1, మార్చి 2025, శనివారం

సమస్యాపూరణ_ మార్చి 2025

కొమ్మా వినుమ సకల జన 
సమ్మతమౌ రీతిఁ బంచ సంచిత నక్ష
త్రమ్ముల యన్నాలయమునఁ 
గమ్మగ వండెడి వనితలు గలరే భువిపై                                                              62 

పమ్మిన వేడ్క హెచ్చిన కృపా రస వీక్షల వారి వారి డెం
దమ్ముల సుంతయున్ విసుగు దాల్పక మిక్కుట మైన ప్రీతితో 
నిమ్మన కెట్టి జీతమును నెన్నఁడు సాటిగ దార కమ్మకుం 
గమ్మగ వండి పెట్టఁ గల కాంతలు గానఁగ రారు మేదినిన్                                        61 

కాంచు చుండంగ జను లెల్లఁ గరము భీతి 
నీట జనియించి రేఁగిన పాటవమున 
రేఁచిన ప్రకృతి వలనను నాఁచు లనెడి 
యడవులను దహించెను బడబానలమ్ము                                                          60 

వెడ బడబానలం బొకఁడు భీకర రీతిని రేఁగు నబ్ధిలోఁ  
నడరు వనమ్ము లింపుగఁ దదప్చర రాశికి ప్రీతి మంతమై    
సడల కొకింత యేనియును సంద్రములో విలసిల్లు చుండు నా 
యడవుల నెల్లఁ గాల్చె బడబానల మంబుధిలో జనించియున్                                 59 

రయము మీఱఁ గడిఁది పయనించు చుండంగఁ  
జల్ల గాలి తనువు నెల్లఁ దాఁకఁ  
బగటి పూఁటఁ జేఁప పగిది నే నప్పుడు 
కనులు మూయకుండఁ గలనుఁ గంటి                                                                58 

తిన్నను జన్న నెన్నఁడును దెన్నులఁ గొన్నను మందు లెన్నిటిన్ 
జొన్నలు  సన్నబియ్య మిఁక సున్నము గిన్నెలు మన్ను సొన్నముల్    
పన్నులు లేవు లే వనుచు భారత దేశ విభుత్వ మన్నదా  
కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్                            57  

ఏక పత్నీ వ్రతునకు నరేంద్ర నంద
నునకు నిద్ధ కోదండ రామునకు నిత్య
సత్య వాక్పాలకున కిల నిత్య ధర్మ 
కాముకుండు బ్రీతుఁడు రఘు రామునకును                                                        56 

రామున కార్త దీన జన రక్షణ కార్య వితాన ఖేల నా
రామున కంబుదాభ తను రాగ విరాజికి నెన్నఁ డేనియుం 
బామర పండితప్రవర పౌరజ నమ్ముల ధర్మ విత్త స
త్కామ కళావినోది దశకంఠ విరోధికిఁ బ్రీతి పాత్రుఁడౌ                                              55 

ఆతతముగ నరులకు సం
పాతము లిక్కట్టు లెల్లఁ బాచిక లాడన్  
 జ్ఞాతులతో దూరీకృత 
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖము లెల్లన్                                                       54 

జగతిని నున్నఁ బ్రాణములు సంకట సంచయ ముండు నేరికిన్ 
వగ లవి మాయ మౌను గద ప్రాణము లాత్మను వీడిపోవఁగా      
విగత నిజాసు జాలముల వేగమ కాంచ యమాలయమ్మునే 
యగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే                                  53 

కన్ను మిన్ను సుంత గానక నిత్యము  
విఱ్ఱవీఁగి కరము విత్త రాశి 
గర్వమునఁ జెలంగ నుర్వి దుష్కృతములఁ
గరివరదుఁ డొసఁగఁడు కామితముల                                                                   52 

ఏమని చెప్ప నేర్తుఁ గలి నెవ్వరు దిక్కు నరాళికిం బరం
ధాముఁడు నిద్రలో మునిఁగి తద్దయు వార్ధిని మఱ్ఱియాకుపైఁ 
గాముక కోటి కోరికలు గాంచి రమేశుఁ డగోచరుండు గాఁ 
గామిత మెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేఁడుకున్నచో                                           51 

ఎక్కి నంత మాత్ర మిభము నెయ్యది దక్కు 
దక్కునె పరికింప నొక్క కాసు 
చిక్కఁ గలది యెద్ది  దక్క భయము గ జా
రోహణమును గవులు రోయు చుంద్రు                                                                50 

మోహ మనంగ రాదు మది మోదము గూర్చు జయమ్ము సద్యశో
దాహము లేని దెవ్వరికి ధాత్రి సముల్లస దంధ్ర దేశ భా
షాహవ కేళినిన్ గెలువ నర్హ విధమ్ముల  గెల్చినన్ గ జా
రోహణ మన్న సత్కవులు రోసెద రెప్పుడు కౌతుకమ్మునన్                                       49 
[రోయు = వెదకు] 

రామ కథ నుడువుచు రగులు చుండ మిగుల   
సీత కొఱకు వెదకు కోఁతు లందుఁ 
బక్ష్మ యుగ్మ మకట పక్షి సంపాతికి 
దగ్ధమైన కనులె దారిఁ గాంచె                                                                            48 
[దగ్ధమైన యల్పములు; కను = అల్పము] 

దుగ్ధ పరిప్లుతమ్ము లయి తొల్లి శుచిత్వము నంది నింపుగా 
ముగ్ధ మనోహరమ్ము లవిపో మఱి  యివ్విషయంబు నందు సం
దిగ్ధము లేదు కన్నులను ద్రిప్పుచు దిక్కులఁ జూచుచుండ ని
ర్దగ్ధము లైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్                                          47 

వాసుదేవుఁడు నల్లని వాఁడు కాఁడె 
యర్జునుండు నల్లని వాఁడు దుర్జయుండు 
కాఁడె యింక డెందమున శంక వలదంచుఁ 
గారు వరుని కాల్గడిగియు కన్య నిచ్చె                                                                 46 
[కారు = నలుపు] 

మూరిన సంతసమ్మునను  బుత్తడి విత్తము లిచ్చి మక్కువన్ 
దార యొసంగ సమ్మతము తద్దయుఁ ప్రీతిని గౌరవమ్ముగాఁ  
గోరఁగ మున్ను తన్ను తన కూఁతును దన్నగరంబునం దయ
స్కారు ముదంబునన్ వరుని కాళ్లను గడ్గి యిడెం గుమారితన్                                 45 

ఈ మహి ధృతరాష్ట్ర సుతుని 
గోముగ దుర్ధర్ష దుర్ముఖుల కవరజునిన్ 
భీమబలున కగ్రజునిన్  
భీముఁడు కర్ణుని వధించెఁ బెనకువ లోనన్                                                         44 

నామ దశప్రభా వినుత నాథుఁడు స్వీయ మనో లసత్పరం
ధాముఁడు సవ్యసాచి రిపు దండుఁడు గాండివ నామ సద్ధను
ర్భీముఁడు ఫల్గుణాఖ్యుఁడు కిరీటి ధనంజయుఁ డాహవోజ్జ్వల
ద్భీముఁడు కర్ణుఁ జంపె నరి వీర భయంకరుఁడై రణమ్మునన్                                    43 

పావకోళ్ల నూని పాద ద్వయమ్మున 
గొడుగుఁ పట్టి వింత వడు గెడందఁ 
గాశి యాత్రకుఁ జన నాశ జనించెను 
వరుఁడు దనకు వధువు వల దనియెను                                                            42 

దురితము మూట కట్టుకొనఁ దొందరపాటు వహింప నేల ని
ష్కరుణను మోప నిందలను గర్జము కాదు శుభాంగి కింపుగా 
సిరి కళ యున్న దాస్యమున శీల పరీక్ష నిమిత్త మౌర దే
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్                                     41 

తల్లి వినత చెప్పిన దంత తలఁచి తలఁచి 
దోషముల నెంచి మది లోనఁ దొడరి తొడరి 
పేరున హరి యయి నడతఁ గ్రూరుఁ డైన  
విష్ణువునుఁ జంపెఁ గోపించి వినత కొడుకు                                                           40 

చనునే చేసిన పాప మూరకను విశ్వంబందు నెవ్వారికిన్  
వినినన్ మాతృక దాస్య కారణమహో వేవే ప్రదర్శించి చే
వను గద్రూ ప్రియ సూను స్వీయ జననీ బాధా ప్రదాయిన్ ఖలున్ 
వినతానందనుఁ డుద్యమించి హరిఁ జంపెం గ్రుద్ధుఁడై పోరునన్                                 39 
[హరి = పాము] 

భాషణమ్ములఁ జతురుని రోష మన్న
దెఱుఁగని తనకు సంతత మెలమి నొసఁగు 
సుదతులఁ గడింది గౌరవించు వికటంపు 
సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె                                                              38 

తరుణుల పైన గౌరవము తప్పక చూపును జిత్త శుద్ధితోఁ 
గరుణ గలట్టి యుత్తముఁడు కైతవ మన్నది నేరఁ డెన్నఁ డే
నరయగ స్వప్నమం దయిన నన్య లతాంగుల చెంత నాడఁగా  
సరస మెఱుంగ నట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే                                    37 

రఘు వరాన్వయ మహనీయు రామ చంద్రు
కరుణఁ బట్టాభిషిక్తుండు గాఁగ మురిసి 
రవి తనయునకు శత్రు విద్రావణునకు 
వాయుజుఁడు హారతినిఁ బట్టెఁ  బరమ భక్తి                                                           36  

ఘన రిపు వాయు నందనునిఁ గయ్యమునం దపరాజితుండునై 
పెనఁగెడు వాని బంధితుని భీకర సంఖ్యను జేసి పిమ్మటం 
జని చని యబ్జజాస్త్ర సువిశారదుఁ డింద్రజితుండు కూలఁగా
ననిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై                                           35 

మేనునకె కాని యెన్నఁడు మానసమున
కుండదు ముసలితన మను గండ మెన్న 
నిత్య యౌవనమునఁ గడు నివ్వటిల్లు
మది నపుంసక మన్నట్టి మాట బొంకు                                                                  34 

పాయక నీదు సూత్రములు భావ గభీరత సంతరింపఁగాఁ  
దీయని రాగ సంచయ మతీతము వీనుల విందు సేయఁగా 
హాయి నొసంగు గీతముల నాతత రక్తిని నాలకించుచుం
బోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ                                     33 

అల విత్తమె ముఖ్యం బని 
కలకాలం బుండు నంచుఁ గాఠిన్యమునం 
గలి కాలపు మాహాత్మ్యము 
తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్                                                         32 

ఛిన్నము కాక మున్న వెసఁ జింతల మున్గక మున్న నేర్పునం 
గ్రన్నన నేరి తత్క్షణమ కష్టము లన్నిటిఁ, గాచి భక్తిమై 
యన్ననుఁ దండ్రినిన్ జనని, నంత మొనర్చిన వారె వంద్యు లౌ
నన్నను లేక కా దనిన నాత్మ  జనౌఘము సంతతమ్మునున్                                        31 

దుష్కర మైనను బాప ప
రిష్కార మొనర్ప శ్రీహరి పదార్చనలన్ 
నిష్కపటపు దూరీకృత  
దుష్కృతమున స్వర్గ మబ్బె దుర్మార్గునకున్                                                           30 

నిష్క చయార్జనార్థమ యనేక విధమ్ముల మోసపుచ్చుచున్ 
శుష్క వచో నికాయమున సొమ్ముల  మ్రుచ్చిలి యంత్య వేళ  మ
స్తిష్కమునన్  సుతుం దలఁచి శ్రీహరి నామము నుచ్చరింపఁగా 
దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై                                29 

హరి హరునకు బాణం బయి 
పురత్రయ వినాశ  హేతు భూతుం డయ్యెన్ 
నర విఘ్న విలయమునకై 
హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్                                                              28 
[అమ్ము+ఐ = అమ్మై] 

సిరులం గుర్యుచుఁ దా దరిద్రమును నిశ్శేషంబుగాఁ బాపుచుం 
దరుణీ రత్నము వాపి మానవుల సంతాపమ్ము ఖండింపఁగా
వర భక్తవ్రజ నాశ హేతు వగు నా పాపారి వర్గమ్మునున్ 
హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్                                           27 
[అమ్ము+ఐ = అమ్మై] 

కవుల మనుచు ఘోషించుచు 
నవివేకపు వ్రాతలెల్ల నలరింపంగా 
సవివేకం బొనరించినఁ  
గవి పండిత ధిక్కృతి శుభకర మగును గదా                                                           26 

భువిలో వాసన లీన లేని వగు నా పుష్పమ్ములన్ మెత్తురే 
ఛవి హీనం బగు దీప సంచయమునున్ శ్లాఘింతురే సజ్జనుల్ 
శ్రవణానర్హ కవిత్వ కర్తృ కుకవివ్రాతమ్మునున్ మెత్తురే 
కవులుం బండితులుం, గళావిదుల ధిక్కారంబు శ్రేయం బిడున్                                   25 

ఏక దివస కందుకేరిత క్రీడాంగ
ణమున భారతోగ్ర నరవరేణ్యు
ల కెదు రెవ్వఁ డుండుఁ బ్రకటింపుమా నాకు 
నెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు                                                                      24 

అవ్వన జాక్షు నెన్న మది హస్తి వరేణ్యున కప్రయత్నతన్ 
నొవ్వున వెల్వడెన్ గిరలు నోటఁ బురాకృత పుణ్య రాశిచే
నివ్వన చారి బంధము కరీంద్రున కెవ్వఁడు వాప నోపునో  
యెవ్వఁ డెవండె వాఁ డెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే                              23 

పద్మ రాసుల కింపుగఁ బంచి వెలుగుఁ 
గలువ గముల మనము లందుఁ గరుణ లేక 
తూర్పు కొండపై నుదయించి తోరముగను  
వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను                                                               22 

రూకల కాస నూన కెద లోనఁ దలంచి పరోపకారమున్ 
నాకపు మార్గ మందు నిజ నైపుణ మేర్పడఁ దిర్గు చుండి ప
ల్పోకల సంతతమ్మును విరోచనుఁడే యుదయింప కింకయుం 
జీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతము లందు వేకువన్                                      21 

చంద్రమౌళికి మామ యై సకల సుర గ
ణార్చితుండు నయ్యెను దక్షుఁ డంచితముగఁ 
జారు చంద్రికా కాంతులఁ జల్లు చంద 
మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు                                                       20 

ఈ మహి దాన కర్ణునిగ నెన్నిక కెక్కెను మిక్కటమ్ముగా 
నేమఱ కుండ నుండు మెద నెన్నఁడు బంధము నెంచి చూడ నీ 
మామకు మామ యౌ నతఁడు  మానిత మామక మాతృ దేవికిన్ 
మామకు మామయై యతఁడు మాన్యత నందెను మామ వింటివా                               19 

సంతు లేని సంసారము వంత లొసఁగు 
నట్టి జీవితమ్ము గడప వ్యర్థ మంచుఁ 
దీర్థ యాత్రల మన కోర్కి తీరు నంచుఁ 
ద్రిప్పితి సతిని నల్దెసల్ దేశ మందు                                                                       18 

మెప్పను బొంది తీ విల నమేయ బలమ్మున నెల్ల శత్రులం 
దిప్పలు పెట్టి కప్పములు దిట్టతనమ్మునఁ గొంచు నింపుగాఁ 
దప్పక నీదు గెల్పు సిరి ధైర్య సమేతము రాజ్య చక్రముం 
ద్రిప్పితి వెంటఁ బెట్టుకొని దేశము నాల్గు చెఱంగులన్ సతిన్                                         17 

ఆ మనుజాధీశునకున్ 
రామునకును దప్ప లేదు రణఘాతములే 
యా మనుజాశను చేతన్ 
రాముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్                                                            16 

భామను జంపి జానకినిఁ బన్నుగ నన్ను వరింపు మన్న యా 
కామ వశాసు రాంగన వికారపు మాటల నాలకింపఁగా 
భీమ వచోవిఘాతమునఁ బెన్నుర మందు జనింప మచ్చలే  
రాముని వక్ష మందుఁ గన రక్తప ద ద్వయ ముద్ర లొప్పెరా                                           15 
[రక్తప ద ద్వయ ముద్రలు = రక్తము త్రాగు దానిచే నొసఁగఁ బడిన రెండు మచ్చలు] 

వింతపడ నేల సుంతయు నంతరంగ 
మందు నొక్క రైతు గృహము నందు గోవు 
కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేఁపఁ 
బాలు  దానికి నొక దూడ పది నెలలకు                                                                   14 

అన్నుల మిన్న భాగ్యము నహా గణియింపఁ దరంబె యేరికిం 
గన్నుల కీయ హర్షమును గట్టున నెఱ్ఱగ నున్న పీతయే 
తన్ను వరించె లాభమె యుదమ్మున నుండఁగఁ జోద్య మందుచుం 
గన్నియ యెద్దునుం గలియఁ గల్గెను జేఁపయె యెండ్రి మెచ్చఁగన్                                    13 
[ఎండ్రిన్ మెచ్చఁగన్] 

ఏర్పడఁ బ్రేమాతిశయము 
కార్పణ్యమ్మునను జేరి కాంచుచు నిజ ప
త్యర్పిత శునకపు టా నుప
సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్                                                            12 
[ఉపసర్పము = సమీపించుట]

దర్పము నూను నిత్యమును ధారుణి లోఁ దన కన్న మిన్న యౌ 
వార్పువుఁబోడు లుండిన నవశ్యము దెల్పుఁ డటంచు నాకుఁ గం
దర్ప సమాను నందమునఁ దద్దయుఁ బ్రీతి ఫణీంద్రుఁ బెన్మిటిన్ 
సర్పముఁ బట్టి ముద్దిడెను జాన ముదంబున నిర్భయమ్మునన్                                       11 

వాని మాటల వేదన మానసమున 
నాఁటె బెట్టిదముగ నరనాథుఁ డంతఁ 
గోల ఘాతమ్ము రుచి చూడు కొంచె మనుచు
నరి సెలం బెట్టి తిను మన్న నలుకఁ బూనె                                                                 10 
[సెల = బాణము] 

తర తమ భేద మెంచకయు ధర్మము నెంచక సుంత యేనియుం 
దిరిపె మొసంగు నట్లకట దిట్ట తనమ్మున నక్కజమ్ముగం 
దరుణము మించ వచ్చినను దారుణ రీతినిఁ బాసి నట్టివౌ 
యరిసెలు ముందుఁ బెట్టి తిను మన్నఁ గడుం గుపితుండు గాఁడొకో                                  9 

పావు సేరు పాల లో విను పా లెన్ని 
యన్న నేను రెండె యన్న సత్య 
మరయ వింతఁ దొంటి యక్షరములు పుచ్చ 
పువ్వు లోన రెండు పూ లు పుట్టె                                                                             8 

విష్పందక్రియ వెల్గుచుండ వనితా విశ్వంక రాంభోజముల్ 
నిష్పందక్రియ నిల్వఁ జూపఱు తమిన్ నీరేజ తుల్యమ్ము జ్యో
తిష్పూర్ణాస్యము కాంతులం దనరుచున్ దీపింపఁ జోద్యమ్ముగాఁ 
బుష్పం బందున రెండు పుష్పము లవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై                                          7 

వరుని కొకనికి నెఱుక పడఁ  
దరుణీ మణి వఱచి చూపు తమ్ములు తగ నం
తరముం గని యనిశపుఁ దన 
భరణంబునుఁ గోరె వధువు పరిణయ వేళన్                                                                6 

తరుణుల కెల్ల భూష లనఁ దద్దయుఁ బ్రీతి జనించు నిద్ధరం 
బరిణయ వేళ వృద్ధి యగు బంధము వారికి భూషణమ్ములన్ 
వరుఁ డెద హర్ష మందఁగను వారిజ లోచన కాంతిమద్గళా
భరణముఁ గోరె నా వధువు బంధువు లెల్లరుఁ జూడఁ బెండ్లిలో                                        5 

మనుజేంద్రున కొసఁగితివి సు
రనాథు దర్శనము వేగ రాగముఁ జూపన్ 
ఘను ధర్మజు వెంటఁ జనిన 
శునకంబా నిన్నుఁ గొలువ శుభములు గలుగున్                                                           4 

వనజాక్షుండు కుమారుఁడై వటువు సంభావించి సేవించెనే
నిను నో కశ్యప మౌని పుంగవు సతీ నీ సాటి వా రుందురే 
తనరన్ భక్తి మనమ్ము నందు జననీ దాక్షాయణీ నిర్జరే
శున కంబా నిను గొల్చినన్ శుభము లస్తోకంబుగా దక్కెడిన్                                            3 

అవమానము వొందకుమీ 
కవివర నీచోపమలు దగవు వ్రాయకుమీ 
కవితలు దుర్గంధముతోఁ
గవితా గంధమ్ము లేని కావ్యమె మేలౌ                                                                        2 

అవు నన్నం దగ దంచుఁ గాదనిన  భవ్యాభంగ ధారా ఘన
చ్ఛవి భాసిల్లఁ గడింది ప్రీతి  జను లాశ్వాదింపఁ బద్యమ్ము లం
దు విశేషార్థ పదమ్ము లేని మఱి చాతుర్యమ్ము, నున్నట్టి వౌ
కవితాగంధము లేని, కావ్యములె విఖ్యాతిం గడించున్గవీ                                                1 
[కవితా గంధములు + ఏని= కవితా గంధము లేని]