1, మార్చి 2016, మంగళవారం

పద్యాలు_మార్చి2016

మానవ పూజార్హ రమ
జ్ఞానామృత మయ మనోజ్ఞ నాద భరితముల్
గాన సుధా రస ధారల
గాన సహస్రద సుశీల కరుణా మయియే                                          10

హరివాగీశాదిగ సుర
వరగణ సేవిత వధువును వరునిం గనుడీ
దురితౌఘ హరము ఘన శుభ
కరమ్ము గిరిజా పురహర కళ్యాణ మిలన్                                           9

వందన మాచరింతు మదిఁ బర్వత రాజ తనూజ భర్తకున్
చందనభస్మగంధ పరి సర్పిత గాత్రుడు చంద్రమౌళికిన్
నందిత భృంగి శృంగి వర నంది పిశాచ గణాధినేతకున్
సుందర ఫాలనేత్ర పరి శోభిత వక్త్రు పినాకపాణికిన్                               8

శ్రీశైలాగ్రతటీస్థ పుణ్యజన సంసేవ్యుండు మల్లన్ననున్ 
కాశీక్షేత్ర విరాజితున్ శివుని ద్రాక్షారామ భీమేశ్వరున్
రాశీభూత దయాపయోనిధిని సద్రామేశ్వ రాలంకృతు
న్నీశానీ కర పూజితాంఘ్రియుగ దేవేశుం భవున్ వేడెదన్                       7

హరహర! మహా సురా! హిమ
గిరివరవాస! నటరాజ! గిరిజానాథా!
పుర త్రయ హరా! దయాకర!
సురాపగాజూటధీర! సుందర! ప్రణతుల్                                                  6

మూర్ధవిరాజిత సోమున్ 
దుర్ధర్షాభీల గరళ దోషిత కంఠు
న్నర్ధేశ సఖుఁ దలతు వా
మార్ధస్థిత శైలసుతు నుమాశంకరునిన్                                                    5

మనమున ఘనమ్ముగ మథిం
చిన బృహదాలోచనలు విశేషముగ ఫలిం
చుననిన సందేహంబే
మినుములఁ దిరుగలి నఱుమదె  మెత్తని పొడిగన్                                      4

దండధర పాశ బంధన
మండితము కఠోర ఘోర మరణాస్పదమున్
భండన భీభత్సుండు
ద్దండ ఖగేశ్వరుని పోరు ధరణిన్ ఫణికిన్                                                     3

గురుతర కార్య ధురీణుని 
స్థిరమతి వనధి తరణ సురుచిర సేవా త
త్పరుని గనుడు రామాంచిత
కరాంగుళీకృత త్రిరేఖుఁ గమనీయముగన్                                                   2

సత్సంగోత్సాహ ఘనులు
మాత్సర్య విగుణ విహీన మహి మోన్నతులున్
తాత్సార ఖాదన విహా
రోత్సుకు లిరువురుఁ గురంగ యుగళము గనరే                                            1

సమస్యాపూరణ_మార్చి 2016

కపటమున జనధన మపహరణ మదిని
దురిత భయము దలపక రయమున నొ
నరిచి గుడికి నిడ వితరణ మఘము గద
దాన గుణము మిగుల హీనగుణము.                              31

అసమాన పరాక్రము భా
ను సమానాభాసు సద్గుణుని, మించిన మా
నస నైర్మల్యము నందున
పసిబాలునిఁ,  బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్.                30

ధర్మ విహీనుడు ద్రౌణుని
కర్మ హతుండు ప్రతివింధ్యు  కాల వివశునిన్
మర్మ విహీను, కుమారుడు
ధర్మజునకుఁ,  గన్నతల్లి ద్రౌపది యందున్.                           29

తామ రాకున దోయంపు ధార వలెను
బంధు రాలయమ్మున గీతఁ బాడ వలెను
చోర నికరములకు జాలి సూప వలెను
తాటి తోపులోఁ బాలను ద్రాగ వలెను.                                     28

సుంతైనవెరపు జెందకఁ
బంతము బూని తన మాట పాడియ యనుచున్
వింతగ దూషించుచు నిక
కాంతుని సేవించు నాతి! గయ్యాళికదా!                                   27

రాము ఘననీలిమేఘ
శ్యామునినేమార్చి తాదశగ్రీవుడు సీ
తామాతనపహరింపగ
రాముడు కన్నీరు కార్చె రావణుడలరన్                                    26

జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట పాప కృత్యమౌ
నననవివేకమే ఘనదయాగుణసంయుత తప్త చిత్తులై
యనిశమునాత్మ సౌఖ్యములనాశలనుంచక కష్ట జీవులై
తనయులనుద్ధరింతురిల తల్లియుదండ్రియు పూజనీయులే         25

కాననమ్ములఁ బతి సేవ కందె నంత
సత్యవంతు డాయె నట భృశమ్ము వశము
యముని సావిత్రి గని పలాయన మొనర్చె
వేగ నాతని జేరగ సాగె నతివ                                                      24

ఉత్సవమ్ము లందు నుద్యాన వన భోజ
నమ్ముల సమ భావనమ్ము సుంత
వదలినను దరతమ భావమ్ము జూపిన
వైరములను బెంచు బంతికూడు.                                                 23

పద్య రచనకు గణయతి ప్రాస లేల
నన నమిత శ్రవణానంద మంద జేయ
లలిత సుందరాంగుల కాభరణము లనగ
చంద మిచ్చు పద్యమ్మున కంద మెపుడు                                        22
[చందము = ఛందము]

నాధవతి పుణ్యవతి యే
నాధుఁడు సౌభాగ్య దాత నారీ మణికిన్
బాధా కరమే, కాదిల
వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.                                      21

జలమిలఁ బ్రాణా ధారము
ఫలవంతము నెంచ స్నాన పానాదులకున్
సలలితము పూజ నీయము
తులసీ దళము మనకు విష తుల్యమ్ము గదా!                                  20
[విషము = జలము]

తడవ తడవ హితులు తన్ను పలుకరింప
కడగి పడతి సేవ కరము సేయ
పడక యిల్లు వదల పనిలేదు వింతగ
నడుము నొప్పి తెచ్చెఁ గడు ముదమ్ము.                                            19

ఉత్తర కుమార ఫల్గుణు లుత్తములు ప
రాక్రములును సారథి మహారథులు గోగ్ర
హణ విముక్త రతులు ఘను లందు నాజి
నరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.                                                18

భువి నాశా పీడిత మా
నవ దురహంకార చేత నమ్ములు నిత్యం
బవిరళ  ఖండిత జంతు స
హ వనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే.                                      17

రావణాసురుచే రవి రశ్మి హీను
డయ్యె ననిలానలుల శక్తి యణగె నట్ల
పుష్పక విమానముం గోలుపోయి దివిని
బేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు.                                              16

మెండుగ నెరువు నీరును మేదిని నిడి
కండగల విత్తులను జల్లి కాల మెరిగి
కలుపు తీయగ నేపుగఁ గాండమూని
బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ.                                                       15
[బీర = పెద్ద]

విధివత్కృత మంత్రవచః
ప్రధాన పూజాభిషిక్త పరమాత్ముని స
న్నిధి పంచామృత సారఘ
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.                                        14

పాప దుఃఖ హర మపార పారాశర్య
వినుత సకల శాస్త్ర వేద సార
ధరము హరికథా సుధా పాన మత్తుండు
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.                                                                13

ఇంపుగ నజభజ జజరలు
చంపకమాలకు గణములు సభరనమయవల్
సొంపగు మత్తేభమునకు
పెంపారు కవన సుమములు పేరిమి తోడన్                                             12

వక్రత్రిశిఖయు, ధాత్రీ
చక్రమ్మున దైత్య కంపజ,  త్రిశూలమ్మున్
శక్రాశనితుల్య, సదృశ
చక్రాయుధమున్, ధరించు శంభునకు నతుల్.                                        11

పట్టు వదలక మదిని నెప్పట్టు నైన
పట్ట వలెనని రాహువు పట్టె నత్రి
పట్టిని నుడువ నలవియే యట్టి గట్టి
పట్టు గ్రహణమ్ముశశిన మావాస్య నాఁడు.                                                10

పుష్ప భరిత క్షితిరుహము భువిని నొసగు
సుధ లొలుకెడి కాంతితతుల సోము డవని
నశన దాతయై వర్తిల్లు ననవరతము
పండు, వెన్నెలఁ గురిపించు,  భాస్కరుండు.                                             9

ఉర్విఁ జండ ప్రచండ మయూఖ సంహి
తార్కుడు కమల మిత్రుం డహర్పతి కువ
లయ విలాసకరు శశి కిల కరుణించి
పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు.                                                 8

శివకేశవ భేదంబే
ల? వలద నవసరపు కలవరములు జనులకున్
శివపూజలతో నింపుగ
శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్.                                                 7

పొలములు పిల్లలు నున్నయె
డల వలయునిక  దమవాకిట పశుగణములు
న్నిల పశు సంపద నింపుగ
గలవారలకున్ గరళము గావలెను సుమీ.                                               6
[ గరళము = కసవు ప్రోగు; గడ్డి మోపు ; విషము]

తప్పు లెన్నియైన నొప్పులగు ననియు
ముప్పు లన్ని యింక తప్పు ననుచు
గప్పి కళ్ళు దోచ నప్పనముగ దుడ్డు
నప్పులున్నవారె గొప్పవారు.                                                                 5

పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్
కోపము కామమున్ మదము కుత్సిత మత్సర మోహలోభముల్
తాపము నీయ మారిన యధర్మ పరుల్ నరు లెల్లరుం గన
న్నా పరమాత్ము సంతతులె యాగుణ దూరులు నైన ధన్యులే                  4

గోత్ర ధారి ముదముగ  వైకుంఠ మందు
లచ్చిమగఁడు వసించుఁ గైలాసమందు
చంద్రమౌళి పార్వతితోడ శంకరుండు
ప్రమథ గణము సేవింపగఁ బరవశించు                                          3

రంజన సెడి యన్యోన్యాను రాగ సువిము
ఖుల వలెనట మంగళవాద్య ఘోషణములు
వఱలు చుండగ నతిఖిన్న  వదను  లైరి
పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి!                                                2

నాకెఱుక పంచపాండవు
లాకత మంచమునకున్న యాకోళ్ళ వలె
న్నేకముగ మూడను నటుల
కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!                                      1