8, జూన్ 2024, శనివారం

హర్షిణీ భరత నాట్య సభారోహ ణాశీస్సులు.

 

 

శ్రీరస్తు.                                                                శుభమస్తు.                                         అవిఘ్నమస్తు.

 

26 -05-2024.

 

శ్రీ పద్మాశ్రీనివాసుల పుత్రికామణి హర్షిణీ భరత నాట్య సభారోహణోత్సవ శుభ సందర్భమున నర్తకీమణికి శ్రేయోభిలాషి  యాంధ్రభాషానేక కావ్య కర్త పోచిరాజు కామేశ్వర రావు సమర్పించు శుభాశీః పద్య రత్నాక్షతలు:

***

 

                                                మత్తకోకిల.

                                                అంబికాసతి తాండవేశ్వరుఁ డాదరమ్మునఁ గాంచఁగా

                                                నంబ శారద నీకు దీవన లంచితమ్ముల నీయఁగా

                                                నంబుజాసన నిత్య ముండఁగ నండగా నొనరింపుమీ

                                                యంబరమ్మును దాఁక నృత్యము హర్ష వర్ధని! హర్షిణీ!                                

                                                చంపకమాల.

                                                ఘుమఘుమ చంద నాగరు సుగుంఫన వాసన లీను సత్సభన్

                                                సమ సమ హస్త కాంగిక దశా విలసన్నిజ భావ జాలముల్ 

                                                క్రమముగఁ బర్వ లోచన విరాజిత నృత్య మొనర్పు హర్షిణీ!  

                                                ధిమి ధిమి పాద ఘోషణ వితీర్ణ దిశా దశ మండలోద్ధతిన్                             

                                                కందము.

                                                భావి భరత నాట్య కళా

                                                కోవిదవై వెల్గుమీ యకుంఠిత దీక్షన్  

                                                దైవకృపాన్విత! హర్షిణి!

                                                వావిరి కీర్తి గడియించి వర్ధిలు మమ్మా!                   

 

 

సర్వమంగళాని భవంతు!

స్వస్తి!

***

సమ్మక్క సారక్క దేవతాద్వయ స్తుతి.

సమ్మక్క సారక్క దేవతాద్వయ స్తుతి. 

 

 

తే.గీ.

శ్రీ రమా గిరి జాంశ విశేష మహిమ

సంజనిత విత తామేయ శక్తి యుక్త

దేవతా మతల్లు లయిరి గావ మాన

వాలి సమ్మక్క! సారక్క! లనఁగ మీరు

1.      

 

 

 

తే.గీ.

మానవత్వము  గనరాదు మాన్య లార!

రాక్షసత్వము మితి మీఱె రమణు లార!

ధరణి దయ లేదు నేఁడు సుంత జగదంబ

లార! సమ్మక్క! సారక్క! రార ప్రోవ        

2.     

 

 

 

తే.గీ.

నీతి నియమమ్ము లన్నవి నేల రాలె

హింస సెలరేఁగె శాంతమ్ము ధ్వంస మయ్యె

నిజము కఱవాయె వెదకంగ జగదంబ

లార! సమ్మక్క! సారక్క! రార ప్రోవ      

3.     

 

 

 

ఉ.

తూలఁగ భోగ భాగ్యములఁ దోరము కొందఱు భాగ్యవంతులై

మూలుగు చుందు రాఁకలిని భూజను లన్యులు మూరి సంతతం

బాలము లుండ విశ్వమున నాయము లక్కట మానవాలికిం

జాలవు కూడు గుడ్డలకు సమ్మక! సారక! రార కావఁగన్ 

4.     

 

 

 

చం.

తఱ చయి స్వార్థ చింతనము తద్ద చెలంగెను మర్త్య కోటిలోఁ

దఱిఁగెను ధర్మ వర్తనము దాంతము శాంతము మిక్కుటమ్ముగన్

వెఱపు నశించెఁ బాపముల విత్త నిమిత్తపు టాశ రేఁగెఁ గ్ర

చ్చఱఁ గరు ణాంతరంగముల సమ్మక! సారక! రార కావఁగన్

5.     

 

 

 

మ.

అనురాగమ్ములు సన్నగిల్లినవి కోపావేశ మాత్సర్యముల్

దనరెన్ మిక్కుటమై కలిం నరులకున్ ధాత్రీతలం బం దహో

కనమే భద్రత మానినీ మణులకుం గామాంధు లుండంగ స

జ్జన కోటిం గరుణార్ద్ర దృష్టిఁ గనరా సమ్మక్క సారక్కలూ

6.     

 

 

 

కం.

మ్రొక్కెద మింపుగ మీరే

దిక్కిల శరణాగతులము దీవింపఁగ రా

రక్కలు సమ్మక్కరొ సా

రక్కరొ విశ్వమ్ము నింక రక్షింపంగన్

7.     

తెలుఁగు వెలుఁగు.

తెలుఁగు వెలుఁగు.

 

సీ.

వర్ణమాల యడర నర్ణవమ్ము పగిది యర్ధ శతము పైన నాఱు మణులఁ
గర్ణద్వయమునకుఁ గమనీయ రాగము సమకూర్చు పదముల కొమరు మిగుల
నక్షర సత్యమ్ము లైనట్టి నానుళ్ల విం దాఱు రుచులఁ గన్విందు నొసఁగ
గీర్వాణ సద్భాష నిర్వివాదమ్ముగఁ దల్లియై నిత్యమ్ము దనరు చుండఁ

ఆ.వె.

బల్లె పల్లె లందుఁ బాట లేలలు మూరఁ 
గవులు మించి యల్లఁ గవిత లెల్ల
జోల లాలకించి పాలపాపలు పండఁ   
దనకుఁ దాన సాటి  తెనుఁగు  భాష 

1.    

సీ.

అరసున్న లలరార నర్థ బేధమ్ములఁ బరికింపఁగాఁ దెన్గు పదము లంద
మటుమాయ మగునట్టి పటుతర ద్రుతములు పరఁగ నొక్క తెనుఁగు పదము లంద
నుడికారములు పస నుడువఁ బడుచు నుండ వింత సొబగు లీని సంతతమ్ము
నర్థద్వయమ్మున నడరఁ గావ్యములు రెండు నొకట నింపుగఁ దెనుఁగు నంద 

ఆ.వె.

యాట లనఁగఁ దనర నవధాన లీలలు
తియ్య తియ్య నుడుల ద్విపద లడర
వేల యేండ్ల కయిన విశ్వాన గణియింపఁ   
దనకుఁ దాన సాటి  తెనుఁగు  భాష  

2.   

 


1, జూన్ 2024, శనివారం

సమస్యా పూరణ జూన్ 2024

నీరజాక్షుఁడు రక్షింప నిర్జరులను 
మోహినీ వేషము వహించి మోహ పఱచి
మిక్కలి తన రూపమ్మున దక్క కుండ 
నమృత మసురులకుం బంచె నచ్యుతుండు                                                                        55     

అమరులు వేఁడఁ గావఁ బరమాత్ముఁ డుపాయము చేత నింపుగా 
సముచిత ధర్మ రక్షణము సల్పఁగ నెంచి యెడంద మోహినీ 
రమణిగ వేష మూని యసురప్రవరాలి విమోహ మందఁగా 
నమృతముఁ బంచి విష్ణువ సురావళిఁ బ్రోచెఁ జిరాయు విచ్చియున్                                54 

తోరపు టాధారమ్ముల 
రారాజులఁ గాంచ రామ రావణు లందున్ 
ధారుణి రావణు, వీడఁగ 
శ్రీరామునిఁ, బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్                                                                         53    

ఆలోకించిన భూతలమ్మునను నిత్యం బేకపత్నీ వ్రతై 
కాలేశ స్థిర మానసుం డసమ ధర్మాత్ముండు విఖ్యాత  స
త్యాలంకారుఁడు సద్ధనుర్ధరుఁ డయోధ్యా పట్టణేశుండు స్వ
స్త్రీ లోలుం డగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగుం బండితుల్                                                52        

కృష్ణ నిర్యాణము నవలోకించి సంభ్ర
మించి పీడల నొసగంగ మించి సతము  
ద్వాప రాంతమం దుగ్రుఁడై ధర్షణమున 
నారసింహుఁడై కలి పుట్టె నరులు బెదర                                                                                  51 
[కలి = కలి పురుషుఁడు] 

నర లోకమ్మున దుష్ట శిక్షణకు సంతప్త ప్రజానీకముం 
బరిపాలింపఁగ ధర్మ బద్ధముగ సంభావింప నాకౌకసుల్   
ధరలోఁ బుట్టు నతండె  మున్నిల మహా స్తంభంబునం దెవ్వఁ డా    
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నా నాభీతులం గూర్పఁగన్                                                 50 
[కలి = శూరుఁడు, ఇక్కడ కల్కి; నానా + అభీతులం = నా నాభీతులం] 

ఇంద్రు రాకకుఁ గారణ మెఱుకపఱచి  
యప్రమత్తుని నొనరింప క్షిప్రముగను 
భానుజునిఁ గర్ణునిఁ గదిసి పలుకు లందు  
వెన్నెలం గ్రుమ్మరించె వే వెలుఁగుల దొర                                                                             49   

క్రన్నన నెంచి శోధనముఁ గాంత పఠింపగ మంత్ర రాజముం 
జెన్నుగ మారి సౌమ్యునిగ శీతల భానుఁడు నయ్యె నర్కుఁడే 
విన్నఁ దదుక్త మంత్రమును బ్రీతి నొసంగెను గుంతి దేవికిన్    
వెన్నెలఁ గ్రుమ్మరించెఁ గడుఁ బ్రేమను సూర్యుఁడు గ్రీష్మ మందునన్                              48     

భువిలో దారల పల్కుల
ను వినని వారుం గలరె మనుష్యుల లోనం 
దివిరి ఘనమ్ముగ నా వి
ప్ర వరుఁడు విడకుండఁ దీర్చె భామిని కోర్కెల్                                                                            47 

అవని సురేంద్రు వేషమును దాలిచి తిర్గుచుఁ గాననమ్ములో 
నువిదను నా వరూధిని నయోగ్యుఁడు నిర్జర గాయకుండు భూ 
రి విలసనప్రియుండు గని రేఁగ ముదం బెడఁదన్ విడంబన
ప్రవరుఁడు వీడకుండ నల భామిని కోర్కెలఁ దీర్చెఁ బ్రీతితోన్                                                  46                  
కంగారుపడి యెడఁద  గం 
ధాంగప్రతిమ నరయంగ నాత్రము తోడన్   
బంగారు బొమ్మ సరసను  
శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై                                                                                     45  

భంగాంగద్యుతి నుండ స్వీయ ప్రతిమన్ భగ్నాంతరం గార్తయై   
గంగా తోయ సమాన నిర్మల జలాగారమ్మునౌ రాజ దు
త్తుం గాభంగ తరంగ జాల విలసత్తుంగైకభద్రా తటిన్    
శృంగేరిన్గని రోసె నొక్క సతి రాశీభూత వాగ్దేవియై                                                                   44    

మన్నింపరు సుంతయినను 
జన్నే యిట్లుండఁ దెన్గు జనులకు నెల్లన్    
సన్నగిలెనె యాంధ్రమ్మునఁ 
గన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా                                                                        43      

స్వర్ణాభమ్ములు నీదు వాక్కు లివి యాశ్చర్యమ్ములౌ సత్యముల్  
కర్ణాకర్ణిక వింటి మిప్పగిది శంకా హీన మయ్యెం గదా  
వర్ణింపంగఁ గడింది ధైర్యమున సంభావింప నిబ్భంగినిం 
గర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్                                                          42   
 
అఆల్ నేర్చుట యరుదే 
అఆల్ వర్ణమ్ము లెల్ల నరసితి వయ్యా 
అఆల్ నేర వఱవమున  
అఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్                                                                                41

అఆల్ రా వని కిట్ట కంటి రది యత్యం తానృతం బౌ నయా  
అఆల్ కాదు సమస్త మైన వగు వర్ణౌఘమ్ములున్ వచ్చునే      
అఆల్ రా వఱవమ్ము నందు నిజ మయ్యా నమ్ము మో మిత్రమా  
అఆల్ నేర్వకయే వధానిగ యశం బార్జించితిన్ మిన్నగాన్                                               40 
[పద్యములలో వాక్యాంతమును బాదాంతము నయిన సంధి లేమి దోషము కాదు.] 

పార్వతీ పరమేశ్వరు లుర్వి వెలసి 
నట్టి పుణ్యతమ పురమ్ము గట్టు పట్టి 
నెడఁద భక్తి స్మరింపక యెవ్వ రైన   
శివునిఁ దలఁచుట తప్పు కాశీ పురమున                                                                                  39   

భువి క్షేత్రమ్ముల నెంచి చూచినఁ గడుం బుణ్యప్రదం బైన గౌ 
రవ ధామం బిది యీశ్వరాలయము స్వర్గం బేఁగ నౌ ద్వారమే        
యవివేకమ్మున నే నరుం డయినఁ జేయం జాలకే నిల్చినన్  
శివ నామస్మరణమ్ము దోష మగుఁ గాశీ క్షేత్రమం దెప్పుడున్                                                  38 

ఇడుమలకు నోర్చి వసియింప నడవు లందు 
జానకీరాము లింక  లక్ష్మణుఁడును గల 
కంఠి నపహరింపఁగ  దశకంఠ సంహ
రణము ముద మిడె సీతకు రామునకును                                                                          37  

రణ తల దుర్జయుండు నగు రావణు నంతము దాపురింప స
ద్గుణుఁ డనుజుండు నుండ దరిఁ గూరిమిఁ దోడుగ సంతతమ్ము ధా 
రుణిఁ జరియింప గోత్రములలోఁ దమి నూతన వాల్క వస్త్ర ధా
రణ మది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్                                       36  

నేత నెద  గౌరవింపుమ 
నాతుల కిడు గౌరవం బనవరత మిలలో   
నాతతముగ సద్భక్తిఁ గి
రాతికి మ్రొక్కంగ వలెను రాతికి నేలా                                                                                  35        

భూత దయా విహీనులకు భూతల మందు గణింప నిర్జర
వ్రాతము నీయ నొల్ల దట రక్షణ మెన్నఁడు నిశ్చయమ్ముగా   
నే తఱి నైన మానవుల కింపుగ మూరిన భక్తి కైట భా 
రాతికి మ్రొక్క మే లగును రాతికి మ్రొక్కిన నిష్ఫలం బగున్                                           34   

జగదేక వీరుఁ డుద్ధతిఁ 
బగతో రణ దుర్జయుండు భండన మందుం 
దెగి పడి యుండ నిజ సఖుఁడు 
విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్                                                                             33   

విగతత్రాసుఁడు వాయు నందనుఁడు జృంభింపంగఁ బ్రావేల్పు లా 
తొగలం గాంచి చలింప కింత హనుమంతుం డుగ్ర రూపమ్మునం   
దగఁ జంపంగఁ దలంచి నెమ్మదిని దైత్యవ్రాత శస్త్రాస్త్ర ని
ర్విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్                                     32  

అఖిల పండిత వరుల కాహ్లాద మొసఁగఁ 
దెన్గు వారికి నెల్ల నిధియె యనంగఁ  
జేర్చి లంకె బిందెల లోన స్థిరముగఁ దన     
పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె                                                                                 31   

ఆద్యుఁడు సత్కవీశ్వరుల కారయ నింపగు తెన్గు భాషలో   
హృద్యముగా రచించి జను లెల్లరు మెచ్చఁగ నంతిమమ్మునన్ 
విద్యల నంది చక్కఁగను విశ్వ యశస్సుఁ గవిత్వ మేదినిం 
బద్యముఁ బాఁతిపెట్టె నఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే                                     30 
[పాఁతి పెట్టె నఁట కనుకఁ బండితుం డౌను.] 

పుంఖమ్ములు సెలరేఁగెను
రింఖా ఘట్టనము లెల్ల రేఁగె భృశముగం
బుంఖానుపుంఖముగ నిల
శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్                                                                           29   

రింఖా సంయుత వాద్య ఘోషముల ధాత్రీ చక్ర మల్లాడఁగా
వింఖవ్రాత నిపీడనమ్ముల వెసన్ విశ్వమ్ము కంపింపఁగాఁ
బుంఖాపుంఖ నరార్త రావముల నంభోధుల్ చలింపంగ నీ
శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్                                       28   
[రింఖ = గుఱ్ఱపు డెక్క, నృత్యము; వింఖము= గుఱ్ఱపు డెక్క; పుంఖము=డేగ]

పాక శాస్త్ర ప్రవీణులు భద్రగతిని 
వేఁగఁ జేసి వండింతురు వెక్కసముగ 
వెచ్చగా నంజికొన సురం బ్రీతిఁ గొంచుఁ 
గుంభ వృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు                                                                                     27  

ముసరెను మబ్బు లెల్లెడల ముంచు జగమ్మును వర్ష మిత్తఱిం 
గసరక యాత్మ రక్షణము గార్యము తత్క్షణ మెంచి చూడుమా    
విసువక విన్మ చెప్పినది వేగమ ఛత్రముఁ గొన్మ వాగ కి
ట్లసదృశ రీతిఁ గుక్క! గొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో                                                   26  

విత తాహ్లాద రుచిర హా
స్య తర వినోదమ్ము లెట్టి సౌఖ్యమ్ములు సం 
తతము కఱ వైన యట్టి వ
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా                                                                              25   

గతులను నర్థ ధర్మములు కామము లెన్ని గ్రహింప నొప్పు భూ
త తతుల మిన్నయై పరఁగు ధార్మిక పూరుష కోటి కిద్ధరం    
బతితుల దుష్ట చిత్తుల నవాంఛిత మర్త్యుల దార కన్యలౌ     
యతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁ డనఁగా రసజ్ఞుఁడౌ                                               24 

గోముగ దరి సేరి గోముఖ వ్యాఘ్రపుఁ
జంద మొప్పఁ గనుల ముందు మెలఁగి 
 నమ్మకమ్ము మీఱ నటియించి వంచన
నాప్త మిత్రుఁ డనుచు హత్య సేసె                                                                                           23

విత తావక్ర పరాక్రముండు రణ దుర్భేద్యుండు నుగ్రుండు సం
తత ధర్మైక రతుండు నుత్తముఁడు నత్యంతాగ్ర హావేశ సం
చిత దుర్మార్గ చరిత్రు శాత్రవుని నాక్షేపింప సుక్షత్రియుం 
డతఁడా నాకొక యాప్తమిత్రుఁ డని హత్యం జేసె సద్బుద్ధియై                                            22
[అనిన్ = యుద్ధములో] 

ఏ తఱి లాభమ్ములు సం
జాతమ్ములు గా భృశము నిజవ్యాపారం
బాతతముగ వర్ధిల్లఁగ 
జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్                                                                         21  
                      
రోఁత యొసంగ నట్టి పని క్రూరుఁడు గాని విభుండు మెండుగా 
వేతన మున్న మేలగును వృద్ధి నొసంగ నిరంతరమ్మునుం   
గోతల తోడ వేడ్కలకుఁ గూఁటికి గుడ్డకుఁ జాల నట్టిదౌ 
జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై                                      20 

శారదా సతీ యపార కృపాంబుధీ 
మ్యవల్లకీ విలాస శార 
దాంబ  సురుచి రాక్షహార పుస్తక కీర 
హు దళ సుమ హస్త భద్ర మొసఁగు                                                                               19  
 
శారద చంద్రికా సదృశ శాట విరాజిత వల్లకీ కరా 
నీజ సంభవాంఘ్రి యుగ నిత్య నిమగ్న నిజాంతరింద్రియా 
హార శుకాబ్జ పుస్తక సదాంచిత హస్త చతుష్క శారదా  
సార కవిత్వ పాటవ మొసంగుమ యో జగదం భారతీ                                                    18

భారత సమరావని లోన ఫల్గునుండు  
సవ్యసాచి సరస నపుంసకుని నా శి
ఖండి వీక్షించి గంగా సుతుండు నిలువ  
శస్త్ర సన్యాసముం జేసి జయము నందె                                                                         17   

శాస్త్రవ్రాత విరోధ మేర్పడఁగ నిశ్శంకన్ వచింపంగ స
ర్వాస్త్రాచార్య సుతాంత వార్త ద్విరదవ్యాజంబునం గంకుఁడే 
నిస్త్రాణుం డయి పుత్ర శోకమునఁ దా నిల్వంగ ద్రోణుం డహో 
శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్                                 16  

తూర్ణ మొసంగు ముదము సం
కీర్ణము లెల్ల దిశ లందుఁ గీర్తన చయముల్
స్వర్ణ నిభమ్ములు గార్దభ
కర్ణ కఠోరములు సుమ్ము కన్నడ కవితల్                                                                       15 


అర్ణవ మంత లోఁ తయిన యట్టివి భావము నెంచి చూడ లేఁ
బర్ణము లాని నట్టి పిక వర్యము సిగ్గిలఁ జాలినట్టివే 
వర్ణన కంద నేర వవి పాడిన కా వవి యాలకింపుమా
కర్ణ! కఠోరపద్యములు గన్నడ దేశము నందు విన్పడున్                                            14 

భంగ మొనరించి నీతికిఁ
బింగాంబరములు ధరించి వీడక యెదలన్
సంగము నించుక పీఠము
శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్                                                                     13 


ధనదాహంబున నిత్య మెల్లర నిలం దర్జించుచున్ నిర్దయన్
వినయమ్మున్ నటియించుచుం గరము నిర్భీతిం బ్రవర్తించుచున్
జన సందోహము మోసపుచ్చఁ గుమతుల్ సంస్కారవంతుల్ వలెం
జెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్                                      12 

కరుణా రసార్ద్ర హృదయుఁడు 
నిరతామల చిత్తుఁడు ఘన నిష్ఠాత్ముండున్ 
నరలోక నిత్య సేవా 
పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా                                                                    11 

కరుణాంతఃకరణైక మండితుఁడు నిష్కాముండు లోకోపకా
రి రుజా హీనుఁడు దీన రక్షకుఁడు నై హృద్యంబుగా సంతతం 
బరవిందాక్ష విలోల మానసుఁడు సమ్యగ్దేవతా చింతనా 
పరతంత్రుండు రహించు దీన జన కల్పద్రుప్రభావోన్నతిన్                                 10 

వింతగఁ దూఱంగఁ దటా
కాంతరమున సిగ్గు వీడి కయ్యమ్మున దు
ష్టాంతఃకరణుం గౌరవ
కాంతుని నెదిరించి చంప ఘన కార్యమ్మౌ                                                                        9 

అనివార్యంబుగ నీ దశాననుని దుష్టాత్మున్ నిరీక్షించి వే
వనితా లోలుని స్వీయ సౌధమున దర్పం బెల్ల నాశంబు గా
హనుమంతుండు దలంచె నెమ్మనమునం దత్యంత రోషుండునై
ఘనకార్యం బగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్                                 8 

కాతు రమరులు మర్త్య నికాయము నసు
ర గణ తర్జనముల నుండి రమ్య రీతి
వేఁడ శరణమ్ము సద్భక్తి తోడ వీత
సుర శరణ్యుఁడు దనుజ దాసుఁడుగ నయ్యె                                                                     7 

అరి వీరోగ్రుఁడు మేఘనాదుఁడు దశాస్యాత్మోద్భవుం డుగ్ర సం
గరమం దింద్రు జయింప వీర్యమున దుఃఖం బంది దైన్యమ్మునన్
ధర లంకాపురి నిర్జరేశ్వరుఁడు సంతప్తాత్ముఁడై యక్కటా
సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుం డయ్యె దైత్యాళికిన్                                                6 
[హరి = ఇంద్రుఁడు] 

గారవ మొప్ప నిత్య సహకారము భర్త కొసంగి స్వీయ సం
స్కారము సాటిచెప్పి మమకారము సంతతి కెల్లఁ బంచి ని
ష్కారణ మెన్నఁ డల్గక వికారము నంద కెడంద సుంత స
త్కారము లంది యింపుగ సతమ్ము సతీమణు లుండ మేలగున్                                    5 

జిష్ణు సహిష్ణు పరమ రో
చిష్ణున్ వర్ధిష్నుఁ గృష్ణుఁ జిత్తం బందున్
విష్ణుని సద్భక్తి నిలిపి
కృష్ణుఁడె బెండ్లాడెను గద కృష్ణనుఁ బ్రేమన్                                                                          4 

జిష్ణుఁ డనంగ వర్ధిలుచుఁ జేవ జయింపఁగ మత్స్య యంత్రముం
గృష్ణుఁడు సమ్మతింపఁ బరికించి యెడందను యాజ్ఞసేనినిం
గృష్ణుఁ డొసంగ దీవనలు కృత్స్నము సోదర సంయుతమ్ముగాఁ
గృష్ణుఁడె పెండ్లియాడెఁ గద కృష్ణనుఁ బాండవ పక్షపాతియై                                                3 

అడర శబ్ద గాంభీర్యము నర్థ లాఘ
వమ్ము కన్పట్టు నట్టులఁ బండితాధి
ప! సరళీకృత సంక్లిష్ట! ప్రాస నిత్తు                                
సత్కవి చెపుమా పద్యము సత్కరింప                                                                                   2        

ఓం క్లీం హ్రీ మ్మని దేవతా స్మరణమం దుత్సాహినై చింతనా 
సంక్లిన్నామల మానసుండ నయి నిశ్శబ్దమ్ము వర్ధిల్లఁగా 
సంక్లేశమ్ములఁ బాసి పూరణము నిశ్శంకన్ వెలారించెదన్ 
సంక్లిష్టం బగు ప్రాస నిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా                                             1