత్త మింపుగాఁ
దడయక కూర్చి సద్గురువు దక్షిణ నుంచి యరంటి పండ్లతో
విడియము నిచ్చి భార్య తగు వేతన మిమ్మనె జంకు లేకయే 31
క్రుంగక ప్రాణ భయమునఁ దొ
లంగక రణ భూమి నుండి ప్రబలెడు పర సే
నాంగమునకు వెన్నీయక
సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ 30
అంగజ తుల్య సుందరుఁడు నంతక సన్నిభ విక్రముండునుం
బింగళ సన్నిభుండు నగు వీర్య విరా డభిమన్యు సవ్యసా
చ్యంగజు సన్ను తాతిరథు నాజి దురాసదు వైశికమ్మునన్
సంగర మందు నోడినను శౌర్య ధనుం డని మెచ్చుకొందురే 29
వ్రేళుల నైపుణ్యమ్మున
వేళాకోళమ్ము గాఁగ విపరీతముగా
లీల నగ లందు నంతటఁ
దాళిని దొలఁగించె భర్త తరుణియె మెచ్చన్ 28
[వేళాకోళము = చిక్కయినది]
మేళము లింపుగాఁ దనరి మిన్నును నంటఁగ మ్రోగుచుండఁగాఁ
దాళము లింక వాద్యములు దద్ద పురోహితుఁ డన్న యట్టి యా
వేళ నెడంద మిక్కుటపుఁ బేర్మి ముహూర్తము నందుఁ గట్టఁగాఁ
దాళిని దీసె భర్త వనితామణి మెచ్చఁగఁ బ్రేమ తోడుతన్ 27
భూమి జనులకుఁ జెలంగె న
హో మోహ మెదలఁ గడింది యున్మత్తులు కాఁ
బ్రేమాంధత్వమునఁ జలుపఁ
బ్రేమి కుల దినోత్సవ మని విలపింపఁ దగున్ 26
వికలము లైన డెందముల వెఱ్ఱితనమ్మున మర్త్యు లక్కటా
నికరము నీతు లాఱఁగ గణింపరు ధర్మము యౌవనస్ఫుర
త్సకల విరుద్ధ నాగరికతా మహి మోత్థిత నిందితమ్ము ప్రే
మి కుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్ 25
మచ్చరింప కెడఁద నచ్చ మైనట్టి భా
వము గ్రహించి సతము సముచితముగ
మంచి గుణము లరసి యంచితముగ వాని
మెచ్చ నట్టి వారె మిత్రు లకట! 24
ఇచ్చకు నచ్చి నట్లు వచియించెడి వారలు పెక్కు రిద్ధరన్
నచ్చని వానిఁ గట్టెదుట నాన్పక చెప్పెడు వారిఁ గాంచమే
కచ్చె వహించి పల్కి యిడి కాఱియ నిట్టుల సమ్మతింపఁ బో
మెచ్చని వారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్ 23
[సమ్మతింపఁ బోము+ఎచ్చని; ఎచ్చు=విజృంభించు ]
ఇచ్చ వచ్చి నట్టు లిహ లోక మందు వి
చ్చలవిడిని జరించి సంతతమ్ము
పాప మాచరింపఁ బరలోకమునఁ గల్గు
భయముఁ గూర్చు వాఁడె పరమ గురుఁడు 22
నయమును విస్మరించుచు ఘనమ్ముగ స్వీయ కృతక్రయాను వి
క్రయముల నుంచి సంతతము కైతవ మత్యధికమ్ము ధర్మ సం
క్షయ మొనరింప నిక్కముగఁ గాలుని సమ్మెట పోటు లుండు నన్
భయమును బెట్టు వాఁడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్ 21
పంకజ నయనను లక్ష్మినిఁ
గొంకక సంపన్ను రాలిఁ గొనినన్ సతిగా
నంకిలి లేక తన సఖుఁడు
శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్ 20
తెచ్చెన్ భాగ్యము విష్ణు శంకరులు సందేహింప కింతైననున్
విచ్చేయంగను భూతలమ్మునకు సంప్రీతిన్ విశేషంబుగా
వచ్చెన్ శ్రీసతి వెంట రాగ వడి నా వైకుంఠుఁడే యద్రికిన్
వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్ 19
కాషాయమ్ముల వెలుఁగుచు
వేషమ్ముల మార్చి యంత భీకర లీలన్
దూషించుచుఁ గపటమ్మున
రోష ముడిగి చంపిరే విరోధుల బలిమిన్ 18
18
ఘోష లొనర్చుచున్ భృశము ఘోర తరమ్ముగఁ దిట్టుచుండఁగన్
దూషణ భాషణమ్ము లవి తోరము నొవ్వఁగఁ జేయ నుగ్రులై
దోష నిరూపణమ్మునను దూర్ణము కించి దవాంఛనీయమౌ
రోషము లేని వారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్ 17
మెత్తఁ దనమున మించెడు నుత్తమంపుఁ
గొత్త పఱపు సందేహింపకుమ నెడంద
నింపుగఁ గొనుమ వీడుమ కంపు గొట్టు
చింకిబొంత లే జాతి సంస్కృతినిఁ జాటు 16
నే నిటఁ బల్కు చుంటి నయ నిక్కము నాధుని కోత్తమంపు టీ
మానవ జాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును దల్ప రాజముల్
మేనున కీయ సౌఖ్యమును మేలుగఁ బండఁ బురాతనంపు టా
మానవ జాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును జింకిబొంతలే 15
[సంస్కృతి = మంచి కృతి]
ఒక్కరి కైనను బోరున
దక్కునె శాంతి యిసుమంత తర్కించి యిటుల్
వెక్కసముగ నష్ట మొసఁగు
నక్కలనున్ స్రుక్కఁ జేసినన్ మెచ్చఁ దగున్ 14
[కలను = యుద్ధము]
దిక్కయి యెల్ల వారలకు దేశ పురోగతి పైన నాత్మలో
మక్కువ మిక్కుటం బడర మాన్పఁగఁ గ్రక్కునఁ జిక్కు లింపుగాఁ
జిక్కక యేరికిం బుడమిఁ జిక్కిన రొక్కము నెల్ల బొక్కెడిన్
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్ 13
కర్మ భూమి యైన భరత ఖండ మందు
వాడ వాడలఁ బరికింప బడుగు ప్రజకుఁ
గూడు లేకున్న నక్కట కుడువ నీరు
కడుపు నిండెను దీర దాఁకలియె సుంత 12
తడఁబడ కుండ బాసలను దద్ద యొనర్చి గ్రహించి పీఠమున్
విడువక యెట్టి మార్గమును విత్తము నింపుగఁ గూడఁబెట్టుచుం
గడుపులు గొట్టి లోకులకుఁ గాసుల తోడుత బొక్కసమ్ము నాఁ
గడుపును నింపుకొన్నను సుఖంబుగ నాఁకలి దీర దయ్యయో 11
విశ్వ విదితమ్ము జాంబవ
తీశ్వరు పుట్టింట నుండు నెలమిన్ ప్రక్షీ
ణైశ్వర్యుఁడు గాఁగ వెసన్
విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్ 10
ఆశ్వాసింతు సదుత్తరం బొసఁగి నీ వందంగ హర్షమ్మునే
విశ్వేశుండు జగద్వ్రజావనుఁడు నిర్భీతిన్ మహాంభోనిధిన్
విశ్వాత్ముండు వటచ్ఛదమ్ము పయి సంప్రీతిం బరుండుం గదా
విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో 9
శైత్య చండ కిరణ చయ చారు తనులు
నీరజద్విష మిత్రులు నిత్య చరులు
గగనమున నభశ్చారులు కాంతు లొసఁగ
సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప 8
శ్రీమద్రాజ కులోద్భవుల్ సమర దుర్భేద్యుల్ నరవ్యాఘ్రులున్
శ్రీమంతుల్ విలుకాండ్రు దాశరథు లక్షీణప్రభా కాయులున్
జామాతల్ జనకాఖ్య రాజ ఋషికిన్ సౌమిత్రి సీతాపతుల్
సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా 7
వేల లేనట్టి సంద్రము నేల ముంచుఁ
గట్టు బాటులు లేకున్నఁ గలుగు లయము
సొంపు నింపారఁగాఁ బరికింప నెట్లు
యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు 6
ధృతి నూనం దగు రాజ కార్యముల నిర్దేశింపఁ దద్దేశ భూ
పతి కెన్నండును దేశ రక్షణము సంభావింపఁగా నొప్పు సం
తతమున్ శాంతినిఁ గోరు మార్గ మిలలో ధర్మ్యంబు ఘోరావ హో
ద్యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్ 5
[ప్రాసము = ఈటె; పద్యము=మార్గము]
పూర్వము వినమే లోచన
పర్వపుఁ గవి సార్వభౌముఁ బండిత వరు నీ
యుర్విని విశ్వాస జనిత
గర్వమ్మే లేనివాఁడు కవి గాఁడు కదా 4
గర్వ విహీన ధీ పటిమ గౌరవ సంజని తేద్ధ భావ నా
ఖర్వ విలాస భాస పరికల్పిత రమ్య ముఖార విందుఁడై
సర్వ వచః ప్రభా కలిత శాస్త్ర వివేక విచక్షణౌఘ వా
గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్ 3
[వాక్+అర్వము=వాగర్వము; అర్వము = గుఱ్ఱము]
పంత మూని చంద్రు నొడిసి పట్ట వచ్చు
చేవ మీఱఁ గొండలఁ బిండి సేయ వచ్చు
మానవుండు దలంచిన మానసమున
దోసిటం బట్టి సంద్రమున్దోడవచ్చు 2
చేవ మీఱఁ గొండలఁ బిండి సేయ వచ్చు
మానవుండు దలంచిన మానసమున
దోసిటం బట్టి సంద్రమున్దోడవచ్చు 2
న్యాస తపోబలమ్మునకు నారయ దుష్కర కార్య ముండునే
త్రాస మొసంగ వీసమును ధారుణిలోఁ బరికింప నెందునున్
వాసిగఁ బట్టఁ బుక్కిటను బార్థ ఋషీంద్రుఁడు మున్ను జహ్నువే
దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగ వచ్చు నటన్న సత్యమే 1