2, డిసెంబర్ 2016, శుక్రవారం

పద్యాలు_డిసెంబర్ 2016

అచిరగ్రహచార విచా
ర చర చిర విచార గోచరగ్రహచారున్
ఖచర రత వచో రుచుఁ గను
రుచి రాచా రోపచార రోచిత చరితున్                                                                                                    5
[ప్రస్తుతపు గ్రహచార ఫలితములాలోచింప దెలిసిన
 దీర్ఘ సంతాప సూచకపు గ్రహచారము కల్గినవాడు, 
 దేవతాసక్తి దాయక కీర్తనలయందు నిచ్ఛ గలవాడు, 
సదాచారము, సేవాగుణముల చే భాసిల్లున్న చున్న
వానిని గనుడు!] 

ఉ. క్రైస్తవ సన్మతప్రభవ కారణ భూతుడు పుణ్య మూర్తియున్
    నాస్తిక భావ నాశక సనాతన ధర్మ వికాసమాన చి
    త్త స్తవనీయ పూరుషుడు దైవ సుతుండు నరేంద్ర ధర్షిత
    న్యస్త విశాల చార వినతాంబుధి వీరుడు క్రీస్తుఁ గొల్చెదన్                                                                     4
    [చారము = చెఱ]
Meaning:
A name with which a Religion had its fame
A man of pure soul who sees the atheists crawl
Flares up the fire of Ten Commandments as a whole
A man of honour and Son of The Omniscient
Captured by the king and had the rupture of jail
Made the ocean bowed whom I always adore!


దుష్ట నికృష్ట వినష్టా
నిష్టాతుష్టాపదిష్ట నిర్దిష్ట మతి
క్లిష్టాభిమృష్ట శిష్టా
శిష్టాదేష్టాతిసృష్ట చేష్టా రతుడే                                                                                                                3

[దుష్ట=చెడ్డ; నికృష్ట = అధమము; వినష్ట=నశించిన; అనిష్ట; అతుష్ట;   అపదిష్ట = చెప్పఁబడిన; నిర్దిష్టము=నిర్దేశింపబడిన;  మతి=బుద్ధి కలవాడు; క్లిష్ట = పూర్వోత్తర విరుద్ధ పదాన్వయము; అభిమృష్టము=  కూడిన;;  శిష్ట+అశిష్టా = మంచి చెడులు; ఆదేష్ట = ఆజ్ఞాపించువానిచే; అతిసృష్ట = విడువఁబడిన; చేష్ట=వ్యాపారములందు; రతుడే= ఆసక్తికలవాడే.]

మాతాపితరుల స్తుతి:
కరివరద పదస్మృతి త
త్పరమతి విమల గుణధామ పావన పేర్రా
జ రుచిర నామమున వెలుఁగు
విరాజమాన సురభరిత పితృలోకమునన్                                                                                     2

తరళ సాధ్వీ లలామ శుద్ధచరిత సుగు
ణచయ విభ్రాజమాన వినమ్ర లలన
సంతత ప్రియ భాషిణి చారు శీల
సత్యసుందరి మాతల్లి ముత్య మెంచ                                                                                        1

1, డిసెంబర్ 2016, గురువారం

సమస్యాపూరణ_డిసెంబర్ 2016

సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక: 
ప్రారంభించిరి సత్కళా విభవ విద్వన్మండ లాఖ్యాతమున్
ధారాదత్తము సేయ నా సరక సంత్రాసంపు సుక్షేత్రముం
బౌరుల్మెచ్చి సగౌరవమ్ము భువి నాప్రాంతమ్ము పూర్వోక్తమౌ
సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ గనన్                                   61

గూఢశ్రుతుల నుడువు ను
ద్గాఢ శుభప్రద సుకర సదాచారమనన్
గాఢాను రక్తిఁ దలచిన
మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్                                          60

వ్యతిరేకార్థమున పూరణాంతరము:
గూఢశ్రుతుల నుడువు ను
ద్గాఢ శుభప్రద సుకర సదాచారమునన్
గాఢానురక్తి వీడిన
మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్                                            59

తా ఢీకొన్న ధరాధరమ్ము త్రుటిఁ బాతంబన్న చందంబునన్
బాఢార్థప్రదముల్ దురాత్మ కృత దుర్వాక్యమ్ము లేయన్న నా
గూఢంబైన ధనంపు లాభములు కోకొల్లల్ సుమీ యన్న నీ
మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్                             58

రాధాసుతు డని యేర్పడ
నా ధరణీ సురు డలిగి మహాక్రోశమున
న్నా ధానుష్కుడు భీతిలి
రాధేయుఁడు, వెంబడింప రాముఁడు, బాఱెన్                                                  57
[ రాముఁడు = పరశు రాముఁడు]

యోధాగ్రేశులఁ బాండుపుత్రులను దర్పోద్రేకు లా కౌరవుల్
వేధింపం జన ఘోష యాత్రకు మహావీరుండు గంధర్వుడే
బాధించంగను ద్వైత గోత్రమునఁ దాఁ బ్రాణార్థ మాసన్నుడున్,
రాధేయుం డదె, వెంబడింపఁగ వడిన్ రాముండు బాఱెం గటా                                56
[ఆసన్నుఁడు = సేవకుఁడు; రాముడు: భటుని పేరుగా భావించి] 

ఉచ్ఛ నీచముల నెరుగ కుండుదు రట
కింపురుషు లిలఁ జేసిరి కీడు వీడి
నీతిఁ బండ్లను, చింతిలి నీదు దుర్ద
శకు, నములకు భీతిలిరి నాస్తికజనమ్ము                                                       55

ప్రకృతిం గంపిలఁ జేసి యా వఱద దర్పం బూడఁ దగ్గంగ నా
వికటాకారపు గృధ్ర రాజముల నాభీలచ్ఛ దోద్రేకులున్
శకునమ్ముల్ గని భీతిఁ జెందిరఁట యాశ్చర్యంబుగన్ నాస్తికుల్
సకలక్షేత్రము లందు హేతు గణ సత్సారంపు సంశోధకుల్                                     54
[శకునము = పక్షి]

క్షుతముల బిడాల సవ్యపు గతులను గని
కడు నశుభములని జనులు గలతఁ జెంది
శకునములకు భీతిలిరి, నాస్తికజనమ్ము
వారిఁ జూచి నవ్వి రట నవారితముగ                                                             53
[క్షుతము =  తుమ్ము ; సవ్యము = ప్రతికూలము]

వివిధాకర్షణ విక్రయప్రకట నావిష్కార తుల్యమ్ములున్,
దివ సంచార నిబంధ జాలకపు రీతిన్నుండెడుం, దీక్ష్ణదృ
ష్టి విశాలద్రుమ కాష్ఠ మందునిడు పాఠీ నాశ నాభమ్ముల
య్యవకాశమ్ముల వీడినన్ నరుల కాహ్లాదమ్ము సేకూరదే?                                   52
[జాలకము = వల; అశనము = అన్నము , ఎర ]

అవనిం బున రవకాశమ
లవడునె మఱిమఱి విడువఁ గలతయే మిగులున్
లవలేశమైన నేమి స
దవకాశము విడిన నరుల కాహ్లాదమ్మా!                                                        51

కౌరవ వీరులఁ జూచి వి
కారముఁ బొందఁ దగు నెట్లు క్షత్రియున కిలన్ 
శూరుడ! బాణమ్ముల ని
ర్వీరుఁడు పో! విడుచు యుద్ధ విముఖుం డగుచున్                                           50

సవనవ్రాతము నిర్వహింప నిల దుస్సాధ్యమ్ము చింతింపగం
గవనం బల్లుట ప్రజ్ఞయౌ నవని సత్కావ్యస్వరూపంబులై
యవనిన్శ్వాసను నాపి యుంటనది ప్రాణాపాయమౌగాని యీ
యవధానం బొక ప్రజ్ఞయౌ నన నసత్యంబే కదా మిత్రమా                                     49
[అవధ+అనము = అవధానము = శ్వాసను చంపకుండుట; అనము =  శ్వాస]

భువనత్రయమున నిరత మ
నవధ్యులు విరాగులు సుమనస్కు లయిన మా
నవులకుఁ బశు ధన ధాన్య దు
రవధానము ప్రజ్ఞ యనుట యనృతము సఖుఁడా                                             48


పాప నాశన కారియ ప్రభు సుతుడని
యెంచి భక్తిప్రపత్తుల నెల్లను మది
నుంచి క్రీస్తుఁ బశ్చిమ సకలోర్విజన వ
శంకరునిఁ గొల్చుచుంద్రు క్రైస్తవులు సతము                                                    47

బొంకులు నేర్చి నిత్యమును మూరిన స్వార్థపు బుద్ధిఁ దాల్చుచున్
శంకను వీడి కావలము సల్పగఁ బొందిన ఘోర పాపపుం
బంకిల మెల్లఁ బాపి జనవర్గ సురక్షణ భార ధారి యౌ
శంకరు నాశ్రయించిరఁట సై యని క్రైస్తవు లెల్ల భక్తితోన్                                        46
[శంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు]

సరసోల్లాపము లెల్ల మారు వికటాసందర్భ హేలాగతిం
బరిహాసమ్ములు దెచ్చు నెల్లరకు విభ్రాంతిన్ వివాదమ్ములే
దరహాసమ్ములు సాలు వక్త్రమున  శస్త్రశ్రేణులన్ మించగం
గరవాలమ్మునఁ గాని కార్యములు తత్కాలంబ చేకూరగన్                                    45

శాస్త్ర విదుల నైనను గుసు
మాస్త్ర శరాఘాత సుహృదయార్తులఁ జేయున్
వస్త్ర విశేష లస దబల
శస్త్రశ్రేణులను మించు సరి చిరునవ్వే                                                            44

సీత! నీవిక ముక్తవు చెఱను బాసి
రాము డవనిజ విన గభీరముగ నుడివె
రావణుని చంపితి నని గర్వమునఁ బలుక
భర్త, మరణవార్తను విని, భార్య మురిసె                                                         43

వర్తన మేలనో కడిది భారము నేనది మోయ నేర్తునే
కర్తకు జాలి లేదనుచుఁ గర్కశు డంచుఁ దలంచి యేడ్చి తా
నార్తిని నెత్తి మొత్తుకొనె నత్తరి చిత్తము సంచలింపగన్
భర్త పరేతుఁ డయ్యెనను వార్త వినంగనె భార్య నవ్వెరా                                         42

ర్విని నున్న రాజులకు నోర్వగ రాని పరాక్రమంబునన్
సర్వ ధరాధి పోత్తముడఁ జాపగుణధ్వని కౌరవధ్వజా
ఖర్వ వినాశ కారణ వికాస ఘనోరుఁ గనుండు నన్ననన్
గర్వము తోడఁ బల్కు విలుకాడె మహారథు డుత్తరుండు బో                                    41
[ధ్వజము = గర్వము; అఖర్వము = అధికము]

అమ్మో కాలము దాటి పోయెడిని వయ్యారంబు నీకేల ర
మ్మిమ్మీఁ దున్నిటఁ గట్ట వేగముగ జాగేలన్ వరారోహ చి
త్రమ్మే నిత్యము వచ్చు నుత్తమ ముహూర్తా లర్ధ రాత్రిన్ వరా
లమ్మా రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్ధ రాత్రంబునన్                                   40

ఇమ్మగ బిడ్డడె యాస్తిని
నిమ్ముగ నమ్మగఁ దలంచి యీ కరముద్రల్
సమ్మతి నిటఁ బెట్టగ వలె
నమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే                                                      39
[నాలి = మోసము;  మగఁడు = పురుషుడు] 

శార్వరి సాగర సైకతస్థలి నిల్చినాకమ్ము వీక్షింప నాస్తికునకు
నిర్మలానంత వినీల నభోవీధి రత్నరాశుల వోలె రంజిలుచును
దేదీప్యమానమై దివ్యగ్రహ శశాంక తారాగణమ్ములు దర్శన మిడ
జలధి తరంగ నిస్వనము దశదిశలు వ్యాపింప జేసిన వనధిని గన
వృక్షముల నగల్చు పవన వేగముఁ గన
జగమున నడరు ధవళంపుఁ జంద్రికఁ గనఁ
గన్నుల మిఱుమిట్లు దెరలి కడలు కొనగ
దైవమును నమ్మ కుండగఁ దరమె యుండ                                                     38

ఏవిధి బ్రహ్మాండ మొదవు?
రావ రహిత సజలధి ధర భ్రమణము సలుపున్?
జీవము చరాచరులకును?
దైవమ్మును నమ్మకుండఁ దరమే యుండన్                                                    37

కశ్యప సుతాత్మజుండు ఘ
నశ్యామల వర్ణుడునర నాముడు విమతా
వశ్యుడు తిరస్కృ తామర
వేశ్యను వీక్షించి వేదవిదు లిడిరి నతుల్                                                         36

వేశ్య యలంబుషాఖ్యకును బేర్మి సుతాత్మజు డా కుబేరుడే 
వేశ్య సుతుండు కాడె మరి విప్రు డగస్త్యుడు పూజనీయుడున్
వేశ్య తనూజ సూను డిల విశ్రుత రాజట భారతావనిన్
వేశ్యను జూచి మ్రొక్కిరట వేదవిదుల్ గడుభక్తి నెల్లరున్                                        35


తాళపు చెవి యొండున రే
వేళం గలముం డొకండు వేగోద్ధతినిం
దాళపు కప్పను దెరువగఁ
దాళములో నుండు కప్ప దడదడ లాడెన్                                                       34

ఆళి వధూమతల్లి నలినాక్షి జిగీష నొకండు గాత భూ
గోళపు వాసు లెల్ల మృదు కోకిల రావమనంగ మెచ్చ హిం
దోళపు రాగ మంద వడిఁ దోరపు రాగముఁ జేరలేమి యా
తాళములోని కప్ప కడుఁ దల్లడమందె భయార్తచిత్తయై                                         33

[ఆళి = నిర్మలమయిన మనసుగలది; లోనికి+అప్ప=లోనికప్ప]

పరమ రసాయ నాంకగణ భౌతిక శాస్త్ర నికాయ సంపద
న్నెరుగగ వచ్చునే? నరుల కీ భువనభ్రమ ణాపదేశముం
గరువలి వేగ హేతువును గంటిరె? మూర్ఖులు హేతువాదు లీ
తిరుమల వేంకటేశ్వరుఁడు దేవుఁడు గాఁడని చెప్పి రెల్లరున్                                    32
[అపదేశము = కారణము]

సంస్కృతాంధ్ర పదములకు సంధి జేసి
తిరిటఁ దత్సమ మీశుడు తిరుమల పద
మిది వికృతి!  యొదవు తిరుమలేశుఁ డెట్లు? 
దేవుఁ డగును వ్యాకరణము తెలియఁబరుప!                                                     31

బాసట నిల్వ రామునకు వానర ముఖ్యుడు నర్కపుత్రు న
బ్బాసలు సోకఁ గర్ణములఁ బౌరుష మేసర సాధులోక సం
త్రాసుల యుద్ధ కోవిదుల రాక్షస వీరుల వైరు లెల్లఁ గొ
ర్కాసులఁ జూచి వచ్చినవి గంతులు వేయుచు కోతు లన్నియున్                              30
[ఏసరు = మీఱు,  అతిశయించు; కొర్కాసు =  నిప్పు ఉన్న కట్టె, కొఱవి]

సంతసమ్మున కార్తికోత్సవము లందు
జనులు వచ్చి చేర వన భోజనములకును
భక్ష్యచయ భరిత సుగంధ పాత్ర కర వి
కాసులఁ గని వచ్చెఁ గపులు గంతు లిడుచు                                                      29


ఇననిభ తేజ నేత్రము ఫణీంద్ర విభూషణు ఫాల మందునం
దనర శశాంకమౌళి యమదర్ప విఘాత మనోభిలాషియౌ
యినజ మృకండ సూనులకు నీశ్వర భాసుర మూర్ధ మందు నా
యిన శశిబింబ యుగ్మ ముదయించె దినాంతమునందు దద్దిశన్                              28

జనని శివప్రియ సావి
త్రి నగాత్మజ గౌరి బాలదినకర నిభ మా
కనక తిలక ముఖ శశిని
న్నిన హిమకర బింబము లుదయించె నొకమొగిన్                                               27

జ్ఞాతుల గురువుల మిత్రుల
ఘాతులఁ జేయంగ నొల్లక కుములెడు దరిం
బ్రీతి రణావనిఁ గృష్ణుడు
గీతను బోధించె నరుఁడు, గీష్పతి, వినఁగన్                                                       26
[నరుడు, గీష్పతి = పండితుడైన అర్జునుడు ]

ధాతకు నైన శక్యమె మదద్యుతి చిత్తుల నుద్ధ రింపగం
జేతులు వేయి వెల్గ నతి శీఘ్రమ భూసుర నాకు హోమ గో
మాతను దానమిమ్మనుచు మర్మము లెల్లయు రాజనీతి నా
గీతను జెప్పె నర్జునుడు గీష్పతియే, వినఁగన్, రణంబునన్                                    25
[అర్జునుడు = కార్త వీర్యార్జునుడు, రణములో పండితుడే]   

నిషిద్ధాక్షరములు - ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ అనే అచ్చులు, ఆ అచ్చులతో కూడిన హల్లులు:
రావణాది దుష్ట రాక్షస సంహార!
సకల సురవరగణ సన్నుత! భవ
సాగర పరిరక్ష! సత్య పరాక్రమ!
రాగ దయ్య గావ రామ చంద్ర!                                                                      24

సీతా మానస సాగర
శీతాంశుసమాసితాంగ! జిత కీనాశా!
భీత లవణాల యాశ్రిత!
వీత భయామర మునివర వినుతా! రామా!                                                        23

వడ్డిఁ గట్టఁ జాలునె పంట నడ్డి యింక
జితికి నడువ లేకుండగ బ్రతికి యుంటె
తంట కంట నీరారునె దాని కంటెఁ
దండ్రి! మరణమ్ము సంతోషదాయకమ్ము                                                            22

అనితర సాధ్య భక్తి మహిమాన్విత భాగవ తోత్తముం డటం
గనక పరిచ్ఛదాత్మజుడు కైటభ దైత్య విరోధిఁ బిల్వ వే
యనిమిష లోక మేగ నసురారి నృసింహ నఖాసి ఘాతయై
జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ                                      21

సరళతర పరిష్కృతములు సరస విలసి
తారవింద సమములు క్షీరాబ్ధి మథన
తుల్య మేధో మథన పద్య తోరణమ్ము
శంకరాభరణము సమస్యలకు నెలవు                                                               20

తరగని సంపదున్న మరి తారక రాముడు చిక్కె చిక్కులం
బరగెను వెన్నదొంగ చిఱు బ్రాయము నుండి సమస్యలందున
న్నరయఁగ శంకరాభరణ మందు సమస్యల వెల్లువే కదా
ధరణి తలమ్మునందు సుకృతమ్ములఁ దీరు సమస్య లింపుగన్                                    19


లలితమ్ముగ యజ్ఞమ్మున 
జ్వలితం బగుచుండ నంతఁ బామరు డొకడున్
సలిలమ్ము గుమ్మ రింపగ
బలవంతపుఁ జావు వచ్చె భాస్కరున కటన్                                                          18
[భాస్కరుడు =అగ్ని] 

ఇల వేదాంతము లెల్ల జెప్పుదురు లోకైకత్వ వాదమ్మునున్
ఫలితం బెంచగ వట్టి మాటలు సుమీ పంతంబులే ముఖ్యముల్
కలనైనం దలచంగ లేము కుల సంగ్రామంబు పేట్రేగగన్
బలవన్మృత్యువు ప్రాప్తమయ్యె రవికిం బ్రారబ్ధకర్మంబునన్                                           17

[రవి = జీవుడు]

చలమును విడనాడి యమున
హలధర కోపపరితప్త హల ఘాతమునం
దలవంచ వ్రయ్య గతియై
బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్                                                         16
[వ్రయ్య = చీలిక; సీత =నాఁగటిచాలు]

వలయాలంకృత రత్నకుండల యుగప్రద్యోత కాంతార సం
చలనానంద తరంగ హృత్కమలినీ సంతుష్ట బింబోష్ఠినిం
బలలాశామతి కాకచుంచు కృత సంపాతవ్రణక్షిప్త దో
ర్బలరాముం డవనీతనూజఁ గని దుర్వారమ్ముగా నవ్వెరా                                           15

[పలలము= మాంసము; ఆశ=దిక్కు; మతి=ఇచ్ఛ; 
వలయము =  కంఠమాల ]

బాహాటంబుగఁ బండితబ్రువుల వే వారింప ఘోరమ్ముగన్
సాహాయ్యమ్మును  బొంది సత్కవుల సత్సారార్థ లీలా పద
వ్రీహివ్రాత సమృద్ధ సంయుతము ప్రావృట్కాల మేపారగన్
సాహిత్యాధ్వము దుమ్ము రేగినది దుష్కాలమ్ము ప్రారంభమై                                          14
[పదవ్రీహివ్రాతము= పదము లనెడి వడ్ల సమూహము]

ఆహా! సుదినంబిది కో
లాహల మింక చెలరేగ లలిత కవులకుం
బాహి యనఁ గుకవి సంఘము
సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్                                                         13

పుణ్య మెట్లు పొందు పురుష పుంగవు డింకఁ
దీర్థ యాత్ర సేయ? దీనులకును
ధనము సుంతయైన దానము లేదనఁ
దప్పు,  సేయువాఁడె ధర్మవిదుఁడు                                                                       12

చెప్పిరి పెద్ద లెల్లరును జీవు లశాశ్వతు లెంచ నిద్ధరన్
గొప్పల కోసమై ధనము గోవెల కిచ్చిన ధన్యుడౌనె తా
నప్పులు సేసియైన సకలార్తుల కిచ్చిన సద్గుణుండ యీ
తప్పులు సేయు మానవుఁడె ధర్మవిదుం డన నొప్పు నెల్లెడన్                                         11

అక్షౌహిణీ సమేతము
నీ క్షోణినిఁ గావగ మది నెంచి యడరెడిన్
సుక్షత్రియులను విదళిత
రాక్షసుల సహస్రదృక్కు రక్షించు సదా                                                                    10

రాక్షసు లెల్లరన్ సతము రక్షణ సేయు, సహస్రనేత్రుఁడే
దక్షతఁ బూని పోరినను, దానవ వంశ గురూత్తముండు నే
కాక్షుడు భార్గవాన్వయ మహార్ణవ సోముడు బ్రహ్మ తేజుడు
న్నక్షయ వేద పారగుడు నద్భుత శిష్యగణాభిమానియున్                                               9

తులసీ తరు పర్ణైకై
లఘుత్వాంగక! సుమిత్ర గణ సేవిత! తా 
లస దమృతకర నిభముఖ!
సలలిత ఘననీల వర్ణ సదజిర కృష్ణా!                                                                       8

కఱకుఁ బలుకైన ముదితుఁడె కన్న తండ్రి
తనదు ప్రశ్నకు నీయ నుత్తరము విదిత
మెల్లరకుఁ బదమూడున కింపుగఁ బద
మూడు నాలుగు గలిపిన ముప్పది కద                                                                    7

దాడులు సేయు ఘోరగతి దౌష్ట్య గుణమ్ములు మానవాళిపై
వీడక క్రోధ మోహములు విస్తృత లోభ గుణాత్త చిత్తులై
యోడగ నీషణేంద్రియము లుర్వి జనాశ్రిత దోషకారకుల్
మూడును నాలుగున్గలియ ముప్పది యౌఁగద లెక్కఁ జూచినన్                                          6

[ముప్పు+ అది = ముప్పది ; ఈషణత్రయము(దారేషణము, విత్తేషణము, పుత్రేషణము), 
అంతఃకరణ చతుష్టయము (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము)]

సురవర లోక మేగుదురు శుద్ధ చరిత్రులు దైవ చింతనా
పరవశ చిత్త మానవులు భక్త శిఖామణు లెల్ల రిద్ధరం
దరతమ భేద హీన సమ దర్శన భాసిత దివ్య దక్షిణా
వరసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్                                                 5
[దక్షిణా వరసుర లోకము = యమలోకము]

విష్ణు లీల లెఱుఁగ గల విబుధు లేరి
కుమిలి మరణావసాన మగు సమయమ్ము
న మది నారాయణస్మరణ మహిమ నిక  
స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల                                                                               4

చదువు సంస్కారముల మేటి చతురు డగుచుఁ
బరుల ధుఃఖము మరలింపఁ బాటు పడుచు
నన్య దారలఁ గోరక యవనిఁ దనదు
సాని పొందున్నవారలే సత్పురుషులు                                                                       3
[తనదుసాని = తన భార్య] 

దాన గుణప్రవృద్ధ పర దార ధనాళి విముక్త మానసుల్
మానవ ధర్మ సంస్థిత సమంచిత భావ సమాశ్రితాత్ములున్
దానవ నైజహీన గురు ధార్మిక సద్గుణ సత్యయుక్త స
త్సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే                                           2

[సత్సానువు= మంచి మార్గము]

విస్తరంపు టరుగది భువి మితిమీఱ
వాయువర్త్మము మించగఁ బందిరిఁ గన
రితపు టరటి మ్రానులు నంద మీయ
ముచ్చటగ బెండ్లి యచ్చట ముదము నొసగె                                                                         1


1, నవంబర్ 2016, మంగళవారం

సమస్యాపూరణ_నవంబర్ 2016

సాధన విదితం బుత్కట
మేధోద్ధారణ సుకరము మేదిని సారా
గాధపద సుఖని మిథ్యా
మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా                                                  55

సాధింపంగఁ బటుత్వ మాంగ్లమున భాషాంతర్గ తమ్మేలనో
బాధల్ కల్గినఁ జిట్టి పిల్లలకు నింపారంగ నమ్మాయనన్
వేధించం బరిపాటె యాంధ్రులకు నావేశంపు చిత్తమ్ములన్
మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై!                        54
[అంతర్గతము= మఱవఁబడినది]

లసదినమయూఖ పక్ష
మ సితావారణ సుదేహ మహి మాసదృశున్
బిసరుహ నయన పృథ కనియె
నసమాన వరప్రదాత హరిదశ్వునకున్                                                         53
[మయూఖపక్షము = కిరణముల సమూహము] 

ఘనపు సమాసమ్ముల నం
దనపు టలంకరణల విశదపు వ్యాకృతులన్
ఘన వర్ణ నార్థ రతులై
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్                                         52
[సమాసము= సంక్షేపము ( ఎక్కువగా మాట్లాడకూడదు), సమాసములు; 
అలంకరణ = నగలు, అలంకారములు; వ్యాకృతులు = వివరణలు, వ్యాకరణము; 
వర్ణన = పొగడ్తలు, వర్ణనలు; అర్థము = ధనము, భావము]

సునిశిత దోష శోధకుల సూక్ష్మపుఁ జక్షువు లెల్ల దాటుచున్
మనమున నున్న భావమును మాన్యులు మెచ్చగఁ జెప్ప నొప్పగున్
జనహిత చిత్త మోదకర శబ్ద సుయుక్త నిగూఢ భావ సు
స్వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా                        51

చేతలు దైవ చోదిత విచిత్ర విధాయక సంభవమ్ములే
హేతువు లారయన్ జగ దభీష్ట సమృద్ధికి ఘోర దుష్టపుం
గూతలు గూసి నట్టి వెడ కుబ్జయ మంథర రామ వైభ వా
రాతినిఁ గూడినట్టి  చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?                                   50

శక్రుడు సురవిభుడు సంక్రందనుండట
పంచ కన్యక యట చంచలాక్షి
నుడువ గల రహల్యను జను లిటుల బలా
రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె                                                             49

ఆర్తుల కల్ప వృక్ష మిల నంగజ గాత్ర వినాశ ధీ జనో
ద్ధర్తృ విభూతి గాత్ర భవ తాప విదూరుడు చంద్రశేఖరున్
కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాప మౌ
హూర్తికు డావిలాంతమున హోత్రియుడై వెలుగొందు నిత్యమున్                     48
[పాప మౌహూర్తికుడు= దుష్కృతపు జోస్యుఁడు; ఆవిలము= కలుషము] 

ఆర్తి జనుల సకలాఘా
హర్తమని మదిం దలంతు రట శర్వాంత
ర్వర్తిత ముత్తమ మాసము
కార్తికము నశివుని పూజ గడుఁ బాపమగున్                                               47

ఉదరము నంద కాదు సకలోన్నత పర్వత సంచయంబులన్
సదమల పుష్క రాకలిత సాగర గర్భము లందుఁ బొందరే
విదళిత మైన వేదన నుపేక్ష వహింపదు రత్నగర్భ స
ద్ధృదయముఁ జీల్ప రత్నములు హేమములుం గనవచ్చు నంతటన్              46

సదమల మనో వికాసుల హృది నివాసు
లా పరమ పావన హరి భక్తాగ్ర మునులు
మదన బాణార్త విరహంపు మనుజులఁ గని
యెదను జీల్పఁ గనంబడు హేమమణులు                                                  45
[హేమమణులు= నారీరత్నములు]

సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక: 
అక్కజ మైన ధైర్యమును నందము లొల్కు ముఖారవిందముం
జక్కని వేష ధారణయుఁ జారు వచోరు విలాస చూడగా
నక్కలకంఠి మాటలు మహామయ శీఘ్ర వినాశ హేతువుల్
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి నౌషధమ్ముగా                               44

నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్
శ్రుతి హేలాభవ చిత్త మానవు సదా రోషద్యుతిక్షీణునిన్
హిత కామార్థ విభూతి పూజ్యు సతతై కైకాంబ రాచ్ఛాదితున్
మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే                              43
మొదటి  అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = లోతైన భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో పొండబడిన సంతోషము కలవానిని 
 శ్రుతి హేలాభవ చిత్త మానవు =  శ్రుతి హేలా + అభవ చిత్త మానవు= వేదములందు తిరస్కారము పుట్టని మనస్సు గల మానవుని 
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోషపు కాంతి లేని వాని హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల వలన పూజింపబడు వాడు 
సతత+ఏక+ఏక+అంబర+ఆచ్ఛాదితున్ = ఎల్లప్పుడు అంబరమే ఆచ్ఛాదన (కప్పు) గా కలవాడు 
మతిహీనాచల భావ పూరుషుని = కోరికలు లేని వాడు, స్థిరమైన భావములు కలవానిని 
సన్మానింప సంభావ్యమే. 

రెండవ అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = వంకర భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో నపహరింప బడిన సంతోషము కలవానిని; 
 శ్రుతి హేలాభవ చిత్త మానవు =  శ్రుతి హేలా + భవ చిత్త మానవు =  వేదములందు తిరస్కారము పుట్టు మనస్సు గల మానవుని;
సదా రోష ద్యుతి క్షీణునిన్ =  ఎల్లప్పుడు రోష కాంతులచేత క్షీణుని; 
హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల శూన్యుడు; 
సతతైకైకాంబరాచ్ఛాదితున్ = ఎల్లప్పుడు నేక వస్త్రము  నాచ్ఛాదన గా కలవాడు; 
మతిహీనాచల భావ పూరుషుని = మతి హీనుడు, కొండ వంటి (కఠిన) భావములు కలవానిని;
సన్మానింప సంభావ్యమే?


నుతజల సన్ముఖ ధౌతున్
గత కల్మష దర్ప భాస కర్మాసక్తున్
ధృతరాగమానస, కలుష
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ                                           42
మొదటి  అర్థము:
నుతజల సన్ముఖ ధౌతున్= మంచి నీటితో కడిగిన ముఖము వాడు; గత కల్మష దర్ప భాస= పోయినకల్మష దర్పములతో భాసిస్తున్న;   కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృతరాగమానస = అనురాగముతో నిండిన మనసు వాడు;  కలుష మతిహీన= కలుషపు బుద్ధి లేని;  పురుషు నుతింప మాన్యులు సుమ్మీ =  పురుషు నుతింప మాన్యులే.

రెండవ అర్థము:
నుతజ=పొగడ్తల వలన కలిగిన ; లసన్ముఖ= వెలిగిన ముఖము; ధౌతున్= కడిగిన వాడు;    గత కల్మష దర్ప భాస= పూర్వపు కల్మషము గర్వములు ప్రకాసమానమగు;   కర్మాసక్తున్  =  కర్మలనిష్ట పడువాడు; ధృత రాగ మానసకలుష= నిశ్చయమైన మాత్సర్యపుమనస్సుచేత కలుషితమైన వాడు; పురుషు నుతింప మాన్యులు సుమ్మీ =   పురుషు నుతింప మాన్యులే?   


అవిరళ పంచమ సుస్వర
వివశాత్ముల జేయ నెంచి వేల్పుల నెల్లన్
దివి కేగితివా! చెపుమా!
భువి వీడితి వేల బాల మురళీకృష్ణా!                                                              41

పట్టునె నిద్దుర పరుపుల
గుట్టది రట్టయినఁ దేలు కుట్టిన బరులే
దిట్టముగా నింట కవిల
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా                                                         40
[కవిలకట్ట= ఆస్తిపాస్తుల సంబంధమైన కాగితముల కట్ట;  బరి= దొంగ]

చుట్టము లంచు వత్తురిక చోద్యము మీరగ నెల్ల వేళలం
గట్టుడు పన్నులంచు నధికారులు నిత్యము వచ్చి పోదురే
పెట్టుదు రంచుఁ గన్నమును వీటికి దొంగలు చింత నొందరే
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా                                   38

కన్నుల్ కానని కాల రాత్రుల మహా క్ష్మాభృత్తు లందైననుం
జిన్నాభిన్నములైన గాత్రములు నుత్సేకంబు నక్షీణమై
దన్నొప్పార నభీతి భీకరపు యుద్ధంబందు నేపారు రౌ
తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రాహ్యమౌ                                  37

కన్నీరే సద్గంధపుఁ
బన్నీరైనను గుములక వరిపొల మందా
వెన్నులు సూచి మురియు రై
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్                                                      36

అడ్డ దిడ్డ మయిన నడ్డి విఱుగఁ జేయు
జడ్డ లడ్డమైన గిడ్డ గాక
దుడ్డు గడ్డుజడ్డు నొడ్డి దొడ్డ మనసు
పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు                                                                        35
[జడ్డ=సంకటము; గిడ్డ=పొట్టి; జడ్డు=తగులము]

వ్యగ్రవిహీన సద్గుణ పరాయణ శోభిత మూర్తి సచ్చరి
త్రాగ్ర జనార్చ నేప్సిత విహార విభూషిత తోషితాత్ము నే
కాగ్రమనోవిలాస సుపరాక్రమ విక్రమ తేజయుక్త సౌ
మ్యాగ్రహ మున్నఁ జాలు సుజనావళి మెచ్చును స్తోత్రవాక్కులన్                      34
[వ్యగ్రము= వేగిరిపాటు; పరాక్రమము=సామర్థ్యము; విక్రమము= శౌర్యము; 
తేజము= ప్రభావము, ప్రకాశము; ఆగ్రహము=అనుగ్రహము]

ప్రాగ్రము శాంతము ధరణి స
మగ్ర గుణ సమూహముల సదాచారంబే
యుగ్రత చెఱచు బనులను ని
రాగ్రహ మున్నపుడె మెత్తు రందఱు సుజనుల్                                                33

శ్యామామల జల కైరవ
తామరసాన్విత మధుకర తటినిం గనుమా
కామద దర్శిత నిర్జర
భామార మ్మనుచు ముదిత భర్తను బిలిచెన్                                                    32
[భామా+ఆరమ్ము=భామారమ్ము; ఆరము =  ఒక తటాకము]

ముద్ద దిగదు నిజ మరయం
దద్దినమే లేనిరోజు నా తద్దినమే
యద్దిన మగు నిక సుమ్మీ
విద్దియ యియ్యది వృధాయె వివరింపంగన్                                                     31

ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను నిక్కముగ హాలికు డోర్చునె వర్ష శూన్యమున్
మోదము నీయ నేర్చునె విభూషణ హీనము నీరజాక్షికిన్
కాదనలేరు క్షత్రియులు కయ్యము లెన్నడు వీరవర్యులై                                   30

సలిలము లందుఁ ద్రోసిరి విషజ్వలి తాన్నము వెట్టి రీసునన్
హలహల దర్ప సర్పమున హాని యొనర్చగ నెంచి రుగ్రులై
మలమల మాడ్చ నెంచిరి యమానుష రీతిని వారణాసి దు
ష్పలితముఁ గోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్                            29

దీటుగ నూహలు మనమున
నాటగఁ బరికించ వలె గుణ మగుణము లిలన్
చీటికి మాటికి నాతుర
పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్                                                        28

చల్లని వేళ వాహనముఁ జక్కగ నిల్పియు సంభ్రమంబుగ
న్నుల్లము సంతసిల్లఁ గడు నొప్పగు దుస్తుల నెమ్మిఁ దోడు రాఁ
దల్లియు దండ్రి భార్యయును దానికఁ బిల్లను, జూడకుండ నే
పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్                                    27

పండ్లు పువ్వులు కొనకుము పర్వ మందు
గుండ్లు నిండిన భూమిని గొనుము వేగ
పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
యిండ్ల నవ్వరె కని పువ్వుబోండ్లు నిన్ను                                                          26

సృప్ర ముఖారవిందుడు విశేషపు టాగమ పండితుండు ని
క్షుప్ర కరాభిశోభితుడు కోవిదు డుత్తము డెల్ల విద్యలం
జప్రము జేరి చూచి కలశమ్ముల నేర్పడ వీడి ఖిన్నుడై
విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే                              25
[సృప్రము=చంద్రుఁడు;  ఇక్షుప్రము=  ఱెల్లు;  ౘప్రము/ౘప్పరము= పందిరి, గుడారము]

విజయ దుందుభు లని మ్రోగ వీర వరుడు
సర్వ సైన్యాధిపతి భూరి సద్గుణుండు
శత్రురాజ శార్దూల సుక్షత్రియుండు
ద్విజుఁడు మద్యమాంసమ్ముల విందుఁ గోరె                                                          24

వాక్త్రాణద్యుతి భారతీ సుకర సంభావ్యాబ్జజాశీస్సులన్
ధృక్త్రాతాయత సద్గుణాత్త విలసద్దివ్యాస్య విష్ణూద్ధతన్
దృక్త్రేతాగ్ని రుచిప్రభా సదృశ సందీప్తాననాశీస్సులన్
వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్"                                         23
[వాక్త్రాణ= వాక్బలము; ధృక్త్రాత= ధైర్యముతోగూడినరక్షకుడు;  దృక్త్రేతాగ్ని= చూపులనే మూడగ్నులు]

ఆ రావణ సుతు నక్షయుఁ,
జేరగఁ దప్పు లట వంద శిశుపాలుని నే
పార బకారియు,శివుడున్
మారుతి, చక్రాయుధమున, మన్మథుఁ జంపెన్                                                     22

ఆరగ నేలఁ గృష్ణుఁ బరమాత్ము డటంచును గొల్తు రెల్లరున్
ధీరుడె వీడ టంచును మథించ మనమ్ము మురారి చైద్యునిన్,
దారుణ నిందలం గలగి ధర్మ సుతాదుల తోడఁ జూడ నా
మారుతి, చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై                                   21
[మన్మథుఁడు = బుద్ధిని కలవరము చేయువాడు; క్రూరకర్ముఁడు = భయంకరమైన కర్మ చేసిన వాడు]

పగ్గము లెల్లను గైకొని
బెగ్గడిల జనులు వదలక బేరము లెల్లన్
డిగ్గున జేయు వినీతుని
సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్                                                               20
[వినీతుఁడు = వర్తకుఁడు]

మగ్గంబుల్ పడి యున్న నింట సిరి సమ్మానింపఁ దా నేర్చునే
బుగ్గై పోయినఁ బంట కర్షకుని దాఁ బూరించునే విత్తముల్
నుగ్గుల్ సేయగఁ గొండ లన్నిటినిఁ గన్నుల్ నిండు నీరమ్ముతో
సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్                                          19

ఆ నవనీత చోరుడు దయారస మానస శోభితుండు స
న్మాన మునీంద్ర పూజితుడు ధర్షిత భామయ సత్యభామ తో
దానికఁ బారిజాతమును దప్పక తెచ్చెద నంచుఁ బల్కి యా
మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా                                     18
[మానము = స్త్రీలకు పురుషులయెడఁ గలుగు కోపవిశేషము;  మగవాఁడు =  శూరుఁడు]

అన్న గారి యాజ్ఞను బీముడు దుర్యోధను కట్లు విప్పు సందర్భము:
మౌనమున భీమసేనుడు
సేనాయుత చిత్రసేన శృంఖల బద్ధుం
గానల సుయోధను దురభి
మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్                                           17

వేషముఁ జూడఁ జిత్రము కుబేరుని మించెడి భోగ భాగ్యముల్
భాషను విన్న రోత యగుఁ బండిత వర్గము గొల్చు నిత్యమున్
రోషము భూషణమ్మట విరుద్ధము లాతని పల్కు లెల్లయున్
దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో                       16

శాంత మెరుగని ఘోర పాషాణ హృదయ 
మున్నఁ గాషాయ వస్త్రము లూన నింక
నవని ఘోషించునవి కల్ల లైన నేమి
దోషము లరుదు ధనమున్న దుష్టు నందు                                              15

కండలు నిండుగ నుండిన
మెండుగ నుద్దండు లైన మిండల నెల్లన్
దండిగ చెండాడంగన్
బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.                                                  14
[మిండఁడు = పురుషుడు] 

దండోరా విని సంతసమ్మున ఘనోద్దండక్రియన్ సాగి తాఁ
జండంబౌ మృదు విడ్డెనల్ చిదిమి యాశ్చర్యమ్ముగన్ ముప్పదుల్ 
గండం బించుక నెంచకుండ నలభై గారెల్ విలాసంబుగన్
బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్                        13

నేరమయ మీ కలి యుగము
ఘోరమ్ముగఁ జేసిరి యతి గోప్యముగ నదీ
తీరము సారపు భూమ్యప
హారము గొలిచిన నది పది యామడ లుండెన్.                                   12

దారుణ మర్థ నాశము నధర్మము ప్రాణ వినాశ కారమున్
ఘోరపు టాజి భూజనులకుం దగ దెన్నడు నిక్కమే సుమీ
పారిన దచ్చటన్ రుధిర వాహిని వే జరుగం బగన్ మహా 
హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ                      11

[హారము=యుద్ధము] 

జిత ఘన కేసరి గమ నాం
చిత పద పంకజ నిసర్గ చిత్తానందాం
కిత సత్య ధర్మ పాలన
ధృత విక్రమ యాతుధాన ధృతి హర! రామా!                                       10

[నిసర్గ =స్వభావము; చిత్తానందము, సత్యధర్మపాలన కంకితపు స్వబావము కలవాడు]

ఏ విధి నిల్చు నిప్పుడమి యింపుగ దైవమ లేక యున్నచో
బావన నామ కీర్తనలఁ బన్నుగఁ గొల్చిన సంతసించుచుం
బ్రోవగ నేర్చు సంతతము రోషముఁ బూనుచు శాప మిచ్చెడిన్
దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్                         9

కైవల్యానుగ్రహ సు
శ్రావితుడు కలియుగ మందు సప్త నగేశుం
డీ వేంకటేశు మించిన
దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్                                        8

కన మిల నిట్టి వాని నికఁ గన్నుల నిక్కలి కాల మందునన్
వినయ విధేయ తాది గుణ విశ్రుత సచ్చరి తాంత రంగుడే
యనయము దైవ చింతనము నాకలి దప్పులె రుంగ డమ్మ శాం
త నయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ              7
[నయుడు=  నీతిపరుడు]

తన వారన్న న్గిట్టదు
తన మాటయె కాని యొరుల తలపుల వినడే
వినయమ లేని వదరుఁబో
తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో                                   6

[వదరుఁబోతు+అనయుఁడు; అనయుడు = నీతిలేనివాడు]

లేరే కార్మికు లప్పురంబునను వారిం జూచితే నీ వికన్
వేరే రీతిఁ దలంప నేల వినుమా విస్తారపుం బల్కులన్
దూరం బైనను నేమి సంతసము దాఁ దోడై శ్రమింపంగ నా
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్                      5
[కార = యత్నము,ఉద్యోగము; కారాగారము = ఉద్యోగము చేయు చోటు, కర్మాగారము]

నీరారాతి విధూమాం
గారక మిచ్చు ఘన శీతకమ్మున ముదమున్
ఘోర తర నిధాగమ్మున
కారాగారమున ఘనసుఖంబులు దక్కున్                                             4

[కార+ఆగారము = కారాగారము; కార =  మంచుకొండ; మంచుకొండలలో యిల్లు]

నెయ్యమున లేప ముంగొని
యియ్యగమున చిక్కితేను నెరుగను మరలన్
గుయ్యిడె నతడు వరూధిని
యయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే                                      3
[అయ్య = పూజ్యుడు] 

అయ్య నియోగ మంత శిరమందునఁ దాల్చి వనాంతరమ్మునం
జయ్యన లక్ష్మణుండు సతి జానకి తోడుగ సంచరించగన్
దయ్యపు రూపు శూర్పణఖ  ధార్మికుఁ డున్నత సుందరుండు రా
మయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా                       2

[ ధార్మికుఁడు =  ధానుష్కుఁడు]

తెగువ మనోరుచిర రయ  ప
తగమున సద్ద్వారకన్నుత నివాసుడిలన్
దగ నంబుముక్కు వర్ణుడు
బిగి మగువ గన సమయించె విలయుని నరకున్                                    1
[అంబుముక్కు = మేఘము]

పద్యాలు_నవంబర్ 2016

నేర మవినీతు లన్నియు
దూరము మానవులు లేని తోరపు భువినిన్
ఘోరారణ్యము పంపిన
రౌరవ మేగినను నరులు లంచముఁ దినరే                                                     22

రామ భవాఘ విరామ
శ్యామల తను రుచి లలామ సద్గుణ ధామా
రామా సత్య పరాక్రమ
భామావనిజహృదయాబ్ధి భాసిత సోమా                                                         21

బాల్యము నుండి కష్ట పడి బాధ్యత లెంచి చరించి భాతృ వా
త్సల్యము మీరగం బెరిగి సంపద లెల్ల గడించి యుక్త సౌ
శీల్యము విస్మరించి మరి చీలిన నొండొరులన్ దురాశగన్
దుల్యము పైడి బాతుఁ తెగఁ ద్రుంపఁగ నక్కట మూర్ఖ చిత్తులై                                   20

అంభోజాక్షుని భూమిపుత్రుఁ జిరుహర్షావేశ దృగ్జాలల
న్నంభోజాననజూచి ఘోర తర బాణాగ్రక్షతేంద్రారి యా
గంభీరానన రౌద్ర రూపి యనురాగహ్లాద సంత్రాస సం
రంభాహార్యుల సత్యభామ గని పోరాడెన్ రణోత్సాహియై                                         19

అందము లొల్కు మోము పయి హాస మనోజ్ఞ విలాస రేఖలున్
చిందులు వేయఁ జెంప నును సిగ్గులు మొగ్గల రూపు తేరగన్
డెందము నందు ప్రేమ పురడించగ నించుక భీతి చొప్పడన్
సుందరి రుక్మిణీ సతి యశోద కుమారుని గాంచె నచ్చటన్                                      18

సుందర వదనారవిందావలోకనా
తత్పర పరివేష్టిత వివశ లల
నావర వచనాభి నందిత భాసుర
వాసుదేవు గొలుతుఁ బరమ పురుషు.                                                             17

భ్రమ వీడి కనియె రుక్మిణి
కమనీయారుణ నయన వికాసప్రభలన్
రమణీయాంచిత ధవళ
ద్రుమసుమ రోచిష్ణు కృష్ణు దుష్ట జనోగ్రున్                                                         16

తెనుగు హృద్య పద్య దివ్య వనమునందు
శబ్ద పల్లవముల సంకరమ్ము,
తులసి వనము చెఱచ మొలచిన గంజాయి
మొక్క వోలె, సేయ మక్కు వేల?                                                                    15

శ్రీరామాయణ కావ్య కర్త ఘన వల్మీకోద్భవుం డిద్ధరన్
తోరంబౌ తరణోద్భవుండు ఘన చిద్రూపుండు వ్యాసుం డిలన్
వారిప్రాంత శరోద్భవుండు శుభ షడ్వక్త్రుండు క్రౌంచారియున్
హీరాభద్యుతి కుంభసంభవుడు యోగీంద్రుం డగస్త్యుం డిలన్
నీరాటార్త పునర్భవార్చిత భవానీ శంకరాచార్యులున్
దారిం జూప నమస్కరింతు మదినిం ద్రైలోక్య సంభావ్యులన్                                        14                     

ఆకాశ వీధిని నసమాన విద్యుల్లతా తతి తోరణవ్రాత మనఁగఁ 
బద్మాకరమ్ముల ప్రవిమల ధవళంపు ముత్యాల రతనాల ముగ్గు లనఁగ
ధరణీ తలము వనార్ద్రస్ఫటిక విభవ జలపూర సమతల ఫలక మనఁగ
సప్త సాగరముల ఝషరాశి భీతిలి వేగంబ పాతాళ మేఁగె ననఁగఁ
బురులు విప్పి యాడ ముదిత శిఖిగణము
బెకబెక నినదములు పృథ్విఁ జెలఁగ
వరుణుఁడు కరుణింపఁ బురజనులకు నెల్ల
హర్ష మెసఁగ వచ్చె వర్ష మవని                                                                          13                         

వీణా తంత్రుల మీద నాట్యమును ప్రావీణ్యమ్ముగన్ సల్పుచున్
వాణీ హస్త నఖాంకురప్రతతి భవ్యాంభోజ రేఖాభలై
ప్రాణిశ్రేణుల సృష్టికర్తృ చికురాపారాళి సంచారముల్
వీణాపాణి కరాంచి తోద్భవములై విద్యోత మానమ్ములే                                                12

బహు కష్టము తెలిసి పలుక
బహుళమ్మగునత్వసంధి వనజజు కైనన్
విహరించు నిష్ట గతిని క
లహకారణము కవులకు నిలఁ దరింపుహరీ!                                                            11

గేహమున రేగఁ గలతలు
బాహువుల బలము సడలినఁ బరువము జారన్
దేహమునఁ జెలగ జాడ్యం
బోహో యిక వాని వెతలు నోర్వగఁదరమే                                                                 10

మత్తేభారిస్కంధుని
మత్తేభప్రాణ దాత మాధవు గొలుతు
న్నుత్తుంగాభంగ తరం
గోత్తంసోత్కర దయాపయోనిధి గుణధిన్                                                                     9

కరివర వరదు మకరి హరు
హరినిభకటి మురహరి నరహరి ఘనకిటినిన్
హరిగణ విభునుతు భవభయ
హరు ముదముగ గొలుతు హరిని హరిఫణ శయనున్                                                     8

కమలార్చిత పద కమలము
కమలాసనున కభయంపు కరములు కరమా
ల మరులు కొనియెడి సుమములు
సుమ దామ విలసిత కంఠు సుందరు గొలుతున్                                                            7 

కమల విలసితము:
దశరథ తనయ సదమల చరిత్రా
కుశలవ జనక సుగుణ గణ ధామా
శశినిభ ముఖ హరి సదృశ సుమధ్యా
దశశిర విదళన ధరణిజ నాథా                                                                                   6

కనిపెంచి పెద్ద జేసిన తల్లిదండ్రులఁ జదువులు నేర్పిన సద్గురువులఁ
బుట్టి పెరిగినట్టి పుణ్య భూమిని నాట పాటల జదివిన పాఠశాలఁ
గలసి మెలసి తమకంబున నాడిన చిననాటి దట్టంపు చిట్టి సఖుల
నాపద లందున నాదుకొన్న ఘనులఁ జేయూత నర్థించి రోయు జనుల
వృద్ధ జనుల నెల్ల వెలదుల బాలల
మూగ జీవ రాశిఁ బుడమి నున్న
వినయ మతిశయిల్ల విబుధ జను లెపుడు
విస్మరింపఁ దగదు విమల మతిని                                                                                 5                       

కందుకపు క్రీడలాడిరి
సుందరవదనారవింద శోభిత రమణుల్
కందర్పబాణవిద్ధలు
మందస్మిత చిద్విలాసుమాధవు తోడన్                                                                           4

ఇంద్ర వజ్రము:     
ధర్మమ్ముసత్యమ్ము సదాస్మరింపన్
మర్మంబు మంత్రంబు సమాచరింపం
గర్మంబు నిత్యమ్ము ప్రకాశ మైనన్
నైర్మల్య రాజ్యంబు ఘనంబు సుమ్మీ
                                                                            3

కన్న తల్లిదండ్రులుమరి గనిరి దివిని
తోడ బుట్టిన యక్కలు దూరమాయె                                 
కట్టు కొన్నసాప్త పదియు కాల మొందె
నకట భారమయ్యె బ్రతుకు నవని నిపుడు                                                                         2

చిత్తాభ సత్వతరు మరు
దుత్తమ వేగున్ జితేంద్రియు నధికమతి హ
ర్యుత్తమ వరాధికు ఘన మ
రుత్తనయున్ రామదూత రూఢిగఁ గొలుతున్                                                                        1