29, అక్టోబర్ 2025, బుధవారం

డా. పోచిరాజు శేషగిరి రావు కవి వరేణ్య సంస్తవ దశకము

 

డా. పోచిరాజు శేషగిరి రావు కవి వరేణ్య సంస్తవ దశకము:

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు) 


 

 

 

 

శా.

శ్రీమన్మంగళ పోచిరాజ కుల వారిస్తోమ సోముండునై

ధీమంతుం డుదయించి శేషగిరి రాడ్దివ్యాఖ్య విఖ్యాతుఁడై

భామా సత్యవతీ వరాఖ్యకును  సుబ్బారావు నా వెల్గెడిన్

భూమీ దివ్యునకుం గుమారుఁ డయి సంపూజ్యుండు నయ్యెన్ ధరన్ 

1.      

 

 

 

మ.

ఛవిమచ్ఛబ్ద భృదాంధ్ర సాంస్కృతిక భాషా పాండితీ పక్వ పా

టవ మేపార మహా ప్రభా తిరుపతీ టంకార సప్తాద్రి నా

థ విశిష్టోన్నత పట్టణమ్మునను విద్వల్లోక సంభావ్యుఁడై

భువి వెల్గెం గవి వర్య శేషగిరి సంపూర్ణస్థితప్రజ్ఞుఁడై             

2.     

 

 

 

శా.

పూజార్హుండును బిన్న తండ్రి విలసత్పుణ్యాత్ముఁ డౌదార్య స

త్తేజస్వంతుఁడు పండితుండు కవితా దివ్యాబ్ధి పూర్ణాబ్జుఁడే

సౌజన్యస్ఫుట వర్తనుండు సు సుధీ శార్దూలుఁ డిద్ధాత్రినిన్

వ్యా జాజ్ఞానుఁడు సాధు జీవనుఁడు కవ్యారాధ్య శేషాఖ్యుఁడే

3.     

 

 

 

శా.

భాషా శైలి నొనర్ప వీక్షణము కన్పట్టున్ భాసిల్లి సం

తోషం బిచ్చు తెనుంగు తేట పదముల్ తోరమ్ము నొక్కొక్కచో

భూషాలంకృత సంస్కృతేద్ధ పదముల్ పూర్ణంబు నొక్కొక్కచో

దోషాంతర్గత కౌముదీ ప్రభలు విద్యోతమ్ము లందం దహో 

4.     

 

 

 

శా.

లేరే సత్కవి పుంగవుల్ మునుపు భూరిజ్ఞాన సంపన్నులున్

లేరే పండిత వంశ సంభవులు లేరే సాహితీ వేదులుం

బారావార పరీత భూతలమునం బ్రఖ్యాత విజ్ఞానులున్

వారిం బోలును బోచిరాజ సుమహావంశోద్భవుం డింపుగా  

5.     

 

 

 

శా.

దారాత్మోద్భవ సంఘ సంజనిత బాధా యుక్త సంసార దు

ర్వారాంభోధిఁ దరించు చుండి భగవద్భావైక చింతాత్ముఁడై

ధారాయుక్త సదర్థ శుద్ధ కవితా ధౌరేయుఁ డై నిత్యమున్

సా రాసార వివేక వంతుఁ డయి సచ్చారిత్రుఁ డయ్యెన్ ధరన్   

6.     

 

 

 

మ.

పరమార్థంపు విశేష తత్త్వము నిజస్వాంతమ్ము నందేర్పడన్

నిరతమ్మున్ శ్రమియించి సద్గురువు సాన్నిధ్యంబునన్ నిల్చుచుం

గర మాసక్తి నొనర్చి శోధనము నిష్కాముండునై నిత్యమున్

ధరలోఁ జల్పెను స్వీయ జీవనము సద్యస్స్ఫూర్తి భాసిల్లగా   

7.     

 

 

 

తే.గీ.

అలరి శారదా మంజీరములు రచించె

రక్తిఁ దేజో వలయముల రచన సేసెఁ

బరమ గురువు వేటూరి ప్రభాకరు చరి

తమ్ము శేష కవి రచించె సమ్మదముగ  

8.     

 

 

 

మ .

అలరించెం దమి నాంధ్ర నామ వర భాషాకాంక్ష విద్యార్థులన్

వెలయించెన్ బహు కావ్య ఖండికల గంభీరార్థ శబ్దావలిం

దలఁపించెం గద పూర్వ సత్కవి కవిత్వప్రౌఢి రమ్యమ్ముగాఁ

గలిగించెన్ ముద మాత్మ కల్పిత బృహత్కావ్యప్రకాశమ్మునన్ 

9.     

 

 

 

ఉ.

బాల్యము నందు నేను దమిఁ బంపిన యా శతకమ్ము నింపుగా

శల్య పరీక్ష సేసి క్షమఁ జక్కఁగ వ్రాత ప్రతిం గడింది వా

త్సల్యము మీఱ దిద్దియుఁ బ్రశంస లొసంగెను సంతసమ్మునం

దుల్యునిఁ గాంచఁగాఁ గలనె దొడ్డ మనస్కుని భూతలమ్మునన్   

10.    

 

     

 

చం.

 

కవి వరు లందు నెన్నగను గమ్ర లసత్కవితా దురంధరుం

డు వినుత సంత తాధిక కఠోర పరిశ్రముఁ డర్థ శబ్ద భా

వ వివర ణాది విద్యలను బాటవ మత్యధికమ్ము నిచ్చలున్

భువిఁ గన నెంద ఱుందు రఁట ముచ్చట గొల్పఁగ నిట్టి వారలున్  

11.    

 

 

 

శా.

కార్పణ్యావృత శాంత చిత్తునకు సంకల్పప్రభా మూర్తికిన్

దర్పావేశ విరోధ హీనునకు విద్యాదాతకున్ నిత్య కం

దర్పస్కంధ వినాశ కార్చకునకున్ దాసుండనై భక్తి నే

నర్పింతుం గవి లోక మాన్యునకుఁ బద్యాంభోజ భవ్యాంజళుల్

12.    

 


దైవస్తుతి

 

దైవస్తుతి

ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు  

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం హరహరమహాదేవాయ నమః
ఓం నమో నారాయణాయ.

విఘ్నేశ్వర స్తుతి:


శ్రీగణేశం శ్రితార్తిఘ్నం సర్వ విద్యా ప్రదాయినమ్।
పుష్టికాంతం సురాధ్యక్షం పృథ్వీగర్భం నమామ్యహమ్॥1॥

మూషికానింద్య సంచారం మోదక హస్త భాసురమ్।
నమామి గిరిజా సూనుం వక్రతుండం వినాయకమ్॥2॥

లంబోదరం సదాదాన మేకదంతం గజాననమ్।
చతుర్భుజం మహాకాయం వందే హరవరాత్మజమ్॥3॥

ద్వైమాతృక వరం దేవం నాగోపవీత భాసితమ్।
విఘ్నరాజం గణాధ్యక్షం ప్రణమామి భవాత్మజమ్॥4॥

శూర్పకర్ణం కుమారాగ్ర్యం హేరంబం కుబ్జవిగ్రహమ్।
శుక్లాంబరం ప్రసన్నాస్యం మందహాసం నమామ్యహమ్॥5॥

రుద్రైకాదశకము.



శ్రీశైలస్థిత కేదారం కాశీనాథం త్రిలోచనమ్।
హరం త్రిపుర సంహారం దిగంబరం నమామ్యహమ్॥1॥

కైలాస గిరి సంవాసం హైమవతీ మనోహరమ్।
గంగాధరం మహాదేవం నమామి చంద్ర శేఖరమ్॥2॥

హాలాహల విషాహారం భస్మకాయ విరాజితమ్।
భూతప్రేత గణాధ్యక్షం నటరాజం నమామ్యహమ్॥3॥

ఫాలనేత్రం జటాజూటం శాశ్వతం నాగభూషణమ్।
ఊర్ధ్వరేతస మీశానం వృషధ్వజం నమామ్యహమ్॥4॥

కందర్ప గాత్ర హర్తారం కామిత వర దాయినమ్
ప్రణమామి మహాదేవం హరం భక్త వశంకరమ్ ॥5॥

సదాశివం సతీనాథం గంగేశ్వరం మహేశ్వరమ్ 
దేవాసుర గణారాధ్యం నమామి నంది వాహనమ్ ॥6॥

పూర్వోత్తర దిగధ్యక్షం హిమవన్నగ సంస్థితమ్
ప్రణమామి విరూపాక్షం వామార్ధ స్థిత శైలజమ్ ॥7॥ 

సురాపగా సు మూర్ధానం సుర సంచయ పూజితమ్
నిజ భక్త జనాధీనం శుభప్రదం నమామ్యహమ్  ॥8॥ 

తాండవప్రియ దేవేశం దాక్షిణ్యాది గుణప్రభమ్ 
అంబరాంబర సద్గాత్రం ప్రణమామి త్రిలోచనమ్ ॥9॥ 

శూలాయుధ మహావీరం మాతంగ చర్మ ధారిణమ్ 
కాలాంతకం పురారాతిం నమామి విశ్వపాలకమ్ ॥10॥ 

సర్పకుండల సర్వజ్ఞం సుప్రతీకం సుదర్శనమ్
సువర్ణాక్షం స్వయంభూతం ప్రణమామి విషాంతకమ్ ॥11॥  


కృష్ణ స్మరణ:


శ్రీరమా సుమనోనాథం కౌస్తుభ మణి భూషితమ్ |
శంఖ చక్ర గదాహస్తం స్మరామి సతతమ్ హరిమ్||1||

నీలాంబుద నిభశ్యామం నీరజపత్ర లోచనమ్ |
శిఖిపింఛధరం కృష్ణం స్మరామి మురళీధరమ్||2||

తృణీకృత తృణావర్తం పూతనా ప్రాణ హారిణమ్ |
అర్జున మోక్ష దాతారం స్మరామి బక మర్దనమ్ ||3||

కాళియఫణ సంత్రాసం  అఘాసుర విదారిణమ్ |
మత్త కుంజర హంతారం స్మరామి నందనందనమ్||4||

శ్రీరామ స్తుతి:


శ్రీరామ మంబుద శ్యామం సర్వ ధనుష్మతాంవరమ్ 
సీతా హృద్వన మందారం వందే దశరథాత్మజమ్ ॥1॥

కౌసల్యా సుప్రజా రామం ససీతా చ సలక్ష్మణమ్ 
ధానుష్క మరవిందాక్షం వందే సత్య పరాక్రమమ్ ॥2॥

జనస్థాన మహారణ్య ఖరాద్యసుర  నాశకమ్ 
పరిరక్షిత మున్యోఘం  నమామి పురుషోత్తమమ్ ॥3॥

విదారిత దశగ్రీవం సంభావిత విభీషణమ్ 
పరిపాలిత సుగ్రీవం సమారుతిం నమామి తమ్ ॥4॥

మంగళం రామచంద్రాయ సత్యసంధాయ మంగళమ్ 
మంగళం నీల దేహాయ సీతానాథాయ మంగళమ్ ॥5॥

అగ్ని స్తోత్రము:


అగ్నిదేవం ప్రచండాంశుం సన్నుత సర్వ భక్షకమ్
స్వాహాపతిం జగద్వ్యాప్తం నమామి హవ్యవాహనమ్ ॥1॥

1, అక్టోబర్ 2025, బుధవారం

సమస్యాపూరణ_అక్టోబర్ 2025

వే వీడి తండ్రి పంపునఁ
దా వైదేహి కయి కడలి దాఁటక మునుపే
యీవల హరునకు వెఱవక 
రావణునకు గుడినిఁ గట్టె రాముఁ డయోధ్యన్                                              62. 

వావిరి కంటకమ్ములను బన్నుగ వేల నతిక్రమించి యీ 
పావన భారతావనినిఁ బౌర వరేణ్యుఁడు భక్త కోటినిం   
గావఁగ బ్రహ్మ నామ శర ఖండిత ముంచదసృగ్ద్రవచ్ఛిరో 
రావణు దేవళమ్ము రఘురాముఁడు గట్టె నయోధ్యలోఁ దమిన్                          61. 
[ముంచత్+అసృక్+ద్రవత్+ శిరస్+రావణు  = ముంచ దసృ గ్ద్రవ చ్ఛిరో రావణు]  

పర దేశస్థుల మహిమము 
విరివిగ వ్యయము నొనరించి విత్తముఁ గనుమా
నరవరుల నేఁటి పోకడ 
చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే                                                      60. 

తరతమ భేద మెంచక సదస్యులు నచ్చెఱు వంది నిల్వఁగా 
గురువుగ నెంచి డెందములఁ గూరిమిఁ జూపి కడింది వింత ము
న్జరిగిన పండితోత్తముని చర్య నెఱింగిన నాఁటి నుండియుం 
జిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్                               59. 

భైష్మకి పతి చెంత నిలువ 
భీష్మద్రోణులు గెలుతురె వివ్వచ్చు ననిన్ 
శుష్మాధిక వీరులతో 
భీష్మద్రోణులకుఁ గలిగె భీషణ రణమే                                                            58. 

శుష్మం బందు గణింప  నల్వురును దక్షుల్ సుమ్మి విశ్వమ్మునన్ 
భీష్ముం డెన్న దురాసదుండు నయినన్  వివ్వచ్చు నోర్వండు యు
ద్ధోష్మాంతః కరణుల్ వెసం గవియ నోహో భీమ గాండీవులే 
భీష్మద్రోణుల కాహవమ్ము గలిగెన్ భీష్మంబుగా నత్తఱిన్                                      57. 

తీరని వ్యధఁ జేకూర్చును దీరకున్న
కోరినట్టి కోర్కులు నర నారుల కిల 
మూరినట్టి ధృతిని మీఱి కోరకున్నఁ 
దుచ్ఛ వాంఛలన్ ధర్మమ్ము దోఁచు మదికి                                                         56. 

కృచ్ఛ్రము లందు నైన మఱి మృత్యు భయం బది సంతరించినం 
దుచ్ఛపుఁ గోర్కులన్ హృదయ తోయధి లోన జనింప నీకుమా 
స్వచ్ఛము గాఁగ మానసము సచ్చరితుండవు గాఁగ నీవ లోఁ   
దుచ్ఛపుఁ గోర్కెలన్గొనినఁ దోఁచును బుద్ధికి ధర్మ సూక్ష్మముల్                                 55. 
[తుచ్ఛము = 1. నీచము; 2. శూన్యము] 

పూర్వము మన దేశమున నపూర్వపుఁ బరి
శోధనల విరాజిల్లిన సుచరితుండు    
శాస్త్ర వేత్తయు నయిన యశస్వి నాయుఁ
డమ్మకుఁ గలదు భార్య యేమని పిలుతురు                                                     54. 

తమ్ముడ యన్న యం చతఁడు తద్దయుఁ బ్రీతిఁ జెలంగు మోముతో 
నమ్మక చెల్ల నందఱిని నంచిత రీతినిఁ బల్కరించుచున్ 
నెమ్మిఁ జరింపఁ గంటివె యనింద్యుని వాని కెవండు చుట్ట మౌ
నమ్మకుఁ గూడ, భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్                              53. 

మున్ను భాస్కరుం డనువుగ విన్న పగిది 
వీఁక నెవ్వరు వండిన లోక మందు
నెక్కడైనను బరికింప మిక్కుటంపు
టుప్పు లేని కూరకు రుచి యుండును గద                                                       52. 

భువిలో నేఁ డతి శుద్ధ వస్తువులు సంపూర్ణమ్ము శూన్యమ్ములే 
యవలోకింపఁగ సంకరమ్ములు సుమీ యార్యా సమస్తమ్ములుం
జవులూరుం గడు నుప్పు చక్కఁగను స్వచ్ఛంబైన నెందైన దు
ర్లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ                                51. 

మూర్తీభవించిన విమల
వర్తన మనఁగఁ జరియించి ఫలితమ్మును, ని
ర్వర్తించి చక్కఁగఁ దనదు 
కర్తవ్యము, మఱచు జాతి గనును శుభంబుల్                                                  50. 

కర్తృత్వమ్ము వహించి భూధవుఁడు  లోకవ్రాతమే మెచ్చఁగాఁ 
గర్తవ్యమ్ముల నాచరించిననె నిక్కం బైన కల్యాణమౌ
ధూర్తవ్రాతము సేర్ష్యఁ జాట నిల నెందుం గాన రానట్టిదౌ
కర్తవ్యంబును విస్మరించి నపుడే కల్యాణమౌ జాతికిన్                                         49. 

హరి పవ్వళించు ముదమున 
నరనారీ మణుల కిల ఘనమ్ముగ  శ్రేయ
స్కర మగు నొకింత తడ వా 
శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్                                                         48. 
[శర తల్పము = జల తల్పము] 

తరుణీ రత్నమ గ్రీష్మ నాశమున నిద్రా దేవినిం గొల్వుమా 
పర మానందద శీతలానిలము వీవం జక్క సౌఖ్యంపు లా
హిరి గ్రమ్మంగ నెడందలో వగపు నీకేలా మహా కోమ లా
ర తల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్దాపమున్                                  47. 
[ఆశర తల్పము = నైరృతి మూల నున్న తల్పము] 

ఆండ్రును మఱి  కోడండ్రును 
గుండ్రముగాఁ దిరిగి సుతులు కూతుళ్లును న
ల్లుండ్రు నొకింత నిలువుఁ డిట 
గుండ్రాతిని భక్తిఁ గొల్వఁ గుశలం బబ్బున్                                                          46. 

తీండ్రంబై చెలరేఁగి దుఃఖ మెద వేధింపంగ నిత్యమ్ము పె
క్కండ్రిద్ధాత్రిని నిష్ట దైవముల వీఁకన్ మ్రొక్కి సేవింతురే  
తండ్రీ నీ విల దిక్కు మా కనుచు నిత్యం బార్తి లింగాకృతిన్ 
గుండ్రాతి న్గడు భక్తిఁ గొల్వ నిదె నాకున్ నీకు సౌఖ్యం బగున్                                  45. 

స్వస్తి యని ధనము ధాన్యము 
వస్తు నిచయము విభజించి వడి వివరముగం 
బ్రస్తావించియుఁ జట్టము 
నాస్తుల పంపకముఁ జేయు మనె భరతుండే                                                      44. 

విస్తృత మైన రాజ్యమును వీడి వనమ్మున కేఁగ రాముఁడే 
న్యస్త కిరీట భాసితుని నా సుతుఁ జేయు మనంగఁ గైకయే 
నిస్తుల సానురాగ రమణీయ నితాంత దయా క్షమాదులౌ
యాస్తుల నెల్లఁ బంచు మని యన్నను నా భరతుండె కోరెఁ బో                                43. 

నీకుం గల విత్తమ్మున
నే కొంతైనను నెదఁ గరుణించి యొసఁగవే 
నా కన్న శిరము నూపుచు 
లాకేత్వము దాకుఁ గొమ్ములను దాత యిడున్                                                    42. 
[కొమ్ములను + తాత = కొమ్ములను దాత] 

గా కోత్వమ్మును డాకుఁ గొమ్మరుదు లోకం బందు నిట్లైనచో 
నీ కీయంగ ధనమ్ము నర్థులకుఁ జింతింపంగఁ గొంతైననున్ 
లా కోత్వమ్మును టాకుఁ గొమ్ము గలదా రాజేంద్ర నా నడ్గఁగా 
లాకేత్వమ్మును దాకుఁ గొమ్ము నిడు హేలన్ దాత యెల్లప్పుడున్                              41. 

కట్టెదుటం దగఁ గూర్చొని 
దట్టము సరి చేసికొంచుఁ దన సరసం గ
న్పట్టఁగ జడ వేయ వెసం  
జుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీఁకెన్                                                      40.  

పుట్టిన యింటి బందుగులు ముద్దియ కెప్పుడు ప్రీతిపాత్రులే 
మెట్టిన యింట మోదమున మీనవిలోచన పట్టి కోడినిం 
బుట్టము చక్కఁ బెట్టి పువుఁ బోడి తలంచుచుఁ గూర వండఁగాఁ  
జుట్టమ రమ్ము రమ్మనుచు జుట్టును బీఁకె నదేమి చోద్యమో                                    39. 

వేసిన తలుపు లవి వేసి నట్టుండఁగ 
నెట్టి వింత యయ్యె నేరి కెఱుక 
లోన నున్న యట్టి లోహమే లేదయ్యె
నెలుక లెల్లఁ జేరి యినుముఁ దినెను                                                                  38. 

చిలుకలఁ బోలెఁ బల్కెదరు సిగ్గన నేరక నేఁటి నేతలే 
నిలయము లెన్నొ కట్టితిమి నేలను గూల్చెను బందికొక్కులే 
కొలనులఁ బెక్కు త్రవ్వితిమి గుట్టలు కట్టెను గండుచీమలే 
యెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్                            37. 

పిల్ల నొసంగిన మామకు 
నుల్లం బది తల్లడిల్ల నొక్కొక్కటిగం
జల్లగఁ గాఁ జేయ సిరుల 
నల్లుని మంచితనము నహహా రోసిరిగా                                                              36. 

పల్లెలఁ బట్టణమ్ములను బన్నుగఁ గీర్తి  గడించి నిత్యముం 
గల్లయు నింక నే కపట కార్య మెఱుంగక సాగుచుండఁ దా 
నొల్లక మామ మత్సరము నొంద సహింప కెడంద యందు మే
నల్లుని యొక్క మంచితన మందఱుఁ గాంచి యసహ్య మందిరే                                 35. 

వనరు సీత నరయ వచ్చిన యట్టి వాఁ
డగ్గి వెట్టఁ దోఁక కసురు లనుమఁ
డన్న నిందుఁ గలది యన్న! వేల్వ యగునా         
వాడ లందుఁ దిరుగు వాఁడు వేల్ప?                                                                     34. 
[వేల్చు = తగులఁబెట్టు; సమస్య లోనే ప్రశ్నాంక ముండుటచే 
వేల్పు పదముపైఁ గర్తకే యనుమాన మున్నదని భావించి చేసిన 
పూరణము. అగునా యన్నది ప్రశ్నాంకమునకు నిందు నన్వయించును.

వేడుక మీఱ బాల్యమున విశ్వ వినోది వినోద రక్తినిం 
దోడుగ నుండ నన్న ఘన దోర్బలుఁడౌ బలరాముఁ డండగా 
నాడిన యాటలం దిరిగి యాడక తా నవనీత చోరుఁడై 
వాడల వాడలం దిరుగు వాఁ డగుఁ జోరుఁడు దేవుఁ డెట్లగున్                                      33. 

నిర్భయమ్ముగ బాధింప నేల పట్టి 
రాముఁ డస్త్రమ్ము సంధించి బ్రహ్మ శిరము 
కంటి నలుకతో వీక్షించి కాకి నలఘు 
రావణున్ గడ్డిపోఁచతో రమణి!  గూల్చె                                                                  32. 
[అలఘు రావణుఁడు = పెద్ద యఱుపులు గలవాఁడు] 

చేవను గాఱుకూఁతల నశేష విధమ్ముగఁ గూయుచుండఁగాఁ
బావని కోప తాపమున వారక పోల్చి సమస్త విశ్వ వి
శ్రావ ని జాసమాన బల సంప దవారిత వీర్య దర్పితున్
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో                                        31. 

నష్టము గా మతి తన్నిన 
స్పష్టంబౌ రీతి సత్యభామా సతి స్వీ
యేష్ట సతియె యా తాఁపును  
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను జేఁదున్                                                             30. 

కష్టం బైనను నోర్చి శాంతముగ వీఁకన్ ఘోర కాకోల సం
దష్టాంగార్తి సమాన దుర్భరము గాంధారీ కుమారౌఘ దు
ర్నష్టైకార్తి యొసంగ శాపము వెసన్ నారాయణుం డత్తఱిన్  
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్గదా చేఁదునున్                                             29. 

మానవుల కొసంగం బర
మానందమ్ము పరికింప నత్యధికముగన్ 
మానుగ దక్షిణ వార్థిని  
భానుఁడు సోముఁడును గలసి వచ్చిరి వేడ్కన్                                                           28. 

మానిత సాజ వర్ణచయ మాతృ సతీ గిరిజా సతీ యుతే
శాన స దేవగాయన స యక్ష స కిన్నర సిద్ధ దేవ స
న్మౌని వరాప్సరో గణ సనందన సోదర వజ్రి నిర్జరుల్   
భానుఁడు సోముఁడుం గలసి వచ్చిరి విందుకు మా గృహంబునన్                                   27.  
[మా గృహము = లక్ష్మీదేవి గృహము] 

జూద మాడి యా లేకింకఁ జూఱకొనియ 
లోకులను మోసగించియ కాక యున్నె 
చోద్య మీ రీతి వచియింపఁ జూడఁ జూడఁ 
బావలా పెట్టి లక్షలఁ బడయు టొప్పు                                                                       26. 

కావలె వే యుపాయములు కాసుల నందఁగ దీక్ష తోడుతం  
ద్రోవలు పెక్కు లెన్నఁగను రూకల నందఁగఁ బట్టు పట్టినన్ 
వావిరి మత్స్యరాజములఁ బన్నుగఁ బట్టితి మన్మథాభ రూ 
పా వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్                                                25. 

నాతుకలకు ధర్మం బగు 
నాతతముగ గౌరవింప నాత్మేశునినిం  
బాతక మగుఁ గుహనా మతిఁ  
బాతివ్రత్యమును రమణి పాటింపకుమా                                                                   24. 

సీతా మాతృ సమాన లోక నుత సచ్ఛీలాంగనా కోటికిం 
బాతివ్రత్యము పాటి యౌను రమణీ పాటింప నింపారఁగా 
ధౌతార్ద్రాంబర భాసి తాంగనల కిద్ధాత్రీ తలం బందుఁ దా  
పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింప రాదెన్నఁడున్                                              23. 
[తాప + ఆతివ్రత్యము = తా పాతివ్రత్యము; అతి వ్రతల బావ మాతివ్రత్యము]  

అరివీర భయంకరుఁడై 
నిరతము దోర్బలము నందు నిష్ణాతుండై 
పరఁగిన ధర్మాధిక త
త్పరులకు భీముండు బెదరు వాఁడు రణమునన్                                                         22. 

పరులకు నాజిలో బెదరు వాఁ డన భీముఁడు సత్య దూరమౌ  
దురమున నైన గాయములఁ దూర్ణము మూలము నుండి మాపుటన్ 
నిరయముఁ జూపు బాధ లిడ  నేర్పరులై చరియించు మందు కూ
ర్పరులకుఁ బెద్దగా బెదరు వాఁడు గదా రణ మందు భీముఁడే                                          21. 
[రణము = ధ్వని] 

వివరింప శక్య మగునే 
యవివేకుల బాధ లెల్ల నవనీ తల మం
దవిరళ పర పరిచర్యా 
కవులకు దిక్కగుఁ జుమా శకారుం డెపుడున్                                                              20. 
[పరిచర్యా కవులు = దాస్య శృంఖలములు గలవారు; 
శక + అరుఁడు = శకారుఁడు, శక మను నల్పజాతికి శత్రువు, అగ్రకులుఁడు] 

నృవరు లిడన్ సమస్యలను నేరక వైనము పూరణమ్ములం 
జెవులకు నింపొసంగు గతిఁ జెప్పఁ గవిత్వము రాక యున్నచోఁ 
దివిరిన నెంత యే పగిది దిక్కెద నెద్దియుఁ దోఁపకున్నచోఁ
గవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండుఁ బూజ్యుఁడై                                        19. 
[వైనము = ఉపాయము] 

నృపవర్యుఁడు మేకలఁ బో
లు పులుల గుర్తించని యెడ లోకం బందున్ 
విపరీత గతి ననవరత
మపకారులకే లభించు నభినందనముల్                                                                  18. 

ఉపకారం బొనరించు వారి కిలలో యుక్తంబు గా నట్టులే 
విపరీతమ్మన రాదు దీని నిజమున్  వీక్షింప దుర్వార ద
ర్ప పరీతోగ్ర నిజాంతరంగ జన దుర్మా ర్గాపకా రాలికే 
యపకార మ్మొనరించు వారలకె లభ్యం బౌను సన్మానముల్                                           17. 

మానవత్వము సూపింప మానకుండఁ 
బరుల కుపకార మొనరింపఁ బాతకమ్మె 
యెఱుక లేక తన్నడిగిన నేల కల్గుఁ 
దిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము                                                          16. 

గిరలు నిజమ్ము లివ్వి పరికింప నొసంగును బెక్కు బాధలం 
బరులకుఁ దల్ప హాని హరి వారికిఁ జూపుచు నన్య దిక్కునుం 
గరుణను వీడి దర్శన విఘాత మొనర్పఁగ వక్ర బుద్ధితోఁ 
దిరుమల మార్గ మిద్ది యని తెల్పిన వారల కబ్బుఁ బాపముల్                                         15. 

పరుల నొప్పింపక తనదు గిరల సుంత 
యెంత కవ్వించిన నితరు లింత యేని 
యెడఁదఁ దలపోయ కున్నచో నెన్నఁ డేని 
తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ                                                                     14.  

బిట్టుగఁ గీర్తి నా సతిని బెట్టును గట్టిగఁ బట్టఁ బట్టు ని
ప్పట్టున నెట్టి నెట్టన విపక్షుల నర్కుని పట్టి  యింటికిన్ 
దిట్టతనమ్మునం జెలఁగి ధీరత చూపిన నీ వెడంద నెం
తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడి వాఁడె విజ్ఞుఁడౌ                                                      13. 
[బెట్టు = గౌరవము; పట్టును = చెల్లును;  ఎంతు+ఇట్టి = ఎంతిట్టి, ఎంతు విట్టి] 

మానసమున నిల్పుచు  నను
మానము నూన కిసుమంత మనుజు లనిశమున్  
మానితముగఁ జదువుల దొర 
సానిన్గొల్చిన లభించు సాహిత్య నిధుల్                                                                       12. 

గానవ్రాత విపంచి హస్త విధిహృత్కాంతా లసత్ఫల్య పా
ణీ నాళీక సపుస్త కాక్ష కర దేవీ నీల సారంగ వే
ణీ నీరేజ దళాక్షి చారుముఖి వాణీ సర్వ విద్యా సర
స్సా నిన్గొల్చిన వాని కబ్బును గదా సాహిత్య సామ్రాజ్యముల్                                            11. 

గురు వగు నీ సముఖమ్మునఁ 
దరుణీ మణి వొంద శాంతి తగు నంచు వెసన్  
గురుతర నిజ బాధా వి
స్మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా                                                                   10. 

నరులకుఁ జెప్ప నేల  మఱి నారుల కైనను యక్ష రాక్ష సా
మరులకు నైన దుర్భరము మాతృ వియోగము నిశ్చయమ్ముగాఁ 
బరమపదింపఁగా జనని వారక తద్దిన మందు మాతృ సం
స్మరణముఁ గోరి వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో                                                  9. 

గారాబు పట్టి యా కల 
వారి కొమరిత ముదము కొలుపంగ నిలువగా 
మూరి జను లెల్లరు నచట 
బారున నృత్యమును జలిపె భారతి వేడ్కన్                                                                   8. 
[బారు = వరుస] 

వారిజ నేత్ర వారిజ నిభద్యుతి లబ్ధ నిజాస్య ప్రీతిమైఁ 
దీరుగ సత్కళా ప్రతిభ తేటపడంగ సభాస్థలమ్మునన్  
భారతి పేరు పెట్టుకొని పండిత పామరు లున్న యట్టి యా 
బారున నృత్యమున్జలిపె భారతి సత్కవు లెల్ల మెచ్చఁగన్                                                   7. 
[బారు = సమూహము] 

కృత్ను వడరి చండస్తన
యిత్ను నిభ ముఱుముచుఁ జేయ నెంచిన మదినిన్ 
హత్ను వయినఁ దా నెంతటి   
యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ                                                                      6. 
[కృత్నువు = నేర్పరి; స్తనయిత్నువు = ఉఱుము; హత్నువు = హంత]
  
రత్న నిభమ్ము యోచనల రమ్యతరం బిది యంచు నెంచుచుం 
బత్ని విచార సంచయము భగ్న మొనర్చి యగౌరవమ్ముగన్ 
నూత్న విధాన హీనము మనో వనజమ్మునఁ దాండవింపఁగా   
యత్నముఁ జేసినన్ ఫలిత మంద దటంచు వచింత్రు సజ్జనుల్                                              5. 

ఏలను సంధులు గింధులు 
సాలును గ్రామ్యమ్ము లైన జనములు మెచ్చం
గాలం బిల మారిన దే  
బాలవ్యాకరణముఁ గవివరుఁ డెఱుఁగఁడు పో                                                                    4. 

ఏ లీలం గన రీ ద్రుతమ్ములను వర్జింత్రెల్ల పద్యమ్ములన్ 
హేలా లీలను యట్టు విట్టనుచు  నచ్చే లగ్గు నా నుంతురే 
తేలింతుర్ కళపైఁ జెలంగి సరళాదేశమ్ము కావ్యమ్ములన్ 
బాలవ్యాకరణ మ్మెఱుంగని కవిన్బ్రఖ్యాతుఁ డంద్రెల్లరున్                                                      3.  

సూర్యుని కుమారుఁ డార్తినిఁ జూచి యేఁగ  
రక్తముం గని నన్న మరణము నెంచి 
పెను గుహాంతరమ్మునఁ బెద్ద బెనఁగి మయు కు
మారునిం జంపె శక్రకుమారుఁ డెసఁగి                                                                               2.  

ఆ రథ చక్ర మంకమున నద్భుత రీతిని నేలఁ గ్రుంగఁగా 
భారత సంగరమ్మునను బార్థుఁడు శల్యుఁడు సూచుచుండఁగాఁ 
గారణ జన్ము నంగ పతిఁ గర్ణు నరాతి నతీత సర్వ కౌ 
మారునిఁ జంపె శక్రుని కుమారుఁడు మాధవుఁ డంప నుద్ధతిన్                                                1.