వరమై భాసిల్లంగం
దరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గురులే
వరమై భాసిల్లఁగ గో
తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్ 61
తమకం బొప్పగ స్వీయ భావమును గాంతా రత్న మిబ్భంగినిన్
మమకారమ్ము సెలంగఁ బూరుషునకున్ మర్యాద ప్రాయమ్మునం
గమనీయమ్ముగ మూతి మీసములు వక్కాణించె, నా గిత్తకుం,
గొమరా లందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్ 60
చంప నెద్దాని నింక సాధింపఁ గలము
వింత కాదిది సత్యమ్ము సంత తాను
కంప తనరంగ వే నివారింప నవని
భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును 59
సలలిత భక్తి సంయుతము చక్రినిఁ బద్మ దళాక్షు నింపుగాఁ
గొలుచుచు సంతతమ్మును నకుంఠిత దీక్షను జారుహాసినీ!
చలమునఁ జెడ్డ కోరికల సంశయ మందక యించుకేనియుం
జెలఁగుచు భ్రూణ! హత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్ 58
[భ్రూణ = గర్భిణి]
సంగర మందు నఙేయుఁ డ
భంగ యశస్వి యగు పాండు పతి, సూడఁగ న
య్యంగనలఁ గుంతి మాద్రిని
గాంగేయుఁడు, పెండ్లియాడి కనె సత్సుతులన్ 57
గాంగేయుండు షడాననుండు మఱి గంగా పుత్రుఁడే కాక తా
నంగారప్రభవుండు నాఱుగురు సత్యం బెంచఁగా నంబ లె
బ్భంగిం గాంచిన నుత్తముం డమర సద్బంధుండు శాఖాదిగా
గాంగేయుండు వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్ 56
ఇద్ధాత్రిఁ జరించి విమల
బుద్ధిని నిత్యమ్మును నరపుంగవు లెదలన్
శ్రద్ధగఁ బూజింప హరిని
వృద్ధాప్యము లోన బలము పెంపొందు గదా 55
వృద్ధిం జెందుచు సంతతమ్ము ఘనులై విద్యాప్రసంగమ్ములన్
శుద్ధస్వాంతత నుండగా విగత సంక్షోభమ్ము తారుణ్య కా
లోద్ధారమ్మున మానవాళి కిల నిత్యోత్సాహమై తక్కఁగా
వృద్ధాప్యంబున దేహ దార్ఢ్యము గడున్ బెంపొందు చుండున్ గదా 54
'పంది - కిరి - కిటి - సూకరము' పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
గోమాతను స్తుతి:
వాకిటి లోనికి రిక్కగ
దూఁకినఁ బఱుపం దిని తమిఁ దోరంపుఁ ద్రుణం
బాఁకలి తీరంగ సురభి
సూ కరము కురియును బాలు శుద్దము లార్యా 53
పులి కడుపు నందుఁ బుట్టునె పులికి నన్య
మైన జంతువు విశ్వమ్ము నందు నా మ
హా వని మృగరాజునకు విద్రావిత ఘన
కరికి సింగము గలిగె నక్కజ మెటు లగు 52
నరులకె వైద్యు లుండుటలు నారులకున్ మగవారి కైననుం
బురుడు మహాటవీ తటినిఁ బోసిరి యెవ్వరు దాని కక్కటా
యరయుచు నుండ కేసరిణి కత్తఱి నింపు నొసంగ నా భయం
కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందు టేలనో 51
అరవింద లోచన సుదతి
సురుచిర భాషణము లాడుచుఁ దన పతి కొసం
గి రమణి కమ్మని గారె ల
మరఁ దిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్ 50
విరిసిన పూలు వెట్టికొని పెద్ద కుమారుని భార్య భీతిఁ గాఁ
పురమున కేఁగి కాంచె నట ముచ్చట నత్త కనిష్ఠ పుత్రు నా
యరుదగు మందహాసమున నందము లొల్కెడు చంటి బిడ్డకున్
మరఁదికి మాటి మాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్ 49
వాడని పూవు లనినఁ బూఁ
బోఁడుల కిష్ట మొక ముగ్ధ ముచ్చట ననె నే
నాడ నసత్యమ్మును నే
వాడిన పువు లందములు సువాసనల నిడున్ 48
మాడలు మాడ లిచ్చినను మత్తిలు వాసన లీను పువ్వులే
వాడల వాడ లందు మఱి పల్లెల భంగినిఁ బట్టణమ్ములన్
నేఁడు లభింప కుండుటను నెచ్చెలు లింపుగ మాట లందు ము
న్వాడిన పూల సౌరుల సువాసనలన్ నుతియింతు రెల్లరున్ 47
నరులకు భాగ్య మొసఁగు దే
వి రమాసతి నిశ్చయముగ విశ్వం బందున్
గరుభక్తినిఁ గాకున్నన్
నిరుపేద గృహంబున సిరి నెలవుండు సదా 46
నరులకు లేమి శాశ్వత మనంగ వచింపఁ దరమ్ము కా దిలన్
సురుచిర మింక డెందమున శోక మణంగి స సౌఖ్య హర్షముల్
కర మనురక్తి తోడ నుపకారిని బంధులు భాగ్యవంతుఁ జే
సిరి నెలవుండు నెల్లపుడు చిత్రముగా నిరుపేద కొంపలో 45
త్రాణ పరాయణుఁ డా గీ
ర్వాణవరుఁ డనుగ్రహింపఁ బద్మాక్ష మహా
బాణుఁడు, శపింప దక్షుఁడు
ఏణాంకుఁడు చెడి, కళంక హీనుం డయ్యెన్ 44
విధునకుఁ బౌత్రుఁడై తనరు విప్ర వరేణ్యుఁడు యజ్ఞ కర్తయున్
బుధ జనకుండు నత్రి ముని పుత్రుఁడు చంద్రుఁ డొకండు నుండ వా
ర్నిధి నుదయుండు చందురుఁ డనింద్యుఁడు నేరని కారణమ్మునన్
విధుఁడు కళంక హీనుఁడుగఁ బేరు గనెన్ గురు పత్నిఁ గూడుటన్ 43
శాంతి శాంతి యని నిలువ శాంత మూని
సుంత యేని దేశమ్మున శాంతి రాదు
దుష్టులకు బుద్ధి నేర్ప ననిష్ట మైన
విశ్వమునకు ధర్షణ గతి వేడ్కఁ గూర్చు 42
ఆవేశం బొక యింతయుం దగదు రక్షార్థమ్ము నిత్యమ్ము స
ద్భావంబూని నరేంద్ర సంచయము నిర్ద్వంద్వమ్ముగా స్వీయ సు
ప్రావీణ్యంబునఁ బాప కర్ములను గారన్ నిగ్రహింపన్ ధరన్
బావా భర్త్సన చర్య సాధనము విశ్వశ్రేయముం గూర్పఁగన్ 41
ఏ మని చెప్పుదు నీ వెత
నేమఱి నే నిలిచి నంత నీ యెడ వింతన్
వామాక్షీ వే కను మో
స్త్రీ మీసము పైనఁ బాఱెఁ జీమ కటకటా 40
ఏమీ వింత భయమ్ము లేక ఘన విప్రేంద్రాది సంకీర్తిత
స్తోమగ్రామ ముదాన్వితుండు మహిలో దోర్దండ గర్వంబునన్
సామాన్యుండె తలంప విక్రముఁడు వాక్చాతుర్య సంతోషిత
స్త్రీ మీసమ్మునఁ జీమ వాఱె నకటా చీకాకుఁ బుట్టించుచున్ 39
మాతలను గూడి పౌరుల మంత్రి వరులఁ
గూడి మరలి వెడలు చుండి కుమిలి కుమిలి
రామ పాదుకా యుగ్మ శిరస్కుఁ డంత
భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేఁగె 38
గురువును సత్య సంధునిగఁ గూర్పఁగ నిత్యము నిశ్చయించి తా
నురవడి లక్ష్మణుం డనుజుఁ డుండఁగఁ దోడుగ డెంద మందు నా
తురత వహింపకే, భరతు తోడుత రాఘవ సైన్య మేఁగఁగా
భరతుని యాజ్ఞ నంది, వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్ 37
చంద్రధరుని ఫాలాక్షుని సన్నుతింప
ఫాల నేత్రము తల నుండ భాను భంగి
వెలయ నెలవంక యా వంక లలితముగను
సూర్య బింబము మధ్యలో సోముఁ గంటి 36
ఆర్యుఁడు కోపగించినఁ దదాస్యము మండును సూర్య బింబమై
యార్యుని సుప్రసన్నతఁ దదాస్యము వెల్గును చంద్ర బింబమై
యార్యుని కోప శాంతముల నమ్ముఖ బింబము మారుచుండఁగా
సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణ శశాంక బింబమున్ 35
ఏకమ్ము పురుష శుక్రం
బేకము స్త్రీ యండము జత యేకము కాఁగా
నేకము వుట్టును బిండం
బేకమ్మేకమ్ము తోడ నేకమ్మయ్యెన్ 34
ఏకము జీవు నాత్మ చను నీ మహి లోన ననేక రీతులం
బ్రాకటమై చ రాచర విభాగముగాఁ బర మాత్మ యుండుఁ దా
నేక మనేక జీవుల వసించును ద్రష్టగ లోన నేకమై
యేకము తోడ నేకమె యనేక విధమ్ముల నేక మయ్యెనే 33
భోగి విభూషణుఁడు నుత మ
హాగరళ గ్రీవుఁడా మహాదేవ మహా
భాగుఁడు కైలాసము నా
సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్ 32
ఏ గతి నైన జానకిని నెచ్చట నున్నను గాంచ నెంచుచుం
దాఁ గపి సేన వీడి వడిఁ దద్దయు భక్తిని శంకరాంశుఁడే
యాఁగక వే సుఖమ్ము లిడ నార్తుఁడు రాముని కేఁగు దెంచుచున్
సాగర మందుఁ గన్గొనెను శంకరుఁ డున్నత శీత శైలమున్ 31
[శంకరుఁడు = సుఖము లొసఁగు వాఁడు; శీత శైలము = చల్లని కొండ, మైనాకుఁడు]
దేవ రాక్షస సంఘంబు దివిరి కలసి
మందరాద్రి కవ్వముగాఁగ సుందరముగ
క్షీర వారాశి నెల్లరు సిల్కఁ బొంద,
జలముఁ గ్రోలి రోసిరి, దేవత లమృతమును 30
నలి నాక్షాంఘ్రి సరోజ సంజనితమై నాక ప్రదేశ ప్రజా
వలి దాహమ్మును దీర్చు నా సురనదీ పాథస్సు సంభావ్యమై
లలి తాభంగ తరంగ సంకలిత నీర ధ్వాన మందాకినీ
జలపానమ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ము లోనన్ సుధన్ 29
భూమి చల్లపడఁగ హేమంత ఋతువున
మీఱి మీఱి తెల్లవాఱు వేళ,
నుదధి లోన నున్న యుదక మావిరి కాఁగ
మండు టెండ లోన, మంచు గురిసె 28
నేత్రములన్ స్వయమ్ము యమునిం గనె సాధ్వి లభించె మామకున్
నేత్ర యుగమ్ము రాజ్యము గనెన్ జనకుండు కుమార పంక్తి సా
విత్రి మృతాత్మ నాథుని భువిం బడసెన్ వర లబ్ధ జీవునిం
జిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండు టెండలో 27
వినయవతి రూపవతిని వివేకవతిని
శీలవతిని విద్యావతి నీల వేణి
నవని వెదకి కోడలిని హాస్య కరుణా ర
స వతినిం దెచ్చె నా భర్త సంతసిలితి 26
కువలయ మందు నా యదితి కోసల కన్యయు నంబి కాఖ్యయున్
సువదన రుక్మిణీ సతియు సుందరి ద్రౌపది నాఁ జెలంగు నా
యువిదలు స్వీయ చిత్తముల నుండఁగ శక్యలె యెంచ కివ్విధిన్
సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతస మందుచు మెచ్చితిన్ మదిన్ 25
చల్లిన గంధము తగ్గక
యుల్లమ్మునఁ దీపి దలఁపు లొక్కుమ్మడి వ
ర్ధిల్లఁగ విరహ మనలమై
చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్ 24
తల్లయ కారకుండు ధృతిఁ దత్పర సేనలఁ జంపి కౌరవుల్
తల్లడిలంగ నుగ్ర తమ ధన్వి వరుండు దురాసదుం డనిన్
డుల్ల భ టాభిమన్యుఁడు కఠోరపు వార్త వినంగ మాయమై
చల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్ 23
[భటుఁడు = యోధుఁడు]
నామములఁ దనరు హంసలు
ధీమంతులు నీతు లందు దిట్టలు గిర లం
దీ మహిఁ గలి కాలమ్మునఁ
గాముకులై కంటఁ బడిరి గద మౌనివరుల్ 22
శ్యామల వర్ణ దేహ చర ణాంబురుహ ద్వయ చింతనా రతుల్
ధామ సతీ కుమార ధన ధాన్య విహీనులు ముక్తి నామక
శ్రీ మయ హర్ష దుఃఖ సమ చిత్తులు వర్తన మెంచి చూడ ని
ష్కామ కళా విశారదులుగాఁ గనిపించిరి మౌను లెల్లరున్ 21
సత్సాహిత్యము నస్ఖలి
తోత్సాహము సాధు వృత్తు లుపయుక్తమ్ముల్
వత్సా! విను దూరీకృత
సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్ 20
వాత్సల్యమ్మున ధర్మ చింతనము సంప్రాప్తించు నాశించినన్
సత్సాంగత్యము శుద్ధ చిత్తమున నిస్సందేహమే దుర్జన
ప్రోత్సాహ స్ఫుర ణాంతరంగమున దుర్బుద్ధిన్ భువిన్ సంత తా
సత్సాంగత్యము పాప కారణ మగున్ సందేహ మింకేలనో 19
[సంతత + అసత్సాంగత్యము = సంత తాసత్సాంగత్యము]
అలుక మదిలోఁ జెలఁగ నేఁ
జలమునఁ బలికిన పలుకులు సరకుగొనకు నాఁ
బలికి తన సతీమణితోఁ
బలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్ 18
లలనలు కోప తాపములు రంజిల నేర్వరు మంచి చెడ్డలం
గలికి కొకింత వేళ నొసఁగం బరికించు మనమ్ము నందుఁ బే
రలుక వహించి పల్కు సతి కాగ్రహ మూర్తికి వాలుఁగంటికిం
బలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో 17
కాంతలకు నుండు ననురక్తి కాంత లందు
కాంత కెనలేని రతి యుండుఁ గాంతు పైన
ముక్తి కామ్యంపుఁ గాంతయై మూరుఁ గాన
నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి 16
నెలఁతను స్వీయ వక్షమున నిత్యము లక్ష్మిని నుంచె విష్ణువే
నెలఁతను వామ భాగమున నిల్పెను బార్వతి నీశ్వరుం డహో
తలఁపఁగఁ గామి కాని యెడఁ దా నిఁక నందఁడు మోక్ష లబ్ధినిన్
నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్ 15
వెక్కసముగ నెక సెక్కెము
లక్కడ నాడుచుఁ జెలంగి యానందముగన్
టక్కరి యుత్తగ నుత్తగ
ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్ 14
ముక్కును గోసి యీఁ గలవ పొక్కక నీ విట నంచు వేఁడఁగా
నొక్కి వచించి యిత్తు నని నోటిని నోటి కొసంగి దారకున్
గ్రక్కునఁ బంచదార చిలుకం గొని లీలగ సుందరంపు టా
ముక్కునుఁ గోసి భర్త సతి ముచ్చటఁ దీర్చెను ముద్దుముద్దుగన్ 13
గ్రహ నికాయము తారకా గణము లడరు
చుండ నిత్యమ్ము తిరుగుచు నండ మందు
వెలుఁగు చుండు నఖిలములు విశ్వ మందుఁ
దా మరల లోనఁ గన నగుఁ దారకలను 12
[తాము + అరల = తా మరల; తాము = తారకలు;
అరలు = వ్యాపించు; లోన: ఇక్కడ విశ్వమందు ]
ఈ మహి నున్న వింతల నెఱింగి వచింప నశక్యమే పరం
ధామున కైన శంకర విధాతల కైనను గాంచఁ బున్నమిన్
నీ మది సంతసింపఁగ ననేకము లుండఁగ నీటి గోళముల్
తామర లందుఁ గాన నగుఁ దారక లింపుగ రాత్రి వేళలో 11
చిక్కఁగఁ గాల వశమ్మున
దక్కును బ్రాణమ్ము లంచుఁ దమ కెండినచో
డొక్క లగుఁ దారుమారుగఁ
గుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్ 10
నిక్కము మారు నర్థములు నిల్పఁ బదమ్ముల నన్య రీతులం
జక్కని పద్యపాదముల సత్యము కానము చింత సేయ నిం
దక్కజ మించుకేఁ జదువ నాగి విరామము లన్వయించుచుం
గుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను బిల్లి మాంసమున్ 9
కన నెంచి రెండు పంటల
ననుకూలమ్ముగ నొకింత యసమంజస మై
నను నేఁ గందులను గలిపి
మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్ 8
చొనుప ననుక్రమమ్మునను జొన్నలు కందులు నింక మిన్ములున్
ఘనముగ నేఁట నేఁటను సుఖమ్ముగ జొన్నలు నేఁడు చల్లఁగాఁ
గనుల కొసంగ నచ్చెరువు క్రన్నన రెండును జల్ల కుండినన్
మినుములఁ జల్లఁ గా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో 7
[చల్లఁ గా= చల్లను గా; చల్లనుగా రెండును, జల్లకుండినన్ మినుములు,
మేలిమి కందులు మొలిచె]
ఆర్ష గుణము వాటింపుమ
మర్షం బూనుమ కడింది మది నీకు మనో౽
మర్షం బేల యెవరి కట
హర్షమ్మే కలుగును మనకా పద గలుగన్ 6
శీర్ష తలవ్యథా కలిత చేతన సంక్షయ కాల సుప్రభా
కర్షిత భాగ్య హీన పరికల్పిత దుర్ఘట నైక దుర్భరా
మర్ష సవేదనా చకిత మానస విస్తృత భీతి యుక్త ని
ర్హర్షము గల్గుచుండు మన కాపద గల్గిన వేళ నెప్పుడున్ 5
కులుకులు సెడ వినపడ కే
పలుకులు కన రాక యున్న పతుల వివరముల్
వలపు లను మనోఽరణ్యపు
టలరులు విరిసె నని యేడ్చి రంగన లెల్లన్ 4
నలిన దళాక్ష వీడి దయ న్యాయమె నీకుఁ దలంచి చూడఁగా
లలనల నేడిపింపఁగ నరర్షభ క్రన్నన మాయమైతివే
కలవర మాయె డెందములఁ గాంచ యదూత్తమ వేఁడుచుండఁగా
నలరులు విచ్చుకొన్న వని యంగన లేడ్చుచు వీడి రావ ? నిన్ 3
చారుతర మూర్తి నిజ భర్త సద్గుణుండు
స్వీయ తను కాంతు లందు రవి సదృశుండు
నాత్మ వదన లావణ్యము నందు నెంచ
శశి యమావాస్యఁ గురిపించెఁ జంద్రికలను 2
కల్లయొ సత్యమో యెఱుఁగఁ గట్టెదుటం గనిపించి మించి నా
యుల్లము వొంగ మిక్కుట మనూహ్యము దూరపు దేశ మందు వ
ర్తిల్లెడు సుందరాస్యుఁడు నిజేశుఁడు దార మనోబ్ధి వెల్గుచుం
జల్లని వెన్నెలల్ గురిసెఁ జంద్రుఁడు వచ్చి యమాస రాతిరిన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి