కుంద జగమెల్ల వేఁడిమి నంది మిగుల
వేసఁగి యరుగు దెంచి కవియఁగ దెసలు
వెక్కసమ్ముగ నక్కట నిక్కి వేఁచు
చుక్కలు పుడమిపై సాగెఁ జోద్యముగను 62
[వేఁచుచు + ఉక్కలు =వేఁచు చుక్కలు]
ఎక్కటి కారు మబ్బులు రహిం దమకించి కరమ్ము నింగినిన్
టెక్కున నేఁగుచుండఁగఁ గడింది మగంటిమిఁ గొండ చాలుపుల్
డెక్కినఁ జాల చల్లఁబడ డెందములన్ మురిపించు మంచు పె
న్చుక్కలు నేల రాలిపడి చోద్యముగా నడయాడె నిత్తఱిన్ 61
మావి చిగురు నలరి మెక్కి చేవ మీఱ
గెంతి పాడు చుండి తనదు గొంతు విప్పి
యుర్వి నింపుగ వ్రాల గంధర్వ మపుడు
గాన గంధర్వుఁ గని నవ్వె గార్దభంబు 60
[గంధర్వము = మగ కోయిల]
నే నొక గొప్ప మానిసిని నిత్యము వీడక కొల్చు దానిఁ గాన్
మేను కడింది వంగిన శ్రమించెడు వానికి దాసి వంచునున్
మౌనము తోడఁ జాగ నొక మార్జుని గాడిదఁ గాంచి నవ్వుచున్
గాన కళా విశారదుని గార్దభ మొక్కటి గేలి సేసెఁగా 59
ఈ ధరలోఁ గాంచఁ బ్రణయ
గాధలు వర్ధిల్లుఁ బెక్కు కంతు కృత మనో
బాధను నలకూబరుఁ డో
రాధిక! కౌఁగిటనుఁ జేర్చె రంభనుఁ గంటే 58
నా ధవుఁ డేడ కేఁగె నని నాఁతి మరుండు కడింది యేఁప నా
బాధను దాళ లే కరఁటి పాదప మాని సలీల నిల్చె నా
మాధవుఁ డేఁగు దెంచి యని మానస మందు భ్రమించి నట్టి యా
రాధిక పారవశ్యమున రంభనుఁ గౌఁగిటఁ జేర్చె వింతగన్ 57
[రంభ = అరఁటి]
మానస ముప్పొంగఁ దగని
వానికి వాంఛిత మెఱుగక పన్నుగ నొసఁగన్
దానవున కుమా పతి వర
దానము శాపముగ మారె దాతకు భువిలో 56
మానక నిర్జరాలి కవమాన మొసంగుచు నుండి యోటమిం
గానని వాని కక్కజముగా బవరమ్మున రోష చిత్తుఁడై
రా నిడ మచ్చ రావణు నురమ్మున శక్రుని ప్రాగ్దిశా సదా
దానము శాప మయ్యెఁ గద దాతకు నీ భువి లోనఁ గంటివే 55
[సదాదానము= ఏనుఁగు; దాతకు = యుద్ధ దాతకు]
పై చదువులఁ జో టందిన పాత వారిఁ
బదుల లోఁ జూపి చేరిన వచ్చు మంచి
కాల మంచు నాసలు సూపి వేల లోన
శిష్యులను మోసగింత్రు విశిష్ట గురులు 54
తరుణుల మాటలం దనిపి తద్దయు రక్తినిఁ గామ సారమున్
విరివిగఁ దెల్ప యత్నములు వేమరుఁ జేయఁగ గీత సార మం
దరసిన యట్టి ముక్తి వడయంగ నుపాయము లెల్లఁ దెల్పు స
ద్గురువుల మంచు శిష్యజన కోటిని మోస మొనర్తు రెందఱో 53
గిరిజా నాథుని గగనాం
బరునిం బ్రేతగణ భూత పతినిం బరమే
శ్వరుఁ గొల్చిన నటరా ణ్నూ
పురమునుఁ గనినన్ జనులకుఁ బుణ్యము గలుగున్ 52
త్వరపడు వేంకటేశ్వరుని దర్శన మొప్పును జేయఁ బిమ్మటం
దిరుమల ఱేనికిం బుడమిఁ దేర యొసంగెను వేంకటాద్రిలో
గురు మహి మాన్వితుం డతఁడు గొప్ప వరాహపుఁ బేరి స్వామిఁ జూ
పుర మునుఁ గాంచినం గలుగుఁ బుణ్యము ముక్తియు మానవాళికిన్ 51
చూత నవమల్లి కాశోక సుంద రాసి
తోత్ప లారవిందములు పద్యోత్కరముల
నిభము దోఁప శివుని తోడ నిర్జరాధి
పా మరుఁ డొనర్చెఁ బద్య సంభాషణమ్ము 50
ఆద్యము నంతముం గని మహాద్భుత నాటక మందు నింపుగాఁ
జోద్యము మీఱఁ జక్కఁగను సుంతయుఁ దప్పక ప్రాయ మందుఁ దా
విద్యలు నేర కున్నను వివేకుఁడె యాశ్వపతీ సతీ ప్ర జా
పద్యము లందు భాషణము పామరుఁ డొక్కఁడు సేసి చూపెఁగా 49
[ఆశ్వ పతీ సతీ ప్రజా +ఆపద్ +యములు = సావిత్రీ దేవి, ప్రజల కాపద యైన
యముఁడు; ద్వంద్వ సమాసము.]
ఉస్సు రనుచుం బనులను మ
నస్సునఁ గృష్ణార్పితముగ నడపక యున్నన్
నిస్సందేహమ్ముగ నీ
నిస్సంగత్వ మిడు నొక్కొ నిజముగ ముక్తిన్ 48
నిస్సందేహము లైన మాట లివి వానిం బల్క శ్రావ్యమ్ముగా
నిస్సంగత్వమె ముక్తి నిచ్చు ననఁగా నీ వెట్టులన్ నమ్మవో
యిస్సీ తల్పఁగ మంద చిత్తుఁడవు గావే నిత్య శాతోదరీ
నిస్సంగత్వమె ముక్తి నిచ్చు ననఁగా నీ వెట్టులన్ నమ్మితో 47
[నిః + సంగత్వము = 1. సాంగత్యము లేమి 2. నిశ్చయంపు సాంగత్యము]
దుష్ట బుద్ధుల నుంచుమ దూర మందు
శిష్ట జనులను నిల్పుమ స్నేహ మందుఁ
గష్ట మైనను ధరలోనఁ గాంచ విగత
దుష్ట సాంగత్యమే ఘన దోష హరము 46
స్పష్టమె యెల్లవారలకుఁ జక్కగఁ బృథ్విని దానకర్మ ప
ర్వేష్టుని స్వీయ దుష్కర సమీప్శిత సత్కృత నిత్య కర్మ జా
లేష్టుని బాంధ వేష్టుని యనీర్ష్య మనస్కు సతం బమేయపుం
దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలఁగింపఁ జేసెడిన్ 45
[అమేయపు + తుష్టుని = అమేయపుం దుష్టుని]
నర లోకమ్మున వెదకఁగ
నరుదుగఁ గన్పట్టుదురు మహాత్ములు వారల్
ధరలో నిరంతర తపః
పరతంత్రుల్ దీన కల్పపాదపములె పో 44
సుర లోకమ్మును వీడి కావఁ దగ నా శోకార్తులం బ్రీతులై
యిర కేతెంచి దయార్ద్ర మానసులు దేవేంద్రాది దాక్షిణ్య ని
ర్జర ముఖ్యుల్, తము మర్త్యు లార్తు లయి భద్రం బెంచి ప్రార్థింపఁగాఁ
బరతంత్రుల్, వసియింత్రు దీన జన కల్పక్ష్మాజ సాదృశ్యులై 43
కృష్ణ దేవ రాయలు వంటి కృతి పతులను
నల్లసాని వంటి కవుల నరయఁ గలమె
ధరణి నేఁడు వెదకి చూడ ధైర్య మూని
గండపెండెరముం గోరఁ గలరె కవులు 42
అల కవితా పితామహుని నాంధ్రము నందుఁ బ్రసిద్ధుఁ డంచు భూ
వలయము నందు వెల్గు కవి వర్యులఁ జక్కఁగ నర్హుఁ డంచు నా
సలలితు నల్లసాని కుల సాగర చంద్రునిఁ బెద్దనార్యునిం
దలఁతురె గండ పెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్ 41
గుండె లోపల జాలియె బెండువడియె
రాముఁ డాపద పాలయ్యె నేమొ యంచు
జానకీ దేవి కక్కట కాననమున
భ్రమ ఘటించెను బ్రహ్మ సా రాయి గొనెనొ 40
[బ్రహ్మ సా = బ్రహ్మ చా ]
సుమతి వచింప నోపునె వసుంధర నివ్విధి నెన్నఁ డైననుం
గమలజుఁ గూర్చి వక్రముగఁ గంజ దలాక్షుని పట్టి గూర్చియే
స మల మనస్కుఁడై పలుక జ్ఞాన విహీనుఁ డొకండు నిట్టులన్
భ్రమ ఘటియించె బ్రహ్మ, కలు ద్రావెనొ యంచుఁ దలంచి రెల్లరున్ 39
ఆక్షేపింపకు దైవము
సాక్షిగ వచియించు చుంటి సంతత రక్షా
దక్షా సంకోచం బెద,
రక్షా బంధన మటంచు రా, వల దనుజా 38
అక్షీణంపు దయార్ద్ర మానసుఁడ వై తత్యంత మిద్దాత్రినిన్
రక్షాదక్షత ఖ్యాతి నందితివి సౌభ్రాత్వమ్ము వర్ధిల్లఁగా
రక్షా బంధన మంచు రమ్మనుజ సంరంభంబునం బల్కుచున్
ర క్షాబంధన మంచు రావల దిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్ 37
[రక్షా + అబంధనము = ర క్షాబంధనము]
ఒకటి రెండుగఁ గనిపించు నొకఁడు వలికె
నాల్గు పాదసరోజముల్ నాల్గు హస్త
పద్మములు నలరుచు నుండఁ బద్మ ముఖికిఁ
బొలఁతి కొప్పెను నాల్గు కన్బొమలు భళిర 36
అలరుచు నుండఁ జక్కగను నబ్జము పొత్తము కీరరాజమున్
లలితపు టక్ష మాలయును రమ్యతరమ్ముగ సంతతమ్మునుం
దలరుచుఁ బద్మసంభవుని దారకు వాణికి హస్తపద్మముల్
పొలఁతికి నాల్గు కన్బొమలు పొల్పు వహించె విలాసినీ తతిన్ 35
అని లోనఁ బాండవేయులు
కనలిన నిక్కముగ నంబికా నందన నం
దన దురభిమాన దుర్యో
ధన సంసర్గమునఁ జావు తప్పదు కర్ణా 34
ఘన సంతాపము సెందు చుండ నెద నా కాకుత్స్థ రత్నంబు వే
దన వర్ధిల్లెడు రీతి నిప్పగిది నుత్సాహమ్ముతోఁ గాల యా
పనముం జేయుచు రామ కార్యమున నీ భామా చరత్కామ సా
ధన సంసర్గము వీడకున్న రవిపుత్రా మృత్యు పాశమ్మగున్ 33
[రవిపుత్రుఁడు = సుగ్రీవుఁడు]
కహ్వమున కనిమిషమ్ము న
జిహ్వమునకుఁ గీటకమ్ము సెందును భీతిన్
జిహ్వకుఁ దగులం జంపెడు
శ్ర్యాహ్వమ్మునుఁ గాంచి తేఁటి జడిసెన్ మిగులన్ 32
ఆహ్వానింపక యున్న వచ్చిన సుఘోరాగంత కత్యార్తినిన్
రాహ్వాఖ్యుం గని చంద్రుఁ డైన గతి విద్రావుండు లూతా ముఖా
ద్బహ్వానీతము కీట దుర్భరమునుం బ్రాణాపహారిన్ మహా
శ్ర్యాహ్వమ్ముం గని బంభరమ్ము మిగులన్ సంత్రాసముం బొందెడిన్ 31
[శ్రీ + ఆహ్వము = విషము]
ఎక్కితిరి యందలమ్ములు సక్క జనులు
చిక్కు లెల్లఁ దొలంగిన వక్కజముగఁ
దక్కు పలుకంగ వాక్కులు నొక్కి యిట్లు
దక్కున భరతభువికి స్వాతంత్ర్యఫలము 30
తొలఁగెన్ శృంఖలముల్ పరాంగ్ల జన దుర్దోర్దండ బంధమ్ములుం
దొలఁగెన్ వర్ణ విభేదముల్ మనకు సంతోషమ్ము లేపారఁగాఁ
దొలఁగం జూడము వర్ణ భేదముల నెందుం గొంచె మైనం గటా
తలపోయన్ భరతాంబ పొందు నొకొ స్వాతంత్ర్యమ్ము నేనాఁటికిన్ 29
పుట్ట రోదించుఁ బసిబిడ్డ బోరు మంచుఁ
గొట్ట నుంకింప నేరైన నెట్ట నేర్చు
ముసర నీఁగలు కన్నుల మూయ నేర్చు
గురువు సెప్పని చదువు లోకులకు వచ్చు 28
ధరలో నిత్యము స్వీయ లాభ పరులై దాక్షిణ్య హీనాత్ములై
పర విత్తార్జన సక్త మానసులునై పాపాత్ములై ధూర్తులై
దురవస్థార్దిత మాన వాకలన సద్యో వంచనా విద్య లే
గురువుల్ సెప్పరు గాని యీ చదువు లోకుల్ నేర్తు రాసక్తులై 27
నీతు లెఱింగిన బాలుం
డా తఱిఁ బరుల వలెఁ గాక యన్నుల గమిలో
నాతిని నల్లరి లోనం
గోఁతినిఁ దల్లిగఁ దలంచెఁ గోమలి మురియన్ 26
చేఁతల రాఘవేంద్రునకుఁ జిక్కుల సాయ మొనర్చు వీరుఁ డీ
భూతల మందు నంజనకుఁ బుట్టుట భాగ్యము కాకపోవునే
ప్రీతిని గాలి కొడ్కునకు వీర వరేణ్యున కాత్మ నింపుగాఁ
గోఁతినిఁ దల్లిగాఁ దలఁచెఁ గోమలి కెంతటి భాగ్య మబ్బెనో 25
కన్ సన్నల మెలఁగి గురుల
కున్ సత మింపుగ సభక్తిఁ గొలుచుచు సంప్రీ
తిన్ సద యాత్ము ధరాభో
జిన్ సేవించిన లభించు స్థిరవాగ్ధనముల్ 24
పెన్ సేవా రత మానసమ్ములను నా వీణా లసద్ధస్త దే
విన్ సేవించిన భక్తి తత్పరతలన్ విద్వన్మహాచార్య కో
టిన్ సేవించిన సంతతమ్ము పరిపాటిన్ సత్య ధర్మాధ్వ రా
జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్ 23
వాసశ్శ్రేష్ఠ మయినచో
నే సిన్న దయినను గాంచ నిటు లెంతేనిన్
వాసిగ ధరియించిన విను
మా సిన చీరయె లలనకు మాన్యతఁ గూర్చున్ 22
నీ సరి యెవ్వరంచు నలినీదళ లోచన లెల్ల రివ్విధిన్
భాసిల నేర్తు రెవ్వ రని పన్నుగఁ గీర్తన సేయఁ గోరుచోన్
వేసర కాత్మఁ గట్టుకొని వెండి జరీ పొడఁ గట్టకున్నచో
మాసిన చీర మానినికి మాన్యతఁ గూర్చును బెండ్లివిందులో 21
విల్లూని నరుఁడు మత్స్యపుఁ
బిల్లను నలవోకఁ గొట్ట వెసఁ జేపట్టన్
నల్లని కన్యను ద్రుపదుని
పిల్లం గని పాండవులను భీష్ముఁడు మెచ్చెన్ 20
సల్లాపమ్ముల సున్నితత్వము మహా సత్కార్య సంప్రీతినిం
గల్లోలౌఘము భీత మానసములం గంపింప వీక్షింపఁగాఁ
నల్లోకోన్నత నైపుణమ్ము నిజ శస్త్రాస్త్రమ్ములన్ వారు సొం
పిల్లం గన్గొని పాండు రాట్తనయులన్ భీష్ముండు మెచ్చెం గదా 19
[కల్లోలుఁడు = శత్రువు]
సాధ్వాలోచన మన్న న
సాధ్వాలోచన మనిన విచారం బేలన్
జ్యా ధ్వానము భీతి గొలుప
విధ్వంస మొనర్చె నరుఁడు విశ్వము మెచ్చన్ 18
అధ్వానమ్మునఁ బాఱ భీతు లయి యత్యంతమ్ము భీమమ్ము లా
హా ధ్వానమ్ములు పిక్కటిల్లఁగను గట్టా భార తాభిగ్రహై
కాధ్వభ్రాజిత ధార్త రాష్ట్ర వశ ఘోరైకాద శాక్షోహిణీ
విధ్వంసం బొనరింపఁ బూనె నరుఁడే విశ్వమ్ము కీర్తింపఁగన్ 17
యక్ష సిద్ధ మాన వామర కిన్నర
వ్రాతమునకు దొడ్డ బాధ లొసఁగి
దైత్య దానవులకు నిత్య మంచితముగ
రక్ష సేయువాఁడు రాక్షసుండు 16
అక్షయ రీతి నిత్యము మహర్షి వరేణ్యుల కెల్ల వారికిన్
శిక్ష లొసంగి ఘోరముగఁ జిత్రముగం గరుణా విహీనుఁడై
కుక్షినిఁ గొంచు మానవులఁ గ్రూర తరమ్ముగ దుష్ట కోటికిన్
రక్షణ నిచ్చువాఁ డనఁగ రాక్షసుఁడే యగు నంద్రు పండితుల్ 15
కర ఖర న ఖాయుధమ్ముల
హిరణ్యకశిపున్ వధించి యింపారంగా
నరు దగు జయలక్ష్మిం గొని
నరసింహుఁడు భక్తి మ్రొక్కె నారీమణికిన్ 14
ధరణీ భార వినాశనమ్ము రణ తంత్రంబై ప్రవర్తిల్లఁగా
దుర మందుం బగ వారి మార్కొని వెసం ద్రుంపంగ సంరంభియై
కర మందుం గొని దివ్య గాండివము నా గాండీవి కౌంతేయుఁ డౌ
నరసింహుండు నమస్కరించె నఁట యానందంబునన్ నారికిన్ 13
[నారి = వింటి నారి]
మకరాంకుని ప్రాభవమునఁ
జకచక వెచ్చందనమ్ము చవిగొన శీతో
దకమున నక్రస్వామిని
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్ 12
శకటము లాఁగ గుఱ్ఱములు సందడి సేయక సంతతమ్ము పా
యక చనుచుండి నింగి విరహమ్ము వహింపఁ గడింది భారమై
యొక పెను వత్సరం బరుగ నుర్విని సూర్యుఁడు సంక్రమించి యా
మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను బ్రేమ పొంగఁగన్ 11
మకరాంకుని ప్రాభవమునఁ
జకచక వెచ్చందనమ్ము చవిగొన శీతో
దకమున నక్రస్వామిని
మకరముఁ జుంబించె వలపు మరిమరి పొంగన్ 10
శకటము లాఁగ గుఱ్ఱములు సందడి సేయక సంతతమ్ము పా
యక చనుచుండి నింగి విరహమ్ము వహింపఁ గడింది భారమై
యొక పెను వత్సరం బరుగ నుర్విని సూర్యుఁడు సంక్రమించి యా
మకరముఁ బట్టి చుంబనము మాటికిఁ జేసెను బ్రేమ పొంగఁగన్ 9
అంస్యం బగునే యశ్మము
ధ్వంస్య పదార్థమ్ము గాక తగ దిట్లనఁగాఁ
గాంస్యము కంచు లొకటి గాఁ
గాంస్యమునకుఁ గంచుఁ గలుపఁ గాంచన మయ్యెన్ 8
శంస్యమొ లే కశంస్యమొ విచార మొనర్ప నశక్య మయ్యె మీ
మాంస్యమె యియ్య దెన్నఁగను మారుట కాంస్యము పైడిగా నిలన్
హింస్యము లిట్టి భాషణము లెల్లను గాంచఁగ సత్య దూరముల్
కాంస్యము గంచుతోఁ గలియఁ గాంచన మేర్పడెఁ జూడఁ జోద్యమే 7
అనిశమ్ము భర్తృ పద చిం
తనా విలగ్నాంతరంగ తద్దయు భీతిన్
వనజాక్షి నిజ మనోధా
మునికై ధ్యానము నొనర్చె భూమిజ లంకన్ 6
వనమం దుండఁగ రావ ణాపహృతయై వ్యాజమ్మునన్ దుస్స్థితిన్
దనుజాధీశు పురమ్ములో నిలిచి సంతప్తాంతరంగమ్మునం
గన రాకున్నఁ గలంత రామునకునై కాకుత్స్థవంశాభిరా
మునికై ధ్యాన మొనర్చె సీత మది వ్యామోహమ్ముతో లంకలో 5
పూర్వ కాల మందు నుర్వి జనుల క్షేమ
మెంచి మెలఁగ వలయు నంచు మూరి
శాసన సభ యందుఁ జేసిన భార తా
ధ్యక్ష వాక్కు గడు ముదావహంబు 4
అక్షయుఁ జేయ వేఁడికొన నా నకులుం దగు కారణమ్ముతో
దక్షత మీఱ నింపుగను ధర్మజుఁ డిచ్చిన నుత్తరమ్ము లా
యక్ష వరేణ్యు ప్రశ్నలకు నంతట భ్రాతల నెల్లఁ గొమ్ము నా
యక్షుని వాక్కు లెంతయు ముదావహముల్ సుమనోభిరామముల్ 3
పేరు లోనఁ గలదు సిరి యూరి లోన
సున్న కలహమ్ము లచ్చోట మిన్న గాంచఁ
గలదు సంశయం బొక్కటి యలరి యెడఁదఁ
గలఁడె పండితుఁ డొకఁడు శ్రీకాకుళమున 2
వలదయ్యా యెకసెక్కియమ్ము లిటులన్ భాషింప నీ కెన్నఁడుం
గల నైనం బరుషంపు మాటలను బల్కంగా నిషేధం బహో
యిలలో నింపుగఁ జక్కనౌ గణన కింతేన్ రాని వాఁ డెచ్చటం
గలఁడే పండితవర్యుఁ డొక్కఁడును నిక్కం బెన్న సిక్కోలులో 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి