21, నవంబర్ 2025, శుక్రవారం

భీష్మ మాహాత్మ్యము.

 

భీష్మ మాహాత్మ్యము.

 

 

ఉ.

భీష్ముఁడు శాప జన్మ పరిపీడిత కౌరవ వంశ కీర్తి రో
చిష్మయ వర్ధనుండు సు వశీకృత పంచ నిజేంద్రియుండు చి
చ్ఛుష్మ పరాక్ర మోన్నత యశోధన మండిత వీర వర్యుఁడున్
భీష్మతమ ప్రతిజ్ఞుఁ డరి వీర భయంకరుఁ డెన్న ధాత్రినిన్  

1.      

 

 

 

మ.

త్రిది వోత్తుంగ నదీ కుమార వరుఁడై దేవవ్రతాఖ్యుం డహో
యుదయించెం గురు వంశ రాజమున నిత్యోద్యోగియై నిల్చెనే
సదసద్భావ వివేకవంతుఁ డిలలోఁ జాపాగ్ర్య నైపుణ్యుఁడై
సుదతీ కారణ మాత్మ సద్గురువునే చోద్యంబుగా గెల్చెనే

2.     

 

 

 

ఉ.

తీర్పఁగఁ దండ్రి కోరికను దిట్టతనమ్మున వీడె రాజ్యమే  
యేర్పడ దాశరాజునకు నింపుగ నమ్మక మాత్మలోఁ గటా
కూర్పరి బ్రహ్మచర్యమును గోరి వరించెను జీవితాంతమున్
మార్పఁడు నిర్ణయమ్మును సమంచిత రీతినిఁ గాచె రాజ్యమున్

3.     

 

 

 

చం.

నర వధ మాజిలోఁ బది దినమ్ములు సల్పెను భీష్ముఁ డుగ్రుఁడై
నరపతి ధర్మరా జడుగ నర్మిలిఁ దన్ను జయించు వైనమున్  
దురమున నాశిఖండి నరు తోడుగ నిల్పుఁ డటంచు మర్మముం
 గరుణ వహించి తెల్పి సహకార మొనర్చి త్యజించె బాణముల్  

4.     

 

 

 

శా.

గాంగేయుండు శరోగ్రతల్పమున విక్రాంతుండు స్వచ్ఛంద రీ
త్యంగాంతం బొనరింప నైపుణుఁడు కృష్ణారాధనా వ్యగ్రుఁడై
యంగీకారము లైన నీతులను  రాజౌచిత్య ధర్మమ్ములం
బొంగారన్ మది ధర్మసూనునకుఁ దా బోధించెఁ బుణ్యాత్ముఁడే

5.     


1, నవంబర్ 2025, శనివారం

సమస్యాపూరణ_నవంబర్ 2025

మెత్తని పఱుపు ఱాయియై మేనుఁ గలఁచెఁ  
గంటికిఁ గునుకు దూరమై కలఁత నొసఁగె 
దారుణమ్ముగ విరహాగ్ని తప్త యైన 
కలువకంటికిఁ గాటుక గరళమయ్యె                                                        54. 

పోటులు మాటిమాటికిని మూరుచు వచ్చుచు నుండఁ దోర మ
ప్పాటలగంధికిం గనులఁ బాఱుచు నుండ జలమ్ము ధారయై 
పాటిలఁ గంటికిం గలఁక వారని బాధ నొసంగ నిత్యముం 
గాటుక చూడఁగాఁ గలువ కంటికిఁ దీవ్ర విషంబె యౌనుగా                             53. 

మందు గొన్న రీతి మంచి జరుగు నెంచ 
సంతసంబు తనరఁ జింత లేక
యనుదినమ్ము సుంత యంచితమ్ముగ మంచి 
మదిరఁ గొన్న యెడల ముదిమి రాదు                                                      52.  

తాతల్ తండ్రులు త్రాగి మద్యమును సంతప్తాంగు లై రెల్లరున్ 
నీ తీరుం గన నీకుఁ దప్ప దని సందేహంబు నా కయ్యెడిన్ 
భ్రాతా చక్కఁగ నాలకింపుమ సుధన్ రాగంబుతో, వీడి ని
ష్ప్రీతిన్ నిత్యము మద్యముం, గొనినచో వృద్ధాప్యమే రాదు పో                      51. 

తగవులు పెక్కు చెలంగును 
విగతం బగు నెడఁద శాంతి విజ్ఞుల కైనం 
దగునే పలుకఁగ నిట్లున్ 
స్వగృహము లేనట్టి వాఁడె? భద్రతఁ గాంచున్                                             50. 

పగతుఱ కైన నిప్పగిది వాసము దైవ మొసంగకుండెడిం 
దగదిది యెల్లవారలకు దైన్యము నూని వశింప శక్యమే 
యగణిత వాసరమ్ము లకటా తల వంపులు గా సదా పర
స్వగృహము లేని వాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్                       49. 

కోపం బూనక తా సం
తాపములం దెద వగవక తనరుచు నుండం 
దాపస వరేణ్యుని విగత 
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్                                            48. 

తాప మొసంగుటం బ్రజకుఁ దా మది నేరక సుంత యేనియుం 
జూపఱు లెల్ల వారికిని శుద్ధ మనస్కుని రీతిఁ గన్పడన్ 
రూపము మార్చి తా వసు పరుండయి కోట్లను గూడఁ బెట్టినం 
బాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్                       47.  

వే వ్యయ మొనర్ప వినికిడి 
నవ్య గతిన్ దద్దఱిల్ల నరులకుఁ జెవులే 
సవ్యాపసవ్యము లహో 
శ్రావ్య! గళస్వనమునన్ ఖరమె మేటి గదా                                                  46. 

దివ్యముగాఁ దలంచి వసుదేవుఁడు గాడిద కప్డు మ్రొక్కి తా
భవ్య తరమ్ముగాఁ బొగడె వారక యేఁగుచుఁ గార్య సిద్ధికై   
కావ్య చయాది పాఠములఁ గాంతుము వర్ణన లిట్టి భంగినిన్  
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా                                 45. 

అత్మీయత వర్ధిల్ల ని 
జాత్మ సఖులపై సతమ్ము నత్యంతము జీ
వాత్మకు నిరంతరము వీ
తాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘు యశమ్మున్                                                 44. 

ఆత్మజ్ఞానము ప్రజ్వరిల్లఁ బరమాత్మాంతస్స్థి తాత్మీయ జీ
వాత్మాలింగన కార్యముం దెలియ సత్యం బంచు నేపార న
ధ్యాత్మం బత్యధికమ్ముగా నెడఁద నిత్యమ్మున్ విసర్జింపఁగా 
నాత్మశ్లాఘము, సాధు దూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్                       43. 

కోరి భజింపఁగ నీ గ్రహ 
వారములను భక్తి తోడ వరుసల నెంచన్  
వారము వార మొసఁగు కై
వారములో రెండుగ రవివారము లయ్యెన్                                                   42. 
[ కైవారము = పొగడ్త; గ్రహ వారము = గ్రహముల సమూహము] 

వారికి వీరి కెన్నఁడును భార మొసంగవు వీని కేల యీ 
దారుణమైన పంపకము ధర్మమె యివ్విధి దుఃఖ మీయఁగం 
దోరము కష్ట మయ్యె నిడు తొంటి విధమ్ముగ నిక్కమెంచ నీ  
వారము లోన వచ్చె రవి వారము సూడఁగ రెండు మాఱులున్                          41. 
[రవి వారము = రవి యొక్క తడవ] 

దర్ప మడరంగ దోర్బల దానవుండు 
కొండ నెత్తంగ యత్నించి కూల నేల 
వేగ సదయ రక్షించెను వేడ భక్తి 
వక్త్రముల్ పది గల్గినవాఁడు శివుఁడు                                                           40.  

రుక్త్రైలోక భవా‌‌ళి నాశకర నిర్మోహుండు ఫాలాక్షుఁడే 
దిక్త్రాణార్థము విష్ణువే తనరఁ బ్రాక్దిఙ్నాథుఁ డయ్యెం దద
న్వక్త్రాతృప్రవరుండు పద్మజుఁడు వింతం గాంచ నర్ధమ్ములై 
వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిం బ్రార్థింతు సద్భక్తితో                                    39. 

అంతఃకరణం బుండ ని
రంతర మతి శుద్ధిగ నెద నర్చించినచో    
సంతత కరుణా రక్షిత 
కుంతీసుత గణపతి మన కోర్కెల్ దీర్చున్                                                     38. 
[రక్షిత కుంతీసుతుఁడు = రక్షింపఁబడిన భీముఁడు గలవాఁడు] 

సంతోషమ్ము లభించు డెందము వెసన్ శాంతించుఁ బ్రాప్తించు దుః
ఖాంతం బింపుగ సత్వరమ్ము కలుగుం దోడ్తోడ బాంధవ్య మ
త్యంతావేశము వీడు మింక జన పూజ్యం బౌను నీ జన్మమే  
కుంతీపుత్ర! వినాయకుం గొలిచినం గోర్కెల్  ఫలించుం గదా                               37. 
[కుంతీపుత్రుఁడు = తల్లిదండ్రులను నేరని వాఁడు] 

పంతము నూని ధనమ్ము న
నంతము నొడ్డి వికటింప నక్కట స్వీయ
స్వాంతము జూదం బాడితి  
నింతలు గను లున్ననుఁ దెరువే కన నైతిన్                                                     36. 

కంతుని బారిఁ బడ్డ నరకాంతుల చిత్తము లార్తి నందవే 
యింతినిఁ జెంతఁ గన్న మది నెంతయొ రక్తి జనింప వింత నే 
సుంతయుఁ దాళకుంటి వెస సొంతము సేసికొనంగ నక్కటా 
యింతలు గన్ను లుండఁ దెరువే కన నైతి నిదేమి చోద్యమో                                 35. 

తనదు భాగ్యముఁ దలపోసి తమ్మికంటి 
సంతతము సతీ రక్తుఁడై సుంత కాక
కామ తప్తుండు నన్య కాంతా మణులకు 
విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె                                                   34. 

రమణీరత్నము గా సుధా వితరణార్థం బప్డు విష్ణుండు భా
మ మనోహారినిఁ గాంచు కోర్కి సెలగం బంతంబుతోఁ జూచినన్ 
రమనీయం బగు విష్ణుమాయ మదిఁ దెల్లం బైన వే మోహినీ 
విముఖుండై పతి వీడి పోయె ననుచున్బ్రీతిన్గనెన్ సాధ్వియే.                             33. 

మనమున జనింప ఘన సంభ్రమమ్ము తనకుఁ
గనుల కింపు నొసంగఁగ ఘనతరముగ
నప్పురమున జరుగు నంచుఁ జెప్పి నంతఁ 
దన సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె                                                       32. 

‌అనుజుఁడు కన్యకా మణిని నారసి చారు లతాంగి నొక్కెడన్ 
మనసిజ పద్మ బాణ చయ మర్దన తప్తుఁడునై వరింపఁగా 
ననయము వెంట నుండు నలినాక్షి సరోజ నిభాస్య తోడు రాఁ 
దన సతి పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో                               31. 

చేర లంకా నగర మతి శీఘ్రముగను
రావణ వధార్థము భయంకర స్వనముల
వానర సమస్త సైన్యము వంతెన పయి
రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె.                                                      30. 
[వాలు = అతిశయించు]

ధీమంతుం డెద నిశ్చయించి గత సందేహుండు వైదేహినిన్
భామం గాంచఁగఁ దన్మహేంద్ర గిరిపై వాతాత్మజుం డుద్ధతిన్
భీమాకారము నొంది పాద యుగముం బీడించుచున్ ముందుకున్,
రామోక్తిన్దలఁ దాల్చి, వాలియె సముద్రంబున్దరించెన్గదా.                                       29. 
[వాలు = వంగు]

లోకైక విచారం బిది 
వీఁక నిజోగ్రత్వ మందు విస్తార మిలం
గాకుండుటకై దండిత 
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ                                                          28. 

ఏకాకిత్వము చేష్టలం దుడిగి నప్డే యుగ్ర వాదమ్ము దా 
నే కాలమ్మున సమ్మతం బవనిఁ గాదేన్ మానవత్వం బటన్ 
సాకారం బయి నిల్వ సంతతము హింసానందమున్ వీడినం 
బాకిస్తాన్ మన మిత్రదేశ మనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్.                                   27. 

అప్పు సేసినఁ గ్రమముగ నొప్పుఁ దీర్ప 
నప్పు డప్పుడు ముప్పిసుమంత లేదు 
గొప్పలకు నేఁగక యడుగ నప్పు నొప్పు 
రాష్ట్రమునకుఁ గావలె నప్పు ప్రగతిఁ గనఁగ                                                         26. 

ఆష్ట్రాధ్వమ్మును నంట సంపదలు నిత్యానంద మేపార సౌ
రాష్ట్రాంధ్రాది సమస్త రాష్ట్రములు భద్రైశ్వర్యసంపన్నతన్ 
రాష్ట్రాన్యాధిక వృద్ధిఁ గాంచి ధరలో రంజిల్లి వర్తింపఁగా 
రాష్ట్రాభ్యున్నతి కప్పులే శరణమై రాజిల్లె సౌభాగ్యముల్                                         25. 
[అప్పు = నీళ్లు]

మోద మంద నెల్ల భూలోక వాసులు  
సంజనింపఁ బ్రేమ సద్య మంత 
సుంద రాంగుని మృదు సుమ నిచయ శిరస్స్త
బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె                                                                 24. 

ప్రకటము గాఁగఁ దారకుని ప్రాణ వినాశము నిశ్చయమ్ముగా 
సకల జనమ్ము లివ్వసుధ సంతస మందఁగ మిక్కుటమ్ముగన్ 
వికల మనస్వినీ నగజ భీకరపుం దప మాచరించి త్ర్యం 
బకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో                                         23. 

పరికింప నంద ఱొక్కటె 
తరతమ భేదమ్ము లేల ధరలో విను మో 
నరుఁడా మానవులం దం
తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును జుమా                                                       22. 

నర లోకమ్మున కెన్న హానికరముల్ నాశమ్ము గావించు భీ
కర మత్యంతము వాని ప్రాభవము నిక్కం బెంచ గాలించుచున్ 
ధరలో నింపుగ మత్తొసంగునవి నిర్దాక్షిణ్య ముద్వేగివై 
తరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా                                  21. 

కడు దుర్భర మౌను బ్రతుకు 
మడిసినఁ దలిదండ్రు లకట మగ దిక్కునకై 
పడతి స్వయమ్ముగఁ దొందర
పడుచున్నను బెండ్లి సేయువారలు లేరే                                                                 20.  

తడ వే లివ్విధి నుద్యమింపుఁ డిఁకఁ నుత్సాహమ్మునం జక్కఁగాఁ  
బుడమిం గాంచిన యెట్టి సుందరులకై పొంగండు నెవ్వారి నొ
ల్లఁడు వీక్షింపగ నిట్టు లిప్పు డనుకూలంబైన లావణ్యపుం 
బడుచున్నం దగఁ బెండ్లి సేయుటకు నెవ్వారైన లే రెందుకో                                          19. 

నైపుణ్యం బధిక మళికి
నాపద యెబ్భంగిఁ గల్గు నావంతైనం 
దాపము దాఁకని యట్టుల 
దీప శిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్                                                              18. 

దాపుల సంచరించుచు రొదల్ కడుఁ జేయుచు గెంతు చుండి సం
తాప మొకింత లేకయె ముదమ్మున రమ్య వనాంతరమ్ములో
నేపుగఁ బెర్గి నట్టి విరు లింపగఁ బూసిన మొక్క గన్పడన్  
దీప శిఖాగ్ర భాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా                                            17.  
[దీపము = మయూరశిఖి యను మొక్క] 

సర్వధారి చనిన యంత నుర్వి లోన 
నశుభములు దొలంగు నరయ నక్కజముగ  
గ్రహముల గమనమ్మును గాంచ రాహువు తగు  
మే లొనర్చెడి వాఁడె సుమీ విరోధి                                                                           16. 
[విరోధి (న్) = విరోధి నామ సంవత్సరములో] 

కాలుని భంగి శాత్రవ నికాయము మార్కొని చంపుచుండఁగాఁ 
జాలక హింస నోర్వఁగను సంకట ముక్తికిఁ బ్రాణ రక్షకై 
యాలము నందు నెట్టి గతి నైనను నింతయు శత్రు సేనకున్ 
మే లొనరించు వ్యక్తియె సుమీ జగ మందునఁ జూడ శత్రువౌ                                         15. 

పిలువ విం దొసంగ నలరి వచ్చిన వార 
లీ పురుష వరేణ్యు లెంచి చూడఁ  
బంక్తి లోన నున్న వార లొక్క విధము 
చిన్న యెవ్వఁ డిందు మిన్న యెవఁడు                                                                      14. 

జన్నము పూర్తి కా నలరి శత్రు విహీనుఁడు గాంచి ధర్మ సం
పన్నునిఁ దాత శాంతనవుఁ బన్నుగ ధర్మజుఁ డడ్గె నిట్టులన్ 
మిన్నగ నశ్వమేధ మెలమిం బరిపూరిత మగ్ర పూజకై 
చిన్న యెవండొ మిన్నగనుఁ జేకొన నర్హుఁ డెవండొ చెప్పుమా                                          13. 

కిట్కనఁగ రాదు కిటు కను  
గుట్కలు నట్కులు తగు నన గుటకలు నటుకుల్ 
గుట్కా పరదేశ పదము 
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్                                                                      12. 

చిట్కా లున్నవి పోవఁగా వ్యసనముల్ శీఘ్రంబ మేల్గూర్పఁగా 
మట్కా యన్నది యాట నూతనము వే మానంగ మేల్మేదినిన్ 
గుట్కా శబ్దము సుప్రసిద్ధ మగు నొక్కో యన్య దేశ్యంబునై 
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే ?                                                 11. 

ఆర్యా కల్లలు వలుకుట  
కార్యము కా దేరికైనఁ గవివర చెపు మే
చర్యల శంకరు లను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్                                                                  10. 

ధైర్యము నూని యేకతను దాఁ ప్రవచించెను ద్వైత భావమే 
వార్యము నాఁగ శంకరుఁడు పల్కెను హైందవ మన్న శబ్దమే 
యార్యుల దృష్టి సంస్కృతము నందు నదృశ్యము సుండి శంకరా
చార్యుల చేత హైందవము సర్వ విధంబుల భ్రష్టమై చెడెన్                                               9. 

రాజ్య మీ నని భీష్మించి రాజరాజు 
బంధు మిత్ర పుత్ర యుతమ్ము భారతమున   
యుద్ధమున వీర మరణమ్ము నొంద నంతఁ 
బాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు                                                                             8. 

పాపం బైనను బుణ్య మైనను నరవ్రాతమ్ము పొందున్ ఫలం 
బేపారంగ సునిశ్చయమ్ముగను శంకింపంగ రా దిందుఁ దా 
నే పుణ్యం బిసు మంత సేసెనొ కదా యింపార భోగింపఁగాఁ 
బాపాత్ముం డగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్గటా                                                7. 

పరమాద్భుత రీతిని నా 
సరసపుఁ బద్యమ్ము నందు శబ్దములం దా
వరుసలు మార్చి చదివినన్  
విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్                                                                 6.  

నరవర యేమి చెప్పుదు వినంగ వలెన్ వచియింప శక్యమే 
సురుచిర శబ్ద సంచయ సు శోభిత భంగినిఁ గావ్య లోక మం 
దు రుచిరమై వెలుంగఁగ మనోహర రీతి రచింపఁ గావ్యమున్ 
సరసకుఁ జేరి కోమలికి సత్కవి తా నధరామృతమ్ము ద్రా
వి రసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను బ్రీతిపాత్రమై                                                   5. 

సర్దు లెఱుంగక మనము క
పర్ది కృప వహింప నాటపాటల నలరన్    
మార్దవముగ నిఁకఁ దొలఁగెను  
దుర్దిన మని బాలు రెల్లఁ దోషముఁ గనిరే                                                                        4. 
[సర్దు = సరుదు, ఎల్ల] 

అర్దుగ సంభవింతు రిల నంచిత జన్ములు సాధు సజ్జనౌ
ఘార్దిత భాసి తాననుఁడు నౌ మన కృష్ణుని మేనమామకున్ 
దుర్దమ నిత్య సంకటద దుర్భర బాలక హింసకారికిన్   
దుర్దిన మంచు బాలకులె తోరఁపుఁ దోషము నంది రత్తఱిన్                                                 3. 

చేయరా దెగతాళి కొంచె మయిన నిను 
భస్మ మొనరించుఁ గోపము వడసె నేని 
యెవ్వ రనుకొంటి వీ యోగి నెడఁద నీవు 
నిప్పులం బూల వలెఁ జేత నిలిపినాఁడ                                                                          2. 
[నిలిపిన వాడు+అ = నిలిపినాడ; నిలిపి నట్టి వాఁడె ] 

ఒప్పుగ నేఁ దపో మహిమ నుర్వినిఁ జేసితి వింత లెన్నియో 
త్రిప్పితి భూమి చక్రమును దీవ్ర రయమ్మున నీటి కుప్పలో
నప్పుల నొక్క గ్రుక్క వెస నానితిఁ గొండలఁ బిండి సేసితిన్   
నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతి పూలుగన్                                                  1.