పరులఁ గాంచి నేర్చుఁ బన్నుగ విబుధుండు
మూర్ఖుఁ డనుభవించి మునుపు నేర్చుఁ
జక్క నైన మాట త్రొక్కఁ గాలు ననుచు
నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె 62
ఎప్పటి కేది మంచి దగు నింపుగ నయ్యది సేయ నెంచుచుం
జప్పునఁ గొర్కి నాలుకను శాంతి వహించి యొకింత యంతటన్
ముప్పు నెఱింగి డెందమున బోరన గెంతుచు వింత సుంత క
న్నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్య వాక్యముల్ 61
[కన్ను + ఇప్పును = కన్నిప్పును ; కన్ను విప్పును]
మహిలోఁ జూపఁగ నించుక
మహిమ కలిగినఁ గద! సంయమన మున్న గదా!
యిహ ధన పరులే యెల్లరు
మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్ 60
ఇహమం దెందఱొ యోగు లున్నను నిజం బెన్నంగ నవ్వారిలో
సహనం బక్కట గాంచ వీ లగునె యీషన్మాత్ర మెప్పట్టునం
గుహనా తాపసు లెల్ల రక్కజముగాఁ గుంఠీకృతజ్ఞానులే
మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్య సంలగ్నుఁడై 59
వంశ పావనుండు మనువు వఱల నెడఁదఁ
దద్ద గౌరవమ్ము తనదు తండ్రి వలన
దినము లలరు చుండ వెలుఁగుల నిలఁ బుడమి
యినుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు 58
[ఇనుఁడు = రాజు]
కనులకు విం దొసంగ నిసి కాంతుఁడు చంద్రుఁడు చల్ల చల్లగా
ననయము శీత లాంశునిగ నందఱి మన్నన లందె ధాత్రిలోఁ
బెనుపున మానవోత్కరము వే కిరణమ్ముల వెల్గు చుండఁగా
నినుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రక రాభిధానమున్ 57
ఆకు లేని తినక యడవిలో నాచరిం
పఁ దప మా యుమయె యపర్ణ యయ్యె
దేవి తమ్ములమ్ము సేవింప కున్నచోఁ
బద్మభవుని సతి యపర్ణ యంద్రు 56
ఛద్మ మించుక లేదు కావఁగ శక్య లెల్లర ధాత్రినిన్
సద్మ రాజము లందు నిల్చి విశాలనేత్రలు నిత్యముం
బద్మనాభుని ధర్మ పత్నియు వాణి యెట్టులొ యట్టులే
పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్ 55
తినఁ దా నెవ్విధిఁ రాఁ గల
డని వెస వాతాపి జీర్ణ మనుచు విసరఁగా
మినుకుల శస్త్ర మగస్త్యుఁడు
ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్ 54
వనవాసాంతర కాల మందుఁ జరియింపం బాండవానేక మా
ర్తిని భార్యా సహితమ్ము వారల నహో తీవ్రంబుగా మార్కొనన్
ఘన దోర్దండు సహస్ర గంధ కరి సంకాశోగ్ర తేజస్వి భీ
ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో 53
దశర థాగ్ర నందనుని కోదండ రామ
చంద్రుని కరమ్ము గైకొని జానకీ స
తి పరమ పతివ్రత వర విదేహ రాజ
కన్య కల్యాణమూర్తియై కనెను సంతు 52
ధన్యుల్ మిక్కిలి వారి భర్త లిలలోఁ దథ్యమ్ముగా నెన్నఁగా
మాన్యల్ ధాత్రిని నెల్ల వారలకు సంపాదించి రార్యామణుల్
వన్యాన్యాశన లంద ఱింపుగను విశ్వఖ్యాతినిం బంచ స
త్కన్యల్ వారలు సంతతిం గలిగియుం గల్యాణ మూర్తుల్ గదా 51
కూఁతురివి యన్న దాతృత్వ గుణము లేదు
కోడలి వన గాంభీర్యము కొఱత నీకు
పౌత్రి వయిన నీ రెంటినిఁ బడయ లేదు
కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము 50
దాతల యందు నుత్తమపు దాత ధరాతల మందు నెన్నఁగా
నేతల లోన నున్నతపు నేత వసుంధరలో గణింపఁ నా
తాతకు నేమి యౌదు వనితామణిరో వచియింపు మింపుగాఁ
గూఁతురు వయ్యెదో యనుఁగుఁ గోడలి వయ్యెదొ పౌత్రి వయ్యెదో 49
ధన్యాత్ములు మును లెల్లరు
కన్యా ధన లాలసమ్ము కాంచఁగఁ బుడమిన్
శూన్య ఫలము సంసారము
సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్ 48
అన్యాయార్జిత విత్త మేల మన కం చాదర్శముం జాటఁగా
నన్యోన్యమ్ము పరోపకారమును నిత్యం బెంచి సద్బుద్ధితో
నన్యాక్రాంత నిమిత్త సంజనిత ఘోరాన్వస్త్ర ధారా మహా
సన్యాసం బిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా 47
పలికిన పలుకు పలుకక వారిజాక్షి
యధర మత్తఱిఁ గంపమ్ము నందఁ గరము
సతియె ప్రణయ కోపమ్మునఁ జలుప నింద
పతి మురిసెఁ బల్లవాధర ప్రల్లదమున 46
వల్లవీజన లోలుఁ డిద్ధర వాసుదేవ వరాఖ్యుఁడే
మెల్ల మెల్లగ వీణ నూదుచు మించి యంతట మాయమై
చల్ల చల్లగ జాఱఁ దిట్టెడి శాపయుక్త విశేషమౌ
పల్లవాధర ప్రల్లదం బది భర్త కెంతయొ హర్షమౌ 45
దంష్ట్రములు పద నగు మహా
దంష్ట్రమ్మునకుఁ బరికింపఁ దద్దయుఁ గొఱకన్
దంష్ట్రములచే నరుఁ డొకఁడు
దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే 44
[మహాదంష్ట్రము = పులి]
దంష్ట్రమ్ముల్ దనరారుచుండ నిశి తాస్త్రవ్రాతభంగిన్ మహా
దంష్ట్రాభం బయి భీమ సేనుఁ డనిలోఁ దద్దేహముం జీల్పఁగా
దంష్ట్రాలిన్ వెసఁ గొర్కుచుం బగను బ్రద్దల్ గాఁగ దేహం బహో
దంష్ట్రాఘాతము చేత నేల కొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్ 43
[ద్వైమాతురుఁడు = జరాసంధుఁడు]
ఎండిన యుర్వీరుహ మె
న్నండైనఁ జిగుర్చు నిల ననఁగ నమ్మెద వి
శ్వాండంబున వింతఁగ నే
షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్ 42
చెండాడెం గద భీక రాహవమునం జిత్రాతి చిత్రంబుగాఁ
బాండుక్ష్మాపతి సూను వర్గము ధనుర్బాణాస్త్ర దివ్యప్రభా
షండంబున్ దిన మందు సింధు నృపుఁ డాశ్చర్యంబు విశ్వంబునన్
షండుం డొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతాన మందెన్ భళా 41
కోరి రాఁగ జనులు గురువుల నర్థింప
మూరి యొసఁగ నొప్పు నేరి కైన
మూర్ఖ జనులఁ జేరి బోధ నొసఁగ నెంచి
విద్య నేర్పు వారు వెఱ్ఱివారు 40
సేద్యము యంత్రచోదనము సిక్కును విద్యల నైపుణమ్మునన్
వేద్యమ యెల్లవారలకు విశ్వము నందు సునిశ్చయమ్ముగన్
విద్య లొసంగుఁ జిత్తుఁ గుడిఁ బెట్టును నేర్పిల నేరకున్నచో
విద్యలు, నేర్పు వార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్ 39
కాలానుగుణము గనఁబడు
నీ లాగున వాదము లవి యే విధి నాగం
జాలవు బతిమాలిన నీ
యాలుమగల మధ్య గొడవ లాహ్లాదములే 38
చాలుం జాలును బోకుమీ యడరి నీ సంక్షేమ మాశించితే
నాలాపమ్ముల జోలికిం దమిని మిథ్యాక్రోశ సంయుక్త దృ
గ్జాలవ్యాప్త పరస్ప రాతిశయ శృంగారైక వాదమ్ము లం
దాలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాద మిచ్చున్ గదా 37
కావలెఁ దార్కాణమ్ములు
దేవుని యునికికి నటంచుఁ దెల్పుఁ డనంగన్
దేవుని మహిమం దెలుపఁగ
దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్ 36
వేవురు భక్తి రక్తులను విన్నపముల్ గడుఁ జేయుచుండి స్వీ
యావన కార్య కాంక్షు లయి యంచిత రీతిని శుద్ద చిత్తులై
యే విధిఁ గొల్చినం దమిని నించుక యేఁ గరుణా విహీనుఁడౌ
దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్ 35
జన్మమ్ము లనిత్యమ్ములు
జన్మ పరంపర లనిశము సాగుచు నుండున్
విన్మా నీవును ధర, నే
జన్మించితిఁ జచ్చి మరల, జన్మించి తిటుల్ 34
కన్మా పుట్టుక లింకఁ జావులఁట యెక్కాలమ్మునన్ జీవికిం
దన్మూలమ్మునఁ గల్గుచుండు నిలలో దామోదరుం డింపుగా
నున్మీలింపఁగఁ జేయఁ గేళిగతిఁ దా నుత్సాహియై నిత్యమున్
జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్ 33
నమ్మకు మూఢుని పగిది భృ
శమ్ముగఁ జింతించి పూజ సలుపుమ నరుఁడా
యిమ్మహిని క్షుద్ర పూజల
నమ్మను సేవించు వార లత్యంత ఖలుల్ 32
సొమ్ముల్ కొన్నిటిఁ బుచ్చుకొంచు నకటా క్షుద్రాశ పొంగారఁగన్
సమ్మోహమ్ము సెలంగ డెందముల దుస్సాంగత్య మేపారఁగన్
సమ్మానింపక విగ్రహమ్ములను మాత్సర్యంపు దుర్బుద్ధితో
నమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యం తాఘముల్ వొందరే 31
[అమ్మన్ = అమ్మఁగా]
ప్రీతిఁ బినదండ్రిఁ గొలు మని
వే తెఱవుల నంగదునకు వెత వాలియు నిం
కా తారా సతి గోముగఁ
గోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్ 30
భూతల మేల నర్హుఁడవు మూఱిన విక్రమ శక్తి యుక్తులం
దే తఱినిన్ సమర్థుఁడవె యెన్నఁగఁ బౌరవ వంశ వర్య యం
చాతత మా సుయోధనున కంగధవుండును మేనమామయుం
గోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్ 29
ఎన్ని పొగడఁ దగు గుణము లున్న నేమి
లొంగి వ్యసనములకుఁ గడు క్రుంగి పనుల
మాని సంచరించెడు ధనహీనుఁ డైన
పతిని సేవించు సతి పొందు బాధ లెన్నొ 28
ఓర్తి విదర్భ రాజ సుత యుంచె మదిం బతి నిశ్చయమ్ముగా
నార్తి నిజేశు సేవల ధరాత్మజ నిల్చె సతమ్ము త్రేతలో
వర్తిలె భర్తృ సేవలను బన్నుగ ద్రోవది ద్వాపరమ్మునన్
భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్ట నష్టముల్ 27
సకల సురులకు నాద్యుఁడై సంతతమ్ము
నతుల నింపుగ నందెడు నలువ పద్మ
సంభవుండు సనంగ దర్శన మొసంగ
విష్ణుదేవుఁడు సూపెను వినయ మెంతొ 26
కృష్ణ! కృష్ణ! పరీక్షకై వెస నేఁగ నేల నితాంత రో
చిష్ణునిం గట చిన్నవుచ్చుట చిద్విలాసమె మౌనికిన్
విష్ణు మాయ యనంగ నా భృగు విప్రుఁ డాతనిఁ దన్నఁగా
విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే 25
అజ్ఞాను లిష్ట పడుదురు
విజ్ఞులు మెచ్చ రెపు డిబ్భువిని సత్యము ధ
ర్మజ్ఞా హింసాత్మకములు
యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్ 24
ప్రాజ్ఞులు వేదపారగులు భద్రము నెంచి నిరంతరమ్ము క్షే
త్రజ్ఞు నెఱింగి నట్టి వసు ధామరు లెల్ల రొనర్తు రిద్ధరన్
విజ్ఞులు మెచ్చ రెవ్విధిని విప్ర వరేణ్యులు వల్క నిట్టులన్
యజ్ఞము లెల్ల దేశమున హానినిఁ గూర్చుట కోసమే కదా 23
విద్యా నిజ ప్రభా లసి
త ద్యుతి విద్వణ్మణి నిరతము విద్యాపా
రద్యుతినిఁ, జేరఁ దీయక
పద్యద్వేషులను, ధూళిపాళయె మెచ్చున్ 22
గద్యౌఘావృత పద్యకావ్యముల నాకాంక్షించు నిత్యమ్ము నీ
విద్యాధిక్యుఁడు పండితోత్తములలో విఖ్యాతుఁడే యెన్నఁగన్
సద్యస్ఫూర్తి సమంచి తాంధ్ర సుర భాషా వేత్త నిందార్థ భృ
త్పద్యద్వేషుల ధూళిపాళ మణి యాహ్వానించు నాత్మీయతన్ 21
చెంగు చెంగున వెసఁ జిత్రగతుల గెంతి
చిఱుత పిల్ల యొకటి చెంత కరిగి
పండుకొంచు నొసఁగఁ, బాఱంగ భీతిల్లి
గోవు, పాలను బులి గ్రోలె వనిని 20
ఆక్షేపింపఁ దరంబె సన్మునుల మాహాత్మ్యమ్ములన్ సుంతయున్
నిక్షేపమ్ములు మానవాళి కవి సంధిల్లంగ సుశ్రేయముల్
సుక్షేమమ్ముగఁ గణ్వు నాశ్రమమునం జోద్యమ్ముగా నాడుచున్
గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవి న్దృప్తిగా 19
దాఁచి పెట్టిన సొమ్ము లంతమ్ము లయ్యెఁ
జేరఁ దీసిన వారలే దూర మైరి
నాది నా దనుకొన్నది యేది నిలుచు
విఱ్ఱవీఁగిన నాయకుల్ వీడినారు 18
వెఱ్ఱు లంచును నూఱకుండునె వేల్పు టింగల మక్కటా
చుఱ్ఱు మంచును గాల కుండునె చూచి దాఁకఁగ నిప్పునే
కుఱ్ఱ లంచును లోకు లెల్లరు కుల్క నిత్యము మిక్కిలిన్
విఱ్ఱవీఁగిన నాయకాళికి వీడుకోలు నొసంగిరే 17
హరి కటాక్ష మున్న నసాధ్య మరయఁ గలమె
గాన గంధర్వుఁ డయ్యె నొకండు వింత
నాట్య కోవిదుఁ డయ్యె ఘనముగ నొకఁడు
వేద విదుఁ డయ్యె నొక్కఁడు విద్య విడిచి 16
విద్య లనంగ బ్రహ్మమును వేద్యము నింపుగ నేర్పు నట్టివౌ
చోద్యము నేఁడు గాన మిలఁ జొప్పడ లౌకిక విద్య లెందుఁ దా
నాద్యుఁడు శంకరాఖ్య ముని యబ్జజ సన్నిభుఁ డద్భుతమ్ముగా
విద్యను వీడి యొక్కరుఁడు వేద విశారదుఁ డయ్యె నిద్ధరన్ 15
అలర మనము లెల్లరకును
లలితమ్ములు గుంభనములు రమణీయముగా
నొలుకఁగఁ దేనెలు పలుకుల
కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ 14
సలిలం బందు మునింగి సాగరమునన్ సద్భక్తితో వేద వే
దులు మౌనీశ్వరు లెల్లఁ బూజ లిడఁ జంద్రుం డస్తమింపంగఁ ద
మ్ములు, కన్పింపఁగ బాల భాస్కరుఁడు సంపూర్ణమ్ముగా, వాడఁగాఁ
గలువల్, పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ 13
[కన్పింపఁగ బాల భాస్కరుఁడు సంపూర్ణమ్ముగా వియత్తలంబునఁ ద
మ్ములు పూఁచె]
దిన నిశా చంద్రు లిరువురు దినదినమ్ము
నిద్ధర వెలుఁగు చుందురు పద్ధతిగను
నొకరి పిమ్మట నొక్కరు ప్రకటితముగ
నొక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె 12
గ్రద్దన నుద్భవింప హరి కారణ జన్ముఁడు లోక రక్షకై
పెద్దలు నస్త్ర శస్త్రముల వీర్య పరాక్రమ ధాటి వెల్గఁగాఁ
దద్దయు రామచంద్రుఁడును దానవ చంద్రుఁడు రావణుండు నా
నిద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్ 11
ప్రకటిత భక్తిం ద్రిపురాం
తకార్పితస్వీయ బుద్ధి తనరగ సతమున్
వికల మనమ్మున ఫాలాం
బక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్ 10
సుకరము లౌను గార్యములు చొప్పడు నెల్ల లసన్మనో రథ
ప్రకరము లంచితమ్ముగను ఫాలత లాక్షునిఁ గొల్వ భక్తినిన్
సకల నరోత్కరమ్మునకు సన్నుత ధర్మము చిత్త శుద్ధిఁ ద్ర్యం
బక జప మాచరించుటయె ప్రాప్త మొనర్చును మోక్ష మిద్ధరన్ 9
గాదిలి సూనునకు బలము
గాఁ దాఁకఁగ బల్ల యంచు గాయము గాఁగా
నోదార్ప నెంచి బల్లను
సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్ 8
మేదినిఁ దల్లి ప్రేమ కిఁక మించిన దెయ్యది యెంచి చూడఁగా
వేదన నాలకించి వెసఁ బెద్దగ నేడ్వఁగ సంభ్రమమ్మునం
దా దరిఁ జేరి శీఘ్రముగఁ దల్లియె కూరిమి కంటి చూపు లన్
సూదుల తోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారుని పైనఁ బ్రేమనున్ 7
సజ్జనులఁ గూడి యుందురు శాంత మూని
యేమఱక యుందురు సతమ్ము తాము సేయు
కర్జముల వీడ రెన్నఁడు దుర్జన గణ
మాన్యు లుండరు కోటబొమ్మాళి లోన 6
మే లొనరించు నేత లిట మించి వసింపఁగఁ బట్టణంపు స
త్పాలన ముండ నింపుగను బండిత శూన్యుల నేరిఁ గాంచ మీ
నేలను నేర నైతిఁ గడు నేర్పు గడింపని వాఁడు గోటబొ
మ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో 5
దారుణముగ మనుష్యులు దర్ప మూని
నియమముల నెన్న కించుక భయము భక్తి
రక్తి నెదల వీడి యనాదరమున సాంబ
శివునిఁ దలఁచుట దొసఁగు కాశీ పురమున 4
రవి చంద్రాది దివౌకసప్రకర మర్త్యవ్రాత గంధర్వ భా
ర్గవ రక్షోవర సిద్ధ కిన్నర గ ణారాధ్యుండు ఫాలాక్షుఁ డీ
భువిలోఁ దారక మంత్ర రాజము సదా పూజ్యంబు దూషింపఁగా
శివ నామస్మరణమ్ము దోష మగుఁ గాశీ క్షేత్రమం దెప్పుడున్ 3
చక్కటి చుక్కవె యెన్నఁగ
మిక్కుటముగఁ బద్దెములను మీఱి వచింపం
బ్రక్కన నిలువంగఁ గలవె
తిక్కనను వరించి తీవు తిక్కల పోఱీ! 2
ఇక్కలి కాల మందుఁ గన నివ్విధి నుండక యెట్టు లుండు నీ
మక్కువ నెంచి చూచినను మానిని హాస్య మెడంద రేఁగదే
తిక్కకు తిక్క తో డగును దిన్నగ నేఁడిఁకఁ జంచలాంబకా
తిక్కననున్ వరించితివి తిక్కల పోఱి! యిదేమి చిత్రమో 1