ఉఱుకులఁ బరుగులఁ గదిసి యఱచుచు వడిఁ
దనదు తండ్రినిఁ గాపాడఁ దలఁచి మించి
మీదకు నుఱుకు పగవాని, నాదు కొనుచుఁ
గొడుకు దండ్రినిఁ, జెప్పుతోఁ గొట్టె సరియె 59
అనయము మీఱ నల్లరి నిజాత్మజుఁ డింతయు జాలి లేక తాఁ
గనిన మహాల్ప జీవులను గ్రక్కునఁ బట్టి చెలంగి వాని వేఁ
చినఁ గని రోష వేగమునఁ జిన్నఁదనమ్మునఁ దాత తండ్రికిం
దనయుఁడు చెప్పు తీసికొని తండ్రినిఁ గొట్టెను దప్పు గాదులే 58
చేడెల కెల్లర కరయఁగ
నేఁడు పతియె నిత్య దాత నీ వాగుమ యి
ట్లాడిన సంఖ్య గణింపఁగ
నే డవ! పతి యున్న సాధ్వికే గౌరవమౌ 57
[ఏడు +అవ =ఏడవ; అవ = అవ్వా]
ఱేఁడు గుణాఢ్యుఁ డుత్తముఁడు ఱేయుచుఁ బాలన సేయ ధాత్రినిన్
వీడుల నున్న మానవుల ప్రీతిని మన్ననఁ బొందు నట్టులే
యీ డగు సద్గుణావృతుఁడు నిద్ధ చరిత్రుఁడు, స్వీయ శత్రులే
యేడవ, భర్త కల్గి నపుడే కద సాధ్వికి గౌరవం బిలన్ 56
వర గరిమ దర్ప మడరంగఁ బద్మ సన్ని
భమ్ము వ్యూహ మడర భండనమ్మునఁ జెల
రేఁగి పాండవ మధ్యము లేమిఁ గాంచి
సైంధవుండు గౌరవ రాజ సైన్య మడఁచె 55
[గౌరవ రాజ సైన్యము = గౌరవనీయుఁ డైన రాజ సైన్యము,
ఇక్కడ ధర్మరాజ సైన్యము]
తన పాపమ్మున కింత యేని మదిఁ జింతం జేయకే కక్షతో
ననిఁ గూల్పంగఁ దలంచి పాండవులఁ దా నా శంభుఁ బూజింపఁగా
నెనయం గల్మష కంఠ దత్త వరమే యేకైక ఘస్రమ్మునన్
జనవంద్యుం డగు, సైంధవుండు, గురు రాట్సైన్యాంతకుండై చనెన్ 54
[గురురాట్ =గొప్పరాజు, ఇక్కడ జనవంద్యుఁ డగు ధర్మరాజు]
పుట్టి నట్టి వా రెల్లరి పోక నిజము
చచ్చి నట్టి వారికి నుండు జన్మమెంచ
సంతతం బివి భువి నుండ వింత యేల
జనన మరణమ్ము లల్ప విషయము లగును 53
మను జానీక మృ గాభ్రగ వ్రజ మహాంభః ప్రాణి వృక్షమ్ములే
జనియింపంగ లయింప సంతతము గాంచం బ్రీతియౌవారికిన్
వన జాత్మోద్భవ కాల కృత్యముల సంభావింప డెందమ్మునన్
జననంబుల్ మరణంబు లన్నవి గడున్ స్వల్పంబులౌ యంశముల్ 52
పొట్ట కూటికై గట్టులు పుట్ట లిట్టె
చుట్టి నట్టాడుచు నడర దిట్టఁదనము
పిట్టలం గొట్ట గట్టిగ విల్లు నూని
వాడ వాడలఁ దిరిగెడు వాఁడె సుగుణి 51
[సుగుణి = మంచి విల్లు గలవాఁడు]
గోడుల నాలకించుచును గూర్మిని జానపదాలి కింపుగాఁ
దోడుగ నుండి కష్టముల దూరము సేయుచు యుక్త రీతినిన్
వీడక ధర్మమార్గమును బెన్నిధియై యిల దీన కోటికిన్
వాడల వాడలం దిరుగువాఁ డలరున్ సుగుణాభిరాముఁడై 50
లేఁడు పరుండు కనంబడు
వాఁడగు దైవము పుడమిని వానికి భక్తిం,
గాఁడు సమానము చంద్రుఁడు
షోడశ కళలున్న రవికి, స్తుతు లొనరింతున్ 49
వాడల వాడలం దడరి పన్నుగ వెల్గుల నిచ్చు వానికిన్
వేడుక మీఱ సంతతము పృథ్వినిఁ జూచుచుఁ జక్రపాణికే
యీడగు వాని కాతనికి, నెవ్వనిచేఁ దగ శీత రశ్మికిన్
షోడశ సత్కళల్ గలుగు, సూర్యున కే నొనరింతు సంస్తుతుల్ 48
ఉండు డింక భద్రమ్ముగ నండ నుండ
నా సుతుం డిట నీకు నానందముగను
మురిసితిని యాదరమునకుఁ బోయి వత్తుఁ
గోడలా! నా పతిని నేఁడు గూడ వలెను 47
పాడిగ లేక భోజనము పాపము వేఁగును నీదు మామయే
మాడుచు నుండు సంతతము మానిని! యేఁగెద నింక నేను యే
నాఁ డిట కేను వచ్చితినొ నా కిట చాల దినమ్ము లయ్యె నో
కోడల! నా సుతున్ విడిచి కూడఁగ నొప్పును నేఁడు నా పతిన్ 46
భారము కా దెన్నం డవి
చారపు సుద్దులు వలికిన సమ్మతములు సూ
వారక దెందమ్ముల మమ
కారమె ప్రేమించినఁ గనఁ గడు ముద్దు సుమా 45
కోరినవాఁడు భర్తగను గోమలి కింపుగ దక్క మిక్కిలిన్
మూరదె డెంద మందుఁ దగఁ బొంగుచు నిత్యము హర్ష మెంచఁగన్
వారక యుండ దీవనలు పన్నుగఁ బెండ్లికిఁ బెద్దవారి స్వీ
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ పక్షికిన్ 44
చావు పుట్టుక లెంచఁగ లేవు నరుల
చేతి లోవాసుదేవుఁ డహో తలంచి
పేర్మిఁ దగు మేలు సేయంగ వినక యున్న
బంధు మరణ వార్త మనకుఁ బండుగె కద 43
అండగ నిల్చి తోడ్పడఁగ నాపద వేళల బంధు లుండరే
దండము వెట్టి యోర్పుఁ దగఁ దాల్చి తదుత్తర కర్మ కాండముల్,
గుండెలు మండు చుండగను ఘోర విచారము నిండ మానుచుం
బండుగఁ, జేయఁగాఁ దగును బంధువు సచ్చిన వార్త వచ్చినన్ 42
అసమాన వీరుఁ డొక్క ది
వసమున రావణుఁడు రాఁగఁ బవరమ్మునకై
యసురునిఁ దలంచి యిచ్ఛా
వసు దేవునిఁ గాంచి వాలి పక్కున నవ్వెన్ 41
[ఇచ్ఛావసువు = కుబేరుఁడు]
పసి బాలుం డట నన్ను జంపు నట నా భాషించి కంసుండు దా
నసి వేగమ్ముగ నెత్తి గర్వమున నయ్యాకాశ వాణిన్ వినన్
రుసి చందమ్మున మౌనియై నిలువఁ దేరుం దోలుచుం బ్రక్కకున్,
వసుదేవుం గని, వాలి సేసెనఁట దుర్వారాట్టహాసమ్మునున్ 40
[వాలి = ఒఱగి]
లోక కల్యాణము దలంచి వీఁక తనదు
గళమునకుఁ, దడయక కంఠ కందరమును
నింపఁ బ్రక్షాలనం బొనరింప నంత
నమృతమున్ మ్రింగి, శివుఁ డిచ్చె హాలహలము 39
[అమృతము = నీళ్లు]
సముచిత రీతి భక్తులను శంకరుఁ డెప్పుడు గావ వచ్చునే
యుమయు నొసంగఁ బూని ధృతి నోర్పును భర్తకు స్వీయ సమ్మతిం
గుమిలి నిశాచ రాగ్నిముఖ కోటి సమీపము వచ్చి వేఁడ వా
గమృతము, మ్రింగి హాలహల, మందఱకున్ శివుఁడిచ్చెఁ జెచ్చెఱన్ 38
[వాగమృతము =మాట యను నమృతము (అభయము)]
ఏవగిం పొసఁగు జనుల కేల యిట్టి
లీల హింసాప్రియుండవు లేదు జాలి
నీ కొకింతయు నక్కట నీ మనసున
కాలికిన్ ముల్లు గ్రుచ్చ సుఖంబు గలుగు 37
[మనసునకు +ఆలికిన్ = మనసున కాలికిన్]
మేలుగ మాను గాయములు మేనునఁ గల్గిన సత్వరమ్ముగం
గాలిన గాని మేను మది గాయము మానునె మాన్య కోటికిన్
జాలిని వీడి నా హృదిని శబ్ద కృపాణపుఁ బోటు కన్న నా
కాలికి ముల్లు గ్రుచ్చిన సుఖంబు లభించుట తథ్య మిద్ధరన్ 36
గుమ్మము - గోడ - తలుపు - అరుగు పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
కడు వంతలు పుట్టఁగ నరు
గుడు మే లిట మనకు ముద్దుగుమ్మ మురియఁగన్
మడు గోడక దిగి కొని పూ
లడరి వనము నందు నుంట నర్హము భీమా 35
నిరతము సద్భక్తిని నా
హరిఁ బూజింపఁ దగును సిరు లాశింపకయే
పరము సమకూడు లౌకిక,
పరమాత్ముని భజన సేయ, బాధలె కల్గున్ 34
గురు నిష్ఠా రతి నిత్య తత్పరులు నై కొల్వంగ నిక్కమ్ముగాఁ
బరమౌ మాయలు క్షుద్ర శక్తు లని సంభావింత్రు బోధింప మా
రరు దుర్మార్గులు క్షుద్ర దేవతల, నారాధింప కెన్నండు నా
పరమాత్మన్, భజియించు వారలకు సంప్రాప్తంబులౌఁ గష్టముల్ 33
కడుపు వీక్షింప నింపగు గగన మౌను
తిన్న కూటినిఁ గబలింప వెన్ను పెరిఁగి
యెలుక లయ్యె నా యెలిక పాము లలఁ గుక్షి
నెలుక లన నాకసమ్మున నీఁదు నవియె 32
విలవిల లాడరే జనులు వెఱ్ఱిగ నాకలి బాధ కోర్వకే
కలకల లాడు మోము మఱి కమ్మని భోజన మారగింపఁగాఁ
గులుకుచు సంచరించు నవి కుక్ష్యభిధాన నభోంతరమ్ములో
నెలుక లనంగ నీ వెఱుఁగవే గగనమ్మున నీఁదునట్టివౌ 31
తిరముగ నొక్క క్షణ మయినఁ
దిరుగక నొక చోట నిల్చి తీయఁడు వహి న
త్తరి నుత్తీర్ణుం డయ్యెను
గరగిన నెయి నిప్పునుంచ గడ్డలు గట్టెన్ 30
[వహి = పుస్తకము]
పరమ మునీంద్రు లచ్చటఁ దపస్సుల నెవ్విధి నాచరింతురో
సురుచిర శీతకాలమునఁ జోద్యము దుస్సహ శీతలంపు టా
గిరి పయి నుంచ నొక్క త్రుటి గిన్నెను జల్లగనై తటాలునం
గరగిన నేయి, నిప్పుపయిఁ గాచిన, గడ్డలు గట్టెఁ జూడఁగన్ 29
[అన్వయము: నిప్పుపయిఁ గాచిన కరగిన నేయి]
ముప్పు లెప్పగిదినిఁ జొప్పడుఁ జెప్పంగ
నెప్పు డైన నెట్టు లొప్పుఁ జెప్పు
కొమ్మ పైన జాఱి కూల నేలపయి నం
జనము నెల్ల మ్రింగె శ్వాన మొకటి 28
[అంజనము = ఒక రకపు బల్లి]
చని చని యెవ్వరుం గనని చందము దూఱి సజాతి పంక్తితో
ఘనముగ వండి యుంచగను గమ్మని వాసన లింపు గొల్పఁగాఁ
దనర వివాహ మంటపము దగ్గరఁ బందిరి లోన విందు భో
జనమును మ్రింగివేసినది శ్వానము సూచిన వార లేడ్వఁగన్ 27
ప్లవగంబై ధరకు నుప
ప్లవమ్ము లొనరింప కమ్మ ప్రార్థన లివియే
ప్లవమై జనులం బ్రోతువా
ప్లవ సంవత్సరమ తెత్తువా సేమమ్ముల్ 26
సవికార్యబ్ద ఘనోగ్ర శార్వరి మహా సంత్రాస మిచ్చెన్ భువిం
సువిచా రాతత సౌఖ్య సంపదలు నిశ్శోకమ్ముగాఁ గూర్చుచున్
రవిచంద్రాది నవగ్రహప్రభ లిలన్ రాజిల్ల శాంతమ్మునం
బ్లవ నామాబ్దమ రమ్ము మాకిఁకను సంప్రాప్తించునా సేమముల్ 25
చింతాక్రాంతుండ నయితి
సాంతము వ్యాపింప నిచట నకటా యటవీ
ప్రాంతమున నంధకారం
బింతలు గను లున్నను దెరువే కన నైతిన్ 24
వింతలు మెండు విశ్వమున వృక్షము లెట్లు జనించె నాదిలో
సంతతి మూగ జీవులకు సంధిలు నెవ్విధి పెర్గు నింపుగా
నింతిరొ తాటి చెట్టునకు నెవ్విధిఁ దూఱెనొ గుంజు ముంజలో
నింతలు గన్నులున్నఁ దెరువే కన నైతి నిదేమి చోద్యమో 23
[కన్నులు = తాటి ముంజ కున్న మూడు రంధ్రములు]
తలఁచిన ధర్మం బని యెడఁ
దలఁ బుట్టింటి పయిఁ బ్రీతి తనరఁగ మిగులం
గలనైన నౌర నిజపతు
లలిగిన సతు లుడుగరు దగు వ్యాపారములన్ 22
జలజా తానన వార ణాభ గమ నాశావ్రాత సంతప్త చి
త్త లతా సన్నిభ దేహ నిత్య సద సద్భావజ్ఞ సుస్వాంతలున్
లలితాంఘ్రిద్వయ భూష ణాంబర విలోలప్రాభ వోద్యోగ లే
యలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారలై మించరే 21
పరు లెల్లరు తన్ను గొలువఁ
బురవర మందు నిరతమ్ము పూఁబోడికిఁ దాఁ
గర మనురక్తిని భార్యకుఁ
బురుషవరుఁడు సీరఁ గట్టి పూవుల ముడిచెన్ 20
పురుహూత ప్రతిభా విశేషమున నా పుంస్త్వంపు సంప్రాప్తమే
వరమై భాసిల నొక్క యేఁ డచట సంవాసార్థ సంరంభియై
వర ధానుష్కుఁడె యుర్వశీ వనిత శాపం బీయఁ దాఁ బేడియై
పురుషశ్రేష్ఠుఁడు సీరఁ గట్టి ముడిచెం బూమాల శీర్షంబునన్ 19
కాలానుగుణమ్ముగ నో
లోలాక్షీ ముద్దు లిడ నరుగుమ సరసకున్
లీలగఁ బతినిఁ జిలుక రౌ
తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చఁ దగున్ 18
[చిలుక రౌతు + ఏలును]
లాలన హేలఁ జేరి దరి రాగ విలోకన సాయ కాలినిన్
లీల రసాల సాల సుపరీవృత నందన మందు నింపుగాఁ
గాలము కాదు నా ననక కాంతుని ముద్దిడ హర్ష వారిధిం
దేలును, ముద్దులాడు పడతిం గని మెచ్చఁ దగున్ ముదమ్మునన్ 17
తిట్టి నంతఁ దిరిగి తిట్టిన వైరమ్ము
దిట్ట మగును బట్టు పట్ట కుండ,
నొట్టు నిన్ను నింకఁ దిట్టరు నమ్ముము,
తిట్టువారి కిడుము దీవెనలను 16
చట్టపుఁ గన్ను లేమఱచి సంపదఁ బెంచెడి మోసగాండ్రనుం
గట్టితిఁ దాళి నంచు నిజ కాంతను గొట్టెడి మోసగాండ్రనుం
జుట్టము లంచుఁ గొల్లగొనఁ జుట్టును దిర్గెడి మోసగాండ్రనుం
దిట్టెడి వారి కెల్లరకు దీవెన లిమ్ము శుభమ్ముఁ గోరుచున్ 15
దాతలు కఱవు కాఁగ బాధ సెలఁగ నెద
నా యనాథాశ్రమము నందు నందఱి నిఁక,
దారి లేక యిం కెద్దియుఁ దనకుఁ దాన,
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ 14
వీఁకను బెండ్లియాడి తగు ప్రీతిని దారకుఁ దీర్చి కోరికల్
తాఁకఁగ లేక యంబరముఁ దాఁకు సమున్నత వాంచితమ్ములం
బ్రాఁకుచు నంత జానువుల భార్యను జక్కఁగ నూఱడించుచున్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ 13
విమలమతి నింపుగ వివా
హ మాడఁగాఁ జూచి నంత నాత్మజ కలిగెం
గమలదళాక్షి యచిరమే
జమునన్ గనినంత విజయశాంతి లభించెన్ 12
విమల జలమ్ము భాసిలఁగ వీవఁగ నొడ్డునఁ జల్ల గాలి ప
శ్చిమమున సూర్య బింబము విశేషపు టెఱ్ఱని రంగుఁ జిందఁగాఁ
గమలిన చిత్త మక్కజముగా నట నూఱట సెందఁ జక్కఁగన్
జముననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్ 11
[జమున =యమునా నది]
నవ్వుదురు చూచు వారలు దవ్వు లందు
గోళ్ల తోడ దురద యిడ గోఁక వలదు
పుండ్లు చెలరేఁగి వడిఁ గడగండ్ల నొసఁగుఁ
గడుగవలయుఁ దైలంబునఁ గరయుగమును 10
పరమును బొందఁగా నిహపు భద్రము నెంచియు మిక్కుటమ్ముగా
నరిగి యరిష్టనాశమునకై శని సింహపురమ్ము భక్తితో
నరుణ కుమారు డెందమున నార్తిని నువ్వుల నుండి తీయఁగాఁ
గరముల నెల్లవేళఁ గడుగన్ వలెఁ దైలము తోడ మేల్గనన్ 9
ధన ధాన్యమ్ముల నడుగము
తనియుం డనుదుము పఠించి తాత్పర్యములే
యనుమాన మేల నీ కిట
మన పద్యమ్ములఁ బఠించి మాన్యతఁ గనరే 8
ఘను లా శంకర మధ్వ ముఖ్యు లిల లోకజ్ఞుల్ సరామానుజుల్
కన వారల్ గద యాత్మ సంవిదు లహో కాలజ్ఞు లెన్నండునున్
మన గొప్పల్ వచియింప నేల మన కాత్మజ్ఞానమే యున్నచో
మన పద్యమ్ముల నెల్లరుం జదివి యాత్మజ్ఞానులై వెల్గరే 7
ఆస్తిక జనుల వర్ధిల్లు నవని యెల్ల
సంతతమ్ము పరిఢవిల్ల సంతసమ్ము
నాస్తికులు దురిత జనులు నడవఁ గాంచ
నీసు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు 6
ఆర్ష్యప్రోక్త గుణమ్ము సూప కనునిత్యం బుండ భాసిల్ల ని
ష్కర్ష్యా భాషణ సంయుతమ్ము నిలఁ బ్రాశస్త్యమ్ము తోడన్ నిజో
త్కర్ష్యాలాపము లెన్నఁడుం బలుకకే ధాత్రిన్ విరాజిల్ల వీ
తేర్ష్యాద్వేషము లున్న మానవులనే యీశుండు మెచ్చుం గదా 5
[ఆర్ష్యప్రోక్తము = దూలగొండి; నిష్కర్ష్యము = నిజమునకు సంబంధించిన;
నిజోత్కర్ష్యము = ఆత్మశ్లాఘమునకు సంబంధించిన]
వ్యధ లిడ బూతులు మాటల
నధికముగాఁ బల్లె లందు నక్కట చెలఁగున్
విధవలు రూపొంద నయిరి
'వెధవలు' సెలరేఁగి రంట వేలకొలఁదిగన్ 4
అధరము లందు నుండ నగు నాంధ్రపు గ్రంథము లందు మృగ్యముల్
సుధలను జిందు, గ్రామ్యములు చొప్పడ కుండినఁ, గావ్యముల్ ధరన్
విధవలు మారి యైరి మఱి వింతగఁ బల్కఁగ నల్గి నోళ్లలో
‘వెధవలు’ పెచ్చురేఁగి రఁట వేలకొలంది శకార రూపులై 3
పూర్వకాల మందు పురుష వర్యు లకట
మూరు చుంద్రు సతము మూఢ భక్తి
వీర శైవు లున్న వీడురా యియ్యది
రామ యనిన బూతురా యనకుము 2
నాతులు చూచు చుండఁగ ననంత యశస్వి చువర్ణ దుగ్దకా
రాతిశయమ్ము కల్గిన మహాశయ! పండితవంశ సంభవా
ప్రీతిని శబ్దశాస్త్రమునఁ బెంపును జూపఁగ నిట్లు పల్కినన్
బూతగు రామచంద్ర! యనఁబోకు సుహృజ్జను లున్న తావులన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి