21, నవంబర్ 2025, శుక్రవారం

భీష్మ మాహాత్మ్యము.

 

భీష్మ మాహాత్మ్యము.

 

 

ఉ.

భీష్ముఁడు శాప జన్మ పరిపీడిత కౌరవ వంశ కీర్తి రో
చిష్మయ వర్ధనుండు సు వశీకృత పంచ నిజేంద్రియుండు చి
చ్ఛుష్మ పరాక్ర మోన్నత యశోధన మండిత వీర వర్యుఁడున్
భీష్మతమ ప్రతిజ్ఞుఁ డరి వీర భయంకరుఁ డెన్న ధాత్రినిన్  

1.      

 

 

 

మ.

త్రిది వోత్తుంగ నదీ కుమార వరుఁడై దేవవ్రతాఖ్యుం డహో
యుదయించెం గురు వంశ రాజమున నిత్యోద్యోగియై నిల్చెనే
సదసద్భావ వివేకవంతుఁ డిలలోఁ జాపాగ్ర్య నైపుణ్యుఁడై
సుదతీ కారణ మాత్మ సద్గురువునే చోద్యంబుగా గెల్చెనే

2.     

 

 

 

ఉ.

తీర్పఁగఁ దండ్రి కోరికను దిట్టతనమ్మున వీడె రాజ్యమే  
యేర్పడ దాశరాజునకు నింపుగ నమ్మక మాత్మలోఁ గటా
కూర్పరి బ్రహ్మచర్యమును గోరి వరించెను జీవితాంతమున్
మార్పఁడు నిర్ణయమ్మును సమంచిత రీతినిఁ గాచె రాజ్యమున్

3.     

 

 

 

చం.

నర వధ మాజిలోఁ బది దినమ్ములు సల్పెను భీష్ముఁ డుగ్రుఁడై
నరపతి ధర్మరా జడుగ నర్మిలిఁ దన్ను జయించు వైనమున్  
దురమున నాశిఖండి నరు తోడుగ నిల్పుఁ డటంచు మర్మముం
 గరుణ వహించి తెల్పి సహకార మొనర్చి త్యజించె బాణముల్  

4.     

 

 

 

శా.

గాంగేయుండు శరోగ్రతల్పమున విక్రాంతుండు స్వచ్ఛంద రీ
త్యంగాంతం బొనరింప నైపుణుఁడు కృష్ణారాధనా వ్యగ్రుఁడై
యంగీకారము లైన నీతులను  రాజౌచిత్య ధర్మమ్ములం
బొంగారన్ మది ధర్మసూనునకుఁ దా బోధించెఁ బుణ్యాత్ముఁడే

5.     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి