వినయమ్మునఁ జని చని తా
ననునయపు మినుకుల గురుని యతి మర్మంబౌ
యనుమతి వర్ణంబు లరసి
తనయుఁడె తలఁ గొరిగినాఁడు తండ్రికి సుమ్మీ 61
[అనుమతి వర్ణము = pass word]
అనయము వంశవృత్తు లవి యాదరణమ్మున స్వీకరించఁ గా
ననమున నున్న మేలగును నమ్ముము నిత్యము నాదు పల్కులన్
ననుపున మంగళప్రదుడు నాపిత వంశ వివర్ధనుండు వే
తనయుఁడె తండ్రికిం దలను దన్మయ మొందుగ గీకె నవ్వుచున్ 60
దురితుండు మేఘనాథుని
నరర్షభుల బంధనమ్ము నాగాస్త్రమ్ముం
ద్వరితము విఫలము సేసిన
గరుడుని హరి చూచినంత గ్రక్కున మ్రొక్కెన్ 59
[హరి = కోతి, హనుమ]
సురవర వీరు లెల్లరను జోద్యము మీర పరాక్రమంబునం
బరుగిడఁ జేసి మాతృ హిత బద్ధుడు వేగ సుధారసమ్ము దాఁ
గరమునఁ బూని పోవు తరిఁ గశ్యప సూనుడు నమ్మహాత్మునిన్
గరుడునిఁ జూచినంత హరి గ్రక్కున మ్రొక్కె వినమ్రమూర్తియై 58
[హరి = ఇంద్రుఁడు]
అవసరముల జగతి నవలంబ మది లేక
యున్న సంపద లవి యెన్ని యున్న
మఱి విళంబ మంత మది విడువక యున్న
హేవళంబి జగతి కిడుము లొసఁగు 57
నిచ్చలు స్నేహ భావమున నిర్మల వృత్తిని సంచరించుచున్
వచ్చిన దాని తోడ మదిఁ బన్నుగఁ దృప్తిల భాగ్యవంతులే
కచ్చిత మౌను దా యునికి కై కలహమ్ముల కెల్ల నింత తా
వచ్చిన హేవళంబి కడు వంత లొసంగును మానవాళికిన్ 56
[తావు+అచ్చిన =తావచ్చిన: చోటిచ్చిన; అచ్చు = ఇచ్చు]
రామ జన్మ దినము రమ్యమ్ముగ జరిపి
బీద సాద లట ప్రసాదములును
బానకమ్ము నీయ భక్త వరు లపు డా
విషముఁ ద్రాగె హరియె విందటంచు 55
[విషము = జలము]
ఇషువుల కన్న మిన్న తపియించును దేహము నెల్ల వేగ వై
దుషుల పథమ్ము దల్పకయె దుర్వ్యస నమ్మది వీడ లేక శే
ముషి యొక యింత లేక విష పూరిత వారుణి యంచు నేర కా
విషమును ద్రాగె మా ధవుఁడు విందనుచుం బరమాను రక్తితోన్ 54
[మా ధవుడు = మా యొక్క పతి]
పడ బండి నుండి బాలుఁ డు
నడిరేయి గడచినఁ బెట్టిన నిరవధికముం
బడతులు ముఖపద్ములు కాఁ
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్ 53
[పద్మములు : ఇక్కడ పడతులు]
అడరి విషాద కోపముల నర్జును డంతట నిశ్వసించుచున్
వడిఁ గడతేర్చ సైంధవునిఁ బశ్చిమ మేఁగక ముందు సూర్యుడే
తడఁబడ కెందుఁ బంతమున ధైర్యము మీరఁగ పోరు చుండగం
బడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్ 52
[తోచు = ప్రత్యక్షమగు]
నక్తంచ రాన్వవాయా
ముక్తాసుర వర వదాన్యుఁ బూర్వజుని వరా
సక్తోపాసన సుస్థిర
భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే 51
వ్యక్తము పూర్వ జన్మ పరిపాక సుకర్మ నికాయ పుణ్యునిన్
యుక్త కటాక్షవీక్షణల నుత్తమ పండితుఁ జేసె వాణియే
రిక్త మనస్కుఁ డల్పు విపరీతపు మూర్ఖుఁడు కాళిదాసునిన్
భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై 50
[సాక్షాత్తు సరస్వతీ దేవి చే “అహమేవ త్వం త్వమేవాహమ్”
అని పించుకున్న మహా విద్వాంసుడు కాళిదాసు.]
పూర్వ మింద్రు డహల్యను ముట్టె సతిని
ఋషి సతులఁ గోరె ననలుండు ధృతి చెడి మది
ధర్మ రక్షణ కెయ్యది తావు ధరణి
నమృత పానమ్ముచే సుర లసురు లైరి 49
సుమతులు మద్య పానమునఁ జోద్యము కాదిల దుష్టులౌట నాఁ
గుమతుల స్నేహబంధ మది కూడిన వేరుగఁ జెప్పనేల మో
హము మది నుప్పతిల్లఁగ నహంకృత దుష్టులుమార శక్యమే
యమృతముఁ గ్రోలినంత, సుర లక్కట రాక్షసులై చరించిరే! 48
మీరఁగ రాదాడి నుడులు
పారావార మినికినను వసుధాలయమై
నీరైన నసత్యం బిది
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్ 47
పరమైశ్వర్యము పొంద శక్యమగు నప్పద్మాక్షుఁ గీర్తించినన్
దురితౌఘమ్ములు నాశనంబగును వే తోరంబుగన్ ధాత్రినిన్
నిరయాధీశుడు ధర్మరాజునకు వానిం ద్రోయగా శక్యమే
నరకం బందును, మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో 46
కార్యాతురతన్ మనము వి
పర్యయమై మైకమున నపస్మారమునం
బర్యంకము పైన పడిన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్ 45
శౌర్యము జూపగా వలయు సంకట వేళల వెఱ్ఱివానిగం
గార్యము లందయిష్టులయి గంతులు వేసిన లాభ ముండునే
ధైర్య మొకింత చూపకయె, దయ్యము సత్వర మావహింపగన్
భార్యను, గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై 44
స్వార్థ చిత్తుఁడు దుష్టస్వభావుఁ డన్య
జన ధనాపహరుఁడు క్రూర జనుఁడు విభుఁడు
రాజ నీతి నంతను వీడి రాజ భజన
పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద 43
తరతమ భేదముల్ విడిచి ధర్మయుతమ్ముగ సంచరించుచుం
గర మనురక్తి నర్హులకు గౌరవ మిచ్చిన మంచివాఁ డగున్
నిరతము విత్త లాభమున నిశ్చిత బుద్ధులు స్వార్థ భావ త
త్పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్ 42
డెంద మలరంగ భక్తిని
నంద వరాత్మజ సుకీర్తనలఁ బరవశులై
చిందులు వేయు నృపులపై
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్ 41
డెందము పొంగ శిష్యులకు ఠేవగ మంత్రము చేత సంగరం
బందునఁ బ్రాణ హీనులగు నందఱి కింపుగ నిచ్చు జీవముల్
సుందరమైన సంస్కృతము శోభిలఁ జేయును దెన్గు నందు నే
కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్ 40
[కవి = శుక్రుడు]
సంగర భీముడు ధీరుడు
గాంగేయుం డన్న నెవఁడు, గంగాపతియే!
భంగ మ్మగు నీవచనము
గంగాసతి భార్య యౌను గఱకంఠునకున్ 39
[గంగా+ అపతి = గంగాపతి; అపతి = అనాథ]
శృంగారం బన నొప్పునే ధరణి విచ్చేయంగ మూర్ధమ్మునన్
గంగాదేవినిఁ దాల్చె నంత శివు డాకాంక్షించి తా బార్వతీ
సాంగత్యంబున సంతసించుచు మహాశ్చర్యంబునన్ భస్మ రా
గాంగేయుం డెవఁడన్న నా కెఱుక గంగావల్లభుండే సుమీ 38
[భస్మరాగ+అంగ +ఈయుఁడు = భస్మారాగాంగేయుఁడు;
అంగేయుఁడు = అంగము కూడుకున్నవాఁడు]
రామాభ్యుదయము గోరుచు
నా మారుతి యేగ జలధి నల సింహిక నా
భామను వధించి రాక్షస
రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్ 37
[రామా+అంతకుఁడు= రామాంతకుఁడు; రామ = స్త్రీ]
భీమ పరాక్రముండు నరి వీర భయంకరుఁ డస్త్ర శస్త్ర వి
ద్యామిత తేజ విక్రమ మహా బల దర్పిత దైత్య వీరుఁడే
యా మహిమాన్వితాత్ము ఘను నక్ష కుమారుని, ఘోర వైరి సు
త్రామునిఁ, జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే 36
[కుమారుఁడు = యువరాజు; సుత్రాముఁడు = ఇంద్రుఁడు]
ఏమనగ వచ్చు నుచితమ్ము లెఱుగక యల
పరిణయము కాక పూర్వము పాప మంతఁ
గామ మోహితులై తమకమున నతివ
పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు 35
పరిణయ మన్నఁ జూడఁ దగుఁ బన్నుగ వంశపు సప్తకమ్ములన్
ధరణిని లేని పక్షమునఁ దప్పవు బాధలు నిశ్చయంబుగం
జరిత మొకింత జూడకయె సత్వర మెంచుచుఁ బెండ్లి కన్య కా
పురుషుఁడు పూరుషుం గలియఁ బుత్రుఁడు పుట్టె నదేమి చోద్యమో 34
[కాపురుషుఁడు = దుష్టుఁడు]
భవసాగర మీఁదగ దే
వ విభుండు నుమా ధవుండు పరమేశున కా
శివుని కనురక్తిఁ, దా ననె
జెవిలోఁ, బువుఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్ 33
[పెట్టువాఁడు = సమర్పించువాఁడు]
అవనీ నాథులు భూసురేంద్రులును విద్యాధిక్యు లౌగాక యీ
భువిసంజాతులు దైవ భక్తులు సుమీ పుణ్యాత్ములే యెంచఁ గే
శవ పాదార్చితముల్, త్యజించి మదిఁ దాత్సారమ్ము, సద్భక్తినిం
జెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసౌశీల్యుండు ముమ్మాటికిన్ 32
సలలితస్వర మృదు కలిత గానామృత
రస ఝరీ నినాద రమ్య తరము
ప్రణవ నాద కలిత రాగ యుక్త మధుర
రణము ప్రాంగణ మది రణము గాదె 31
[రణము = 1. శబ్దము , 2. యుద్ధము ; ప్రాంగణము=పణవవాద్యము]
మణిమయ మా వివాహ ఘనమంటప మొక్క నిమేష మాత్రఁ గా
రణ మొక యింత లేక యనురాగము గర్జనమయ్యె నంత తో
రణములు ద్రెంచి వేదికలు రవ్వలు సేసి చెలంగ నత్తరిన్
రణము రణమ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్ 30
మనమున రామ భద్రుడట మాతలి మాటలు గౌరవించి యా
యినకుల భీమ విక్రము డహీన విధాతృ ఘనాస్త్ర మంతటన్
ఘనముగ నేయ మంత్రములఁ గార్ముక చండ విముక్త మంతఁ దా
కెను దశకంఠు వక్షము వికీర్ణము సేసెను రౌద్ర వంతమై 29
ఇమ్ముని వేషాకృతి కర
ణమ్మున నల్పుని వలెం దన ననుకొనియె పా
పమ్మని వనధి తరంగ శ
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై 28
సమ్మత మౌనె శాంతమది సంతత మెల్లర కెక్కడైననున్
నెమ్మది దారి నిమ్మనుచు నేరక వేడితి నంచుఁ దల్చి తా
నిమ్ముగ బాణమూని వడి నిమ్మకరాకరపుం దరంగ జా
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్ 27
ఆ మనుజ షండ మఁట వి
శ్రామ విలాసముల నిచ్చు శశి శీతకరో
ద్దాముఁడు రాహు దళితుఁ డవఁ
గౌముది లేనట్టి రాత్రిఁ గనెఁ బున్నమికిన్ 26
నీమము తప్ప నెవ్వరికి నిక్కము శక్యము కాదు విశ్వ మం
దా మధుకైటభారి పరమాద్భుత లీలలు సుమ్మి లోకమే
సోముఁడు వెల్గు చుండ పరి శుద్ధపుఁ గాంతుల సైంహి కాపహృ
త్కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమి నాఁడు వింతగా 25
ప్రకటమ భవకారకుఁ డా
శుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
యకళంకు నగాధిపునకు
నిక ముద మొసఁగఁగ నభవుఁడు హిమవంతునకున్ 24
[భీష్ముఁడు = శివుఁడు]
వికలంబైన నిజేచ్ఛ పార్వతి గిరిం బ్రీతిన్ తపం బాచరిం
చి కరంబా పరమేశ్వరున్ గుఱిచి తాఁ జిత్తంబు మెప్పించఁగం
బ్రకటామ్నాయ విభాగుడే నుడివె నాద్వైపాయనుం డివ్విధిన్
శుకయోగీంద్రున, కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్ 23
[భీష్ముఁడు = శివుఁడు]
గోముగ నత్తయె పాపన
నేమైనను మేనయల్లుఁ డే నిక్కంబం
చా మగని సోదరి యనియె
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్ 22
[కలియు = కలియఁబడు]
ఏమని చెప్ప వచ్చు నిల నింపుగ నద్భుత కృష్ణ లీలలం
గోమలు లెల్లరం దమినిఁ గోర్కిలు తీర్చుచు నాదరింపగం
బ్రేమగఁ జేర చేర దరి పేర్మిని నంతఁ బదారు వేలవన్
భామయు భామయున్ గలియ, బాలుఁడు పుట్టెను సత్యభామకున్ 21
పార మెఱుంగ దధర్మము
భారతమున నేడు వింత పరికింపంగన్
దూరీకృత సతృణీకృత
భారత! యశ మడఁచు సుమ్ము భావితరములన్ 20
వీరులు ధర్మ వర్తనులు పేర్మి వహించిన సత్యసంధులున్
భూరి యశో విలాసితులు భూపతు లెల్లరు భారతమ్మునన్
ధీరత వీడి భోగములఁ దేలుచు నిత్యము, విస్మరించినన్
భారత కీర్తిచంద్రికలు, భావితరాలకుఁ జేటుఁ గూర్చురా 19
దొంగ తన మది యాతని దొడ్డ వృత్తి
యన్య మెఱుఁగఁడు చిఱుత ప్రాయమ్ము నుండి
దూఱి కలవారి యింటను దొంగిలించఁ
బడమటం బొంచె రవి సుప్రభాతమందు 18
[పడము+అటన్ = పడమటన్; పడము = రత్న కంబళము; సుప్రభాతము = తెల్లవారు ఝాము]
అడరిన విష్ణు లీలలు గ్రహాంతర సంచలనాత్మకమ్ములం
బడయగ శక్య మేరికిని బ్రహ్మమహాండపు టద్భుతమ్ములున్
బడలిక లేక యింపుగను బశ్చిమ దేశము, భారతమ్మునం
బడమటఁ బొంచి, చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్ 17
విష్ణు మాయ లవి తలుప వింతలె సుమి
దాట తరమె యేరికి నైన ధరణి మోహి
నీ సురూపధారి హరిని నిజ మనోప
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పాఱె 16
[మనః + అపహరు = మనోపహరు; పాఱె : కలుసుకోవడానికి పరుగు పెట్టెను]
కర మరుదైన గాథ నిలఁ గంటిమి కాదె మనోహరమ్ముగన్
గురు విష సర్ప రాజులను గోరి పయస్సునఁ బెంచ వచ్చునే
వర పరిశీలనార్థి హరభక్తుఁడు భస్మపలాశి జీవ నా
హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే 15
[జీవన + ఆహరు =జీవనాహరు: జీవనముల నపహరరించు వాఁడు]
కట్టెదుటఁ గంటి
నిప్పుడు
చుట్టును బచ్చటి పొలములు శోభ లొసంగన్
గట్టగఁ
బూదిని నింపుగఁ
దట్టపు టెడ్లను నస
మ సిత సువర్ణములన్ 14
[పూది = కాడి]
చరితము లవి చదివి చదివి
కర మలసి సొలసియు మూసి కన్నులు నిదురిం
చ రయమునఁ బల్కెఁ దా కల
నరయఁగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్ 13
కొల్లంగొట్టగఁ గాక దుడ్డులను సంకోచమ్ము లేదిందునం
దల్లీ దూరసుదర్శినీ తగునె వింతల్గొల్పు మేథో మహా
వల్లీమంథన భీమ యజ్ఞములు సంభావ్యంబు లయ్యెం గదా
యల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో 12
కాలానుగుణము నవనీ
పాలామ్నాయ గురుజన కృపారస సుర స
జ్జాల సురుచిర విశాలా
స్త్రీలకు మ్రొక్కినఁ ధనమును శ్రేయముఁ గల్గున్ 11
[అస్త్రీ+ఇల = అస్త్రీల: అస్త్రి : అస్త్రమును ధరించిన వాడు,
ఇల : భూమి: అస్త్ర ధారి యొక్క భూమి.
“అస్త్రధారి (విష్ణువు) యొక్క భూమి ని గొల్చిన”
అను నర్థమును తీసుకొన వచ్చును.]
శైలము నందు జన్మమట సత్వర మాయుమ శంభు పత్నినిం
బాల సముద్ర మందు నట పన్నుగ శ్రీసతిఁ గంజ పత్నినిన్
మేలగు భక్తి నుంచి మది మిన్నగ శక్తి రమా సరస్వతీ
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్ 10
ఆ విష్ణు వవని తలమున
రావణ సంహార కార్య రతిని దశరథుం
డావసుధాధీశు నరై
రావణునకుఁ బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్ 9
[నర+ఐరావణు = నరైరావణు: నరకుంజరుడు]
పావనుఁ డవ్యయుండు నిన వంశ మహోదధి శీతరశ్మి సం
భావిత లక్ష్మణుండు పరిపాలిత ధర్ముఁడు సత్యశీలి తా
దేవ హితైక కార్యమును దీర్ప ననంతుఁడు,వజ్ర ఘాతమై
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై 8
సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక:
దేశ దాస్య మెల్లఁ దీరంగఁ బ్రాణమ్ము
లొడ్డి పోరి రెల్ల రుత్తమముగ
ధరణి వారి హృద్విదార కోష్ణంపుఁ గ
న్నీటి పైన వ్రాత నిలిచెను గద 7
ఓప దిటులన నెవరికిని
ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే
యా పద్మ నయన లిరువురు
నీ పుడమి నయోనిజలు నహీన గుణవతుల్ 6
పాఁప విభుండు లక్ష్మణుఁడు పన్నుగ రాముడు భర్తలే కదా
క్ష్మాపతి సూర్య వంశజు స్నుషల్ మిథిలాపతి రాజయోగి యా
భూపతి నందనల్ పరమ పూజితు లూర్మిళయున్, లతాంగి యో
ద్రౌపది!, సీత యిద్ద రొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా 5
[పాఁప విభుఁడు = ఆదిశేషుఁడు]
దేహ మందు సగము తీసు కొన్నది గౌరి
ప్రేమ మీర చూడ వింత గంగ
యాక్రమించె నంత యతివ జటా జూట
ము గురు స్త్రీల మగఁడు మొదటి యోగి 4
[కురుస్త్రీలు = చిన్న భార్యలు; మొదటి యోగి = ఆది బిక్షువు, శివుడు]
అగ్గలమైన ప్రేమ కడు నద్భుత భక్తియు పారవశ్యముం
దగ్గని యాత్మ గౌరవము దాల్మి దయార్ద్ర హృదంబుజంబునున్
బెగ్గల మెంచ సుంత కనిపించని చంద్రముఖుల్ మహా పయో
ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ 3
[పయోముక్ + గురు = పయోముగ్గురు: మేఘనిభాలఘువులు;
పయోముచ్ = మేఘము; ఆది యోగి = ఆది బిక్షువు]
ఎద వాలు మీ క్షణమ ద్రో
వది నా నీ కందఁ జేతు స్వర్గసుఖమ్ముల్
పద కీచక యనె భీముడు
సదమల మాలిని కపట వచనముల నంతన్ 2
[నా=అనన్]
సుదతుల్ నీకు విలాస వస్తువులె దాసుల్ భంగి కన్గొందువా
వదరుల్ చాలును గీచకాధమ మదభ్యాసంబు నీ మృత్యువే
వదలించం దగ దుక్కు కౌగిలినిఁ దల్పన్ భీకరంబౌను జా
వది నా కౌగిటఁ జేర్చుకొందు నిను నే స్వర్గంబుఁ జూపించెదన్ 1