1, జూన్ 2025, ఆదివారం

సమస్యా పూరణ జూన్ 2025

దిట్టతనమున నట్టింట గుట్టు రట్టు 
కాఁగఁ బట్టు పట్టి పలుకఁ గాదె చెట్ట 
వట్టి మాటలె యిట్టివి యెట్టి చోటు 
చాటుమాటుగా వినుట సంస్కార మగును                                                    60. 

ఘనులే యౌదురు దోష మించుకయు నెక్కాలమ్మునం గాంచ రీ
మనుజశ్రేష్టులు పౌర సంతతికి సంప్రాప్తించు క్షేమమ్ములే  
యనయం బింపుగ గూఢచారులకు రాజ్యక్షేమ మాశించుచున్ 
విన నొప్పున్గద చాటుమాటుగఁ బరుల్ వేర్వేఱ మాటాడఁగన్                              59. 
[పరులు = శత్రువులు] 

ఖలు లయి భక్తి యొకింతయు
ను లేక చిత్తమ్ము లందు నుతియింపక కే
వల మిల విత్తార్థంబై
తలిదండ్రులఁ బూజ సేయఁ దలఁగును బరువే                                                 58. 

ధరలో నెన్నఁగఁ దల్లిదండ్రులు సురల్ తథ్యంబు వాక్రువ్వఁగాఁ  
ద్వరమాణమ్ముగ దేవతావ్రజ కృపా ధారం ద్వదీయోత్త మా
యు రరోగమ్ములు వృద్ధి సెంద నగు దుష్టోగ్రప్రజా మైత్రికై  
పరువే పోవును దల్లిదండ్రులను సంభావించి పూజించినన్                                  57. 
[పరువు = పరుగు] 

నీతు లెల్ల వక్కాణింత్రు చేత లందు 
వానిఁ బాటింప నొల్లరు పరుల కంచుఁ 
గలియుగమ్మున గూఢమ్ముగ నిశ లందు 
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు                                                56. 

పోఁగొట్టన్ దురితౌఘ మెల్ల నదియే పో మం దగుం దిప్ప నా  
తీగం జక్క మథింప సోమరసమే దేవౌఘ పానం బహో 
రాగం బొప్ప జనింప మద్య మనియున్ బ్రహ్మల్ వచింతుర్గదా   
యాగంబుం బొనరించు వారలకు మద్యం బిచ్చుటే యొప్పగున్                          55. 
[ఆగము = పాపము] 

దండిగ వండ నగును మఱి 
భాండమ్ములు చాల వెపుడు స్వాస్థ్యము కలుగున్ 
మెండుగ జనాళికి మరీ
చాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ                                               54. 
[మరీచము = మిరియము] 

వండన్ మేలుగ సాటి దీని కిఁక విశ్వంబందు నెచ్చోటు నం 
దుండన్ నేర్చునె యన్య పాకములు భక్ష్యౌఘమ్ము లం దెల్ల బ్ర
హ్మాండం బందుఁ బ్రశస్త మౌను దువరీ సంయుక్త మాధుర్య కూ
ష్మాండమ్మున్గలుపంగఁ జారునకు దివ్యస్వాద మందెన్ గదా                                53. 
[తువరి = కంది]  

సద్రవిణ పండితుఁడు హీ
నోద్రేక మనో విరాజియుఁ గుకవి సమ్య
గ్విద్రావణుండు కించి
న్నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ                                                               52. 

భద్రేభప్రతిమాన సంచలన సంభావ్యుండు శశ్వన్మహా
రుద్రారాధన సక్త చిత్తుఁడు సుధీ రోచిష్ణుఁ డెన్నంగ  రా
జద్రాజాశ్రయ రక్షితుండు ప్రతిభా శార్దూలుఁ డెన్నం డహ
ర్నిద్రా హీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే                                       51. 

కవి వరేణ్యు భావ మవిరళ గంభీర 
మెన్నఁ దరిచి చూడ నెఱుక పడును 
రిత్త మాట లేల యిత్తఱి నియ్యది 
భావ శూన్య పద్యమే వినఁ దగు                                                                   50. 

వావిరి నమ్మకమ్ము తన పాండితి యందని చాటిచెప్పఁగా 
లే వప శబ్ద పాతములు లేశము నైనను సంతరింపఁగా 
భావ గభీర శబ్దము లపారము సుంతయు నేని న్యూనతా 
భావము లేని పద్యమునె పండితు లెల్లఁ బఠించి మెచ్చిరే                                    49. 

కమ్మని పదార్థము లొకఁడు నెమ్మి నొసఁగ 
గిరలఁ దియ్యందనము మీఱఁ బరుఁడు మధుర 
రసము లొసఁగంగ వారి పరస్పర మమ  
కారముం గనఁ బాయస కాంక్ష హెచ్చె                                                             48.  

వారలు హస్త పద్మమునఁ బాయస పాత్రను గాంచి కోరికల్ 
మూరఁగ ఖాదనమ్మునను ముచ్చట దీరఁగ సంభ్రమమ్మునన్    
మారు వచింప కెప్పగిది మాకు సఖుండవు నెమ్మిఁ, దన్ము ఖా    
కారముఁ గాంచి చేరెదరు, కమ్మని పాయస మందుఁ బ్రీతితో                                  47. 

వివరింపఁగ మోక్షార్థ
మ్ము విరిసిన తెలివియె జ్ఞానము తదితరము కా 
దవనీ తలమున నెన్నఁడు 
నవధానమ్మునకు జ్ఞాన మక్కఱ యగునా                                                       46. 

భువిలో నెందుఁ బరాజయమ్ము కలదే పూజింపఁ గాత్యాయనిన్ 
శ్రవణానందముగా నుతింతు సతి శర్వాణిన్ విశేషించి నే 
నవలోకించి సనాతనంపు గతిఁ బూజార్థమ్ము పీఠమ్ముపై 
నవ ధానమ్మున జ్ఞాన నేత్రమును మూయం జెల్లు గెల్పొందఁగన్                           45. 
[అవ ధానమ్మున = అవ్వను నుంచుట యందు;  మూయను =మూసియుంచను;                                
చెల్లు = తగును] 

జలము కాదిది సత్య మెంచంగఁ దాము
పడ్డ కష్టములకుఁ గన్న ఫలిత మంచు 
వడి వడి తమ వస్త్రమ్ములఁ దుడిచికొంచు 
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి                                                             44. 

గాదిలి దేవ మిత్రుఁ డట కామిని వేషము దాల్చి యా ద్విష
త్సూదనుఁ డా సుధా రసము దూర్ణము బంచఁగఁ గైతవమ్మునన్  
వేదన తోడి సత్ఫలముఁ బ్రీతిని స్వీయ మహా పరిశ్రమ
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలి రెల్లరున్                               43. 

తలయే ఘోరారణ్యము 
బలిసిన పేలే కరు లనఁ బర్వత సదృశ
మ్ము లయి చెలరేఁగు చుండఁగఁ 
దలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్                                                           42. 

ఇలలో వీని భరింపఁ గష్ట మని యెంతే నాత్మలం దల్చి చిం
తలలో మున్గిన మావటీండ్లు తమ సంతాపమ్ము వాపంగ విం
తలలో వింతగ నుంచ నమ్ముటకు నుత్సాహమ్ము పెంపొంద సం
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్                                   41. 

క్రూరాత్ములు విశ్వమ్మున 
నేరుదురె దయా గుణమ్ము నీతిని నెందుం 
గ్రూరునిఁ గరవా లాలం 
కారున్గని మ్రొక్క మోక్షగామి వగుదువే                                                            40. 

పోరాటమ్ముల నైన భక్తి యుతముల్ పూజా విశేషమ్ములన్ 
ధారాళమ్ముగఁ జేసి యైన మది నిత్యం బుంచి కీర్తించుచున్   
శ్రీరాధా దయితప్రసాద మహిమన్ సృష్టిస్థితిధ్వంస హుం
కారున్గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యం బగున్                                       39. 

తలఁపఁగ నుపకారములు మానవాళికి 
కలుగు నిజముగ నప కారములను  
మేఘ రాశి యప్రమేయ నిర్మల జల  
వరద మే లొసంగుఁ బ్రజల కెపుడు                                                                 38. 
[జలవరదము +ఏల +ఒసంగు = జల వరద మేలొసంగు] 

కూలము గాంతురే జనులు కోరి భజించిన నిన్ను మాధవా! 
పాలన కాలవాల మగుఁ బావనుఁడా! త్వదపాంగ వీక్షయే 
నీల ఘనాభ వర్ణ తను! నీదు కృపారస వీక్షణమ్ము వే 
మేలు నొసంగదే వరద! మేదిని నెల్లరు సంతసిల్లరే                                              37. 

పర పీడితుం డతి భయం
కర వర్తనుఁ డఖిల లోక కంటక క ర్మా
చర ణాసక్తుఁడు నిత్యము 
పరమాన్నముఁ దిన్న వాఁడు పాపాత్ముఁ డగున్                                                  36. 

గురు పుణ్యాత్ముల సాహచర్యమె యొసంగున్ మంచిదౌ బుద్ధి న
ల్గురు మెచ్చంగ నిరంతరమ్ము నిలలోఁ గూర్చున్ మహానందముం  
బరమాసక్తినిఁ జేరి యల్ప మయినం బాపాత్ము సౌధంబునం 
పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్                           35. 

అంచితమ్ముగ భక్తినిఁ బెంచినారు 
నరవరుల నొక్క త్రాటిని నడపి నారు 
మాన్యులై యెల్ల వారికి మసలినారు 
కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు                                                                   34. 

నేఁడిట లేదు మందిరము నీరజ నాభుని నిత్య పూజకై 
పాడుచుఁ గీర్తనమ్ములను భక్తి యుతమ్ము విశేష రీతులన్ 
వేఁడఁగ నెల్ల రింపుగను విష్ణునిఁ జక్రి కృపా రసమ్మునం 
గూడున మంగళమ్ము లని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్                                     33. 

అంగన శచీ సతి యొసఁగ 
బంగరు కలశమున నింపి వారినిఁ దమి శ్రీ
రంగపతి పదములు కడిగి 
గంగన్ హరి దలనుఁ దాల్చెఁ గని శివుఁ డొప్పన్                                                  32. 

భంగం బుండదు భావజాలమునకున్ భావింప నీరీతిఁ బా
దాంగచ్ఛేదము నిట్లు సేయ వలె సత్యార్థమ్ము గంగా సతిన్ 
సింగారించిన దా సదాశివుఁడు గా శ్రీకాంతుఁడే మేలనెన్ 
గంగన్, శ్రీహరి, దాల్చె నౌదల నుమాకాంతుండు, మేల్మేలనన్                                  31. 

ముదము నొసఁగదె యేరికిఁ బుత్ర సంభ
వమ్ము మీఁదు మిక్కిలి ప్రథమమ్ము పుడమి 
వార్త వినినంత వేవేగ వచ్చి నాదు 
మగఁడు పుత్రునిఁ గనె నని మగువ దెలిపె                                                           30. 

విగత విచార రాజ దలివేణి సులోచన  సంతసమ్మునన్ 
వగవక సుంత భీతిలక పంతము నూని కరమ్ము నాత్మలో 
జగతిఁ జరించి యొక్క దివసమ్మునఁ గన్పడ కుండఁ బోవ నా 
మగఁడు కుమారునిం గనెఁ జుమా యని పల్కెను భార్య చేటితో                                29. 

మీ మీఁదఁ జరింపం గల 
దేమఱకుండ వలె మాన వేశ్వర! నిత్యం
బో మాననీయ! లాలిత 
స్త్రీ! మీ సము మీఁద నడచెఁ జీమ రయమునన్                                                      28. 

ఏమీ వింత యొకింత యేని భయ మీ హీనాంగి దా నూనదే  
యీ మర్త్యోత్తముఁ గాంచి యిప్పగిది నీ వీక్షించి వే పల్కుమా 
ధీమంతా! ఫలితమ్ము నిట్లయిన జ్యోతిశ్శాస్త్ర విజ్ఞాన శా
స్త్రీ! మీసమ్ముల మీఁదఁ జీమ నడచెన్జీకాకు గల్గించుచున్                                           27. 

సకల పాప సంచయ వినాశకము  చక్రి 
నామ సంకీర్తనంబె యనవరతమ్ము   
ధరణి హరినామ నిత్య చింతా నిమిత్త 
శమిత దైవోపహతునకు సౌఖ్య మబ్బు                                                                26. 

కర మాశ్చర్యము లింక నశ్వరములం గాంతావతంసంబ! యో 
యరవిందాంబక! సర్వ సంపదల నీయన్నేర్తు వింపార సు
స్వర సంకీర్తన సన్నుతుల్ సలిపినం జాంచల్య చిత్తాఖ్య! యో 
సిరి! దైవోపహతుండు పోవు కడకుం జేరున్గదా సౌఖ్యముల్                                     25. 

అక్కఱకు రాని యుక్తులు వెక్కసముగ 
నున్న నేమి  ఫలం బని యెన్ని యెదల 
శక్తిమంతుండు నైనను శంక నూనఁ  
బీడఁ బాప నతనిఁ దూలనాడి రెల్ల                                                                     24. 
[పీడఁ బాపను+అతని = పీడఁ బాపుటకై  యతనిఁ] 

వీఁ డొక విక్రముం డట వివేక విహీనుఁడు నిర్దయుండు దా 
నోడక చేసె రాజునకు నోర్వఁగ రాని యకృత్య మివ్విధిన్ 
వేడుక గాఁగ నాశనము వేదన రాజ కుమారి పాణి సం
పీడను బాపి నట్టి రణ విక్రము నెల్లరు తూలనాడిరే                                                23. 

నగ పతిత వర్ష జల మిం
పుగ నొక చోఁ గూడు యత్నము లొనర్చి వెసం 
దగు రీతిని విమల జ లా 
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్                                                          22. 

తగునే పంతము లెల్ల వేళల వృథా దర్పమ్ము నీ కేలనో 
వగలే కల్గును బూనినం బగలు సంబంధమ్ము లెల్లం జెడుం 
జిగురింపంగ సహోదరత్వ మిలఁ గించిత్స్నేహమున్, మాన్పుచుం 
బగలం, బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీ కయ్యెడిన్                                    21. 

రావణుండు లంకాపతి రాక్ష సాధి
పుండు సంతత కామ లోలుండు వాఁడు 
లోభి క్రూర కర్ముఁడు వాని లోనఁ గనము 
మనము మార్దవ మాతని పనియొ   హింస                                                       20. 

జను లొనరించు నట్టి యఘ సంచయ మెన్ని శమింపఁజేయఁగాఁ 
దనరును దక్క కోపమును దాల్పఁడు సుంతయు నేరి పైననున్ 
వనజ హితాత్మ జాత సమవర్తికి దక్షిణ దిక్కు నేతకున్ 
మనము శిరీషమార్దవము మారణ హోమమె నిత్య కృత్యమౌ                                  19. 

ఈ విశ్వాసము గొప్పది 
భావి జనులకు నవినీతి వాపఁగ నిలలోఁ 
గావుండని నేతల కే 
నైవేద్యము లేని పూజ నచ్చిరి భక్తుల్                                                                 18. 

కైవారమ్ములు సేసి చక్కఁగను శాఖాప్రాశ నౌచిత్య ని
త్యావిష్కార సమర్థ భక్ష్యముల నిత్యం బిమ్ము దేవాళికిన్   
దైవశ్రేణికి భక్తియుక్త మయినం ద్యాజ్యం బశుద్ధంపు టే 
నైవేద్యం బిడ నట్టి పూజయె మహానందంబునుం గూర్చెడిన్                                      17.  

మేటి ధనవంతుఁ డాతఁడు 
సాటి కుబేరునకు నెన్నఁ జక్కఁగ నెత్తెం 
గోటికిఁ బడగ లనఁగఁ దాఁ
బూటకు గతి లేని వాఁడె! ప్రోచును జనులన్                                                         16. 

కోటలఁ గాంచఁ డుండుటకుఁ గుంజర చర్మము కట్టు గుడ్డ యౌఁ  
గాటిఁ జరించు చుండుఁ దమిఁ  గంఠము నందు వెలుంగుఁ బుఱ్ఱెలే 
కూటికి బిచ్చ మెత్త వలెఁ గొంకక నిత్తెము నాదిబిక్షువే  
పూటకు దిక్కు లేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్                                     15. 

వెక్కసముగ హింసించితివి చెలఁగి మును 
పక్కట కరమ్ము టక్కరి వై జనులను 
మించి వర్తింప నేల శాంతించు మెంచి
లోక హితమునుఁ గూర్పఁ గరోన రమ్ము                                                                 14. 

ప్రాకెను దేశ దేశములఁ గ్రన్ననఁ గ్రూరత వింత వింతగా 
రూకల కై నిరంతరము లోకులు ఘాతుకు లైరి నిర్దయన్ 
వీఁకను భూమి భారమును వెన్నుఁడు దీర్ప జనించి నట్టులన్ 
లోక హితం బొనర్పఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్                                           13. 

నల్లనైన మేను పెల్లుగ విలసిల్లఁ   
గొంటె పనులు సేయ వెంట వెంట 
మీఱి పసితనమున మేనమామ కకట 
కీడొసంగు వాఁడు కృష్ణుఁ డంద్రు                                                                          12. 

క్రీడి సఖుండు బాంధవుఁడు కృష్ణుఁడు భారత యుద్ధ వేళలోఁ 
దోడుగ నుండ సంతతము తోరము కన్పడఁ జేష్ట లందు నా  
జాడలు ధర్మరాడ్వరుని సంపదకున్ నల రాడ్వరేణ్యు శ్రీ 
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్                                        11. 
[శ్రీకి +ఈడు = శ్రీ కీడు] 

ఇది వల దది వలదు పదిల మంచు సతము 
నడ్దు పడిన లాభ మరయఁ గలమె 
చెలఁగి చేయ వర్తకుల కమ్మకమ్ముల 
స్వేచ్ఛ హెచ్చి నపుడె సిరులు కలుగు                                                                   10. 

ఐచ్ఛిక సంచయమ్ములకు నన్య జనైక దయారసాప్తికై 
స్వచ్ఛ మనస్కు లఱ్ఱులను జాచుట యక్కట హేయ కార్యమే 
కృచ్ఛ్రము లెన్ని వచ్చినను కృత్య సమీక్షణ నిర్ణయమ్ములన్ 
స్వేచ్ఛ మరింత హెచ్చి నపుడే సిరు లెన్నియొ పొందఁగా నగున్                                   9. 

సామజ వరగమన వెదకి 
భూమీశుల నెల్లఁ బుణ్య పురుషుని వేడ్కన్ 
రాముని వలెఁ బర భామా 
కామము లేనట్టి వానిఁ గాంత వరించెన్                                                                 8. 

సోముని మించి నట్టి కడు సుందర రూపునిఁ గాంచి నంతటన్ 
భామల కున్న సంపదల పైన మనోరథ మాత్మ నిత్య సం
క్షేమము నెంచి డెందమునఁ గేవల విత్తపు టార్జనమ్ముపైఁ 
గామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో                                            7.  

మగువ లెల్లరు విన మాయ మాట లడర 
గీత లోనఁ గన్పడు కొన్ని గిరల నుడివి 
గాంతలను జూచుచుండును గామి బుద్ధి 
వాడ దొంగ యెటుల్ భగవంతుఁ డగును                                                                6. 
[వాడు=మ్లాన మవు] 

ఆఁడుదానిని పాలు త్రాగుచు నంపెఁ గాలుని వీటికే 
తోడుగా జలకమ్ము లాడఁగ దొంగిలించెను బట్టలే 
పాఁడి నమ్మెడి గోపకాంతల వారిజాక్షులఁ దన్పెనే 
వాడ వాడల దొంగిలించెడి వాసుదేవుఁడు దేవుఁడా                                                    5. 

ఎత్తుల కెల్లఁ దలఁచి పై
యెత్తులు చిత్తమ్ము నందు హెచ్చిన రక్తిన్ 
నిత్తె మడరి చెమ్మట నా 
నెత్తురుఁ జిమ్మింపు మనెడి నేస్తుఁడు వలయున్                                                        4. 

సత్తువ సూపి కష్టపడఁ జక్కఁగ దక్కు జయమ్ము నిత్తెముం  
దత్తర పాటు సెందక సతమ్మును వచ్చిన నేని పెక్కు లా
పత్తులు జంక కింతయును బంతము వీడక కార్య సిద్ధికై 
నెత్తురుఁ జిమ్మఁ జేయు మని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్                                   3. 

కన్న కూఁతు రనినఁ బ్రేమ కన్న వారి
కుండ నాశ్చర్య మే మున్న దుర్విఁ దండ్రి
యెన్నఁడో తమ సోదరి కిచ్చి నట్టి 
సొత్తులోఁ బొత్తు లెందుకు సోదరులకు                                                                     2. 

విత్త మనర్థ దాయకము వీరికి వైరము రేఁగఁ జేయ న
త్యుత్తమ మంచు నెంచి పగ నొక్కటి యై పొరుగింటి వారలే 
చిత్తము లందు నూని చెడు చింతల నందఱు నొక్కి చెప్పఁగా 
సొత్తుల పొత్తు లెందుకని సోదరు, లందఱఁ జంప నొప్పగున్                                         1.