వానర పద మందు వా గిరను దొలఁగిం
ప నరు లయిరి యెల్ల మానవు లిఁక
వా రటు లొనరింపఁ గారణ మే మందు
వా నరులకు లేవు వాలము లఁట 59
దానవ మాన వౌక మృగ దైత్యులు కశ్యపు బిడ్డలే చుమీ
మానవు లెల్ల వింతగను మర్కట కోటికిఁ బుట్టి నట్టి సం
తానము నా వచించినను దథ్యమునే వచియించు చుంటి బా
వా! నర జాతి యెల్లపుడు వాలము లేనిది గాదె చూడఁగన్ 58
రామ విరోధిని నింద్రుం
డా ముక్కంటి మఱి బ్రహ్మ యైనను గట్టా
నీ మహిఁ గావ నశక్యులె
రామునితో వైర మది పరమ్మును జేర్చున్ 57
రాముఁడు విష్ణువే ధర నరప్రవరుండు వికుంఠవాసుఁడే
ధామ సురక్షకుల్ పతిత ధర్ములు రావణ కుంభకర్ణులే
నీమము తప్పఁ బుట్టి రిట నేల గణింపఁగ శాపముక్తికై
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్ 56
తమ్ము నిరంతరమును జెలు
వమ్మునఁ గాపాడు చుండ వానిం గని వా
రమ్మను జాధిపు సహకా
రమ్మునుఁ గొనియాడిరి ముని రాజులు నెమ్మిన్ 55
సమ్మా నార్హము లా మనో బలములే సామాన్యమౌ మానవౌ
ఘమ్మొల్లం గడు విస్మయం బరయ దీక్షా దక్షతం గాంచఁగన్
నెమ్మిన్ దుస్సహ ఘోర సంతత తపో నిష్ఠా నిమిత్తాత్త భా
రమ్మున్ మెచ్చిరి యోగిపుంగవులు భద్రంబున్ మదిం గోరుచున్ 54
జయము లెన్న నెవ్వరి కైన సంశయమ్ము
లని నెఱుంగక దైవోపహతుఁడయి కట
సంతత సమ రాకాంక్షి సుక్షత్రియుండు
ద్విజుఁడు మోహాంధుఁడై వరూధినినిఁ గూడె 53
[వరూధిని = సేన]
నిజ దేశంబున కేఁగ నా ప్రవరుఁడే నిశ్చింత నిష్కాముఁడై
విజయం బందితి నంచు డెందమునఁ దృప్తిం జెంద నన్నాతియే
నిజ రూపంబు వహింప కత్తఱి వెసన్ నిర్లజ్జ మాయామయ
ద్విజ వర్యుండు తిరస్కరింపక వరూధిన్గూడె మోహాంధుఁడై 52
వరూధిని పేరు గనుక వరూధి గాఁ గుదించి వరూధిన్గూడి యన నగును.
న్యాయానికి వరూధినిన్ గూడి యన వలెను.
జానకీ సతి నిజ భర్త సరస సేరఁ
జంద్ర బింబ నిభానన స్యయము స్వీయ
ముఖ మరయ నెంచి తుడువంగ ముకుర మంత
సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు 51
జాత మహానురాగమునఁ జంద్ర నిభానను రామచంద్రునిం
బ్రీత మనోంబు జాతమున భృంగ నిభాసిత కుంతలప్రభా
సీత సరోరుహాంబక స్పృశింప నిజేశుని యాస్యబింబమున్
సీత కరాంబుజాతమున శీతమయూఖుఁడు వెల్గెఁ జూడుమా 50
మద్యము సేవించితివా
వైద్య మవసర మని పిచ్చి వాఁడవె యంచున్
వేద్యం బాయెను జెపు మే
మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్ 49
విద్యల నుత్తముండు కపి వీరుఁడు రాఘవ కార్య మగ్నుఁడున్
హృద్య వచో వితానముల హృష్టి నొసంగుచుఁ బుణ్య శీల యే
తద్యము నాభ జానకి సుదర్శన భాగ్య రసమ్ము, తుల్య ధీ
మద్యముఁ, గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రునిన్ 48
[ఏతత్ + యమునా + ఆభ = ఈ యమునా నదీ సమాన మైన
యామె; తుల్య ధీమత్ +యము = ధీమంతుఁడైన యమునికి సమాన మైన వాని]
నిశలందు వాడుట కయి య
నిశమ్ము కంబళ మడుగఁగ నిశ్చింతగ, స్వీ
య శరీర రక్షణమునకు
శిశిరమునకుఁ దాళ లేక, శిష్యునిఁ గలిసెన్ 47
వశమై పైఁడికి వేఁడఁ గాంచనము సంభావించి శిష్యుండు వే
భృశ మిచ్చెన్ గురు దక్షిణం దలపయిం బెట్టంగ మొత్తమ్ము నా
వశయే భార నివారణార్థము వెసం బ్రార్థింప, గాంగేయ రా
శి శిరమ్మున్ భరియింప లేక, కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై 46
రాత్రిఁ బుట్ట నుత్పలమ్ములు తమ్ములు
పుట్ట రాత్రి గడచి ప్రొద్దు వొడువ
నుచిత మిట్లనంగ నుత్పలమల కిలఁ
దమ్ములై రహించెఁ దమ్మిపూలు 45
ఇమ్ముగ మెత్తనౌ విరుల కీ కఠినత్వము వచ్చె నెట్టులో
యమ్మకచెల్ల సుంత గమనార్హము స్త్రీ పురు షాలి కింపుగాఁ
బమ్మఁగఁ జేయ మోహము నవారిత రీతిని ధాత్రి మారు వం
తమ్ములుగా రహించెఁ గనఁ దామర పూలు మనోహరమ్ముగన్ 44
వర్ణింపఁ గలమె దుఃఖము
కర్ణములన్ సోఁక భర్త గమనం బకటా
తూర్ణము మరణం, బొల్లక
జీర్ణ వయస్కు మనువాడఁ, జిన్నది కోరెన్ 43
అర్ణవ సన్నిభంపు ధృతి నంగన వూని మనమ్ము నందు ను
త్తీర్ణ నిజాపదుత్కరుని దేవునిఁ జక్కఁగ విశ్వసించి సం
పూర్ణ మనోరథమ్మునను భూరి తపో బల దివ్య దక్షతం
జీర్ణ వయస్కునిం గనిన చిన్నది కోరె వివాహమాడఁగన్ 42
[చీర్ణ వయస్కుఁడు= సంపాదింపఁ బడిన వయస్సు కలవాఁడు]
చలుప కున్న నెట్టి సత్కార్యముల నెప్డు
ప్రజల మేలు నెంచి రమ్యముగను
ఫల విహీన మైన భంగి స లీల దు
ష్కృత మొనర్చు వాఁడె కీర్తిఁ గనును 41
వితరణ శీలియై భృశము విత్తము నందు దురాశ చూప కె
ట్టి తరుణ మందు సుంతయును డెందము నందు ఫలించు నట్టి స
త్కృతము లనేకముల్, పరిహరించి వివేకము తోడ నెల్ల దు
ష్కృతము, నొనర్చు వాఁడె ఘన కీర్తినిఁ బొందు వివేకవంతుఁడై 40
వెక్కసమ్ము గాను వీనుల కిడ విందు
రాగ తాళము లవి మ్రోగుచుండఁ
జక్కఁగ శ్రుతు లమర నొక్కటేనియు నప
స్వరము లేని పాట శ్రావ్య మయ్యె 39
నరులటఁ దోలుచుండ వడి నడ్ముల పైనఁ గడింది మొత్తుచున్
వరుసగ నొక్క టొక్కటిగఁ బాడుచు వింతగ గొంతు లెత్తి యా
ఖరముల మంద సాగ ఘన కంపము సెంద ధరాతలం బహో
స్వరములు లేని పాట కడు శ్రావ్యముగా వినిపించె నెల్లెడన్ 38
జనులకు నబ్బునె సౌఖ్యము
మనముల కెట్లబ్బు శాంతి మాత్సర్యమునన్
ఘన శాంతి, సమసి యా వెల
సిన క్రూరత, నిండఁగఁ బ్రజ క్షేమం బందున్ 37
కృత సత్కార్య ముదాత్ము లై వినుత సంతృప్తాత్ములై సన్నుతో
న్నత విద్యాధిక కీర్తిమంతు లయి నానా వర్ణ సన్మార్గులై
సతతం బింపుగ ధర్మ తత్పరులునై శాంతాత్ములై వర్తిలన్
క్షితి నక్రూరత నిండఁగాఁ బ్రజలకున్ క్షేమంబు సాధ్యం బగున్ 36
ధరణీ తలమున గురువుల
కురుతర భక్తిని మనముల నొక్కింతయు నా
దరముం జూపక చన నలు
గురు సరణిఁ జరించు శిష్యకోటికి వగపౌ 35
నిరతము పూజనీయులు గణింప గురూత్తము లెట్టివారికిం
బరము లభించు మార్గమును బన్నుగఁ జూప సమర్థు లౌదురే
సరసిజ జాత సన్నిభులు సద్గురు లిద్ధర సుంత యేని స
ద్గురు సరణిం జరించు టొనఁగూర్చును దుఃఖము శిష్యకోటికిన్ 34
పెద్దరికము వీక్షింపక వింతగాను
హద్దు లెఱుగక బాధ్యత నరయకుండఁ
బెద్ద వారికిఁ దగ నట్టి విధము గాను
సుద్దులం జెప్పు పెద్దలం జూచి నగిరి 33
మద్ది నిభంపు టంగముల మంచితనమ్మున మోసపుచ్చెడిన్
విద్దెలఁ బట్టభద్రు లయి వీడి మనమ్ముల నెగ్గు సిగ్గులన్
గద్దియ కై నిరంతరము కల్లలు కొల్లలు గా వచించుచున్
సుద్దులఁ జెప్పు పెద్దలను జూచి జనుల్ పరిహాసమాడరా 32
నుడివితి వక్షర సత్యం
బెడంద సందేహము వల దింతయు నీకుం
గడు చక్కని మాటే యిది
చెడు దుర్వార్తలను వినినఁ జేష్టలు డుగరే 31
[చెడు దుర్వార్తలు = మంచి వార్తలు]
తడి వస్త్రమ్మున గొంతు కోయుట యనన్ ధర్మమ్ము లో నెన్నకే
కడు దుర్వార్తలు దుఃఖ దేయములు వక్కాణించుటే మానవా
యడరన్ భీతి కడింది డెందముల కత్యం తోగ్ర కంపమ్ము లి
చ్చెడు దుర్వార్తల విన్నచో జనులు నిశ్చేష్టాకృతిం బొందరే 30
మే మేడ భీష్ముఁ డెక్కడ
మే మిద్దెస మార్కొనంగ మే లగు నేమో
వే మగుడి సెలఁగ మేలా
యే మెయి నని నతిశయిల్లు నింపుగ జయమే 29
అన్య దేవతలను నర్చింప నిత్తురు
భోగములను గాని ముక్తి నిడరు
విన్మ కోరితేని జన్మరాహిత్యము
విభవ నాశమునకు విష్ణుపూజ 28
లభియించెన్ స్వ పురాకృ తాత్యధిక కర్మవ్రాత సంజాత దు
ర్లభ మర్త్యోన్నత జన్మ సత్ఫలము లీలాలోలు సద్భక్తితో
నభ యార్థం బిల సాధు రక్షణకు దైత్యాటోప రాజన్మహా
విభవ ధ్వంస మొనర్పఁగా మురహరున్ వేఁడన్ వలెన్ మానవుల్ 27
జలములకుఁ గొదవే యీ విశాల భూ త
లమునఁ బరికించి చూచిన నమిత కలుషి
తములు మూసీ జలమ్ములె తగు శివార్చ
నకును దగ వన నీవు వినవు గదయ్య 26
మీన స మేష రాసులను మెండుగఁ దల్పక చిత్తశుద్ధితో
నా నది లోఁ బవిత్రములె యప్పులు మౌని వరుల్ వచించు ప్ర
స్థానము నెంచి డెందమున శంకరు నర్చనకై జలమ్ము మూ
సీ నది నుండి తెమ్ము మును చేర నెఱుంగము కల్మషమ్ములన్ 25
[ప్రస్థానము = శాస్త్రము]
వాక్కు లందు సుంతయు మృదుత్వమ్ము లేని
యందగాని కెన్నఁగ విశ్వ మందు మంచి
వాసన యొకింత లేని పుష్పమ్ము పగిది
చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు 24
ఎక్కడ నైన విశ్వమున నింతుల కాభరణమ్ము శాంతమే
చక్కఁగ సద్గుణమ్ము లవి చామకు నక్కట లేకయున్నచో
వెక్కస మై వెలంది కిల వేద్యమ కాంచన భూషణమ్ములం
జక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్ 23
తనదు కరాగ్రమ్మున నా
ఘనగిరిఁ గృష్ణుండు మోయఁ గమనీయముగం
గని మ్రొక్కె భీతి శక్రుం
డనుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా 22
కనికర మొప్పఁ గష్ట తర కానన వాసులఁ బాండవేయులం
గన నుత దీన రక్షకుఁడు కంస నిషూదనుఁ డక్కజమ్ముగం
దన కడ కేఁగుదెంచఁ గని తద్వసుదేవ కుమారుఁ గూడి తా
ననుజుని పాద పద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్ 21
మిన్న గాను నన్ను మన్నించు నెప్పుడు
విన్న వినక యున్న నన్నె కాని
యెన్నఁ డైన నేని వన్నెలాఁడుల నేరి
ముట్టఁ డనుచు మెచ్చె ముదిత మగని 20
పట్టిన యట్టి గట్టి తన పట్టును వీడఁ దలంప నోపఁ డె
ప్పట్టున నైన డెందమున వారని కోరిక పుచ్చు కొంట యం
దిట్టల మైనఁ బట్ట పగ లెన్నఁడు మందును లేశ మైననున్
ముట్టెడి వాఁడు గాఁ డనుచు ముద్దియ మెచ్చును భర్త నెప్పుడున్ 19
శ్రీ యుతమ్ము వెల్గు సింహళ దేశమ్ము
భారతావనికి నదూరముగను
రక్షిత నగరమ్ము వీక్షింపఁగ నపర
చెన్నపురి గలదఁట సింహళమున 18
మిన్నని రాజమార్గముల మెండుగ వెల్గెడు చత్వరమ్ములన్
వన్నెకు నెక్క విశ్వమునఁ బన్నుగ నన్ని విధమ్ము లందు సం
పన్నము మిక్కుటమ్ముగను బట్టణ రాజము నొంటిఁ బోలఁగాఁ
జెన్నపురంబుఁ జూడ నగు సింహళ దేశము నందు రూఢిగన్ 17
ధీ వరేణ్యుండు సంగీత కోవిదుండు
నప్ర మేయాంధ్ర భాషైక సుప్రసిద్ధ
పండితుండు వాగ్గేయకారుండు నేఁటి
త్యాగరా జేసు పైనఁ గీర్తనలు వ్రాసె 16
మతముల భేద మించుకయు మానస మందుఁ దలంపకుండ నే
గతిఁ బొగడంగ వచ్చుఁ గృతి కర్తను విత్తము కోరకుండ నేఁ
డతులము సేసి గీతముల త్యాగము సార్థక నామధేయుఁడై
హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసుక్రీస్తుపై 15
అను నిత్యం బిలలో స
జ్జన రక్షకునకు నొనర్తుఁ జక్రికి నతులన్
వనజాక్షునకు మహాసుర
జన నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్ 14
ఘన సంతాప మొసంగఁ బౌరులకు నాకాంక్షించి దుర్బుద్ధితో
ననివార్యమ్ముగ నాక్రమింప విజయం బాశించి నిత్యాన్న పా
న నికాయమ్ముల నాపి శత్రు దళ సేనానీ బృహద్వాహినీ
జన విధ్వంసకుఁ డైన వానికి నమస్కారమ్ము లందించెదన్ 13
సుస్వర గళుండు సకల జన స్వభావ
వేత్త సంగీత విద్యా వియత్తలైక
భాసమానుఁడు నాట్య క ళాసమాన
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె 12
పస గల కారణమ్ములను బల్కుచు నెల్లరు విశ్వసింపఁగాఁ
గొసరుచు వేఁడుఁ గాలమును గోరినఁ గుందక తీర్పు మప్పు నా
విసువక రేపు రే పనుచు వేఁడును నిత్యము రమ్య మర్మ వా
గ్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో 11
[కంతు= గడువు]
తెలతెల వాఱిన కేశ
మ్ములవియు, వినయమ్ము మూర మోడ్చినవియుఁ, దా
నిల కూలినదియు నవిగో
తల లైదు, కరంబు లాఱు, తను వది యొకటే 10
అలుకం బూని కడింది డెందమున యోధాగ్రేసరుం డత్తఱిన్
బల దర్పమ్మునఁ బోర నుగ్రముగ బీభత్సంపు సంగ్రామపుం
దల మందున్ గణియింపఁ జిక్కినవి సత్యం బెంచి వీక్షింపఁగాఁ
దలలా యైదు కరంబు లాఱు తనువో తా నొక్కటే వానికిన్ 9
సౌమిత్రిఁ గూడకుండఁగ
రాముఁడు నిదురింపఁ డెప్డు భ్రాతృ ప్రియుఁడై
యేమఱకు లక్ష్మణ వినా
రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా 8
ఆ మనుజేంద్ర పుత్రుని మహాత్ముని లీల లమానుషమ్ములే
పామరుఁ డైన నత్యధిక పండితుఁ డైనను లోక మాత యా
భూమిజ గాథ నే పురుష పుంగవు తోడ నగౌరవమ్ముగా
రామ చరిత్రముం జదువ రాదు కుమార శుభాభిలాషివై 7
ఇలలోఁ గపి ముఖ్యుండు వి
మల చరితుం డతి బలుండు మారుతి వల దీ
కలవరము కామరూపుఁడు
నెలఁతా హస్తి ముఖ మాంజనేయున కొప్పెన్ 6
సతతము విఘ్న భంగములు సల్పుచు భక్తులఁ గాచు దేవునిన్
నతు లొనరించి గొల్వు మెద నాతిరొ తెల్పిరి యెల్ల వార లిం
గితములు చక్కఁగాను దిలకించు వినాయకుఁ బార్శ్వమందు నో
యతివరొ యాంజనేయునకు హస్తి ముఖం బమరెం గనుంగొనన్ 5
డెందము పులకరింపంగఁ జిందు లింపు
గొల్ప నెల్లర కప్పుఁ డనల్ప భంగి
రమణి తీసెఁ దియ్యని కూన రాగ మిట్లు
ననన నానా ననన నానన నన నాన 4
పనిలేకుండినఁ బోరు వెట్టితివిగా బాంధవ్యముం దల్పకే
వినుమా నిక్కము పల్కుచుంటి నిపుడే బింబోష్ఠి నిన్నెన్నఁడున్
వనజాక్షీ కన రాను నన్ననుపఁగా భాషింప రాకున్నచో
నన నా నానన నా ననా ననన నా నా నాన నా నాననా 3
[నన నాన్+ఆనన (సుమ మను ముఖము గలదానా), నా ననా
(ఓ నా సుమమా), న న న నాన్ నాన్ నాన్+ఆన
(న న న అని అని అనిన నొట్టు), నానా +ఆననా( అనేకము లగు
నోళ్లు గలదానా)]
ముజ్జగములకు వెలుంగుల
మజ్జన మొనరించు చుండి మానక నిత్యం
బజ్జరె పండ్రెండుగురును
సజ్జనులై ప్రజకు హిత మొసంగెద రసురుల్ 2
[అసురుఁడు = సూర్యుఁడు]
ఉజ్జగిలంగ నాసురుల యుగ్రత హ్లాదుని పాలనమ్ము నం
దజ్జనక ద్విషుం డిడిన యాజ్ఞల దాఁట నశక్తులై ధరన్
ముజ్జగముల్ ముదం బరయ భూరి విభీషణు పాలనమ్మునన్
సజ్జను లైరి రక్కసులు సర్వ జనాళికి మేలు గూర్పఁగన్ 1