అయ్యా విను నాదు పలుకు
లియ్యవసరమున వరించి యీ సుందరిని
న్నొయ్యన మనంబున వదలి
గయ్యాళినిఁ, బెండ్లియాడఁగా సుఖ మబ్బున్ 55
ఒయ్యారంబులు సూపి మోహమున నయ్యోషిత్తు లాయత్తలై
సయ్యాటమ్ములఁ గూలఁ ద్రోయుదురె యిశ్సాతోదరిం జూడ మే
లయ్యా సద్గుణ రాశి రూపవతి సత్యంబెల్ల స్థైర్యంపు ప్రో
గయ్యాళిన్, దగఁ బెండ్లియాడి నపుడే కల్గుం గదా సౌఖ్యముల్ 54
[ప్రోగు+అయ్యాళి = ప్రోగయ్యాళి; ఆళి = నిర్మలమయిన మనసుగలది]
పరవశము జెంది చూడగఁ బడతి నచట
ఋషి వరేణ్యు నికుంజ పరిసర చరిత
తరళ తను సుమాపచయ సంతత రతాత్మ
భూరి దుష్యంతుఁడు వరించె భూతలమున 53
వడివడి తడబడక యడరి
సడిసేయక జనులు సల్లఁ జల్లని నీటం
దడియగఁ గనుమరు గయ్యిన
వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్ 52
[వడ = సెగ, వేఁడిమి]
నడయాడంగ నరక్షితంబుగను నానా కీట కాగారమే
వడిఁ జేకూర్చును రోగ సంతతిని ప్రాప్తంబైన శీతం బిలన్
మడఁగంగావలె శీతలమ్మునకు హేమంతంపు, భద్రమ్ము పా
వడ, గాలుల్ వడి వీఁచుచుండఁగ నెటుల్ వర్ణింతుఁ దచ్ఛీతమున్ 51
[పావడ = వస్త్రము]
నిషిద్ధాక్షరములు - క వర్ణము:
పృథ పుత్రాగ్రజ విలసిత
పృథు దాన గుణాభిరామ వివిధాస్త్ర విశా
ల ధన విరాజిత రవిజుఁడ
పథానువర్తి విలయమ్ము వడసెను సుమ్మీ 50
అన్నము కావలె నన్న
న్నన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెం
గ్రన్ననఁ గన్నులునిండం
గన్నీళ్ళవినిండ మెండుగ ద్విజోత్తముఁడే 49
ఎన్నడు నూరు దాటి చన డీ మనుజుండు ప్రపంచ చిత్రముల్
తిన్నగఁ దానెరుంగునను ధీరత నించుక శంక లేకయే
సున్నయె చూడ జ్ఞానమున సుద్దులు సెప్పును హద్దు మీరుచు
న్నన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్ 48
కోరి దాగెను విష్ణువు కోటరమునఁ
గొండల గృహముల నదులఁ గోవెలల వ
నముల సకల చరాచర విమల జీవ
రాశు లందెం దడుగు నింక రక్కసుఁ డని 47
చారు కృపారసుం డడుగ శంభునిఁ గానక యెందుఁ జూడగం
గోరి జనార్దనుం, డపుడు కోటరమందున దాగె భీతుఁడై
పారి శనీశ్వ రాపకృతి భంగము నెంచి మనో వికారుఁ డై
చోరుని రీతి యంచనె వచోవివశాత్మ భవాని వేదనన్ 46
చల్లని చూపుల వానిని
పిల్లన గ్రోవి రవము వినిపించెడి వానిన్
సల్లలితుఁ దనువు వానిని
నల్లని, మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్ 45
ఉల్లము నందు నిల్పి పురుషోత్తము నచ్యుతుఁ బద్మనాభునిన్
నల్లని వానిఁ గృష్ణుఁ గరుణా రస వీక్షణు భక్తరక్షకున్
మల్లెల దండ నా కొసగ మన్నన తోడసఖుండు, చెప్పగ
న్నల్లని మల్లెలం గొని, ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్ 44
[చెప్పగన్ +అల్లు+అని= చెప్పగన్నల్లని]
విగతవ్యధాతిశయమున
మృగలోచన మందహాస ధృత వదనమున
న్నగుపడ నచ్చోట నుడివి
మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్ 43
మగువల కెంచ జన్మమది మన్ననఁ బొందును దల్లి యైనచో
నగరము నందు నున్న కడు నాణ్య మనందగు వైద్యశాల లో
నగణిత రూప సంపదల నందపు టా పసికందుఁ జూపుచున్
మగనికి, బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా 42
రామ రాజ్యము నందు ధరా తలమున
మారుతము వీచె నిత్యము మానితముగఁ
గాంచ నెల మూడు వానలే కాని గాలి
వానలే లేక సస్యముల్ పండె మెండు 41
వానలు భూమి మీద పడుఁ బన్నుగ శక్రుఁడు సంతసించినన్
మేనలరంగఁ బూజల నమేయపు భక్తిని నెమ్మి సల్పుచున్
వీనుల విందుగన్ నుతుల వేడిన నింద్రు నుపద్రవమ్ము, లే
వానలు, లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్ 40
[లేవు + ఆనలు = లేవానలు; ఆన = ఒట్టు]
దేవలోకంబు సని వైనతేయుఁడు తగఁ
జక్కబెట్టు తరి నమృత మొక్క క్షణము
నుద్ధృతంబగు కావలి యున్న కతనఁ
బాము కనిపించ గరుడుండు భయము నొందె 39
[పాము = ప్రామిడి = క్రౌర్యం]
సుర ముని యక్ష కిన్నర వచోనుతి వందిత భాసమానుఁడే
సురుచిర రూప సంపదల శోభిలు శ్రీపతి పద్మనాభుఁ డా
హరి భువి రక్షణార్థము మహా ఝష రూపము దాల్చ వేదనన్
గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్ 38
[ఉరగము = పొడుగుచేఁప]
రామ రాజ్యమ్మునం గనరాదు నీతి
బాహ్యము నధర్మము ననృత భాషణమ్ము
చోర భయమును బౌరుల శుల్క భార
మించుకయు రామ భక్తులె యెల్ల జనులు 37
కామ విలాస లాలస సుగర్విత కార్య కలాప తోషి యా
భీమ శరీర భీకర వివేక విహీన మనో విచార సం
గ్రామ వికార రావణుని రాక్షస సింహుని, ఘోర శత్రువా
రాముని, రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్ 36
తోరపు విద్య ఘనముగ కు
బేరుని మించు ధనరాశి విశ్రుత కులమున్
మారునిఁ బోలు వరుని యా
కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్ 35
దూరము నుండి వచ్చిన సుదూరపు బంధు గణమ్ముఁ జూచి వే
గౌరవ భావ మేర్పడగఁ గమ్మని పల్కుల నాదరించుచున్
భారమ యంచు నెంచకయె పన్నుగ వా రొనరించి నట్టి స
త్కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ 34
వీరుఁడు నరుఁడు స్తుతించెను
సారసముఖ శశధర వర సమలంకృత సాం
బా రుజవిదూర కారక
చారుతర కృపావిపులు సుజనగణ పాలున్ 33
[సాంబా = అంబతో గూడిన; రుజ విదూర కారక = రోగనాశనకారి]
చక్రవాకము లంతట సంతసించెఁ
గలువ లింపుగ వికసించెఁ గొలను లోన
హితులఁ గాంచ నేరక విరహిణుల యోరు
పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన 32
[ఓరుపు+అగలె = ఓరుపగలె; అగలు = క్షీణించు]
ఎగిరెను సాగరమ్ము దన యెల్లల నెల్ల నతిక్రమించుచున్
గగన విహార మోదమున గంతులు వేసెను గోకపక్షులే
యగుపడ నంత పట్టపగలై నిసి చోరుల కెల్ల రేఁగెనే
పగలె, శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా 31
[పగలు = విరోధములు]
నగల యందమితము ప్రేమ నారులకును
మగనిఁ దలతురు నిధి యని మగువ లెపుడు
పండుగ దినమన నొనర్చి వ్రతము నోము
దారమే లేని హారము తరుణి దాల్చె 30
[నోము దారము = వ్రత సూత్రము; వ్రతసూత్రము లేని తరుణి హారము దాల్చె]
వారలు వీరలందున నవారితమై వెలు గొందగా వలెం
దారల వోలె నాదు ముఖ తామరసమ్మని యెంచి యత్తరిన్
భారము కాదు చేకొన నపారము చెల్వము నందుఁ జూడ చే
దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్ 29
[చేదారము = నగలలోని తఱుఁగు]
రిక్త కరద్వయ భజనుఁడు
ముక్తి సతీ కాముకుండు మురరిపు భజనా
సక్తుఁడు జితేంద్రియుండును
భుక్తియె లేనట్టి పరమభోగి యతండే 28
రక్తము ధార వోయ నది లబ్దము రమ్యపు టాస్తి యంత బి
త్రక్తము సంపదెల్ల పర దారల పాలయినన్ వరాంగనా
సక్త వికార చిత్త కృత సంకట సంచయ కారణమ్మునన్
భుక్తి యుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్ 27
[పితృ+అక్తము = పిత్రక్తము: తండ్రి నుండి చేరినది]
తలవాస ముని జనాభయ
తల సంచర! దురిత జలధి తారక! ధరణీ
తల జాత హృదయ చర! కర
తలాభయప్రద! రఘువర! దయఁ జూపుమయా !!! 26
[తలము = 1. అడవి, 2. కారణము, 3. చోటు, 4. అఱచేయి]
దానగుణుండు పవిత్రం
బైన ద్విజ కులోద్భవుఁడు మహా కవులకుఁ బ్రా
చీనుఁడు పెద్దన, భక్తుఁడు
శ్రీనాథుని, కృతిగ మనుచరిత్రయె యొప్పున్ 25
వేనోళ్లం బొగడంగ భూజనులు సంప్రీతిన్ ధరాధీశుఁడుం
దా నత్యంత ముదంబునం దొడిగె నంతన్ గండపెండేరమున్
నానాసూక్తుల నల్లసానికుల రత్నంబాంధ్ర సద్వాఙ్మయ
శ్రీ నాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునుం బ్రీతితో 24
దర్పణ నిభము మనమెంచ ధర్షితంపుఁ
బల్కులను వ్రక్కలగు నింక బాధ కలిగి
దాని కంటె మేలగు నయ్య మేనికి నగు
బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును 23
పాణినిఁ జేకొనంగ దృఢ బంధము పన్నుగ నేర్పడంగ నొ
డ్డాణము గోర నీయ నన డంబపుఁ బల్కులు మాను మంచికన్
క్షోణి తలంబు పైన ననుకూలపు భార్య మనోజ్ఞ భావ వా
గ్బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్ 22
వికటపు టాలోచనలను,
సకలాస్రతతుల, భుజబల శాలుల, సేవా
ది కలాపములం దాతడు
శకునికిఁ దమ్ముండు, కృపుఁడు, సాత్యకి, సుతుఁడున్ 21
సకలము లొక్కనిం బరఁగి సంధిల నచ్చెరువే తలంపగన్
మకుటము లేని రాజతఁడు మా నగరమ్మున నిశ్చయంబుగం
బ్రకటిత మాతఁడే వివిధ భావ గుణమ్ముల నెంచ సత్యమే
శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్ 20
జూద మెంచ రాజ మోదకరమ్మఁట
కైతవమున లేదు కైతవ మఁట
వనిత వలువ లూడ్చఁ బ్రభు ధర్మ మగు నంట
ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల! 19
ముప్పది ప్రాణ ధారణకు మూరిన నిశ్చయమై వివాహముల్
తప్పిన విత్త నష్టములు తప్పక యున్నను నింతు లందునం
గప్పిన ఘోరదుఃఖములు కల్లలు సెప్పినఁ దప్పు లే దిలం
దప్పక సేయునట్టివగు తప్పు లగుం గన ధర్మబద్ధముల్ 18
వడగాడ్పులు తో డుండగఁ
గడు మండుచు సూర్యుడుండఁ గార్యార్థము నే
వడివడి యెండం జన నా
గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే 17
గడుసరి యన్న నాతడగుఁ గాలము నెంచి చరించ నిత్యముం
దడఁబడ నేమి లాభము నిదానము ముఖ్యము సర్వవేళల
న్నుడుపుల తోడఁ బెక్కులట నుండగఁ దక్కినవెల్ల, వీడి యా
గొడుగును పాదరక్షలను, గోరుట యొప్పునె మండుటెండలో 16
మేను పెంచి యింపుగ హనుమానుఁ డంతఁ
బాదములు కుదించి పరిఘ బాహువులను
గిరి తలమున నూని యెగుర విరివి యగుచు
వీచె మంద మారుతము క్ష్మాభృత్తు వీఁగె 15
శోచిత మెంచ నెల్లఱకు శూర వరేణ్యుఁడు ధన్వి విత్తముల్
దోఁచగఁ దారసిల్ల వని దొంగలు నల్పుల బారి నుండి తాఁ
గాచఁగ లేక యర్జునుఁడు క్రమ్మఱె యాదవ వృష్ణి కాంతలన్
వీచిన మందవాతమున వీఁగెను శైలము దూది భంగినిన్! 14
అనితర సాధ్య ధనుర్భం
గ నినాద భరిత చలిత దిగంతక్వణనున్
మనువాడు మనుచుఁ జెప్పెను
జనకుండని, పెండ్లియాడె జానకి రామున్ 13
జననము దైవసంభవము సాగును మృత్యువు దైవికంబుగన్
మనువది సేయ నేర రసమాన నరాధికులున్ యథేచ్ఛగన్
ఘన విపినాంతరమ్మునను గష్టము లోర్చి వినోద మోద సం
జనకుఁ డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామువిన్ 12
రోమపాదు పెంపుడు కూతురు విను శాంత
రామునకు సహోదరి గదా, రమణి సీత
రఘుకులాబ్ధి సోమునకు భార్య యగు నయ్య
ధీర వరులు కుశలవుల వీర మాత 11
హైమ సుహార దామ సుగళావృత జానకి ధర్మ పత్నియౌ
రామునకున్, సహోదరి ధరాసుత సీత గదా తలంపగ
న్నా మిథిలా పురాధిపతి యౌవన పుత్ర కుశధ్వజుండు ను
ద్దామునకుం బ్రియంబుగ విధాతృ వరంబున నిశ్చయంబుగన్ 10
[జనకమహారాజు సీరధ్వజుని కుమారుఁడు కుశధ్వజుఁడు]
జంకరు మనమం దిసుమంత జాతకమున
నీచదశ నంది సజ్జనుల్, నీల్గుచుంద్ర
సహనులై నీచులెల్ల భృశ మది చూచి
భేద మదియ యిరువురకు వింత యేల 9
తోచక యేమియున్ మదిని దుఃఖము నాపఁగ లేక దుర్జనుల్
నీచదశస్థులై సతము నీల్గుచునుందురు, సజ్జనుల్ భువిం
జూచిన ధైర్యవంతులు నశోక మనస్కులు దాల్తు రింపుగన్
వీచిన గాలి మిక్కుటము వీగునె శైలము మ్రాను భంగినిన్ 8
సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక:
లేమా! యరసున్న నిడగ
లేమా? మరచినఁ గలుగునులే వగ పయ్యో
రామా! మారదె యర్థము
రామా యన బూతుమాట రమణీ వినుమా! 7
(“రామా యనఁ బూతుమాట రమణీ వినుమా” లో
అర్థానుస్వారము మరచిన “పూతు మాట” (పవిత్రుని మాట)
కాస్తా “బూతు మాట” అయ్యిందని భావము.)
సకల సద్గుణ భాసిత చంద్ర వదన
సమద గజయాన మిథిలేశ జనక తనయ
ధరణిజ విశాల నేత్ర సీతా సతీ మ
తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె 6
ఉల్లము నందు శంభుని మహోగ్రుని సన్మతిఁ దల్చి భక్తి శో
భిల్ల ససంభ్రమమ్ముగను భీతిల సీత విశిష్ట సాధ్వి యా
విల్లును బాహు సత్వమున భేదన చేసి జగత్రయమ్ములం
దల్లికి, తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్ 5
అతి రథుండు ద్రుపద సుతుఁ డు ధృష్టద్యుమ్ను
డరి నిషూదనుండు నవని జాగ్ర
జుండు గాండివ భుజ మండితు జితవైరి
పార్థుఁ డర్జునునకు బావ మఱఁది 4
వ్యర్థము లౌనె యబ్జ భవు వ్రాతలు ధారుణి నెన్నఁ డైన ను
న్నర్థము వాని జన్మమున కవ్వఁగ ద్రోణ వధార్హుఁ డయ్యె ని
స్స్వార్థుఁడు ధృష్టకేతునకు జన్యుఁడు సోదరుఁ డౌటఁ గృష్ణకుం
బార్థుఁ డనంగ నర్జునుని బావమఱంది సుమీ తలంపఁగన్ 3
ఆ ఋషులు నల్వు రప్పుడు
నారద మునిసత్తమునకు, నలువురు భార్యల్
నీరీయఁ గడిగి పదముల
పార ముదమ్మునఁ గొలిచిరి పరమాసక్తిన్ 2
నారద! మౌని ముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులు
న్నేరనఁ బల్కె భాగవతుఁ డింపగు మాటల నిశ్చయంబుగన్
ఘోర మదమ్ము లోభమును గోపము మోహము దా భరింపగన్
ధీర తపమ్ము చేత నిలఁ దీరును దార లనంగ వాటినిన్ 1