అందెల్ ఘల్లన నాట్య మాడుచును బ్రహ్లాదాది రక్షో బృహ
త్సందోహం బిల మున్నిషేవణమునన్ సాధింపరే ముక్తినిన్
సందేహింపకు విష్ణు నామ రస మన్ స్వచ్ఛంపుఁ బానీయ మీ
మందుం ద్రాగినఁ దీఱిపోవుఁ గలినిం బ్రారబ్ధ పాపౌఘముల్ 61
యుక్తమె మన్నింప రుషా
సక్త దురాత్మను రవంత శాంతము గనమే
రిక్తగ నను నిందించెను
భక్తిగ వీక్షింప నామె భగభగ మండెన్ 60
[వీక్షింపను + ఆమె = వీక్షింప నామె]
యుక్తమె మోసగింప మది నూహ వహించుట యేరి కైన నా
శక్తి గలట్టి వానిఁ గన శక్యమె యెందును భూ తలమ్మునన్
భక్తుఁడ నంచు నెంచు నని భాగ్యద లక్ష్మిని దుష్ట భావ భృ
ద్భక్తిగఁ జూచి నంతటనె భగ్గున మండెను గాదె యామెయే 59
పరమాత్ముని శ్రీనాథుని
గురు వాత్సల్యమ్ముఁ జూఱకొన్న నరుండే
సుర లోకమ్మున, ధరలో
సిరి వీడిన వాఁడె, చెలఁగు శ్రీమంతుండై 58
అరవిందాక్షుఁడు వల్కెనే స్వయము నిత్యారాధ్యులే భూసురుల్
ధరలో నంచుఁ దదీయ విత్తములనుం దాఁకంగ రా దేరికిం
బెరుమాళ్లింపుగ నిత్యముం గొలుచు నా విప్రాలిఁ దర్జింప రా
సిరినిన్ దూరము వెట్టువాఁడె చెలఁగున్ శ్రీమంతుఁడై యెప్పుడున్ 57
సంతత సంతోష నిమ
గ్నాంతఃకరణ లచటఁ గల కాంతా మణులే
సంతాన విహీన లయిన
కాంతలు గనరారు రాయగడ నగరమునన్ 56
నామమె తెల్పు చున్నది ఘనమ్ముగ గొప్ప తనమ్ము నోర్మినిన్
భూమి సమాన లెల్లరును బుణ్య చరిత్రలు సుందరాంగు లే
ధామము నందుఁ గాంచినను దాన మొసంగని యట్టి వార లే
భామలు లేరు రాయగడ పట్టణ మందు నదేమి చిత్రమో 55
అవిరళ సాంద్ర తర తరు ప
రివృతగ్రామమ్ము సేరి హృద్యమ్మును బాం
ధవు గృహమున నెద నిజ శై
శవముం గని బాటసారి శాంతుం డయ్యెన్ 54
కవియఁగ నొక్క యాశ్రమముఁ గానన సీమను జేసి భక్తినిన్
సవినయ సప్రపత్తి ముని చంద్రున కంజలి స్వీయ సుప్రభా
ఛవులను వెల్గ రమ్యముగ సన్ముని ధామము నిర్మ లాపగా
శవమును గాంచి పాంథుఁడు ప్రశాంత మనంబున విశ్రమించెఁ దాన్ 53
[శవము = జలము]
ఎల్ల వేళ లందు నిలలోన గణియింప
శాంత గుణ మొసఁగదు శాంతి సుంత
దండ మొసఁగు గుణము దండిగఁ బరికింప
రణమె వలయు శాంతి రక్ష కొఱకు 52
క్షణదా గాములు జారచోరగణ సంఘద్రోహి సంఘాతమున్
పణవిద్యా పరిపూర్ణ పండితులు దుర్వ్యాపార పారీణులుం
బ్రణిపాతమ్ము లొసంగి వేఁడినను సంభావింతురే నమ్రులై
రణమే కావలె శాంతిరక్షణకు వీరా లెమ్ము లేలెమ్మిఁకన్ 51
పాల సంద్ర మందు లీలగఁ బ్రభవించి
పరవశమ్ము సెంది పద్మ నేత్రు
వింటి వమ్మ! తమ్మి కంటి లక్ష్మీ దేవి
హరినిఁ బెండ్లియాడె గిరితనూజ! 50
మరు మరణమ్ముఁ గాంచి వెత మానిని పార్వతి నిశ్చయాత్మయై
గురుతర భక్తి నిష్ఠను సుఘోర తపమ్ము నొనర్చి యద్రినిన్
హరుని వరించి క్షీర విమలాంబుధి సంజనితంపు శ్రీ సుధా
హరిని వివాహమాడె ధవ ళాచల పుత్రి సురల్ నుతింపఁగన్ 49
[శ్రీ సుధా హరిని = విష మనెడు నమృతమును హరించిన వానిని]
పట్టి తగఁ జెట్టపట్టాల నట్టహాస
మునను జుట్టరికము మూర ముదము తోడఁ
దిరిగి యిద్దఱు విద్యుత్తు తీఁగ నకట
ముట్టి యొకఁడు సచ్చె మడిసె ముట్ట కొకఁడు 48
దట్టపు గుట్టు రట్టయినఁ దట్టుకొనంగఁ దరమ్ము గాక యే
పట్టున నెట్టు లైన మెయి వట్టఁగ నెట్టనఁ దట్ట కన్యముల్
పట్టిన యట్టి బెట్టిదపుఁ బట్టును వీడక యగ్ని నన్నమున్
ముట్టి యొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడఁగన్ 47
ఏ వలను పరికించిన నెల్లర కిటఁ
గేవలము కల్గ నానందమే విరివిగఁ
జిక్కిచింతా భరమ్మున నక్కజముగ
నీ వసంతమునం బాడవేల పికమ! 46
ఈ విషాదము రేఁగఁ గారణ మెద్ది నాకు వచింపుఁడీ
రావు వెన్నెల కాయు చుండ విరక్తి యేల చకోరమా
యీ వలాహక సంభ్రమమ్మున నేల నాడవు చంద్రకీ
యీ వసంత సమాగమంబున నేల పాడవు కోకిలా! 45
కుదు రుండ దింట బయట నె
డఁద నధికారిగ మఱియు నొడయునిగ నుండం
బదిలము క్షీణింప సతము
పదములు రెండు గలవాఁ డభాగ్య నరుండౌ 44
[పదాలు = పదవులు]
ఉదార బుద్ధి సంతతమ్ము నున్నవాఁడు దానమున్
సదా యొనర్చు నట్టి వాఁడు సద్గుణుం డనంబడుం
బదంబు ముందు నొక్క టుండి వాక్య మంత మాఱఁగాఁ
బదాలు రెండు గల్గువాఁ డభాగ్యుఁడౌ వసుంధరన్ 43
[పదాలు = మాటలు]
చెన్నింత యేని తగ్గక
యున్నట్టి నెలంత నారయుఁడు నన్నిట నే
నెన్న నఱువ దేండ్ల వయసు
కన్నె ననుచు నవ్వయె నయగారము లొలికెన్ 42
అన్నుల మిన్న నేను మును యౌవన మందు గణించి చూడఁగా
సన్నని మేను పద్మ నిభ చారు తరాస్యము తోడ వెల్గఁగాఁ
జెన్నుగ వాసి కెక్కిన విశేష పరాక్రమ రాజ వంశపుం
గన్నెను నే నటంచు నయగారపుఁ బల్కులఁ గుల్కె నవ్వయే 41
యత్న మవశ్యము గావలె
యత్నమున కసాధ్య మెద్ది యవనిం దలఁపన్
నూత్న విధానమ్ముల ఘన
యత్నమ్మున నేర్తు మొక్కొ వ్యాకరణమ్మున్ 40
రత్న చయోదరీ తలము రాజవరేణ్య సురక్షితంబు గాన్
నూత్నతమప్రయోగ సుమనోజ్ఞ విధాన పరంప రోన్నతిన్
యత్న పరాత్మ మర్త్యులకు వ్యాకరణం బది బ్రహ్మ విద్యయే
యత్నము సేయు వారలకు వ్యాకరణ మ్మిసుమంత వచ్చునా 39
[ఇసుమంత వచ్చునా? కాదు కొండంత వచ్చు నని భావము]
స్వస్తి వచనమ్ములు వలికి
యస్తు సు కల్యాణము లని యఖిల జనులకున్
విస్తార విదుఁడు కుహనా
నాస్తికుఁడై భక్తి బోధ నయముగఁ జేసెన్ 38
విస్తృత మైన తర్కమున విశ్వ జనావలి విశ్వసింపఁగాఁ
బ్రస్తుత నాస్తికుం డయిన బ్రహ్మము గూర్చి వచించి యింపుగా
నేస్తము నెంచి సద్గురువు నిష్ఠ వహించి భృశమ్ము దాను ము
న్నాస్తికుఁ డాతఁడై ప్రవచనంబుల భక్తులఁ జేసె నెల్లరన్ 37
ఆతత కరుణం గంస వి
ఘాతి సమరకాంక్షుఁ జేయఁ గౌరవ సేనా
వ్రాతమునకుఁ జేసి యనిన్
గీతాబోధన నరునకుఁ గీడొనరించెన్ 36
వీతానుగ్రహ మానసమ్మునను సంవీక్షించి భూ సౌఖ్య సం
ధాతృస్థానము నాక్రమించి తమి నానాగోత్ర భూమీశ్వర
వ్రాతఘ్నం బగు యుద్ధ మెంచి వసుధా భారమ్ము తగ్గింపఁగా
గీతాబోధన సేసి యర్జునునకుం గృష్ణుండు కీడెంచెనే 35
కొలిచిన వరమ్ము లొసఁగు జ
నుల కాతఁ డరయునె భయమును ముదిమి నిలలోఁ
గలియుగ దైవం బయ్యప
పులి పట్టిన కుఱ్ఱ గనెను బూర్ణాయువునే 34
అల యా బాలుఁడు భీతినిన్ వణఁకి వే యార్వంగ వ్యాఘ్రమ్ము క్రే
పులకై వచ్చినఁ గాంచి నిర్భయముగా మ్రోగించి వాద్యాలి లో
కులు వీక్షించి ముహూర్తకాలమున నిర్ఘోషమ్ములన్ ముంచఁగాఁ
బులి నోటన్బడి నట్టి బాలుఁడు గనెన్బూర్ణాయువుం జిత్రమే 33
[పులిని + ఓటన్ = పులి నోటన్; ఓట = భయము]
భరత లక్ష్మణ శత్రుఘ్నులు రఘు రాము
న కవరజు లైరి దశరథ నందను లయి
భరత శత్రుఘ్నులకు నెన్న వరుస లక్ష్మ
ణన్న తమ్ముఁ డయ్యెను దమ్ముఁ డన్న యయ్యె 32
అన్నను గాంచి లక్ష్మణుఁడె యంచిత రీతిని నూఱడింపఁగా
నన్నుల మిన్న నాత్మ సఖి నక్కట జానకిఁ గోలుపోవఁగన్
మిన్నఁగ మున్గి దుఃఖమున నివ్వెఱఁ దా విలపించు చుండఁగా
నన్నయె తమ్ముఁ డయ్యె మఱి యన్నగ మారెను దమ్ముఁ డత్తఱిన్ 31
కానక యెదురుగ వచ్చెడు
యాన వరమ్మును జరింప నలవోకగఁ దా
నా నాతిని వీక్షించుచు
మానిని చిరునవ్వదియె ప్రమాదము దెచ్చెన్ 30
ఈ మహి మాన వావలిని నేరిని గాన మచంచలాత్ములం
గామ విహీన పూరుషులఁ గాన మసత్యము నిందు సుంతయున్
వే మన మందు మత్తిలఁగ వేదన తోడుతఁ గంపనమ్ములం
గోమలి మందహాస మది కో విడు, కన్న! ప్రమాదమే సుమీ 29
[కోవు + ఇడు= కో విచ్చునట్టి; కోవిడు మందహాసము; కోవు = ఆర్పునం
దగు ధ్వన్యనుకరణము]
సంశయమున లక్ష్మీ సతి చంచలాక్షి
తనదు కోడలి నడిగెను దరికిఁ జేరి
పార్వతీ సతి నామము పల్కు మమ్మ
పద్మసంభవు పత్ని! యపర్ణయె కద 28
పద్మ సంభవుఁ గాంచ నెంచి యపార భక్తి మహా మునుల్
సద్మ రాజము సేరఁ బ్రశ్నము సక్క వేయ వచింపఁగాఁ
బద్మలోచన పార్వతీ సతి భద్ర నామము నన్యముం
బద్మసంభవు ధర్మపత్ని, యపర్ణ యందురు పండితుల్ 27
అరయం గాకికి ముద్దగు
గురుతరముగఁ గాకి పిల్ల కోరఁగ నేలా
తరతమము లిట్లు భాషల
నొరియాకున్ సాటి వచ్చు నొకొ తెలుఁ గధిపా 26
ధరలో నెంచఁగ నెల్ల భాషలకునుం దా నిల్చు మూలమ్ముగాఁ
బరఁగున్ నిత్యము మాతృ భాషగను సంభావింపఁగా సుంద రా
మర భాషా ప్రవరమ్ము సంస్కృతము సంపాదింప దోషంబ మీ
కొరి యా భాషకు సాటి వచ్చునె తెలుం గో కృష్ణరాయాధిపా 25
[ఒరి=వైరము]
కథలందు లోకులకు సు
ప్రథితుం డగు చందమామఁ బరికింపంగా
మథియించి మదులఁ బంపఁగ
రథి లేకయె స్యందనమ్ము రయమున నేఁగెన్ 24
కథితోద్ధండ పరాక్రముండు నిజ రక్షా స్ఫూర్తి లంకాపురీ
పథ సద్యో గమనోన్ముఖుండు నయి యభ్యామర్ద రాజన్మహా
రథి పౌలస్త్యుఁడు త్రోల రామ శిత నారాచైక ఘాతుండు సా
రథి లేకుండఁగ నేఁగె స్యందనము తీవ్రంబైన వేగమ్మునన్ 23
వే యుష్ణం బడరంగం
బాయక నిస్సంశయముగఁ బరికింపంగా
నాయతముగ నఱకాళులఁ
గాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్ 22
ఏయే వేళల నివ్విధం బవనిలో నేపారు నా వేళలన్
జాయాస్యాంబుజ దివ్య దర్శన మహా సందిగ్ధ సంతాప ధౌ
రేయాక్షిద్వయ మార్తి మిక్కుటముగా రేఁగన్ నిరీక్షింప వే
కాయల్ గాచిన వెన్నఁ డైన ఫలముల్ గాఁ బోవు నిక్కంబుగన్ 21
కనులు మిఱుమిట్లు గొల్పఁగఁ గాంతు లీన
ననుసరింపఁగ నుఱుములు నంచితముగ
నుదరి వెలుఁగంగ నొక్క ముహూర్త మవని
మెఱపులు స్థిరము లని పల్కె మేఘపంక్తి 20
అఱిముఱి రేఁగు బుద్బుద కణావళి భంగిని సంభవించుచున్
వెఱపు నొసంగు భగ్గు మను భీకర వహ్నిని ధిక్కరించుచుం
దఱచుగ వర్ష కాలమునఁ దత్క్షణ మాత్రము వెల్గు లీయఁగా
మెఱపులు సుస్థిరంబు లని మేఘము లెల్లను నొక్కి చెప్పెనే 19
తార్క్ష్య మనోహర వాహనుఁ
దార్క్ష్యాశ్వకుమార వర్యుఁ దనరింపక యే
పార్క్ష్యక్రియనుం గాంక్షిత
తార్క్ష్యరథుం డలిగి మదను దగ్ధమొనర్చెన్ 18
వార్క్ష్యవరోన్నతాయుధునిఁ బంచ శరప్రము ఖాంగజాతునిం
దార్క్ష్యవినూత్న వాహనునిఁ దార్క్ష్య చరాత్మజుఁ గాంచినంతటం
బార్క్ష్య విహీన రమ్యతర భంగినిఁ గాంక్షిత దివ్య రూప భృ
త్తార్క్ష్యరథుండు మన్మథుని దగ్ధమొనర్చెను దేవభూమిలో 17
[వార్క్ష్యము=వృక్షమునకు సంబంధించినది, పార్క్ష్యము= పృక్షమునకు
(యుద్ధమునకు) సంబంధించినది, తార్క్ష్యము=కశ్యపుని యపత్యము,
పక్షి(గరుడుఁడు, చిలుక)]
పుండ్రములు ధరించి భూత దయ యొకింత
లేక సంచరింప లోకు లందు
నాశ నూని యెడఁదఁ గేశవునిఁ బరమ
శివునిఁ గొల్చువాఁడు శిష్టుఁ డగున 16
అవలోకింపఁగ ధర్మ వర్తనము ముఖ్యం బౌను లోకమ్మునన్
శివునిం గొల్చిన భస్మ దైత్యుఁడు ధరం జింతింప సన్మార్గుఁడే
శివ భక్తుండగు రావణాసురుఁ డహో శిష్టుండె చింతింపఁగా
శివరాత్రిన్ శివుఁ గొల్చునట్టి నరునిన్ శిష్టుం డనం జెల్లునా 15
ఇట్టలముగ దురద యుండి నెట్టనఁ గడు
దట్టముగ నుండ నఖములు బెట్టిదముగఁ
బొట్ట గల వాని కుండును దిట్ట దుడ్డు
బట్టతల గల్గువాఁడె పో భాగ్యశాలి 14
చివురులు తొడ్గి వెల్గెడిని ఛిన్న మహీరుహ కాండ భంగినిం
జివికిన శత్రు సేనలను జేతృ నరాధిపు కోట మాడ్కినిన్
నవ తృణవృత్త సద్విమల నార తటాక నిభమ్ముగా ధరం
గవులు వచింత్రు బట్టతల గల్గిన వానిని భాగ్యశాలిగన్ 13
పేర్కొనఁ దగి నట్టి గురువు
కూర్కొను నాధ్యాత్మికమున గురుతర రీతిన్
మార్కొని దుష్టుల నెన్నఁడు
తర్కంబును జేయ లేఁడు తత్త్వముఁ జెప్పున్ 12
తర్కము నందు నైపుణుఁడు ధాత్రిని సాధు జనైక వర్గ సం
పర్కుఁడు పూజి తాంఘ్రి యుగ పండిత వర్యుఁడు తిగ్మ సుప్రచం
డార్క సమాన తేజుఁడు మహాత్ముఁడు వ్యర్థపు టడ్డదిడ్డపుం
దర్కము సేయ లేఁడు ఘన తాత్త్విక బోధను జేయు నెల్లెడన్ 11
నర లోకమ్మున జనులకు
నిరంతరధ్యాన మొసఁగ నిఖిలేంద్రియ దు
ర్భర బల లయమ్ము కూలఁగ
నరి షడ్వర్గమ్ము గూర్చె నాత్మకు హితమున్ 10
గురు ఘోరేంద్రియ పాశ బద్ధుల కిలం గ్రూరంపు టుద్దీపితో
ర్వరి షడ్వర్గము క్లేశ మిచ్చును గదా యాత్మానుసంధానమై
గురు ఘోరేంద్రియ వర్గ నిగ్రహులకుం గోదండ విధ్వంసితో
ర్వరి షడ్వర్గము క్షేమ మిచ్చెను గదా యాత్మానుసంధానమై 9
చిన్న తనము నుండియు నాన్న నాన్న యంచు
ముద్దుగఁ బిలువఁ బడ లోకమునకు నయ్యె
నతఁడు నాన్న వాని వివాహ మందు నెలమిఁ
బిల్ల లాడిరి నాన్నకుఁ బెండ్లి యనుచు 8
కన్న ఋణమ్ముఁ దీర్చికొనఁగం దగు కాలము రా ముదమ్మునన్
మిన్నగ నుత్సవమ్మును సమీక్షణ ముద్ధతిఁ జేసి చల్పఁగా
నన్నుల మిన్న యమ్మకు సమంచిత చిత్తకు షష్టిపూర్తిలో
నాన్నకుఁ బెండ్లి యంచనుచు నాట్యము సేసిరి పిల్ల లిద్దఱున్ 7
ఊనంగ విక్రమార్క ధ
రా నాథుం డంచి తోత్తరం బీయంగం
దా నడిగి నట్టి ప్రశ్నకుఁ
బీనుఁగు తరు శాఖ పైకి వేగమె యెక్కెన్ 6
వానల్ దగ్గిన వేళ లందు నిజ సత్వంబుం బ్రదర్శింపఁగా
మానం జాలక రక్తి నాడు ననుకంపం గోఁతి కొమ్మంచినిం
గోనల్ గొండలు తిర్గుచుండి వడి సద్గోత్రుండు జ్యేష్ఠుండు రా
పీనుం గెక్కెను వృక్ష శాఖ నట నుద్వృత్తిన్ జవం బొప్పఁగన్ 5
ఎచ్చుగఁ జతురంగ బలం
బిచ్చట మన దర్జునుండు నిట నొంటరి వాఁ
డచ్చముగ నిశ్చయమ్ముగ
వచ్చిన ఫల్గునుని గెల్వ వచ్చుఁ గురుపతీ 4
అచ్చెరు వయ్యె వానిఁ గన నంకము నందు ననూహ్య రీతినిన్
మెచ్చఁగ రాజ రాజు కడు మిన్కుల నింపుగ భగ్న మయ్యె నా
వచ్చి వచించె నా శకుని పాండుకుమారుల గుప్త వాసమే
వచ్చిన వాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్చెద మో సుయోధనా 3
ఆహా దైవ వశమ్మున
బాహాబాహి మరణింప వల్లవ జన సం
దోహము కిరాతుఁ డొక్కఁడు
శ్రీహరి! యజునానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్ 2
ఈశుని వాసుదేవుని నహీన పరాక్రము నండ నుండఁగా
నా శర ణాగతవ్రజ జ నార్భకులం బరిమార్ప నెంచ దై
త్యేశు నఘాభిధేయుని ఫణీంద్ర వరాకృతి నున్న వానినిన్
శ్రీశుని సంహరించె నఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్ 1
[శ్రీశుఁడు=విషమున కధిపతి; వాక్పతి యానతి= బ్రహ్మ వ్రాత]