7, ఏప్రిల్ 2021, బుధవారం

Ugaadi kiirtanalu

యుగాది వర్ణనములు.

ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.

 

 

 

 

 

 

 

కం.

 

ప్రభ వాద్యక్షయ చరమము

లభయదము లఱువది యేం డ్లిహమునఁ జెలంగున్ 

నభమునఁ దారల భంగిం

బ్రభవించుచు మఱి మఱి యిలఁ  బద్మాక్షు దయన్            

1.      

 

 

 

సీ. మాలిక

ప్రభవ విభవ శుక్ల వఱలఁ బ్రమోదూతయును బ్రజోత్పత్తియు నుర్విఁ జెలఁగ

నాంగీరస శ్రీము ఖాబ్దము భావ యువయు ధాతు నామపు వత్సరమ్ము

నీశ్వర బహుధాన్య యింకఁ బ్రమాది విక్రమ విషు చిత్రభాను మహి నలరఁ

గ స్వభాను తారణ కదియఁ బార్థివ మఱి వ్యయ సర్వజిత్తులు పరఁగ నింక 

సర్వధారి విరోధి చనఁగ వికృతి ఖర నందన విజయలు నందు నింక

జయ మన్మథ లలరఁ జను దుర్ముఖియు హేవిళంబి విళంబులు సంబరంబు

గ వికారి శార్వరి ప్లవ శుభకృత్శోభకృత్తులు  క్రోధియు సత్తు సూప

విశ్వావసు మఱి భువిఁ  బరాభ వాబ్దములు ప్లవంగ కీలకలు దనరంగ

సౌమ్య సాధారణ సమలు విరోధికృత్తును బరీధావియు దనర నమ్మ

హా ప్రమాదీచయు నానంద రాక్షస నళ పింగళ సమలు నాట్య మాడఁ   

 

 

తే.గీ.

 

 

గాళయుక్తి సిద్ధార్థులు కాంతి నీయ

రౌద్రి దుర్మతి దుందుభు లద్రి నిభము

లు రుధిరోద్గారి రక్తాక్షులు దనరంగఁ 

గ్రోధ నాక్షయ లఱువది  కూర్మి వచ్చు

2.     

 

 

 

 

పరాభవ నామ సంవత్సరపు టుగాది. 19/03/2026.

 

 

 

 

ఉ.

ఈ వపరాభవై తనరి హీనపరాభవ గానొనర్పుమా

యీ వసుధాతలమ్మును నహీన పరాభవ వత్సరంబ నీ

దీవనలే సెలంగఁ గడతేఱ విపత్తులు విశ్వ మందు వే

కావు మొసంగి శాంతిని సుఖమ్మును మెండుగ మానవాళికిన్    

3.     

 

 

 

చం.

పెరిగెఁ బరాభవమ్ము లిల విశ్వ విశేష జనాంతరమ్ములన్

నరులకు ద్వేష భావము ఘనమ్ముగ నాత్మల నుద్భవించెనే

విరివిగ యుద్ధ మేఘములు విశ్వ నభమ్మున సంచరింపఁగా 

నరయవె నూత్న వత్సరమ యమ్మవు నై యిల నింకఁ గావవే

4.     

 

 

 

మ.

అవమానం బని నిన్ను నెంచెదరు నిత్యం బాత్మ లందుం బరా

భవ మన్నం బరమంపు మోక్షమని సంభావింప నొప్పున్ ధరన్

స్వవనీ సంతతి మోక్ష కారణము నిత్యానంద సంధాయినీ

భవ బంధమ్ములఁ ద్రెంపు మమ్మ వసుధా భద్రమ్ము నిమ్మా కలిన్

[పరా + అభవము = పరమ మైన జన్మ రాహిత్యము]                    

5.     

 

 

 

 

విశ్వావసు నామ సంవత్సరపు టుగాది. 30-3-2025

 

 

 

 

 

ఓ విశ్వావసు నామ వత్సరమ పౌరోద్యోగ సంధాత్రివై 

భావోద్రేక వినాశకారిణివి నై భద్రార్థ సంరంభివై

దైవానుగ్రహ పాత్రులై జనులు నిత్యంబుండు నట్లింపుగా

వే వీక్షింపుమ శాంతి సౌఖ్యము లిలం బెంపొంద నిమ్మా దయన్        

6.     

 

 

 

 

విశ్వక్షేమ రతాంతరంగ వికసద్విశ్వావసూత్తుంగ నా

మైశ్వర్యప్రమ దాయు రుచ్చతమ విద్యా కార్య సంధాయకీ  

శశ్వల్లోక జనౌఘ వర్ధన సు రక్షాదక్ష విఖ్యాత మ

మ్మాశ్వాసింప దయార్ద్ర చిత్త వయి రమ్మా వర్ష వర్గాగ్రణీ        

7.     

 

 

 

 

అలసిరి జనులీ క్రోధిని

నల పొసఁగక సుఖ మొసంగ నందఱి కిలలోఁ

జెలువము మీఱఁగ వత్సర

లలామ విశ్వావసు వెస వ్రాలుమ జగతిన్

8.     

 

 

 

 

క్రోధి నామసంవత్సరపు టుగాది: 9-4-2024.

 

 

 

 

 

తనరం గ్రోధి వరాఖ్యయే గరిమ వీతక్రోధినీ! సంతతం

బనివార్యద్యుతి మానవాలి కిలలో నైశ్వర్య మింపారఁగా

నొనరం జేసి దయార్ద్ర చిత్త వయి నిత్యోద్యోగ సంసక్తతన్

మన నిమ్మా విగతక్షు ధార్తులుగ సంభావించి వర్షోత్తమా!      

9.     

 

 

 

 

శోభకృన్నామ సంవత్సరపు టుగాది: 2023

 

 

 

 

ఉ.

శోభకృ దంచి తాఖ్య ధర శోభ లొసంగుచు నిత్య సర్వ లో

కాభయ సుప్రదాత్రి వయి హాటక సర్వ వసుప్రదాయినీ

శోభల వెల్గి రోగ కర సూక్ష్మ భయంకర కీటకఘ్నవై

లాభ విధాయక ప్రవిమల స్థిర కార్యము లిమ్ము వర్షమా!      

10.    

 

 

 

 

శుభకృన్నామ సంవత్సరపు టుగాది: 2022

 

 

 

 

మ.

శుభకృన్నామ వరాబ్ద మిద్ధరఁ గడున్ శోభాయమానంబునై

శుభ సందోహ సమావృతం బగుచు సంక్షోభ క్షయ క్రీడలం

బ్రభవిల్లున్ జన కోటి కీయఁగ వెసన్ భద్రాయు రారోగ్యముల్

విభవమ్ముల్ విలయం బొనర్పగఁ దమిన్ విధ్వంస కీటాలినిన్

11.    

 

 

 

 

ప్లవ నామ సంవత్సరపు టుగాది: 2021

 

 

 

 

ఉ.

ఈ ప్లవ నామ వత్సర మహీన పరాక్రమ వీర్య యుక్తమై

విప్లవ ఘోర కీటక సవిస్తర నాశక యజ్ఞ సాగ రా

వప్లుత శుద్ధ దేహి యయి వాత జలానల భూత భీక రో

పప్లవ హీనమై సుఖ శుభప్రదమై యలరారుఁ గావుతన్

12.    

 

 

 

ఉ.

కంటిమి యా వికారి నటఁ గంటిమి శార్వరిఁ గంటగింపుగాఁ

గంటక హీనమై చెలఁగఁ గందు మికం బ్లవ వత్సరమ్మునుం 

బంటలు పండ మెండుగను బాడియు సంపద లుండ నిత్యమున్

మింటను రేఁగి వర్షముల మేఘము లీయఁగఁ జాలినంతగా   

13.    

 

 

 

శా.

పంచాంగమ్ములు భవ్య భూషణములై భాసిల్ల ద్యోతిర్మహా

సంచారమ్మలు నీ పదాంకములునై సంధిల్ల ఋత్వాలి ద్వ

చ్చంచన్నేత్ర దృగాలియై చన నహశ్శ్యామా ద్వయమ్ముల్  త్వదీ

యాంచన్నేత్రములై వెలుంగఁ బ్లవ నా మాబ్జాక్షి  దీవింపుమా

14.    

 

 

 

 

శార్వరి నామ సంవత్సరపు టుగాది:   

 

 

 

 

ఉ.

సర్వ సుఖప్రదమ్ము నయి శాంతిదమై సుజ నౌఘ సమ్మ దా

ఖర్వ వినోద సంభరిత కార్య కలాప విరాజితమ్మునై

పూర్వ సమోధ్భ వాధమ విమోహ వికార వినాశకారియై

శార్వరి యుర్విఁ బర్వములఁ జారుతరమ్ముగ నిచ్చుఁ గావుతన్

15.    

 

 

 

కం.

క్రిమివర కరోన కుక్షి

క్రిమి కలుష కరానుగత వికీర్ణ వ్యతిరే

క మహోజ్వల బల సంప

న్న మయి విరాజిల్లు గాక నవ శార్వరియే

[కర +ఊన + కుక్షిక్రిమి  = కరోనకుక్షిక్రిమి : చేతులు తక్కువగాఁ బొట్ట గలిగిన క్రిమి]     

16.    

 

 

 

 

వికారి నామ సంవత్సరపు టుగాది:

 

 

 

 

 

హారతు లొసంగ రండు వికారి నామ

రాగ సంవత్సర ద్విజ రాజ రమ్య

పక్ష విక్షేప సంజాత వాత వేగ

చోదిత ప్రాప్త భాగ్య రాసు లరయంగ!                

17.    

 

 

 

 

ఆంగ్ల నూత్నసంవత్సర కీర్తనలు:

 

 

 

 

కం.

మొదట సమమ్మునకు నెలలు

పదియే మార్చి యొకటి యయె వర్షాది యటన్

పిదప పెరిగె రెండు నెలలు

తదుపరి జనవరి యొకటియ తథ్యంబయ్యెన్

18.    

 

 

 

తే.గీ.

ఆంగ్ల మానపు సంవత్సరాది వచ్చె

పూర్వ వత్సర వేదన లుర్విఁ దలగు

రెండు వేల పయి పదియే డుండు నిపుడు

నూత్న వర్షమ్ము కడిగిన రత్న మనఁగ

19.    

 

 

 

కం.

కుసుమ సుకుమార సమ మా

నస చోదిత కర్మనిచయ నందకమే యీ

ద్విసహస్ర సప్త దశమము

వసుధైక కుటుంబ భావ వాత్సల్యమునన్                      1/1/2017

20.   

 

 

 

 

నూతన ధైర్య విక్రమ వినోద సమంచిత పూర్ణ భాగ్యముల్

చేతన సంయు తోత్తమ విశేష వివేక విలాస భోగముల్

నీతి విచార కార్య చయ నిర్జిత శుద్ధ యశస్తరంగముల్

శీత గిరీంద్ర నాథు దయఁ జేకురుఁ గావుతఁ గ్రొత్త యేటినిన్    1/1/2019

21.    

 

 

 

మ.

ద్విసహస్రోత్తర వింశ తీరిత మహా విధ్వంస కీటమ్ములన్

వెస సంహారము సేసి నూతన సమావిష్టమ్ము తోరమ్ముగా

నొసఁగంగా వలె లాఘ వాయువుల నుద్యోగప్రమోదమ్ములన్

లస దాదాయ సమగ్ర విద్యలను మిత్రత్వమ్ము విశ్వమ్మునన్           

22.   

 

 

 

శా.

నూత్నాం గ్లాబ్ద మొసంగుఁ గాత జన సందోహేప్సి తాకాంక్షలన్

రత్నవ్రాత స శౌక్తికేయ యుత పారావార వృత్తావనిన్

యత్నోద్దీపిత కార్య కాయ ఘన సద్యః ప్రాప్త సాఫల్యమున్

నూత్నారోగ్యద కీటకక్షయము సంతోషమ్ములన్ వేగమే      

23.   

 

 

 

ఉ.

వచ్చెను గ్రొత్త యేఁడు మఱి పన్నుగఁ దెచ్చును సంబరమ్ములం

గుచ్చుగఁ బుట్టి నట్టి పురుగుం గని చంపును దిట్టయై వడిం

బచ్చని పంట లిచ్చుచును బాడి నొసంగును మిక్కుటమ్ముగా

నచ్చము తిమ్మ నిచ్చు నిఁక నందఱి కింపగు సొమ్ము విద్దెలన్         

24.   

 

 

 

చం.

సతము సహస్ర యుగ్మ సదశద్వయ సద్వి సమావరమ్ము భా

రత ఘన దేశ విశ్వ జన రంజక సౌఖ్యద దుర్వ్యధా నివా

రిత జిత రోగ సంప దభివృద్ధి విధాయక శాంతి యుక్త వ

ర్జిత నిజ మత్స రాది గుణ వృత్త మొసంగును గాక సద్దయన్          

25.   

 

 

 

శా.

 

నూత్నాంగ్లేయపుఁ టేఁడు వచ్చినది సంతోషమ్ము మిన్నంటఁగన్

యత్నా లెల్ల ఫలింప విశ్వమునఁ బౌరౌఘమ్ము పెంపొందఁగన్

రత్నాభంబు వెలుంగ ధాత్రి ద్విసహస్రస్వబ్దముల్ సాగఁగం

గృత్నుస్ఫూర్తి విరాజిలం దగఁ జతుర్వింశద్స మారబ్ధినిన్      4/1/2024

26.   

చం.

ఇడ సిరి రెండు వే లిరువ దేనవ రమ్యపు టాంగ్ల వత్సరం

బడరుచు వచ్చె విశ్వ మను జావన సంభృత కార్య దీక్షతోఁ

గడు దయ శాంతి భద్రతలఁ గ్రన్ననఁ గూర్పఁగ యుద్ధ భీతులే

యడఁగ నిరంతరం బొసఁగు హర్షము నాయువు నెల్ల వారికిన్            1-1-2025.

27.   

 

 

 

చం.

ఇల నిరు వేలపై నిరువ దింకను నాఱవ యేఁ డొసంగుతన్

ఫలములు మానవాళికి నపారము లాయు రరోగ సారముల్ 

సలలిత రీతి సంపదలు సౌఖ్యము శాంతిని  స్నేహ వృద్ధులన్

విలయము నంద వైరములు విశ్వము నందు నిరంతరమ్మునున్

28.