9, ఏప్రిల్ 2016, శనివారం

పద్యాలు_ఏప్రిల్ 2016

అట్టాదులు కన్పట్టవు
నట్టింటను బట్టు మనుచు నాలుగు రోజుల్
పట్టణ కాంతల లీలలు
కట్టా నాగరికతం గగనముం దాకున్                                  21

భూదేవి రత్న సన్నిభ
మోదక సదృశములు ముగ్ధ మోహన రుచులన్
ఖాదన శాక విశేషము 
స్వాదు రుచి సుసంహి తామ్ల శాకము లవియే                    20

బర్హి సుదర్శన తర్పిత
బర్హిణ రాజాతిశయ విభవ జిత ఘన ప
త్యర్హతుడు సఖీ సహితున్
గార్హస్థ్యాచరణ రతుల గనుడట బ్రీతిన్                                 19

ప్రగతి పథాను గమన దే
శ గరిమ మిదియె? సుకుమార శాతోదరియే
విగత ధన పీడిత హృదయ
గగన సదృశ కార్య భార కాంతను గనుడీ                             18

పప్పు దినుసులవి కొనలే
మప్ప నిజము ముత్యములకు నవి సాటి యిలన్
తిప్పలు తప్పవు కొనినం
గొప్పలకుం బోయి యప్పు గోరిన వేళన్                             17

అనవరత వాహ నావృత
ఘన జన సమ్మర్ధ రాజ గమథం బదివో
కన బహు సాహసి గద యా
వనితయు నాట లవి యేల బథ రాజములన్                       16

సప్తఛద పత్ర మా?యది
తప్తాగ్నిస్థాల నిభము ధరణిన్ వెలుగున్
తృప్తిగ నశనము గుడువం
గుప్తము సేయ పనిలేదు కుదురుగ దానిన్                           15

కొత్తిమిరి నింపు గించుక
మత్తిడు రసమందు వేయ మన మలరించున్
విత్తనములు ధనియాలను
చిత్తొనరించఁ బొడియిడు రుచిని కూరలకున్                          14

హరితా భర శాద్వల సా
గర నిభ వన యవస కుసుమ కర ధవళా ఫే
న రుచిర దృశ్యము రత్నా
కర లీల మెరసె నితాంత కమనీయముగన్                              13

కొత్తిమిరి నింపు గించుక
మత్తిడు రసమందు వేయ మన మలరించున్
విత్తనములు ధనియాలను
చిత్తొనరించఁ బొడియిడు రుచిని కూరలకున్                             12

తరుణార్క కిరణ సన్నిభ
సురుచిర చూత ఫల సార చోదిత శుక రా
జ రవశ్రవణానంద మ
మర సుఖముల కన్న మిన్న మనుజుల కెల్లన్                          11

వనితా జన సంస్పర్శము
ఘన ముని వర జప వినాశ కర మలివేణీ
తనరార ననంగ శరా
శని ఘాతము విహ్వల మతిఁ జరి యించితినే                              10

నిద్రా దేవీ కృత చిర
భద్రాశ్రిత సన్నిధాన పరమాసక్తున్
క్షుద్రోపాసను ఘన ని
త్యోద్రేకాత్మునిఁ దరింప నుర్వి నలవియే                                         9

జాడీ నిండుగ, దండిగ
వాడినఁ దనియరు కరండ బంధము దానిన్
వీడరిల నావకాయను
వేడుక లందాంధ్రులెల్ల విస్మయ మందన్                                        8

చిన్నారి చెల్లి జడనుం
గన్నార్పక నేర్పు మీరఁ గమనీయముగన్
విన్నాణి యన్న వేయన్
మిన్నంటిన వారి ప్రేమ మెప్పై యొప్పున్                                        7

తల తానమ్ముల కిప్పుడు
సలలితముగ నురుగు నీయ జగమెల్ల గనన్
చెలరేగె రసాయన సం
కులమ్ము లేరి కెరుక యిక కుంకు ళ్ళనినన్                                      6

హాస్యార్థంబున కైన ర
హస్య విధిని చతుర వాచ్య హననము దగునే
యాస్యప్రకటిత దుఃఖము
తస్యాననమున గనుండు దయనీయముగన్                                    5

భువనైక మోహ నాతీ
త వరాంగ విలాస చేష్ట తన్మయ రూపుల్
ఛవిమత్కంకణ కర రా
ఘవ వంశోద్ధార కానఘమతుల గనుడీ                                            4

వేసవి కాలపు దాహపు
త్రాసము దీర్పంగ లేత తాటి ఫలములున్
వీసపు ధరలం దొరుకును
దోసము సేయ వవి త్ర్రాగ తోషము నిచ్చున్                                        3

వచ్చును బోవును సమములు
ఖచ్చితము మరణము బుట్టఁ గరుణా మతియై
నిచ్చలు పుణ్య యశమ్మున
చచ్చిన బ్రతుకంగ వలయు జగతిని పేర్మిన్                                         2                                         
సముఖం బాయెను దుర్ముఖి 
ప్రమదమ్ముగ భారతాన రాగ సుధా ధా
ర మహీ తలముం దనుపగ
సమంచిత శుభప్రదాయి సకల జనులకున్                                          1


2, ఏప్రిల్ 2016, శనివారం

సమస్యాపూరణ_ఏప్రిల్ 2016

పాటుపడక సుంతైనను
మాటల మాయల జనులను మభ్య పరచినన్
చేటగు కార్యము లెల్లం
బాటుబడిన, వారి కెట్లు ఫలితము దక్కున్?                           31

సుంత దెలియ బెద్దయనంగ వింత గాను
జంకు గొంకు లేకను వెట్ట వంక లెన్నొ
వారి వీరి మేర లెఱుగ నేర కుండ
విఱ్ఱవీగెడి వారలే? విజ్ఞు లనఁగ.                                             30

ప్రీతిగ పంచ సమములకు
నేతలె యెన్నికల వేళ నిఖిలాన్వయ సం
జాతుల మతార్థముం దమ
చేతం జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్.                                  29

క్రూరులు ధన మోహ మద వికారుల చెలి
మి నత డక్కట దారుణ మిత్ర వంచి
తుండు శిక్షితుడైన నిర్దోషికి యురి 
త్రాడు ద్రెంచిన పురుషుండు దైవసముఁడు.                              28

భోగ భాగ్యములకు పుట్టి నిల్లట యది
సంతతి కఱవయ్యె సుదతి కకట
కాళి మాత గుడిని కాంచన ఛదమునం
గప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె.                                                27

కమలాప్త కరోష్ణ తపన
సమధిక తప్తాతి ఘోర సమయము లందున్
విమలము మేఘచ్యుత తో
యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.                     26

జీవ నావసర ధనము క్షేమ కరమె
యధికమైన విభవము చౌర్య భయ దుఃఖ
కరము నిత్యము సకలాఘ కారకములు
కలుము లెడమైన వేళ సౌఖ్యము లెసంగు.                               25

కాటి కాపరి యయ్యె నిక్ష్వాకు వంశ
వర్ధనుండు సద్ధర్మ భూభర్త యకట
దారుణంబుగ నిక శని దాపు రింప
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు.                                             24

తళుకు బెళుకుల చేలపు కళలు మెరయ
చెంగు చెంగున గంతులు  భంగ మైన
భామ కంత కాలు బెణికె నేమొ యయ్య
రో కలికి కాలు జాఱె తె మ్మాకుమందు.                                         23

భాగవ తోత్త మాశన నిభ మ్మట తారక నామ మంత్రము
న్నాగమ సార తుల్య దురితౌఘ వినాశము భవ్యదాయియున్
రాగ సమేత సుందరము రామ సునామ రసామృతమ్ము నుం
ద్రాగిన వాని జీవితము ధన్య తరమ్ము ధరా తలమ్మునన్                22

సర్వ భూతార్తియై సాగుచు నప
రిమితముగు గాక వ్యయమొనరింపగం, గృ
పారసము మది ప్రసరింపఁ, బాప ఫలము
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల                                         21

ఆపశువిక, ముక్కోపియ,
చాపు మెడను మేక, ఘోరచపలత్వము సం
తాపమసహనమున మెలగఁ
జేపలు గాకులకు బుద్ధి చెప్పగఁ దరమా
[చేపు, అలుగు, ఆకులకు,  బుద్ధి చెప్పగఁ దరమా]                            20

పగ కాల్చును హృదయమ్మును
తగదది జనుల కనిశమ్ము దగ నించుక శాం
త గుణము, కోపమది నా
పగ, గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్                                             19

పగ మూడు భవము లందున
దగు భక్తి నయిదిట ముక్తిఁ దరియింతు రనన్
పగ నెంచిరి జయవిజయలు
పగ గల్గిన వాడె సౌఖ్యవంతుడు జగతిన్                                               18

కోపము వలన కలుగుబహుదుఃఖమ్ములు
చెఱచుఁ గార్యములను శీఘ్ర మనవ
రతము వ్యర్ధములునిరవధిక కోప తా
పాల వలన వైరమే లభించు                                                                 17

భామ సుమాలి సుత జనని
తా మరి ఖర దూషణాది దనుజుల కెల్లన్
రామాస్త్ర హత ఖరుడు, రా
కా మాతురుడైన నరుడె? కాంచును ముక్తిన్
[నరుడె: కాదు రాక్షసుడు; రాక: విశ్రవసుని భార్య]                                   16

చిద్రూపుడు రాముండు జ
గద్రక్షకు డచ్యుతుండు కరుణా మయుడున్
భద్రగతి నుండు జగతిని
భద్రాచల రాముడుండు బాసర యందున్                                                 15

విలస త్కాంచన సన్నిభానన సదావేశాభి మానుండ నే
సలిలమ్మంచు నెంచుచుం గుడువ నుత్సాహమ్ముగన్ మద్యమున్
చలి వేంద్రమ్ములలోన బోసెదరు విస్తారమ్ముగా, మద్యమున్
బలవంతమ్ముగ గాంతు సత్వరము భీభత్సమ్ము దీపింపగన్
[మత్ + యమున్ = మద్యమున్]                                                           14

వరునకిడుకట్నముంగొని
నరాధములు నిజసతులను నరకవ్యథలం
గురి సేయుట ఘోర దురిత
మరణము లేనట్టి వాడె మర్త్యు డన దగున్
[దురితము+అరణము]                                                            13

ప్రాణ మిత్రు డడుగ పయనించె తోడ్తేరఁ
బట్నమునకు దనదు పల్లె నుండి
ముచ్చట గను నంత ముగ్గుర దన తల్లి
తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.                                                  12

అనవర తాశేష నిబిడ
ధనార్జ నైకైక లక్ష్య తప్తాత్మునకున్
జనపతుల లక్షలం దని
పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?                                            11

“గణనయంత్రము” గర్వ కారణము గూడ
“లెక్కలబిస” యనియు నందు రక్కజముగ
అప్పు జేసి దర్పముగను గొప్ప జూప
కూటి కేడ్చెడువాఁడును గొనెనుదాని
[కూటి కేడ్చెడువాఁడు కంప్యూటరుఁ గొనె.]                                      10

మండువా యింటి మధ్యన చెండుమల్లె
దండ చేకొని మామిడి పండు తినుచు
పండు వెన్నెలనిండారియుండ భళిర
మండు వేసవిఁ గ్రమ్మెను మంచుతెరలు.                                           9

అనిశాసంతృప్త మతులు
ఘన మోహాంధులు కుమతులు కరుణా హీనుల్
ధన ధాన్య లుబ్ధ మత్సర
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్.                                        8

దక్షుడు ధరఁ గినిసి దర్పంబు తోడ ని
రీశ్వరముగ జన్న మెట్లు సేయు
వింత సుమి పిలువని పేరంట మది పరా
త్పర సతీ గమనము బాగు బాగు.                                                    7

వదలక మది భూతముల మ
హదంచి తానురతి పెద్దలం దుంచక కిం
చిదగౌరవమ్ము సుఖముగ
నిదురించెడువాఁడు ధారుణిన్ యశమందున్.                                    6

అధికార దుర్మదమ్మున
విధి వంచిత నరు లనాథ విహ్వల మతు లి
వ్విధి బాధించిన దుష్టుల
నధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.                                         5

క్రీస్తు దేవుని కొల్తురు క్రైస్తవు లట
భూసు రోత్తము డుదయము భాసురముగ
యవన రాజ నగర గమ నాభి లాషి
చర్చిలో, సంధ్యవార్చెను, సాయబయ్య.                                             4

వ్రాసె మనోజ్ఞకావ్యములు వ్యాకరణమ్ము నెఱుంగ డింతయున్
దాసుడు కాళిమాతకు సుదైన్యుడు మందుడు ముందు నారయన్
వాసిగ రాజకన్యను వివాహము వంచన నాడి ఖిన్నుడై
భాసిత పండితుండయినఁ బన్నుగ కొల్వగఁ గాళికాసతిన్                      3


వీధివీధి నుండు వేప మనకు వంట
చెఱకు, రసము మిగుల చేదు సుమ్ము
దుష్ట క్రిముల నెల్ల నష్ట పఱచు వేగఁ
బండ్లు తోముట కది పాడి సుమ్ము                                          2


సాధ్వి సావిత్రి  ప్రార్థింప శమను డంత
భర్త ప్రాణముల నొసంగె పడతి కతని
వరమునన్ సాళ్వ భావి ధవ యననొప్పు 
భర్త జీవించి యుండు సువర్తనమున                                       1