9, ఏప్రిల్ 2016, శనివారం

పద్యాలు_ఏప్రిల్ 2016

అట్టాదులు కన్పట్టవు
నట్టింటను బట్టు మనుచు నాలుగు రోజుల్
పట్టణ కాంతల లీలలు
కట్టా నాగరికతం గగనముం దాకున్                                  21

భూదేవి రత్న సన్నిభ
మోదక సదృశములు ముగ్ధ మోహన రుచులన్
ఖాదన శాక విశేషము 
స్వాదు రుచి సుసంహి తామ్ల శాకము లవియే                    20

బర్హి సుదర్శన తర్పిత
బర్హిణ రాజాతిశయ విభవ జిత ఘన ప
త్యర్హతుడు సఖీ సహితున్
గార్హస్థ్యాచరణ రతుల గనుడట బ్రీతిన్                                 19

ప్రగతి పథాను గమన దే
శ గరిమ మిదియె? సుకుమార శాతోదరియే
విగత ధన పీడిత హృదయ
గగన సదృశ కార్య భార కాంతను గనుడీ                             18

పప్పు దినుసులవి కొనలే
మప్ప నిజము ముత్యములకు నవి సాటి యిలన్
తిప్పలు తప్పవు కొనినం
గొప్పలకుం బోయి యప్పు గోరిన వేళన్                             17

అనవరత వాహ నావృత
ఘన జన సమ్మర్ధ రాజ గమథం బదివో
కన బహు సాహసి గద యా
వనితయు నాట లవి యేల బథ రాజములన్                       16

సప్తఛద పత్ర మా?యది
తప్తాగ్నిస్థాల నిభము ధరణిన్ వెలుగున్
తృప్తిగ నశనము గుడువం
గుప్తము సేయ పనిలేదు కుదురుగ దానిన్                           15

కొత్తిమిరి నింపు గించుక
మత్తిడు రసమందు వేయ మన మలరించున్
విత్తనములు ధనియాలను
చిత్తొనరించఁ బొడియిడు రుచిని కూరలకున్                          14

హరితా భర శాద్వల సా
గర నిభ వన యవస కుసుమ కర ధవళా ఫే
న రుచిర దృశ్యము రత్నా
కర లీల మెరసె నితాంత కమనీయముగన్                              13

కొత్తిమిరి నింపు గించుక
మత్తిడు రసమందు వేయ మన మలరించున్
విత్తనములు ధనియాలను
చిత్తొనరించఁ బొడియిడు రుచిని కూరలకున్                             12

తరుణార్క కిరణ సన్నిభ
సురుచిర చూత ఫల సార చోదిత శుక రా
జ రవశ్రవణానంద మ
మర సుఖముల కన్న మిన్న మనుజుల కెల్లన్                          11

వనితా జన సంస్పర్శము
ఘన ముని వర జప వినాశ కర మలివేణీ
తనరార ననంగ శరా
శని ఘాతము విహ్వల మతిఁ జరి యించితినే                              10

నిద్రా దేవీ కృత చిర
భద్రాశ్రిత సన్నిధాన పరమాసక్తున్
క్షుద్రోపాసను ఘన ని
త్యోద్రేకాత్మునిఁ దరింప నుర్వి నలవియే                                         9

జాడీ నిండుగ, దండిగ
వాడినఁ దనియరు కరండ బంధము దానిన్
వీడరిల నావకాయను
వేడుక లందాంధ్రులెల్ల విస్మయ మందన్                                        8

చిన్నారి చెల్లి జడనుం
గన్నార్పక నేర్పు మీరఁ గమనీయముగన్
విన్నాణి యన్న వేయన్
మిన్నంటిన వారి ప్రేమ మెప్పై యొప్పున్                                        7

తల తానమ్ముల కిప్పుడు
సలలితముగ నురుగు నీయ జగమెల్ల గనన్
చెలరేగె రసాయన సం
కులమ్ము లేరి కెరుక యిక కుంకు ళ్ళనినన్                                      6

హాస్యార్థంబున కైన ర
హస్య విధిని చతుర వాచ్య హననము దగునే
యాస్యప్రకటిత దుఃఖము
తస్యాననమున గనుండు దయనీయముగన్                                    5

భువనైక మోహ నాతీ
త వరాంగ విలాస చేష్ట తన్మయ రూపుల్
ఛవిమత్కంకణ కర రా
ఘవ వంశోద్ధార కానఘమతుల గనుడీ                                            4

వేసవి కాలపు దాహపు
త్రాసము దీర్పంగ లేత తాటి ఫలములున్
వీసపు ధరలం దొరుకును
దోసము సేయ వవి త్ర్రాగ తోషము నిచ్చున్                                        3

వచ్చును బోవును సమములు
ఖచ్చితము మరణము బుట్టఁ గరుణా మతియై
నిచ్చలు పుణ్య యశమ్మున
చచ్చిన బ్రతుకంగ వలయు జగతిని పేర్మిన్                                         2                                         
సముఖం బాయెను దుర్ముఖి 
ప్రమదమ్ముగ భారతాన రాగ సుధా ధా
ర మహీ తలముం దనుపగ
సమంచిత శుభప్రదాయి సకల జనులకున్                                          1


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి