14, మే 2025, బుధవారం

భారత మాతృ వందనము.

భారత మాతృ వందనము.
(పహల్గామ్ దాడి సందర్భమున)
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)


 

ఉ.

సర్వ వరాయుధ ప్రకర శక్తి భటుల్ సతతోగ్ర శత్రు రా
డ్గర్వ మడంప నిర్దయను గార్య భరమ్ము వహించిరే సమ
స్తోర్వి ముదావహమ్ముగ మహోగ్ర మనస్కుల నుగ్ర భీష ణా
ఖర్వ ఖలోగ్ర వాదులను గాలుని యింటికిఁ బంపు వారలై

1.         

 

 

 

చం.

అలయక తాఁ జతుర్దశ సహస్రఖరప్రము ఖాసు రోగ్రులన్
నలిన దళాక్షుఁ డాజి రఘునాథుఁడె యర్ధ ముహూర్త వేళలో
నలి నలి సేసె మారుతి దినమ్మున నెన్బది వేల  రాక్షసేం
ద్రుల వధియించె లంకను విరోధుల సాక్ష కుమార వీరులన్   

2.         

 

 

 

చం.

కలవర మింత లేక రిపు కంటక భారత వీర సైనికుల్
సెలఁగి వధించి రుగ్ర రిపు సీమల నల్ప నిమేష కాల మం
దలయక భారతీయులకు నత్యధికమ్ముగ మాననీయులే    
జలనిధి వద్గభీరులకు సైనిక వర్యుల కెల్లఁ బ్రాంజళుల్ 

3.         

 

 

 

శా.

ఉన్మాదమ్ము మతాభిమానమున దుష్టోద్ధండ గుర్వాలికిం
గన్మోడ్పుం గలుగంగఁ జేయ రిపు సంఘాతాంత మర్హం బనం
దున్మాడుండు జనాలి నంచు ననిరే దుష్టాత్ములౌ పెద్దలే
సన్మానం బెటు లౌను మారణము హర్షం బందునే దైవమే  

4.         

 

 

 

ఉ.

భారత దేశ మెల్లపుడు పన్నుగ నెంచి మతమ్ము లన్నిటిన్ 
మూరుచు గౌరవించుఁ గద ముక్తికి మార్గముఁ జూపు నొజ్జయై
కోరును శాంతి నిక్కముగఁ గూరిమిఁ గోరును సంతతమ్మునున్
ధారుణిఁ గాంచ దేశములఁ దద్ద యశస్వి చరిత్రఁ గాంచినన్ 

5.         

 

 

 

శా.

 

సిందూ రాఖ్య మహోద్యమవ్రత చరత్సేనా త్రిభాగైక త
త్సందోహంబు పరాక్రమించి రిపు దేశస్థైర్య నాశంబు ని
స్సందేహం బొనరించి వాయు పద రక్షా క్షేత్ర విధ్వంసముం
గందర్పాంతక నేత్ర వహ్ని కణ సంకాశంబు గావించెనే

6.         

 

 

 

ఉ.

సింధు జలమ్ము లాపిరి యశేష రిపూదధిమేఖలా ప్రజా
స్కంధ విచార కారకము కర్మ వినాశకరమ్ము దౌత్య సం
బంధములం గుదించి రిపు పౌరుల రాకల పైన నాంక్షలన్
సంధిలఁ జేసి రెప్పటికి శత్రుల ఖిన్నులఁ జేసి రుగ్రులై     

7.         

 

 

 

ఉ.

భారము గాఁగ వృద్ధి కట వర్తక కార్య కలాపముల్ తెగెన్ 
దూరము లయ్యె బంధములు దూషిత మయ్యెను స్నేహ భావమే
క్రూరులు నుగ్ర వాదు లని లోకు లెఱింగిరి వారి నెల్లరన్
భారత దేశ వైర మతి భారము నా రిపు కోటి నేరెనే              
8.         

 








































2, మే 2025, శుక్రవారం

సమస్యాపూరణ_మే 2025

ద్రవ్య నిధుల ధనము తస్కరించుటయే ప
రిశ్రమాధిపతుల లీల  నేఁడు   
నేఁటి వర్తకుండు పాటవమునఁ బల్కు 
నప్పుఁ దీర్చు వాఁడె యధముఁ డగును                                                            61 

ఎప్పుడు గుట్టుగాను దనరింపఁగ నొప్పెడి దాని నక్కటా 
యిప్పనిఁ జేయ నిట్టుల సహింపఁ దరమ్మె దురాకృతమ్మునుం 
దప్పని నేరినం జలముఁ దాలిచి మూత్రవిసర్జనంబుఁ దా 
నప్పులఁ దీర్చువాఁ డధముఁ డౌనని చెప్పెను నీతి శాస్త్రముల్                                 60 
[అప్పు = నీరు] 

పజ్జనఁ జేరి పలుక మఱు
గుజ్జులు వెసఁ దాఁటి కల్లు కుడువఁగ నేలా   
బొజ్జం గల కల్లునకున్ 
మజ్జిగ విషతుల్య మంద్రు మాన్యులు వింటే                                                     59 

బెజ్జము నెందు నైనఁ గడు వింతగ శోధన సేయు వారలే 
ముజ్జగ మందుఁ బల్కుదురు పొంతన లేని విధమ్ము సుంత లో
గుజ్జది లేని వారలును గుందకు మయ్య వినంగ నిట్టులన్ 
మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యు లెల్లరున్                                  58 

సఖు లొసఁగ విత్తమును గో
ముఖ శార్దూలురను బోలి పొగడఁగ జనులే 
మఖ శతము సేసినను గా 
సుఖ లౌల్యులు యోగు లెల్లఁ జూడరు ముక్తిన్                                                    57 

మఖ సందోహము పేరునన్ ధనము సంపాదించి ధాత్రీ తల
మ్ము ఖగోళమ్మును నిండఁ దేలుచు నిలన్ భోగమ్ములన్ దైవ స
మ్ముఖమం దక్కట సత్య దూరు లగుచున్ బోధించినన్ నీతులన్ 
సుఖ లౌల్యుల్ గద యోగు లెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్                        56 

ఆశించి కీర్తి వసుధా
ధీశుఁడు వేఁడఁగ నెఱుఁగకయే వాణీ ప్రా
ణేశుఁ డొసఁగ గయునకు వర 
మాశీర్వాదమ్ము శాపమై బాధించెన్                                                                   55 

కాశీ నాథు దయార్ద్ర వీక్షణము లొల్కంగన్  సమీక్షింప నే 
యాశన్ ధర్మము వెల్గుచుండు విజయం బందంచు ఘోరమ్ముగా 
నాశా భంగము నంగరాజునకుఁ బార్థార్థమ్ము తచ్ఛౌరి యీ
నాశీర్వాదము శాప మయ్యెను గదా యారాటముం గూర్పఁగన్                               54 

కలిగిన దుర్భరముగ బా
ధలు మీకున్ మిత్రు లార తఱుఁగుటకై రా
హు లనం దా విఖ్యాతుఁడు 
కలు సేవింపుఁ డనె గాంధి గా దనఁ గలవా                                                         53 

అల సత్యాగ్రహ ముండ రక్షణకు నన్యాయమ్ము నాపంగ క్ష్మా
తలమం దింపుగ వీడు సందియము డెందం బందు నిర్భీతి వం
తలు వాటిల్లిననున్ నిరంతరము సత్యమ్మున్, విసర్జించి వం
కలు, సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా                                52 

ఘోరతరైక మనుజ భవ 
పారావార తరణనిభ పద్మా సతియే 
నారాయణ వక్షస్స్థిత 
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్                                                         51 

సార హిమాద్రి సంభవను సామజ సంచయ వైరి వాహనన్ 
భార భవాబ్ధి తారకను బార్వతి లోక సవిత్రి సంత తా
పార దయా విలోకనను భర్గ మనోహరి భక్త లోక మం
దార నిరంజనాకృతి సదా భజియింపుఁడు మోక్షలబ్ధికై                                          50 

కనకుమా ముహూర్తమును గదలికలకు 
నమ్మి చెడకు కపట నరుల గిరలు 
కలఁగకు మపశకునములఁ గాంచి సుంతయు   
వాస్తుఁ జూచి కట్ట వలదు గృహము                                                                 49 

స్వస్తి యగున్ భృశమ్ముగ నవశ్యము నమ్ము నిరంతరం బప
ధ్వస్త వివాద యుక్త ఘన దర్పిత  లోకులు సేయు నట్టి య
ప్రస్తుత మైన వాదనలపై నిడి డెందము రిక్త శాస్త్రమున్ 
వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్                                    48 

ఆట పాట లందు నందఱు సెలరేఁగి 
పొలము లోన నుండ నలసి సొలసి 
పైరు పైన నంత దారుణ రీతి న
శని శనివలెఁ బడఁగ సర్వ మడఁగె                                                                   47 

తన ఘన కోపమే తనకు దారుణ శత్రు వనంగ నిక్కమే 
కని విని నేర నట్టి గతి కార్యము వే ఫలియించు వేళలో 
గొనముల నీచ మైన దగు కోపము నిత్య నిజక్షమా వినా
శని శని వోలె వచ్చి పడి సర్వము నాశ మొనర్చె నయ్యయో                                   46 

వట్టి వోవఁగ నెల్లెడ వ్యాకరణము 
కట్టి యరసున్నలను మూట పెట్టఁ జెఱను 
వట్టి మాటలు సెలరేఁగఁ దుట్టెలుగను 
బట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు                                                           45 

వృషభగతిరగడ. 
బెట్టిదమ్ముగఁ దియ్యఁదనమే విరిసి యుండఁగ గిరల కంతటఁ 
బట్టెఁ జీమలు దెలుఁగు పద్యపు వాణికిం గడు గొప్పగన్గట                                     44 

ఇంటి పేరు గాంచ నింపైన కస్తూరి 
యబ్బ యింటి నిండ గబ్బిలములు 
పేరు రాజు తాను బేద మిక్కుటముగఁ 
బెండ్లి యాడి రాజు బిచ్చ మెత్తె                                                                        43 

దండము లన్నఁ బొంగుదురు దర్ప గుణాంధులు రాజు లెల్లరున్ 
మెండుగ నాశ మిక్కుటము మేటి పొగడ్తల భూమి నందఁగా 
రండని యిచ్చి మూ డడుగులన్ బలి గాంచెను దా నధోగతిన్ 
దండిగఁ జేసి వే రొకఁడు దానము లౌర దరిద్ర దేవతం 
బెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మరెన్ భువిన్                              42 

తిరుగు చుండంగ వనమం దెదురు పడంగ 
నన్ను బోలు శిరోజాళి యన్ను లందు 
మిన్న కున్న దంచు మురిసి కన్ను లదరఁ 
దాటకన్బూజ్యురా లనెఁ దాపసాళి                                                                    41 
[తాపస +అళి = తాపసాళి; తాపసుని బోలు తుమ్మెద] 

కాటికిఁ బోవ నిశ్చయము కాల వశమ్మున నెల్ల వారికిం 
గైటభ దైత్య మర్దనుఁడు కంజ దళాక్షుఁడు రామ చంద్రుఁడే 
మాటలఁ జెప్ప శక్యమె రమాపతి చేతి లయమ్ముఁ గాంచెనే 
తాటక పూజ్యురా లనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్                                   40 

నాతిని విషధర కుచనుం
బ్రాతః కాలమ్ము నందుఁ బరికింపంగా
నాతఁడు ప్రాకృత బాలుఁడె 
పో తన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్                                                       39 

పోతన వంటి సత్కవినిఁ బుణ్య చరిత్రునిఁ బండితోత్తముం
జూతమ టన్న నిక్కముగఁ జోద్యము గాదె ధరాతలమ్ములో
నాతత భక్తి తత్పరుఁడు యాదవ సింహుని లీల వ్రాయఁడే 
పోతన యింటఁ జేరె నని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్                                   38 

నీ కేలనొ యిట్టి తలఁపు 
రాక యిచట లాభములు నిరంతర మకటా 
కోకొల్లలు, విహరింపకు
మాకసమునఁ గలవు విపణు లమ్మకమునకై                                                        37 

సాఁక నశక్యమై విపణి సంచయ మెల్లను బీద సాదలౌ 
లోకుల కందరాని గతి లోచన యుగ్మము చెమ్మగిల్లఁగాఁ 
దాఁకఁగ సూర్య చంద్రులను దగ్గక మూల్యము లెల్ల నుండఁగా
నాకస మందుఁ బెట్టి రఁట యంగడు లెన్నియొ యమ్మకానికై                                     36 

ఆ యెడ నొచ్చుచు నుండిన 
నాయత రీతినిఁ బసిండి యచ్చపు ఛాయం 
బాయక నిగనిగ లాడుచు 
గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్                                                          35 

సోయగ ముప్పతిల్లు బహు సున్నిత తంతు సమన్వితమ్ములౌ 
మాయని మంచి రంగుల సమంచిత కాంతుల నీను బట్టలం 
దోయజ పత్ర లోచనకుఁ దొడ్గఁగ నింపుగఁ జిత్ర వర్ణపుం 
గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్                                         34  

క్రీడి సఖు వాసు దేవుని 
క్షే డాభరణుం డలుకను సిత శశి రేఖా 
చూడుఁడు బాణున కీతఁడు 
కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే                                                         33 

వీఁ డొక వీర వర్యుఁ డట వీని బలమ్మును నేఁడు గాంచెదన్ 
దాడి యొనర్ప నే పగిదిఁ దా నెదిరింపఁగ నోపు నంచునున్  
వీడక మౌని వేషమును వింటిని నెక్కిడి  వేఁట నీతికిం 
గీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే                                         32 
[కృష్ణుఁడు = అర్జునుఁడు] 

న్మ మన్న ధైర్య సాహస వీర జ
న్మ మని చాటి చెప్ప మానితముగ 
భూరి భరత నామ భూమిలోఁ బొందితి
మి కనుఁ డంచు భటులు మీఱి రాజి                                                                    31 

ధరణి నించి భారత నితాంత విశిష్ట చమూ సమూహ మం   
దరి కరి కోటి సింహ గణ మన్మహిమాన్విత వీర రాసులై 
సురుచిర ధైర్య సాహస విశుద్ధ విభూతి సమేత శూరులై 
కరము వెలింగి రాజి నిజ కాంతుల శాత్రవ భూమిఁ గాంచుఁడీ                                     30 

నేపాలు - జపాను - చైన - ఇరాకు - భారతార్థములో
పద్యము 
ద్యుతలజ పానుజ కృష్ణా 
నతి తతినే పాలు సేయ నలిన దళాక్షా 
గతి వైనం ద్రా చైనఁ గు
పిత వయి రాకు మన మరలి వెడలదె కన్నా                                                          29 

ధర్మ యుక్తమ్ము లైనట్టి కర్మములను 
నిత్య మాచరించుచు నుండ నెమ్మితోడ 
నదను గాంచి మిత్రామిత్రు లరయు చుండ 
నొక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె                                                                      28 

ఒక్క విధమ్ము మర్త్యు లెవ రుండరు మారుచు నుండు బుద్ధులే  
యెక్కడ కేఁగి చూచిన మహీ తల మందు నిరంతరమ్మునుం 
జక్కన యన్న వాఁడు మఱి సమ్మతి నీయని వార లింతలో
నొక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే                                         27 

కడుపు నిండఁగ నక్కట కాసు లున్న 
తిండి లేకుండ జను లెట్టు లుండఁ గలరు 
తడయ కుండఁ దర్కమ్ముల విడిచి యుండఁ 
బాఁడి పంటలు లేనట్టి పల్లె మేలు                                                                        26 

వాఁడు వీఁడను భేద భావము వారి కుండదు సుంతయుం 
దోడు నీడగ నుందు రెల్లరు దొడ్డ దుఃఖము కల్గినన్ 
వాడ వాడలఁ బొంగు హర్షము భార తావని లేవు సూ 
పాఁడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్                                                  25 

తారాపథమునఁ గన నె
వ్వారికి శక్యమ్ము గాని పగిది ననంగం   
దోరపు మేఘావృతమునఁ 
దారలు చినబోయెను జలధారలఁ గనుచున్                                                          24 

వారక కాఱుచుండఁగ నపారము వక్త్రము వస్త్రరాజముల్ 
తోరము గాఁగఁ గ్లిన్నములు దుర్భర తాప నిమిత్త మత్తఱిన్    
సార విచార సంయుత విసారిత చక్షు నభస్స్థ సంచర
త్తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్ర మేమొకో                                        23 

కార్ముక ముండ నరుని కడఁ 
గూర్మిని సాఁక వసుదేవు కొడుకు సతతమున్  
ధర్మమును వీడి పలుకుట  
ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్                                                              22 

మర్మము దాఁచుచున్ దురభిమాన ధనుండు సుయోధనుండు దాఁ 
బేర్మి నటించి పాచికల వేడుక నాడెద మంచుఁ బిల్వ రా
డ్ధర్మము కాదు కా దనుట తల్చె నెడంద యుధిష్ఠురుం డటుల్ 
ధర్మము ధర్మ మంచు మది ధర్మజుఁ డెంచు టదేమి ధర్మమో                                       21 

ధరణీ ధవుఁడు జనకుఁ డం
తరంగమున సంతసింప దాశరథి ధరన్ 
ధరణీ తనయ నిజ మనో 
హరునిం బెండ్లాడె సీత యతి సంప్రీతిన్                                                                20 

అరుణము సింద నాస్యమున నాత్మ మనోరథ పూర్ణ వేళలో 
నర నిచయోత్తముం దమి మనమ్మున రేఁగఁగ హర్ష చిత్తయై 
మరు హరు విల్లుఁ ద్రుంపఁగను మానవ కంటక తాట కాది సం
హరుని వివాహ మాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో                                         19 

కమ్మని వంటల బొజ్జల 
నిమ్ముగ నింపుఁ దిన కున్న నెన్నఁడు తమినిం  
బొమ్మనఁ గోపమ్మున నీ  
వమ్మను నమ్మ వల దనుచు నార్యు లని రొగిన్                                                       18 

ఇమ్మహిఁ గాలు వెట్టుటకు నెల్లర కింపుగ హేతు వమ్మయే 
నెమ్మినిఁ గాచుఁ బిల్లలను నేర్పున నిత్యము వేయి కళ్లతో 
నమ్మక చెల్ల నిక్కముగ నందఱి నెవ్వరు గౌరవింపరో  
యమ్మను నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంత రీతులన్                                     17 

సంసార బంధ ముక్తుఁడు 
కంసారి పదాబ్జ సక్త కమనీయ నరో
త్తంసుం డన్నమ్ము విగత  
మాంసముఁ దిను ద్విజుఁడు ముక్తి మార్గముఁ జూపున్                                                16 

మాంస విసర్జితుండు జన మాన్యుఁడు సచ్చరితుండు సంయమో
త్తంసుఁడు ధర్మ బోధకుఁడు దాఁ బర మాంచిత శబ్ద యుక్తుఁడౌ  
హంస తపోబలాన్వితుఁడు యజ్ఞ ఫలమ్మును, వీడు లగ్న మీ
మాంసముఁ, దిన్న శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తి నందఁగన్                             15 
[లగ్న మీమాంసము = తగులుకొనిన మీమాంస కలది, ఇక్కడ మనస్సు]

బీమాసుర వృత దండక
నా మారణ్యమున ముని జన హితకరుఁడు సం
గ్రామంబున శత్రుంజయ 
రాముం డున్నాఁడు చేర రా దెవ్వరికిన్                                                                     14 

సీమల్లేవు రమాధినాథునకు నృశ్రేష్ఠాత్మలే యా పరం
ధా మావాసము లౌను దప్పకను సత్యం బెన్ని వీక్షింపఁగన్    
రామా రత్న శచీ సమేత సుర సువ్రాతేశ్వరుం డైన సు
త్రాముం డున్నను లోకు లెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్                                        13 

సార్థక మొనర్చె నామము వ్యర్థ మించు 
కేని కానీక తా నభ్యసించె విద్య 
మరణ మందిన యట్టి కోమలికి నమ్మ 
విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు                                                                          12 

పాద్య మొసంగి సోమ రస పాన నిమిత్తము వజ్రి వేఁడు నా 
విద్యకుఁ బట్ట మింపుగను వేదము సెప్పును గట్టు మం చిలం 
జోద్యమె చెప్పు మిట్టు లన క్షుద్ర దురాసద దేవతార్చనా  
విద్యకుఁ బాడెఁ గట్టు మని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్                                      11 

ధరలు కబళించు చున్నవి నరుల నిపుడు 
ప్రభుత యిప్పుడు పీడించుఁ బౌర వరులఁ 
గొలువు లిప్పుడు పనివారిఁ గూల్చు చుండెఁ 
జదువు లిప్పుడు ఛాత్రులఁ జంపు చుండె                                                                  10 

పదిలము లేక కొల్వులను వంతలు రేఁగ గురూత్త మాళికే
యొదిఁగిన యట్టి నెన్నడుము లుండఁగఁ బిల్లల కెల్ల నూరిలో 
నుదితమ యిట్టు లెల్లెడల నొజ్జల నక్కట కాక యింకనుం 
జదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచు నుండె భయావహమ్ములై                                     9 

అంగమ్ములు కంపింపఁగ 
నింగినిఁ దాఁకంగ భీతి నిబ్బర మెడఁదన్ 
భంగమ్ము గాఁగఁ బల్లియ 
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్                                                               8 

అర్క సుతాత్మ మిత్రుఁడు మహా బలశాలి మరుత్సుతుండు సం
పర్కము గాఁగ యుద్ధమునఁ బట్టణ రాజము లంక లోపలం 
దర్కము మాని రాక్షస వితానము వాఱెఁ జమూ సమూహమే 
మర్కటరాజముం గని ప్రమాద మటంచును బాఱె సింహమే                                             7 

తనదు పాటవ మెఱిఁగించు తపన తోడ 
దూర మందు నిలిచి నట్టి వారి నపుడు 
వినుఁడు రండు వేగమ్ముగ నని కుమార   
భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు                                                                          6 

ధైర్యోపేత మనస్కుఁ డై పరుల విత్తం బాహరింపంగఁ దా
కార్యం బెన్ని వచింప నంతయును నా కాంతా ద్వయమ్ముం ద్రుటిం  
గార్యాకార్య వివేకవంతుఁడు స్వ పక్షప్రీతినిన్ సోదరీ 
భార్యారత్నము లిద్దఱం బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్                                                 5 
[శ్రీ పటు+అవర్ధనుండు= శ్రీ పట్వర్ధనుండు; సంపదల సమర్థులను వర్ధిల్ల నీయని వాఁడు] 

జనుల దాహార్తి తీర్తును జక్కఁగాను 
సకల జనులు డెందమ్ములఁ దికమక పడి 
గింజుకొన నేల నేఁ దాటి ముంజె నయ్య 
మూడు కన్నులు గలవు శంభుఁడను గాను                                                                  4 

వెలసెను దట్ట మైన పరివేష్టిత విస్తృత కుడ్యరాజమే 
చెలఁగెను దంతుసంచయ మశీర్ణ వరాయస భద్ర దుర్గమే   
చెలువుఁడ నేను జిత్ర ఫల శేఖర సన్నుత నారికేళముం 
గలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్                                      3 

ఒజ్జలు సెప్పిన నీతులు 
ముజ్జగములఁ జెల్లు నిత్యము ననఁగ వినవే 
యిజ్జగతిఁ గుజనుఁ గూడిన 
సజ్జనుని సమస్య లేఁచు సతతమ్ము భువిన్                                                                2 

సచ్ఛీలుం డగు ధర్మరాజునకు వాసం బయ్యె గోత్రమ్ము స
త్యచ్ఛాయా గత రాజశేఖరునకుం ద్రాసం బొసంగెం గటా 
విచ్ఛిన్నాత్మ కుటుంబ యుక్తముగ నీ పృథ్విన్ రమా నాథుఁడే 
సచ్ఛీలున్ సతతమ్ము దైవము సమస్యల్ మోపి బాధించెడిన్                                          1