ఆ వర వనాంతరమ్మునఁ
బావన ముని పుంగవునకు వాల్మీకి కహో
యా విపరీతము విహ గా
భావము గానముగ నెగడ బాధయె కల్గెన్ 62
దేవున కర్పణమ్ముగ విధేయత నుండి ఫలమ్ము కోరకే
పావన నిత్య కర్మములు పన్నుగఁ జేయఁ బరమ్ము వొందుదుర్
నీవృ దధీశుఁ డేన యని నిత్యము సేసెడి చేఁతలం దహం
భావము గానమై నెగడఁ బ్రాణము ఱంపపుఁ గోఁతఁ బొందెడిన్ 61
[నీవృత్తు = దేశము]
పకపక నవ్వుదు రంచును
సుకవులు, వారించఁగ మనసు కరము, సెలగం
దికమక వ్యాకరణమ్మున
నొకఁ డైనం బద్యరచన నొనరింపఁ డయో 60
అయ్యా యిండ్లను దార నందనుల కుయ్యాలించి సైరించి తా
రయ్యో వ్రాయుచు నుంటిరే వెతల భావ్యం బెట్టు లౌ నిట్లు మీ
రయ్యా వ్రాసిన వాటి కింక దయ సమ్యగ్వీక్షణం బీనిచో
నయ్యో యొక్కఁడు గూడ పద్యముల వ్రాయంబోఁడు నే నౌననన్ 59
[ఆ + ఆ = ఆయా = అయ్యా]
రూప సౌందర్య మలరించ భావ సుప్ర
కటన చాతుర్య మేపారఁ గంబుకంఠి
చలనచిత్ర తారగ వెల్గి నలిననేత్ర
కోటి రూప్యముల్ సమకూర్చె మేటి పిట్ట 58
పచ్చని చెట్ల గూళ్లు సులభమ్ముగఁ బెట్టి నివాసముండి గో
ర్వెచ్చని పక్క లుంచి చెలరేఁగి సమూహముగాఁ జరించుచున్
మచ్చిక నిండ్ల వాకిళుల మైమఱ పారఁగఁ దండులమ్ములం
బిచ్చుకకోటి రూప్యముల వేగముగా సమకూర్చె నద్దిరా 57
సంభవమ్ము సేయ సాధ్య మసాధ్యముఁ
బట్టుదల సెలంగ నిట్టలముగఁ
బండితోత్తముండు పంత మూని యొనర్చె
చదువు రానివాని చట్టు సూరి 56
కౌశికుని చరిత్రము:
చదలం దుండిన కాక రాజమును భస్మంబౌ విధిం జేసెనే
పదునౌ నేత్ర కుదృక్కులం బఱచి సద్బ్రాహణ్య సంచారి యౌ
ర దయాస్వాంత పతివ్రతా లపిత ధర్మవ్యాధునిం గాంచెనే
చదువే రాదను వానికిన్ సకల శాస్త్రజ్ఞుండు శిష్యుం డగున్ 55
అనంతచ్ఛంద సమస్య:
గో అర్ఘంబిల నెంచ శక్యమె మహా ఘోరాఘ విధ్వంసమున్
ద్యో ఆద్యూర్ధ్వ జగన్నివాస మిడు సద్యోగర్భ సాదృశ్యమై
ద్యో ఆవాసులు కోరుకొందురు మహీ దుస్సాధ్య సాన్నిధ్యమే
గో అక్షిన్ జగమెల్ల కాన్పడెను గో గోలోకమాలోకమై 54
వాడల వాడలఁ దిరుగుచు
దూడల బలిగొను చిఱుతను దుఃఖము తోడన్
నాఁడు జనులెల్లరు తలఁకు
చూడకు మనఁ జూచినాఁడఁ జూడనిదానిన్ 53
[తలఁకుచు + ఊడకు = తలఁకు చూడకు; ఊడు = వదలు]
చూడుఁడు చూడుఁ డన్న లనఁ జూచెడి వారలఁ జూడ శక్యమే
చూడకు చూడ కన్న మఱి చూచెడి వారలు సూడ కొల్లలే
చూడకు మన్నఁ జూచుటయుఁ జూడమి నిక్కము చూడు మన్నచోఁ
జూడనిదానిఁ జూచితిని చూడకు మన్నను దొంగచాటుగన్ 52
భావోద్రేకమ్ము లలర
నావే శాతిశయ చిత్తుఁ డర్చక వరుఁడే
కోవెలలో మోక్షార్థము
దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే 51
ఆ వనజాసన ప్రకటి తాసహ నిశ్చయ ఫాల లేఖ నో
పావృత మెంచ శక్యమె యవాంతర ముండదు దాని కెన్నడుం
బావన భస్మ దేహి మును భస్మ నిశాచర భీతిఁ బాఱుచున్
దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే 50
భారత సమరమ్మున గజబలము తోడు
త భగదత్తుఁడు చెలరేఁగ దపను భంగి
కాల్బలము నందు నొక్కొక్క గణిత వీర
సింహ మేనుంగులకుఁ జిక్కెఁ జెడె యశమ్ము 49
భంగుల్ పెక్కు నదృష్ట హీనులకుఁ జావం గాననంబం దహో
కంగా రించుక లేక పొంచి పొదలం గర్వించి వేటాడఁగన్
సింగం బేఁగఁగ నాఁడు సింగములతో శీఘ్రంబ శాబమ్మ యీ
సింగం బక్కట సింధురమ్ములకు నిస్తేజంబుగాఁ జిక్కెడిన్ 48
చల్లంగ జాఱు చున్నాఁ
డిల్లు వదలి కంపు రోఁత యేపారంగం
బెల్లుగ సంపెఁగలు కలియ
మల్లె లనిన నాగరాజు మది రోసె నయో 47
అల్ల జగమ్మునం దునికి కర్హత యింతయు లేదె యం చహో
తల్లడ మంది మిక్కుటము తప్త మనస్కులు నై సమీపులుం
గల్లరు లా మనుష్యులను గాంచఁగ నాగులు, సూడఁ బోలుఁ జు
మ్మల్లెల నాగరాజు గని, మానసమందున రోసె నయ్యయో 46
[నాగరాజు గని = పాముపుట్ట; అల్లె = వింటి నారి]
కాదన్న పనులు సేయఁగ
మేదినిఁ దల్లులకు వరము మీరన్నట్టుల్
హా దొరకెన్ మంత్ర మిపుడు
రోదించినఁ బిలిచెదను గరోనా బూచిన్ 45
ఈ మా మానవజాతి ముంచెను గదా యియ్యెగ్గు రాకాసి మా
భూమిం జేరి పరాక్రమించి నిలిచెం బో మృత్యు రూపమ్మునన్
నీ మాయల్ వల దింకఁ బొమ్మనఁగ, దానిం జంపు మో దైవమా,
నా మాటల్ వినకుండ నేడ్చిన కరోనా బూచినిం బిల్చెదన్ 44
[వెడలనని యేడ్చిన కరోనా బూచి]
అంతు లేని దుఃఖము మది నావహించఁ
జింత మునిఁగి మునింగి రవ్వంత తేఱి
వంత కొంత తొలఁగ మిత్ర వర్గ మెల్లఁ
దప్పఁగఁ బరీక్ష విద్యార్థి తాను మురిసె 43
తప్పి పరీక్ష లందు సతతమ్ము విషాదముఁ జెందు టెంచగం
దప్పని కృత్య మయ్యె నని తల్చుచు నుండ గురు ప్రవీణుఁడే
నెప్పరి యయ్యెనే తుదకు నెగ్గి, యహో పరిపాటి నేడు దాఁ
దప్పి, పరీక్షలోఁ గడు ముదంబున గంతులు వేసె ఛాత్రుఁడే 42
సముచిత రీతి విజృంభిం
తము వాహనరాజ గాంచఁ దగ్గె నకట వే
గము మార్కండేయుఁ గదియ
యమమహిషా! గమనమున భయంపడఁ దగునా 41
స మనుజ జంతు కోటికి నశక్యము గాంచఁగ దేవ కోటి నెం
చ మహిని నెన్నడేని వికచన్నయ నాబ్జము లున్న నేరికిన్
యమ మహిషమ్ముఁ గాంచ నుసు రక్కట నుండునె బొంది లోపలన్
యమ మహిషాగమంబున భయంబును బొందఁగ నొప్పు నెవ్విధిన్ 40
కనికరము సూప కించుక
మనుటకు నాడించ మించి మనుజుల కొఱకై
విను కోతిఁ బెంచి వీధుల
హనుమంతుని జప మిడుముల నందించుఁ గదా 39
మన మందుంచఁగ రామనామమునె యన్మండింట నశ్రాంత ముం
డును గాపాడఁగ వారి నెల్లరను వే డుల్లంగఁ గష్టాలు దు
ర్జన దోషాచర ణానుయాయ తతికిన్ సంతర్జి తాధ్రుఙ్మనో
హనుమన్నామ జపానురక్తులకు లభ్యంబౌను కష్టంబులే 38
[సంతర్జిత +అధ్రుక్ +మనః + హనుమన్నామ; సంతర్జితాధ్రుఙ్మనో
హనుమన్నామ జపానురక్తులు = తర్జింపబడిన నిష్కపట
హనుమన్నామ జపానురక్తులు కలవారు; అధ్రుక్ = నిష్కపటము]
భయము సెందక పోరుఁడు పాఱ నేల
రామ లక్ష్మణ కోదండ రక్షిత ప్ర
చండ భల్లూక మర్కట భండనమున
రావణుఁడు కుంభకర్ణుఁడు రక్ష మనకు 37
వే వడి రాజి రామునకు వీరులు వీరలు బ్రహ్మవంశ స
ద్భావ వరౌఘ దర్పిత సుబాహు పరాక్రమ విక్రమార్జితుల్
పావన లంకఁ గాచెడు నపార రుషాత్ములు దైత్యకోటికిన్
రావణ కుంభకర్ణులె తిరంబగు రక్షణ నిచ్చు దైవముల్ 36
తల్లిదండ్రులఁ జూడరు పిల్ల లకట
యన్నదమ్ములు పోరుదు రాస్తి కొఱకు
మోస పుత్తురు మిత్రులఁ గాసు లెంచి
మనుజులను సంఘజీవులం చనుట కల్ల 35
కనవలెఁ జావ నొక్క టిలఁ గాక సమూహము గూడు పద్ధతిం
గనవలె భృంగ తండమును గ్రమ్మఁగ నొక్కటఁ దేనెపట్టులం
గనవలెఁ జీమ దండులను గాంచన పంక్తి విధమ్ము సాగఁగన్
మనుజులు సంఘజీవు లను మాట యసత్యము గాదె చూచినన్ 34
పర్వ పర్వముల నుతింతు గర్వ ముడిగి
క్షీర జలధి సంజాత లక్ష్మీ సునామ
సర్వ సంపత్ప్రద దయా రస గుణ విజిత
పార్వతీ విష్ణుపత్నివై భద్ర మిడుము 33
ఉర్వినిఁ దామ సాంధము నహో నశియింపఁగఁ జేయ నిర్మలా
ఖర్వ విశేష తైలమును గంధ యుతమ్ము నొసంగ నే నిటన్
సర్వ జగత్తు వెల్గుల ప్రసారము నారయ దీప మందు నే
పా ర్వతి వీవు విష్ణు సతివై నను బ్రోవవె సత్కృపామతిన్ 32
[ఏపారు +వతి = ఏపా ర్వతి; వతి = దీపపు వత్తి; విష్ణువు = అగ్ని]
సత్వగుణ మది యలవడఁ జారుతరము
వేగ క్షీణమై యుండ రజో గుణమ్మ
హీన దుస్సహ నిజ తామ సేంద్రియముల
దారులం గొట్ట నేర్పె నధ్యాత్మబోధ 31
దారల్ పుత్ర ధనాదు లందుఁ దమి నిర్దాక్షిణ్య చిత్తమ్మునం
దా రీదంగ భవాబ్ధి రౌరవమునం దాపంబు నిక్కంబు నా
నారాటమ్ము మదిం జెలంగ వర వేదాధ్వమ్ము, వే వీడి తా
దారుల్ గొట్టుట, నేర్చినాఁడు విని యధ్యాత్మప్రబోధమ్ములన్ 30
శ్రీపతి కథా వితాన వశీకృ తార్త
చిత్తత నిరవధిక భక్తి సిక్త రక్తి
హరి పదాంభోజ యుగ చింత నామృతమ్ము
త్రాగువాఁడె శిష్టుఁ డనిరి ధర్మవిదులు 29
ఆఁగక భక్తి యుక్తము మహాధ్వర సంచయ మొప్పు చుండఁగన్
గోగణ దుగ్ధ మిశ్రితముఁ గూరిమిఁ గూర్చఁగ సంయమీంద్రులే
జోగుల హోమ కార్యముల సోమరసమ్మును విప్రదత్తముం
ద్రాగెడివాఁడె శిష్టుఁడని త్రాగుచుఁ జెప్పిరి ధార్మికోత్తముల్ 28
[ఇక్కడ ధార్మికోత్తము లన వరుణాది దేవతలు]
అంగన నీకేల యిఁక వి
హంగమ్ముల భంగి పొంగి యాశ్చర్యముగన్
నింగికిఁ జేరంగ ధరలు
బంగారముఁ గాంచితి భయపడితిఁ గొనంగన్ 27
అంగారమ్మనఁ గాల్చ వాయి నకటా యత్యంత మొక్కుమ్మడిం
గంగారుండఁగ నాదు చిత్తమున వీకన్నీటిఁ గాక్షించి నే
నుంగుం గంచును, గంది చూర్ణ మని యయ్యో తింటి నే నింత నా
బం గారమ్మును గాంచి, దూరముగ నేఁ బాఱంగ యత్నించితిన్ 26
[ఆబన్ + కారమ్ము = ఆబం గారమ్ము; ఉంగ +ఉంగ + అంచును = ఉంగుంగంచును]
క్రోల వచో రస
ముత్పల
మాల స
మత్తేభ ముక్త మధు రస ఘన
శా
ర్దూల ము దావహ
చంపక
మాలచ్ఛంద రసముఁ దమి మన ముప్పొంగున్ 25
శక్తి కొలందికిఁ జేసెడు
భుక్తి ప్రద నిత్య కర్మముల రాబడులన్
దిక్తట సంగత నిజ కర
భక్తి పెరిగి నట్టి జనుల బ్రతుకులు బరువౌ 24
[భక్తి = భాగము; కర భక్తి = కప్పపు భాగము]
రక్తినిఁ గొల్వ నన్య సుర రాజిని నిత్యము విత్త మందు నా
సక్తి సెలంగఁ జిత్తమున సంపద లింపుగఁ జేరు భక్తులన్
ముక్తికి ద్వారమై పుడమి మూర ముకుంద పదారవింద స
ద్భక్తియె మీఱఁగన్ బ్రతుకు భార మగున్ జను లెల్ల వారికిన్ 23
కుక్షి లయ భరణముల కవ
లక్షణములు సుమ్ము భూవలయమున నన ని
త్యాక్షయ సమ్మాద విభవ
మోక్షార్థికి వలయు మద్యమును జౌర్యంబున్ 22
రూక్ష తరైక వర్తన విలోల విహార విలగ్న చిత్తులై
యక్షయ గాత్ర శుద్ధి కమలాసన దత్త మహా నిజాన్న కో
శక్షయ రోగ కోటులఁ బ్రచండ గతిం గని సత్వరమ్ముగన్
మోక్షముఁ గోరువారలకు ముఖ్యము చౌర్యము మద్యపానముల్ 21
నలినాక్షుఁ గృష్ణు నిత్తఱి
తలంచి శిశుపాల ఘోర తాపము సెలఁగన్
లలి గూఢార్థమ్ములు నీ
పలికిన నిందలు మధురసుభాషితము లగున్ 20
కలవర మంద నేల సఖ కా వవి శాపము లెంచి చూచినం
జల మది వీడి చిత్తమునఁ జక్కఁగ నేఁగుమ వీటి కింకఁ దా
నలిగినఁ గన్న తండ్రి పరమాత్యయ చిత్తత స్వీయ పుత్రుతోఁ
బలికిన నిందలెల్లను సుభాషితముల్ గలిగించు క్షేమమున్ 19
తాఁ జనండు ధర్మ తత్పరతఁ గపట
వృత్తి చిత్త మందు నిత్తె ముండుఁ
గాసు లెంచి జనుల మోసగించు టది వ
క్రి కెటు కష్టమైన క్రీడ యగును 18
ఒకఁడ పదాఱు వేల సతు లుండఁగ నందఱి కన్నిరూపు లూ
ని కరుణ గారవించఁ గను నీరజ నేత్రుని లీల లన్నిటిన్
సకల చరాచ రావన విశారదుఁ డైన త్రివిక్రముండు చ
క్రి కెటు కనంగఁ గష్టమగు క్రీడ యగున్ సురమౌని నారదా 17
కంటిమి పూర్వము శుద్ధత
మంట లతామణులు పెక్కు మాన్యచరిత్రల్
కంటివె యీమెను వారల
నింటిని విడి తిరుగు కాంత యే సాధ్వి యగున్? 16
బంటు తెఱంగు దేవతలఁ బన్నుగఁ గొల్చుచు నిత్యకృత్యయై
కంట జలమ్ము నెట్టి తఱిఁ గానక మెచ్చ నిజాప్త కోటి తా
నింట ముదమ్ము మీఱ, మఱి యింపు కతమ్మది లేకయున్న నే
యింటికి స్వస్తి చెప్పుచు, యథేచ్ఛఁ జరించెడి కాంత సాధ్వియౌ 15
వాడిన ముఖమ్మునఁ బలికె
నేడ శివుఁ డనంగ భృంగి యీసున నందిన్
వేఁడి వడిన్ రమ్మని యా
గాడిద నెక్కి శశిధరుఁడు గాశికి నేఁగెన్ 14
గాడిద రావణాసురుని కంచర మింపుగ లాగుచుండఁ బో
నాడ భృశమ్ము భావ్యమె మహాత్ముల కిద్ధర నాఁ దలంచి తాఁ
దోడుగ నుండ నంది కట దూర్జటి నందిని పిల్చి, మెచ్చి యా
గాడిద, నెక్కి శంకరుఁడు గాశికి నేఁగె నుమాసమేతుఁడై 13
అల్ల రేల త్రాగు మన్నఁ దల్లి కినిసి
పళ్ల రసము కలిపి చల్లఁగాను
బాలు త్రాగ నొల్లఁ, బన్నుగఁ దెమ్ము స
ముదము, వలదటంచుఁ బోఱఁ డేడ్చె 12
[సమ్+ ఉదము = సముదము: మంచి నీళ్లు]
ముదమున నాడఁ డాటలను ముక్కుచు మూల్గుచు నుండు నొంటిమై
కదలక కూరుచుండి కడు కాఱియ నొందుచు నుంటఁ గాంచగం
బదపడి నిత్యమైన మల బద్ధము నారసి వాని కీయ నా
ముదమును రోసి వద్దనుచుఁ బోఱఁడు బిట్టుగ నేడ్చె నత్తఱిన్ 11
పలు విధమ్ముల సకల జీవులను దుఃఖ
సాగరమ్మున ముంచి భృశమ్ము సెలఁగు
త్రిపురములఁ గూల్చఁ దన మదిఁ దీవ్ర భీమ
హలముఁ దాల్చిన శివుఁడె దిక్కగును మనకు 10
[హలము = కలహము]
కలవర మింత లేక మది గౌరి యొడంబడ లోకరక్ష నెం
చి లలనఁ గూడి భద్రగతి శీఘ్రమ యచ్చట కేఁగుదెంచి వే
జలధి జనించి ప్రాణులను జంపఁ గడంగిన క్ష్వేళ మా హలా
హలమును దాల్చినట్టి నిటలాక్షుఁడె దిక్కగు నెల్లవారికిన్ 9
విత్త మిది మేనమామకు
దత్తఱ లేక సతియైన దర్మం బనఁగా
నిత్తోయజాక్షినిన్ మే
నత్తను బెండ్లాడవచ్చునా యని రెల్లన్ 8
ఎత్తిన చేయి దించకయు నెప్పుడు మ్రింగుచు నుండు స్థూల కా
యాత్త రుజా ధనుండు నకటా తలపం గుసు మాభ తన్వియే
యిత్తరుణీ మతల్లి తరలేక్షణ యిత్తరి క్షుత్పిపాసిఁ దా
నత్తను బెండ్లియాడఁ దగునా యని నవ్విరి బంధులెల్లరున్ 7
[అత్త = తినువాఁడు]
వీఁక నిడ ఫల వనమ్ములు
ప్రాకటముగఁ బండ్ల మీద బ్రతికెడు ఖగముల్
కేకి గణ శారికా శుక
పైకముతోఁ గర్షకుండు పాడైపోవున్ 6
[పైకము = పికముల సమూహము]
చీకాకుల్ నిజ దార పుత్రులకు దుశ్శీలుండు కల్పించి తా
నేకాంతమ్మున నిత్య ముండి తలచున్ హేయంపు టాలోచనల్
పైకమ్ముల్ కృశియించ దుర్వ్యసన తప్త ద్రోహి మద్యంపుఁ బై
పై కంబున్ గొని కర్షకుండు ఖలుఁడై భ్రష్టత్వముం బొందులే 5
[కంబు = సుఖము]
రాట్నమున వడుక బట్టలు
రాట్నముల మయమ్ము సేయు రతి దేశంపుం
బట్నపు టింటింట నిలిపె
రాట్నము విడిగాంధి యిదె స్వరాజ్యముఁ దెచ్చెన్ 4
[విడి = ప్రత్యేకమైన / ఒంటరి]
కొట్నపు జీవ మేల యని కుందుచు నిత్యము భారతమ్మునం
బట్నము పల్లె వాసులు నపార ధృతిం గని నేత కిచ్చెడిం
గట్నము సత్య శాంతి పరఁగంగఁ గరమ్మున నాగ్రహాఖ్యమౌ
రాట్నము వీడి తెచ్చెను స్వరాజ్యము గాంధి మహాత్ముఁ డొప్పుగన్ 3
[కొట్నము = ఊడిగము; రాట్నము =చక్రము; ఆగ్రహ మనెడు చక్రాయుధము]
భారత రణభూమిఁ బాండురాజ సుతుండు
శత్రు భీకరుండు శమన సముఁడు
భద్ర కుంజ రాభ రౌద్రాననుండు భీ
మునిఁ గని భయపడిరి పుడమిదొరలు 2
మనముల శాప శంకితులు మాన్య తపో నిరతుండు శంభు వ
జ్జిన వరుఁ డత్రినందనుఁడు శిష్య సమేతము శశ్వ దాగ్ర హా
వనిసురుఁ డంబరీషు సభఁ బాద సరోజ మిడంగ నత్తరిన్
మునిఁ గని రాజులెల్లఁ దలపోసిరి కాలుఁ డటంచు భీతితోన్ 1