స్వాంతమ్ము పిక్కటిల్లును
భ్రాంత మతిని సంత తానురాగం బడరన్
వింతగఁ బతితో నిత్తరి
సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో 62
ద్వాంతారాతియె నిష్ప్రభా యుతముగాఁ దా నుండునే యట్టులం
జింతాక్రాంతత నుండఁ జాల నిట నీ చేదోడుగా నుండఁగాఁ
గాంతారమ్మున కేను వచ్చు టది నిక్కంబే చుమీ యగ్రజా
సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై 61
మ్రొక్కినఁ జల్లఁగఁ గాచెడు
నక్కరి వర రక్షకుండు నంచిత దేవుం
డెక్కడ లేఁడు తలంచఁగ
మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్ 60
చక్కన్ గెల్చును బుద్ధి నందఱను సచ్ఛాంతుండు వేదజ్ఞుఁడే
చిక్కం డెన్నఁడు ధర్మ హీనులకు సచ్ఛీలుండు రామాలయం
బొక్కం డింపుగ దార సంయుతము, నీ వూహించు తప్పిందు నే
మక్కా చేరి సభక్తిఁ గొల్వఁ దగు రామయ్యన్ మహీజాపతిన్ 59
సలలిత రాగాలాపము
చెలరేఁగ చిలుకలకొలికి శీఘ్రంబుగఁ దా
నలవోకగ గాజులు పు
ష్కలము ధరించి చనె సతి సుఖం బిడఁ బతికిన్ 58
కలువల ఱేని మించిన ముఖమ్ము వెలుంగ నతోత్తమాంగియై
లలితపు లజ్జితానన ధరాసుత మెల్లఁగఁ జేత నూనుచున్
ఫలములు పాలు మూలముల పళ్లెము పంచవటిన్ విశుద్ధ వ
ల్కలము ధరించి శోభన సుఖం బిడఁగాఁ జనె నాతి భర్తకున్ 57
హాలహాలమ్ము వుట్టిన హరుఁడు మ్రింగి
లోకములఁ గావ నెఱుఁగమె! లోకమాత
లక్ష్మి వుట్టిన హరియె దారగఁ గొనండె!
కవుల కల్పన కాదె! సాగరమథనము 56
రవి నభ మందు శూన్యమున రాజిల నాస్పద మెద్ది తల్చఁగన్
భువి రవి చుట్టు సంతతము మూరుచు నాగక తిర్గఁ గాంచమే
వివరము నేర కున్న ధర వింతగఁ బల్కుట పాడియే యిటుల్
కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే 55
సక్రోధము నిత్యము భూ
మ్యాక్రమణంబే పని యని యవనిని నాతం
డా క్రూరుఁడు నీచుం డని
యక్రమ సంబంధ మధిక యశమును దెచ్చున్ 54
విక్రమ మాజి లోన మది భీతి విహీనము వీర్య మింక న
న్యాక్రమ ణాహితమ్ము ధర నంచిత దాన గుణమ్ము జాలియున్
సక్రమ మైన జీవితము సంతత హర్షము వర్జి తోగ్ర దు
ష్టాక్రమ మైన సంగడ మనంత యశమ్మును దెచ్చు నెప్పుడున్ 53
కానము వెదకిన భూమిని
దీనిని వీడంగ నొప్పు దిట్టతనముతో
నీ నీ శకటము కన్నను
గానుఁగపై నెక్కి యేఁగఁగా నగుఁ గోసుల్ 52
మానవ! యోర్పు ముఖ్య మిల మానుగఁ బొందఁ దలంచఁ గోర్కులన్
మే నలయంగఁ బాక మీఱక యెప్పటి కైన నీ వహో
నూనెను బొందఁ గోరినను నూఱకు పండ్లను జుట్టు తిర్గుచున్
గానుఁగ నెక్కి యేఁగ వలెఁగా శతయోజనముల్ రయంబునన్ 51
భస్మాసుర నిభ రా జనె
విస్మయముగ నివ్విధమ్ము వెఱ్ఱి ప్రణిధులే,
యస్మద్బోధన నాపుమ
క్రిస్మసు దినమునఁ, దురకల, కృష్ణుని పూజల్ 50
సస్మిత సుంద రానన ప్రశాంత మనమ్మున నాలకించుమా
విస్మయ మేల స్వప్నమున వింతలు చిత్రమె యివ్విధమ్మునన్
భస్మము ఫాల మందు నిడి బ్రాహ్మణ సంతతి పల్క మంత్రముల్
క్రిస్మసునాఁడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్ 49
లలనల జోలికి నేఁగ న
నల మంటిన రీతిఁ గాదె నయముగ నీకు
త్తల మణఁగ నెంచినను బుం
శ్చలి బాధకు దాఁగుము హిమశైలము నందున్ 48
సలసల కాఁగ నేల యిట సంతత చింతిత మానసమ్మునన్
వలవల యేడ్వ నేల యిట భాస్కర చండ కరార్తి తోడుతం
గలవర మేల డెందమున ఘర్మపుఁ దాపము వోవు చక్కగం
జలి యిడు, బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో 47
సద్ధర్మము పాటించుమ
బుద్ధి వహించి చరియించు భూసుత యేలా
యిద్ధర రావణ దుష్టపు
బుద్ధిని విడి, రాముఁ డందె భూమిజ కరమున్ 46
అద్దిర ముద్దబంతి వలె నందము లొల్కుచు నున్న దంచుఁ దాఁ
దద్దయు సంతసించి మదిఁ దామరసాక్షినిఁ గ్రూరచిత్త నా
మొద్దును బేరు లింపుగను బోలఁగ రాముని జానకీసతిన్
బుద్ధిని వీడి రాముఁడు విమోహితుఁడై గ్రహియించె జానకిన్ 45
వర పుణ్యాత్ములు మది న
బ్బుర మేల సమస్త జనులు పూజింతు రిలం
దిరుమల నాథుని స్త్రీలును
బురుషులు మూర్ఖులు కుజనులు పుణ్యవిదూరుల్ 44
పర కాంతా ధన ధాన్య కాంక్ష నవి సంపాదించు నీచాత్ములన్
ధరలోఁ గొందఱఁ గాంతు మల్పులను నిత్యం బౌర సద్దేవ తా
పర పూజా రత కార్య సంజనిత విధ్వం సేష్ట చిత్తైక కా
పురుషుల్ మూర్ఖులు పాపచిత్తులు ఖలుల్ మ్రుచ్చుల్ గదా చూడఁగన్ 43
మాలా సద్భూషిత సువి
శాలాక్షులు దేవతా నిచయ సన్నిభలే
చాలిఁకఁ బరిహాసమ్ములు
కాలుని దూతలె? కనంగఁ గాంతలు భువిలోన్ 42
కాల కుఠార తాడన విఖండిత విస్తృత మూల ధిఙ్మహా
సాల తరూత్త మాభముగఁ జావఁగఁ గాంచమె దుష్ట ఘోర దై
త్యాలిని మున్నుభూమిపయి నన్య సతీమణు లైన వారినిం
గాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై 41
సుకరమె జీవన మిల స్వీ
య కుక్షి నింపంగ బాధ లక్కట కనమే
వికల ప్రాణావళి కిఁక
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ 40
సుకమల దివ్య పీఠ మగు సుందర వాసము పద్మయోనికిన్
మకరనిహంతృ చక్రకర మాధవుఁ డుండు వటచ్ఛదస్థితిం
బ్రకటిత సత్య మియ్యది ధరాతల మందుఁ ద్రిశూలపాణికిన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్ 39
కృపతోడ నిమ్మని యడిగి
యపుడు సపరివార ముండి యక్షయ పాత్రన్
విపులం గూర్చొని యింపుగ
విపినమ్మున ధర్మరాజు బెన్రొట్టెఁ దినెన్ 38
[విపుల =నేల; పిజ్జా కి తెనుఁగునఁ బెన్రొట్టెగా నామకరణము]
విపరీతమ్ముగఁ కాంక్ష వుట్టగను నిర్భీతుండు స్నానమ్ము సే
సి పవిత్రంపు శరీరుఁడై ఘనుఁడు సచ్ఛీలుండు సంరంభియై
కపి జంత్వాదులఁ గాంచ నెంచి చని యుత్కంఠార్తి రమ్యంపు టా
విపినమ్మందున ధర్మరాజు దినియెం బెన్రొట్టెఁ దన్మాతనున్ 37
దారము లోపింప నిరా
ధారం బగు గాలిపటము తనరునె నింగిన్
ధారుణిఁ గన్పట్టినచో
దారము లేనట్టి పూలదండయె మేలౌ 36
వారిద పంక్తి తుల్య ఘన వాల నికాయ విశేష శీర్షలౌ
వారిజ నేత్ర లాస్య జిత వారిజ వైరులు సుందరాంగులే
తీరుగ గూర్చి పువ్వులను దెచ్చిన కంటికిఁ గాన వచ్చెడిన్
దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్ 35
ముట్టక నింతయు నామెను
గిట్ట సవతి మాయదారి కీటక మామెం
బట్టగను బలుకరించఁగఁ
జుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్ 34
[ముట్టకను = ముట్టకుండకయే]
వట్టిగఁ జుట్టపక్కములు వత్తురు సూడఁగ విత్త మున్నచోఁ
బట్టిన పట్టు వీడకయె పంతము పట్టి కరమ్ము నింటిదౌ
గుట్టును రట్టు చేయుచును ఘోరతరమ్ముగ దుఃఖ మీయఁగాఁ
జుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్ 33
[జుట్టము వచ్చినాఁ డనుచు: వచ్చిన వాఁడు చుట్ట మనుచు]
వాల గోడ మీద బల్లి దాని నరసి
వేగ వేగ వెన్క కేఁగి దాని
తోక నంటఁ జేరి తూర్ణమ్ము వాలమ్ముఁ
దేలు గుట్టె బాధ తెలియ దింత 32
పాడ్యమి నుండి డెందమునఁ బన్నుగ నిత్యము మృత్యులోక స
మ్రాడ్యమ ధర్మరాజును గరమ్ము నుతించి చరించు చుండెనో
జాడ్యము వచ్చి దేహమునఁ జచ్చెనొ నాడులు విస్మయమ్ముగాఁ
గుడ్యము మీఁది తే లొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్ 31
భాతిగఁ జేయ జన్నమును బన్నుగఁ బుట్టెను రాముఁ డిద్ధరన్
సీత జనించె దున్నఁగను శీఘ్రమ నేలను పుణ్యశీలయే
భూతల మందు నింపుగను బుణ్యగళుండు ఘనుండు శర్వ రా
రాతికిఁ గోతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్ 30
[శర్వర +అరాతికి =శర్వ రారాతికి, సూర్యునకు]
ఱాతి నింకఁ జేత ధరించి భీతిచెంద
కించు కేని చిత్తమున భక్షించుఁ గొండ
చిలువ దాని వేగమ్మ, రక్షించ నెంచ
మేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుము
ఫాలుని యాజ్ఞ తోడుత నవారితపాశధరోగ్ర చిత్తుఁడౌ
కాలుని కెంచఁ గాక మఱి కాయము లిద్ధరఁ గూల్చ శక్యమే
బాలక! యేరికైనఁ బొరపా టగు నివ్విధిఁ బల్క నెన్నఁడున్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్ 29
ఉండుము సహనమ్మున మి
త్రుం డరుదెంచ వలె వచ్చు దూర్ణ మిచటకున్
భండనభూమి విగత బా
హుం డీ లో ధనము వేయు టొప్పెట్టు లగున్ 28
భాండాగారము దోఁచి మోసమున సంపాదించి విత్తమ్ము బ్ర
హ్మాండాభమ్ములు వేశ్మ రాజములు దేవాగారముల్ గాంచుచున్
దండం బింపుగఁ బెట్టి పేటికల నీ దర్పుండు దుష్టుండు ద్రో
హుం డీ లోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్ 27
[ద్రోహుండు =ఈ లోన = ద్రోహుం డీ లోన]
అవ్వ లోక మెల్ల వ్యాపించె వీక్షించి
వింత కీటకమ్ము పంత మూని
ప్రజలఁ దాకి వేగ భక్షించె దయ వీడి
చిన్ని చీమ కన్ను చేరెఁడంత 26
కన్న! తలంచు మింక మదిఁ గమ్మిఁక బుద్ధి గలట్టి వానిగాఁ
దన్నిన రాల దొక్కటియు దమ్మిడి వింతగఁ గాంచఁ జేతి లో
నున్నది చిన్నినాణె మట యూహలు మాత్రము దాటు కోటలం
జిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే 25
వీరు వా రన నేమి యీ తీరుగ నిట
వారును నరులే కద భువిఁ గారణములు
సూపఁ గాదన వా రెట్టు లోపఁ గలరు
వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు 24
కాదన నేల మా కెఱుక కాకయె యున్న విశేష మిద్ది యీ
మేదిని నిన్ను నమ్ముదుము మిత్రమ యన్న వచింప మెచ్చుచున్
వాదము లేల వృత్త మిది పన్నుగ సర్వము నీ వెఱింగినన్
వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే 23
[వేదమె = తెలిసినదే]
అందఱు నట్లొనరింతురె
యుందురె వారిప్డు కాంచి యొప్పునె యన నీ
చందము గంగాదేవిని
నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్ 22
డెందము లెల్లఁ దల్లడిల ఠీవిగఁ గాష్ఠ గతాగ్ని నంత వే
గం దమ నాథులం గలయఁ గాంతలు సేరరె మున్ను వింతయే
పందలు కాక యాజి నిజ భర్తలు గూలఁ దలంచ కించుకై
నం దనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై 21
[తనులు = దేహములు]
గార్దభము చేత నక్కట కాకి యొకటి
యర్దితం బయి యెగురంగ నంద మైన
గర్దభముపైఁ బడఁగ గ్రుడ్డు కాకి దపుడు
గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె 20
[గార్దభము = 1. గాడిద; 2. గర్దభమునకు
సంబంధించినది, తెల్లగలువ నాళి; గర్దభము = తెల్లకలువ]
వేడుక తోడ నే నడరి బ్రీతినిఁ బాడఁ గరంగు ఱాల్లిలం
జూడుఁడు నిక్క మియ్యదని చోద్యము కాదిది యంచు నంతటం
బాడఁగ గాయకుం డొకఁడు పాఱఁగ లోకులు భ్రాంత చిత్తులై
గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్ 19
శ్రావ్యమయి చెలఁగ వలయుఁ జదువరులకుఁ
బలుకు తీపి నీయ వలయుఁ బామరులకు
విన్న నేవగింపు కలుగు వికట మైన
బాసఁ జెఱచు పండితులకె వందనములు 18
కాసులు పోసి కొందు రన గ్రంథము లివ్విధముల్ లభించునే
గ్రాసము వెక్కసం బగును గావ్యము నింపుఁ బఠించ నేరికిం
జేసిన సేవ లన్నియును జిత్రములే విర మించుఁ డింక నా
బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్ 17
నేటి భారతమ్మునఁ గాంచఁ బాటవమున
గీత వాక్యమ్ము లను వగు రీతి నీ పు
డమిఁ బలుకు వార లైన చట్టముల నుండి
కాముకు లగు యోగులకె మోక్షంబు దక్కు 16
దామపిచండు పూజలనె తథ్యము మోక్షము ధాత్రి నెంచ సౌ
దామనిఁ జేతఁ బొందని విధమ్ముగ నెన్నఁడు భోగ భామినీ
కాముకు లైన లౌకికులు కానఁగఁ జాలరు మోక్ష భామినీ
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్ 15
నిత్య దుఃఖితున కకట సత్య మెంచ
సుఖమునకుఁ జిత్తమం దింత చోటు కలదె
దాఁచ నెవ్విధి నగు నంచుఁ దోఁచకుండ
దొరికె లంకెబిందె లటంచు దుఃఖపడెను 14
పరు వది యున్నవానికి నపారము పట్టు గలట్టి వానికిన్
నరగణ సేవి తాగ్రతమ నాయక ముఖ్యున కున్నయట్టి తో
ట రయుతు దున్నుచుండగను డబ్బులు మిన్నఁగ నున్నవానికే
దొరికెను లంకెబిందె లని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే 13
ఇహలో సుఖముగ నుండి క
లహమ్ములను సైప లేని లలితాత్ముఁడు దా
ను హలమునఁ బొలము దున్నుచు
సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్ 12
[సీత = నాఁగటి చాలు]
సహదేవాఖ్యను వెల్గు నొక్క పురిలో సన్మానవుం డిద్ధరన్
గృహరాజమ్మును వీడి గోత్రమున కేఁగెన్ వెల్గు లీనంగ నా
తుహినాంశుండు దివిన్ నిజాగ్రజులు ముందుండన్ శమీవృక్షమున్
సహదేవుండు ధరాత్మజం గని కడున్ సంతోషమున్ బొందెరా 11
[ధరాత్మజ =ఉర్వీరుహము, వృక్షదేవత]
తలిరువిలుకాఁడు హరుపైఁ
జెలంగి బాణమ్ము నేసె శీఘ్రమ కాలెం
బులకించెన్ శివుని మనము
గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్ 10
పాడిగ జట్టు లన్నిటను బంతము తోడుత నాడి నంతటం
గూడ జయమ్ము లెక్కువగఁ గొండ్రు విజేతగ నందుఁ గాంచఁగా
నాడిన యాట లందును మహత్త్వము మీఱఁగ నొక్క జట్టుపై
నోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే 9
ఇనకుల భూషణు నా రా
ముని వని కంపు మన మోహమున దశరథ రా
జున కత్తరి నక్కసమున
దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్ 8
దిన దిన ముప్పతిల్లఁ బగ తీవ్ర తరమ్ముగ సూర్య చంద్రులన్
ఘనముగ నొవ్వఁ జేయుటయె కార్యముగా నెదఁ దల్చు రాహువే
కనలి కరమ్ము నాకమున గ్రక్కున రాహువు గ్రస్త నిష్ప్రభా
దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను జిమ్మచీఁకటిన్ 7
సన్మతి నేఁగి మహాత్ముని
జన్మాహమ్మున నమాత్య సంచయము నతుల్
మృన్మయ శాలకు నొసఁగును
జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్ 6
విన్మిది చావు పుట్టుకలు విశ్వములోఁ బరికించ నింపుగాఁ
జన్మఱి దైవ సమ్మతి విచారము నందిన లాభ ముండునే
కన్మఱుఁ గైన వింతగ నకాలము జన్మ దినమ్ము నందునే
జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ 5
[నింపుగాన్ + చను మఱి దైవ సమ్మతి (న్)]
శివ కేశవులకుఁ గలదే
శివ! శివ! భేదం బెడందఁ జింతన సేయన్
శివు నెన్నఁడు నిందించకు
శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్ 4
భువి దేవుళ్లట నిర్వికారులు నరుల్ పూజించినన్ లేక యు
న్న వివేకమ్మును వీడి వారిఁ గని యానందింతురే నిత్యమున్
సవిశేషమ్ము గణింత్రు చేష్టలను వాచాలత్వమే యిట్లనన్
శివపూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్ 3
లోకాల సృజించు నలువ
లోకాలను విష్ణు వేలు లోకోత్తరుఁడై
యా కాలుం డను నివ్విధి
నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా 2
కాఁకల్ దీరిన దేశ రాక్షసులు నిర్ఘాతాలి తుల్యమ్ముగా
వీకన్ జన్మ నొసంగి రుద్ధతిని నీ విశ్వమ్ముఁ బాలించఁగా
నా కాయు స్సమితమ్ము భూమి పయి నణ్వస్త్రమ్ము నా పే రహో
నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే 1