అన విని కనలి కరము ప
ల్కె నిట్టు లామిత్రు తోడ లీలన్ హేలం
దన కడపటి చిన్నాన్నకుఁ
దనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టు లగున్ 59
అనుజుం డన్నఁ గరమ్ము దగ్గ రగు నాప్యాయమ్ముగా నీ కహో
విను మీ చుట్టరికమ్ము నిట్లు తలఁచన్ వింతౌచు దూరమ్మగుం
దన ముత్తాతకు జ్యేష్ఠ నందనుని సంతానమ్ములోఁ బెద్దకుం
దనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్ 58
కాలము కాఁ బ్రళయమునకుఁ
గాలాంతకుఁ గాంచఁ జేరి కైలాసమ్ముం
గాలగ్రీవుని మహిమం
గైలాసమున నహిపైనఁ గంజుఁడు పండెన్ 57
[అహి =మేఘము]
ఏ లోకమ్ముల జన్మ రక్షణ లయాం తై కైక కార్యోన్ముఖుల్
హేలా లీలఁ ద్రిమూర్తు లుందురు నిజంబే! సత్యలోకమ్ములోఁ,
గాలాతీతము వెల్గఁగా హర హరుల్, కాంతామణిం గూడుచుం
గైలాసమ్మున శేషతల్పమున, సౌఖ్యం బందె వాణీశుఁడే 56
పస్తు లుండి నంత భక్తి కల దనంగఁ
జోద్య మగును జిత్త శుద్ధి వలయుఁ
గ్రీస్తుని సతతమ్ము ప్రస్తుతింతు రెడందఁ
గ్రైస్తవులకె కద్దు రామ! భక్తి 55
భామరొ దేవుఁ డొక్కఁ డగు వాని కనేకము నామధేయముల్
భూమిని నొక్క రొక్కరిని ముక్తికిఁ గొల్తురు వేఱు వేఱుగన్
లేమ నిజమ్ము నమ్ము నను గ్రీస్తున కిద్ధరఁ, దల్చి చెప్పెదన్
రాముని, భక్తు లెవ్వరనఁ గ్రైస్తవులే కద యెంచి చూచినన్ 54
వలపు టలుక చెలరేఁగఁగ
నెలఁతుక పాన్పు పయి నుండి నేలన్ రాలన్
లలితముగఁ ద్రోయ భర్తను
దలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్ 53
[ఇక్కడ తలగడతోఁ గొట్టినది భర్త]
తలపయి పెట్టు కొంచుఁ దగ దారలు కొల్వఁగ నర్హు లౌర పే
రలుకను జెంది నట్టి సతు లక్కట నేర్తురె మంచి చెడ్డలం
గలుగఁగఁ గోప మెక్కువగఁ గాంతకు కాంతుని మీద నంతటం
దల గడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే 52
[...దల (న్) గడతోడ; బ్రద్దలయ్యెనే : అతిశయోక్తి మాత్రమే]
దుస్తర జన్మ పరంపర
విస్తరము చెలఁగమి గతులు విశదము లిందున్
హస్త బలమ్మున నాపిన
పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్ 51
ప్రస్తర భంగి చిత్తములు వారక మారిన నిశ్చయమ్ముగన్
దుస్తర మైన భావములు దుష్కృత కారక చింతనాళియున్
మస్తము నందు దుష్ట తర మార్గము లుద్భవ మంద ఘోర దు
ష్పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్ 50
క్రాలుచుఁ గుడ్యమ్మున నళు
లాలు మగలు వగలు వోవు చాడం బ్రేమన్
వాలము నూపుచు సతి పతిఁ
దేలును ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్ 49
ఆలుల కెంచ డెందమున హర్షము రోషము లావహించగాఁ
జాలరు నాథు లెవ్వరును సైఁచగఁ బర్యవ సాన మెన్నడుం
గాలము సెల్ల నల్క కిఁకఁ గాంతుని, నాథుని నింకఁ జిల్క రౌ
తేలును, ముద్దులాడి సుదతీమణి బల్కెను దీయతీయఁగన్ 48
[చిల్కరౌతు + ఏలును = చిల్క రౌ తేలును]
ధూర్తులు చెలరేఁగి యహో
యార్తి నొసఁగఁ జూతు రంచు నాత్రము మదిలో
వర్తిల నిత్తరి మిక్కిలి
కార్తిక దీపమునుఁ గాంచఁగా భయమయ్యెన్ 47
వార్తలు విందు మెన్నఁడును భగ్గున మండెను మేడ లంచు ము
మ్మూర్తుల రుద్రు నేత్రమును బోలి చెలంగి భృశమ్ము నేఁడు సం
వర్తము వచ్చు నేమొ యని భాసుర మై యట మండుచుండఁగాఁ
గార్తిక దీపముం గనులఁ గాంచఁగ భీతి జనించె మెండుగన్ 46
కలయో వైష్ణవ మాయయొ
మలిగెను నరకుంజరమ్ము మాయఁగ బలమే
యల బభ్రువాహనున కని
నెలుకలు తమ కలుఁగులోని కేనుఁగు నీడ్చెన్ 45
[నర కుంజరము = అర్జునుఁ డను నేనుఁగు; ఇచట
బభ్రువాహనుఁ డొక్క ఎలుకకు కాక పలు నెలుకలకు సమానము]
పలువురు పైనఁ బడ్డ మఱి వారికి సింహబలుండు చిక్కఁడే
కలిగిన వీర్య ధైర్యములు కార్య వివేకము తద్ద యున్ననుం
జెలఁగి వనమ్ములోఁ గరము సింహ సమూహము, సూచుచుండఁగా
నెలుకలు, మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగు లోనికిన్ 44
[కలుఁగు = గుహ]
గాన వేదిక కాఁగ నాకాశ మచటఁ
దారలు చెలంగ నింపగు తారల వలె
వదనములు వెల్గఁ దోయజ వైరి భంగి
నాకసము నందుఁ దోఁచె శశాంక శతము 43
దూఁకఁగ మత్స్యకోటు లవి తోఁచఁగఁ దారల పంక్తి భంగినిన్
వీకఁ జెలంగ నంత వినువీధిని నుర్ములు వాన కుర్య నా
రాకకు నీటిబొట్టుల పరంపర వెల్గఁగ సందరమ్ము నా
నాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై 42
ధిగ్దేహమ్ము మది దినా
న్వగ్దిన వర్ధనము గాఁ దనరవలె నన్నం
బ్రాగ్దిఙ్ముఖుండ వయి తగ
వాగ్దేవీ పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్ 41
రుగ్దేహమ్ము తలంచ కుత్తమ మనన్ రోగమ్ము నిక్కంబ యీ
దృగ్దర్పమ్మును వీడి చిత్తమున భక్తిన్ నిల్పి పూజింపుమా
దిగ్దేవాళి సదార పూజలు రమాదేవీ సమీపంపు టా
వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్ 40
చక్కదిద్దు సతము శాంతియె పగల న
డంచి సకల రాజ్య సంచయముల
నేల మనకు వీరుఁ డీ భండన కళా వ
శంకరుండు వలదు శాంతి వలయు 39
అంకము కోర మిత్తరి యనర్థము లిచ్చుఁ గరమ్ము పూని తాఁ
బొంక మెడంద మిక్కిలి త్రిమూర్తుల మేటి భృగూత్తమర్షియే
యంకము సేరి కన్గొనె మహాత్ముఁడు నోర్పరి విష్ణు వుండఁగా
శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిం గనన్ 38
శత్రు కాయపు వ్యూహ విశదము తనదు
ఱెక్క సందులఁ గట్టిన ఱేని వాడి
వార్త నిట మోసికొని వచ్చి యార్తి నింకఁ
బ్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము 37
కాణాచిం బడి యుండ కేలఁ బడెనో కంటం బురిన్ డేగకుం
ద్రాణార్థమ్ముగ శ్యేన భీతము ధరం దాఁ జేరి వేగమ్ముగా
వాణీశుద్ధున కక్కటా శిబికి దుర్వారమ్ముగాఁ జెంత హా
ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో 36
తపతప యాడించఁగఁ గం
చు పాత్రలో గులక ఱాళ్ల చొప్పయ్యెను నీ
దు పలుకులు వికారము లివి
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్ 35
రెపరెప లాడ నిండ్ల పయి రివ్వున టెక్కెము లల్ల నల్లనం
దపతప ఱెక్క లూపుచుఁ బతంగము లుబ్బునఁ దిర్గఁ జెల్గఁగన్
"మపద నిసా" స్వరమ్ము లవి మత్తుగఁ గాల్చఁగఁ జిచ్చుబుడ్డులం
డపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్ 34
[(సరిగ) మపదనిసా]
ఎన్నెన్ని లేవు కొంపలె
యెన్ని మన గృహమును వేసి యింటికి నయ్యో
కన్నము దొంగలు వచ్చిరి
యన్నా యను పిలుపును విని యడలితి నయ్యో 33
మిన్నును దాఁకెఁ గాంచనము మేడల నమ్మినఁ గాని నేఁడిలం
గొన్న విధమ్ము గాంచ మయొ గొంతెమ కోరిక నిట్లు కోరఁగాఁ
జెన్నుగ స్వర్ణ మేఖలను శీఘ్రమ కొంచును రాఁ గదన్న యీ
యన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్ 32
తోటలఁ దిరుగు చుండు సంతోషముగను
గీడు సేయఁ దా నేరదు పాడి కాదు
చాలు నీ ఘోర మింక శశమును, వినుమ
నన్ను దయ, మాలి! చంపుట న్యాయ మగునె 31
చనియెద నింక నీ గుణము చక్కఁగ నేరితి నబ్బురంబు నౌ
తనరు రహస్య మంతయును దప్పక చెప్పెద నంచు లంచ మీ
పని పని మీద యబ్బ పని పంచుచుఁ జేయఁగఁ బల్క వింతయున్
నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా 30
మాయదారి యీ క్రిమి వచ్చెమహిని నేఁడు
రాజ్య ముఖ్య పట్టణమున రామ! రామ!
ప్రభువులే నిరోధించఁగ బాణసంచు
దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు 29
తాపము కల్గఁ జిత్తములఁ దద్దయు దర్శన కాంక్ష నీరు కా
దీపము లెల్ల నాఱ నటఁ దీవ్ర తమస్సు చెలంగ వాటికా
గోపన కారణమ్మునను ఘోర తరానిల వేగ సంచల
ద్దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్ 28
[దీపము = 1. దివ్వె, 2. తీఁగ]
అన్నదమ్ము లిద్దఱు గూడి యాడుచుండఁ
దత్క్షణము పల్కు ఘోరానృతమ్ము ననుచు
నన్న యడుగఁ జెప్పె నిటులఁ జిన్నవాఁడు
నరకునిం జంపె సీత వానరులు గనఁగ 27
పరులు తలంతు రివ్విధిని భామయె నిల్చి వధించి నట్టులం
బరఁగఁగ నేల సందియము పద్మ సులోచన! చిత్త మందు నా
వరసతి సత్యభామ తన ప్రక్కన నుండఁగ వాసుదేవుఁడే
నరకునిఁ జంపె సీత! సురనాథుఁడు దైత్యులు వా నరుల్ గనన్ 26
[వా నరులు = నో రున్న (తెఱచిన) నరులు]
ఆ మానిసి మిన్న కలువ
మోము నలరు పుడమి కానుపు మగని బువికిన్
సామిని కడింది జోదుని
రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్ 25
బూమిని జోగిబొబ్బమెకముం గని వానిఁ గడింది ముంచఁగా
వే మెయి చెన్ను వెల్గులను వింతగఁ దామరకంటి జూపఁగా
నేమని చెప్పగా వలయు నీ జడదారికి, గొప్పయొజ్జ దా
రాముని, మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే 24
కాఁకలు తీరినట్టి నర కాంతుల నెల్లర ఘోర దుస్స హా
నీకము తోడ వీఁక ఘన నిగ్రహ కాంక్ష జయించి శక్తినిన్
శ్రీకర కాకతీయ నృపశేఖర తీష్ణ పరాక్రమ ప్రభా
ప్రాకట రుద్రమాంబ నిజ రాజ్యము నిల్పెను భీతి వాయఁగన్ 23
భాష్యము లగు భాషణములు పలుక మప్ర
ధృష్యముగను బలుకకు మీ తీరు మాట
దూష్య మౌను సుగ్రీవుఁడు దూఱె నందు
ఋష్యమూకమ్మునకు వాలి యేఁగి దాఁగె 22
వెయి నుడు లేల యల్పులె భువిం గల విప్రులు యెంత వీర్య ము
న్న యతఁడు లొంగు దుర్బలుఁడు నాఁగ మతంగ మహర్షి శాప భీ
తి యెడఁద నుంచి నాశిత ధృతిం దన కుందని ప్రాణ హానియే
భయపడి ఋష్యమూకమున, వాలియె దాఁగెను ప్రాణరక్షకై 21
పలుకఁగ నెంచ నిజము ధూ
ర్తులు మాత్రము కారు కాని తోరమ్ముగ లో
లులు జయలక్ష్మికి వారలు
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్ 20
వలచు జయమ్ము సంతతము వాక్పటిమం దనరించ నేఁడు యీ
పలికిన మాట నిక్కువము వాదము నెగ్గుట ముఖ్య మే విధిం
దలఁచిన వారి యోటమినిఁ దథ్యము నా వెనుకాడ రెవ్వరుం
బలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే 19
నేతల కింపుగ స్వజన
వ్రాతము మెచ్చఁగఁ గడింది పట్టుదలం దాఁ
బ్రీతి దనర శాస్త్ర్యుక్తపు
భౌతిక శాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్ 18
పూతులు ధాత్రి వ్యాస కవిముఖ్యుల సన్నుతి సేసి ధర్మ సం
వీతము, మించి ఛందము కవిత్రయ పూర్వకవీంద్ర సత్కృతి
వ్రాతము వే పఠించి ఘన వ్యాకర ణావృత మాంధ్ర మింకయున్
భౌతిక శాస్త్రముం జదివి, పద్యకవిత్వము వ్రాసె మేలుగన్ 17
[కవి = వాల్మీకి మహర్షి]
విద్రుమ మే యగు రాత్రిన్
నిద్రాసక్తుండ వైన నీకు సుఖంబే
క్షుద్రం బీ సుద్దనృతమె
నిద్రాసక్తుండ వైన నీకు జయమ్మౌ 16
భద్రం బిచ్చును రాత్రి నిద్రయె శిరోభారమ్ముఁ దగ్గించుచున్
నిద్రా భంగము కాక యున్న నిసిలో నిత్యమ్ము నిక్కంబు యీ
మాద్రిం గాక దినమ్ము నందు విడుమా మధ్యాహ్న కక్ష్యాంత రా
నిద్రాసక్తుఁడ వైన నీకు జయమౌ నిక్కం బిదే నమ్ముమా 15
[కక్ష్యాంతర +అనిద్రాసక్తుఁడ = కక్ష్యాంత రానిద్రాసక్తుఁడ]
వాలిఁ గాంచి యంత మాల లేని కపిని
విల్లు నెక్కుపెట్టి వేగ వేసి
రాఘవుండు దా నమోఘ శిఖిని ధర్మ
రక్షకుండు గొనెను ప్రాణములను 14
ఈక్షితి మాన వాకృతిని హీన మనస్కులు దుష్ట చిత్తులున్
భక్షణ మెంచి సంతతము వారక మత్స్య విహంగ జన్యులన్
దక్షతఁ బట్టి తిందు రని తా మది నేరకయే శశమ్మహో
రక్షకుఁ డంచుఁ జేరఁగనె ప్రాణము దీసె దయావిదూరుఁడై 13
ఆజినిఁ గుంజర ఘన రథ
వాజిస్థ ధనుర్ధరులకు భయపడిన మహా
భూజ స్థోత్తరుఁ డీయఁగ
గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్ 12
భూజను లిట్టి యబ్బురపుఁ బోరులు మెచ్చరు హస్త నేత్ర స
ద్భోజన మంచు నెంచి కని దోర్బల గర్వయుత ప్రమీలనున్
వాజి సహేషిత ప్రమద వాహన చారిణి నాతి రుక్మపుం
గాజులు గల్లు గల్లనఁగ గాండివ మెత్తె ధనంజయుం డనిన్ 11
చవి లేని పాట లెల్ల వి
ని విని యసహనమునఁ దాఁ గినిసి సభలో ని
ట్లవహేళనముగఁ బల్కెను
శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్ 10
భువి నీరీతిఁ జెలంగు హాస్యములు సమ్మోహమ్ము వెల్గం గర
మ్ము వచశ్శుద్ధియు నింక నైపుణము సన్ముద్రాదులం గావలెం
గవి ముందుండఁగ నొత్తి పల్కకుమ యీ “కా” నిట్లు దా గాడ్దయౌ
శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా 9
వ్యాకరణము నేర్పి వీఁక ఛందస్సును
శబ్ద భావములు విశదము సేసి
మూరి మంచి చెప్పు వారిని నిందించ
కు కవులెల్ల మనకు గురువులె కద 8
కకవిక లైన కేశముల కాంతకు భూషణ వస్త్ర భూషితాం
గికిఁ గల భేద ముండుఁ బరికించఁగ గ్రామ్య విశుద్ధ భాషలం
బ్రకటిత దుష్ట వృత్తులను రంజిలఁ జేసి ద్రుతాది సంధులన్
వికలము సేసి యట్టు నిడి వింతగ నుత్తున కెందు వ్రాయు నా
కుకవులు వార లెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!!! 7
పొద్దు పొడువక పూర్వమ్మ ముదిత లెల్ల
లేచి మఱచి పెట్టిన చోటు సూచి చూచి
రుబ్బినట్టి పిండిని నింట నబ్బ యంచు
నతివ లెల్లరు రోసెద రట్లతదియ 6
[రోయు = వెదకు]
పతి సుత బంధువర్గమును బండుగ వచ్చెను లెండు లెండు నా
నతివలు వల్కి వేసి తగ నట్టులు కమ్మగ వేఁడివేఁడిగాఁ
జతురత నెల్ల వారలకుఁ జక్కగ మోదము గూర్తు రింపుగా
నతివలు మెచ్చ రట్లతదియన్? మగవారల పండు గందురే? 5
పుట్టిన దివసమ్ము తొట్టి కట్టె కొఱకు
గట్టి దెబ్బలు దిని ముట్ట దివము
మట్టిలోనఁ బుట్టి మట్టిలోఁ గలయంగ
మట్టిఁ బోసె మఱఁది మామ మురిసె 4
బెట్టిద మైన పట్టుఁ దగఁ బెట్టుచు గట్టునఁ బట్టి యెట్టులో
గుట్టుగఁ బోయి రట్టు సెడఁ గొట్టున కింపుగఁ దెచ్చి తట్టనున్
దట్టము గాఁగ నాఱు నొక తట్టను జెప్పఁగఁ జెప్ప దొడ్డిలో
మట్టినిఁ బోసె నా మఱఁది మామయు నత్తయుఁ గాంచి మెచ్చఁగన్ 3
ఈ లలనలె యల సత్వము
నాలాపించిన ధనక్షయ సుఖక్షయముల్
సాల యగుఁ గాన స్వీయ
స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్ ! 2
చాలము సూడఁ జక్షుల నిజద్యుతి గాత్ర విరాజమానలన్
ఫాల కరాబ్జ సంస్థితము పన్నుగఁ గాంచుచు భక్తి మీఱ దే
వాలయ దర్శిత ప్రముఖ భక్త గణార్చిత లైన త్రై కకు
త్స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్ 1
[త్రై కకుత్స్త్రీలు = ముగ్గురు ముఖ్యుల కూటమి కి జెందిన స్త్రీలు; త్రిమూర్తుల భార్యలు]