ఒక్క యొఱను గత్తుల రెంటి నుంచ వచ్చు
మీఱి నరులందు నొక్కని మెచ్చవచ్చుఁ
బొగడ రాదు నారుల నొక్క మగువ నెందుఁ
జిచ్చు రగిలించె నొకకాంత లచ్చిఁ బొగడి 59
నెచ్చెళు లెల్లఁ గోరు మిట నిచ్చను మెచ్చిన నామె నం చనం
గచ్చెలు గల్గు నచ్చముగఁ గాంతల కిచ్చట మచ్చరమ్మునం
బొచ్చెము లేల గోర నన ముచ్చట నెల్లరు పట్టు పట్టఁగా
లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చెఁ జెచ్చెరన్ 58
ప్రాపు సేరఁ జూడక యున్నఁ గోప మూని
నెలఁత లుందు రన మగల నెత్తి పైన
నిజము సేయంగ నానుడి నీరజాక్షి
శివుని తలపైనఁ బార్వతి చేరి నిలిచె 57
సవతుల్ జేరిరి యొక్క చోటునకు నాశ్చర్యంబు వాటిల్లగన్
శివ మూర్ధమ్మును వీడి గంగయు వెసం జేరంగఁ బుట్టింటికే
భువి శీతాద్రికి నేఁగి సంబరమునం బుట్టింటి కెన్నాళ్లకో
శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో 56
విత తానందమ్ము విరియ
నతీతముగ మనము నందు నక్కజముగ నా
మతి వెల్గ నంత నింగిగ
శత చంద్రులఁ గంటి నాకసమ్మునఁ బ్రీతిన్ 55
ఏ కడఁ జూచినం గలికు లే కడఁ జూచిన సుందరాంగులే
యే కడఁ జూచినం బ్రవిమ లేందు ముఖుల్ సుదతుల్ తలోదరుల్
నాక నిభైక మంటపమునం గన నత్తఱి రాత్రి వేళ యం
దాకస మందుఁ గానఁబడె నందముగా శతచంద్ర బింబముల్ 54
వనితామణి! వీక్షింపుమ
మనుజ గణము రాక మున్న మఱవకుమీ వ
డ్డన కయి నింపుగ నుంచుమ
యనలమ్మున నేయి వడి ఘనాకృతిఁ జెందెన్ 53
వనరిన లాభ మేమి నిజ బాహులు కాలినఁ బట్ట నాకులన్
మనుజల కుండ నట్టి క్రియ మానుగ మున్నర యంగ నొప్పునే
తనరఁగఁ దత్క్షణం బచటఁ దద్దయు శీతల మంత నాఱఁగా
ననలము నందు నేయి గన నయ్యె ఘనాకృతిఁ జెంది వింతగన్ 52
కని యా విగత జనమ్మును
జని చోరుల పగిది నంతఁ జయ్యన సదన
మ్మునఁ గల పళ్లెముఁ దన్నఁగ
శునకమ్ములు పూవు లాయెఁ జోద్యముగఁ గనన్ 51
అనఁగాఁ గొందఱు ద్వేష మానసులు దుష్టాత్ముల్ సహింపంగ నే
రని వారెల్లరు శాప మీయఁగను సంత్రాసమ్ము వాటిల్లఁగా
వినుఁడీ వృక్షము లెల్లఁ బూయ వని నిర్భీతిన్ సుఘోరమ్ముగా
శునకమ్ముల్ పలు పువ్వు లయ్యెను గదా చోద్యమ్ముగాఁ జూడఁగన్ 50
స్నేహ మెంచి కరము సెంద కెడఁద లోన
సుంత సంశయమ్ము చెంత నుంచె
ధార్తరాష్ట్రుఁ డిట్లు దలఁచి సాటి యగు వాఁ
డర్జునునకు మిత్రుఁ డంగరాజు 49
కడు ధృతి మంతుఁ డంకమునఁ గౌరవ రాడ్వర మిత్ర వర్యుఁడుం
బుడమిని భారతప్రధన మూల నరుండు నరద్విషుండునున్
వడిని ధనంజ యాభుఁడు నపారుఁడు దివ్య తరాస్త్ర నైపుణిన్
నుడివెద రంగరాజును ధనుంజయ మిత్రుఁ డటంచుఁ బండితుల్ 48
[ధనుంజయ మిత్రుఁడు = విలుకాండ్ర జయించు వారికి సూర్య నిభుఁడు]
సూర్య నిభుఁడు
సృష్టి వైచిత్ర్య మేమని చెప్ప వచ్చు
నరు దయిన భారతమ్మున నడవు లందు
వింత దేశాంతరమ్మున ద్విప మొకండు
రెండు దంతముల్ గల్గి కరేణు వొప్పె 47
దండఁ జాగుచు నూఱడించుచుఁ దద్ద సంతత మింపుగా
నండ నీయఁగఁ గోరుచుండి నిజాత్మఁ బేర్మినిఁ జక్కఁగాఁ
దొండముం దగఁ జాచి కైకొని దొడ్డ కుంజర నాథు నా
రెండు దంతము లుండి యొక్క కరేణు వొప్పెను గంటిరే 46
వెలుఁగు చున్న వహ్ని వీక్షించి కాళ్లను
గరములఁ గదలించి మురిసి మిగుల
ఋత్విజు లచట హవి నింపుగ వేల్వంగ
నగ్నిశిఖల మీద నాడె శిశువు 45
భగ్నస్వాంతులు పెద్ద లా వెతల సైపం జాల కంతన్ రుషా
మగ్నాంతఃకరణప్రభా వశులు సంబాధాగ్ని మున్గంగ దుః
ఖాగ్నిజ్వాలలణంగ దత్క్షణము బాల్యావస్థ నుప్పొంగు హ
ర్షాగ్నిజ్వాలల పైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్ 44
అక్షులకు నున్న యంధత్వ మవని నరయ
మానసమ్ముల కుండునె మనుజులార!
యందముగను వర్ణింప భార్య నిజ పతికిఁ
బూర్ణచంద్రు సౌందర్యమున్ బొగడె గ్రుడ్డి 43
గంధంబింపుగ నద్ది గాత్రమున శంకా హీన చిత్తుండునై
గంధేభప్రతిమాన గామి నలినీ కాంతోపయంతృప్రభా
బాంధవ్యుండు నిరంతరోగ్ర మదనవ్యాపార వారాశి మ
గ్నాంధుం డాకస మందు శోభిలెడు పూర్ణైణాంకు వర్ణించెఁ బో 42
అమ్మ - అయ్య - అక్క – అన్న పై పదాలతో నన్యార్థములో
భారతార్థములోఁ జంపకమాల:
అడరి సుయోధనుండొసఁగ నాజ్ఞను దమ్ములఁ గూడి యేఁగి యా
యడవినిఁ గూడి యమ్మగువ నయ్యమ నందనుఁ డోడి పందెముం
గడపి నరాధిపుం గొలిచి కట్టకడం గదనమ్ము లోన వా
రడిచిరి యాజి నక్కపటి నన్నగ ధారి దయా రసమ్మునన్ 41
అరయ ముల్లోకముల యందు నంచితముగ
యక్ష కిన్నర గంధర్వ పక్షి పన్న
గాప్సరస్త్రీజన సమేత మమరు లెల్ల
స్థిర యశస్కులు గౌరవుల్ నరుఁడు లేకి 40
[గౌరవుల్ = గురువునకు సంబంధించిన వారు]
వ్యర్థము లయ్యెఁ బాండవుల నంత మొనర్ప రచింపఁ జేష్ట ల
త్యర్థము వాసుదేవ కరుణాంచిత దృష్టి నిరంతరమ్ము రా
జ్యార్థి సుయోధనుండు కుటిలాత్ముఁడు దుర్భర పాప కర్ముఁడౌ
పార్థుఁడు నిష్ప్రయోజకుఁ డపారయశస్కులు ధార్తరాష్ట్రులే 39
[ధార్త రాష్ట్రులు = ధృతరాష్ట్రునకు సంబంధించిన పౌరులు]
ధ్వంసిత నిజాంతరంగ సు
సంసక్త సుఘోర వైరిచయ పరమ మహా
హంసలకుఁ జరింప విగత
సంసారము హితకరమ్ము సన్యాసులకున్ 38
కంసారిన్ సతతమ్ము నిల్పి మదులం గాషాయ వస్త్రమ్ములన్
మాంసాహారము మాని మోక్షమును సంపాదింప నుత్సాహులై
హింసా ద్వేష విహీన మానసులునై యింపార నిద్ధాత్రి నా
సంసారమ్ము హితమ్ముఁ గూర్చును గదా సన్యాసులౌ వారికిన్ 37
[సంసారము = పుట్టుక]
ఏమని వచింప నొప్పును
సోమరియై పికము మెక్కి సోలి పరుండన్
గోముగఁ జెలరేఁగి కరం
బామని శోభిల్లెఁ గాక మాలాపింపన్ 36
ఆతత రీతిఁ బాదపము లంతఁ జిగుర్చుచుఁ బూలు వూయఁగాఁ
బ్రీతి నొసంగుఁ బిల్లలకుఁ బెద్దల కెల్లర కా వసంతమే
కూఁతలు గూయ ఘోరముగఁ, గోయిల లత్తఱిఁ తేనె లొల్కెడిన్
గీతములన్ వసంత ఋతు కీర్తినిఁ బెంచెను, గాకఘూకముల్ 35
వావి వరుస సుంత పరికింప నేరక
కాల మెంచ కుండఁ దూలి యూఁగఁ
బ్రేమ డోల లందు భామ! రావా రావ
రామ! రామ! యనుట రంకు బొంకు 34
[రామ= రమించు నట్టి స్త్రీ ]
ఈ మహి నీతులం బలికి యెన్నిక వేళ ప్రజాలిఁ గావఁగా
నే మెదలం దలంచి యరుదెంచితి మంచు వచించి నెగ్గినన్
భూముల నాక్రమించుచును బూర్ణము దుడ్డుల సంగ్రహించుచున్
రాముని నామముం బలుక రంకగు బొంకగు నంద్రు పండితుల్ 33
నిత్యాంబర సంచారి ని
రత్యయుఁడు ప్రభాకరుండు రంజిత తరుణా
దిత్యప్రభా పటుత్వం
బత్యల్పమె? యద్భుతముగ వ్యాపించె దెసల్ 32
నిత్యుం డాద్యుఁ డజుండు నవ్యయుఁడు సందీప్తాభ్ర దేహుండు దా
దైత్యశ్రేష్ఠునిఁ గోరి మూడడుగులన్ దైన్యంబు వాటిల్లఁగాఁ
గృత్యంబెంచి మురారి వామనుఁడు వే జృంభించి వర్ధిల్లఁగా
నత్యల్పంబె యదృశ్య మద్భుతమునై వ్యాపించె నాశాంతముల్ 31
బేల యయి వామలోచన
తాళఁగ లేనట్టి పగిది తన తను వందున్
వ్రాలఁగ, రాఁ బతి యేఁగెడు
కాలము చెల్లి వడలె నఁట, కాముని శరముల్ 30
ఆ మరు దుత్కరమ్ములకు నాశ లడంగ మహేంద్రు తోడుతన్
భామకు నద్రి నందనకు వాడ భృశమ్ము మనస్సరోజమే
భీముని నేత్ర వహ్ని మరు విగ్రహ మింక విచిత్ర రీతినిం
గాముని పూల బాణములు కాలము చెల్లఁగ వాడిపోయెనే 29
కష్టములను మాన ప్రాణ నష్టములను
లెక్క సేయరు సుంతయు నక్కజముగ
దుష్ట జనుల కెల్లరకు విశిష్టము లగు
కంటకములు సజ్జనులు లోకమ్ము నందు 28
ఇఁక సందేహము నంద డెందముల మీ కెట్లొప్పుఁ గౌంతేయుఁ డై
హిక కార్యమ్ముల మెత్త నైన పులియే యీ ధర్మ రాజెన్నఁగన్
సకలార్యుల్ వచియింప నివ్విధముగా సత్యంబు లీ వాక్యముల్
సుకుమారం బగు కంటకంబులు గదా సుశ్లోకులౌ సజ్జనుల్ 27
భువి నేఁ బాలింపంగన్
రవి తుల్యుఁడ నెట్టు లితఁడు రాజగు నంచున్
దివి లోనఁ దిరిగెడు నిశా
రవిలో మచ్చలనుఁ గాంచి రాజు హసించెన్ 26
ధైర్యము డుల్ల నాలమున ధన్వి స లక్ష్మణుఁ డట్లు గూల దు
ర్వార్య ఫణీంద్ర పాశమున వాఁతలు రేఁగ శరీ రమం దహో
కార్య చయైక దక్షు సిరికాంతుని యిద్ధ రమా సరోజ హృ
త్సూర్యుని లోని మచ్చలను జూచిన చంద్రుడు నవ్వె గొల్లునన్ 25
సుదతీ! యాకర్ణింపుమ
సద యామల హృదయ! సారస నయన! యిఁక ము
ప్పది రెండయి లెక్కెల్లం
బదునాఱు పదాఱును గలుపఁగఁ బూర్ణంబౌ 24
వీకం దీర్తును నీ ఋణమ్ములను నుద్వేగంబు నీకేలనో
నాకం బేఁగక మున్న నీ వకట సంతాపమ్మునన్ మిత్రమా
నాకీయంగ సహస్ర నిష్కములు తూర్ణంబిప్పు డప్పెల్లయున్
లోకంబందుఁ బదాఱు నాపయిఁ బదాఱుం గూడి సంపూర్ణమౌ 23
ధనమే కాంచఁగ మూల మ
గును బాపమ్ములకు నెల్లఁ గువలయ మందున్
మనముల నింపుగఁ దొలఁగన్
ధన జాడ్యమె సౌఖ్య మిచ్చుఁ దగ విబుధులకున్ 22
మును భూనాథులు యజ్ఞ యాగముల గో భూ దాన సత్కర్మముల్
వినమే చేయఁగ శాస్త్ర సమ్మతముగం బ్రీతిన్ విశేషమ్ముగా
మనుజాధీశుఁడు దాన మీయఁ గ్రతులన్ మన్నించి విప్రాలికిన్
ధన జాడ్యంబె నితాంత సౌఖ్య మిడు విద్వచ్ఛ్రేణికిన్ ధాత్రిలోన్ 21
[ధనజ+ఆఢ్యంబె = ధన జాఢ్యంబె; ఆలమందచేఁ బుట్టిన సంపద]
వాద్య ఘోషమ్ముల నభమ్ము పగులకుండ
హావభావమ్ము లవి యసహ్యములు గాక
విన్న చెవులు బ్రద్దలు గాని పెన్నెలుంగు
స్వరము లేని గానమున రసమ్ము లూరు 20
హరినామాంకిత కీర్తనమ్ములను నభ్యాసమ్ము వర్ధిల్లఁగా
నిరతం బింపుగఁ బాడ సత్సభలలో నిష్ఠాత్ములై గాయకుల్
పరమోద్వేగ విహీనమై రుచురమై భాసిల్ల నిక్కం బప
స్వర దూరమ్మగు గాన మందు రస విస్తారమ్ము దోరం బగున్ 19
నెమ్మనమునఁ దాఁ గోరిన
యమ్మాయినె తండ్రి నింక నతి కష్టమునన్
నెమ్మిని నొప్పించి తివిరి
యమ్మనుఁ బెండ్లాడి మోద మందెఁ దనయుఁడే 18
అమ్మ కనిష్ట మన్నది నిజాత్మ నెఱుంగక సుంత యేని స
త్యమ్ము వచింపఁ బ్రేమ వితతమ్ము జనింప నెడంద నత్త సూ
రమ్మకు ముద్దు బిడ్డ నకలంక చరిత్రఁ గరమ్ము గోరి వెం
కమ్మను బెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్ 17
వేల కోట్లు దోఁచిరి మీఱి పాలకు లని
పలుకఁగ విపక్ష నేతలు చెలఁగి వీరు
మున్ను లక్ష కోట్లు తినిరి యన్న వినిన
పౌరు లవివేకు లీ ప్రజాస్వామ్య మందు 16
భువిలో భారత దేశ పాలకుల వ్యామోహమ్ము విత్తమ్ముపై
న వచింపంగఁ దరమ్మె యింత యని యన్నా యేరి కెన్నండుఁ గా
క విశేషంబుగ వర్తమాన మగు నిక్కాలమ్మునన్ భూత భా
వ్యవివేకుల్ గద పౌరు లెల్లరు ప్రజాస్వామ్యమ్మునం జూడఁగన్ 15
[యతి భంగ మున్న సమస్యా పాదమున కఖండ యతినిఁ గూర్చి చేసిన
పూరణము గమనార్హము.]
పెద్ద ప్రాణి కెంచఁ దద్దయుఁ జిన్న ప్రా
ణి పగవాఁ డగు నిల నిశ్చయముగఁ
గుంజ రాభ ముండఁగాఁ జుంచెలుకయె కం
పిల్లి యెలుకను గని బెదరి పాఱె 14
ఆలము నందు సైంధవుని నడ్డు కొనంగ నశక్యుఁ డయ్యె నా
భీల పరాక్రముండు నగు భీముఁడు సోదర సంయుతుండునై
కాలము దుస్సహం బగును గాలున కైన నతిక్రమింపఁగాఁ
గాలికి బుద్ధి సెప్పె నెలుకం గని నంత బిడాల మక్కటా 13
కలి యుగమ్మున ధర్మము గాన రాదు
ప్రియములు వచించు వానినే విభుఁడు మెచ్చు
పొగడు నట్టి వానినె పదవులు వరించుఁ
గల్లలం బల్కువానికే గౌరవమ్ము 12
కల్లలు నిల్పఁ బ్రాణములు గ్రన్ననఁ బల్కిన మెత్తు రింపుగా
నెల్లరు దోషముం దలఁప కింతయు నైనను హర్ష చిత్తులై
కొల్లలుగా నిజమ్ములను గోరి త్యజించి నిరంతరమ్మునుం
గల్లలఁ బల్కువాఁడె యిల గౌరవ మందును సత్యవంతుఁడై 11
సకల ధరా జను లింపుగ
వికార మందక యెదలను వీసమ్మును వా
డక యున్న నిశ్చయమ్ముగఁ
బ్రకృతిం గాపాడు నంద్రు ద్రావ్యాలి బుధుల్ 10
సమస్యా పాదములోని కాఁచు శబ్ద మరసున్నతోఁ గూడి యున్నది
కనుక నది కాచు (కాపాడు) పదమున కన్య మగును.
సుకరంబైన మృదుత్వ మందు టవియే శోభిల్లు ద్రావ్యమ్ములై
వికలంబందఁగ నేర వెన్నఁడును వేవేలేండ్లకున్ సుంత కు
ళ్లక చచ్చున్ మృగ సంచయమ్ము తిన నిర్దాక్షిణ్య మా వస్తువే
ప్రకృతిం గాఁచును ద్రావ్యమం చనిరి ధీ ప్రాగల్భ్య సంపన్నిధుల్ 9
[కాఁచును = కాఁగఁ జేయును; ద్రావ్యము = plastic]
ఊని నట్టి బట్టల రంగు నూన వలయు
చేతి సంచి వర్ణమ్మును జేరవలయు
కాలి చెప్పుల రంగును గలియ వలయు
బొట్టుఁ దాల్చుట భారము బోటులకును 8
జుట్టును గత్తిరించెదరు చొప్పడఁ గ్రొత్త దనమ్ము మోములన్
ముట్టరు కోక ఱైకలను ముగ్ధలు గూర్తురు పొట్టి గుడ్డలన్
గిట్టక మచ్చ యేర్పడుట కిన్నెర కంఠులు మానసమ్ములన్
బొట్టు ధరించుటే నుదుట బోటులు భారముగాఁ దలంతురే 7
పతి యానతి తాఁ గైకొని
యతివ నిరాటంకము మహిషాసురు నిత్యా
తతఘోర కర్ము రాక్షస
పతి శిరమును ద్రుంచివైచెఁ బార్వతి గినుకన్ 6
వితత దయా రసార్ద్ర హృది భీషణ శైల నిభాంతరంగ సం
తత పతి వామభాగ నిజ ధామ నగాత్మజ దుర్గ నామ్నియే
యతులిత వీర్యవంతు మహిషాసురు ఘోర నిశీథినీ చర
త్పతి శిరమున్ మహోగ్రతను బార్వతి ద్రుంచెను లోకరక్షకై 5
వారని రక్తిని భక్తులు
దూర నివాసు లరుదెంచి తూర్ణం బంతన్
నారాయణునకు మును పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్ 4
దారలఁ గూడి యున్న వర దాతల మువ్వుర స్వీయ మందిర
ద్వార వరాంగణమ్ములను దాఁటి రయమ్మున సంభ్రమమ్ములం
బార విహీన హర్షమునఁ బద్మభ వాచ్యుత రాజ భృన్మనో
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో 3
[రాజ భృన్మనోజారి = చంద్రుని ధరించిన శివుఁడు]
దక్షత లేని విభుండు వి
పక్ష విహీనము సెలంగి పాలింపంగా
నీ క్షితి నిస్సంశయముగ
రాక్షస తత్త్వమ్మె యెల్ల రాజ్యము లేలున్ 2
శిక్షలు దాఁకు నింగిని నశింతురు లోకులు దారుణమ్ముగా
నక్షయమై నిరంతరము నగ్ని నిభమ్ముగఁ బ్రజ్వరిల్లఁగా
నీ క్షితి లో రజో గుణ మహీనము సత్వ రజో తమస్సులన్
రాక్షస తత్త్వమే సకల రాజ్యము లేలును వాస్తవమ్ముగన్ 1