ఎమ్మెలు కొన్ని వచింపఁగఁ
బమ్మిన ధన మదము తోడఁ బండిత మానిన్
రమ్మని వానిని, నెన్నుచు
బమ్మెర పోతనను, గవిగఁ బల్కఁగఁ దగనే 59
ఇమ్మహిఁ బద్య కోటి పఠియింపఁగఁ బండిత పామరాళి హ
ర్షమ్మున నాంధ్ర సంస్కృత సుశబ్దము లారసి పొంగు చుండునే
పమ్మిన సిద్ధ హస్తుఁ డిల భక్తి రసమ్మున సుందరంపు నై
జమ్ము కవిత్రయమ్మునకు సాటి కవిత్వము నందు నెన్నఁగా
బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చర టన్న సత్యమే? 58
మనుజులకు నెంచఁ బాప
మ్ము నించుకయుఁ జేయ కుంట పొసఁగదు ధరలోఁ
దనరిన పాపప్రాయ
స్తనమే నా కిష్ట మనుచు సన్యాసి యనెన్ 57
[ప్రాయః + తనము = ప్రాయస్తనము: ప్రాయశ్చిత్తము]
అనయం బింపుగ ధర్మ వర్తనమునం దాసక్తి వర్ధిల్ల మూ
రిన సద్భక్తినిఁ బద్మనాభుఁ డగు నా శ్రీనాథు గాధాలి చిం
తనలో సంతత ముండు నిర్మలమునౌ నారాయ ణోపేయివ
స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్ 56
[ఉపేయివస్ + తనము = ఉపేయివస్తనము: చేరినట్టి చిత్తము]
వారణావత పుర వాసుల మనోగతము:
దుష్ట దుర్యోధ నాదులు శిష్ట వర్త
ను లగు వీర వరేణ్యులను గపటమున
నక్కజమ్ముగ నడిరేయి లక్క యింట
బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను 55
పెల్లుఁదనమ్ము మీఱిన నవీన సభా గమనంపు సాకుతో
నల్లన గుప్త భావమున హస్తి పురాఖిల పౌరకోటి కం
పిల్లఁగ రాజ్య లక్ష్మి హరియింపఁగ మోసపు టక్ష విద్యలో
బల్లిదు లైన కౌరవులు పాండవులం బరిమార్చి రుద్ధతిన్ 54
సతతము విద్యార్జనమున
వితతముగఁ గృశింపఁ దాను వీక్షించి మదిన్
వెత వొడమఁ దమ గృహమున వి
రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్ 53
నత శీర్షుండవు నై రయమ్ముగను సందర్శింప నీ వేఁగు న
గ్గతులం దీయ శుభవ్రజమ్ములను రక్షార్థమ్ము వారెల్ల ర
ద్దితి రీ వద్దికొనంగఁ గన్నులకు భక్తిన్ దైవ దత్తంపు టా
రతికై రమ్మనె నాత్మ సోదరుని నారాటంబు గన్పట్టఁగన్ 52
అనునిత్య మపాయ మెదు
ర్కొనుచుం దిరుగాడు చుండు కూన యొకటి భీ
తినిఁ గని మార్జాలము వడిఁ
జన మును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్ 51
కనఁ బడి నట్టి యెల్లర కఖండిత వాక్కులు చెప్పు చుండుఁ దా
ననిశము కాఁగ ఛిద్రములె యందఱికిం జెవు లెల్ల వింతగా
వినఁ డతఁ డెంత వద్దనిన వీనులు కొర్కుచు నుండుఁ దద్దయున్
జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతిఁ జెందఁగన్ 50
సంతత మర్చన కర్హులు
తంతులఁ దాళి మెడఁ గట్టి తనరిన తన వాఁ
డంతర్యామియు నిలలోఁ
గాంతకుఁ గందర్ప సదృశ కాంతు లిరువురే 49
[కాంతుఁడు = మగఁడు, ప్రభువు ]
వింత యనంగ నేల దివి వెల్గెడు వారు జ నాభయంకరుల్
కొంత యొసంగు వారు వెత లోకులు సంతస మందఁ దీర్పఁగా
ధ్వాంతము చంద్రుఁ డర్కుఁ డన భవ్య నిశా దివసమ్ములన్ నభ
స్కాంతకుఁ గాంతు లిద్ద ఱట కంతుని మించిన సుంద రాననుల్ 48
ఈ మహిఁ గౌరవ పాండవ
భూమీశులు రాజ్య కాంక్షఁ బోరఁ గురుక్షే
త్రామల తటి భారత సం
గ్రామంబున వెల్లి గొనెను రక్తపు టేరుల్ 47
సామజ సత్పదాతిదళ సద్రథ సాశ్వ నికాయ యుక్త సం
గ్రామ తలాంతర ప్రథిత కంపిత భూమి నిరంత రోగ్ర వి
శ్రామ విహీన యుద్ధ గత శాత్రవ వీర మదేభ విగ్రహ
గ్రామము నందు వెల్లిగొనె రక్తపు టేరులు భీకరంబుగన్ 46
పొంతము లేనివి యగు నీ
వింత పలుకు లెంత నిజమొ వీక్షింపంగా
నంతియ నిక్కం బగు నిది
కాంతరొ మామిడికిఁ జింత కాయలు గాసెన్ 45
వేనిని బాహ్య రూపముల పేరిమినిం గని కూడ దెన్నఁగా
వాని గుణమ్ములే యనుభవమ్మునఁ దెల్ల మగున్ నిజమ్ముగాఁ
గానఁగ నుండ నందముగఁ గాయను దింటిని పుల్పు ఱొడ్డు సూ
మానిని నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింత కాయలే 44
ముగ్గురు కవిత్వ సారము నగ్గలముగ
నేర్చి నట్టి వారు ఘనులు నేర్పరు లయి
డెంద మలర వర్ణించిరి సుందరంపుఁ
గన్యనుఁ గనిరి ముగ్గురు గనిరి యశము 43
మాన్యులు విప్ర వర్యులు సమస్తపు వ్యాకరణమ్ము నం దసా
మాన్యపు లక్ష్య కావ్యము సమంచిత మానవ ధర్మ సారమున్
ధన్యులు పండితోత్తము లుదాత్తపు టాంధ్రపు భారతమ్ము నా
కన్యను ముగ్గు రాదరముగాఁ గని రిమ్ముగఁ గీర్తి కాములై 42
దుర్నిరీక్ష్యుఁడు రణ దుర్జయుండు ఘనుండు
క్షత్రి యాన్వయుండు శత్రు కోటి
ఘోర శస్త్ర పటిమఁ గ్రోధమ్ము మీఱఁ దూ
లం జని వధియించె లా వెసంగ 41
రంజిత మానసుండు నయి రక్కసు లెన్బది వేల సంఖ్యలం
బ్రాంజలి మ్రొక్కి మైథిలికి రావణు సేన నెఱుంగు వేడ్కతో
నంజని పట్టి యుక్తిని దశాస్యు నశోకపుఁ దోఁట కంత లీ
లం జని చంపెఁ గ్రూరముగ లావెసఁగం బవమానపుత్రుఁడే 40
గాండీవమ్ము ధరింపఁగ
గాండీవి రణాంతరమునఁ గాలాభుండై
చండతర కార్ముక మపర
గాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో 39
మండం డెక్కెము నందు మారుతి మహా మార్తాండ తుల్యుండునై
దండన్ నిల్వఁగఁ దోలుచున్ హయములన్ దామోదరుండే రణో
ద్దండాజేయుఁడు తమ్ముఁడే నిలువ బద్ధద్వేషి బీభత్సుఁ డా
గాండీవమ్మును దాల్చి నిల్చె ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై 38
భామా రత్న మహల్యా
నామ విధి వశమునఁ గాననమ్మున నా ని
ష్కామ ముని తపోఽరణ్యా
రాముని శాపమున నాతి రాతిగ మారెన్ 37
[అరణ్య + ఆరాముని = అర ణ్యారాముని ]
కామ వశాత్ముఁడై యమర కాంతుఁడు కాంచఁడు మంచి చెడ్డలన్
భామిని శాప మిచ్చు నని వాసవు నాపదు భీత చిత్తయై
కోమలి పాప కృత్యమునఁ గుందుచు గౌతము స్వీయ వక్ష యా
రాముని ఘోరశాపమున రాతిగ మారె నహల్య యక్కటా 36
[వక్షస్ + ఆరాముని = వక్ష యారాముని]
కొండ నెత్తెద నను జూపి కండ లకట
కడలి నెండింతు నం చను నడరి తాను
గంటి దేవుని నం చను వెంట నరిగి
తలకు రోఁకలిఁ జుట్టె విద్వాంసుఁ డౌర 35
పలుకుల్ వేదము లంచు వీని నల సంభావించిరే యెందఱో
యిలలో శాస్త్రము లందు దిట్ట యనిరే యింకెందఱో వీనినిం
గలలో నైనను ధర్మ సూక్ష్మములు వక్కాణించు నాఁ బల్కిరే
తలకున్ రోఁకలిఁ జుట్ట మే లనెను విద్వాంసుండు నీతిజ్ఞుఁడై 34
ప్రజ కేల పట్టు బట్టలు
ప్రజ కేల విభూషణములు భవ నావలియున్
నిజము పరికింప శూన్యమ
ప్రజలకుఁ బద్యముల తోడఁ బని లేదు కదా 33
సృజన కొసంగు దోహదము శీఘ్రముగా హరియించు డెందమున్
నిజము వచింపఁ బద్యమున నేర్చిన పాఠము నిల్చు నిత్యమున్
ఋజువుగ పెద్ద భావముఁ గుదింప నగున్ విను మింకఁ జెప్పుమా
ప్రజలకుఁ బద్య కావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ 32
సద్దుమణఁగిన గృహములో
ముద్దుగఁ గపటంపు వేషమున హాస్యముగా
నొద్ద కరుదెంచి పతియే
ముద్దిడు మనె భిక్షు వతివ పొమ్మన దయ్యెన్ 31
ముద్దియ నేర్వ వ్యాకరణముం దలపోయుచు నత్వ సంధినిన్
ముద్ద నొసంగు మన్న గతి పొల్తుక డెందము నందు నెంచుచుం
దద్దయు భక్తిఁ జూపుచును దప్పక యిత్తును భిక్ష నంచుఁ దా
ముద్దిడు మన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్ 30
పలుమ ఱనంగ వినమె పలు
కు లిటులఁ బొరుగింటి పుల్ల కూర రుచి యనన్
నలినాక్షి కర కమలపుం
బులుసు కవుల నెల్ల మోహమునఁ బడఁ ద్రోయున్ 29
కలువల ఱేని వర్ణనము కాంతల సుందర గాత్ర వర్ణన
మ్ములు భ్రమ రాలి నాదములు మోద మొసంగ నిరంతరమ్మునున్
సలలిత గూఢ భావ పద జాల సమావృత సత్కవిత్వపుం
బులుసు కవీంద్రు లెల్లరను మోహమునం బడఁ ద్రోయు నిచ్చలున్ 28
ఇంతి తొందర యెక్కువ సుంత నీకుఁ
జెంత కేఁగి వీక్షింపుమ వంత యేల
వీఁక లే వని చెప్పిన నీకుఁ గీడు
మూడు కన్నులు గలవు రామునకుఁ గనఁగ 27
తిన్నగ నేఁగి సత్వరము దిట్టతనమ్మున వీడి చింతనుం
గ్రన్ననఁ జూపు వైద్యునకు రామ!వచించిరి యిట్లు చక్కఁగా
నన్నుల మిన్న నీ సతికి నంచిత రీతిని నిశ్చయమ్ముగాఁ
గన్నులు మూడు రామునకుఁ గాంతలు నల్వురు పుత్రు లేవురున్ 26
[మూడు = కలుగు; కాంతలు = స్త్రీలు ]
‘దర్భ - తిల - పిండ - శ్రాద్ధ' పదాలతో రుక్మిణీ కళ్యాణ వృత్తాంతము
లలనా తిలక బకారిని
వలచి మహోద్దండ పిండ వసుదేవ సుతున్
సలలిత వైదర్భ తనయ
లలి మిశ్రాద్ధాపురుషుఁ బరముఁ బెండ్లాడెన్ 25
[మిశ్ర +అద్ధాపురుషు =మిశ్రాద్ధా పురుషు; అద్ధాపురుషుఁడు = సరియైన
మనుష్యుఁడు; మిశ్రుఁడు = గౌరవము కలవాఁడు]
దార సువర్ణ మణి ఖచిత
హారము న్యాసం బొనర్ప నక్కట నే నే
తీరున నేఁగెద నింటికి
హారము లే కున్న నగు మహా ప్రళయంబే 24
హారి రమా మనో వన విహారి మునీంద్ర వచో విహారి దే
వారి నికాయ సంప దపహార విహారి దురాసద ప్రభా
సీరి నిజానుజ ప్రవర శిష్ట జనావన దుష్ట లోక సం
హారము లేకపోయిన మహాప్రళయంబు సముద్భవించెడిన్ 23
పరమ పురుషుండు నరునిగ
ధరలోఁ గృష్ణుం డనంగఁ దద్దయుఁ బ్రీతిన్
హరియే సుతునిగ వింటివె
నరహరి! జన్మించె నఁట కనన్ దేవకికిన్ 22
గురువరుఁ డెల్ల లోకములకుం బరి పాలకుఁ డచ్యుతుండు దా
స్థిరముగ భూమి భారమును దీర్పఁగ నెంచి పరాత్పరుండు ద్వా
పరమున నా రమా పతియె పన్నుగ మున్నిల నెవ్వఁ డయ్యెనో
నరహరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భ మందునన్ 21
వర్ణములు పలుక లేవు వి
వర్ణం బయ్యెను ముఖమ్ము పాటను నకటా
తూర్ణం బాపుమ దయతోఁ
గర్ణ కఠోరమ్ము వేణు! గానమ్మయ్యెన్ 20
కర్ణము లేని నావఁ జనఁ గా రనలమ్మునఁ జిక్కి యుండఁగాఁ
దూర్ణము మృత్యు కంఠమునఁ దూలుచు నుండఁగ దుస్సహంపు దుః
ఖార్ణవ మందు మున్గఁ గడు నంబర వీథిని వచ్చు చుండఁగాఁ
గర్ణ కఠోరమై మదికిఁ గష్టముఁ గూర్చెను వేణు గానమే 19
ద్రౌపది సరస నుండంగఁ జూపి స్వీయ
విక్రమమ్ము వీరుండు తివిరి వధింపఁ,
జేరి కామాంధుఁ డైనట్టి సింహబలుఁడు
చచ్చె, భీముఁడు నర్తనశాల లోన 18
కవ్వడి చెప్పి నట్టి విధిఁ గైతవ వాక్యములన్ వచించి తా
రివ్వున వచ్చి కృష్ణ విపరీతపు సంశయ మంది భీతితో
నవ్వనితా మతల్లి కల నారసె నీ గతిఁ దత్తఱమ్మునన్
నవ్వుచు వీడెఁ గీచకుఁడు నర్తనశాలనుఁ జంపి భీమునిన్ 17
ఆ మారుతి వాక్యమ్ముల
మైమఱచి ముదమ్ము మీఱ మారుతి యనుచున్
భామ చివరకుఁ దడఁబడుచు
మా మా యని పిలిచె సీత మారుతిఁ బ్రీతిన్ 16
ఏ మని నిన్ను నేఁ బొగడ నిత్తఱి నేర్తును ఘోర దుఃఖ మన్
ధూమము నందు మున్గితిని తోషము కల్గిన దుంగరమ్మునన్
రామున కీవు తండ్రి సరి ప్రాణము నిల్పితి నాకు నెంచఁగా
మామ యటంచుఁ బిల్చినది మారుతినిం గని సీత ప్రీతితో 15
పావని సీతా సతిఁ గని
యీ వచనము లనిరి మోసగింప నవనిజన్
రావణిచే నని యసురులు
రావణుఁ జంపంగఁ బోయి రాముఁడు సచ్చెన్ 14
చావును దత్క్షణం బొసఁగఁ జాలెడు రామ శరమ్ము తాఁకఁగా
నా వన చారి వక్షము మహాయస సన్నిభమున్ దృఢమ్మునుం
జేవ సెలంగ మిక్కుటము స్వీయ వరానుజు శత్రు సంఘ వి
ద్రావణుఁ జంపఁ బోయి రఘురాముఁడు, సచ్చెను వాలి, సూడఁగన్ 13
[..సచ్చెను వాలి రఘురాముఁడు సూడఁగన్ ]
గుండె లోన నిలిపి కోరిన దేవుని
నింటి లోన నుండి యెలమిఁ జేయఁ
బూజ పుణ్య మబ్బుఁ బోవు నీ మాట దు
ర్నీతి కాటపట్లు నేటి గుడులు 12
ఖ్యాతి వహించె నీ భరత ఖండము నీతికి మున్ను నేడొ యే
రీతినిఁ గాంచినం దివిరి లే దవినీతి కనర్హ మెద్దియుం
జేతలు గాంచ నిక్కముగఁ జిత్రము కాదు వచింప నిట్లు దు
ర్నీతికి నాటపట్టులుగ నిల్చెను దేవళముల్ గనుంగొనన్ 11
కానఁగఁ దగు కాలమ్మున
వానల నంచితముగ మఱి వలసిన రీతిం
మేను లలరఁగ నకాలపు
వానలు లేకున్నఁ బంట పండెను మిగులన్ 10
పాన నిమిత్త మింకఁ గృషి వారికిఁ గట్టఁగ నానకట్టలే
వాని ప్రభావ మేర్పడఁగఁ బన్నుగ నిండ జలాశయమ్ములే
నానఁగ నేల యెల్లను ఘనమ్ముగఁ బాఱిన సాగు నీటితో
వానలు లేకపోయినను బంటలు పండె సమృద్ధిగా భువిన్ 9
ప్రియము వాసంతికి వసంత ఋతువు కరము
ప్రీతియౌ వసంతకు వర్ష ఋతువు భృశము
చైత్రమునఁ గనిపింప వాసంతి ఋతువు
శ్రావణమ్మున వచ్చు వసంత ఋతువు 8
ఈ వనితా మతల్లి స్వర మేమని చెప్పుదుఁ గోకిలస్వరం
బే వినిపింపు మంచడుగ నింపుగఁ దాఁ దన కెట్టి రాగముల్
రా వని చెప్పి శ్రావ్యముగ రాగము నొక్కటి నాలపింపఁగా
శ్రావణ మాస మందున వసంతము వచ్చును సంతసమ్మునన్ 7
[వసంతము = వసంతరాగము]
భువి ధర్మమ్మును సత్య
మ్ము వలుక నేఁడు కని వానిఁ బురుషులు కలిలో
నవివేకి యనిరి కంటివె
కవి! కోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్ 6
పెల్లుగ రాగ యుక్తములు పేరు గడింపఁగఁ దప్పు లున్నఁ గో
కొల్లలు భాషలో నయినఁ గోట్లు గడించును జిత్ర వీథిలో
నల్లిన నారికేల సదృశాంచిత పాకము నందు లోకులా!
గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయఁగన్ 5
ప్రభవించిన నెదఁ గోపం
బభీతినిన్ దారుణముగ నర్హుండగుఁ దా
నభిశంసనమున కిట్లన
శుభకృద్వత్సరము భువికి శోకం బిడుతన్ 4
శుభకృద్వత్సర మెల్ల లోకులకు నిచ్చుంగా నశోకమ్మునే
సభలో నిట్లన నెంచి స్వీయ వదనోచ్చారమ్ము లిద్ధాత్రిలో,
నభినందించు సతమ్ము నిట్లు, ప్రతికూలార్థమ్ము లీ నేర్వఁగన్
శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత శోకం బిఁకన్ 3
శిరము పైన నిలిచె గంగ కరము ప్రీతి
గళ మలంకరించెను బన్నగమ్ము ప్రీతి
నంకము లపరములు వల దింక మాకు
శంకర! విభూషణము నిండు చందమామ 2
[విభూషణమును + ఇండు = విభూషణము నిండు; చందమామ(న్)]
తూర్ణము సూచువారలకుఁ దోఁపదె యివ్విధిఁ జంద్రికా ప్రభా
వర్ణ సమాన దేహు నళి వర్ణ నిభాంచిత కేశి దివ్య ఫా
లార్ణవ మందుఁ బుట్టిన ని జాంబక బింబము నివ్వటిల్లఁగాఁ
బూర్ణ శశాంక బింబమె విభూషణ మయ్యెఁ ద్రిశూల పాణికిన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి