ఆర్తినిఁ గంచర గాడిద
సర్తృ జఠరమున జనింప సంధాన మహా
కర్తలు మర్త్యు లవనిలోఁ
గార్తికమునఁ గోకిల యొక గాకికిఁ బుట్టెన్ 60.
[సర్తృ జఠరము = గుఱ్ఱపుఁ గుక్షి; కార్తికము = కృతకమునకు/ కృత్రిమమునకు సంబంధించినది]
కీర్తి పలాశి కేల పరికింపఁగ నిల్చును, విష్ణు వైరికిన్
ధూర్త సురారి కర్భకుఁడు తోరపు టచ్యుతు వీర భక్తుఁడే
యార్తి నొసంగ దైత్య పతి కత్యధి కమ్ముగ నుద్భవించె, నో
కార్తిక! మాస మందు, నొక కాకికిఁ గోకిల పుట్టె వింతగన్ 59.
[మాసము = మాష పరిమాణము/ అల్పము; అందు =అనెదను]
నిప్పు వలె మనస్తాపం
బప్పుడు మితిమీఱ నకట మకరభ్రమతో
నప్పులఁ గదలాడఁగఁ బెను
కప్పనుఁ గని నంత గజము గజ్జున వడఁకెన్ 58.
తిప్పలు తప్ప వాతనికిఁ దెల్లమె యియ్యది యెల్లవారికి
న్మెప్పులఁ బొంద నేరఁ డట నిందల నందును మిక్కుటమ్ముగా
నెప్పటి వోలె నిప్పు డెద నీసున మావటి వాని వెఱ్ఱి వెం
కప్పనుఁ గాంచి కుంజరము గజ్జు మనెన్ శశకంబు నవ్వఁగన్ 57.
మంచిగఁ బంచఁ దలంచి స
మంచిత రీతిఁ గొని కుంచె డాడిన వడ్లన్
మించి సమకూర్ప నన్నము
కంచములో గారె లున్నఁ గాని తినండే 56.
ముంచిన నీతిబాధలె యమోఘములై ఘన దుఃఖ వార్థిలో
ముంచిన బంధు మిత్ర తతి మూరి సమస్యల యూబిలోపలం
గంచికి పోక నిల్చినఁ బ్రగాఢపు బాధల గాధ లెన్నఁడుం
గంచము నిండుగాఁ గలవు గారెలు గాని తినంగ నొప్పఁడే 55.
అంతము సేయం దలఁచుచు
నంతక నిభుఁ డాంజనేయుఁ డత్యుంగ్రుండై
పంతమున ఱాతి ముక్కల
బంతిని విసరంగ నద్ది పర్వత మయ్యెన్ 54.
[బంతి = పంక్తి]
స్వాంతము లందు సంతసము వానర కోటికిఁ గల్గ నత్తఱిం
జింతలు రేఁగ డెందములఁ జేవ నశింపఁగ దైత్య కోటికిం
జెంతన నున్న యా శిలను జేఁగొని మారుతి చక్కఁ బోలఁగా
బంతిని వేయఁగానె యది పర్వతమై కనుపట్టె వింతగన్ 53.
నాథు తేరికి వృషభేంద్రునకు నొకింత
హాని నొసఁగ నేరని కారణానఁ బ్రీతిఁ
బార్వతీ సతీమణి నిజ వాహనమ్ముఁ
గ్రూర మృగమును ముద్దాడెఁ గోమలాంగి 52.
వారక వాటికా తటినిఁ బల్లవ సన్నిభ మార్ద వోష్టియున్
నీరజ పత్ర లోచన వినిర్మల మానస పూర్ణ ఫుల్ల క
హ్లార తనుప్రభా శునక రమ్య మనోహర శాబకమ్ము న
క్రూర మృగమ్మునుం గనిన కోమలి ముద్దిడి సంతసించెనే 51.
కాచి రక్షింప సమయమ్ము గాన రాక
వ్యయమునకు నింత యేనియు బాధపడక
యుదరి వృద్ధాశ్రమమ్ముల నుంత్రు గాని
తల్లిదండ్రుల నమ్మరు తనయు లెల్ల 50.
[అమ్మరు]
అనయము విత్త మందు మది యత్యధికమ్ముగఁ గాఁగ లగ్నమే
ధన విషయమ్ము నందుఁ గనఁ దథ్యము నమ్మరు తల్లిదండ్రులన్
వినయము భక్తి గౌరవము వృద్ధి వహింప సతమ్ము కూఁతులుం
దనయులు నమ్మ రెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా 49.
[తనయులును+అమ్మరు = తనయులు నమ్మరు]
ఆరితేఱెను భూదాన మందు మిగుల
సుప్రసిద్ధ కనక దాన శోభితుండు
కాని యక్కజముగ నొక్క కన్య నైన
దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె 48.
దానము సేయఁ గశ్యపుఁడు ధారుణిఁ గొంటయె కాని నేరమే
దానము నందుఁ గర్ణుఁ డల తద్ద ప్రసిద్ధి వహించె నింపుగా
వానికిఁ దాత యౌట ముని వర్యుఁడు ధాత యభీష్ట మయ్యెనే
దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే 47.
[ఎన్నఁడును+తాతగ=ఎన్నఁడును దాతగ]
అలరి కాకర కాయ నాఁ బలికెఁ జదువు
లేని నాఁడు కీకర కాయ నా నుడివెను
జదివి మిక్కుటమ్ముగఁ బైత్యము దనరంగఁ
జదువు లెక్కువై పెట్టఁడు సంతకమ్ము 46.
కుదురును విత్త కార్యములు గోరిన యప్పుడ జాల వేదికం
బదిలము కార్య సంచయము పన్నుగఁ జేసిన జాల వేదికం
దుద కిట నన్ని కార్యములు తూర్ణము సంధిల జాల వేదికం
జదు వది యెంతొ కల్గినను సంతక మొక్కటి చేయ నొప్పఁడే 45.
[జాల వేదిక = అంతర్జాలము]
ముంజకాయ కుండు ముచ్చట కొల్పఁగ
మూడు కన్నులంట పాడిగాను
జూచు వారి కెల్లఁ జోద్యము మఱి వాఁడు
కనులు గలవు గాని కాంచ లేఁడు 44.
ఎంతటి వారికైన వరియించిన నక్కట పోవు కాలమే
వింత నెడంద మంచి చెడు వీక్షణ మబ్బదు సుంత యేనియుం
బంతము లుబ్బు సంతతము పండితుఁ డైనను మూర్ఖు భంగిఁ దా
నింతలు గన్ను లుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై 43.
పరుల మాటల నక్కట యాలకించి
యనుజుఁ డెల్ల కుమారుల యందుఁ గదిసి
యాస్తి పంపక మొనరింపు మంచుఁ బల్కి
యమ్మకున్ మ్రొక్క దున్నపో తనుచుఁ దిట్టె. 42.
అమ్మకు మించి దైవమును నారయ శక్యమె యెన్నఁ డేనియున్
నెమ్మి నొనర్చు సేవలను నిత్యము నెన్నక యెట్టి లాభమున్
సొమ్ముల కాసఁ జెంది తన చుట్టములం గని వీడి యక్కటా
యమ్మకు వందనం బిడఁగ నంతక వాహన మంచుఁ దిట్టెరా 41.
అంజలి ఘటించి వేఁడెద
మంజులముగఁ బల్కు మయ్య మానవ వర్యా!
స్వంజునకే మఱి కా దీ
కంజా తాక్షునకుఁ దొడవు కంకాళమ్మే 40.
మంజీరమ్ములు ఘల్లు ఘల్లు మన సంభావింప నీశాని యే
జంజాటమ్ములు లేక మిక్కుటపు టాసక్తిన్ శ్మశానమ్ములో
నంజల్ చాపి చరింప సంతతము ఫాలాక్షుండు ప్రార్థింపఁగాఁ
గంజాతాక్షుని, భూషణం బగుఁ గదా కంకాళ మెల్లప్పుడున్ 39.
ప్రేమ డింభక దంభక నాముల నిల
డి ద లు గఁ బిలుతు రెల్లరు ముదము మీఱ
గాన సభ లోన జంట లక్కరము లనువు
గా డి ద లు గాన మొనరించెఁ గమ్రముగను 38.
వనజ దళాక్షి యొక్క పరి పాడిన పాటను బాడకుండఁగాఁ
దనరఁగ వాద్య రావములు తద్ద ముదమ్మున గాన కోకిలే
తొనఁకు సెలంగ మేనుల సుదూరము పాఱఁ బయోధి భంగ లం
ఘనముగ గాడిదల్, మధుర గాన మొనర్చె సభాంతరమ్మునన్ 37.
చూచు వార లెల్లఁ జూడ ముచ్చ టయిన
జంట యంచుఁ బొగడఁ జంద్ర వదన
మన మలరఁగఁ దనదు చిననాఁటి చెలికత్తె
యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె 36.
మిన్నగఁ దన్ను జూచు నను మేటి తలంపు సెలంగ నాత్మలోఁ
గ్రన్నన నుద్యమించి చెలికాని వరించి వరింపఁ జేసి తా
మన్ననఁ జిన్న నాఁటి యభిమానినిఁ జింతిల కుండ నెవ్వ రే
మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్ 35.
నృపవర! కిష్కింధాపతిఁ
గపి సైన్యమ్మెల్లఁ గొల్వఁ గమనీయముగా
విపరీ తాచా రాసుర
కపి సైన్యమ్మెల్లఁ గొల్చెఁ గద లంకేశున్ 34.
[కపి = 1. కోఁతి, 2. పంది]
విపులాధీశుఁడు రామ చంద్రుఁ డనిలో విద్వేషణుం జంపఁగా
నపరాహ్నమ్మున నా విభీషణుని రాజ్యార్థాభిషేకమ్మనన్
నృప రాట్సూను వరేణ్యు రాఘవుని సందేశమ్ము పాటించుచుం
గపి సైన్యంబులు గూడఁ బల్కుకొని లంకా నాథునిన్గొల్చిరే 33.
భీమోగ్ర రూపునిఁ బరశు
రాముని వీక్షించి వెస ధరణిజ కదిసి యో
రామా వచియింపుమ యీ
రాముం డెవఁ డంచు సీత ప్రశ్నించెఁ గదా 32.
లేమకు రావణుం డనుచు లేశము కల్గెను శంక యాత్మలో
నేమన లంక నన్య నరుఁ డెవ్వఁడు దూఱఁ గలండు వింతయే
రామ చరిత్ర పాడుచుఁ గరమ్ము ముదం బిడినే యెఱుంగునే
రాముడు, వీఁ డెవం డనుచుఁ బ్రాభవ మేదని సీత చింతిలెన్ 31.
వెన్నుం జూపెను వైరికి
మన్ననకు ననర్హుఁ డితఁడు మనుజాధీశా
మన్ను కఱచె లేక బలం
బన్నముఁ బెట్టవలదు మన మల్లునకుఁ జుమీ 30.
కన్నియ నిచ్చినారలము కాంతకు దుఃఖ మొసంగ రాదు సూ
మన్నన కర్హుఁ డీతఁ డభిమాన ధనుండు చిరాగతుండు శు
ద్ధాన్నము పంచ భక్ష్యముల నల్లునకుం దగు సంతతమ్ము చ
ద్దన్నముఁ బెట్టరాదు మన మల్లుఁడు పండు గటంచు వచ్చినన్ 29.
పొమ్మని యన లేక తివిరి పొగను బెట్టి
నట్లు కూర్పఁగ శయ్యను నక్కజముగ
వార కొనరింప మరియాద దూర బంధు
మంచమునకు శోభనుఁ గూర్చె మత్కుణములు 28.
తరువుల పైన భాసిలఁగఁ దన్మయ మందఁగఁ జూచువారలే
సురుచిర వర్ణ సమ్మిళిత సుందర మూర్తుల బంధు వర్గమే
మురిసి శిలా లసద్విజ సమూహముఁ జక్క నలంకరింపఁగా
స్ఫుర దురు శయ్యకున్ మిగుల శోభనుఁ గూర్చెను మత్కుణంబులే 27.
[మత్కుణములు = నా కాకులు]
ధర్మమె దండనము దురిత
కర్మములకు రాజ నీతిఁ గమనీయముగా
మర్మ మెఱిఁగి పాటించిరి
ధర్మముఁ దప్పిన వనితకు దండము లిడిరే 26.
[దండము = రాజశిక్ష]
ఓర్మి వహించుటే సతుల కుర్విని నుత్తమ మైన ధర్మ మా
ధర్మము తప్ప నట్టి వనితా నిచయమ్మున కింక నింపుగా
భర్మము పైన మక్కువ నపారము చూపుట స్త్రీల ధర్మ మా
ధర్మముఁ దప్పి నట్టి వనితామణికిన్ నతులైరి విజ్ఞులే 25.
అవనిఁ బరికింప నిత్యో
గ్ర వాక్య సంచయ చతురులు కైతవ భాషా
ప్రవరులు నిరంతర క్షి
ప్ర వచన కర్త లన మృషలు వల్కెడి వారల్ 24.
దివిజులు వీరి బంధు లను తీరునఁ బల్కెద రెల్ల చోటులన్
వివరము లెన్నొ పల్కెదరు వింత లహో విను వార లున్నచో
నవిరళ వక్ర భాష్యముల నక్కట భాషణ నైపుణమ్మునం
బ్రవచన కర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్య దూరముల్ 23.
భక్తు లైన వా రెల్లరు పరమ శాంతి
వొంద నేర్తురు తప్ప కెడంద లందు
నన్న నిజ మన్న నాస్తికు లైన వారు
కాంచఁ దగిన దెద్దియు లేదు కాశి లోన 22.
హరుఁడు వసించు పట్టణ మి దన్నఁ గడింది నిజమ్ము సుమ్ము పో
దురు శివ భక్తు లెల్లరును దోరపు భక్తినిఁ బూజ సేయఁగా
ధర నిది పావ నాంగణము తర్కమ దేలయ దోష మించు కే
నరయఁగఁ గాశికాపురినిఁ గాంచఁగ నేమియు లేదు లేదు పో 21.
ఊహల విహరించుట యంద నుంద్రు భాగ్య
హీను లెల్లరు నిల లోన నెపుడు దీన
మానవుల కొసఁగ ముదము మానసంపు
టాకసంబునఁ దేలె హర్మ్యంబు లెన్నొ 20.
కీకారణ్యము నందు జంతువుల రక్షింపంగ సూర్యాంశువుల్
ప్రాకారమ్ములు నాఁగ నిల్చినవి సంరంభించి చోద్యమ్ముగా
సాకారమ్ములు మేఘ రాజములె యత్యాశ్చర్య మేపారఁగా
నాకాశంబునఁ దేలి యాడినవి హర్మ్యంబుల్ మనోజ్ఞంబుగన్ 19.
పండితోత్తములు సభా ప్రాంగణమ్ములఁ
బలుక నేర్తురంచుఁ దలఁచి దేవ
భాష లోని కొన్ని పదములఁ దెనిఁగించి
తెలుఁగు లోనఁ బలుకఁ దిట్టఁ దగును 18.
పొలమున నుండఁగాఁ గలుపు మొక్కలు హాలికు లౌర సైతురే
చెలువము మీఱ శబ్దము లశేషము లుండఁగ నాంధ్ర భాషలోఁ
గులుకుచు నన్య దేశములఁ గొన్నిటి నుద్ధతి సత్కవీంద్రులే
తెలుఁగున నేమి పల్కినను దిట్టఁ దగుం బరిహాస మాడుచున్ 17.
ఈ క్షితిని దేవదత్తుఁడు
దాక్షిణ్యము లేని సఖుఁడు దాఁ గ్రూరుండై
సక్షమ వే రక్షింపఁగఁ
బక్షిని గౌతముఁడు, గొట్టె, వద్దన సఖుఁడే 16.
అక్షయ పాప కర్ముఁడు నరాధముఁ డుగ్రుఁడు బాంధవుండు దా
నీ క్షితిపాత్మ జాతునకు నెన్నఁగ భిన్న మనస్కుఁ డింకనున్
రాక్షస సన్నిభాత్ముఁడు నిరర్థకుఁ డౌర దయా విహీనుఁ డై
పక్షినిఁ గొట్టె, గౌతముఁడు వద్దని చెప్పఁగ, దేవదత్తుఁడే 15.
రుజలఁ గలిగించు నకట మ
నుజులకు నీఁగలు కడింది నొవ్వుల నొసఁగున్
నిజము పరికింప వ్రణ భా
గజ మొక్కటి పుట్టె నీఁగ గర్భము నందున్ 14.
[వ్రణ భాగజము = వ్రణ భాగము నుండి పుట్టినది]
సత్తెపు టాయుధమ్ము తన సత్వము కా గిరిరాజ సన్ని భో
న్మత్తులఁ బాఱఁ ద్రోలె నొక మానవ మాత్రుఁడు పోరుబంద ర
న్బత్తన మందుఁ బుట్టి వెస వైశ్య కులాంగన గర్భ జాతుఁడే
మత్త గజంబు పుట్టె నొక మక్షిక గర్భము నందు వింతగా 13.
నరవరులు నిశ్చయమ్ముగ
నరచిన దిప్పగిది యలరి యత్తఱి మీ రె
ల్లరును వినఁగ నేనే కా
ద రవమునం, దిక్కనయె మహాకవి సుమ్మీ 12.
పుర జను లంద నచ్చెరువు భూతల నాథున కర్పణమ్ముగా
సురుచిర శబ్ద సంయుతము శుద్ధ కవీంద్రుఁడు బట్టు మూర్తియే
గురువుగ నెంచి తిక్కనను గోవిదు, నింపగు తెన్గు నంద, కా
దరవము నందుఁ దిక్కన మహాకవి, వ్రాసెను ద్వ్యర్థి కావ్యమున్ 11.
["సూరన పింగళి వంశ రత్నమే"- పాఠాంతరము ]
సీత యున్నట్టి లంకను జూత మంచు
నాథుఁ గోరఁగఁ గూర్మిని నాతి కోర్కెఁ
దీర్ప రఘురాము నానతి ధీర వరుఁడు
లక్ష్మణుం డూర్మిళం దెచ్చె లంకఁ గనఁగ 10.
సూక్ష్మముగా వచింపు మనఁ జోద్యము మీఱఁగఁ జెప్పె శిష్యుఁడే
యక్ష్మ రుజార్త వక్త్రుఁ డయి యత్తఱి నివ్విధి సంశయమ్మునం
బక్ష్మ యుగమ్ముఁ ద్రుంచి వెసఁ బక్షి వరేణ్యున కుగ్ర మూర్తి యా
లక్ష్మణుఁ డూర్మిళాసతిని లంకకుఁ జేర్చెను బుష్పకమ్ముపై 9.
అతి భారము వైధవ్యము
వెతలకు నంతమ్ము గనము విధవల కకటా
యతివా బ్రతుకున నుండఁగఁ
బతి, మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్ 8.
మగఁ డన మిన్న మక్కువయె మానిని కింపుగ నాత్మ లోపలన్
మగువల నెన్న మిన్న సుమి మంచి తనమ్మున భూతలమ్మునం
దగవుల కేల పోయెదము తన్వి తలంపుల బాస లీయఁగా
మగఁడు, గతింపఁ గాంచి కడు మంగళ మంచుఁ దలంచె భార్యయే 7.
[గతించినవి మగఁ డిచ్చిన బాసలు]
చాల దినమ్ములు వర్షా
కాలమ్మునఁ దడసి నట్టి కారణ మేమో
గాలికి నేలం గూలఁగ
దూలం బిభరాజ మగుచుఁ దోఁచెన్ సుకవీ 6.
జ్వాలాజిహ్వ సమాన వీర వర సంస్థానమ్ము పల్నాడునన్
కేళీ లీలలు ఘోర యుద్ధములు వీక్షింపంగ నచ్చోట మా
ర్జాలంబే మృగరాజ శేఖరము నౌరా మూషికోత్తుంగ శా
ర్దూలంబే యిభ రాజ మయ్యెఁ గవి శార్దూలా ప్రపంచంబునన్ 5.
తల్లి దండ్రులు బంధువు లెల్ల రకట
విత్త మొక్కటి వీక్షించి ప్రీతిఁ జెంది
భోగ భాగ్యము లబ్బును నాఁగఁ బలుక
నరువ దేండ్ల వరు వరించె నలరి బాల 4.
[బాల = మూర్ఖురాలు]
అరు దగు నుత్సవమ్ము మనసార నొనర్తురు భూతలమ్మునన్
నరహరి బాల దంపతులు నందను లెల్లరు నుత్సహింపఁగాఁ
బరఁగఁగ షష్ఠి పూర్తి యను పండుగ నవ్య వధూలలామయై
యరువది యేండ్ల పెండ్లి కొడు కంచు వరించెను బాల ప్రేముడిన్ 3.
తా దయతో లేకుండఁగ
నే దెస నన్యాయ మింత యేని సతమ్మున్
వేదన మాన్పఁగ రోగికి
వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్ 2.
పాదుకొనంగ ధర్మ మిలఁ బన్నుగ నిత్యముఁ గష్ట మైననున్
మేదినిఁ జేయు కార్యములు మిన్నగ శాస్త్ర విరుద్ధ మైనచోఁ
గాదని దేవతా పరమ కర్మము లందు సహేతుకమ్ముగా
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్య వృత్తియౌ 1.
[వైద్య వృత్తి = వేదములకు సంబంధించిన వృత్తి, పౌరోహిత్యము]