1, నవంబర్ 2016, మంగళవారం

సమస్యాపూరణ_నవంబర్ 2016

సాధన విదితం బుత్కట
మేధోద్ధారణ సుకరము మేదిని సారా
గాధపద సుఖని మిథ్యా
మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా                                                  55

సాధింపంగఁ బటుత్వ మాంగ్లమున భాషాంతర్గ తమ్మేలనో
బాధల్ కల్గినఁ జిట్టి పిల్లలకు నింపారంగ నమ్మాయనన్
వేధించం బరిపాటె యాంధ్రులకు నావేశంపు చిత్తమ్ములన్
మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై!                        54
[అంతర్గతము= మఱవఁబడినది]

లసదినమయూఖ పక్ష
మ సితావారణ సుదేహ మహి మాసదృశున్
బిసరుహ నయన పృథ కనియె
నసమాన వరప్రదాత హరిదశ్వునకున్                                                         53
[మయూఖపక్షము = కిరణముల సమూహము] 

ఘనపు సమాసమ్ముల నం
దనపు టలంకరణల విశదపు వ్యాకృతులన్
ఘన వర్ణ నార్థ రతులై
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్                                         52
[సమాసము= సంక్షేపము ( ఎక్కువగా మాట్లాడకూడదు), సమాసములు; 
అలంకరణ = నగలు, అలంకారములు; వ్యాకృతులు = వివరణలు, వ్యాకరణము; 
వర్ణన = పొగడ్తలు, వర్ణనలు; అర్థము = ధనము, భావము]

సునిశిత దోష శోధకుల సూక్ష్మపుఁ జక్షువు లెల్ల దాటుచున్
మనమున నున్న భావమును మాన్యులు మెచ్చగఁ జెప్ప నొప్పగున్
జనహిత చిత్త మోదకర శబ్ద సుయుక్త నిగూఢ భావ సు
స్వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా                        51

చేతలు దైవ చోదిత విచిత్ర విధాయక సంభవమ్ములే
హేతువు లారయన్ జగ దభీష్ట సమృద్ధికి ఘోర దుష్టపుం
గూతలు గూసి నట్టి వెడ కుబ్జయ మంథర రామ వైభ వా
రాతినిఁ గూడినట్టి  చెలి రాతిగ మారె నదేమి చోద్యమో?                                   50

శక్రుడు సురవిభుడు సంక్రందనుండట
పంచ కన్యక యట చంచలాక్షి
నుడువ గల రహల్యను జను లిటుల బలా
రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె                                                             49

ఆర్తుల కల్ప వృక్ష మిల నంగజ గాత్ర వినాశ ధీ జనో
ద్ధర్తృ విభూతి గాత్ర భవ తాప విదూరుడు చంద్రశేఖరున్
కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాప మౌ
హూర్తికు డావిలాంతమున హోత్రియుడై వెలుగొందు నిత్యమున్                     48
[పాప మౌహూర్తికుడు= దుష్కృతపు జోస్యుఁడు; ఆవిలము= కలుషము] 

ఆర్తి జనుల సకలాఘా
హర్తమని మదిం దలంతు రట శర్వాంత
ర్వర్తిత ముత్తమ మాసము
కార్తికము నశివుని పూజ గడుఁ బాపమగున్                                               47

ఉదరము నంద కాదు సకలోన్నత పర్వత సంచయంబులన్
సదమల పుష్క రాకలిత సాగర గర్భము లందుఁ బొందరే
విదళిత మైన వేదన నుపేక్ష వహింపదు రత్నగర్భ స
ద్ధృదయముఁ జీల్ప రత్నములు హేమములుం గనవచ్చు నంతటన్              46

సదమల మనో వికాసుల హృది నివాసు
లా పరమ పావన హరి భక్తాగ్ర మునులు
మదన బాణార్త విరహంపు మనుజులఁ గని
యెదను జీల్పఁ గనంబడు హేమమణులు                                                  45
[హేమమణులు= నారీరత్నములు]

సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక: 
అక్కజ మైన ధైర్యమును నందము లొల్కు ముఖారవిందముం
జక్కని వేష ధారణయుఁ జారు వచోరు విలాస చూడగా
నక్కలకంఠి మాటలు మహామయ శీఘ్ర వినాశ హేతువుల్
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి నౌషధమ్ముగా                               44

నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్
శ్రుతి హేలాభవ చిత్త మానవు సదా రోషద్యుతిక్షీణునిన్
హిత కామార్థ విభూతి పూజ్యు సతతై కైకాంబ రాచ్ఛాదితున్
మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే                              43
మొదటి  అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = లోతైన భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో పొండబడిన సంతోషము కలవానిని 
 శ్రుతి హేలాభవ చిత్త మానవు =  శ్రుతి హేలా + అభవ చిత్త మానవు= వేదములందు తిరస్కారము పుట్టని మనస్సు గల మానవుని 
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోషపు కాంతి లేని వాని హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల వలన పూజింపబడు వాడు 
సతత+ఏక+ఏక+అంబర+ఆచ్ఛాదితున్ = ఎల్లప్పుడు అంబరమే ఆచ్ఛాదన (కప్పు) గా కలవాడు 
మతిహీనాచల భావ పూరుషుని = కోరికలు లేని వాడు, స్థిరమైన భావములు కలవానిని 
సన్మానింప సంభావ్యమే. 

రెండవ అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = వంకర భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో నపహరింప బడిన సంతోషము కలవానిని; 
 శ్రుతి హేలాభవ చిత్త మానవు =  శ్రుతి హేలా + భవ చిత్త మానవు =  వేదములందు తిరస్కారము పుట్టు మనస్సు గల మానవుని;
సదా రోష ద్యుతి క్షీణునిన్ =  ఎల్లప్పుడు రోష కాంతులచేత క్షీణుని; 
హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల శూన్యుడు; 
సతతైకైకాంబరాచ్ఛాదితున్ = ఎల్లప్పుడు నేక వస్త్రము  నాచ్ఛాదన గా కలవాడు; 
మతిహీనాచల భావ పూరుషుని = మతి హీనుడు, కొండ వంటి (కఠిన) భావములు కలవానిని;
సన్మానింప సంభావ్యమే?


నుతజల సన్ముఖ ధౌతున్
గత కల్మష దర్ప భాస కర్మాసక్తున్
ధృతరాగమానస, కలుష
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ                                           42
మొదటి  అర్థము:
నుతజల సన్ముఖ ధౌతున్= మంచి నీటితో కడిగిన ముఖము వాడు; గత కల్మష దర్ప భాస= పోయినకల్మష దర్పములతో భాసిస్తున్న;   కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృతరాగమానస = అనురాగముతో నిండిన మనసు వాడు;  కలుష మతిహీన= కలుషపు బుద్ధి లేని;  పురుషు నుతింప మాన్యులు సుమ్మీ =  పురుషు నుతింప మాన్యులే.

రెండవ అర్థము:
నుతజ=పొగడ్తల వలన కలిగిన ; లసన్ముఖ= వెలిగిన ముఖము; ధౌతున్= కడిగిన వాడు;    గత కల్మష దర్ప భాస= పూర్వపు కల్మషము గర్వములు ప్రకాసమానమగు;   కర్మాసక్తున్  =  కర్మలనిష్ట పడువాడు; ధృత రాగ మానసకలుష= నిశ్చయమైన మాత్సర్యపుమనస్సుచేత కలుషితమైన వాడు; పురుషు నుతింప మాన్యులు సుమ్మీ =   పురుషు నుతింప మాన్యులే?   


అవిరళ పంచమ సుస్వర
వివశాత్ముల జేయ నెంచి వేల్పుల నెల్లన్
దివి కేగితివా! చెపుమా!
భువి వీడితి వేల బాల మురళీకృష్ణా!                                                              41

పట్టునె నిద్దుర పరుపుల
గుట్టది రట్టయినఁ దేలు కుట్టిన బరులే
దిట్టముగా నింట కవిల
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా                                                         40
[కవిలకట్ట= ఆస్తిపాస్తుల సంబంధమైన కాగితముల కట్ట;  బరి= దొంగ]

చుట్టము లంచు వత్తురిక చోద్యము మీరగ నెల్ల వేళలం
గట్టుడు పన్నులంచు నధికారులు నిత్యము వచ్చి పోదురే
పెట్టుదు రంచుఁ గన్నమును వీటికి దొంగలు చింత నొందరే
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా                                   38

కన్నుల్ కానని కాల రాత్రుల మహా క్ష్మాభృత్తు లందైననుం
జిన్నాభిన్నములైన గాత్రములు నుత్సేకంబు నక్షీణమై
దన్నొప్పార నభీతి భీకరపు యుద్ధంబందు నేపారు రౌ
తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రాహ్యమౌ                                  37

కన్నీరే సద్గంధపుఁ
బన్నీరైనను గుములక వరిపొల మందా
వెన్నులు సూచి మురియు రై
తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్                                                      36

అడ్డ దిడ్డ మయిన నడ్డి విఱుగఁ జేయు
జడ్డ లడ్డమైన గిడ్డ గాక
దుడ్డు గడ్డుజడ్డు నొడ్డి దొడ్డ మనసు
పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు                                                                        35
[జడ్డ=సంకటము; గిడ్డ=పొట్టి; జడ్డు=తగులము]

వ్యగ్రవిహీన సద్గుణ పరాయణ శోభిత మూర్తి సచ్చరి
త్రాగ్ర జనార్చ నేప్సిత విహార విభూషిత తోషితాత్ము నే
కాగ్రమనోవిలాస సుపరాక్రమ విక్రమ తేజయుక్త సౌ
మ్యాగ్రహ మున్నఁ జాలు సుజనావళి మెచ్చును స్తోత్రవాక్కులన్                      34
[వ్యగ్రము= వేగిరిపాటు; పరాక్రమము=సామర్థ్యము; విక్రమము= శౌర్యము; 
తేజము= ప్రభావము, ప్రకాశము; ఆగ్రహము=అనుగ్రహము]

ప్రాగ్రము శాంతము ధరణి స
మగ్ర గుణ సమూహముల సదాచారంబే
యుగ్రత చెఱచు బనులను ని
రాగ్రహ మున్నపుడె మెత్తు రందఱు సుజనుల్                                                33

శ్యామామల జల కైరవ
తామరసాన్విత మధుకర తటినిం గనుమా
కామద దర్శిత నిర్జర
భామార మ్మనుచు ముదిత భర్తను బిలిచెన్                                                    32
[భామా+ఆరమ్ము=భామారమ్ము; ఆరము =  ఒక తటాకము]

ముద్ద దిగదు నిజ మరయం
దద్దినమే లేనిరోజు నా తద్దినమే
యద్దిన మగు నిక సుమ్మీ
విద్దియ యియ్యది వృధాయె వివరింపంగన్                                                     31

ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం
బా దినమౌను నిక్కముగ హాలికు డోర్చునె వర్ష శూన్యమున్
మోదము నీయ నేర్చునె విభూషణ హీనము నీరజాక్షికిన్
కాదనలేరు క్షత్రియులు కయ్యము లెన్నడు వీరవర్యులై                                   30

సలిలము లందుఁ ద్రోసిరి విషజ్వలి తాన్నము వెట్టి రీసునన్
హలహల దర్ప సర్పమున హాని యొనర్చగ నెంచి రుగ్రులై
మలమల మాడ్చ నెంచిరి యమానుష రీతిని వారణాసి దు
ష్పలితముఁ గోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్                            29

దీటుగ నూహలు మనమున
నాటగఁ బరికించ వలె గుణ మగుణము లిలన్
చీటికి మాటికి నాతుర
పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్                                                        28

చల్లని వేళ వాహనముఁ జక్కగ నిల్పియు సంభ్రమంబుగ
న్నుల్లము సంతసిల్లఁ గడు నొప్పగు దుస్తుల నెమ్మిఁ దోడు రాఁ
దల్లియు దండ్రి భార్యయును దానికఁ బిల్లను, జూడకుండ నే
పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్                                    27

పండ్లు పువ్వులు కొనకుము పర్వ మందు
గుండ్లు నిండిన భూమిని గొనుము వేగ
పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
యిండ్ల నవ్వరె కని పువ్వుబోండ్లు నిన్ను                                                          26

సృప్ర ముఖారవిందుడు విశేషపు టాగమ పండితుండు ని
క్షుప్ర కరాభిశోభితుడు కోవిదు డుత్తము డెల్ల విద్యలం
జప్రము జేరి చూచి కలశమ్ముల నేర్పడ వీడి ఖిన్నుడై
విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే                              25
[సృప్రము=చంద్రుఁడు;  ఇక్షుప్రము=  ఱెల్లు;  ౘప్రము/ౘప్పరము= పందిరి, గుడారము]

విజయ దుందుభు లని మ్రోగ వీర వరుడు
సర్వ సైన్యాధిపతి భూరి సద్గుణుండు
శత్రురాజ శార్దూల సుక్షత్రియుండు
ద్విజుఁడు మద్యమాంసమ్ముల విందుఁ గోరె                                                          24

వాక్త్రాణద్యుతి భారతీ సుకర సంభావ్యాబ్జజాశీస్సులన్
ధృక్త్రాతాయత సద్గుణాత్త విలసద్దివ్యాస్య విష్ణూద్ధతన్
దృక్త్రేతాగ్ని రుచిప్రభా సదృశ సందీప్తాననాశీస్సులన్
వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్"                                         23
[వాక్త్రాణ= వాక్బలము; ధృక్త్రాత= ధైర్యముతోగూడినరక్షకుడు;  దృక్త్రేతాగ్ని= చూపులనే మూడగ్నులు]

ఆ రావణ సుతు నక్షయుఁ,
జేరగఁ దప్పు లట వంద శిశుపాలుని నే
పార బకారియు,శివుడున్
మారుతి, చక్రాయుధమున, మన్మథుఁ జంపెన్                                                     22

ఆరగ నేలఁ గృష్ణుఁ బరమాత్ము డటంచును గొల్తు రెల్లరున్
ధీరుడె వీడ టంచును మథించ మనమ్ము మురారి చైద్యునిన్,
దారుణ నిందలం గలగి ధర్మ సుతాదుల తోడఁ జూడ నా
మారుతి, చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై                                   21
[మన్మథుఁడు = బుద్ధిని కలవరము చేయువాడు; క్రూరకర్ముఁడు = భయంకరమైన కర్మ చేసిన వాడు]

పగ్గము లెల్లను గైకొని
బెగ్గడిల జనులు వదలక బేరము లెల్లన్
డిగ్గున జేయు వినీతుని
సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్                                                               20
[వినీతుఁడు = వర్తకుఁడు]

మగ్గంబుల్ పడి యున్న నింట సిరి సమ్మానింపఁ దా నేర్చునే
బుగ్గై పోయినఁ బంట కర్షకుని దాఁ బూరించునే విత్తముల్
నుగ్గుల్ సేయగఁ గొండ లన్నిటినిఁ గన్నుల్ నిండు నీరమ్ముతో
సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్                                          19

ఆ నవనీత చోరుడు దయారస మానస శోభితుండు స
న్మాన మునీంద్ర పూజితుడు ధర్షిత భామయ సత్యభామ తో
దానికఁ బారిజాతమును దప్పక తెచ్చెద నంచుఁ బల్కి యా
మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా                                     18
[మానము = స్త్రీలకు పురుషులయెడఁ గలుగు కోపవిశేషము;  మగవాఁడు =  శూరుఁడు]

అన్న గారి యాజ్ఞను బీముడు దుర్యోధను కట్లు విప్పు సందర్భము:
మౌనమున భీమసేనుడు
సేనాయుత చిత్రసేన శృంఖల బద్ధుం
గానల సుయోధను దురభి
మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్                                           17

వేషముఁ జూడఁ జిత్రము కుబేరుని మించెడి భోగ భాగ్యముల్
భాషను విన్న రోత యగుఁ బండిత వర్గము గొల్చు నిత్యమున్
రోషము భూషణమ్మట విరుద్ధము లాతని పల్కు లెల్లయున్
దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో                       16

శాంత మెరుగని ఘోర పాషాణ హృదయ 
మున్నఁ గాషాయ వస్త్రము లూన నింక
నవని ఘోషించునవి కల్ల లైన నేమి
దోషము లరుదు ధనమున్న దుష్టు నందు                                              15

కండలు నిండుగ నుండిన
మెండుగ నుద్దండు లైన మిండల నెల్లన్
దండిగ చెండాడంగన్
బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.                                                  14
[మిండఁడు = పురుషుడు] 

దండోరా విని సంతసమ్మున ఘనోద్దండక్రియన్ సాగి తాఁ
జండంబౌ మృదు విడ్డెనల్ చిదిమి యాశ్చర్యమ్ముగన్ ముప్పదుల్ 
గండం బించుక నెంచకుండ నలభై గారెల్ విలాసంబుగన్
బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్                        13

నేరమయ మీ కలి యుగము
ఘోరమ్ముగఁ జేసిరి యతి గోప్యముగ నదీ
తీరము సారపు భూమ్యప
హారము గొలిచిన నది పది యామడ లుండెన్.                                   12

దారుణ మర్థ నాశము నధర్మము ప్రాణ వినాశ కారమున్
ఘోరపు టాజి భూజనులకుం దగ దెన్నడు నిక్కమే సుమీ
పారిన దచ్చటన్ రుధిర వాహిని వే జరుగం బగన్ మహా 
హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ                      11

[హారము=యుద్ధము] 

జిత ఘన కేసరి గమ నాం
చిత పద పంకజ నిసర్గ చిత్తానందాం
కిత సత్య ధర్మ పాలన
ధృత విక్రమ యాతుధాన ధృతి హర! రామా!                                       10

[నిసర్గ =స్వభావము; చిత్తానందము, సత్యధర్మపాలన కంకితపు స్వబావము కలవాడు]

ఏ విధి నిల్చు నిప్పుడమి యింపుగ దైవమ లేక యున్నచో
బావన నామ కీర్తనలఁ బన్నుగఁ గొల్చిన సంతసించుచుం
బ్రోవగ నేర్చు సంతతము రోషముఁ బూనుచు శాప మిచ్చెడిన్
దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్                         9

కైవల్యానుగ్రహ సు
శ్రావితుడు కలియుగ మందు సప్త నగేశుం
డీ వేంకటేశు మించిన
దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్                                        8

కన మిల నిట్టి వాని నికఁ గన్నుల నిక్కలి కాల మందునన్
వినయ విధేయ తాది గుణ విశ్రుత సచ్చరి తాంత రంగుడే
యనయము దైవ చింతనము నాకలి దప్పులె రుంగ డమ్మ శాం
త నయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ              7
[నయుడు=  నీతిపరుడు]

తన వారన్న న్గిట్టదు
తన మాటయె కాని యొరుల తలపుల వినడే
వినయమ లేని వదరుఁబో
తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో                                   6

[వదరుఁబోతు+అనయుఁడు; అనయుడు = నీతిలేనివాడు]

లేరే కార్మికు లప్పురంబునను వారిం జూచితే నీ వికన్
వేరే రీతిఁ దలంప నేల వినుమా విస్తారపుం బల్కులన్
దూరం బైనను నేమి సంతసము దాఁ దోడై శ్రమింపంగ నా
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్                      5
[కార = యత్నము,ఉద్యోగము; కారాగారము = ఉద్యోగము చేయు చోటు, కర్మాగారము]

నీరారాతి విధూమాం
గారక మిచ్చు ఘన శీతకమ్మున ముదమున్
ఘోర తర నిధాగమ్మున
కారాగారమున ఘనసుఖంబులు దక్కున్                                             4

[కార+ఆగారము = కారాగారము; కార =  మంచుకొండ; మంచుకొండలలో యిల్లు]

నెయ్యమున లేప ముంగొని
యియ్యగమున చిక్కితేను నెరుగను మరలన్
గుయ్యిడె నతడు వరూధిని
యయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే                                      3
[అయ్య = పూజ్యుడు] 

అయ్య నియోగ మంత శిరమందునఁ దాల్చి వనాంతరమ్మునం
జయ్యన లక్ష్మణుండు సతి జానకి తోడుగ సంచరించగన్
దయ్యపు రూపు శూర్పణఖ  ధార్మికుఁ డున్నత సుందరుండు రా
మయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా                       2

[ ధార్మికుఁడు =  ధానుష్కుఁడు]

తెగువ మనోరుచిర రయ  ప
తగమున సద్ద్వారకన్నుత నివాసుడిలన్
దగ నంబుముక్కు వర్ణుడు
బిగి మగువ గన సమయించె విలయుని నరకున్                                    1
[అంబుముక్కు = మేఘము]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి