అత్త వారి వేశ్మం బని యాస పడకు
మర్థ మట నిష్ప్రయోజన మగును జుమ్ము
సంకటములు దుర్భరములు సంక్షయ మయి
సౌఖ్యముల్ దక్కుఁ గద యమ సదన మందు 60
ఆఖ్యాతమ్ములఁ దెల్ల మెల్లరి కసంఖ్యాకమ్ములం జూడఁగా
సఖ్యం బెంచుట చెల్ల నేర దన నిస్సందేహ వాక్యమ్ములే
విఖ్యాతాఘ నికాయ వర్తనులకున్ విశ్వమ్ములో దుర్భ రా
సౌఖ్యస్థావర మే దనన్ నరకమే సంసారికిన్ యోగికిన్ 59
పాము - కప్ప - తేలు – బల్లి ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందములో నాడు కుంటున్న అమ్మాయిపై పద్యము
పాముచు స్వకచం బల్లియు
గోముగఁ దేలుచు ముదాబ్ధిఁ గులుకుచు మిగులన్
రామలను గూడి యాడఁగ
భామామణి కప్పడతుల పంచ లభించెన్ 58
విమ లాంతరంగమున ధై
ర్యము నూని నిలువఁ దొలంగు నఖిల సమస్యల్
సమయస్ఫూర్తి పరిష్కృత
సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్ 57
ఈ నర జన్మమే నిలయ మెన్నఁగ ధాత్రిని దుఃఖ రాశికిన్
దాని నెదిర్చి నిల్వఁగ ముదమ్ము ఘనమ్ముగఁ గల్గు నిద్ధరం
గానక యుత్తరించు గతిఁ గష్టము లందు విచార మందుటన్
మానవ? జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ 56
కురు వంశాధముఁడు సిరిని
హరింప వంచించి నిర్దయ నఖిలము పృథా
వర తనయు నుండి యంతట
సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్ 55
నరవిద్యాధికు లెన్న కుండు కతనన్ నైరాశ్య మేపారఁగా
వరదానమ్ముల కాసఁ జెందఁగను నల్పప్రాణు లజ్ఞానులై
ఖర దుష్టాత్ములు నెగ్గ నెన్నికలలోఁ గాపట్యమే వర్ధిలన్
సురరాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్ 54
చోద్యము కాదిట్టు లనిన
సద్యో౽స్థిరములు కడింది సకలార్య జ నా
వేద్య మిది వింత యగు నన
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్ 53
వేద్యం బెల్లర కియ్య దింపుగను నీ విశ్వంబు నందెన్నఁగా
విద్యావేత్తలు నొల్ల కుండుదురె గాంభీర్యమ్మునన్ సుంత హృ
ద్భే ద్యాభీలములై నిరంతరము ప్రావృట్కాల ఘస్రమ్ములన్
విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా 52
కవనం బల్లుట యందిం
త వివేకము లేక యున్న ధారణ మనఁగా
నవగాహన హీన మయిన
నవధానముఁ జేయు వార లల్పులె సుమ్మీ 51
అవిచారంబున నుండు మింపుగను గోపావేశముల్ వీడుమా
కవనం బల్లెడు వార లెల్లరును నిక్కం బెంచఁ గా లేరు లే
యవధానుల్ మఱి గాని వా రెదల నిత్యం బెంతు రిబ్భంగినే
యవధానంబులఁ జేయు వార లనఁగా నల్పుల్ గదా యెంచినన్ 50
తార్క్ష్యుండు గరుడుఁ డన్నయుఁ
దార్క్ష్యుఁడు మాలను ధరించి తాఁ జిత్రముగన్
వార్క్ష్యమున వెలుఁగుచు నహో
తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే 49
ఆర్క్ష్య పథాను వర్తి యయి యంచిత రీతిఁ గుబేరుఁ డింపుగాఁ
బార్క్ష్య వచో సుమాంజళులఁ బద్మదళాక్షు నుతించి నిత్యమున్
వార్క్ష్య పదార్థసంతతులఁ బన్నుగ శ్రీపతి కిచ్చి తృప్తినిం
దార్క్ష్య పదాభివందన మొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్ 48
[తార్క్ష్యుఁడు = విష్ణువు; శ్రీపతి = సంపదల కధిపతి, కుబేరుఁడు; ఆర్క్ష్యము =
నక్షత్రములకు సంబంధించినది; పార్క్ష్యము = వేదములకు సంబంధించిన;
వార్క్ష్యము = వృక్షములకు సంబంధించిన]
పంతమ్ము నూని పల్కితి
వింతియ కాని మ ఱెఱుంగవే నిజ మది యిం
దెంతయొ మిత్రమ చెపుమా
కుంతి సుతుఁడు వాలియె నలకూబరు గెల్చెన్ 47
కుంతియు వాలి యేడ నలకూబరుఁ డేడ నలండు నేడనో
యంతము నాది మధ్యములు నన్నియు నెంచ నభూతకల్పనల్
వింతగఁ బల్కిరిట్టు లవివేకము ప్రస్ఫుటమౌ విధమ్ముగం
గుంతికిఁ బుట్టి వాలి నలకూబరు గెల్చె నలుండు సూడఁగన్ 46
తనర వంశాభివృద్ధి సంతసము మీఱ
నుభయ వంశమ్ములఁ జెలంగ నుత్సవములు
నిల్ప బంధు వర్గమ్మున నెమ్మిఁ బత్ని
గర్భముం దాల్చె నా పతి గౌరవముగ 45
దుర్భరమై చెలంగ రహి తూర్ణము డెందము లందు నౌర స్వీ
యార్భక సంచయమ్మునకు నాతని పుట్టిన యట్టి ఘస్ర సం
దర్భము నందు సంతసము దద్ద సెలంగఁగ మించి ద్వీపవ
ద్గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్ 44
[ద్వీపవద్గర్భము = సముద్రము నుండి పుట్టినది, రత్నము]
ధర్మరతులకు సంతత దైవ రక్షి
తులకు నాపద లిచ్చునె కలఁత లరయఁ
జిన్ననాఁటి నుండియుఁ బగ మిన్నగా న
భద్రత నొసఁగె రారాజు పాండవులకు 43
మేదిని నెందుఁ గాంచినను మేటి దురాత్ముఁడు గానరాఁడు దా
నే దరి కేఁగెనో యనుచు నెంతయు దుఃఖము నందఁ బాండవుల్
దా దొరవిం దొలంగి వెస దర్శన మిచ్చి తలంచి వీరలా
సోదరు లంచుఁ బాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుఁడే 42
వంకల్ సెప్పక తా నా
వంకకు వేగంబ చేరి పన్నుగ శ్రీ వ
త్సాంకుఁడు సంతత భక్త వ
శంకరుఁ డా మకరిఁ జంపి జర్తువుఁ బ్రోచెన్ 41
సిరికిం జెప్పక శంఖచక్ర యుగముం జేదోయి సంధింపకే
కరి రాజేంద్రుఁడు గావు కావు నను రక్షా దక్ష యంచార్వఁగా
హరి యాక్రందన మాలకించి వెసఁ బద్మాక్షుండు లక్ష్మీ మనో
హరుఁడే ప్రోవఁగఁ గుంజరమ్ము నట తా నాలాస్యమున్ జంపెనే 40
లేఁడు దైవమ్ము దయ్యమ్ము లేదు సూపుఁ
డేడ రాముండు గీముండు లేఁ డనుచు స
రసను జేర నాస్తికుల నరసి నుతించి
పద్మనాభుని దూఱిరి భక్తు లెల్ల 39
చీ చీ యంచును గొంద ఱా హరునిఁ జీ చీ యంచు నా క్రీస్తునిం
జీ చీ యంచు మతప్రవక్తను బరుం జీ యంచు నిం కొందఱుం
జీ చీ నేరక దేవుఁ డొక్కఁ డని లోఁ జింతింపకే యన్యులుం
జీ చీ చీ యని చీదరింతు రిట రాజీవాక్షునిన్ లోకులే 38
అగ్రహారవాసు లిరువు రనుఁగు సఖులు
వంత సెంద రన్నమ్మును బడయ కున్న
ముక్కు లోనఁ బడక యున్న మూరు వంత
రాఘవుని నస్య మడిగెను రావణుండు 37
అంగద రాయబారమున రావణుఁడు పలికి నట్టుల నూహాజనితము:
దాస్యం బీ వొనరింపు మింపుగ నెడందన్ సంధి నీవెంచినన్
దస్యా రాఘవ వేఁడి వే శరణు ప్రాణమ్ముల్ వరింతేని యా
లస్యం బింత యొనర్ప కెంచి నిజ కర్తవ్యమ్ము స్వీయానుజా
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్ 36
[నస్యము = నాసికకు సంబంధించిన ఖండము]
దివిని నగు వివాహమ్ములు
యువకునిఁ గని యిట్టు లన నహో మెచ్చితి నే
ను విశేషముగ నెడఁద నీ
యువతినిఁ బెండ్లాడె వనిత యొప్పఁగ విబుధుల్ 35
యువతుల్ మెచ్చు వరుండు దుర్లభుఁ డహో యుర్విన్ విచారింపఁగా
సవతాలిన్ సమకూర్చు వార యధికుల్ శాతోదరీ విన్మ మా
నవులం దుత్తముఁ డీతఁ డెన్న నన నానందించి కీర్తించి యా
యువతిన్బెండిలి యాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్ 34
దారుణములై చెలంగు న
పారమ్ము నిరంతరమ్ము వాని వచనముల్
తోరమ్ము మాఱు చుండును
సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్ 33
వారక పల్కుఁ బల్కినదె పాడును బాడిన యట్టి పాటనే
కోరును మూరి కోరినదె గోడును జెప్పును జెప్పి నట్టిదే
వారిని వీరినిం గదిసి భ్రాంత మనష్కుఁడు భీత చిత్తుఁడై
సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారె సారెకున్ 32
ఒక్కొకరికినిఁ బదిమంది యుద్భవింప
నందను లిల నందార్భక నారులకును
యదువరేణ్య! నీలాంబుదశ్యామ! తల్ప
సర్ప! సంతతి హెచ్చిన జరుగు మేలు 31
[తల్ప సర్ప=తల్ప మయిన సర్పము గలవాఁడు]
శాంతి యొనర్చి యంతము స శాస్త్ర మొనర్పఁగ సర్ప దోషముం
బంతము నంతరంగములఁ బన్నుగ వీడి దయారసార్ద్రతన్
సంతస మంద డెందములఁ జారు తరమ్ముగ వంశమం దహో
సంతతి వృద్ధి సేసినవి సర్పము లీ భువి మేలుఁ గోరుచున్ 30
కవితలు కోకొల్లలు కూ
డు వెట్టునే గుడ్డ లిడునె డుల్లునె దుడ్డుల్
కవివర విత్తార్జనమున
కవి కంటెను మేలు గాదె గాడిద భువిలో 29
అవనీ నాథులు ప్రోత్సహింపగను హర్షాత్ముండు లీలన్ నితాం
త వివేకమ్మునఁ బండితోత్తముఁడు నిద్రా హీనుఁడై నిత్యముం
బవలున్ రేలును, గావ్య సంచయ మహా భారమ్ము నూనంగ నా
కవి కంటెన్ గడు మేలు గార్ధభము, సత్కావ్యమ్ములన్ వ్రాయఁగన్ 28
భూమిజ నారసి లంకా
నామ నగర మందు దాఁటి నక్రాలయమున్
గోముగఁ బ్రస్రవ ణాద్రిని
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్ 27
ఏ మనుజుండు గాదని వచింపఁగ నేరని యట్టి రీతినిన్
వేమఱు చింత సేయక వివేకము గన్పడ నీ క్షణంబ నీ
వీ మహి గొప్పదౌ యనృత మిచ్చటఁ బల్కు మనంగ నిట్లనెన్
రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్ 26
ఏడుకొండలు చకచక యెక్కి సుంత
పలుకు కులుకు లేక నిలువ భార్య లిర్వు
రరసి కిన్కను వచియించి రార్తి తోడఁ
గొండపై నున్న దేవుని గుండె రాయి 25
పూవును బోలు గుండె యని మూరి వచింతురు మేలొసంగినం
జేవ గణింపకుండగను జేయఁ పనుల్ ఫలియింపకున్నచోఁ
గావఁగ నేరడంద్రు దయఁ గాంచఁడె యంచుఁ దలంతు రివ్విధిన్
దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను గొండ కోనలన్ 24
వావిరి వాసవ పంచక
మే వసుధం బాండు సూను లెన్నఁగ నిజముం
గావునఁ బాంచాలికి నా
ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్ 23
పావన వంశజాతకులు పాండువు లందు నొకండు నింపుగా
వావిరి భర్తగాఁ దనరు పద్ధతి నారదు నాజ్ఞఁ దాల్పఁగా
నీ వసుధాతలమ్మునను నెన్నఁగ నొక్కొక వత్సరమ్మునన్
ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్ 22
పట్టణమ్ము లందు వంచనమ్ములు మెండు
విశ్వసింతు రిట్లు విశ్వ జనులు
నిక్కము వచియింప నొక్క సామెత గల
దూరువాఁడె యఘవిదూరుఁ డగును 21
మీఱి ధృతిన్ నిరంతరము మేలొన గూర్చుచు మానవాళికిం
దూఱక పానశాలల విదుల్చుచు దుడ్డుల నర్థికోటికిం
బాఱక భీత చిత్తుఁ డయి పార్థుని సన్నిధిఁ గల్మషాత్ములన్
దూఱెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ 20
చిన్ని పిల్లల చెయ్వుల సిగ్గు సెంద
నేల పెద్దలు తప్పుగ నెదల నెంచి
యలరి మందహాసమున రాజార్భకుండు
తన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను 19
ఎన్నఁగ దైవ కల్పితములే గెలు పోటము లెల్ల ధాత్రినిన్
మున్నరయన్ జయాపజయముల్ మనుజాలికి నేర శక్యమే
తన్నెదిరింపఁ బంతమునఁ దాటినిఁ దన్న శిరమ్ము నంతఁ దాఁ
దన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్ 18
సన్నని తెల్లని యన్నము
పన్నుగ వడ్డించి గౌరవమ్ముగను నిజం
బన్నా యిసుమంతయు దో
షాన్నము లేనట్టి విందు నందఱ కిడిరే 17
కన్నుల పండువై తనరఁగం బరమాప్త జనాలి కప్డు ప్ర
చ్ఛన్న సభాంతరమ్మునను జక్కఁగ వాసన లీను చుండఁగా
నెన్నిన లేహ్య చోష్యములు నేనియు పేయము లేని చిత్ర నా
నాన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో 16
ఈ మలపై నీ వడుగిడ
సామజ గణ మృగ సహితము సంతత జిత సం
గ్రామా! రక్షో వర! నము
చీ! మల పదఘోషను విని సింగము జడిసెన్ 15
కామ రిపుం డుమా ధవుఁడు గ్రన్నన మెచ్చి యనుగ్రహింపఁగా
భీమ తపోతినిష్ఠకును బ్రేముడిఁ బాండవ సింహ పంక్తినిన్
భీమునిఁ దొట్టి సైంధవ పిపీలిక పోరునఁ బాఱఁదోలెనే
చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్ 14
సూర్యుఁ డస్తమింపని రాజ్య మార్య మాది
వెఱ్ఱు లయి తెల్లవా రట్లు విఱ్ఱవీఁగ
నల్ల వార లింపుగఁ బన్నిన నిజ శాంతి
వార్ధి రవి క్రుంకఁగాఁ దెలవాఱెఁ దూర్పు 13
వారితు లైరి పాండవులు ఫల్గుణుఁ డక్కడ కాన రామి దు
ర్వార రణమ్ము నందు ఘన బాహు బలాఢ్యుఁడు భీమ సేనుఁ డా
వీరుఁడు దెల్లఁ బోయె నట భీరువు సైంధవుఁ డాజిఁ దూఱఁగాఁ
దూరుపు దెల్లవాఱె నదె తోయజబాంధవుఁ డబ్ధిఁ గ్రుంకఁగన్ 12
పాము - కప్ప - తేలు – బల్లి. ఈ పదాల నన్యార్థములో
ప్రయోగించుచు స్వేచ్ఛాఛందంలో భార తార్థములో:
అధిపా మునుంగ కప్పటి
వ్యధ నందక తేలు టట్లు బల్లిదుఁ డరయన్
విధి రక్షితుండు సుమ్మీ
యధికమ్ముగ భీమ సేనుఁ డాశ్చర్యముగన్ 11
భువిలోన శరత్కాలము
న విశేషముగ వెలుఁగు గగనమ్మున శశియే
ఛవి నిచయమ్మునఁ జంద్రుని
రవి! తేజము చల్లఁదనము ప్రజల కొసంగెన్ 10
అవికారంబు ననార్త చిత్తముల సత్యంబెన్న విశ్వంబులో
నెవ రెందేని చరింత్రు ధైర్యముగఁ బంచేష్వార్త మర్త్యాలి నేఁ
చి విశేషమ్ముగ నా నిశీధిఁ బరగన్ శీతాంశు కాంతుల్ నభో
రవి తేజం బిడె లోకు లెల్లరకుఁ దీవ్రంబైన శైత్యం బిలన్ 9
[నభో రవి = ఆకాశ జీవి; రవి = జీవుడు]
ఆతత గుణవతి జానకి
వేతన లందంగఁ బుట్టె వివరించెను భూ
మాతయె యటులన్ నా కీ
సీతాసతి కూఁతు రయ్యె శ్రీరామునకున్ 8
యాతన లీయ నెల్లరకు నా దశకంఠుఁడు భీకరమ్ముగా
భూతల మందు మాధవుఁడు వుట్టఁగ వాని వధార్థమై ధరన్
ధాత సృజింప దారగను దథ్యముగా, మిథిలాధినేతకున్
సీత కుమార్తె యయ్యెఁ గద, శ్రీ రఘు రామునకుం దలంపఁగన్ 7
అర్థవంత శబ్దమ్ముల నలరు చుండఁ
గావ్యముం బఠియించి సత్కవులు మెచ్చఁ
జదివి పలువు రానందింపఁ జక్కఁగాను
గవనముం జెప్పు కవికి సత్కార మేల 6
భువిలో నింపెసలారు కావ్యముల నంభోజాక్షు వర్ణించుచుం
గవిలోకమ్మున మూరి రాజిలుచు విఖ్యాతమ్ముగా నుండఁగా
నవివేకుల్ దనరింప స్వార్థమును వారాశించి కావింపఁగాఁ
గవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థం బగున్ 5
మేలి కుసుమమ్ము లుండఁగఁ
జాల నిచట సదమలాంగి! చారు నయన! యె
క్కాలమ్ము నందు వాడిన
పూలను సిగలోనఁ దుఱుమఁ బోలదు తరుణీ 4
పూవుల నెల్ల వాడ వలెఁ బూజకు మాత్రమ యేడు కొండలన్
వావిరి పాప మంటుకొను బద్మ దళాక్షు నగౌర వించినన్
దేవుని వేంకటేశ్వరుని దివ్య నివాస ధరాధరమ్మునం
బూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ 3
శ్యామంబులై కరం బభి
రామంబులునై భృశం బలంకారములై
వేమఱు వొగడఁగ స్వీయ
స్త్రీ మీసలు పెద్ద వయ్యెఁ జేకుఱు వన్నెల్ 2
నే మున్నెన్నఁగ బాలుఁడం గనుమ నే నిక్కంబుగాఁ బెర్గితిన్
యీ మర్త్యావలి లోన నుత్తముడ శంకింపంగ నీ కేల నో
భామా రత్నమ! నా ముఖమ్ము గను మిబ్భంగిన్ మనోబ్జస్థిత
స్త్రీ! మీసంబులు పెద్ద వయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్ 1