26, డిసెంబర్ 2019, గురువారం

మాయా జాలము

మాయా జాలము
(అష్టాదశ శంకా నామికా ఖండిక) 




వాయు వహ్ని తోయములకుఁ బాద పాద్రి
జలచర విహగ నర జంతు జాలములకుఁ
గాంచ నాధార మీ భూమి క్షమను మిన్న
దాని కాధార మెద్దియో తలఁచ నగునె
1.      


సంతరించును జిఱు విత్తు సాలరూపుఁ
జాల నిద్రించి పుర్వగు లీలఁ జిలుక
గ్రుడ్డు పగులఁగ నగుఁ బక్కి గూటి లోన
మఱి పురుడు పోసె వాటి కే మంత్రసాని
2.     


తోయ మాక్రమించెఁ పుడమి హాయిగాను
మూడు వంతులు చుట్టును ముచ్చటగను
భూమి గిఱ్ఱునఁ దిర్గుచుఁ బోవుచుండఁ
దొనఁక దిసుమంత వింతగఁ దోయ మేల
3.     


బళ్లు తెప్పించి పయనించఁ గీళ్లు నొచ్చు 
యోడ లందు బోనెంచిన నొళ్లు తూలు 
గగన యానమ్ము సేయంగఁ గాళ్లు లాగు 
భూమి యానము నెఱుఁగమే యేమి వింత 
4.     


కాన రానంత చిన్నవి కలవు కొన్ని
కొండ కన్నను బెద్దవి కొన్ని కలవు
నేల నీట నింగి చెలంగి నివ్వటిల్ల
నంతు గాంతుమె విశ్వంపు వింతలకును
5.     


పంచదారను గని చీమ పంచఁ జేరు
మాఁగ నింట మామిడి పండు మూఁగు నీగ
యప్పు నిండఁగ గుంటను గప్ప సేరు
మేటి విద్య లబ్బె నెటుల వాటి కిట్లు
6.     


సందు లేనంత కోటను గందిరీగ
తేనె లూరు మైనపు టిల్లు తేనెటీఁగ
మేలు వల నోటి నూలున సాలెపుర్వు
కట్ట విశ్వము వింతల పుట్ట కాదె
7.     


పుట్టు టేరికి నెక్కడ గుట్టు సుమ్ము
గిట్టు టెట్టుల నెన్నడు గుట్టు కాదె
యెట్టు లుండును నడిమిని  గుట్టె యౌను
గుట్టు లేరికి  నెన్నడు పట్టఁ దరము
8.     


ఉన్నవి మృతికిఁ ద్రుటి ముందు నన్ని బొంది
నున్న వన్నియు మృతికి ముందున్న వెల్ల
జన్న త్రుటికిఁ బిదపఁ గూడ వన్నె తోడ
నేది లోపించె నీకట్టె నేరి కెఱుక
9.     


పాఱు నంతరిక్షమ్మున మీఱి యినుఁడు
కృష్ణ బిలరాశి చెలరేఁగుఁ దృష్ణ తోడఁ
జెంతఁ జేర నన్నియుఁ బోవు నంతు లేక
కారకుఁ డెవండు ధరలోన నేరి కెఱుక
10.   


ఉంచుఁ బిల్లను దన పొట్ట సంచి నొకటి
చెట్టు లెక్కు నొకటి పిల్ల పట్టఁ బొట్ట
గొయ్యి త్రవ్వి గ్రుడ్డుల నుంచు నయ్య యొకటి
యెట్టు లీ విద్య లబ్బెనొ గుట్టు కాదె
11.    


ఱాతి నడుమున జీవించుఁ బ్రీతిఁ గప్ప
పండు లోపల నక్కి పుర్వుండుఁ జుమ్ము 
వాన రాఁబుట్టు మట్టిలో వాన పాము
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు
12.   


పూసి రెవ్వరు రంగులు పూల కెలమి
నేల వాసన లీనును బూలు కొన్ని
యిచ్చి రెవరు ఫలములకు మెచ్చి రుచులు
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు
13.   


అణువు నందుండు వేర్వేఱు కణము లంట
బిందు వుండు నంట నడుమఁ గందకుండఁ
జుట్టు తిరుగంగ నవి యెల్లఁ బట్టు పట్టి
యెవ్వఁ డట్టులు గూర్చెనొ యేరి కెఱుక
14.   


కంటికిం గాన రాకుండు గాలి యెపుడు
నొంటికిం దెలియని శక్తి మంటి కుండు
నంటి నంతఁ గాల్చు ననల మొంటి నెల్ల
నెట్టు లేర్పడె నివి యెల్ల నేరి కెఱుక
15.   


అంద దేరికి నెన్నఁడు నాకసమ్ము
నీర మిల మూడు వంతులు మూరి యుండు
నాకమున నీరు వాయువై వీఁక నుండు
 నెవ్వఁ డుంచెను వీటిని నేరి కెఱుక
16.   


కాళ్లు లేనివి యున్నవి కాంచఁ జగతి
కాళ్లు రెండుండు నరులకుఁ గాంతలకును
నాలు గాఱు మించియుఁ గాళ్లు నేల నుండు
నేల జీవుల కీ భేద మేరి కెఱుక
17.   


నేను నేనంచు నెల్లరు నిక్కు  చుంద్రు
నా శిరమ్ము నా కన్నులు నా మన మని
కలవరించు చుండంగ నా కాయ మందు
నాది నాదన్న దానిలో నేది నేను
18.   




ఇది యష్టా దశ శంకావృత మాయాజాల నామికా ఖండిక.
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి