1, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్యా పూరణ ఆగష్టు 2025

నెమ్మనమున భక్తి నిలిపి 
యమ్మా కరుణింపు మంచు నమ్మల నిలఁ గ
న్నమ్మ కరుణా రస మపా
రమ్ముం గొనఁ గాశికాపురముఁ జేరఁ దగున్                                                      62.  

కుమ్మరించి నిజాత్త విత్తము కోరి మద్య సమస్త సా 
రమ్ముఁ గ్రోలఁగ వారుణీ నికరమ్ముఁ జేరిరి పామరుల్ 
కుమ్మరించి నిజాత్త విత్తము కొంత భర్గు మహత్త్వ సా
రమ్ముఁ గ్రోలఁగ వారణాసి పురంబుఁ జేరిరి పండితుల్                                         61. 

మాన్యమ్ముల నడిగిరె ధన 
ధాన్యమ్ముల నేని పేరు దక్కఁగ నకటా
యన్య విబుధుల పగిది స
న్మాన్యులు గా రందును మరుమాముల వారిన్                                                60. 

అన్య మనస్కుఁడై నిలువ నారసి  యత్తఱిఁ బిల్చి వానినిన్ 
మన్యువు నూనకుండ నిట మా మది రేఁగిన శంక మాన్పుమా 
ధన్యులె వారు నా నడుగ ద్రావిడుఁ డంత వచించె నివ్విధిన్ 
మాన్యుల కారు కారు మరుమాముల సోదరు లిద్దలిద్దరే                                      59. 
[శకటరేఫమును గైకొనిన మఱు మాముల = మాఱుటత్తల; లేకున్న మరుమాముల యే] 

మూరి చూపింతు రెల్లరు భూత దయను 
సాటి వారి కష్టమ్ములఁ జక్క దిద్ది  
పంచి యిత్తురు ప్రేమను వంచ కోప
లక్ష్య మొప్పరు కాశిలో సాక్ష్య మిదియె                                                            58. 

సాక్ష్యము లేల కావలెను శంకరు భక్త జనావనక్రియా 
దాక్ష్యము నుచ్ఛరింపగను దర్శితముల్ గద సర్వ మాన వా
వేక్ష్యము లౌను జుమ్ము శివ వేశ్మము లెందును బూజలందు ని
ర్లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్                                        57. 

పంచ తారాన్న శాలలోఁ బంచ వలెను 
జలన చిత్ర వీరుల కవశ్యమ్ము సుమ్ము 
రాజకీయ నేతల కిల భాజనంబు 
మదిరఁ గ్రోలు వారలకె సన్మాన మబ్బు                                                             56. 

మద మాత్సర్య గుణోత్కరమ్ము లిల సంప్రాప్తింప నే నాఁటికిన్ 
మదిరోత్కోచ ధనప్రమోదులకు సంసారఘ్న కాలుష్య వ
న్మదిరా విక్రయ మానవేంద్రులకు నమ్మా చేటు వాటిల్లదే  
మదిరా పాన విశేష మత్తులకె సన్మానంబు దక్కున్గదా                                         55.  
[ఇక్కడ సన్మానము నిందార్థమ్మున] 

రాఘవుఁడు ప్రతిష్ఠించెను రక్తి శివుని 
వాసుదేవుఁడు పూజించెఁ బరమ శివుని 
హరిహరుల విభేదము పాడి యౌనె కాన 
మంచిద హరికథ గణేశ మండపమున                                                             54. 
[మంచిద = మంచిదే] 

హరికి జనించెఁ బద్మభవుఁ డాది వెలింగెను సృష్టి కర్తయై 
హరుఁ డుదయించె రుద్ర నిచయాఖ్యను బన్నుగఁ బద్మయోనికిన్ 
వర సుతుఁ డయ్యె విఘ్న గణ భర్త త్రినేత్రున కట్టు లైనచో 
హరికథఁ జెప్ప దోష మగు నయ్య వినాయక మండపమ్మునన్                               53. 

మోఘమ్ములు గాఁగ నుపా
యౌఘమ్ములు నెల్ల నంత నభ్రము నందున్ 
మేఘములు గ్రమ్మఁగ శశ
వ్యాఘ్రం బొక జింకనుఁ గని పాఱె భయమునన్                                                 52. 

శీఘ్రముగాఁ జరించి నరసింహుఁ డరణ్య తటమ్ము నందు వై
యాఘ్ర విహార తత్పరత నారసి యచ్చట నొక్క మృత్తికో
జ్జిఘ్ర మృగమ్మునుం జిఱుత చెన్ను దలంపఁగ నంత గోముఖ
వ్యాఘ్ర మొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్                           51. 

ఆమె పరికింప నిత్యమ్ము నాటకత్తె  
వాఁడు పరికింప నిత్యమ్ము వంచకుండు 
దాను వేసిన వల లోనఁ దగిలె నంచుఁ  
బయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె                                                            50. 

కయ్యము నొక్కెడం బ్రమద కారణ మౌను దలంప వింతగాఁ 
గుయ్యిడి యంతటం బ్రణయ కోపముతోఁ బరమేశ్వరుండు నీ 
వియ్యెడ నేను గెల్చు తఱి నెక్కడి కేగెదు నా వచింప నా    
పయ్యెద లాగు ధూర్తుఁ గడు బాగని మెచ్చెను సాధ్వి నవ్వుచున్                              49. 
[ధూర్తుఁడు = శివుఁడు] 

భక్తి తోడ దిన దినము ముక్తి నెంచి 
యాచరించు విధమ్మున హర్ష మెసఁగ 
వందనమ్ము లొసఁగ వేగ భాస్కరు జల
తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె                                                       48. 

దొంగలు నేఁడు నేర్పరులు తోరము వెంచిరి నైపుణమ్మునే 
దొంగతనమ్ము నందుఁ గడు దుష్టులు జంకరు చంప నేరినిన్ 
దొంగల యం దొకండు మును దూఱి స భద్రము వేచి చూచుచున్ 
దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే                                 47. 
[గృహస్థుఁడు = గృహ మందు నున్న వాఁడు] 

మున్ను సేసిన తమ కార్యముల వలననె 
దొరకు నరులకు సుఖ మేని దుఃఖ మేని 
పోకు పోకుమ యన్నను పోయెడిదియుఁ 
జెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ                                                                 46. 

నెమ్మిఁ జరించు లోన ననునిత్యము జీవి కొసంగఁ జేతనన్ 
రమ్మని పిల్వఁ గాలుఁడు కరమ్ము రయమ్మున నేఁగు నింగికిం  
గ్రమ్మఁగ నీతి బాధ లిలఁ గాయము సైపఁగ నోప కార్తితోఁ 
బొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే                                     45. 

దుర్జయులు సంగరమ్మున దుస్తరంపుఁ
గౌరవ మహావరూధినీ కంధి పైన
సరళ ధారా విరాజిత శస్త్ర నిచయ
వారధినిఁ గట్టినారఁట పాండుసుతులు                                                              44. 

నేరఁగఁ బూర్వ కాల వన నిర్గత రాడ్వరు సచ్చరిత్ర దు
ర్వార బలప్రదర్శనము వర్ధిలు చుండఁగఁ జూపి శౌర్య వి
స్తారము నెవ్వ రెవ్వ రిడఁ జక్కని సాయము, నాఁగ నడ్గుడున్ 
వారలు పంచపాండవులు, వారధిఁ గట్టిరి లంకఁ జేరఁగన్                                        43. 

తున్మాడ వలయును యశ
స్తన్మయ చేష్టా నిమగ్న తామస కృతముల్ 
విన్మా యెన్నఁడు కైతవ 
సన్మానము జరుగు సభకుఁ జన వలదు సుమా                                                   42. 

ఉన్మాదమ్ము సెలంగఁ గీర్తి కయి యుద్యోగించి వెచ్చింపఁగాఁ 
దన్మోహమ్మున విత్త రాసులను సత్కారార్థ మత్యంతమున్ 
విన్మా తత్సభ సంభవించినది సంవీక్షించి యీ సత్యమున్ 
సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా                                           41. 

భీమ పరాక్రము లంకా 
ధాముని దర్శించి భవ్య ధారా సరణిన్ 
స్తోమము పఠించి వంచిత  
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్                                                              40. 
[కనెన్ = బిడ్డను గనెను] 

ఏమని చెప్ప నేర్తు విధి యీ విధి నెంచినఁ గాంచి యే పరం 
ధాముఁడు దిక్కు నీ కని యదల్చుచు నత్తఱి రాక్షసేంద్రు నా
రామము నందు నిర్భయ మరాతినిఁ గొల్తువె నీ వటంచునున్ 
రామునిఁ గొల్చినట్టి కవిరాజున కాసురుఁ డయ్యొ కన్పడెన్                                          39. 

పాండుర దేహార్తుండై 
ఖండిత నిజ సర్వ సైన్య కౌశికుఁ డనిలో 
భాండోద్భవు బ్రహ్మాభిద  
దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్                                                         38. 

దండ ధరాభ విక్రముని దండిత వైరి సమూహు ప్రజ్వల
ద్భండన భీము పౌర జన బాంధవు దార్ఢ్య త రాయ సాభ దో
ర్దండ విరాజమాను నుత ధర్మ చరిత్రుని రాఘవేంద్రు కో
దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా                                37. 

ఉండ దుడ్డు చేతి నిండుగ నెన్నండు 
కడుపు లోనఁ జల్ల కదలకుండ 
నూసు పోక కాట లుండంగ దండిగ  
ముసురు పట్టిన దినము సుఖ కరము                                                                 36. 

అసువుల్ కుందఁగఁ గుండ పోఁతగను నిత్యం బక్కటా ధాత్రినిన్  
ముసు రింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు క్షీణింపదే 
యసదై యుండఁగ నౌర వర్ష మిల మర్త్యానీక భూతాలికిన్  
ముసు రింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా                                 35. 

నిత్య సత్య వచన నిష్ఠాపరుఁడు విమ
లాంతరంగ కేశ వాది నామ 
చింత నాభిరతుఁడు సంత తోద్దండ సం
గ్రామ సింహ మగుచు రాజు నెగడె                                                                      34. 

గ్రామ పట్టణ పౌర సంచయ రక్షకుండు లసద్గుణ
గ్రామ శోభిత పూరుషుండు విరాజ మాన యశస్వియున్ 
సామ దాన ముఖాద్యుపాయ విశార దారి మదావళ
గ్రామ సింహముగాఁ జరించిన రాజు సన్నుతు లందఁడా?                                          33. 

వింత గాదె కడలి నీరు విన్నుఁ జేరి 
తిరిగి వసుధా తలమ్మునఁ గురియు చుండు 
నింపుగఁ గదలాడుచు నుండు, నింప నీరు,  
మొయిలు పైపైనఁ, బులకకు భూమి పైన                                                              32.  
[పులక = అనాస చెట్టు] 

కయితల సున్నితత్వ మఁట కానఁగ రా దది వింత చేతలం 
బయికి ముదమ్ము దోఁపఁగను బర్వెను దుఃఖ చయమ్ము లోపలన్ 
హొయ లడరంగ బాహ్యమున నుల్లము నందుఁ జెలంగె వంతలే 
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా                                 31. 
[పులు+కలు= పుల్కలు; చిన్న రాయి] 

విధి కరుణ శాస్త్రవేత్తల 
యధీనమున సంతతమ్ము నలరారఁగ న
త్యధిక ఫలప్రద మయిన వ 
సుధ పంటలు పండ జనుల క్షోభలు దీరున్                                                           30. 

అధమాసహ్యము దాస్యమే యడరఁ గ్రూరాంగ్లేయ చింతా ప్రయు
క్త ధరిత్రీ తల మందుఁ బౌర జన సందర్భోచి తోద్ధండ స
త్య ధృతిప్రజ్వలి తాగ్రహమ్ములను స్వాతంత్ర్యాప్తి భాగ్యమ్ము గాన్  
సుధ పండన్బలు పంటలన్ జనుల విక్షోభంబు దీరున్ గదా                                        29. 
[సుధ = అమృతము] 

పాప పుణ్య ఫలమ్ముల నాపఁ గలమె  
వంచితులఁ బరి కింపఁగ వంచకాలి 
యగుట వలదీ పగిది సందియమ్ము నీకు  
వంచకుల కెల్లఁ బాపము పండ దేల                                                                      28. 

సంచిత పాప కార్య ఫల షండము లూరక పోవ వట్టులే 
యెంచిన నిక్కమింపుగను నెవ్విధి నూరక పోవ నేర్చు నా 
వంచక కోటి పూర్వ భవ వర్షిత పుణ్య తరైక కార్యముల్ 
వంచకు లైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో                                            27. 

వలదీ పంతము తన త
ప్పుల నొప్పుకొని పరిహారమునకై యాతం 
డలవోక నొసంగిన రూ
కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా                                                                    26.  

ఖలులే నేతలు గాఁగ దేశమునఁ దర్కంబేలనో మానస
మ్ముల దూరం బగు శాంతి యెల్లరకు సంపూర్ణమ్ము సంసార మి
క్కలి కాలమ్మున నెండమావి యగు  వీఁకన్ దోచు పల్దొంగ మూఁ
కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా                                              25. 

వేద్యము గద వృత్త పద్యము గాకున్న 
నెల్ల కవుల కుర్వి నిద్ధ చరిత 
పాద పాద మందు వాదింపకు గళిత
ప్రాస లేక కంద పద్య మలరు                                                                                 24. 

వాసికి నెక్కితిం గవన పాటవ మందుఁ గరమ్ము నంచహో 
ప్రాసఁ దొఱంగి కందమునఁ బద్యము వ్రాసిన నేరు మెత్తురే 
భాసుర లీలఁ దోఁపఁ బ్రతి పాదము నందు మనోహరమ్ముగాఁ 
బ్రాస దొరంగి కందమునఁ బద్యము వ్రాసిన మెత్తు రెల్లరున్                                             23. 
[తొఱఁగు = విడుచు ; తొరఁగు = ప్రవహించు] 

పనిపిల్ల రాక యుండిన 
మనమ్ము వికలమ్ము గాఁగ మస్తక మెరియం 
బని భారమ్మున నలుకన్ 
శనివారము నాఁడు భార్య శత్రు వగుఁ గదా                                                                22. 

శనివారమ్ముల భక్తి సంయుత మవిశ్రాంతోప వాసమ్ములం
దనరారం గని చేయ దూషణము లత్యంతమ్ము ఘోరమ్ముగన్ 
వనితా రత్నము స్వీయ భర్తృ ముఖ సంపాతోగ్ర వద్దుర్వచో౽
శని వారమ్మున నా పతివ్రతయె వైషమ్యమ్ముఁ జూపున్గదా                                              21. 
[అశని వారము = అశని సమూహము] 

క్రుంకక యీర్ష్యాంబోధిని 
వంకలు వెట్టక నిరాశఁ బరిపంథులపై  
శంకావలి, నర్చించుచు 
శంకరునిఁ, ద్యజింపఁగఁ దగు శాంతిఁ గనుఁగొనన్                                                          20. 

శంక వహింప నేల హర శక్తి పయిం దగ దట్టి దెన్నఁడుం  
బంకజ నాభ సంయుతము ఫల్గుణ యుక్తము వాహినీ విరా
జ్యంకము నందు శాత్రవ జనాలి జయింపగ రక్షకున్ వినా 
శంకరుఁ గోర రెవ్వరును శాంతినిఁ బొంది సుఖింప నెంచినన్                                             19. 

మిన్నున విహరించు సతం 
బెన్నదు మది నేరి నేని యెల్ల ధనమ్ముల్ 
సన్నన్ గర్వాంధకు నా 
కన్నెకుఁ జూడంగ నేఁడు కన్నులు దోఁచెన్                                                                    18. 

ధన్యత నందె నట్లు వనితామణి భారత యుద్ధ పాత రా
జన్యులఁ గాంచ నొక్క పరి సద్గుణ రాశికి సంతతప్రజా
మాన్యకు వ్యాస దత్త వర మాయను సౌబలి కిద్ధ వంశ రా
ట్కన్యకు నేఁడు కన్ను లవె కన్పడుచున్నవి చిత్రమౌ గతిన్                                                17. 

దుర్ధర్షుండు కదల్చుచు  
మూర్ధమ్ము నటు నిటు నడ్డముగ నట రేగన్  
స్పర్ధ సభాపతి కాదన 
నర్ధాంగీకృతియె సభను వ్యర్థం బయ్యెన్                                                                      16. 

స్పర్ధాదగ్ధ మనో వికారు జన రక్షా దక్షు సుజ్ఞాన మం
తర్ధానం బయి యుంట నొక్క క్రతు సన్నాహమ్ముఁ గావించుచో 
నర్ధాంగ స్థిత భార్యుఁ డధ్వరము నందర్హుండ నాఁ దర్క మం 
దర్ధాంగీకృతి వ్యర్థ మయ్యెను గదా యావత్సభావేదిపై                                                    15. 

రారాజు శాసనమ్మున 
ధారాళమ్ముగఁ గవులకు ధాన్యము నచ్చో
నూరక యిత్తు రనఁగ నం
బారుకుఁ బరుగెత్తి రంట పండితవర్యుల్                                                                      14. 
[అంబారు = ధాన్య రాశి] 

తేర కవిత్వ మెన్నఁడును దేరఁగఁ గాసుల పైన నాసలే 
వీరలు చెప్ప నొల్లరు వివేక విహీనులు పౌర వర్యులే 
వారక తిట్ట నిప్పగిది పట్టెను వీరికి నెల్ల డబ్బు జ
బ్బారుకుఁ బర్వులెట్టి రఁట పండితవర్యులు పారవశ్యతన్                                                 13. 
[ఆరు =  నింద; పారవశ్యత = ఇక్కడ ధన పారవశ్యత] 

తా వలచిన స్త్రీ కోర నితరుని నెడఁద 
కాలకుండ నుండునె కడుఁ గామ తప్తుఁ
డొక్క గంధర్వుఁ డచ్చోట నుండ నట్లు 
ప్రవరుఁ గని వరూధిని, మోము ధ్వంస మయ్యె                                                              12. 

అవనీదేవుఁడు నిర్జితేంద్రియుఁడు  నిత్యాగ్నిప్రదీప్తుండు గౌ
రవ వంశోద్భవుఁ డుండ నిర్మల మతిం బ్రార్ధించుచున్ నమ్రుఁడై 
యువతీ రత్నము తీక్ష్ణ సంజనిత కామోగ్రాగ్ని దగ్ధాత్మ కాఁ
బ్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గా కేమగున్                                          11. 

అరుదెంచిన నా కృష్ణుని 
నరయు తమకము మితిమీఱ నక్కట విరహా
తుర యైన గోప కాంతకుఁ 
గరమునఁ దిలకమ్ము గంటఁ గం కణ మమరెన్                                                               10. 
[కం కణము = నీటి బొట్టు] 

విరులు శిరమ్ము నందుఁ గనిపింపఁగఁ  గర్ణము లందు దుద్దులుం   
బరఁగఁ పసిండి యొడ్డణము భవ్య పదాంగుళి వెండి మట్టెలుం    
దరుణి ధరింపఁగా నుదుటఁ, దద్దయుఁ దన్మయయై కరమ్మునం, 
గరమున బొట్టు నేత్రమునఁ గంకణ మొప్పెను భామ కయ్యెడన్                                          9. 
[నుదుట ధరింపఁ గరమున బొట్టు; కరమ్మునన్ ధరింప నేత్రములో (మెఱసిన) కంకణము నొప్పెను] 

విందుమె వింత సురనదీ 
నందనుని శిఖండి గూల్చె నరుఁ డరయఁగ నా
చందం బది యెట్లన్నం 
గుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్                                                                        8. 

సందేహింపక సుంతయేన్ శునక రక్షాకల్పితప్రాంత మం
దందందం దిరుగాడు చుండి వితతం బానంద ముప్పొంగఁగాఁ  
జిందుల్ వేయుచు నుండఁ గాంచి పటిమం జిక్కంగ లంఘించి యా
కుందేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండఁగన్                                             7. 
[కుక్కుటము = కుక్క] 

ఆ తలలు మొలచు చుండం
జేతం గొని బమ్మ యమ్ముఁ జిమ్ము మనంగన్
మాతలి ప్రొద్దు తెగ కడలి 
రాతిరి సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్                                                                    6. 
[ప్రొద్దు తెగ కడలి రాతిరి సూర్యుండు = రవికులాబ్ధి చంద్రుఁడు] 

ఆ తఱి నేఁగు చేఁగుచును నంబర రత్నము వేగ వేగ సం
పాతము గాఁగ నస్త గిరి మల్లెలు తీఁగలఁ బూయు నట్టి యా
రీతిని నీయఁ జూపఱకుఁ బ్రీతిని నింగిని రిక్క చుక్కలన్ 
రాతిరి వేళ భాస్కరుఁడు రాల్చెను బెక్కుగ నిప్పు రవ్వలన్                                                  5. 

కాన రాదెన్నఁ డే నిట్టి గౌరవమ్ము 
భాగ్య వశమునఁ గల్గెను భామ వలన 
మానినీ మణి సూపిన మాని తాభి
మానమును గాంచి మెచ్చిరి మాన్యు లెల్ల                                                                       4. 

కానఁగ రా యశో ధనులు కావ్య పరంపర కర్త లెల్ల స
న్మానము సేయ వారల కమంద విధమ్మున నెల్ల చూపఱుల్ 
ధ్యానము నిల్పి చక్క మది , నౌనన నంతట సమ్మతమ్మునన్,   
మానముఁ గాంచి మెచ్చి రట, మౌనము వీడుచుఁ బండితాళియే                                          3. 
[అట = అక్కడ; అన్వయము: చూపఱుల్ మెచ్చిరట,  ఔనన పఁడితాళి] 

పతియే దైవము నాతికిఁ 
బతి వాక్య మలంఘ్య మనెడు పడతికి మఱి సం
తత నిజ చిత్తేశాను
వ్రత ధర్మంబుగ మదిరనుఁ ద్రాగుట మేలౌ                                                                        2. 

కుత లావాసముఁ గోర యక్షవర! యక్షోనాథ సందిష్ట సు
వ్రత ధర్మంబుగ సోమపానమును సంరంభంబునం జేయుమా   
కుతలప్రాప్తముఁ గోరితే నసుర! రక్షోనాథ సందిష్ట దు
ర్వ్రత ధర్మంబుగ నామిషాశన సురాపానంబులం జేయుమా                                                1. 
[కుతలము = 1. భూమి, 2. అథోలోకములలో నొకటి]