నెయ్యి సెలంగ నొసంగుదు
మయ్య ప్రసాదముల నిత్య మంచిత రీతిన్
నెయ్యము మీఱ దయా నిధి
దయ్యమ శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా 60.
[దయ్యము = దైవము]
దయ్య మొసంగుఁ బీడలను దైవ మొసంగ శుభమ్ము లింపుగా
నియ్యెడ సుప్రసన్నులను నిర్వురఁ జేయఁ గడింది మే లగున్
వెయ్యి విధమ్ములం దనరి వేడెద మిత్తఱి మమ్ము వీడుమా
దయ్యమ వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్ 59.
తోడఁ బుట్టిన సతి భంగి తోఁపఁ బరుని
సతినిఁ బ్రేమించి చరియించు నతని పగిది
కామ లోలుఁడై కరము నిబ్భూమి నన్య
సతినిఁ బ్రేమించని పతియె సజ్జనుండు 58.
[పతి = ప్రభువు]
సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్
సతిపైఁ బ్రేమనుఁ జూపు నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్
సతతమ్ముం గురియించి వాక్యముల వాత్సల్యమ్ము సత్యమ్ముగన్
సతిపైఁ బ్రేమనుఁ జూప నట్టి పతియే సౌశీల్యుఁ డయ్యా మహిన్ 57.
[చూపన్ + అట్టి పతియే, చూపఁగా నట్టి పతియే]
ఈ మహిఁ బరికింపగ నే
సీమల నన్య మనుజుండు సీతా సతికిన్
రాముఁడు దక్క యెడఁద కభి
రాముఁడు లేఁ డనెడి చర్చ ప్రాజ్ఞుల కొప్పున్ 56.
రామా నిక్కము నెంచి చూడఁగ జనారాధ్యప్రదేశమ్ము ని
త్యామేయార్థ విరాజి భాగ్య నగరం బందున్ దురన్యాయ మృ
ద్రామాశుల్ నిలయార్థ పద్మినులు వారల్ దక్క విధ్వంసి తా
రాముం డెక్కడ లేఁడు లేఁ డనుచుఁ జర్చల్ సేయు టొప్పున్ బుధుల్ 55.
[మృద్రామాశులు = మన్ను పడఁతిపై (భూమిపై) నాశ గలవారు; నిలయార్థ పద్మినులు =
ఇండ్లకొఱకు సరస్సులు గల వారు (సరస్సుల నాక్రమించిన వారు)]
వివిధాంశమ్ములఁ బరికిం
ప వీ లగునె తర్కములకు భాషేతరముల్
భువిలోఁ జెలరేఁగఁగ స
త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా 54.
అవిగో మబ్బులు గ్రమ్ము చుండెఁ గనుమా యాకాశ మందెల్లెడం
ద్రివి ధాధ్వమ్ములఁ జేయ నింపుగను బ్రేరేపింప నీ కేల చా
లవె యానమ్ములు నేఁటి క్లిష్టతర కాలమ్ముం బరీక్షింపఁగ
న్కవి! రాజేంద్రుల కెల్లఁ గాని పని నానా దేశ సంచారముల్ 53.
విందు నొసఁగు ధర్మ నందను పెదతండ్రి
పిలుపు నాలకించి భీక రాస్త్ర
శస్త్ర నైపుణుఁడు వెస నభిమన్యుఁడు సుభ
ద్రార్భకుండు యుద్ధ మందు దూకె 52.
దుర్భర మైన వ్యూహమునఁ దూఱి చెలంగి యొకం డెడంద భూ
గర్భుకటాక్ష వీక్షణ నికాయము నమ్మి నిరంతరమ్మునున్
నిర్భయ వీర విక్రముఁడు నేర్పరి మిన్నగ నస్త్ర విద్యలం
దర్భకుఁ డుగ్రుఁ డౌచు సమరాంగణ మందున దూకెఁ బోరఁగన్ 51.
సురుచిరముగ సమరమునకుఁ
జొరఁబాఱక గెలుపు నంది జూదం బందుం
గురువంశాగ్రణి వినుమా
గురు ధనము హరింప నొప్పగు జనుల్ మెచ్చన్ 50.
[గురు ధనము = అన్నగారి ధనము]
ఇరువునఁ జేరి కర్ణుఁడు హరింపఁడె భార్గవు నస్త్ర విద్యలన్
నిరత మొసంగినం బెరుఁగు నిక్కముగాఁ బరికించి చూడఁగా
నొరులకు నీయఁ బ్రీతి మెయి నొజ్జకు నున్న ధనమ్ము జ్ఞాన మా
గురు ధనమున్ హరింపఁగఁ దగున్ జను లెల్లరు సూచి మెచ్చఁగన్ 49.
ఘోర తరమ్ముగ నిల గం
భీర గతి నరులకు వచ్చు వెత లెల్లం బో
కారుప సద్ధిమ లింగా
కారుం గని మ్రొక్కఁగ శుభకామన లిచ్చెన్ 48.
మూరిన భక్తి సాంబ శివు భూతగ ణేశు నిజాంగ భస్మ సం
స్కారుని నంతకారి విష కంఠుని సంతత సర్వ దేవ స
త్కారుని నిర్వికారుని నితాంత వినాశ మొసంగు నట్టి క్రొ
క్కారునుఁ జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వరీతిగన్ 47.
అందని స్థలి కేఁగఁ బతులు
కందర్పశరాలి ఘాత కలకంఠల యా
సుందర వదనల చెదరిన
సిందూరము శూల మగుచు శిక్షించె ఖలున్ 46.
వందే భారత మాతరమ్మనుచుఁ దత్పాఙ్నామ దేశమ్మునం
జిందుల్ వేసెడి యుగ్ర వాదులను శిక్షింపంగ నుగ్రంబుగా
సందేహింపక యుద్యమించి త్రుటినిన్ సంధింప వ్యాపార మా
సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్ 45.
కవి వరేణ్యులు మెచ్చెడి కవిత కవిత
మెచ్చ రెవ్వ రంచు నెదల నొచ్చిన ఫల
మేమి యత్నింప వలెఁ దగ దిట్లనంగ
మర్త్యు లెవ్వరు మెచ్చరు మా కవితను. 44.
ధౌర్త్యము కారణం బగును దల్పఁగ నిక్కము సర్వ లోక ని
ర్వర్త్యము గాదె సత్కవిత భావ్యమె యేరికి విస్మరింప సం
కీర్త్యము నైన నౌర పరికింపఁగ సన్మతి సజ్జనాలికిన్
మర్త్యులు మెచ్చ రైరి గద మా కవితామృత మాధురిన్గటా 43.
ఓడలే బం డ్లకట బండ్లె యోడ లైన
చందము ననుకరింపంగఁ జాలి నట్లు
కాల మేతేర నిప్పు డక్కజముగాను
గురువె శిష్యుండు శిష్యుఁడే గురువు నైరి 42.
పుర విద్వాంసు లలంకరింపఁ దమి సంపూర్ణప్రమోదాస్యులై
కర మాసక్తినిఁ జేయఁ దర్కమును శంకాహీన మానస్కులై
పరికింపంగ సభా స్థలమ్మునను విద్వత్స్వీయ పుత్రుండునున్,
గురువే శిష్యుఁడు, శిష్యుఁడే గురువుగాఁ గూర్చుండి రాశ్చర్యమే 41.
[గురువే శిష్యుఁడు శిష్యుఁడే గురువు = తఁడ్రి (యొకప్పుడు) శిష్యుఁ
డా శిష్యుఁడే (ఇప్పుడు) గురువు]
పిదప చేటొనరించు నవి వచియింప
నేరి కైన నిక్కమ్ముగఁ బోరున కవి
దారి చూపును గలహం బెద వరియింపఁ
గూపభేకప్రగల్భముల్ గొప్పవి కద 40.
కని విని నేరి నట్టి జనకాయము ముందు వచించు వీలు నీ
కొనరినఁ గూపభేక గతి నుండి ప్రగల్భము లాడు టెట్లగుం
గని విని నేర నట్టి జనకాయము ముందు వచించు వీలు నీ
కొనరఁగఁ గూపభేక గతి నుండి ప్రగల్భము లాడు టొప్పగున్ 39.
కర మాశించి పడయఁగాఁ
ద్వరితం బెద నిర్ణయించి తత్క్షణమే య
ప్పురమునఁ గొన్న దడుగఁగా
నిరువురు మువ్వురును నలువు రేవు, రొకరె పో 38.
నర వరు లెవ్వరేన్ వరుస నైపుణ మేర్పడ నెంచి చూచినం
దరుణులు నశ్వులున్, హర విధాతృ రమేశులు, ఋత్విజుల్, పృథా
వర తనయుల్, నిజ ద్విషులు, బ్రహ్మము సంఖ్యల యందు నింపుగా
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా 37.
చంపుటల నెల్లఁ దగ వా
రింపంగఁ దలఁచిన వీరుఁ డెదఁ బగతుఱ కీ
ళ్లొంపంగ వారు కట్టిన
కొంపలు గూలున్ సుజనుని కోరిక దీరన్ 36.
సంప దమేయ సిద్ధి గత సంజని తేషణ దుర్నిమిత్త హృ
త్కంపన సంచలత్ప్రతిఘ ధర్ష తరంగ కదంబ యుక్త నై
లింప దురార్చకాధమ వరేణ్య వినిర్మిత దుష్ట పూరముల్
కొంపలు గూలు సజ్జనుని కోరిక దైవము సమ్మతించినన్ 35.
తాను మున్ను గాంచ లేనియట్టి దురవ
స్థ నెడఁదఁ దలపోసి జనులఁ గాంచి
తనదు కావ్య మందుఁ దప్పులను బరులు
చెప్పుకొనఁగ సుకవి సిగ్గుపడును 34.
చెప్పక యున్న నెవ్వరును సిగ్గు వహింపఁడు సుంత యాత్మలోఁ
జెప్పుకొనంగ నా కుకవి స్వీయ కవిత్వ పటుత్వముల్ సతం
బొప్పును జెప్ప నన్యులు యథోక్తము స్వీయ యశమ్ము నింతయుం
జెప్పుకొనంగ సత్కవియె సిగ్గుపడున్ సభలందు నెప్పుడున్ 33.
మోసపుచ్చెడి వారలె పుణ్య జనులు
పుర జనుల దోఁచు వారలె పుణ్య జనులు
బొంకు పల్కెడి వారలె పుణ్య జనులు
పూజ్యులను దూఱు వారలె పుణ్య జనులు 32.
వేషము గాంచఁ బుణ్య తమ వృద్ధ జనాభ విశేష రూప భా
గ్భేషజ భాసితం బయిన భీతివహింపక యింత యాత్మలో
దోషము లేని పూజ్యులను దూఱెడు వారలె పుణ్యమూర్తు లౌ
రా షడరివ్రజఘ్నులు మహాత్ములు నౌదురె యెన్నఁ డేనియున్ 31.
ధర్మ నందను నోట నధర్మ వాక్కు
లేల వచ్చును సుంత చింతించి చూడ
మనసు లోపల నీ వనుకొనిన యట్టి
యనృత విషయమ్ము లెల్ల సత్యములె చుమ్ము 30.
వనజభ వాంగనా మణియె భారతి పన్నుగ నిల్వ నాల్కపై
మనము వినిర్మలం బయిన మానవ వర్యున కిద్ధ ధర్మ మా
న్యున కల యప్రయత్నముగ నోర బయల్పడ నిత్య సత్య వా
గనృతము లెల్ల సత్య విషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్ 29.
పరిణయమునఁ బరస్ప రాహ్వానమునకుఁ
బ్రకటముగను వధూవరు లొకరి కొక ర
పు డుపవిష్టులై కొబ్బరి బొండ మడరి
బహుమతిగ నిచ్చెద రపరిపక్వ ఫలము 28.
దహనాభంబ యపత్య హీన మొసఁగుం దాపం బనూహ్యంబుగా
నిహ లోకమ్మున సంతు లే కడుగఁ గారింపం దిరస్కారమే
యహహా యేలనొ మీఱి దత్తునిగ బాల్యావస్థు నింపారఁగా
బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్ 27.
కష్టము కవికిఁ గలిగిన న
భీష్టము సిద్ధించుఁ బిదప హృద్యమ్ములు గా
నిష్టమ్మున దూరీకృత
దుష్టసమాసములు కృతిని దోష మెటు లగున్ 26.
ద్వేషము రేఁగ డెందమున భీతి యొకింత వహింప కివ్విధిన్
రోషము తోడఁ బల్కెదవు క్రూరత దూఱుచుఁ గృత్య వృత్తులన్
భాషకు భూష లౌను నుత పండిత కోటి కొసంగు హర్షమున్
దోషము గాదు కావ్యమున, దుష్ట! సమాసము లెక్కువైనచో 25.
కూన లవు నంత కింపుగ
మానక తన గ్రుడ్డులఁ దగు మాటున నిడు నా
వైనమున వంచనమ్మున
గానవిశారదగఁ బికము కాకినిఁ బిలిచెన్ 24.
మానమొ లేక కట్ట యవమానమొ నేరని చొప్పు చొప్పడన్
గానము నందు విశ్వమున గాయక కాయము నందు నెన్నినం
దా నధికుండ నంచు నెదఁ దల్చుచు గార్దభ రాడ్వరేణ్య జి
ద్గానవిశారదా! యనుచుఁ గాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై 23.
సుజనులు మీరని పెద్దల
భజించి సస్యాభివృద్ధి వడయఁగ నిచ్చో
ట జనింప రసాయన విస
ర జనిని మెచ్చంగ వలెను రైతులు నెమ్మిన్ 22.
[రసాయన విసర జని = రసాయన సమూహము లందుఁ బుట్టుక కలది, యూరియా]
రజనిని నిద్ర వోఁ దలఁప రమ్య తరమ్ముగఁ జేతు లుంచుచున్
నిజ హృదయమ్మలం బిసరు నేరక యెట్టి భయమ్ము లాత్మలన్
సజల ధరిత్రి లోన సరసమ్ముగఁ బండెడి పీత వర్ణ వ
ద్రజనిని మెచ్చఁగా వలెను రైతులు సత్ఫలసిద్ధిఁ గోరుచున్ 21.
[రజని = 1. రాత్రి, 2. పసుపు]
భూజను లెవ్వరినిఁ గొలువఁ
గాఁ జను సద్భక్తి తోడఁ గరుణం జెపుమా
తేజున నశించి పాపము
పూజించెడి వారి కెటులఁ బుణ్యము దక్కున్ 20.
ఓజ నొనర్ప మానవుల కుర్విని సేవలు చిత్త శుద్ధితోఁ
బూజలు సేయ నేల యది పుణ్య మొసంగును నిశ్చయమ్ముగన్
భూజన నాశ నార్థముగ మూరి జపమ్ములు క్షుద్ర దేవతా
పూజలు సేయు వారలకుఁ బుణ్యము రాదని యండ్రు పండితుల్ 19.
ఆది మధ్యాంత రహితుండు నంబరాంబ
రుండు నాది భిక్షుం డభవుండు నుండు
ధ్యాన ముద్రుఁడై ముక్కంటి తపము నందుఁ
దనకె తా మ్రొక్కి మోదంబుఁ గనును మిగుల 18.
ధనవంతుండు యశస్వియై వఱలి శ్రద్ధా భక్తి తాత్పర్యముల్
దనరారన్ గురు దేవ పాదముల నిద్రా వేళలన్ నిత్యమున్
గొనకొంచుం గడు స్వీయ సద్గురువులన్ గుర్తించు కొంచుం దగం
దనకే తాను, నమస్కరించు కొని మోదం బందు నత్యంతమున్ 17.
ఆ తరుణీ మణి యడరిన
ప్రీతిని బొమ్మల కొలువున వివిధ ప్రతిమా
వ్రాతములఁ గృష్ణు బొమ్మలఁ
బూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్ 16.
చూతు నవశ్య మంచు నెదఁ జొప్పడ నమ్మక మక్కజమ్ముగం
బూత చరిత్ర యా శబరి మ్రొక్కుచు వేచుచు వాన రాకకై
చాతక పక్షి సన్నిభము సత్కవి పుంగవ సుప్రసిద్ధ చం
పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్ 15.
[సుప్రసిద్ధ చంపూ = మిక్కిలి ప్రసిద్ధ మైన చంపూ కావ్యము కలవాఁడా]
అన్యాధీన మసహ్యము
మాన్యము లవి యెన్ని యున్న మాత్సర్యక్రూ
రాన్య జనాధీనంబగు
ధాన్యం బున్నట్టి తావుఁ దడయక విడుమా 14.
మాన్యుల కెన్న శూన్యములె మానవ కోటికి నమ్మ వస్తువుల్
వన్యము లిచ్చు లాభములు పన్నుగ నాత్మఁ దలంపు టొప్పు ప
ణ్యాన్యము ధాన్య విక్రయ విహార నిమిత్తము లెక్క కెక్కువౌ
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్ 13.
త్వాష్ట్రీ తారా భాసిత
రాష్ట్రమున వెలుంగు చంద్రు రమణ నడరుచున్
రాష్ట్రఘ్నుఁడు మూషికము జి
తోష్ట్రము నెక్కి గణనాథుఁ డొయ్యన వచ్చెన్ 12.
[త్వాష్ట్రి=చిత్త; రాష్ట్రము=ఉపద్రవము]
ఆష్ట్రము నందు నిత్యము సహస్ర మయూఖుఁడు సంతసమ్మునం
ద్వాష్ట్రి మనోహరుండు సను భంగినిఁ గన్పడ నిచ్చ మెచ్చుచున్
రాష్ట్రము రాష్ట్రముం దిరుగ రక్తి ననింద్యుఁ బ్రధావనచ్యుతో
గ్రోష్ట్రము నెక్కి వచ్చెను మహోదరుఁడౌ గణనాథుఁ డొయ్యనన్ 11.
[ఆష్ట్రము=ఆకాశము; త్వాష్ట్రి=సంజ్ఞాదేవి; రాష్ట్రము=దేశము]
హంసాతిథ్య మొసంగఁ బ్ర
శంసార్హంబై వెలయును సతమున్ రాజో
త్తంసా సతి పోరెఱుఁగని
సంసారమె సుఖకరమని సన్యాసి యనెన్ 10.
పాంసుక్షీణ పటాభ మానసులు క్షుద్బాధాది సంపూర్ణ వి
ధ్వంసప్రక్రియ నన్య మర్త్యులకు మోదంబీయ సంసార ధు
ర్యాంసశ్రేష్ఠులు పంచయజ్ఞ పరిపో షాసక్తులై యుండుటన్
సంసారంబె సుఖావహం బనుచు నా సన్యాసి బోధింపఁడే 9.
మచ్చ శాస్త్రము పరికింప మానవేంద్ర
దోష మించు కైనను లేదు దుఃఖ మేల
కుడి భజమ్ముపైఁ జక్కఁగ నడరు పుట్టు
మచ్చ మంచిదె యశ మిచ్చు మాన్యులకును 8.
మెచ్చరె లోకు లింపుగ శ్రమించి యెదిర్చి రణమ్ములన్ జయం
బిచ్చిన వంత గాయమున కేలను క్షాత్రవ కోటి కేర్పడన్
నిచ్చలు వింటి నెక్కిడ ననీక ముఖమ్మున నల్లె త్రాటి యా
మచ్చయు మంచిదే యగును మాన్యులకున్ యశమిచ్చు నెప్పుడున్ 7.
బ్రహ్మోపాసన మొప్పును
బ్రాహ్మ ముహూర్తమునఁ బడయ బ్రహ్మ పదమ్మున్
జిహ్మగు లయి పెనఁగనిచో
బ్రహ్మపదార్థమ్ము విషయ వాసన రేఁపున్ 6.
[బ్రహ్మ పద+అర్థము = బ్రహ్మ లోకమున కయి]
బ్రహ్మకు నైనఁ బుట్టు నెద రాగము సుందరిఁ గాంచ సంత తా
జిహ్మ చరిత్రుఁ డైన ననఁ జెప్పఁగ నేల మనుష్య మాత్రులన్
జిహ్మ చరిత్ర సొం పడరు చేడియ మోమును నంతరంగ మన్
బ్రహ్మపదార్థముం గని విరాగులె యింద్రియ లోలు రై రహో 5.
[బ్రహ్మపదార్థము = అగమ్యగోచరమైనది]
ఓం నమశ్శంభవే యని యోం నమశ్శి
వాయ యని మ్రొక్కు చుందురు భక్తు లెల్ల
నవని వీక్షింప నిత్య పూజాది హీన
భర్గుఁ డుండని క్షేత్రము వారణాసి 4.
తరళము.
చెవులఁ జొన్పకు మిట్టి వాక్కులు చెల్ల వెన్నఁడు రాకు వి
ష్ణు విట లేడనె ద్వారకా పురి చూడఁ బంక్తి రథాత్మ సం
భవుఁడు లేఁడనె భద్ర శైలమె భక్తుఁడా యిటు రాకుమా
శివుఁడు లేఁడనె వారణాసియె జీవుఁడా యిటు రాకుమా 3.
తమకుఁ దోఁచదు చెప్ప నితరులు వినరు
మూర్ఖ జనుల రంజింప లేము ధర లోన
వల దనుచు నెంత చెప్పినఁ జలము తోడ
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను 2.
పంతము నూని చంపె రిపు పక్ష విరాజిత వీర వర్యులన్
వంత యెఱుంగ కింద్ర వర పౌత్రుఁ డహో కపటంపు టాజిలో
నంతము సేయ వాజులఁ బరాలి స సారథి తేరు తోడుతన్
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్ 1.