ఔగ్ర సేనుం డల నిరంత రోగ్ర దుష్ట
గుణ గణ సమేత శిశు గణ కోపనుండు
కాల దేశోచితము లగు వేళ లెఱిఁగి
కనలుట యనంగఁ దెలియదు కంసునకును 62.
అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ జెల్లు నా
సలలిత ధర్మ రాజున కజాత విరోధికి నుర్వి సంతత
జ్వలిత మనో వికార యుత చండ త రాధమ శాసనుం డహో
యలుగుటయే యెఱుంగని మహామహితాత్ముఁ డనంగఁ గంసుఁడే 61.
వనజాక్ష పదాబ్జాంకిత
మనుజోత్తమ భక్త గణము మరణాంతమునన్
ఘన వైరాగ్యాహ్వయ ధన
ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్ 60.
అనయం బిద్ధర భక్తి యుక్తముగ సాష్టాంగప్రణామమ్ములన్
వినయం బొప్పఁగఁ బూజ సేయు నరులున్ విశ్వేశ పాదాబ్జ చిం
తన సంలగ్న నిజాంతరంగులును నాత్మజ్ఞాన సంపన్ను లా
ధనికుల్ వొంద సమర్థు లౌదురు పరార్థం బైన మోక్షాధ్వమున్ 59.
చారుతరము పాదమ్మున
నౌర జనింపంగఁ బద్య మందురు విబుధుల్
వారక పాదం బేర్పడ
నూరక శబ్దములఁ బేర్వ నొగిఁ బద్య మగున్ 58.
ఊరక వచ్చునే కవుల కుర్విఁ గవిత్వ పటుత్వ సంపదల్
చారుతరమ్ము సాధనము చాల యొనర్పక కాన నీవు వే
సారకు మయ్య ప్రాస యతి ఛందపు భావపు దోష ధారలే
యూరక శబ్ద గుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్ 57.
[ఊరు = వెలువడు]
భామకు నొసంగ వరములు
భూమి ధవుఁడు దశరథుండు మూరిన వెతతో
నే మనక సుతుం డేఁగిన
రాముఁడు లేనట్టి రామ! రాజ్యముఁ గనుమా 56.
నీమము లన్న గౌరవము నిత్యము వీడిన వాని దేశ సం
క్షేమము సుంత యేని పరికింపని వాని వివేక హీను దు
ష్కామ విలోలు నిత్య ధన కాముని క్రూరుని వీత కార్య వి
శ్రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ 55.
విజయము తథ్యం బని యెడఁ
దఁ జలింపక ధృతి వహించి దాఁకిన నకటా
నిజ సేనాంతము రిపు జన
విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్ 54.
విజనత్వమ్మున గొంతి బిడ్డకుఁ బరస్వీ యోభ యాక్షోహిణుల్
ధ్వజినీ వ్రాతము వాయఁ బ్రాణముల నా పాండూద్వహార్థమ్మునై
నిజ బంధువ్రజ మెల్లఁ గూల ననిలో నిర్వేద మేపారఁగా
విజయోత్సాహము తీవ్ర వేదనల ప్రాప్తిం గూర్చె నో దైవమా 53.
ఏ మాత్రము సిగ్గూనక
పో మగువలఁ గనిన నిత్యము పలవరించుం
గామాతురుఁ డిబ్భంగినిఁ
గోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ 52.
నీ మెయి చాల కోమలము నీ కను లందము లొల్కు పూవులే
నా మది దోఁచితీ వడరి నా పర మాశ్రయ శాఖ వీవు నే
నే మెయి గాంతు నీ యుదర మీ విల దేవత వల్గు దాటలం
గోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ 51.
ఏ రీతి నేమి సెప్పిన
వా రక్కట నొల్ల కున్నఁ బంతము తోడం
బోరాటమ్ములు వుట్టఁగ
వైరాగ్యము శతవధాన ఫలితం బయ్యెన్ 50.
కరుణన్ వీడి యొకండు రిక్త గిరలం గల్గింప నాటంకముల్
పరుఁ డొక్కండు నిషేధ శబ్ద తతులన్ బాధింపఁ బల్మాఱులే
వరుసం బ్రశ్నలు వేయఁ బృచ్ఛక వరుల్ వైరాగ్యమే కల్గఁగాఁ
బరికింపంగ శతావధానమును సంప్రాప్తించె వైరాగ్యమే 49.
[సంప్రాప్తించు = పొందు]
కాలకంఠుని సేవించి కరము భక్తి
నన్నపూర్ణ సమేతుని మిన్నగాను
బ్రీతి శ్రీరంగ నగరమ్ము, వేగ వీడి
కాశిఁ, జేరిరి కవులు శ్రీకాంతుఁ బొగడ 48.
ఆరయ నిక్కమున్ హరి హరాంతర మించుక యేని లే దనన్
ద్వారక యైన గంగ తటి పట్టణ మైనను భేద మే లనం
దోరము తట్టఁ జిత్తములఁ, దూర్ణము శ్రీగళ దర్శనార్థమై
చేరిరి కాశికిన్గవులు, శ్రీపతి యైన హరిన్ స్తుతింపఁగన్ 47.
గాలి లోనఁ బ్రయాణము మేలు గాదె
కూలె నొక టని మదిఁ బడ నేల చింత
దలఁచి చూడఁ గానేరదు తన్నభో వి
ధూమశకట ప్రయాణంబు దుఃఖకరము 46.
చిక్కులలో మునుంగకుము చేరవు కాలము నందు గమ్యమున్
మ్రొక్కెద నెత్తి చేతులను బోవల దక్కట యాగుచుండుఁ జూ
యెక్కడ నైన మందగతి యెన్నఁగ నిక్కము సెప్పు చుంటి దీ
టక్కరి దౌను ధూమశకటమ్ము ప్రయాణము దుఃఖహేతువౌ 45.
[దీటు + ఆ + కరి = దీ టక్కరి]
బొజ్జను బెంచి ఘనమ్ముగ
లజ్జ విడిచి యీక యున్న లావుగ దుడ్డుం
బజ్జ కయిన రా నీయని
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా 44.
ఆయా వేళల రక్షణం బొసఁగు నవ్యక్తుండు వైకుంఠుఁడే
రోయన్ బాధల నోర్వఁ జాల కవనిన్ రోగార్త కోటిన్ మృతి
చ్ఛాయా గ్రస్తులఁ గాచు భేషజములన్ సత్యమ్ము వీక్షింప న
న్యాయంబౌ నొకొ వైద్యునిన్బిలువఁగా నారాయణుండం చిసీ 43.
కథితం బయ్యెను వసుధా
పథంబు వ్యాపింప నిట్లు బాలుర చేతం
బృథివీరుహ జనిత ఫల
ప్రథమమ్మును మ్రింగె నొక్క పంచమ మయ్యో 42.
[పంచమము = కోయిల]
వృధసాకుండు వృకమ్ము ఛాగి హరియున్ భేలమ్ము సింహంబు సా
తిథు లారణ్య విహార కేళి నతి సందీప్తాంగ సంచారులై
పృథివీ భృద్వన కందరాదులఁ దమిన్ వీక్షించు చుండంగ నా
ప్రథమంబున్గబళించెఁ బంచమము సంభ్రాంతిన్ గనన్షష్ఠమే 41.
బోయ వాఁడొకండు పొదల మాటున నుండి
పొంచి పొంచి చూచి మించి వేయ
వెన్నుఁ బన్ని గుఱిగఁ దన్ను దాఁకని యట్టి
శరముఁ గనిన జింక సంతసించె 40.
[శరము = బాణము]
తిరుగుచు దారుణాటవిని దీనత నొక్కెడ దారి తప్పి తో
డరయక మందలో నొకటి నాఁకలి వేఁగుచుఁ బ్రజ్వలత్తృషా
చిర పరితప్త చిత్తమునఁ జేరువ నొక్క ధరాధరస్రవ
చ్ఛరమునుఁ గాంచి జింక గడు సంతస మందుచుఁ జేరెఁ జెంగటన్ 39.
[స్రవత్+ శరము = స్రవచ్ఛరము; శరము =జలము]
పాదపమ్ము వోలె నాదరమ్మున నిల్చి
కవి వరుండొకండు కవిత నుడువఁ
బండిత జన భర సభా వనమున రమ్య
కవనమున విరులు వికాస మందె 38.
నవ మృదు పల్లవమ్ములు కనంబడ వంగఁగ వృక్ష రాశి యం
త విరివి పండ్ల భారమున దర్శన మాత్రమునన్ సమస్త మా
నవ తతి కెచ్చ నత్తఱి మనమ్ముల సంతస మంబరమ్ముఁ దాఁ
క వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో 37.
ఆశా పాశ స రోష దు
రాశయ మర్త్యు లొనరించు నఘముల నిత్యా
వేశ జనిత పాపాగ్నుల
దేశమ్ము వెలుంగు సంస్కృతిభ్రష్టమ్మై 36.
అరి వీరోగ్ర చమూ సమూహ బల మేపారంగ నత్యంతమున్
వర దీప్తాయుధ కోటిచే రిపుల సంభారమ్ములం గూల్పఁగాఁ
బరవీరవ్రజ నాశ కార్యమున సంప్రాప్తైక విత్తమ్మునన్
భరతక్షోణి పురోభివృద్ధిఁ గను భాస్వత్సంస్కృతిభ్రష్టమై 35.
[భాస్వత్ నకుఁ దత్సమము భాస్వంతుఁడు, వీరుడు; సంస్కృతి = మంచి పని;
వీరులు (వైరి) చేసినట్టి మంచి పని(సంభారములు సమకూర్చుకొనుట) భ్రష్టము కాఁగ]
నరక నామ రాత్రిచరుని భూ తనయుని
గిట్టిన దినమంచు కేళి సలిపి
పుర జనులు సుఘోర నరకాఖ్య దైత్యుని
పుట్టిన దినమంచుఁ బొగులుటె తగు 34.
కట్టడ సేయ కుండిన జగమ్మున రేఁగును వింత పోకడల్
వుట్టిన నాఁడు లోకులకుఁ బుట్టము కట్టమి యొప్ప కున్ననుం
బుట్టిన నాఁడు సాగు ననిపో దిన చర్యలె యేడ్పు తోడుతం
బుట్టిన వాసరం బనుచు భోరున నేడ్చుటె యొప్పు మిత్రమా 33.
ఖడ్గ రాజమునకు షడ్గుణం బధికమే
యగును వాడినిఁ గల మన ననృతమె
తొడ్గు వంటి కవిత పిడ్గు వోలె నొకండు
వ్రాసె ఖడ్గసృష్టి వంగ సుకవి 32.
[వంగ = వినయముతో వంగఁగ]
కాసుల కాస సెందక స గౌరవ మింపుగ సద్గుణుండు శ్రీ
శ్రీ సుకవీశుఁడే చలన చిత్ర సమంచిత గేయకారుఁడే
వాసిగ వ్రాయ నాధునిక పండితుఁ డిట్లనె కాంచి, లెస్సగా
వ్రాసెను ఖడ్గసృష్టి కృతి, వంగ కవీంద్రుఁడు నౌర వీంద్రుఁడే 31.
[కవీంద్రుఁడును +ఔర; వి = పక్షి, ; వి+ఇంద్రుఁడే = వీంద్రుఁడే, శారదా దేవి చేతి లోని చిలుకయే]
కన్న వారిపైన గౌరవ మది సున్న
యన్న దమ్ములందు నరుదు ప్రేమ
కాసులందు రక్తి గల యట్టి కలిలోన
వారసుఁ గన నెంచఁ జేరె దాయ 30.
ఘోర తరాఘ వర్తనుఁడు కొడ్కట విప్ర కులాగ్రనేతకున్
సూర కులైక రాజునకు సూనుఁ డొసంగెఁ గలంత నిత్యమున్
వారక దానవేంద్రునకు వైష్ణవ భక్తుఁడు పుత్రుఁ డయ్యెనే
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే 29.
పర్వతమ్ము పైన నిలిపి భక్తి భృశము
మెల్లమెల్లనఁ జనఁ దగు నుల్ల మలర
విగత భక్తి తత్పరతఁ బరుగు పరుగున
గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగ దయ్య 28.
గురు గిరి సుప్రదక్షిణము కోరిన కోర్కు లొసంగు నన్నచో
గురుతర సత్య వాక్యము లగుం బరికించినఁ జిత్త శుద్ధితో
గురుతర నాస్తికప్రజలు కుత్సిత చిత్తులు పల్కు మాటలే
గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోర తరాపరాధమే 27.
అడ్డగించి నిలిచి యర్భకుం డొక్కండు
దొడ్డ దుఃఖ మొసఁగు చెడ్డ వారి
దొరతనమ్ము నీట నరు దగు నీ దయ
వరద! ముంచె జనులు ప్రమద మంద 26.
హరిహర గేహినీ మణు లనంత దయాంబుధు లైన వారిదౌ
కరుణ చెలంగి మిక్కటముగా వెస నిండుగ భాగ్య రాసులం
దరయ స్వకీయ భక్త తతి నంచ దనామయ భోగ యుగ్వయో
వరదలు ముంచె నూరుఁ దమ భాగ్య మటంచు జనుల్ దలంపఁగన్ 25.
[అంచ దనామయ భోగ యుగ్వయో వరదలు = ఒప్పిదమైన యారోగ్యము
సుఖముల తోఁ గూడిన ప్రాయముల వరముల నొసఁగు దేవతలు]
నింగి లోని యంగ రంగ లసత్తుంగ
భంగ చెంగు చెంగునం గలంగ
నంగజాంగ హరు మహా జటఁ దూఱంగ
భంగ భంగ గంగ పొంగు క్రుంగె 24.
నింగి సభంగ గంగ నల నేలఁ జెలంగ నొనర్చు కార్య మం
దంగజు నంగ భంగకర ణాభవ మూర్ధజ సంగమమ్మునం
దుంగ దయా భగీరథు నదోష తపో బల రంగ దాశచే
భంగ తరంగ గంగ త్రుటి భంగపడంగఁ జెలంగెఁ జెంగటన్ 23.
పొగడిన జను లెల్లఁ బగవారు, తన వారు
సముచితమ్ముగాను గ్రమము గాను
బన్ని నట్టి తనదు పన్నుగడ, జయము
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు 22.
ఎన్నఁగఁ జక్క నిక్కముగ నే యశుభమ్ము, శుభమ్ము సుంతయున్
విన్నను నించుకైన మఱి వీనులఁ జేరక యున్న నైననుం
జెన్నుగ రేఁగ నాశ లెదఁ జిత్ర విచిత్ర మయిష్ట, మిష్టముం
గన్నను గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే 21.
ఆర్య వరులెల్ల సతతమ్ము హరినిఁ బోలె
నన్యు లెవ్వరి నైనను నవని లోన
రాజ్య మెల్లను నేలెడి రాజు వైన
నిన్నుఁ బూజింప వల దండ్రు నీరజాక్ష! 20.
ధనధాన్యమ్ముల నీయ నేర్తు రిలలో దైవమ్ము లర్చింప ము
క్తిని నీయంగను మానవావలికి శక్తిక్షీణులే వారు వం
చను గొల్వుండిన యన్య దేవ చయమున్, సద్భక్తి నర్చింపఁగా
నినుఁ, బూజించుట వ్యర్థ మందురు బుధుల్ నీరేరుహాక్షా! హరీ! 19.
పుష్టిగ బల మున్న ఘనుఁడు
శిష్ట మనస్కుఁడు హరి కృప చేత నడరి ష
ష్టాష్టక హీనుఁడు వర్జిత
దుష్టుఁడు లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్ 18.
శిష్ట జనోపకారి ఋజుశీలుఁడు దుష్ట జనాపకారి సం
తుష్ట మనో విరాజి పరితుష్ట న రార్చ్యుఁడు ధైర్య శౌర్య సం
శ్లిష్టుఁడు సర్వ సద్గుణ విశిష్టుఁడు నిష్ఠుర కష్టకాల ని
ర్దుష్టుఁడు సర్వ లోకముల దుర్దశలన్దొలఁగించె నేర్పునన్ 17.
నిత్య సత్య వచన నిష్ఠాపరుండు న
జాత శత్రువు నృపశాస్త్ర విదుఁడు
ధర్మరాజు సతత ధర్మ రతుఁడు శ్రుత
రాఘవుఁడు శశి కుల రాజ వరుఁడు 16.
మేఘ సన్నిభ వాగ్వరుండు నమిత్ర నాశక విస్తృతా
మోఘ వీర్యుఁడు లోక సుందర మూర్తి పూర్వ భవమ్ములో
శ్లాఘనీయుఁడు సన్ను తేద్ధ యశస్వులన్ బలరాముఁడే
రాఘవుండు సుధాంశు వంశపు రాజు నా నుతి కెక్కెఁ జూ 15.
గేయ కవీంద్ర జనాభి
ప్రాయం బిదియేను నీదు పాండిత్యం బో
హో యెల్లరకున్ విదితం
బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్ 14.
ఈ యవనీ తలమ్మున మఱెవ్వరి లోఁ గన మిట్టి ప్రజ్ఙలే
యాయత భావ శబ్ద సహి తాంధ్ర మనోజ్ఙ కవిత్వ భారమున్
మోయుట యందు నెందుఁ గవి పుంగవు లందు నొకండు నీ సమం
బే యని గౌరవించిరి కవీశుని వేదిక పైన నెల్లరున్ 13.
పావన చరిత్రునకుఁ గరు
ణా వననిధి కెన్న భవ్య నర జన్మంబే,
చావ వలె నన్న రణమున
రావణుఁడే, దిక్కగు రఘురా మున కెపుడున్ 12.
వేవురు ఘోర రాక్షసులు వీరులు సేరిరి కాలు నింటినిం
గేవల మా దశాననుని కృత్య నిమిత్తము సత్వరమ్ముగా
నా వనజాక్షి జానకిని నారయ వే గుఱిగా నొనర్పగన్
రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగ మందునన్ 11.
[దిక్కు = నెలవు]
ఎంత రుచిమంతము లయిన వింతగఁ దన
కనుభవింప వలను కాని వగుట నొక్క
పురుషుఁ డనె నిట్లు తినరామి పులిసిన, కన
కాకర! గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె 10.
[కనక+ఆకర = కనకాకర, పసిడినిధీ]
వీఁక శ్రమించి వేగముగ వెల్వడి నాదగు మందభాగ్యపుం
బోకడ నేమి చెప్ప నగుఁ బో యది దైవ మెఱుంగ నౌను నా
కాఁకలి వేయఁ గాంచి యట నామ్రము నొక్కటి, ముట్ట కుండ నా
కాకరకాయఁ, దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ బుల్లనౌ 9.
[మామిడిని బెల్లము వోలెఁ దినఁగా నది పుల్లనౌ]
చక్కని సౌందర్య మడరు
నక్కాంతామణి చరింప నాయా యెడలన్
మక్కువతో నాదు మనసు
రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్ 8.
ఒక్క కడింది సాఁగు గుణ మున్న పదార్థపు బుద్బుదమ్ములో
దిక్కుల సంచరింపఁ గడు తేలిక గాలిని నింపి చిక్కగాఁ
జక్కని త్రాడు గట్టి రభసమ్మున నెల్లరు సూడ వీడఁగా
రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్ 7.
పరుగిడుచు నెట నుండియొ వచ్చి తాను
గాంచి మామిడి కాయను బంచఁ జేరి
యంత వేవేగ కాంచక చెంత నున్న
పూతరేకులఁ దిని కడు పుల్లన యనె 6.
ప్రీతి సుంతయు లేక యున్నను వెక్కసం బగుఁ జేష్టలే
నీతిమంతము లైన నెల్ల వినిశ్చయమ్మగ నిండుగా
మూతి దాఁకను గూరికొంచును మూరి మెక్కిన వార లీ
పూతరేకులఁ దిన్న వెంటనె పుల్ల నైన వటందురే 5.
కుల మరయ నంట రానిది
వెలిఁగెను గీర్తి శిఖరాన భీమ్రావ్ రామ్జీ
చెలువపు టంబేద్క రవని
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా 4.
వెలసెనె యేకలవ్యుఁ డిల వింటికి నెక్కుడు నై చరించుచుం
గులము గణింప నల్ప మఁట గుట్టుగ నేర్చెను మించ నర్జునిం
జెలఁగును సృష్టి లోను గడు చిత్రము లెన్నియొ యెంచి చూడఁగా
నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్ర మక్కటా 3.
స్తుతియించిన గర్వముచేఁ
బతితుం డగు నని తలంచి పన్నుగఁ గృతులన్
వితతమ్ముగఁ బొగడ రెపుడు
స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే 2.
వితత విశుద్ధ వర్తన వివేకులు సర్వ జనప్రకాండ స
మ్మతముగ భాష పైన నభిమానము మూరిన కారణమ్ముచే
నితర కవీంద్ర కావ్యముల నెందయినం బరికింపఁ దోఁచినన్
స్తుతమతు లైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా 1.