భువిలోనాజిని సేనా
ప్రవరాధిపతి రిపు హర్త భంధించ రిపు
ప్రవరులఁ జక్కఁగ నాతఁడు
కవితల్లజుఁ డనఁగ నొప్పు గణ భంగమునన్ 60
[కవి = కళ్ళెము; గణము = సేనా విభాగము]
కవిజన చిత్త తోష పద కాయ వికాస వినోద సత్సుధా
వివిధ కథౌఘ సంకలిత విజ్ఞద చోదిత భవ్య చింతనా
వివృత విశేష భావ యుత విస్తృత శుద్ధ వచో౽ర్థ భంగముల్,
కవివరుఁ డంచుఁ గీర్తిఁ గనుఁ గాదె, గణమ్ములు భంగ మైనచో 59
[గణములు = సమూహములు]
విండ్రు కడు వింతగ జనులు
తీండ్రపుఁ గూతనె యెఱుగు నిదియె సత్యము కా
దండ్రు నలుగు రీ మాటను
గాండ్రించెను గుక్కపిల్ల గాడిద వోలెన్ 58
వాండ్రున్వీండ్రును జూచుచుండఁ దమి నా శ్వానంపు టచ్చేష్టలం
బండ్రెండేండ్లది యాలకించి కినుకం బంతమ్ము సంధిల్లగా
నోండ్రించంగఁ జెలంగి, గర్దభ సమూహోద్ఘోష మచ్చోటునన్
గాండ్రించెన్, శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్ 57
[గాండ్రించు = ఉబ్బు]
నిన్ను నీవు హృదిని సన్నన సేసికొ
న్నటుల నగును గాదె యట్టి దింక
వలదు సంశయమ్ము వలదు రామాయణ
కల్పవృక్షమునకు ఘనత గలదె 56
భద్ర క్షేమద చిత్త రంజన కథాప్రాశస్త్య సద్గ్రంథమున్
సద్రాజావళి మార్గదర్శి జన హృచ్చైతన్య విస్తారియున్
క్షుద్రాలోచన దుస్తరంగ వృత రక్షోవ్రాత విధ్వంసి శ్రీ
మద్రామాయణ కల్పవృక్షమునకుం బ్రఖ్యాతి యేమున్నదో!!! 55
పూర్వ సాగర జల పూర్ణ కణ ధవళ
మౌక్తిక ప్రభా విమల నభస్స
తీమణి వొడచూపె దివ్యతరమ్ముగ
వెలఁది నుదుట సూర్యబింబ మమరె 54
చిలుకఁగఁ బాలసంద్రమును జేరి సురాసుర వర్గ మింపుగం
గలువల ఱేని పిమ్మటను గాంతుల మించఁ దటిత్తు రేఖలన్
సలలిత శుద్ధ వారిధిజ చంచల వుట్టఁగ బొట్టు లక్ష్మికిన్
వెలఁదికి ఫాలభాగమున వేవెలుఁ గొప్పెను దివ్యకాంతులన్ 53
పారావార సమాన మ
పార రణాంగణమునఁ గని పరసైన్యమునన్
మూరి తన వారి నెల్లర
భారత రణరంగమందుఁ బార్థుం డోడెన్ 52
[ఓడెను = భయపడెను]
వీరలు వార లేమి యట వీరులు వారల వారు వారి యె
వ్వారలు వీరి వారలకు వారల వారల కోడి రెల్లరుం
గౌరవ పక్షమందుఁ బ్రతి కాంతుఁడు పార్థుని యస్త్ర శక్తికిన్
భారత యుద్ధరంగమునఁ బార్థుఁడు పొందెఁ బరాజయమ్మయో 51
[పార్థుఁడు = 1. అర్జునుఁడు, 2. రాజు]
పంటలు దగఁ బండించిన వంటల కయి
ప్రాణ మొసఁగుఁ గద సకలప్రాణులకును
వసుధ రైతు దేవుఁడు చెడ్డ పంటల వ్యవ
సాయి భగవంతుఁ డనుట యసత్యమె కద 50
వాయిని నంగుళమ్ము నిడి పండడె యవ్వటపత్ర శాయియే
యాయన శేషశాయి పరమాత్ముఁడు పన్నుగఁ బవ్వలించునే
హాయిగఁ దోడుగా నడువ నామెకు నాతఁడు సాయి తప్పుసూ
సాయిని దైవమం చనుట సత్యము గాదని యండ్రు సజ్జనుల్ 49
[సాయి = తోడుగ నడచు వాఁడు, పెండ్లికొడుకు]
విసవిస నవ్వుచు రివ్వున
ముసురుచు వచ్చెం గదా సముఖమున కెలమిన్
వెస నీ రాక నిపుడు ఛాం
దస! రాస రదాలు మనకుఁ దప్పెఁ గటకటా 48
[రాస రదాలు =శృంగార రస సంబంధమైన దంతక్షతములు;
మనకు: రాజదర్పము నాకు నకు]
ముస లాఘాత నిభమ్ముగాఁ దనరె సంపూర్ణ క్షమా వాసమే
వసుధాధీశులు సంశయాత్ములయి నిర్వ్యాపారులై నిల్చిరే
రసహీనంబయి పణ్యశాల లిట స్వర్ణచ్ఛవ్యుపగ్రాహ్యముల్
దసరా పండుగ నాటి పెక్కు స రదాల్ దప్పెన్ గదా దైవమా 47
[స రదాల్ = స రదములు = పండ్లతోఁ గూడి; ఉపగ్రాహ్యములు = కానుకలు]
మాద్రి – కైక – రాధ – రుద్రమ
పై పదాలను అన్యార్థములో ప్రయోగించుచు దుర్గాదేవి స్తుతి:
సతత మరుద్రమణీ యా
ర్చిత! రమ్యత మాద్రి వాస! శీఘ్రైకై కాం
చిత హృద యా రాధన భ
క్త తమో లయ కారిణీ! నత సురా! దుర్గా! 46
సర్వజ్ఞుం డనఁ జెల్లును
శర్వునకుం దక్కి నట్టి సర్వులు కారే
సర్వము మానవ సృష్టము
సర్వజ్ఞత్వమ్ము నందఁ జాలునె గూగుల్ 45
ఉర్వీవాసుల సూరి పామరులు సద్యోబుద్ధి విద్యా మహా
పర్వక్షిప్త వివేక నైపుణిని సర్వజ్ఞత్వ హీనాత్ములే
సర్వుల్ వారలు వ్రాయ నందు సతమున్ సత్యంబు లెక్కించినన్
సర్వజ్ఞత్వము గూగు లందఁ గలదే శాస్త్రీ విచారించినన్ 44
ముచ్చటగ మూడు రేవులు పచ్చదనపు
గట్టు లతిశయిల్లఁగ నటఁ గలవు వెలసి
పోరు లేకుండ రెండు రేవుల జలమ్ముఁ
బులులు, మేకలు నొకరేవు జలముఁ ద్రాగు 43
అలవోకం దిరుగాడి కాననమునన్ వ్యాఘ్రమ్ము లత్యుగ్రముల్
పలుమాఱున్ దిశ లెల్ల గాంచుచును దత్ప్రాంతంపు ఛాగాల్పముల్
కులుకుల్ తోడుత నుండగా నులుకులుం గ్రొవ్వంగఁ గుందంగ నా
పులులున్ మేకలు నొక్క రేవున జలమ్ముం ద్రాగు వీక్షింపుమా 42
ఆస చెలఁగ డెందమ్మునఁ
గాసుల కోసమ్ము దోష కాయ గుణములన్
దోసము లెంచక పొగడుచు
వ్రాసిన కవివరుని శృంగభంగ మొనర్తున్ 41
ఈసున నన్ను సంతతము హేళన సేయు మదాంధ సూరికిన్,
భాస సమాన విశ్రుత విభాసిత పండిత భవ్య కావ్య వి
న్యాస విలాస గీత రచనా సువిశారద రంజనమ్ములన్
వ్రాసిన సత్కవీశ్వరునిఁ బట్టి, యొనర్చెద శృంగభంగమున్ 40
గోముగఁ గన్పడు కాంతను
జామల నెంచంగ దిట్ట చారుతర ముఖిన్
మా మంచి పట్టణమ్మున
భీముఁడు రావణుని సుతను పెండిలియాడెన్ 39
ఏ మిది నే నెఱుంగ నసురేంద్రున కింపుగ బిడ్డ లుండిరే
కోమలు లున్న నిక్కముగఁ గూతురునిన్ దశకంఠ తుల్యుఁడౌ
భీమ పరాక్రమోన్నతపు వీరున కిచ్చును సత్య మందుకే
భీముఁడు రావణాసురుని బిడ్డను బెండిలియాడెఁ బ్రీతిమై 38
ముక్కు మీద కోపము సెలఁగు నిత్యము
తమ్ముఁ డన్న జాలి వమ్ము సుమ్ము
కాలు భంగి నెగసి కఱ్ఱను, దా నేమి
చెప్పుఁ, దీసి కొట్టెఁ జెల్లి! యపుడు 37
తిప్పలు వెట్టఁ దన్ను నట దిట్టతనమ్మున నన్నరుండు వే
కొప్పు బిగించి త్రిప్పుచును గ్రుడ్డుల నొప్పులకుప్ప యప్పుడే
గుప్పున నుప్పతిల్లఁ బగ కోపము చప్పున వామపాదపుం
జెప్పును దీసి కొట్టినది చెల్లి తటాలున నన్న మెచ్చఁగన్ 36
రండు మెండుగ నెండెఁ గొనుం డనుచును
బక్క చిక్కి డొక్క లణఁగు నొక్క పురుషుఁ
డక్కుబేరు పేరున్న వాఁ డప్పురమ్ము
చిట్టివలసఁ గుబేరుఁడు గట్టె లమ్మె 35
భూరిధనుండు చిట్టి పరిపూర్ణ నయజ్ఞ కృపా హృదబ్జుఁడున్
నేరక యిచ్చి దానములు నెమ్మి సతమ్ము దరిద్రుఁ డయ్యెనే
గౌరవ మంద స్వీయ పురిఁ గాక వశమ్ము పురాన్యమందుఁ బో
సౌరులు దప్పి చిట్టి వలసన్ ధనదుం డయొ కట్టె లమ్మెరా 34
[వలసన్ = వలస యేగిన చోటులో]
తర్క మందు మించఁ దండ్రిఁ గుమారుండు
చక్క నొక్క స్రుక్కు వాక్కుఁ దక్కి
వాగ్విదుండు చండ వాగ్బాణములను బా
గన్ను నెక్కుపెట్టెఁ గన్నకొడుకు 33
[బాగు + అన్నున్ = బా గన్నున్; అన్ను = పారవశ్యము;
ఇక్కడ బాగు పద మాశ్చర్య సూచకము;
“బాగు” “అన్ను”నకు విశేషణము కాదు]
కన్నున్ మిన్నును గాన కుండగను శ్రీకాంతున్ హరిం దిట్టుచుం
దన్నంగం దనయుండ స్తంభమును వే తావచ్చునా యిందు నా
వెన్నుం జూపు మనంగ విష్ణు వనెడిం బెంగోల, దం జూడ క్రే
గన్నున్, గైకొని యెక్కుపెట్టె సుతుఁడే కన్నట్టి యా తండ్రిపై 32
దృష్టం బదృష్ట మంచును
హృష్టాంతఃకరణు లా నరేశులు సకలా
భీష్టములు ప్రాప్తములు గాఁ
గష్టమ్ములు దీరె ననుచుఁ గన్నీ రిడిరే 31
దృష్టి యరిష్టముల్ చెలఁగఁ దీవ్ర తరమ్ము నిరంతరమ్ముగా
నష్టము మీద నష్టము లనంతము గాఁ గన నక్కజమ్ముగన్
స్పష్టముగా నెఱింగితిమి శత్రుల కోరిక, మమ్ము ముంచఁగాఁ
గష్టము లెల్లఁ, దీరెనని కంటను నీరిడి యేడ్చి రెల్లరున్ 30
కూలును వేగ సకల దే
శా లలసత్వము వహించి చన భూపతు లే
కాలమునను బాలన లో
పాల వలన నెల్ల జనులు పతితు లగుదురే 29
చాలుం జాలును గోప తాపములు సచ్చారిత్రమే ధర్మమౌ
లే లెమ్మింక సఖిత్వమే దనరెడిన్ రీతిం బ్రవర్తించుమా
ఢాలవ్రాత విహీన రాజ దరిషడ్వర్గ ప్రభా ప్రాప్త కం
పాలే కారణ మెల్లవారికి గుణ భ్రష్టత్వముం బొందఁగన్ 28
చెప్ప నెంచి తేనిఁ జెప్పు వివరముగఁ
జాల దిట్టు లనిన నేల శంక
యెవ్వ రెందు నెప్పు డెవ్వాని పత్నిని?
మొలనుఁ గత్తి దూసి పొడిచె సతిని 27
ఇలలో ఱేఁ డనఁ బౌర రక్షణము లే యే వేళ లావశ్యక
మ్ములొ వీక్షించుచు నుండఁగా వలెను గా ముమ్మాటికిన్ నిత్యముం
జెలరేఁగం దమి దుండఁగీఁ డపుడు దా శీఘ్రంబ, రక్షించఁగా
మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్, మోదంబునన్ దత్సతిన్ 26
అందందుం దిరుగాడుచు
సుందరుఁడు రసికవరుండు సూచి ముదమునన్
సుందరి తలను గసవు మో
పంది పటుక్కునఁ గొఱికెను భామిని మోవిన్ 25
[మోపు +అంది = మో పంది]
అందము నందు నచ్చరయె యామె పయిం జిరకాల శంకపుం
డెందము తోడఁ గుందుచుఁ బటిష్ఠ వివర్ధిత కామతాపముం
జెందఁగ నిత్య హింసన విచిత్ర మనస్కుఁడు క్రూర భర్త నాఁ
బంది పటుక్కునం గొఱికెఁ బంకజలోచన మోవి గ్రక్కునన్ 24
అల - కల - వల – నెల పై పదాలను అన్యార్థములో, రామాయణార్థములో
అలఘు పరాక్రముఁడు తను వి
కల రిపు వలయుఁడు గనె లయకారకుల సుఘో
రుల ఖర దూషణ సత్రిశి
రుల దండక యందు రఘువరుఁ డసుర గణమున్ 23
కర మరుదు జంట యింపగుఁ గన్నులకును
గాంచుఁ డక్కడ కమనీయ మంచు నుడువ
నరునకును నారి కపరంపున కపరంపుఁ
గాకికిన్ హంసయే సతిగా లభించె 22
కాక కపోత కోకిల బకవ్రజ కుక్కుట కాలకంఠ హృ
త్కేకి చకోర సద్ధరిణ కీర్ణ జగమ్మున నంచితమ్ముగన్
నాక నివాస దేవవర నాభిజ వాహన రాజ హంస కే
కాకికి రాజహంస సతిగా లభియించెను జిత్ర మెట్లగున్ 21
[హంసకు + ఏకాకికి = హంస కేకాకికి]
కలినిఁ గాంచ మించి పలికి నీతులు వెన్క
ముంచు వాఁడె యగును మునివరుండు
నేత యగును దుడ్డు పాతిపెట్టిన వాఁడ
మతము మార్చువాఁడె మంత్రి యగును 20
కతిపయ వత్సరమ్ముల వికార వినోద విహార కేళినిం
బతి గణ ముత్సహించుచు విపత్తుల నెల్లర కీయఁ గాంచమే
మతి నిడి శిష్ట భావములు మానవ దున్నతిఁ బౌరకోటి దు
ర్మతమును మార్చువాఁడె యగు మంత్రిగ నేఁడు ప్రజాళి మెచ్చఁగన్ 19
న్యాయ మున్న చోటుననె మనకుఁ దగు నని
వాదన జరుగ నచట కోపమ్ము మీఱఁ
దల్లికిని నక్క కక్కట చల్లగాను
దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను 18
[దాని = ఇక్కడ తల్లి; నెలత = అక్క]
మీనపు యంత్ర సంస్థితము మీనముఁ గొట్టి జయించి కన్యఁ దా
నా నలినాక్షి దాచి తగ నర్జునుఁ డింపుగఁ జెప్పనిట్టులున్
నే నిట భిక్ష తెచ్చితిని నేర్పునఁ దల్లి, మొగంపుఁ గమ్మి మీ
దాని, కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్ 17
[మీదు +ఆని = మీ దాని; మొగము =ద్వారము; ఈ పెద్ద లౌ ననుటకుఁ
జాల వ్యవహారము నడచినది.]
వదలక బద్దక మింతయుఁ
గదలెడు మారుత మొసఁగ సుఖము తూఁగే బె
ట్టిదముగఁ జెలంగఁ గూర్చొని
నిదురించెడి వేళ శిరము నేలం గూలెన్ 16
సదయుం డాతఁడు వాసుదేవుఁ డరయన్ సంజీవియై వెల్గఁడే
హృద యావేశ విలగ్న ఘాతకుఁడు విప్రేంద్రుండు హింసించఁగాఁ
బదిలం బెక్కడ ద్రౌపదేయుఁ డకటా పార్థుండు తద్ద్రౌణిచే
నిదురం దోఁగెడి వేళ శీర్ష మహహా నేలం బడెన్ దైవమా 15
పుత్రులు నమాత్యు లసురులు పోరుచు మడి
యంగ దారుణ రీతిని సంగరమున
రావణుం డచ్చెరువు నంద రఘువరుండు
గజమునుం జంపెను హరి చక్రమ్ముతోడ 14
[గజము =గజములతోఁ గూడికొన్నది, గజబలము;
హరి చక్రము = కోతుల సమూహము]
సృజియించంగను రక్ష నీయగను దాక్షిణ్యమ్మునం జంపగం
ద్రిజగద్వ్రాతము నందు శ్రీహరియె యా శ్రీకాంతుఁడే దిక్కగున్
గజముం గాంచి తదార్తనుం గరుణఁ దాఁ గాపాడి తన్నక్ర రా
డ్గజముం జంపెను మాధవుండు ఘనచక్రమ్ముం బ్రయోగించియున్ 13
ఆఁకలికి నోర్వఁ జాలక తోఁక నిటు న
టు వడి నూపుచు నేఁగఁ బటువగు మృగము
నరసి యొక్క చోటున సింహి యారగించి
మేఁక, మృగరాజునుం గాంచి మిడిసిపడెను 12
అడవికి నేఁగి యొక్క తరి నయ్యజ రాజు విహార కేళినిం
గడు ముద మంది డెందమున గంతులు వేయుచు నబ్బురమ్ముగాఁ
దడఁబడి చూడ నచ్చముగఁ దన్ను దలంపఁగఁ జేయు దానినిన్
మిడిసిపడెన్ మృగేంద్రుఁ గని మేఁక భయం బిసుమంత లేకయే 11
[మృగేంద్రుఁడు = జింకలలో శ్రేష్ఠుఁడు]
హరహరా మహాదేవ నగాత్మజా మ
నో ముదావహ పాపు మా బాము లనుచు
గరళ కంఠు శంకరుని ముక్కంటిఁ ద్రిపుర
రిపునిఁ గాంచి వందన మిడిరి జను లెల్ల 10
అపురూపమ్మగు విగ్రహాకృతి మహాం డాధీశుఁడే వెల్గఁగం
గృపతోడం దముఁ గావుమం చడరి వేకీర్తించి సద్భక్తినిన్
విపరీతోగ్ర మహా సుదర్శనము దుర్భేద్యమ్ము శ్రే ష్ఠాయు ధా
రిపునిం గాంచి నమస్కరించిరి జనుల్ ప్రీతిన్ మహోత్సాహులై 9
[శ్రేష్ఠ +ఆయుధ +అరిపుని =శ్రే ష్ఠాయు ధారిపుని; అరిపుఁడు = చక్రమున కధిపతి]
విగత భార్యా విలపితుండు మగువ నోర్తుఁ
గాంచి మది మెచ్చి గుణముల నంచితముగఁ,
బంపి తగ నత్తవారింటి కింపు మీఱఁ
దన కుమార్తెనుఁ, బెండ్లాడెఁ దండ్రి యొకఁడు 8
వినుత పురాణ సంచయ సువిస్తృత గాథల నాలకించి యే
రనుచరణమ్ము సేయఁ దగ దయ్య యొకింత మదిం దలంచకే
తన మెయి జాత భారతినిఁ దాత తదంగము వీడి యొండిటం
దన సుతఁ బెండ్లియాడె నొక తండ్రి సుధీజనులెల్ల మెచ్చఁగన్ 7
చావు పుట్టుక లిల దైవ సంఘటనము
లెల్ల దాట నెవరి వల్ల కాదు
శివుని యాజ్ఞ కాఁగఁ జీమ కుట్టెను వింత
సింగము మరణించెఁ జీమ వలన 6
భృంగ విహంగ తుంగతమ శృంగ వరాంగ సుసంగ శృంగులున్
స్వంగ తురంగ పింగళ నృ జంగమ కోటులు నంగ జార్తులే
సంగమ మైన తత్క్షణము శాప వశమ్మున గండుచీమ నా
సింగము ప్రాణమున్ విడిచెఁ జీమ చిటుక్కునఁ గుట్టినంతనే 5
గంధము పూసి జనులఁ దా
నంధుల నొనరించి పబ్బ మవ్వ కడపఁగన్
గాంధీ వాదుఁ డహో యీ
గాంధీ తన జీవితమునఁ గల్లలె పలికెన్ 4
బంధవ్రాతముఁ ద్రెంచె నెల్లరకు సంభావ్యుండు స్వాతంత్ర్య స
త్సంధాతృ ప్రవరుండు మాను మన, రాజద్భారతంపుం జరి
త్రాంధుం డైతివి “సత్య మేవ జయతే” యంచుం బ్రబోధించెనే,
గాంధీజీ తన జీవితమ్మున సదా కల్లల్ వచించెన్ గదా 3
అగ్ని యెదుటను ద్రి వల్యవ
లగ్నను బెండ్లాడఁ బత్ని లలనామణియే
లగ్నం బరసి యలుక నా
లగ్నను బెండ్లాడఁ బత్ని లలనామణియే
లగ్నం బరసి యలుక నా
నాగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్ 2
ద్విగ్నంబై వడిఁ బాఱుచున్నది యహో భీతిల్లి నిర్లజ్జతో
నగ్నిన్ రాలెడు మండుచుండ నట నాహా నిప్పు రవ్వల్గదా
యాగ్నేయాస్త్రము వేయఁగం గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి