అంతము సేయుమ కోపము
సాంతము విలయ మగు మానవాళి వసుధలోఁ
బంతము ప్రత్యపకారపుఁ
గాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే 61
వింతగ నూత్న వత్సరము వేడుక మీఱఁగఁ బ్రీతిఁ జీరుచున్
శాంతియు సౌఖ్య సంచయము సక్క నొసంగఁగ నెమ్మి వేడుచున్
స్వంత సహస్ర యుగ్మ పర సప్తదశోత్తర యుగ్మ నామపుం
గాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్ 60
[సు + అంత = స్వంత; మంచి యంతము గలది, బాగుగా ముగిసినది]
కవివరు నిజ విద్వత్పా
టవ సంవీక్షణ మతిం గుఠార ప్రహ రా
భ విశిష్ట ప్రాస నొసఁగి
యవధానిని రాజమండ్రి యడలం జేసెన్ 59
కవి శార్దూలము సాన్య ధీ వితతి సత్కారార్థ చింతా మతిన్
ఛవి సంపూరిత పద్య భేషజ రసక్షారప్ర భోన్మత్తతన్
దివికిం బంపఁగ నెంచఁ బౌర మృగముల్ దీనార్తముల్ పాఱఁగా
నవధానం బఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్ 58
క్రూర వృత్తిని విత్తము కూడఁబెట్టి
ద్రోహ చింతల జనులను దోఁచుచుండి
దాన మొనరించ నరకమ్ము దాఁట లేడు
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు 57
పడయఁగఁ బుణ్య లోకములు భార్యలు కారణ మౌదు రేరికిన్
నడపుచు ధర్మ మార్గమున నందన కారక పుణ్య శీలలై
కడు వెడ మాటలాడుచును గాఁక నొసంగఁగ నేడ్చుచుండఁగాఁ
బడఁతులు, పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్ 56
శుక్రాచార్యుని విన్నపము:
ఈ నాపల్కులు వినుమా
దానార్థి రమా ధవుండు దనుజా భూమిం
గానక యున్నది యెల్లయు
దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్ 55
ఏనుఁగు నాల కించమె యహీన బలమ్మున విఱ్ఱ వీఁగియుం
గానన మందుఁ బొందుటను గష్టము లక్కట చిత్తమందుఁ దా
నూనిన దైవ భక్తిని మహోరగ నక్ర విహార వారిలోఁ
దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్ 54
[వారిలోన్ + తానము = వార్ధిలోఁ దానము]
బాలు నుంచ మింకఁ జాలు నీ ఘోరమ్ము
మేలుకొంటి మిపుడు కాల మెఱిఁగి
మాఱె రోజు లయ్య మా బిడ్డ చక్కంగ
బడికిఁ బోవువాఁడు పనికి రాఁడు 53
గడగడ లాడు దేశములు కైతవ మెల్లెడ వ్యాప్తిఁ జెందగం
దడబడు మాటలెల్లయు వృధా యగుఁ గార్యము లెల్ల వారికిన్
విడువక దుష్ట కార్యములు భీతి నొసంగెడు క్రూరు మూర్ఖు నే
ల్బడికిఁ జనంగ నిష్టపడువాఁడు జగమ్మున వ్యర్థుఁడై చెడున్ 52
పుడమిని జీవ హితార్థము
నడరెడు సన్మతము మానవాళికి వలయుం
గడు నాంక్షలు వెట్టు మతము
చెడు, మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో 51
ఇడుముల బారిఁ దూలిన నహీన ధృతిన్ ధరియించి చిత్త మం
దడలును బాసి వాటి నిఁక దాటు విధమ్ముల నెల్ల నేర్పుచుం
దడయక భవ్య జీవన విధానము సూపుచు మానవాళిఁ గా
చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్ 50
కాకు విరాగివి తీరును
శోకములు ముదమ్ము లొదవు సూర్యోదయమే
నాకము నందు నశించఁగఁ
జీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే 49
కూఁకటి వేరు లెల్ల భువి గూలిన చందము జంతు కోటిలోఁ
బ్రాకట మౌను జావు గన రాదిక శోకము నందు మున్గఁగా
రాకలు పోక లెల్ల నవిరామము కల్గును భావి యింక పెం
జీకటి యే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా 48
ఊరఁ గుక్క లున్న నొప్పు నుండఁ దగునే
యౌర జంబుకమ్ము ఘోర మయ్య
క్రూర రీతి నక్క కూయఁగ రేపు మా
పూల వలనఁ జెడెను పుష్పవనము 47
[మాపు + ఊల = మా పూల]
ఆ వనజాక్షు సంతత దయార్ద్ర నిరీక్షణ కారణమ్మునం
బావన పూరుషుం డితని పాప మణంగి తరించు నెన్నఁడో
వావిరి బాధ నొందగను బాపమ యాతని జంట కన్నులం
బూవుల వల్ల రూపు సెడె పుష్పవనాంతర రమ్యదృశ్యముల్ 46
మానసముల నలరించ మ
హానగరము లందుఁ గాన నట్టి, ప్రకృతికిం
గాననమున నేరివి లే
వానలు, లేకుండ మెట్టవరి ఫలియించెన్ 45
[లేవు +ఆనలు = లేవానలు; మెట్ట వరి = గడ్డి]
కానక మీన మేషములు కర్జము పై నిడి దృష్టి నంతటిన్
మే నలయంగ యత్న మది మీఱఁగ బంధు సమిత్ర కోటితో
మానక పట్టు నింపుగను మళ్ళుగఁ దీరిచి బావి నీటితో,
వానలు లేక, మెట్ట వరి బాగుగఁ బండెను వైపరీత్యమే 44
[మెట్ట(న్) = త్రొక్కఁగా; బావి = చెఱువు]
పెం గ్లిష్టంబౌ యీ పని
కిం గ్లిన్నుఁడ నయితి మీర కేళిని నీ తొ
ట్టిం గ్లిన్నము లయి తిరుగన్
బంగ్లాపైఁ గలదు కొలను పట్టుఁడు చేపల్ 43
[కొలను వంటి తొట్టి]
నం గ్లేశాత్మునిఁ జేయ నెంచితిరి విన్నాణమ్ము మీఱంగ భ్రాం
తిం గ్లాంతార్తుఁడ నైతి శబ్ద మిది యే దేశంపు సుద్దౌనొ యా
యాంగ్లే యాగమ కారణమ్మున నహో యైనట్టి వంగక్షితిన్
బంగ్లాపైఁ గొలనున్న దేగెదమటన్ బట్టంగ మత్స్యమ్ములన్ 42
[ బంగ్లా = బంగ్లా దేశము]
కొలఁకులఁ దామర తండ
మ్ములు వికసించఁ బ్రవిమల నభోమార్గములో
నలయక ధిక్కారమ్మునఁ
జలిపులిఁ గని, వేవెలుంగు చయ్యనఁ బాఱెన్ 41
నలుదిశ లందుఁ గ్రమ్ముకొన నాకము నంటుచు నంధకారమే
వెలవెల వోవ పద్మములు పిన్నలు పెద్దలు చూచు చుండగం
గలవర మంది యబ్బురముగం బగ లక్కట సైంహికుండు గ్రొం
జలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్ 40
దారుణమై కన్పడఁ బగ
వారాక్రమణ మొనరించఁ బట్టణ రత్నం
బౌరా నాలుగు వైపుల
నారీమణి యొకతె చూపె నాలుగు కు చముల్ 39
[కు చమువు =చెడ్డ సేన]
పృథు చక్రవర్తి గో రూపిణి యగు భూమి వలన నోషధులఁ బిదుకు సందర్భము:
పారావార పరీత మానవ గణాపారవ్యథా తప్త భూ
చోరస్తోమ కృతాపకార చలితక్షోభార్తి సంతప్త దా
నారాటమ్మును మాని భూసతియె గోవై పృథ్విలాభర్తకున్
నారీరత్నము సూపె నాల్గు కుచముల్ నాథుండు మెచ్చన్ మదిన్ 38
[పృథు + ఇలాభర్త = పృథ్విలా భర్త: పృథు చక్రవర్తి]
తెలతెలవాఱ దిగంత
మ్ములు చెలరేఁగి పొడవంగఁ బుణ్యాద్రి వెసం
దలుకునఁ దామర, లేడ్వం
గలువలు, వికసించె రవినిఁ గాంచి ముదమునన్ 37
[అద్రి = సూర్యుఁడు]
కలువల జంట కన్నుగవ గాఁగ శశాంకుని బోలు మోముతో
వెలుఁగుచు భక్తి తత్పరత విష్ణు మనోరమ లక్ష్మి నెంచుచుం
జెలియలు నోము నోచుకొని చెన్నుగ నక్కకుఁ బ్రేమ తోడ రూ
కలు వలు విచ్చె భాస్కరునిఁ గాంచిన వెంటనె మోదమందుచున్ 36
[వలువు = వస్త్రము; భాస్కరునిఁ గాంచిన వెంటనె : ఉదయము కాఁగానే]
కాలాతీతం బాయెనె
యేలా రాదింకఁ బెయ్య యిట్లేడ్వంగన్
వాలము నూపుచు వడి శా
ర్దూలము సెలరేఁగి యొక్క దూడను మ్రింగెన్ 35
ఏలిక లంద ఱాశ్రయము నీయ నరణ్యము లందుఁ జెట్టులం
గూలఁగఁ జేయఁ గ్రూర మృగ కోటి చరించ విచిత్రమే పురిం
జాలిఁక వ్యాఘ్ర ఘోరములు చాలిఁకఁ జావులు దాని కే మిఁకం
దూలము, పెచ్చురేఁగి యొక దూడను మ్రింగె దయావిహీనయై 34
[ఇఁకన్ + తూలము = ఇకందూలము]
ఎక్క డైన నేమి నొక్కి వక్కాణింతు
మెక్కఁ బొక్కు దీవు మిక్కుటముగ
వెక్కసంబు నైనఁ జక్కెర లేని కా
మితము గాని తిండి మేలు సేయు 33
సతతం బచ్చట క్షాళనమ్ము తనరం జక్కంగ ధూపమ్ము నం
చిత రీతిం బరగంగఁ జేసిన దినన్ క్షేమంబె సత్యమ్ము భా
సిత శుద్ధస్థల మున్న నొప్పు గద యాసీనార్థ పీఠమ్ము ని
ర్మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్ 32
తూఱు నక్కట పాములు మీఱి చీమ
లల్లఁ బుట్టలు మిట్టల యందుఁ బ్రీతి
నిజ గృహములకు నెన్నఁడు నిజము వర ల
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు 31
[లత = చీమ; చెవి = తాళపుఁ జెవి]
అల యవ్వేళ వధింపఁగా నరకు విశ్వాత్ముండు కృష్ణుండు నే
డలరం బండుగ భూజనప్రతతి యాహ్లాదంబుగాఁ జేయ భూ
తలమం దెల్లను నిండ శబ్దములు సంత్రాసంపు ఘోరంపు మ్రో
తలకుం గర్ణము లుండవం చన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా 30
కాయము నొవ్వంగ నుపా
ధ్యాయుఁ డకట దృష్ట దోషుఁ డౌచలిగి బృహ
త్కాయుం డే నిత్తును దొడ
పాయసమన నెవ్వఁ డిష్టపడు నీజగతిన్ 29
ఆయత విత్త రాశుల మహావిభవమ్ములఁ దేలి యాడుచుం
దోయపు వారి యిల్లులఁ బ్రతోషముతో భుజియించు వారలం
బాయస మింపుగా నునిచి పాత్రను దెచ్చుచుఁ బాత్ర పీత రూ
పాయస మన్నచో నెవఁడు వల్లె యటంచును గ్రోలు నిద్ధరన్ 28
[పీతరూప +ఆయసము = పీత రూపాయసము; ఆయసము = ఇనుము]
కాంచన నయనుండు కాంచనకశిపుఁడు
ఘోర రావణుండు కుంభకర్ణుఁ
డు శిశుపాలుర గనుఁడు మఱి దంతవదను
బగను మున్గ నడఁగుఁ బాపచయము 27
ఖగ రాజేంద్రు పయిం జరించు హరి విఖ్యా తాంఘ్రి యుగ్మంబునం
దగ జన్మించి త్రిలోకచారిణియనన్ ధాత్రిం బ్రవేశించి చా
గఁగ వేగంబుగఁ బ్రీతిఁ గొల్చుచు మదిన్ గంగాసరిత్తుం దరిం
పగ లో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్ 26
ధర్మ యుతము వొందఁ దగు వైభవమ్ముల
నుత్తముం డనఁబడు నుర్వి వీడ
నర్థ మందు నాస స్వార్థ రోష దురభి
మానహీనునకు నమస్కరింతు 25
ఈ నరపాల వర్గమున నేను విధేయతఁ జూపి నెమ్మదిన్
దాన దయాది లోక శుభదాయక రక్షక కర్మ కోటిలో
ధ్యానము నుంచు సంతత మధర్మ విరోధికి గర్వ మంగుళీ
మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో 24
ఇష్ట మున్న నింద యిచ్చును మందహా
సమ్ము సుద్దు లన్ని సమ్మతింత్రు
కాని వారి వినరు కమ్మని మాటైన
గడ్డిపోచ చాలు కలహమునకు 23
ఇల సుఖ దుఃఖ యుగ్మముల నెంచు సమానవిధమ్ము బుద్ధిమం
తులు వర సంయమీంద్రులును దూలరె యింద్రియ వశ్యు లందునే
విలయ విధాయ కాసహన భీషణ దుర్జన గీఃప్రవాహమే
కలహము రేపఁగాఁ దగును గాలికి లేచెడు గడ్డిపోచయే 22
[ లేచెడున్ గడ్డిపోచయే= గడ్డి పోచయే లేచును]
గుప్త దానము ధరలోన గొప్ప సుమ్ము
దాని నెంచి వాఁ డెంచెను వీని నిజము
నా కెఱుక యా ధనము నిచ్చె నాకుఁ దాను
దాత యనఁబడు దాత తా దాత గాఁడు 21
[తాను + తాత = తాను దాత]
ఏ తరి దాత లుందురు గ్రహీతలు లేక గ్రహించ నింపుగన్
దాతయు మాఱఁగా నగును ధాత్రి గ్రహించెడు వానిగాఁ జుమీ
భూతల మందుఁ బుచ్చుకొను పూరుషు లుందురు సంతతమ్ము నా
దాతగఁ బిల్వఁగాఁ బడెడి దాత నిజంబుగ దాత గాఁడు పో 20
[ఆదాత = గ్రహీత ]
పాదరక్షలు నన్య భావరతి వీడి
యనవరతము చేరవలె దేవాలయమ్ము
సిగ్గు మానము దర్పము లొగ్గి సాని
మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు 19
తోడుగ రావు సంపదలు తూలఁ గళేబర మెట్టి వారికిం
బాడిగ నీషణత్రయము భావన సేయఁగ మెట్ల గుంపుగన్
వీడిన కాని చిత్తమున విష్ణు పదాలయ లబ్ధి లబ్ధమే
మేడనుఁ జేర రెండునొక మెట్లు దిగం దగు మోక్షగామికిన్ 18
ఓ మిత్రోత్తమ భద్ర
మ్మేమఱకుండుమ సతమ్ము నీ దుష్టున కీ
వీ మనుజుం డకటా స
త్కాముండే దున్నపోతు గణపతి!
కపియౌ 17
పాము విధమ్ము నుండు జన వారము నిత్యము వెంట నుండగా
నీ మతి హీనకార్యముల నెంచి మనమ్మున విఱ్ఱ వీగుచున్
దోమ తెఱంగు బాధ లిడు దుష్ట మనో౽క్రమ విత్తరాశికిన్
గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తియౌఁ గనన్ 16
[గణనాథుఁడు = దళపతి]
వింత ప్రశ్న గాదె వేయంగ నివ్విధి
యమున కగును బూది యగుట యెపుడొ
యనఁ బ్రళయము జగతి నరుదెంచు నప్పుడ
తప్ప కుండ నౌను దర్క మేల 15
అమల మనస్కు లందఱు మహా విభవమ్ములు పొందకున్ననున్
సమల మనస్కు లెల్లరును శార్ఙ్గధ రాగ్రహ పాత్రులే చుమీ
విమతి దశాననుండు భుజవింశతి సన్నత వీర్య వచ్ఛిరో
యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్ 14
బింకముతోఁ బర్జన్యుఁడు
నంకమున నెదిర్చి యోడ యదునందనుఁడే
శంకలు మానుమ కీర్తిత
శంకరుఁ డుమ కొఱకుఁ బారిజాతముఁ దెచ్చెన్ 13
[ఉమ = యశము]
సంకట సంచయా పహర సన్నుత నిర్జర సేవితాంఘ్రియుం
బంకజ లోచనుండు వరపార్థ దృశానుఁడు వాసుదేవుఁడే
కింకర విప్ర భక్త ముని కీర్తిత హర్షిత నీరదప్రభా
శంకరుఁ డంబకై యరిగి చప్పునఁ దెచ్చెను పారిజాతమున్ 12
[శంకరుఁడు = సుఖముల నొసఁగువాఁడు; అంబ = అమ్మ, సత్యభామ]
పాడుచుఁ బాటలు త్రాగుచుఁ
గూడి తినుచు నుండఁగా సఖులు మోదముగా
వేడిగ నున్న వడి వడిఁ బ
కోడిని మ్రింగినది కోడి కోపింప జనుల్ 11
వేడుక నుండ నెల్లరును వేగమ దూఱి గృహమ్ము లోనికిం
బాడిగ ధాన్యరాశి పయిఁ బర్చగ నింపుగఁ దాటి యాకులన్
మూడుర దాని కింక నిట ముందుగఁ బాదపు గోటిఁ దన్ని యా
కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ వడిఁ గోపగింపఁగన్ 10
[ఆకు + ఓడి = ఆ కోడి; ఓడి = నీవార ధాన్యము]
కాననమున వర ముని నికాయమునకు
భద్రత నొసంగు రఘు రామభద్రు నునికి
వర జనస్థానమున దైత్య వరుల కెల్ల
రామరాజ్యాన బ్రతుకు దుర్భరము గాదె 9
సతతము చోరభీతి మఱి చాగును మోసము చూచుచుండ గ్రూ
రత దివిఁ దాఁకు నెల్లరకుఁ బ్రాణ భయమ్మును మాననాశమున్
వెత లవి చెప్ప నేల నట వెంగలు లెల్లరు రాజ్య మేలగన్
బ్రతుకిది రామ! రాజ్యమున భద్రత కోల్పడె దుర్భరంబుగన్ 8
కవి వాచస్పతులఁ గొలిచి
కవి పదముల సంస్మరించి కమనీయంబౌ
కవి సంయమి వ్యాసుఁడు భవ
కవి నాశక భారతముఁ బ్రకటితము సేసెన్ 7
[కవి = 1. శుక్రుడు, 2. వాల్మీకి, 3. కవి, 4. సంకెళ్ళు]
కానము మాన విహీనుల
నీ నగరమ్మున వసించ నివ్విధి మునులన్
నే నిది నమ్మ నెపుడు నే
సానిన్ ముద్దాడె యోగి సద్గతిఁ బొందన్ 6
ఆ నలినాక్షు నచ్యుతు ననంతుని భక్త వహించి కొల్చుచుం
గానల నుండి సంతతము కాయల దుంపల నారగించుచున్
మే నలయంగఁ జిత్తమున మించి తలంచుచు ముక్తికన్య నా
సానిని ముద్దుపెట్టుకొనె సంయమి సద్గతిఁ బొందఁ గోరుచున్ 5
[సాని = అధిపురాలు]
గుండు కన్న మిన్న మొండి ఘటము జాలి
గుండు సున్న సుమ్ము పొండు వాని
చెంత కేఁగ కుండు వింత గుండె తెలియ
కుండ లోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు 4
మెండుగ ఱెక్క లుండగ నమేయ రయమ్మున జంతుజాలముం
బిండి యొనర్చుచుండ బలభిత్తునిఁ జూచి భయమ్మునంది యు
ద్దండుఁడు గాలి వీవ వడిఁ దర్షము నందు నగారి గాన లే
కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా 3
వేడి యైన నేమి వింత శీతల మైన
నేమి తియ్య నైన నేమి చేదు
నైన నేమి యింద్రియమ్ములు లేకున్నఁ
జూడఁ జూడ రుచుల జాడ యొకటె 2
బోధన మందు నందఱును బూర్ణ వివేకత నుందు రక్కటా
బాధలు వారి ముంచ నిఁకఁ బాటవ మెల్లయుఁ దెల్ల మౌనులే
యీ ధరఁ గష్ట కాలముల నెట్టి మనుష్యులు నట్టులే చుమీ
శోధనఁ జేయుచున్ రుచులఁ జూడఁగ జాడ యొకండె మిత్రమా 1