26, డిసెంబర్ 2019, గురువారం

మాయా జాలము

మాయా జాలము
(అష్టాదశ శంకా నామికా ఖండిక) 




వాయు వహ్ని తోయములకుఁ బాద పాద్రి
జలచర విహగ నర జంతు జాలములకుఁ
గాంచ నాధార మీ భూమి క్షమను మిన్న
దాని కాధార మెద్దియో తలఁచ నగునె
1.      


సంతరించును జిఱు విత్తు సాలరూపుఁ
జాల నిద్రించి పుర్వగు లీలఁ జిలుక
గ్రుడ్డు పగులఁగ నగుఁ బక్కి గూటి లోన
మఱి పురుడు పోసె వాటి కే మంత్రసాని
2.     


తోయ మాక్రమించెఁ పుడమి హాయిగాను
మూడు వంతులు చుట్టును ముచ్చటగను
భూమి గిఱ్ఱునఁ దిర్గుచుఁ బోవుచుండఁ
దొనఁక దిసుమంత వింతగఁ దోయ మేల
3.     


బళ్లు తెప్పించి పయనించఁ గీళ్లు నొచ్చు 
యోడ లందు బోనెంచిన నొళ్లు తూలు 
గగన యానమ్ము సేయంగఁ గాళ్లు లాగు 
భూమి యానము నెఱుఁగమే యేమి వింత 
4.     


కాన రానంత చిన్నవి కలవు కొన్ని
కొండ కన్నను బెద్దవి కొన్ని కలవు
నేల నీట నింగి చెలంగి నివ్వటిల్ల
నంతు గాంతుమె విశ్వంపు వింతలకును
5.     


పంచదారను గని చీమ పంచఁ జేరు
మాఁగ నింట మామిడి పండు మూఁగు నీగ
యప్పు నిండఁగ గుంటను గప్ప సేరు
మేటి విద్య లబ్బె నెటుల వాటి కిట్లు
6.     


సందు లేనంత కోటను గందిరీగ
తేనె లూరు మైనపు టిల్లు తేనెటీఁగ
మేలు వల నోటి నూలున సాలెపుర్వు
కట్ట విశ్వము వింతల పుట్ట కాదె
7.     


పుట్టు టేరికి నెక్కడ గుట్టు సుమ్ము
గిట్టు టెట్టుల నెన్నడు గుట్టు కాదె
యెట్టు లుండును నడిమిని  గుట్టె యౌను
గుట్టు లేరికి  నెన్నడు పట్టఁ దరము
8.     


ఉన్నవి మృతికిఁ ద్రుటి ముందు నన్ని బొంది
నున్న వన్నియు మృతికి ముందున్న వెల్ల
జన్న త్రుటికిఁ బిదపఁ గూడ వన్నె తోడ
నేది లోపించె నీకట్టె నేరి కెఱుక
9.     


పాఱు నంతరిక్షమ్మున మీఱి యినుఁడు
కృష్ణ బిలరాశి చెలరేఁగుఁ దృష్ణ తోడఁ
జెంతఁ జేర నన్నియుఁ బోవు నంతు లేక
కారకుఁ డెవండు ధరలోన నేరి కెఱుక
10.   


ఉంచుఁ బిల్లను దన పొట్ట సంచి నొకటి
చెట్టు లెక్కు నొకటి పిల్ల పట్టఁ బొట్ట
గొయ్యి త్రవ్వి గ్రుడ్డుల నుంచు నయ్య యొకటి
యెట్టు లీ విద్య లబ్బెనొ గుట్టు కాదె
11.    


ఱాతి నడుమున జీవించుఁ బ్రీతిఁ గప్ప
పండు లోపల నక్కి పుర్వుండుఁ జుమ్ము 
వాన రాఁబుట్టు మట్టిలో వాన పాము
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు
12.   


పూసి రెవ్వరు రంగులు పూల కెలమి
నేల వాసన లీనును బూలు కొన్ని
యిచ్చి రెవరు ఫలములకు మెచ్చి రుచులు
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు
13.   


అణువు నందుండు వేర్వేఱు కణము లంట
బిందు వుండు నంట నడుమఁ గందకుండఁ
జుట్టు తిరుగంగ నవి యెల్లఁ బట్టు పట్టి
యెవ్వఁ డట్టులు గూర్చెనొ యేరి కెఱుక
14.   


కంటికిం గాన రాకుండు గాలి యెపుడు
నొంటికిం దెలియని శక్తి మంటి కుండు
నంటి నంతఁ గాల్చు ననల మొంటి నెల్ల
నెట్టు లేర్పడె నివి యెల్ల నేరి కెఱుక
15.   


అంద దేరికి నెన్నఁడు నాకసమ్ము
నీర మిల మూడు వంతులు మూరి యుండు
నాకమున నీరు వాయువై వీఁక నుండు
 నెవ్వఁ డుంచెను వీటిని నేరి కెఱుక
16.   


కాళ్లు లేనివి యున్నవి కాంచఁ జగతి
కాళ్లు రెండుండు నరులకుఁ గాంతలకును
నాలు గాఱు మించియుఁ గాళ్లు నేల నుండు
నేల జీవుల కీ భేద మేరి కెఱుక
17.   


నేను నేనంచు నెల్లరు నిక్కు  చుంద్రు
నా శిరమ్ము నా కన్నులు నా మన మని
కలవరించు చుండంగ నా కాయ మందు
నాది నాదన్న దానిలో నేది నేను
18.   




ఇది యష్టా దశ శంకావృత మాయాజాల నామికా ఖండిక.
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము.

1, డిసెంబర్ 2019, ఆదివారం

సమస్యాపూరణ_డిసెంబర్ 2019

అంతము సేయుమ కోపము
సాంతము విలయ మగు మానవాళి వసుధలోఁ
బంతము ప్రత్యపకారపుఁ
గాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే                                                                                         61

వింతగ నూత్న వత్సరము వేడుక మీఱఁగఁ బ్రీతిఁ జీరుచున్
శాంతియు సౌఖ్య సంచయము సక్క నొసంగఁగ నెమ్మి వేడుచున్
స్వంత సహస్ర యుగ్మ పర సప్తదశోత్తర యుగ్మ నామపుం
గాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్                                                          60
[సు + అంత = స్వంత; మంచి యంతము గలది, బాగుగా ముగిసినది] 

కవివరు నిజ విద్వత్పా
టవ సంవీక్షణ మతిం గుఠార ప్రహ రా
భ విశిష్ట ప్రాస నొసఁగి
యవధానిని రాజమండ్రి యడలం జేసెన్                                                                                       59

కవి శార్దూలము సాన్య ధీ వితతి సత్కారార్థ చింతా మతిన్
ఛవి సంపూరిత పద్య భేషజ రసక్షారప్ర భోన్మత్తతన్
దివికిం బంపఁగ నెంచఁ బౌర మృగముల్ దీనార్తముల్  పాఱఁగా
నవధానం బఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్                                                        58

క్రూర వృత్తిని విత్తము కూడఁబెట్టి
ద్రోహ చింతల జనులను దోఁచుచుండి
దాన మొనరించ నరకమ్ము దాఁట లేడు
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు                                                                                           57

పడయఁగఁ బుణ్య లోకములు భార్యలు కారణ మౌదు రేరికిన్
నడపుచు ధర్మ మార్గమున నందన కారక పుణ్య శీలలై
కడు వెడ మాటలాడుచును గాఁక నొసంగఁగ నేడ్చుచుండఁగాఁ
బడఁతులు, పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్                                                     56

శుక్రాచార్యుని విన్నపము:
ఈ నాపల్కులు వినుమా
దానార్థి రమా ధవుండు దనుజా భూమిం
గానక యున్నది యెల్లయు
దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్                                                                                55

ఏనుఁగు నాల కించమె యహీన బలమ్మున విఱ్ఱ వీఁగియుం
గానన మందుఁ  బొందుటను గష్టము లక్కట చిత్తమందుఁ దా
నూనిన దైవ భక్తిని మహోరగ నక్ర విహార వారిలోఁ
దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్                                                               54
[వారిలోన్ + తానము = వార్ధిలోఁ  దానము] 

బాలు నుంచ మింకఁ జాలు నీ ఘోరమ్ము
మేలుకొంటి మిపుడు కాల మెఱిఁగి
మాఱె రోజు లయ్య మా బిడ్డ చక్కంగ
బడికిఁ బోవువాఁడు పనికి రాఁడు                                                                                               53

గడగడ లాడు దేశములు కైతవ మెల్లెడ వ్యాప్తిఁ జెందగం
దడబడు మాటలెల్లయు వృధా యగుఁ గార్యము లెల్ల వారికిన్
విడువక దుష్ట కార్యములు భీతి నొసంగెడు క్రూరు మూర్ఖు నే
ల్బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్                                                         52

పుడమిని జీవ హితార్థము
నడరెడు సన్మతము మానవాళికి వలయుం
గడు నాంక్షలు వెట్టు మతము
చెడు, మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో                                                                      51

ఇడుముల బారిఁ దూలిన నహీన ధృతిన్ ధరియించి చిత్త మం
దడలును బాసి వాటి నిఁక దాటు విధమ్ముల నెల్ల నేర్పుచుం
దడయక భవ్య జీవన విధానము సూపుచు మానవాళిఁ గా
చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్                                                50

కాకు విరాగివి తీరును
శోకములు ముదమ్ము లొదవు సూర్యోదయమే
నాకము నందు నశించఁగఁ
జీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే                                                                                 49

కూఁకటి వేరు లెల్ల భువి గూలిన చందము జంతు కోటిలోఁ
బ్రాకట మౌను జావు గన రాదిక శోకము నందు మున్గఁగా
రాకలు పోక లెల్ల నవిరామము కల్గును భావి యింక పెం
జీకటి యే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా                                                       48

ఊరఁ గుక్క లున్న నొప్పు నుండఁ దగునే
యౌర జంబుకమ్ము ఘోర మయ్య
క్రూర రీతి నక్క కూయఁగ రేపు మా
పూల వలనఁ జెడెను పుష్పవనము                                                                                        47
[మాపు + ఊల = మా పూల] 

ఆ వనజాక్షు సంతత దయార్ద్ర నిరీక్షణ కారణమ్మునం
బావన పూరుషుం డితని పాప మణంగి తరించు నెన్నఁడో
వావిరి బాధ నొందగను బాపమ యాతని జంట కన్నులం
బూవుల వల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్                                                       46

మానసముల నలరించ మ
హానగరము లందుఁ గాన నట్టి, ప్రకృతికిం
గాననమున నేరివి లే
వానలు, లేకుండ మెట్టవరి ఫలియించెన్                                                                                   45
[లేవు +ఆనలు = లేవానలు; మెట్ట వరి = గడ్డి] 

కానక మీన మేషములు కర్జము పై నిడి దృష్టి నంతటిన్
మే నలయంగ యత్న మది మీఱఁగ బంధు సమిత్ర కోటితో
మానక పట్టు నింపుగను మళ్ళుగఁ దీరిచి బావి నీటితో,
వానలు లేక, మెట్ట వరి బాగుగఁ బండెను వైపరీత్యమే                                                                 44
[మెట్ట(న్) = త్రొక్కఁగా; బావి = చెఱువు]

పెం గ్లిష్టంబౌ యీ పని
కిం గ్లిన్నుఁడ నయితి మీర కేళిని నీ తొ
ట్టిం గ్లిన్నము లయి తిరుగన్
బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్                                                                                   43
[కొలను వంటి తొట్టి]

నం గ్లేశాత్మునిఁ జేయ నెంచితిరి విన్నాణమ్ము మీఱంగ భ్రాం
తిం గ్లాంతార్తుఁడ నైతి శబ్ద మిది యే దేశంపు సుద్దౌనొ యా
యాంగ్లే యాగమ కారణమ్మున నహో యైనట్టి వంగక్షితిన్
బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్                                                           42
[ బంగ్లా = బంగ్లా దేశము]

కొలఁకులఁ దామర తండ
మ్ములు వికసించఁ బ్రవిమల నభోమార్గములో
నలయక ధిక్కారమ్మునఁ
జలిపులిఁ గని, వేవెలుంగు చయ్యనఁ బాఱెన్                                                                               41

నలుదిశ లందుఁ గ్రమ్ముకొన నాకము నంటుచు నంధకారమే
వెలవెల వోవ పద్మములు పిన్నలు పెద్దలు చూచు చుండగం
గలవర మంది యబ్బురముగం బగ లక్కట సైంహికుండు గ్రొం
జలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్                                                           40

దారుణమై కన్పడఁ బగ
వారాక్రమణ మొనరించఁ బట్టణ రత్నం
బౌరా నాలుగు వైపుల
నారీమణి యొకతె చూపె నాలుగు కు చముల్                                                                           39
[కు చమువు =చెడ్డ  సేన]

పృథు చక్రవర్తి గో రూపిణి యగు భూమి వలన నోషధులఁ బిదుకు సందర్భము: 
పారావార పరీత మానవ గణాపారవ్యథా తప్త భూ
చోరస్తోమ కృతాపకార చలితక్షోభార్తి సంతప్త దా
నారాటమ్మును మాని భూసతియె గోవై పృథ్విలాభర్తకున్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్                                               38
[పృథు + ఇలాభర్త = పృథ్విలా భర్త: పృథు చక్రవర్తి]

తెలతెలవాఱ దిగంత
మ్ములు చెలరేఁగి పొడవంగఁ బుణ్యాద్రి వెసం
దలుకునఁ దామర, లేడ్వం
గలువలు, వికసించె రవినిఁ గాంచి ముదమునన్                                                                       37
[అద్రి = సూర్యుఁడు]

కలువల జంట కన్నుగవ గాఁగ శశాంకుని బోలు మోముతో
వెలుఁగుచు భక్తి తత్పరత విష్ణు మనోరమ లక్ష్మి నెంచుచుం
జెలియలు నోము నోచుకొని చెన్నుగ నక్కకుఁ బ్రేమ తోడ రూ
కలు వలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్                                                 36
[వలువు = వస్త్రము;  భాస్కరునిఁ గాంచిన వెంటనె : ఉదయము కాఁగానే]

కాలాతీతం బాయెనె
యేలా రాదింకఁ బెయ్య యిట్లేడ్వంగన్
వాలము నూపుచు వడి శా
ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్                                                                            35

ఏలిక లంద ఱాశ్రయము నీయ నరణ్యము లందుఁ జెట్టులం
గూలఁగఁ జేయఁ గ్రూర మృగ కోటి చరించ విచిత్రమే పురిం
జాలిఁక వ్యాఘ్ర ఘోరములు చాలిఁకఁ జావులు దాని కే మిఁకం
దూలము, పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై                                                  34
[ఇఁకన్ + తూలము = ఇకందూలము]

ఎక్క డైన నేమి నొక్కి వక్కాణింతు
మెక్కఁ బొక్కు దీవు మిక్కుటముగ
వెక్కసంబు నైనఁ జక్కెర లేని కా
మితము గాని తిండి మేలు సేయు                                                                                          33

సతతం బచ్చట క్షాళనమ్ము తనరం జక్కంగ ధూపమ్ము నం
చిత రీతిం బరగంగఁ జేసిన దినన్ క్షేమంబె సత్యమ్ము భా
సిత శుద్ధస్థల మున్న నొప్పు గద యాసీనార్థ పీఠమ్ము ని
ర్మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్                                                    32

తూఱు నక్కట పాములు మీఱి చీమ
లల్లఁ బుట్టలు మిట్టల యందుఁ బ్రీతి
నిజ గృహములకు నెన్నఁడు నిజము వర ల
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు                                                                            31
[లత = చీమ; చెవి = తాళపుఁ జెవి] 

అల యవ్వేళ వధింపఁగా నరకు విశ్వాత్ముండు కృష్ణుండు నే
డలరం బండుగ భూజనప్రతతి యాహ్లాదంబుగాఁ జేయ భూ
తలమం దెల్లను నిండ శబ్దములు సంత్రాసంపు ఘోరంపు మ్రో
తలకుం గర్ణము లుండవం చన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా                                                       30

కాయము నొవ్వంగ నుపా
ధ్యాయుఁ డకట దృష్ట దోషుఁ డౌచలిగి బృహ
త్కాయుం డే నిత్తును దొడ
పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్                                                                                  29

ఆయత విత్త రాశుల మహావిభవమ్ములఁ దేలి యాడుచుం
దోయపు వారి యిల్లులఁ  బ్రతోషముతో భుజియించు వారలం
బాయస మింపుగా నునిచి పాత్రను దెచ్చుచుఁ బాత్ర పీత రూ
పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్                                                       28
[పీతరూప +ఆయసము = పీత రూపాయసము; ఆయసము = ఇనుము]

కాంచన నయనుండు కాంచనకశిపుఁడు
ఘోర రావణుండు కుంభకర్ణుఁ
డు శిశుపాలుర గనుఁడు మఱి దంతవదను
బగను మున్గ నడఁగుఁ బాపచయము                                                                                    27

ఖగ రాజేంద్రు పయిం జరించు హరి విఖ్యా తాంఘ్రి యుగ్మంబునం
దగ జన్మించి త్రిలోకచారిణియనన్ ధాత్రిం బ్రవేశించి చా
గఁగ వేగంబుగఁ బ్రీతిఁ గొల్చుచు మదిన్ గంగాసరిత్తుం దరిం
పగ లో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్                                               26

ధర్మ యుతము వొందఁ దగు వైభవమ్ముల
నుత్తముం డనఁబడు నుర్వి వీడ
నర్థ మందు నాస స్వార్థ రోష దురభి
మానహీనునకు నమస్కరింతు                                                                                            25

ఈ నరపాల వర్గమున నేను విధేయతఁ జూపి నెమ్మదిన్
దాన దయాది లోక శుభదాయక రక్షక కర్మ కోటిలో
ధ్యానము నుంచు సంతత మధర్మ విరోధికి గర్వ మంగుళీ
మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో                                                         24

ఇష్ట మున్న నింద యిచ్చును మందహా
సమ్ము సుద్దు లన్ని సమ్మతింత్రు
కాని వారి వినరు కమ్మని మాటైన
గడ్డిపోచ చాలు కలహమునకు                                                                                             23

ఇల సుఖ దుఃఖ యుగ్మముల నెంచు సమానవిధమ్ము బుద్ధిమం
తులు వర సంయమీంద్రులును దూలరె యింద్రియ వశ్యు లందునే
విలయ విధాయ కాసహన భీషణ దుర్జన గీఃప్రవాహమే
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే                                                            22
[ లేచెడున్ గడ్డిపోచయే= గడ్డి పోచయే లేచును]

గుప్త దానము ధరలోన గొప్ప సుమ్ము
దాని నెంచి వాఁ డెంచెను వీని నిజము
నా కెఱుక యా ధనము నిచ్చె నాకుఁ  దాను
దాత యనఁబడు దాత తా దాత గాఁడు                                                                                 21
[తాను + తాత = తాను దాత] 

ఏ తరి దాత లుందురు గ్రహీతలు లేక గ్రహించ నింపుగన్
దాతయు మాఱఁగా నగును ధాత్రి గ్రహించెడు వానిగాఁ జుమీ
భూతల మందుఁ బుచ్చుకొను పూరుషు లుందురు సంతతమ్ము నా
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో                                                        20
[ఆదాత = గ్రహీత ]

పాదరక్షలు నన్య భావరతి వీడి
యనవరతము చేరవలె దేవాలయమ్ము
సిగ్గు మానము దర్పము లొగ్గి సాని
మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు                                                                                 19

తోడుగ రావు సంపదలు తూలఁ గళేబర మెట్టి వారికిం
బాడిగ నీషణత్రయము భావన సేయఁగ మెట్ల గుంపుగన్
వీడిన కాని చిత్తమున విష్ణు పదాలయ లబ్ధి లబ్ధమే
మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్                                                      18

ఓ మిత్రోత్తమ భద్ర
మ్మేమఱకుండుమ సతమ్ము నీ దుష్టున కీ
వీ మనుజుం డకటా స
త్కాముండే దున్నపోతు గణపతి! కపియౌ                                                                           17

పాము విధమ్ము నుండు జన వారము నిత్యము వెంట నుండగా
నీ మతి హీనకార్యముల నెంచి మనమ్మున విఱ్ఱ వీగుచున్
దోమ తెఱంగు బాధ లిడు దుష్ట మనో౽క్రమ విత్తరాశికిన్
గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తియౌఁ గనన్                                             16
[గణనాథుఁడు = దళపతి]

వింత ప్రశ్న గాదె వేయంగ నివ్విధి
యమున కగును బూది యగుట యెపుడొ
యనఁ బ్రళయము జగతి నరుదెంచు నప్పుడ
తప్ప కుండ నౌను దర్క మేల                                                                                            15

అమల మనస్కు లందఱు మహా విభవమ్ములు పొందకున్ననున్
సమల మనస్కు లెల్లరును శార్ఙ్గధ రాగ్రహ పాత్రులే చుమీ
విమతి దశాననుండు భుజవింశతి సన్నత వీర్య వచ్ఛిరో
యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్                                             14

బింకముతోఁ బర్జన్యుఁడు
నంకమున నెదిర్చి యోడ యదునందనుఁడే
శంకలు మానుమ కీర్తిత
శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్                                                                      13
[ఉమ = యశము]

సంకట సంచయా పహర సన్నుత నిర్జర సేవితాంఘ్రియుం
బంకజ లోచనుండు వరపార్థ దృశానుఁడు వాసుదేవుఁడే
కింకర విప్ర భక్త ముని కీర్తిత హర్షిత నీరదప్రభా
శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్                                                    12
[శంకరుఁడు = సుఖముల నొసఁగువాఁడు; అంబ = అమ్మ, సత్యభామ]

పాడుచుఁ బాటలు త్రాగుచుఁ
గూడి తినుచు నుండఁగా సఖులు మోదముగా
వేడిగ నున్న వడి వడిఁ బ
కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్                                                                                 11

వేడుక నుండ నెల్లరును వేగమ దూఱి గృహమ్ము లోనికిం
బాడిగ ధాన్యరాశి పయిఁ బర్చగ నింపుగఁ దాటి యాకులన్
మూడుర దాని కింక నిట ముందుగఁ బాదపు గోటిఁ దన్ని యా
కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్                                                      10
[ఆకు + ఓడి = ఆ కోడి; ఓడి = నీవార ధాన్యము] 

కాననమున వర ముని నికాయమునకు
భద్రత నొసంగు రఘు రామభద్రు నునికి
వర జనస్థానమున దైత్య వరుల కెల్ల
రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె                                                                                 9


సతతము చోరభీతి మఱి చాగును మోసము  చూచుచుండ గ్రూ
రత దివిఁ దాఁకు నెల్లరకుఁ  బ్రాణ భయమ్మును మాననాశమున్
వెత లవి చెప్ప నేల నట వెంగలు లెల్లరు రాజ్య మేలగన్
బ్రతుకిది రామ! రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్                                                     8

కవి వాచస్పతులఁ గొలిచి
కవి పదముల సంస్మరించి కమనీయంబౌ
కవి సంయమి వ్యాసుఁడు భవ
కవి నాశక భారతముఁ బ్రకటితము సేసెన్                                                                             7
[కవి = 1. శుక్రుడు, 2. వాల్మీకి, 3. కవి, 4. సంకెళ్ళు]

కానము మాన విహీనుల
నీ నగరమ్మున వసించ నివ్విధి మునులన్
నే నిది నమ్మ నెపుడు నే
సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్                                                                               6

ఆ నలినాక్షు నచ్యుతు ననంతుని భక్త వహించి కొల్చుచుం
గానల నుండి సంతతము కాయల దుంపల నారగించుచున్
మే నలయంగఁ  జిత్తమున మించి తలంచుచు ముక్తికన్య నా
సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్                                                   5
[సాని = అధిపురాలు]

గుండు కన్న మిన్న మొండి ఘటము జాలి
గుండు సున్న సుమ్ము పొండు వాని
చెంత కేఁగ కుండు వింత గుండె తెలియ
కుండ లోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు                                                                                      4

మెండుగ ఱెక్క లుండగ నమేయ రయమ్మున జంతుజాలముం
బిండి యొనర్చుచుండ బలభిత్తునిఁ జూచి భయమ్మునంది యు
ద్దండుఁడు గాలి వీవ వడిఁ దర్షము నందు నగారి గాన లే
కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా                                                    3

వేడి యైన నేమి వింత శీతల మైన
నేమి తియ్య నైన నేమి చేదు
నైన నేమి యింద్రియమ్ములు లేకున్నఁ
జూడఁ జూడ రుచుల జాడ యొకటె                                                                                       2

బోధన మందు నందఱును బూర్ణ వివేకత నుందు రక్కటా
బాధలు వారి ముంచ నిఁకఁ బాటవ మెల్లయుఁ దెల్ల మౌనులే
యీ ధరఁ గష్ట కాలముల నెట్టి మనుష్యులు నట్టులే చుమీ
శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా                                                1

1, నవంబర్ 2019, శుక్రవారం

సమస్యాపూరణ_నవంబర్ 2019

విడ్డూరము నీ వన నది
యొడ్డున వన భోజనమ్ము లుండఁగ మనకే
మడ్డము చెడ్డ జనాళికి
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్                                                                                60

దొడ్డతనంబు వా రిడఁగ దొడ్డగు గడ్డను దుడ్డు లీయకే
గడ్డు దినంబు లందకట కన్పడఁ బచ్చడి పప్పుతో నిటన్
గడ్డ పెరుంగు దప్పళము కమ్మని కూరలు నప్పడమ్ములున్
వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె! తినందగు నిర్భయమ్ముగన్                                                 59
[పగవాఁడె! కాదు] 

అప్పుల బడబాగ్నిఁ గనమె
యొప్పదె దావానలమ్ము నుర్విన్ రేగన్
గుప్పున శిలాద్రవం బట
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్                                                                            58

ఆహా యెంతటి వింత సృష్టిఁ గన గోత్రారణ్యవారాశులన్
బాహాటమ్ముగ నా పరస్పరపు సంబంధంబు జీమూత సం
దోహప్రాంతము నందు లోయ దరి నుత్తుం గాద్రి కన్పించఁగా
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్                                                    57
[నీహారాద్రినిన్ +ఇప్పు = నీహారాద్రిని నిప్పు; ఇప్పు (విప్పు) = విడఁదీయు]

సంచుల నిండ ధనమ్మును
బంచ జనులకు దిగు లొంది బంధువు లనఁగా
వించు ముఖచ్యుతపుఁ బలుకు
మంచము, క్రిందన్ జొరఁబడె మానధనుండే                                                                       56
[మంచము = పోషించము]

మించిన దొడ్డ మెర్ములను మేదిని యుర్ముల దద్దరిల్లగన్
ముంచుచు నెల్ల దిక్కులను భూతల మందుఁ బడంగ వర్షమే
కంచెకుఁ బ్రక్క నిద్రకు సుఖమ్మిడ వేసిన తల్పరాజ మా
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై                                                 55
[మంచము = మంచె]

త్విట్పింగ సిత వరాంభో
రుట్పావన కౌసుమమ్ము గ్రోలుఁ దమిని భూ
రుట్పతిత సుమములం గని
షట్పద మొనరించు నొక్కొ ఝంకారమ్మున్                                                                     54
[త్విట్పింగసిత  = ప్రకాశమానమైన గోరోజనము, తెలుపు 
రంగులుకల; అంభోరుట్ = తామర; భూరుట్పతిత = 
చెట్టునుండి రాలిన]

త్విట్పతి మండ భీతిలును వీచును గాలియు మంద రీతినిన్
విట్పతి రాజ రాజునకు వీర వరేణ్యుఁడు తిర్గుచుండగా
రాట్పుర నంద నోపమ విలాస వనాంతర సంస్థితమ్మునౌ
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్                                           53
[త్విట్పతి = సూర్యుఁడు;  విట్పతి = అల్లుఁడు; రాట్పురము = రాజనగరము]

భాతి వెలుంగుచుఁ దారా
వ్రాతము గగనమున దీప్తివంతము కా సం
ప్రీతి నొసఁగ భూజనులకు
రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై                                                                        52
[రాతిరి భాస్కరుఁడు = రాత్రిఁ గనిపించు సూర్యుఁడు, చంద్రుఁడు]

వేతన మెంచఁ బోకు మవివేకిగ జన్మము సార్థకం బగున్
భూత గణాధినేత సుర పుంగ సమర్చిత పార్వతీ ధవుం
జూతము చంద్రశేఖరునిఁ జోద్యము మీఱఁగ నిల్చి వెల్గుచున్,
రా, తిరి యందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్                                             51
[తిరి =జట] 

పరమాత్ము నుంచి యెడఁదను
ధరణీశుఁడు విక్రముండు ధైర్యముతో శాం
కరి బలము దక్క సైన్య ని
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్                                                                          50

కురుబల మెల్లఁ దల్లడిలఁ గుంతికి నిష్టుఁడు ఖడ్గ వీరుఁడే
భరత కులాగ్ర శేఖరుఁడు భండన దిక్కరి వానిఁ గాంచు మ
ద్దరి నకులుండు ధర్మజుని తమ్ముఁడు వీరుఁడు దాఁ దలంచ దు
ష్కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో                                          49

వాత్సల్య పూరితాత్ముఁడు
తాత్సారం బింత యేని తాల్చని వాఁడున్
సత్సంగుఁడు దూరీకృత
కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్                                                                        48
[గురువు = కులముపెద్ద] 

కృత్స జగద్వివేక వరకీర్తిత మానధనుండు సద్గుణా
దిత్సువు సూత వంశజుఁడు దివ్య మునీంద్ర నికాయ పూజ నా
ర్హత్సమ రౌమహర్షణి పురాణ విదుండును గాంచ జాతిలోఁ
గుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్                                          47
[సద్గుణ + ఆదిత్సువు = సద్గుణాదిత్సువు; మంచి గుణములను గ్రహింప 
నిచ్ఛ గలవాఁడు] 

సమద గజయాన వేషమ్ము చాలు నింకఁ 
జిగురుఁ బోఁడి నీ వనిశమ్ము చిత్త శుద్ధి
నువిద సత్యంపు సద్భక్తి నుంచు ములికి
కలికి! శివపూజఁ జేయకు కార్తికమున                                                                          46

ఫలితము నుండ నెంచినను బద్మసులోచన  సుంత విన్ము శీ
తల సలి లావగాహనము తప్పక చేసి విశుద్ధ వస్త్రవై
నెలకొన భక్తిచిత్తమున నిష్ఠగ నీ వుపవాస ముండకే
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్                                              45

సుస్తుత కావ్యము నరసి ప్ర
శస్తమ్ముగను గుణ దోష సంశోధనలం
బు స్తక మందలి భావపుఁ
బుస్తక! చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్                                                           44
[పుస్తు +అక = పుస్తక; పుస్తు= కంపు; అక =అక్క]

శస్తపు పండితబ్రువుల శాశ్వత కీర్తి సమార్జ నార్థమై
మస్తక మందుఁ గల్గ ననుమానము మంచి దనంగ నిత్తరిం
బుస్తక చౌర్యమే, యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్ 
విస్తృత భావ శబ్దముల వెల్గిన కావ్యపు సృష్టి కర్తలన్                                                      43
[అనుమానము = ఊహించుట]

ఆజ్ఞలఁ బరిగణించఁ డహరహ మందు
విజ్ఞులందు భక్తిఁ జనఁడు వినయ మరుదు
ప్రాజ్ఞు  లన విందు నే నిల ప్రముఖ శూన్య
విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్యవిముఖుఁ డెపుడు                                                                   42

జనహర్షప్రద సత్ఫలప్రద సవాంఛాజాల సంయుక్తమౌ,
ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా, కర్తవ్య నిర్వాహమే
జన సంత్రాస నిబద్ధ జాతఫలవాంఛా జాల సంయుక్తమౌ,
ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా, కర్తవ్య వైముఖ్యమే                                                 41

వితత కలు షాబ్ధి జల సం
ప్లుత ఘోర నరాధమ కృత బోధనములు కు
త్సిత చిత్తుల, పాటించక
హితబోధల,  వినెడివారికే కీ డొదవున్                                                                           40

ధృతి యుక్తమ్ముగ నిత్య కర్మముల నిర్దేశమ్ము సంధానమున్
మతి నూహించి స్వయమ్ముగాఁ దివిరి సన్మాన్యుండ వర్తించుమా
సతతక్రోధ మనో౽వివేక  ఖర శంసా స్వార్థ చింతా ప రా
హితబోధల్ వినువారికే యొదవుఁ గీ డెల్లప్డు యోచించినన్                                               39
[పర+ అహిత బోధల్ = పరాహిత బోధల్] 

శత్రు రాజు లడరి సంగ్రామ మొనరించ
సప్త సప్తి వంశ చక్రవర్తి
బాహుకుండు భీతిఁ బాఱఁగ నిఁక రాజు
రాజధాని లేని రాజ్యమయ్యె                                                                                         38

రాజ్యము గీజ్యమున్ ధర నిరంతర ముండునె యెట్టి వారికిన్
భోజ్యము శక్తి వంతులకుఁ బోరున గెల్చిన వేళ శత్రు దు
ర్భాజ్యము మున్ను నేఁ డకట భద్రపు శాంతము, పోయు వారు వా
రాజ్యము, రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో                                                    37
[వారు +ఆజ్యము = వా రాజ్యము] 

వీటి కెల్ల గొప్ప పేరున్న వైద్యుఁ డి
తండు చేతి వాసి మెండు కూడ
వీడు మయ్య చింత నే డిఁక నీకున్న
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది!                                                                             36

ఈ ధర లోన సంతతము నీసు నసూయయు నాశ లెంచఁగా
బాధల కెల్ల హేతువులు వాటిని గెల్చిన దక్కు సౌఖ్యముల్
క్రోధుని మూర్ఖశేఖరుని కుత్సిత సంచిత దుష్ట వాద దు
ర్వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్                                       35

ధైర్యము చాలక నిత్యము
కార్య వినాశిని విరుద్ధ కథన నిరత నా
యార్యోద్దాలకుఁ డడలున
భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్                                                                        34

పనులఁ జెలంగు నిత్యమును భర్త వశానుగతైక నిష్ఠ స
జ్జన గణ గౌర వాయత యశష్ఫల సంచయ మోద చిత్తయున్
వనజ దళాయ తాంబక నవారిత ఘోర రుజార్త చిత్తనుం
గనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై                                                    33

కర్మా నుగతమ్ముగఁ గలు
షోర్మి సుకృత సంచయ పరిశోధన గతముల్
నర్మార్తమ్ములు నిత్యా
ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్                                                                       32


మర్మము నేర నేరి కగు మాయలు విష్ణు కృతమ్ము లౌర దు
ష్కర్మము లెన్ని సేసినను సౌఖ్యము లందెను ధార్తరాష్ట్రుఁడే
ధర్మజుఁ డందెనే తుదను ధాత్రియు సౌఖ్యము లెల్ల నాదినిన్

ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్                                               31

ఇది సరదా సమస్య కనుక మీ పూరణలలో వ్యావహారిక, 
గ్రామ్య, అన్యదేశ్య పదాలను, యడాగమ నుగాగమాలను, 
దుష్టసమాసాలను పట్టించుకోను
ప్రస్తుత కవుల స్థితిఁ గనుమ
పస్తులు సన్మానములు విభవములు నిందల్
స్వస్తి గగన కుసుమంబే
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా                                                                                       30

వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకుం 
బ్రస్తావించితి నన్ని సంగతులు నన్ బాధింప నీ కేలనో
విస్తారమ్ముగ లేవు విత్తము లహో విద్యాధికా యీయఁగా
నే స్తోత్రమ్ములు మాత్ర మిత్తు రహినిన్ నీ వింక నన్నొప్పుమా                                              29

చదివెనె మొదవులు పా లిడ
చదివెనె వృక్షమ్ము లీయఁ జక్కని ఫలముల్
చదివెనె సాయి శిరిడిలోఁ
జదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్                                                                              28

విదితము లోకు లెల్లరకు విద్య లొసంగును బుద్ధి నిద్ధరన్
మదము నణంచుఁ జిత్తమున మానవ జాతికి నిశ్చయమ్ముగం
బదుగురి మేలు కోరెడిని భద్రము నిచ్చెడి జ్ఞాన మిచ్చు నీ
చదు వని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్                                                    27


పద్యకళానిధి దత్తపది:
శాపము పాదాదిని పద్యము:

శాప ముఖ సుతప్త నదీ
శాప ముముక్షా విఘాత చలిత ప్రతీ చ్యా
శాప ముఖామర నిచ యే
శాప ముఖ నికాయ తృప్త సద్గుణ రామా                                                                          26

[ముఖము =మాట; నదీ+ఈశ+ఆప = సముద్ర జల సమూహము; ముముక్ష = విడుదలకు నిచ్చ; ప్రతీచీ +ఆశా+ ప = పశ్చిమ దిక్కునకు అధిపతి, వరుణుడు; ముఖ = మొదలుగా; అమరనిచయ + ఈశ +ఆప +ముఖ+ నికాయ+ తృప్త  = ఇంద్రునిచే పొందఁదగిన  యుపాయముల సమూహముచే తృప్తి చెందిన] 

అభయ నవనీత చోరులు
శుభ వ్రజాన్వయ వధూ వసు మనో హరులున్
విభవ శ్రీ చిత్త హరులు
శుభములు లభియించుఁ గాక చోర విటులకున్                                                                   25
[చోరవిటులకున్ = కృష్ణునకు, బహుమాన పురస్సర 
బహువచనము; విభవ శ్రీచిత్త హరులు = (భక్తుల) విభవము, 
లక్స్మీ దేవి హృదయమును హరించు వారు]

అభయము నిచ్చి మార్చ వలె హత్యలు ధర్మము కాదు దుష్ట సౌ
రభులని కూడ దెన్నఁడు నిరంకుశ మిద్ధర రాజ దండనం
పు భయము పాఱఁ ద్రోల మఱి పూర్వపు బుద్ధిని వీడి యుండగా
శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్                                                       24

మంచి బుద్ధిని నీ వింకఁ బెంచ కున్న
మించి పెద్దల నిఁక గౌరవించ కున్న
మంచి మతి నుంచి నే వివరించి చెప్ప
మాతృభాషలోఁ, జదువుట మానుటొప్పు                                                                            23

కనఁదగ నంత విత్త గుణకారపు బుద్ధినిఁ గల్గి యుండినం
గనపడ కుండఁ బోవ నుపకారికి నెంచిన వాని మెచ్చినం
గని నిను బెంచి నట్టి మమకారపుఁ దల్లినిఁ దల్చకుండినన్
మన బడులందిఁకం జదువు మానుటె యొప్పగు మాతృభాషలో                                           22

ఎక్క డుండు నెప్పు డేరీతిఁ గన్పించు
నెవ్వఁ డరసె నంచు నింత యైన
సత్య నిరతి లేక నిత్యము శంకించు
ప్రతిభ లేనివాఁడె పండితుండు                                                                                           21

అతు లానంద మనస్కుడున్ సకల దేవానుగ్రహప్రాప్త పూ
జిత నారాయణ పాదపద్మ యుగ నిశ్చింతుండు శాస్త్రాగ మాం
చిత విజ్ఞాన వికాస మానసుఁడు దుశ్చింతా సమాయుక్త దు
ష్ప్రతిభా శూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్                                             20

ప్రజలు తమకు వద్దన్నది
నిజముగఁ దుచ్ఛార్థ దుష్ట నిర్మిత కృతులం
గుజన వచనమ్ము లియ్యవి
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే                                                                               19

అజర వినాశ హీన మగు నర్థ గభీర సు శబ్ద పద్యముల్
వృజన పదవ్రజోక్త రస హీన కృతిం బర నిర్మితమ్మునున్
నిజ పుర పండి తోత్కర వినిర్మిత హృష్టులు కృష్ణదేవ రా
ట్ప్రజలు దృణీకరించి రఁట పద్యకవిత్వము వద్దటం చయో                                                   18

బలశాలియు మగధీరుఁ డ
మలాంతరంగునకు నకట మాటల యందుం
దెలిసెను వేసవిఁ,  గాదట
చలికాలమున, వడదెబ్బ చప్పునఁ దగిలెన్                                                                      17

విగత వివేకుఁడై పడఁగ వేగమ కాంచిరి బంధు మిత్రులే
పగళులు రాత్రులందుఁ దమి వంటలు సేయఁగ గాడిపొయ్యి చెం
తఁ గరము మండు చుండగను దద్దయు వేడిని సైఁచు చుండగం
దగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్                                                  16

నుతు లిడుదు నొకటి వినుమా
వితండ వాదము లొసఁగు భువి వివాదములే
సతతము నరులకు ధర్మ ని
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై                                                                            15
[ధర్మ నిరతి = ధర్మాసక్తి]

విత తావేశముఁ గల్గఁ జేయు నిఁక హ్రీ భీత్యాదులం ద్రోయు సం
తత మెవ్వారికి నైన నొక్క త్రుటిఁ జిత్తభ్రాంతి కల్గించునే
యతులం బౌచుఁ జెలంగి కన్పడు మనో వ్యాప్తారి షడ్వర్గ యు
ద్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్                                              14
[యుత్ + రతి = యుద్రతి; యుత్ = యుద్ధము; అరిషడ్వర్గ యుద్ధ మందు రతి; 
యుత్కారము = యుద్ధము సేయుట]

హరుని కరములఁ ద్రిశూల డ
మరుకము లుండఁగఁ బ్రకాశమానమ్ములుగా
వర గోపికా గణ మనో
హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా                                                                       13

విరివిగ వెల్గు నా నెమలి పింఛము శీర్షము నందు గాంతు మా
యురమునఁ కౌస్తుభమ్ము సత తోజ్వల కాంతి రమా యుతమ్ముగా
స్థిరముగఁ గేళి లీల దధి ధేను సుధా నవనీత సంత తా
హరుని కరంబులందు నలరారుచు నుండును శంఖచక్రముల్                                            12

నిరతమ్మిట జోడించుచుఁ
గర యుగ్మమ్ములు ముదమ్ముగఁ బ్రశాంతంబౌ,
శరణమ్మని వేడు కొనుచు,
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్                                                                       11

పరఁగిన శిష్ట కార్యరతిఁ బార్థుల నెల్లరు భక్తి యుక్తులై
నిరతము కోరుకొందు రట నీరజ పత్ర విలోచనా భువిం
బరఁగిన దుష్ట కార్యరతిఁ బార్థలతోడ జితాంబుజాస్య! లే
! రణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై                                               10

సుప్రభాత మన వసుధకు నెల్ల వర వి
ప్రకుల  భాజను లటఁ బ్రాజ్ఞ తంత్ర 
భానునిఁ గొలువ నిలువఁగఁ తండ్రి ప్రజకు స్వ
తంత్ర రీతి జలధిఁ దరణి లేచె                                                                                            9

ఆసలు స్వీయారులు దో
షాసాంగత్యము సరళత సచ్చింతనలే,
మోసము సేయకు విడు మీ
వేసమ్మె, ప్రధానమగును వేదాంతమునన్                                                                         8

కాసింతైనను భక్తి నుంచి మది ముక్తప్రాప్తి కర్మాసలే
భాసిల్లంగ వికుంఠ వాస రతి యుద్భాసిల్లఁగా వెల్గుచున్
నీసుల్ వీడుచు లోక మందుఁ గరమున్ నిష్కల్మషంబై వఱల్
వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంత సారం బిదే                                                    7

సన్నాయి వాద్య మలరన్
విన్నాణమ్ముగఁ జెలంగి విభవం బొప్పన్
విన్నంబోవఁగ నేలా
యన్నప్రాశనముఁ జేయుఁ, డా ఱవ, యేటన్                                                                    6
[ఆఱు+ అవ = ఆఱవ; ఆఱు = ఉపశమిల్లు; అవ = అవ్వ; 
ఏటన్ = ఏఁడాదిలో]

చన్నే యివ్విధిఁ బాల మాత్రమున నీ చంటిన్ విలోకించవే
పన్నుల్రాకయుఁ చప్పరించుఁ దమి నింపారంగఁ దా నవ్వుచుం
గన్నా యంచును బుజ్జగించి విరియన్ గారమ్ము మాసాంతర
మ్మన్నప్రాశన మాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్                                                 5
[ఆఱేండ్లకు = ఆఱు నేడు సంఖ్యలకు; ఆఱు నేడుమాసముల మధ్య]

చంటిపాప దన్న సంతసింత్రు జనులు
కాని వారు నవ్వ మేను కాలు
నిష్ట మించు కేని నష్టమైన నగును
గలువ కత్తి దండ కార్ముకమ్ము                                                                                        4

జలచర జంతు జంతు నర సత్య వరాల్ప మనుష్య సుంద రా
మల తర రూప సంపదల మానుగఁ గన్పడి నిగ్ర హానుకం
పల హరి సూచె నేని సిరిభర్తయె దుర్జన శిష్ట కోటికిం
గలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్                                                3

ఆర్తిం గొలువుము భక్తి
స్ఫూర్తిని విశ్వేశుఁ జంద్రచూడుని సతమున్
ధూర్తా సపాదరక్షలు
కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే                                                                         2

కర్తృ మనోభ వాభవ సకాశ విలాస సతీ నిజాంగక
స్ఫూర్తి వినోద శీతకర చూడ విరాజిత శంభు వాసమే
సార్త వపో వినిర్మల రుషా పరివర్జిత చిత్త శుద్ధితోఁ
గార్తికమాసమందుఁ జొరగం దగదే! శివమందిరమ్మునన్                                                     1
[స్ఫూర్తి = కాంతి; తగదే : తగును]